రంగుల భోజనం…గొంతులో వీణలు!

సేకరణ, పరిచయం: పి.మోహన్

 

P Mohanచెన్నపట్టణం రైల్వే స్టేషన్.. 1898 తొలకరిలో ఓ రోజు. విశాఖపట్టణం నుంచి వచ్చిన రైల్లో నూనూగు మీసాల యువకుడొకడు దిగాడు. బస వాకబు చేస్తూ తంబుచెట్టి వీధి బాటపట్టాడు. ఓ పుస్తకాల కొట్టుముందు జనం బిలబిల మూగి ఉన్నారు. యువకుడు కూడా ఆసక్తితో వాళ్లలో కలసిపోయాడు. అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. కొట్టు గుమస్తా అప్పుడే బొంబాయి మెయిల్లోంచి వచ్చిన పెట్టె విప్పి ఒక్కో పోస్టర్ ను టేబుల్ పైన పరుస్తున్నాడు. జనం కళ్లార్పకుండా చూస్తున్నారు. మూరెడుకుపైగా పొడవున్న రంగురంగుల రవివర్మ చిత్రాల పోస్టర్లు ఇంధ్రధనుస్సులా పరచుకున్నాయి. మెరుస్తున్న రంగుల వాసన ముక్కుపుటాలకు మైకంలా సోకుతోంది.  

‘ఎంత బావున్నాయ్! అన్నీ కొత్తవే. నాకు ఆ మేనకావిశ్వామిత్రుల బొమ్మ ఇవ్వండి’

‘నాకు లక్ష్మీసరస్వతులు కావాలి. పటం కట్టించుకుంటా’

‘నాకు మాత్రం అదిగో ఆ పైటజారిన రంభ బొమ్మ కావాలి’

‘నాకు ఆ మలయాళ కన్నెపిల్ల బొమ్మ’

జనం ఎగబడ్డారు. గుమస్తా అణాలు, బేడలు పుచ్చుకుని బొమ్మలు ఇచ్చాడు. కాసేపటికి సందడి తగ్గింది. విశాఖ యువకుడు బొమ్మలను కళ్లార్పకుండా చూస్తూ ఉన్నాడు.

‘ఏమి తంబి, అట్లా సూస్తా ఉండావు, నీకు ఏమి కావాలి?’ గుమస్తా యువకుడిని అడిగాడు.

యువకుడు తేరుకున్నాడు.

‘అన్నీ.. ఇవన్నీ కావాలి..’

గుమాస్తా తుళ్లిపడ్డాడు. ఎగాదిగా చూశాడు.

‘ఇవన్నీ కావాలి. ఖరీదు పుచ్చుకుని చిల్లర ఇవ్వండి’ యువకుడు మూడు రూపాయల బిళ్లలను బల్లపైన ఉంచాడు.

గుమాస్తా ముప్పై బొమ్మలను చుట్టచుట్టి యువకుడికి అందించాడు.

యువకుడు బలిజ సంఘం సత్రంలో గది తీసుకున్నాడు. రంగుల భోజనంలో పడిపోయి అసలు భోజనం సంగతి మరచిపోయాడు. బొమ్మలన్నింటిని నేలపై పరచి గంటలతరబడి అలాగే చూస్తుండిపోయాడు. గొంతులో వీణలు మోగాయి. రాగాలు రేగాయి. పద్యాలు పలికాయి.

***

2 (2)

3 (2)యువకుడి పేరు సెట్టి లక్ష్మీనరసింహం(1879-1938). మనకు అపరిచితుడిలా అనిపిస్తాడు కానీ అతని సమకాలికులకు మాత్రం సుపరిచితుడే. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు రాశాడు. నాటకాల్లో వేషాలు కట్టాడు. యవ్వనంలో గిడుగు, గురజాడల బాటలో నడిచాడు. గ్రాంధికవాదులతో తలపడ్డాడు. వయసుపైబడ్డాక మాత్రం ప్లేటు ఫిరాయించి గ్రాంధికంలో పడ్డాడు. అతడానాడు ఏం చేసినా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, రవివర్మ బొమ్మలపై ‘చిత్రమాలికలు’ పేరుతో రాసిన పద్యాలు తప్ప. ఇవి తొలుత ’కృష్ణా’ దినపత్రికలో వచ్చాయి. తర్వాత సెట్టి మరికొన్ని రాసి మొత్తం 54 మాలికలతో 1935లో పుస్తక రూపంలో తెచ్చి, తన ప్రభువైన జయపురం మహారాజుకు అంకితమిచ్చాడు. ఆ మాలికల్లోకి వెళ్లబోయే ముందు సెట్టి గురించి కాసిని ముచ్చట్లు. సెట్టి చిత్రమాలికల ముందుమాట, అతని ఇతర పుస్తకాలు, ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’, తెలుగు సాహిత్య కోశం వంటి పుస్తకాలు, పత్రికల్లోంచి ఈ వివరాలు..

