అనామకుల ఆయుధం!

నారాయణస్వామి వెంకటయోగి 

swamy1“కళ అబద్దం . అది నిజాన్ని చెప్తుంది” – పికాసో

“ఎడ్యుయార్డోను ప్రచురించడం అంటే శత్రువుని ప్రచురించడమే ! అబద్దాలకూ, ఉదాసీనతకూ, అలక్ష్యతకూ అన్నింటికంటే మించి మతిమరపుకు శత్రువు! మన నేరాలు గుర్తు పెట్టుకోబడతాయి. అతని సౌకుమార్యం విధ్వంసకారకం, అతని నిజాయితీ ప్రచండమైనది” – జాన్ బెర్గర్

~

 ప్రపంచ ప్రఖ్యాత లాటిన్ అమెరికా రచయిత, ఉరుగ్వే దేశానికి చెందిన జర్నలిస్టు, నవలా రచయితా కవీ ఎడ్యుయార్డొ గాలియానో,  74 యేండ్ల వయసులో కాన్సర్ తో పోరాడుతూ ఏప్రిల్ 13, 2015  న మరణించారు. గాలియానో ప్రముఖ రచన ‘ఓపెన్ వేన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా – ఫైవ్ సెంచరీస్ ఆఫ్ ద పిలేజ్ ఆఫ్ ఎ కాంటినెంట్’ (చిట్లిన రక్తనాళాల లాటిన్ అమెరికా – ఐదు శతాబ్దాలుగా కొల్లగొట్టబడిన ఒక ఖండపు గాథ) ను వెనీజువెలా అధ్యక్షుడు హుగో షావేజ్ అమెరికా అధ్యక్షుడు ఒబామా కు బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ఆ పుస్తకం 1971 లో మొదటిసారిగా ప్రచురించబడినప్పటినుండీ కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడై రికార్డు సృష్టించింది. చీలీ, ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో మిలిటరీ నియంతృత్వ ప్రభుత్వాలు ఆ పుస్తకాన్నినిషేధించాయి. తన స్వదేశమైన ఉరుగ్వే లో 1973 లో మిలిటరీ హుంటా అధికారాన్ని చేజికించుకున్నాక, ప్రవాసానికి వెళ్ళిపోయిన గాలియానో ‘’మెమరీ ఆఫ్ ఫైర్” (అగ్నిస్మృతి) అనే ప్రముఖ రచన చేసారు. దానిలో గాలియానో ఐదు శతాబ్దాలా అమెరికా ఖండాల చరిత్ర తిరిగి రాసారు. “సాకర్ ఇన్ సన్ అండ్ షాడో” (ఎండా నీడలలో సాకర్ ), “అప్ సైడ్ డౌన్” (తలకిందులుగా ),” వాయిసెస్ ఆఫ్ టైమ్  “ (కాల స్వరాలు), “మిర్రర్స్ “ (అద్దాలు), “వి సే నో” (మేము కాదంటున్నాము) – అతని ప్రముఖ రచనలల్లో మరికొన్ని. గాలియానో కు సాంస్కృతిక స్వేఛ్చ కిచ్చే లన్నాన్ అవార్డు,ఇంకా తదితర అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చినయి.

గాలియానో మరణం, కేవలం లాటిన్ అమెరికా లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం, సత్యానికి జయం కోసం పోరాడుతున్న కోట్లాది ప్రజానీకానికి తీరని లోటు. అందరినీ కలుపుకుని పోయే, న్యాయమైన, సమైక్య లాటిన్ అమెరికా కోసం పోరాడే వారందరికీ గాలియానో మరణం తీవ్రమైన నష్టం. లాటిన్ అమెరికా లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నోరులేని నిరుపేద అనామక ప్రజానీకానికి గొంతునిచ్చి వారి దైన్యాన్ని,  ఆగ్రహాన్ని తన రచనల్లో అత్యంత శక్తివంతంగా పలికిన గాలియానో అమరులు. చిరస్మరణీయులు, ఆయన రచనలు అనామకుల చేతుల్లో ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధాలు.

