‘బ్యోమ్ కేష్ బక్షీ’ ఆఫ్ దిబాకర్ బెనర్జీ…

ల.లి.త.

 

lalitha parnandiElementary …” –  Sherlock Holmes.

షెర్లాక్ హోమ్స్ అభిమానులంతా ఈ మాట పట్టుకుని మురుస్తూ ఉంటారు. నేర పరిశోధనలో ఎవరూ కనిపెట్టలేని అతి చిన్న వివరాన్ని పట్టుకుని విషయమేమిటో తేల్చటం elementary.  అసలు డికెష్టీ (బుడుగు భాషలో) వాడంటేనే  అసామాన్యుడు.  సూపర్ మాన్ లు, బాట్ మాన్ లు, ఇంకా అడ్డమైన మాన్ లూ తెలీకముందు డికెష్టీ, పోలీసువాడు, రైలింజన్ డ్రైవర్ … వీళ్ళే బుజ్జి మగపిల్లల దృష్టిలో గొప్ప హీరోలు.

సరైన డిటెక్టివ్ సాహిత్యం తలకెక్కితే మరి దిగదు. గొప్ప ఆటగాడిలా నేరస్తుడికి చెక్ చెప్పటానికి డిటెక్టివ్ వేసే   చదరంగపుటెత్తులేమిటో ఊహించేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం. అంతటి ఘనమైన డిటెక్టివ్ సాహిత్యంలో పేరున్న బెంగాలీ డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ. బ్యోమ్ కేష్ కథతో బెంగాలీబాబు దిబాకర్ బెనర్జీ సినిమా తీస్తున్నాడంటే చాలామంది ఎదురుచూపులు… కానీ దిబాకర్ తెలివికి ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే బ్యోమ్ కేష్ అంటే నేనేనంటూ ఇప్పటికే తిష్టవేసి కూర్చున్నాడు రజత్ కపూర్. తొంభైల్లో దూరదర్శన్ లో వచ్చిన ‘బ్యోమ్ కేష్ బక్షీ’ హిందీ సీరియల్ ను జనం బాగా ఆదరించారు. పంచె కట్టి,  విశాలమైన నుదురుతో, కళ్ళను మెరిపిస్తూ, చిరునవ్వుల్తో తను కేసునెలా పరిష్కరించాడో వివరించే రజత్ కపూర్ అందరికీ తెలిసిన డిటెక్టివ్ బ్యోమ్ కేష్. ఈ పాత్రను సృష్టించినది శరదిందు బందోపాధ్యాయ. శరదిందు కథల్ని హిందీ సీరియల్ గా తీసిన బాసు చటర్జీ మరో ఘనమైన బెంగాలీ. అంతవరకూ బెంగాలీ వాళ్ళకే పరిమితమైన బ్యోమ్ కేష్ బక్షీ ని ఈ హిందీ సీరియల్ తో దేశమంతా గుర్తించింది.

గొప్ప డిటెక్టివ్ లందరికీ ఆదిగురువు షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ పెద్ద మర్రి చెట్టయితే మిగతా డిటెక్టివ్ లంతా ఆ చెట్టు ఊడలే.  షెర్లాక్ కి వాట్సన్ లా బ్యోమ్ కేష్ కి కూడా రచయిత అజిత్ బాబు తోడుంటాడు.  షెర్లాక్ పాత్రను రచయిత కానన్ డాయల్ ఓసారి అంతం చేసేసినా పాఠకుల కోర్కెతో మళ్ళీ బతికించి తీసుకొచ్చాడు. రచయిత శరదిందు, బ్యోమ్ కేష్ కు కూడా పెళ్లి చేసి రిటైర్మెంట్ ఇప్పించినా, పాఠకులు ఇంకా అతన్ని ఆదరిస్తున్నారని గ్రహించి, మళ్ళీ తీసుకొచ్చి డికెష్టీ పనులు మొదలు పెట్టించాడు. ఈ పోలికలతో పాటు షెర్లాక్ లో ఎంత బ్రిటిష్ తనం ఉంటుందో, బ్యోమ్ కేష్ లో అంతగానూ బెంగాలీతనం ఉంటుంది . షెర్లాక్ నూ బ్యోమ్ కేష్ నూ కలిపేదీ ఈ లక్షణమే. వాళ్ళిద్దరినీ విడదీసి దూరంగా నిలబెట్టేదీ ఈ లక్షణమే. ఎంతగా విశ్వ సాహిత్యం తలకెక్కించుకున్నా, మన వేళ్ళు మన నేలలోనే దృఢంగా ఉండటమంటే ఇదే. ఈ ప్రత్యేకతతోనే బాసు చటర్జీ సీరియల్ బ్యోమ్ కేష్ బక్షీ కూడా అలరారింది.

