వర్గీకరణ  వ్యథ 

 ఎండ్లూరి సుధాకర్ 

 

”వర్గీకరణ పేరిట

నోరెత్తితే నాలుక కోస్తాం

నామ రూపాలు లేకుండా చేస్తాం

ఏ పార్టీ అయినా

ఏ నాయకుడికైనా ఇది తప్పదు ”*

ఈ మాటలు

తూటాలు పేల్చే ఉగ్ర తాలిబాన్లవి కావు

దళితుల తలలు నరికే అగ్ర సైతాన్లవి కావు

మా వాళ్ళవే

మాలో వాళ్ళవే

‘కావడి కుండల్లా కలిసుందాం

అన్నదమ్ముల్లా విడిపోదాం’

అన్నవాళ్లవే

ఇంగిత జ్ఞానం

ఇంగ్లీషు జ్ఞానం వున్న వాళ్ళవే

‘బుద్ధి’స్టులు  పచ్చి టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారు

దయతో న్యాయం చెప్పండి మీరైనా

నాలుగు ముద్దల్ని

నలుగురం పంచుకుందామంటాము మేము

కాదు కుండ మాకే కావాలంటారు వాళ్ళు

మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం

మాకు మెరిట్ వుంది పోటీ పడమంటారు వాళ్ళు

ఈ పంతం పంతుళ్ళ ముందు ఏమైందో గానీ

 మా అంతం చూసే దాకా వదిలి పెట్టడం లేదు వాళ్ళు

ఏమడిగాం మేము  ఎ బి సి డి లే కదా

ఎవరి మానాన వాళ్ళం బతుకుదామనే కదా

ఎంగిలి మెతుకుల కోసం

ఎగబడుతుంటే ఏం చేయాలో చెప్పండి

ఈనాటిదా ఈ కథ ?

కామధేనువుని కోసుకు తిన్నప్పటినుంచి

కయ్యం కాలు దువ్వుతూనే వుంది

మెత్తని చియ్యలు వాళ్ళు తిన్నారు

ఉత్త ఎముకలు మాకు మిగిల్చారు

చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ

చెప్పకుంటే ద్రోహం మిగుల్తుంది

ఏ జాంబపురాణమో విప్పండి

జాతిపితలు నిజాలు చెప్తారు

సూటిగా అడుగుతున్నాను

 సోదరులారా! నిజం చెప్పండి

ఏనాడైనా

ఒక పాకీ మీలోకి నడిచి వచ్చాడా ?

మీతో చేతులు కలిపి

ఐక్యవేదికపై  పూలమాలై వికసించాడా ?

ఏ రోజైనా

ఒక గోసంగి గోస విన్నారా ?

ఎడారిలాంటి  కుల బిడారులో

ఒక గొడారిని కలుపుకున్నారా ?

ఏ హోదా లేని స్మశానంలో

జీవచ్చవంలాంటి  కాపరిని కన్నారా ?

ఏ ఒక్కరైనా మీ పక్కన ఉన్నారా ?

నిజమే సుమా !

‘సంచారమే ఎంతో బాగున్నది’

ఒక్క సంచార జాతి వాడైనా

మీ పంచన నిలబడ్డాడా ?

తెల్లటి బట్టలతో కనబడ్డాడా ?

ఏ రెల్లి చెల్లైనా

మీ వేదిక మీద గొంతు వినిపించిందా  ?

ఏ డక్కలి పిల్లైనా నీలిజెండాతో కనిపించిందా?

ఎక్కడ వినిపిస్తాయి సమైక్యతా రాగాలు?

ఎప్పుడు వెదజల్లుతాయి

మల్లె మాలల పరాగాలు ?

