వార్తకి అటూఇటూ…. 

వై.వి. రమణ 

 

రమణఉదయం పదిగంటలు. అప్పుడే కాఫీ తాగి పేపర్ చదవడం మొదలెట్టాను. శేషాచలం అడవుల్లో కూలీల ఎన్‌కౌంటర్ గూర్చి వార్తా విశ్లేషణ చదువుతున్నాను. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బు హడావుడిగా వచ్చాడు. 

“హలో మిత్రమా! ఒక కప్పు కాఫీ! అర్జంట్!” వస్తూనే అన్నాడు సుబ్బు. 

“కూర్చో సుబ్బూ! బహుకాల దర్శనం, బాగున్నావా?” పలకరించాను. 

“నేను బాగానే వున్నాన్లే! అంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నావ్! ఏంటి కబుర్లు?”

“పాపం! శేషాచలం అడవుల్లో ఇరవైమంది చనిపోయ్యారు సుబ్బూ! ఘోరం కదూ?” దిగాలుగా అన్నాను.

“ప్రస్తుతం మన్దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కావున – మనుషులిలా చావడం సహజం. నువ్విలాంటి సాధారణ వార్తలకి దిగులు చెందరాదు!” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

ఆ నవ్వుకి వొళ్ళు మండిపొయ్యింది నాకు.

“మనుషుల ప్రాణాలంటే నీకంత చులకనగా వుందా సుబ్బూ?” మొహం చిట్లించి అన్నాను.

నా ప్రశ్నకి ఒక క్షణం ఆలోచించాడు సుబ్బు.

“నువ్వు అర్ధం చేసుకోవాల్సింది – మన దేశ ఆర్ధిక ముఖచిత్రం మారుతుంది. ఇప్పుడిక్కడ కావల్సింది ‘అభివృద్ధి’ తప్పించి మనుషుల ప్రాణాలకి రక్షణ కాదు. ఈ నేపధ్యం అర్ధం చేసుకున్నాను కాబట్టే మనుషులు చావడం, చంపబడటం ఒక సహజ పరిణామంగా నేను ఫీలవుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే – ‘అభివృద్ధి’ అనే ఫేక్టరీకి ఈ చావులు కాలుష్యం వంటివి. కాలుష్యం లేకుండా ఫేక్టరీ నడవదు, లాభాలు రావు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా జరుగుతుందిదే.” అన్నాడు సుబ్బు.

ఇంతలో ఫిల్టర్ కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది.

“సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు తెలుగులో చెప్పవా?” విసుగ్గా అన్నాను.

“సమాజం ఏకోన్ముఖంగా వుండదు. అడవిలో జంతువుల్లాగే అనేక రకాల వ్యక్తుల సమాహారమే సమాజం. కాకపోతే మనుషులు ఒకే రకమైన శరీర నిర్మాణం కలిగుంటారు. అందుకే ఈ శేషాచలం చావుల్ని కూడా ఎవరి తోచినట్లు వారు అర్ధం చేసుకుంటారు.” అన్నాడు సుబ్బు.

“అదెలా?” ఆసక్తిగా అడిగాను.

“నీకు పెద్దమనుషుల భాషలో చెబుతాను. ఈ భాషని ‘కన్యాశుల్కం’లో సౌజన్యారావు పంతులుతో మాట్లాడిస్తాడు గురజాడ. ఈ భాష గంభీరంగా వుంటుంది, అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం!” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటో ఆ భాష?” అన్నాను.

“శాంతిభద్రతల్ని కాపాడ్డం, నేరాల్ని అరికట్టడం అనేది రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యత. ఎవరైతే నేరం చేసినట్లు రాజ్యం భావిస్తుందో, వారిపై నేరారోపణ చేస్తూ, సాక్ష్యాధారాల్తో కోర్టుకి అప్పగించడం రాజ్యం యొక్క విధి. ఇందుకు రాజ్యానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. అట్లా కోర్టుకి అప్పగించిన వారిని ‘నిందితులు’ అంటారు. ఇక్కడి నుండి న్యాయవ్యవస్థ పని మొదలవుతుంది. నిందితుడికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాల్ని కూలంకుషంగా విచారించి ఆ నిందితుడు నేరం చేసిందీ లేనిదీ కోర్టులు తేలుస్తాయి. నేరం చేసినట్లు ఋజువైతేనే నిందితుడు, ఆ క్షణం నుండి ‘నేరస్తుడు’ అవుతాడు.” అన్నాడు సుబ్బు.