 

దిబాకర్ బెనర్జీ “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ” సినిమాలోనూ బెంగాలీతనానికి లోటు లేదు. పంచె కట్టి, దానిమీద బాటా షూ వేసి, మనుషులు పరుగెడుతూ లాగే రిక్షాల్లో, కలకత్తా ట్రాముల్లో తిరుగుతుంటాడు బ్యోమ్ కేష్. పాతకాలం పాన్ డబ్బా, అందులో మసాలాతో పాటు దాచుకున్న కొక్కోక శాస్త్రం, వింటేజ్ కార్లు, చైనా దంతవైద్యం, ఇత్తడి చెంబులు, గ్లాసులు, బక్కచిక్కిన బెంగాలీ మొహంలో పెద్ద పెద్ద కళ్ళేసుకుని పాత గెస్ట్ హౌస్ లో ఆశ్చర్యపోతూ తిరిగే వంటవాడు… వీటిమధ్య 1942 కలకత్తాలో మనని విహారం చేయిస్తాడు దిబాకర్. పీరియడ్ లుక్ కోసం ఎంత సూక్ష్మంగా వెళ్ళాడంటే, సినిమా పోస్టర్లు నలభైలనాటి సినిమా పోస్టర్లలా ఉన్నాయి. మన ‘చందమామ’ బేతాళకథలకు వేసిన బొమ్మల్లా కూడా !

ఇప్పటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాల్లో హీరోలు, నటుల అసలు ముఖాలు కనిపించటం లేదు. ఆ పాత్రలే కనిపిస్తున్నాయి. హాలీవుడ్ మాదిరిగా ‘కాస్టింగ్ డైరెక్టర్స్’ ను పెట్టుకుని పాత్రకు తగ్గ మొహాలు, శరీరాలు ఉన్నవాళ్ళని నటులుగా ఎన్నుకోవటంలోనే  సినిమా కళ దాగుందని కనిపెట్టేశారు మనవాళ్ళు కూడా…  ఇలా పాత్రలకు తగ్గ మంచి నటులు ఎక్కువమంది సమకూడిన సినిమాలకు ఈమధ్య ‘best ensemble cast’ అని అవార్డులు కూడా ఇస్తున్నారు.  ఈ సినిమాలో, కనపడే పాత్రలతో పాటు కీలకమైన, మనకు అసలు కనపడని ఒక జీనియస్ వ్యక్తిత్వం-  అతనికి సంబంధించిన బట్టల పెట్టే, పాన్ డబ్బా… అతని కొడుకు చెప్పే కొన్ని మాటలూ… వీటితోనే ఎంతబాగా అర్థం అయిపోతుందంటే, కథ చదువుతూ మనం పాత్రను ఊహించుకున్నట్టే !  సినిమా ప్రక్రియను సాహిత్య ప్రక్రియ లాగా కూడా సాధించిన అరుదైన దర్శకుల పేర్లలో దిబాకర్ పేరూ చేర్చాల్సిందే.