ఈ శతాబ్దపు పెద్ద అబద్ధాలు

ఒకటి సమైక్యత

రెండు ఐక్యవేదిక

కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మేము తలలు వంచుకుని

వేల సంవత్సరాలుగా చెప్పులు కుడుతూనే వున్నాం

ఒక్క సారి తలెత్తే సరికి

ఎక్కడికో చేరిపోయారు

ఎస్కిమోల్లాగా మేము మంచు గుహల్లో  వుంటే

ఎస్కలేటర్ల మీద

 పార్లమెంటుకు తరలిపోయారు కదా

ఏరోజైనా మాకు బోధించారా ?

మమ్మల్ని సమీకరించారా ?

పోరాటాలకు బాటలు వేశారా ?

రెప్ప పాటులోనే తెప్ప తగలేశారు కదా

చూస్తూ ఉండగానే రిజర్వేషనంత ఎత్తుకి ఎదిగి పోయారు

ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క అమృత భాండం

మా చేతుల్లో ఖాళీ కుండలు

ఒక సుదీర్ఘ నిద్ర తర్వాత

ఒక కొత్త సూర్యోదయం తర్వాత

దండోరా ధర్మ ఘంటికలు మోగిస్తే

కడుపు కాలి మాట్లాడితే

కన్నీటి నాల్కల మీద

కారం చల్లుతారా ?

ఆకలి బతుకుల మీద

మేకులు కొడతారా ?

బువ్వ తినాల్సిన వారసుల్ని

భ్రూణ  హత్యలు చేస్తారా ?

కలిసి ఉందాం

కలిసి తిందాం అంటే

కత్తులు దూస్తారా ?

నాల్కలు కోస్తారా ?

ఒక్కసారి బాబా సాహెబ్

చూపుడు వేలు వైపు చూపు సారిస్తారా !

అంబేద్కర్ సాక్షిగా

వర్గీకరణ రథాన్ని

ముందుకు తీసుకెళ్లమంటున్నాడు

మీరూ వస్తారా ఆనందంగా రండి

ఉపకులాలతో  బాధిత గళాలతో

హస్తిన వైపు రథాన్ని మళ్ళిద్దాం !

ఏదో ఒక రోజు ఎర్రకోటలో

నీలిపతాకం ఎగరక పోదు !

[ ఆంధ్ర జ్యోతి : *మార్చి 28న ఏలూరులో జరిగిన ‘మాలల సింహగర్జన’ సభలో కారెం శివాజీ వ్యాఖ్యలు ]

మీ మాటలు

 1. వర్గీకరణ హక్కుగా కాకుండా వ్యధగా మారినపుడు ఇలాంటి కవితలు వేలు రావాలి.

 2. buchi reddy gangula says:

  సుధాకర్ గారు —బాగుంది సర్ — కాని
  అన్నదమ్ముల్లా విడి పోదాం —???కలిసిఉ 0 దా 0—అలా ఉండాలనే తెలంగాణా జనం
  ప్రతి రోజు — ప్రతి ఘడియ అలాగే కోరుకుంటారు —ఎందుకు విడి పోవలిసి వచ్చిందో —
  మీరు చదువుకున్న వాళ్ళు — మీకు తెలుసు
  2 తెలుగు రాష్ట్రాలు ఉంటె తప్పు ఏమిటి ???
  నేను కోరుకుంటాను — కుల మత పట్టింపులు పోవాలని —- దళిత పాలన రావాల ని ???

  కాని మన జనం — మన ఎన్నికలు — మన ప్రజాసామ్యం — ఎలా ఉందో —నాకన్నా మీకే
  ఎక్కువ తెలుసు —
  బతుకు తెరువు కోసం — అమెరికా లో ఉంటూ — పత్రికలూ — టి .వి లు చూస్తూ — మారింది
  ఎక్కడో — మార్పు వచ్చింది ఎక్కడో — నాకు పొంతన కుదురడం లేదు ??/