“సామ్రాజ్యవాదులు, దోపిడీ శక్తులు అనుక్షణం మనందరిలో మతిమరపును కలిగిస్తూ ఉంటాయి – వారి దుర్మార్గాలను మైమరపింపజేసే మతిమరపు. మన రచనలు సాహిత్యం ప్రజల్లో గ్నాపక శక్తిని పెంపొందించాలె” అంటారు గాలియానో. సాంప్రదాయిక విద్యనేదీ పాఠశాలకు పోయి నేర్చుకోని గాలియానో, ఉరుగ్వే రాజధాని మాంటేవీడియో లోని కాఫీ హోటళ్ళలో చదువు నేర్చుకున్నాడు. కథలు చెప్పే కళలు నేర్చుకున్నాడు. అక్కడ్నుండే,  గడచిన ఐదు శతాబ్దాల కథలన్నీ యిప్పుడే జరుగుతున్నట్టుగా భమింప జేసే అద్భుత మాయాజాలాన్ని సృష్టిస్తూ రచనలు చేసాడు. మరచిపోయిన గతాన్ని వర్తమానం లో యిప్పుడే జరుగుతున్నట్టుగా  ఆవిష్కరించి, సామ్రాజ్యవాదులు తన అందమైన లాటిన్ అమెరికా ఖండాన్నెలా దోపిడీ చేసి కొల్లగొట్టారో కళ్లకు గట్టేలా చిత్రించారు గాలియానో.

“మన గ్నాపకాలను ముక్కల కింద కోసేసారు. నేను చేసిందల్లా మన నిజమైన గ్నాపకాలను పునర్నిర్మించడమే. మానవజాతి గ్నాపకాలు మానవ ఇంద్ర ధనుస్సు లాంటిది . అది నిజమైన ఇంద్ర ధనుస్సుకన్న అందమైనది. కానీ మానవ ఇంద్రధనుస్సు పురుషాహంకారం, జాత్యహంకారం, మిలిటరీ నియంతృత్వం లాంటి అనేక దుర్మార్గాల చేత చిన్నాభిన్నమైంది. ధ్వంసం చేయబడ్డది. అనేక దుర్మార్గాలు మానవ జాతి గొప్పతనాన్ని, మనకు మాత్రమే సాధ్యమయ్యే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నయి. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి వాటిచేత అణచివేయబడుతున్న అనామకులకు గొంతునివ్వడమే రచయితల నిజమైన కర్తవ్యం. అట్లాంటి రచనే నిజమైన గొప్ప రచన”  అన్నారు గాలియానో. తాను నమ్మిన దాని కోసం  జీవితం లో చివరి క్షణం దాకా  నిలబడ్డ మహోన్నత వ్యక్తిత్వం గల రచయిత గాలియానో.

“We shall miss him dearly”.

అనామకులు

ఈగలు తమకోసం ఒక కుక్కపిల్లను కొనుక్కోవాలని కలగంటాయి. అనామకులు దరిద్రం నుండి బయటపడాలని కలగంటారు. యేదో ఒక అద్భుత దినాన హఠాత్తుగా బకెట్ల కొద్దీ అదృష్టం తమ మీద వర్షిస్తుందని – కానీ అదెప్పుడూ జరగదు, నిన్న, యివాళ్ళ,  రేపు యెప్పటికీ జరగదు – అదృష్టం కనీసం తుంపరలెక్కన్న కూడా రాదు అనామకులు  దాన్నెంత గట్టిగా పిలిచినా సరే  – వాళ్ళ కుడి కన్ను యెంత అదిరినా సరే, ప్రతి రోజూ ఠంచను గా కుడికాలు ముందుపెట్టి పనులు మొదలుపెట్టినా సరే, ప్రతీ కొత్త సంవత్సరం ఒక కొత్త చీపురుతో మొదలు పెట్టినా సరే …