శరదిందు కథల్లో బ్యోమ్ కేష్ కి తనను డిటెక్టివ్ అని పిలవటం కూడా ఇష్టం ఉండదు. ‘సత్యాన్వేషి’ నని చెప్పుకుంటాడు. అలాంటి సత్యాన్వేషిగా అలరించిన రజత్ కపూర్ తో పోటీకి రాగల నటుడిని బ్యోమ్ కేష్ పాత్రకు ఎంచుకోవటం కూడా కష్టమైన పనే.  ఈ సినిమాలో బ్యోమ్ కేష్ గా సుశాంత్ సింగ్ రాజపుత్ కూడా బానే ఉన్నాడు. నటించాడు.  వీళ్ళిద్దరికీ పొడుగు, చురుకు కళ్ళు, అల్లరి నవ్వు సమాన లక్షణాలు. బుద్ధికుశలత తప్ప బల ప్రదర్శనలేవీ పెద్దగా ఉండవు. సుశాంత్ సింగ్ అయితే గట్టి దెబ్బలు తిన్నాడే గానీ అవకాశమున్నా ఫైట్లు అసలు చెయ్యలేదు. ఇది దిబాకర్ బ్యోమ్ కేష్ బక్షీ పాత్రకు ఇచ్చిన గౌరవమే.

Byomkesh-Bakshi-is-Indias-answer-to-Sherlock-Homes

శరదిందు కథ ‘సత్యాన్వేషి’లో కలకత్తా చైనా టౌన్ లో మత్తుమందు అమ్మకాలు, హత్యల నేపథ్యంలో బ్యోమ్ కేష్ నేరస్తుడిని పట్టుకుంటాడు. ఆ కథనే సూత్రంగా తీసుకుని రెండో ప్రపంచయుద్ధం, మత్తుమందులు, కలకత్తా ఆక్రమణకు జపాన్ వ్యూహాలు, ఇదంతా ఒకే చేత్తో… సారీ ఒకే మెదడుతో, బ్యోమ్ కేష్ ఆపెయ్యటం… ఇలా కథను పెంచుకుంటూపోయి, బ్యోమ్ కేష్ ను సూపర్ హీరో చేసేశాడు దిబాకర్ బెనర్జీ. కథను వంద మలుపులు తిప్పి larger than life స్థాయిలో సినిమా చేశాడు. దిబాకర్ లాంటి దర్శకుడి  మీద కూడా ఈ అట్టహాసపు హాలీవుడ్ ప్రభావం తప్పదా అని దిగులు… సినిమా నిశితంగా, తీరిగ్గా మనస్తత్వాల్లోకి తడిమి చూస్తుంది.  హాలీవుడ్ సినిమాలాంటి విస్తృతితో మలుపులు తిరిగి, చూసేవాళ్ళని కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా సరే, విస్తృతినీ, నిశితత్వాన్నీ సరిగ్గా బాలన్స్ చెయ్యలేకపోయిన లోటు ఏదో మిగుల్చుతుంది.

ఇంతకు ముందు దిబాకర్ తీసిన సినిమాల్లో సూపర్ హీరోలు లేరు. ఇతని దర్శకత్వంలో వచ్చిన ‘షాంఘై’ లో నాయకుడు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి. రాజకీయ మాఫియాగాళ్ళను కూడా తెలివితోనే లొంగదీస్తాడు. ఫైట్లు, రక్త పాతాల జోలికి వెళ్ళడు.  కానీ ‘డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ’ సినిమా చాలా గ్రాఫిక్ గా ఉండే హింసతో ప్రారంభమై, గ్రాఫిక్ గా ఉండే హింసతోనే ముగుస్తుంది. మధ్యలో బ్యోమ్ కేష్ తెలివితో పోటీ పడి, అతన్ని తప్పుదారి పట్టించగల దీటైన విలన్ ఆడే ఆటలు.. బ్యోమ్ కేష్ అదంతా ఛేదించి, కలకత్తాను జపాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోకుండా అడ్డుకోవటం… జరుగుతాయి. చిన్న కేసుల్లోనే పక్కాగా వ్యూహం రచించే బ్యోమ్ కేష్ బక్షీ ఈ సినిమాలో చివర్లో తీసుకునే రిస్క్ చూస్తే, అది ఆ సత్యాన్వేషి పాత్రకు తగిన వ్యూహంలా అనిపించదు.  నేరం బైటపెట్టే క్రమంలో డిటెక్టివ్ లు రిస్క్ తో కూడిన తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవటం సహజమే. ఆ నిర్ణయాల ఫలితం ఏవో కొన్ని జీవితాలకో, ఒక నేరస్తుడికో పరిమితమైతే పర్వాలేదు కానీ, ప్రేమించిన అమ్మాయి అన్న కోసం భీకరమైన నేరస్తులతో ఆటాడి, కలకత్తా మొత్తాన్నే ప్రమాదంలో పెట్టే పని సరైన ఏ డిటెక్టివ్ అయినా చెయ్యగలడా అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాటి ప్రశ్నలకి దారి తీయటమే ఈ సినిమా చెయ్యకూడని పని. కానీ చేసేసింది. దీనితో రావాల్సిన క్లాసిక్ లక్షణం సరిగ్గా రాకుండా పోయింది.