“ఇదంతా నాకు తెలుసు.” అసహనంగా అన్నాను.

“ఈ పెద్దమనుషుల భాష ప్రకారం – మొన్నట్నుండీ సత్యం రామలింగరాజు ‘నేరస్తుడు’గా అయిపోయ్యాడు. గాలి జనార్ధనరెడ్డి ఇవ్వాళ్టిక్కూడా ‘నిందితుడు’ మాత్రమే.” అన్నాడు సుబ్బు.

“నాకు ఇదీ తెలుసు.” చికాగ్గా అన్నాను.

“మిత్రమా! ‘జీవించడం’ అనేది ఒక ప్రాధమిక హక్కు. ఈ హక్కుని పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్యమైన బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే. నీకు లేని హక్కు ఇంకెవరికీ లేదు. ఇంకెవరికీ లేని హక్కు నీకు లేదు.” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటి సుబ్బూ! మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్లు.. ”

సుబ్బు నామాట వినిపించుకోలేదు.

“న్యాయ సూత్రాలని పాటిస్తూ పాలించడాన్ని ‘చట్టబద్ద పాలన’ అంటారు. దీని గూర్చి బాలగోపాల్ వందల పేజీలు రాశాడు, వందల గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ చట్టబద్ద పాలన దేవతా వస్త్రాల్లాంటిది. ఇది అందరికీ కనపడదు. నిందితుడు, నేరస్తుడు అనే పదాల లక్జరీ కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకని?” అడిగాను.

“సమాజం రైల్వే బోగీల్లాగా కంపార్టమెంటలైజ్ అయిపొయుంది. ఏసీ బోగీవాడికున్న ప్రివిలేజెస్ జెనరల్ బోగీవాడికి వుండవు. ఇది ఎవరూ ఒప్పుకోని ఒక అప్రకటిత సూత్రం. శేషాచలం అడవుల్లో చెట్లు నరికినవాళ్ళు జెనరల్ బోగీవాళ్ళు. వాళ్ళు సమాజ సంపదకి కలిగించిన నష్టం గాలి జనార్ధనరెడ్డి కలిగించిన నష్టం కన్నా తక్కువ. కానీ – మనకి ‘నేరస్తులైన’ కూలీల మీదే క్రోధం, అసహ్యం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకు?” అడిగాను.

“ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం ‘చట్టబద్దంగా విచారించాలి’ అంటారు.” అన్నాడు సుబ్బు.

“నిజమే సుబ్బూ!” అన్నాను.

“ఇక్కడంతా ఆటవిక నీతి. అడవిలో పులులు జింకల్ని వేటాడేప్పుడు జింకలకి నొప్పి కలుగుతుందేమోనని ఆలోచించవు. ఆ పక్కనే వున్న పులి స్నేహితుడైన నక్క – వేటాడే పులిలో రౌద్రాన్ని కీర్తిస్తూ కవిత్వం రాస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అలాగే – మధ్యతరగతి మేధావులు తక్కువ స్థాయి మనుషులు చంపబడితే – ‘ధర్మసంస్థాపనార్ధం అది చాలా అవసరం’ అని నమ్ముతారు. అంటే – మనం మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!” అన్నాడు సుబ్బు.

“నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తుంది సుబ్బూ!” అన్నాను.

“నీకు తెలుసుగా? సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ఐడెంటిఫికేషన్’ అని ఒక డిఫెన్స్ మెకానిజం గూర్చి చెప్పాడు. ఒక వ్యక్తి తన వర్గానికి తెలీకుండానే మానసికంగా కనెక్ట్ అయిపోతాడు. అందుకే – ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మంచినీళ్ళ కోసం పంపు దగ్గర బిందెలతో తోసుకునే ఆడవారిలో అలగాతనం చూస్తాడే గానీ – నీటికొరత ఎంత దుర్భరంగా వుందో ఆలోచించడు.”

“అంటే – తెలుగు వార్తా పత్రికలది కూడా ‘ఫ్రాయిడియన్ ఐడెంటిఫికేషన్’ అంటావా?”