అనామకులు: అనామకుల పిల్లలు, దేనికీ యజమానులు కారు. అనామకులు, యెవరూ కాని వారు,  యెవరికీ కాని వారు, ప్రతి క్షణం ప్రాణభయంతో ఉరుకుతూ, ప్రతి క్షణం చచ్చిపోతూ, అన్ని రకాలుగా వోడిపోతూ, వోడించబడుతూ …

యెవరైతే లేరో,  కానీ వుండవచ్చో
యెవరికైతే  భాషలు రావు, కానీ మాండలికాలు మాట్లాడతారో
యెవరికైతే మతాలుండవు,  కానీ మూఢనమ్మకాలుంటయో
యెవరికైతే కళలు కాదు,  కానీ హస్తకళలు తెలుసో

యెవరికైతే సంస్కృతుండదు, కానీ జానపదముంటుందో
యెవరైతే మనుషులు కాదు,  కానీ మానవ వనరులో
యెవరికైతే ముఖాలుండవు  కానీ చేతులున్నాయో

యెవరికైతే పేర్లుండవు,  కానీ అంకెలు గా మాత్రమే తెలుసో
యెవరైతే స్థానిక వార్తా పత్రికల పోలీసు వార్తల్లోనే  కానీ,
ప్రపంచ చరిత్రలో యెక్కడా కనబడరో…
అనామకులు –
వాళ్లని కాల్చిపారేసిన బులెట్ విలువ కూడా లేని వాళ్ళు.

 

*

మీ మాటలు

  1. Nisheedhi says:

    యెవరికైతే పేర్లుండవు, కానీ అంకెలు గా మాత్రమే తెలుసో
    యెవరైతే స్థానిక వార్తా పత్రికల పోలీసు వార్తల్లోనే కానీ,
    ప్రపంచ చరిత్రలో యెక్కడా కనబడరో…
    అనామకులు –
    వాళ్లని కాల్చిపారేసిన బులెట్ విలువ కూడా లేని వాళ్ళు. How true . Thanks a lot for this special introduction . very few can right like this with heart and minds complete balance .

  2. నారాయణస్వామి says:

    మా ఆఫీసు లో Uruguay దేశస్తుడైన ఒక స్నేహితుడి తో మాట్లాడుతుంటే తెలిసింది – Uruguay ని అనేక విధాలుగా పలుకుతారని – యూరుగ్వే, యూరుగ్వాయి యూరువాయి, వురుగ్వే వురుగ్వాయి వురువాయి – యిట్లా ….
    అట్లే యూరుగ్వాయి లో మూలవాసులూ ఆదివాసులూ యెవరూ మిగల్లేదనీ, అందరినీ తరిమేసో, ధ్వంసం చేసో ఫ్రాన్సు, స్పేయిన్, పోర్చుగీసు తదితర ఐరోపా దేశాల వాళ్ళు మొత్తంగా ఆ దేశాన్ని ఆక్రమించేసుకున్నారని కూడా తెలిసింది.

  3. Nisheedhi says:

    ప్రపంచీకరణ పదనిసల్లో తెగిన వీణలు ఎన్నో .

  4. Thirupalu says:

    /అనేక దుర్మార్గాలు మానవ జాతి గొప్పతనాన్ని, మనకు మాత్రమే సాధ్యమయ్యే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నయి. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి వాటిచేత అణచివేయబడుతున్న అనామకులకు గొంతునివ్వడమే రచయితల నిజమైన కర్తవ్యం. /
    ఈ మాట పాతదే అయినా, దాని గొంతు మాత్రం ఎప్పటికి నవ నవో న్మేశమే! అనామకులు గొమ్తెత్తే వరకు. పరిచయం చాలా బాగుందండి.

Leave a Reply to Thirupalu Cancel reply

*