షెర్లాక్ కి వన్నె తేవటం కోసం మోరియార్టీలాంటి బలమైన ప్రతినాయకుడిని సృష్టించాడు కానన్ డాయల్. మోరియార్టీ మేథకు అయస్కాంత శక్తి ఉంది. Benedict Cumberbatch  షెర్లాక్ గా వస్తున్న బి.బి.సి. సీరియల్ లో కూడా మోరియార్టీని చాలా ఆకర్షణీయంగా తయారుచెయ్యకుండా ఉండలేక పోయారు.  మోరియార్టీ పాత్ర ప్రభావంతోనేమో, దిబాకర్ బెనర్జీ కూడా తన సినిమాలో ‘అనుకూల్ గుహ’ అనే పాత్రతో మైండ్ గేమ్స్ ఆడించాడు. బ్యోమ్ కేష్, గుహ లిద్దరూ ఒకరి తెలివిని ఒకరు అభినందించుకుంటారు. అనుకూల్ గుహగా నటించిన నీరజ్ కబి ని తట్టుకోవటం సుశాంత్ సింగ్ కు బాగా కష్టమై ఉంటుంది. అంత బాగా చేశాడు అతను. చివరకు “నా ప్రేమనే తట్టుకోలేక పోయావ్. నా ద్వేషాన్ని ఎలా తట్టుకుంటావో చూస్తాను” అని బ్యోమ్ కేష్ ను ఉద్దేశించి గుహ ప్రతిజ్ఞలు చెయ్యటంతో సినిమా పూర్తవుతుంది. ఈ ముగింపు చూస్తే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్టుంది. కొన్ని లోపాలున్నా ఇలాంటి సినిమాలనూ, సీక్వెల్స్ నూ కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు.

స్నేహా కన్వల్కర్ “గాంగ్స్ అఫ్ వాసేపూర్” కు అసలైన జానపద బాణీలను వాడి ఆ సినిమాను మెరిపించింది. కానీ బ్యోమ్ కేష్ సినిమాకు తగిన సంగీతం ఇవ్వలేకపోయిందనిపించింది. డిటెక్టివ్ సినిమాల ట్యూన్స్ అంటే, అవి మనల్ని వెంటాడుతూ ఉండాల్సిందే !  అది ఈ సినిమాలో జరగలేదు. పైగా హోరుగా ఉన్న సంగీతంతో ప్రేక్షకులని ఈ కథకి ఎలా శృతి చేద్దామని అనుకున్నారో అర్థం కాలేదు. బ్యోమ్ కేష్ లాంటి పీరియడ్ ఫిల్మ్ లో ఇలాంటి సంగీతం కోసం కాలేజ్ పిల్లలు కూడా వెదుక్కోరు. లేక సినిమా ప్రమోషన్ కోసం, పాత తరం సినిమా అని ఎక్కడ రావటం మానేస్తారో అని భయపడి అందర్నీ ఆకర్షించటం కోసం, అలాంటి metal rock సంగీతపు ట్రాక్ అవసరమనుకునే ఊహ వచ్చిందేమో!