  సింహ ఘర్జన తో సరి పోదు —
  తిరుగ బడాలి
  పోరాటాలు చేయాలి —ప్లస్ మనలో మాల — మాదిగ అంటూ దూరాలు పెంచుకోకుండా
  కలిసి పోరాడాలి —
  మన కులం లో ని నాయకు ల కు ఒక స్టాండ్ అంటూ లేకుండా —( కృష్ణయ్య –Krishna మాదిగ ) పార్టీ ల కు అమ్ముడు పోయే నేతలు మనకొద్దు —
  కట్టి పద్మారావు లాంటి నేతలు — ముందుకు వచ్చి గళం ఎత్తాలి
  భూ సంస్కరణలు —– అమలు లోకి రావాలి —
  ఆర్థిక వత్యాసాలు తొలిగి పోవాలి
  వారసత్వ రాజకీయాల కు ఫుల్ స్టాప్ పెట్టాలి —

  యి రోజు Andhra జ్యోతి లో యిప్పుడే చదివాను
  యీ వారం లోకేష రాయల సీమ పర్యటన
  ********************************************************* వాని పర్యటన ఒక వార్త సుధాకర్ జి ?????

  మన నేతలు అతడు ఎవరు ?? ఎందుకు పర్యటన ___ అని ప్రశ్నించ వచ్చు కదా ???//
  ఒక ఉ దాహరణ కోసం —– మాత్రమే లోకేష్ గురించి రాశాన
  మార్పు రావాలి – రాకా తప్పదు —

  బుచ్చి రెడ్డి గంగుల

  *

 3. Nisheedhi says:

  అయ్యోరి కాలి చెప్పులు మోసేవాడు ఇంటికొచ్చి పెళ్ళం జుట్టు పట్టుకున్నట్లు తమదాక వచ్చక వర్గీకరణ వద్దనడం అంటే తనకంటే ఆర్ధికంగా సామజికంగా తక్కువ స్థాయి వారిని పైకి ఎదగనియ్యకుండా చేసే మనువాద లక్షణాలు పూర్తి గా వొంట్లో ఇంకించుకోవడం ‘ చే’
  అన్నట్టు ఒక నియంత పోవటం ఇంకో కొత్త నియంత తయరీకే అని . సాధికారత అందరికి అందిన ఫలం కావలంటే అణగారిన ప్రతి జాతి అంకుశం అందుకోవాల్సిందే

 4. Thirupalu says:

  వర్గీకరణ కావాలనడం తప్పుకాదు, వర్గీకరణ వద్దు అనడం తప్పుకాదు. భూస్వామ్య భావజాలాన్ని వంట పట్టించు కోవడమే తప్పు. నిచ్చెన మెట్ల సమాజం లో కులం నిచ్చెనల మీద ఎక్కి పోయిన వాళ్ళు ఏరు దాటగానే తెప్ప తగలేయడమ్ తప్పు. ఎన్ని నాల్లని ఏలిన వారు వేసే ఎముక ముక్కలకు ప్రాకు లాడతారు ? అంతా ఒకటే నని భూస్వ్వానికి ఎదురొడ్డి ఎదురు నిలవక వారి వమ్చనలో పావులు కావద్దు.

 5. venkanna says:

  చాలా బావుంది సుధాకర్ గారూ
  మళ్లీ కలం దూశారు ,
  పదును నాలుకలకి ఉంటోంది గాని
  బుద్ధి మొద్దు బారిపోతోంది లా వుంది
  గీత దాటిపోయాక
  ఎవరైనా ఇలాగే నా !
  ఐనా ఎవరికైనా ఏదైనా ఇవ్వొద్దనదానికి
  హక్కెక్కడిది .
  అది అసూయా తామేమి పొందారో
  అది అందరికి అన్దాలికదా!

 6. g.venkatakrishna says:

  సార్ మీ ఆవేదన పచ్చి నిజం .దండోరా వల్ల దళిత ఐక్యత దేబ్బతినిందని అంటారు గాని ,దండోరా అడిగేది ఇస్తే ,నిజమైన ఐక్యత వస్తుంది .ఎందుకు అలా ఆలోచించారో అర్థం కాదు .