“కొంత వరకు. పత్రికలకి వ్యాపార అవసరాలే ప్రధానం. వాళ్ళ పత్రికకి చందాదారులుగా కూలీల కన్నా మధ్యతరగతి వారే ఎక్కువమంది వుంటారు. పత్రికలు ఎవరికి వార్తలు అమ్ముతారో వారి ఆలోచనలకి తగ్గట్టుగానే రాస్తాయి. ఇవే తెలుగు పత్రికలు చెన్నై ఎడిషన్లో కూలీలకి అనుకూల విధానం తీసుకుని రాసుండొచ్చు, నాకు తెలీదు.” అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

“నిజమే! చెన్నై ఎడిషన్ వార్తలు వేరుగానే వున్నాయి.”

“ఏ వార్తైనా అనేక ముఖాలు కలిగుంటుంది. ఉదాహరణగా ఒక వార్తని పరిశీలిద్దాం. పులి ఆహారం కోసం మనిషిని వేటాడి ఆడవిలోకి లాక్కెళ్ళిపోయింది. అడవిలో పులులన్నీ కలిసి ఆ వేటని సుష్టుగా భోంచేశాయి. మనుషుల పత్రిక ‘ఒక క్రూర దుర్మార్గ దుష్ట పులి హత్యాకాండ’ అంటూ హెడ్‌లైన్స్‌తో విమర్శిస్తుంది. అదే వార్తని పులుల పత్రిక ‘దుర్భర క్షుద్బాధతో అలమటిస్తున్న సాటి జీవుల ఆకలి తీర్చిన సాహస పులికి జేజేలు’ అని హంతక పులి వీరత్వాన్ని కీర్తిస్తుంది.” అన్నాడు సుబ్బు.

“వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క – ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం.” దిగులుగా అన్నాను.

“మిత్రమా! మరీ అంతగా కలత చెందకు. రాబోయే కాలం కోసం నీ దుఃఖాన్ని కొద్దిగా దాచుకో” అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

*

yaramana.blogspot.in.

మీ మాటలు

  1. Thirupalu says:

    /“వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క – ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం.” దిగులుగా అన్నాను./
    చాలా సమ్దర్బో సితమైన వ్యాసం. చాలా భాగుంది. కానీ ,ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. నిజమే! ఎవరి కోసం? ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ఐడెంటిఫికేషన్’ అని ఒక డిఫెన్స్ మెకానిజం వర్తించదా?
    మా చి న్న పుడు ఒక కధ చెప్పుకునే వారు. మేక ‘ మే ‘ అని శివుడు గూర్చి తపస్సు మొదలు పెట్టిందట. ఈ తపస్సు యొక్క తాపం భరించ లేక శివుడు గారు వచ్చి ఏమిటి మే కా ఏమిటి నీ కోరిక అని అడగ్గానే మేక గారు శివయ్యా శివయ్యా , ఈ మనుషులందరూ నన్ను చంపి తినాలనే కోరుకుంటున్నారు. దయ చేసి వారికి ఆకోరిక లేకుండా చేసి , వారి భారి నుమ్డి మా మేక జాతి ని రక్షించ మని అడగ్గా, శివుడు గారు ఆలోచించి నిజమే!, మరి నాక్కూడా నిన్ను తిన బుద్దిద్దవుతుమ్తి మరి. నేనెలా నీకు వరమియ్యను? అని నిరాకరిమ్చాదట. ఈ కధను చిన్న పిల్లలు చెప్పుకొనే వారు ఆ విధంగా చిన్న సన్న కారు నేరస్తులను చూస్టే చంపేయాలని కోపం రావడం, రామ లింగ రాజుల్ని చూస్తే జాలి కలగడం సహా జాతి సహజం మరి. that is the ‘ఐడెంటిఫికేషన్’

  2. రమణ గారు, ధన్యవాదాలు.
    ఈ గుప్పెడు ప్రశ్నలు, అనేక ప్రశ్నలకు ఈ గుప్పెడు సమాధానాలు చాలు.
    బాలగోపాల్ గారు పోయినందుకు బాధపడుతున్నంతలోనే, మీ ఈ Article సంతోషాన్నిచ్చింది.

    నరేన్.