బ్యోమ్ కేష్ బక్షీ హిందీ సీరియల్ లో సాంకేతిక విలువలు అంతగా బాగుండవు. ఏవో బడ్జెట్ పరిమితులతో తీసినదది. కానీ దానికి ఆనంద్ శంకర్ ఇచ్చిన థీమ్ సంగీతం మాత్రం అద్భుతంగా ఉంటుంది.  ఆ టైటిల్ మ్యూజిక్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=zlOAN3Gb-8c

Jeremy Brett  షెర్లాక్ హోమ్స్ గా నటించిన గ్రానడా టీవీ క్లాసిక్ సీరియల్ “షెర్లాక్ హోమ్స్” టైటిల్ థీమ్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=3AoK2dqb1vs

Benedict Cumberbatch  షెర్లాక్ హోమ్స్ గా బి.బి.సి. తీస్తున్న సీరియల్ థీమ్ ఇది…

https://www.youtube.com/watch?v=gzCEIBaV1Es

షెర్లాక్ హోమ్స్ చెప్పినట్టుగా  “There is nothing so important as trifles” అన్న సూత్రానికి బాగానే కట్టుబడ్డ సినిమా “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ”

కానీ,  “ప్రతిసారీ అసాధ్యమైన విషయాల్ని విడిచిపెడుతూ పోతే మిగిలేది, జరగటానికి అతి తక్కువ ఆస్కారం ఉన్నదైనా సరే, అదే సత్యం” (“Whenever you have eliminated the impossible, whatever remains, however improbable, must be the truth” – Sherlock Holmes) అనే షెర్లాక్ సత్య శోధన పధ్ధతిలో సినిమా తీసేటప్పుడు, హాలీవుడ్ బాలీవుడ్ ల భారమైన అసాధ్యపుటూహలను కూడా పక్కన పెడితేనే సత్యమైన సినిమా బైటకొస్తుంది.

That’s  “Elementary….”  My dear Dibakar!

                                                                                            *

మీ మాటలు

  1. P V Vijay Kumar says:

    Truly enjoyed this well structured article. Loved it …. being fan of detective literature. Thanq very much

  2. Quite an impressive and sweeping take on the true-to-it’s-milieu detective saga. On the technical front , production design by Vandana Kataria and Nikos Andritsakis’ cinematography for its visual appeal stood out.

    Agatha Christie’s Poirot is another excellent whodunit TV series you would not like to miss !

  3. Nisheedhi says:

    ఎంత సుషాంత్ అంటే ( మీరే చెప్పినట్లు ఆ చురుకు కళ్ళు , ఆ అల్లరి నవ్వు వదులుకొవటం ఇస్టం లేకపోయినా ) ఇష్టం ఉన్నా రజత్ కపూర్ కి కమిట్ అయిపొయిన మనసు ఎందుకో నిజంగానే కొత్త పంట్లాం హీరోలని రిజెక్ట్ చేస్తుంది అని నకనిపించన భావనకి అక్షర రూపంలా ఉంది మీ ఆర్టికల్ . చూడ్డం పక్కనపెడితే మాత్రం మొత్తం చైల్డ్ హుడ్ జ్ఞాపకాలు కళ్ళ ముందుకొచ్చెసాయి. ఇలాంటివి ఇంకా బోలేడు చదవాలి మీ నుండి

  4. paresh n doshi says:

    well written.

  5. చాలా చక్కగా చెప్పారు . ఎంతో నిశితమైన పరిశీలనా శక్తి ఉంటే గానీ ఇంత చక్కని విశ్లేషణ వ్రాయడం సాధ్యం కాదు . అభినందనలు

  6. Lalitha P says:

    విజయ్ కుమార్, నరేష్, నిశీధి, పరేష్ దోషి, భవానీ గార్లకు… వ్యాసం నచ్చి, స్పందించినందుకు థాంక్స్.

  7. Loved your review. I liked the way certain points have been keenly observed and mentioned in the article.

Leave a Reply to P V Vijay Kumar Cancel reply

*