 7. SURESH KUMAR DIGUMARTHI says:

  సార్,
  మరోసారి నిజమైన సామాజిక న్యాయపు సెగ రగిలించారు, ఎ.బి.సి.డి లు మాత్రమే కాదు, ఏ నుండి జెడ్ వరకూ న్యాయం జరగాల్సిందేనని చాలా విపులంగా చెప్పారు.

 8. sudhakar yendluri says:

  కారెం శివాజీ కరకు ప్రకటన చేసిన రెండురోజుల తర్వాత, బాబా సాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా మహా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖామంత్రి మాన్యశ్రీ రావెల కిశోర్ బాబు చేతుల మీదుగా కారెం శివాజీ కి ‘దళిత రత్న’ అవార్డ్ అందజేయడం ఒక విశేషం . ఒక విడ్డూరం . ఒక విషాదం .

 9. VICTOR GONGATI says:

  ఎండ్లూరి వారి “వర్గీకరణ వ్యథ” వాస్తవాలను ప్రతిబింబింప జేసింది.

 10. suseel tatapudi says:

  Samanatvam leni Ikyataku ardam ledu..
  Samanatwam kavalanye A B C D.. undi teerali. yevaridi varu tinnappude andariki andutundi okkade anbhavishe adi mosame avutundi…
  MEERU MOSAGALLA ANDARILO VOKKARA….. MERE NIRNAYAM TRRSUKONDI.

 11. డా.పసునూరి రవీందర్‌ says:

  మాదిగ మహాకవి ఎండ్లూరిగారి కవితలో ఆవేదన, ఆవేశం కలగలిసి ఉన్నాయి. ఇది మా అందరి బాధే! కాకుంటే నిద్ర నటిస్తున్న నటులతోనే అసలు సమస్య. మా కడుపు కాలుతుందని అడిగినప్పుడాల్లా, మాల మహానాడు నేతలంతా వర్గీకరణను దాటవేయడానికి రాజ్యాధికారమనే విషయాన్ని ముందుకు తేవడం సిగ్గుచేటు. వర్గీకరణను బలపరిచిన మాలనేతలైనా, పిచ్చి ప్రేలాపనలు పేలే వాళ్లకు బుద్ధి చెప్పి దళితజాతి పరువు కాపాడాలి..లేకుంటే అగ్రవర్ణాలు మనల్ని చూసి ఎప్పుడూ నవ్వుకుంటూనే ఉంటారు. ఆర్ధ్రత కలిగిన కవితను రచించిన సుధాకర్‌ సార్‌కు, ప్రచురించిన అఫ్సర్‌ సార్‌కు ధన్యవాదాలు…
  -డా.పసునూరి రవీందర్‌

 12. kaaseem says:

  సర్ ,మల్లోకసారి ‘వర్గీకరనియం’ నినాదాన్ని ఎతుకున్నందుకు థాంక్స్. పోయెమ్ బాగుంది.తెలంగాణా కావాలని పోరాడిన వాళ్ళే,వర్గీకరణను వద్దంటున్నారు.ఇది పరమ ‘చండాల’ చరిత్ర.ఎండ్లూరి ఏరుపడుదామంటే ‘ కారం ‘ నూరే వాళ్ళు వుంటారు మరి.మల్లెల పందిరి కింద మంచం పొత్తు లేకున్నా కత్తి ఐక్యత నే కోరుతుంది.శివాజీలు ఖడ్గ ధారులై అరుందతి సుతుల హత్యా కై బయలు దేరారు.తప్పదు, గొడ్డును కోసి కుప్పలు ఏసుకున్నట్లు.

 13. asadhi ganesh says:

  మే వ్యధ లో ఆవేదన ఉంది . అక్కడ అందరు పోస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ మనం బలమైన వేదికని నిర్మించుకోలేక పోతున్నాం దేని గురించి ఆలోచించండి

మీ మాటలు

*