  3. చాలా బాగుంది. అయితే మద్యతరగతికి అనుకూలంగా పత్రికలు వార్తలు రాస్తున్నాయా, మద్యతరగతికి వాళ్ళ భావజాలాన్ని పూస్తున్నాయా అనేది నా సందేహం సుబ్బు!

  4. mohan.ravipati says:

    మధ్య తరగతి ప్రజలందరూ కూడా చ ఒకే వార్తను ఒకేలా చూస్తున్నారా అనేది పెద్ద అనుమానం . ప్రతి సంఘటను రెండు విభిన్న ముఖాలున్న వార్తగా మారిపోవటం అనేది మాత్రం నిజం

  5. చాలా బాగుంది. ముఖ్యంగా కుళాయి దగ్గర ఆడవాళ్ల గోలగా ప్రచారంలో ఉన్న విషయంలోనూ, ట్రాఫిక్ ఆపేసి విమానాల్లో గుండెను తీసుకెళ్లడాన్ని గొప్పగా చూసే మనుషులే 20 మందిని కాల్చిచంపితే ఆనందించడంలోనూ ఉన్న క్లాస్‌ కోణాన్ని చాలాబాగా చెప్పారు. అందరూ కనెక్ట్‌ అయ్యేలా చెప్పారు. విజయ్‌కుమార్‌ గారి వ్యాసం కూడా చాలా బాగుంది….వి ఆర్‌ స్టిల్ అలైవ్‌ అని గట్టిగా అరిచే గొంతులు ఇపుడు చాలా అవసరం. థ్యాంక్యూ..థ్యాంక్స్‌ టు సారంగ.

  6. Y.V.Ramana says:

    ‘సారంగ’లో ఇది నా మొదటి రచన. ప్రచురించిన సంపాదకులకి ధన్యవాదాలు.

    ఈ రచనకి స్పూర్తి ఇదే పత్రికలో ప్రచురితమైన జీఎస్ రామ్మోహన్‌గారి ‘రాజ్యం మెసేజ్ – ప్రజాస్వామికవాదులకు ఎస్ఓఎస్!’ వ్యాసం. అంచేత జీఎస్ రామ్మోహన్‌గారిక్కూడా ధన్యవాదాలు.

    ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి అనుకూలంగా, వ్యతిరేకంగా తీవ్రమైన అభిప్రాయాలు వుండటం సహజం. పాలకవర్గాల ప్రయోజనాలు నేను అర్ధం చేసుకోగలను.

    కానీ –

    క్రమశిక్షణతో, రోజువారీగా తెలుగు పత్రికలు చదివే నా స్నేహితులు – ఇరవైమంది కూలీలు చనిపోవడాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘వీళ్ళెందుకిలా ఆలోచిస్తున్నారు!?’ ఈ ప్రశ్నకి సమాధానంగా నాకు తోచిన కొన్ని కారణాలు రాశాను.

    ఈ రచన చదివినవారికీ, వ్యాఖ్యలు రాసినవారికీ కృతజ్ఞతలు.

  7. dr .A.Bhagavan says:

    చాల బాగుంది. డాక్టర్ రమణ కు ధన్యవాదాలు. నాకు చిన్నప్పటి నుండి తెలుసు. చాల సహజంగా స్పందించగలడు.

  8. /”మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!”/

    అసలు సమస్యంతా ఇక్కడే వుందండీ. మనుషుల్ని మనుషులుగా చూసిన phase మానవ చరిత్రలో చాలా చిన్నది, అది చెదురు మదురుగా మాత్రమె జరిగే వ్యవహారం. బుద్దుడిలాంటి వాళ్ళ ప్రభావంతో కొంతకాలం జరుగుతుంది. ఆ ప్రభావాన్ని అధిగమించే స్థాయిలో స్వార్ధం, అవసరం పెరిగిపోయినప్పుడు షరా మామూలే. నా ఉద్దేశం జీవుల్లో మొట్టమొదటి ప్రిడేటర్ ఆవిర్భవించినప్పుడే ఈ సంస్కృతి మొదలైంది. దేశాలు మార్కెట్లుగా, జనాభా మార్కెట్ ఫాక్టర్ గా మారిపోయాక ఇంక మాట్లాడేదేముంది? :-(

మీ మాటలు

*