చీకటి నెత్తురు

ప్రసాదమూర్తి

 

రాజ్యం గోదాములో

తుపాకులకు ఉన్నట్టుండి వెక్కిళ్ళు పుట్టాయి

దాహం దాహమని అరుస్తూ

తూటాల జూలు దులిపాయి

ఆ రాత్రి అడవంతా వణికిపోయింది

 

అడవిలో చెమటబొట్లు ధారబోసి

చితుకులుఏరుకుని

బతుకులు వెలిగించుకునే

కూలీ పిట్టలు

రెక్కలు కూడగట్టుకుని

 దిక్కులకు దండాలు పెట్టాయి

 

శేషాచలం సాక్షిగా

దేవుడే దారి చూపిస్తే

అడవిలో తుపాకులు

 రాత్రిని తాగి రంకెవేశాయి

 

మనిషి రక్తం

బొట్లుబొట్లుగా కురిసీ కురిసీ

నేలరాలిపడివున్న ఆకుల మీద

భీకరంగా మెరిసింది

అదే రాత్రి నెత్తురు రంగులోకి మారిన చీకటి

రాజ్యానికీ రాజుకీ సలాం చేసింది

 

నేను మాత్రం  ఆ రాత్రంతా

నా ఇంటి చుట్టూ అనాథ అస్థి పంజరాలు

నిస్సహాయంగా నిశ్శబ్దంగా నన్నే పిలిచినట్టు

నిద్రలో ఉలిక్కిపడుతూనే వున్నాను

 

ప్రమాదాన్ని ముందే శంకించిన సూర్యుడు

కొండ అంచున జారవిడిచిన  ఎర్రటి నీడలో

పొర్లిపొర్లి వచ్చిన నా అక్షరాలు

త్వరగా లెమ్మని

కిటికీ ఊచలకు వేళ్ళాడుతూ

 చిటికెలు వేశాయి

*

prasada

 

మీ మాటలు

 1. Thirupalu says:

  /నేను మాత్రం ఆ రాత్రంతా
  నా ఇంటి చుట్టూ అనాథ అస్థి పంజరాలు
  నిస్సహాయంగా నిశ్శబ్దంగా నన్నే పిలిచినట్టు
  నిద్రలో ఉలిక్కిపడుతూనే వున్నాను/

  హృదయం తో చూచి మనసుతో మాట్లాడారు. మనిషిని మనిషి తనలో పునీతమ్ గావించారు.

 2. Nisheedhi says:

  Wounded words

 3. Buchi reddy gangula says:

  Excellent .సర్.
  ——–buchireddy

మీ మాటలు

*