సెట్టి విశాఖపట్నంలో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకయ్యమ్మ, అప్పలస్వామి. సెట్టి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆరు నెలలు కొక్కొండ వెంకటరత్నానికి, ఆరు నెలలు కందుకూరి వీరేశలింగానికి శిష్యుడు. 1900లో బీ.ఏ. పాసై విశాఖ వచ్చి మిసెస్ ఏవీఎన్ కాలేజీ అనుబంధ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. మహాకవి శ్రీశ్రీ తండ్రి వెంకట రమణయ్య, సెట్టి సహోద్యోగులు. సెట్టిని ‘సెట్టి మాస్టార’ని, రమణయ్యను ‘రమణయ్య మాస్టార’ని పిలిచేవాళ్లు. శ్రీశ్రీకి సెట్టి వద్ద తండ్రివద్ద ఉన్నంత చనువు ఉండేది. ఆ వివరాల్లోకి తర్వాత.

సెట్టి దాదాపు ఇరవయ్యేళ్లు(1901-19) ఏవీఎన్ పాఠశాల, కళాశాలల్లో పనిచేశాడు. హెడ్మాస్టర్ గా, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. వ్యావహారికభాషావాదులైన కాలేజీ ప్రిన్సిపాల్ పీటీ శ్రీనివాస అయ్యంగారు ప్రోత్సాహంతో ఆంగ్లంలోంచి ‘గ్రీకుపురాణ కథల’ను అనువదించాడు. ‘సంధులు మొత్తంగా విసర్జించిన శైలి’లో రాసిన ఈ పుస్తకం పాఠ్యపుస్తకమైంది. దీని గురించి గురజాడ తన డైరీలో, ‘కథలలో గొప్ప లక్షణాలు, సాహిత్య మెలకువలు ఉన్నాయి. తెలుగు సారస్వతంలో నూతన పోకడలను ఇవి ప్రవేశపెడుతున్నాయి.. ఈయన అనువాదం చక్కగా ఉంది. సంధిని పరిత్యజించడంలో ఒక నిమయాన్ననుసరించారు. ఇది గ్రాంథికంలో వ్రాసిన గ్రంథమే’ అని రాసుకున్నాడు. అయినా ఈ  పుస్తకంపై గ్రాంథిక భాషావాదులు మండిపడ్డారు. సెట్టి కూడా తగ్గలేదు. తాపీ ధర్మరావు ఓ చంపకమాలలో గ్రాంధికాన్ని సమర్థించగా, సెట్టి దానికి బదులుగా 116 పాదాల శార్దూలం రాసి దానికి ‘నూటాపదహార్లు’ అని పేరుపెట్టాడు.

కవిభూషణ బిరుదాంకితుడైన సెట్టి కొన్ని కొక్కిరాయి పనులూ చేశాడు. ‘రసికాభిలాషం’ రాసి, దాన్ని శ్రీనాథుడికి ఆపాదిస్తూ ప్రకటించాడు. అది కవిసార్వభౌముడిది కాదని చిలకమర్తి లక్ష్మీనరసింహం తేల్చాడు. దాన్ని సెట్టి తనముందే రాశాడని విశాఖ వాసి బొడ్డు రామయ్య చిలకమర్తికి చెప్పాడు. సెట్టి ‘మరీచీ పరిణయం’ రాసి దాన్ని శ్రీ కృష్ణదేవరాయల కూతురు మోహనాంగికి అంటగట్టాడు. సెట్టి చనిపోయాక చాలా ఏళ్లకు అది అచ్చయింది. అది మోహనాంగిది కాదని ఆరుద్ర తేల్చడం మరో ముచ్చట.

సెట్టి విరివిగా రాసేవాడు. ప్రభాసశాపవిమోచనం(కావ్యం), శ్రీకృష్ణరాయబారం, లుబ్ధాగ్రేసర చక్రవర్తి(మోలియర్ రాసిన మైజర్ నాటకానికి అనువాదం), మాలినీ విజయం, చిత్రహరిశ్చంద్రీయం(నాటకం), అహల్య(నాటకం), వసంతసేన(నవల, గురజాడకు అంకితం), పన్నా, బప్పడు(రాజస్థానీ కథాకావ్యాలు), గంగికథ(నవల), దొంగ(కథ), కొన్నిశతకాలు, ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ఉగాది పద్యాలు, బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్ ల పద్యాలకు అనువాదాలు.. ఇవన్నీ అతని సాహిత్య కృషి.

సెట్టి అక్కయ్య సీరం సుభద్రమ్మ(1876-47) కూడా కవయిత్రి, నవలా రచయిత్రి. రెండువేల పద్యాల్లో ‘సుభద్రాపరిణయం’ రాసింది. కానన్ డయల్ రాసిన షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధక నవలావళిలోని ‘ద హౌండ్ ఆఫ్ ద బాస్కర్విలీస్’ను తెలుగులో ‘జాగిలం’ పేరుతో చక్కగా అనువదించింది. ఇది మద్రాస్ వర్సిటీ పాఠ్యపుస్తకమైంది.

సెట్టి స్కూలుకు రాజీనామా చేశాక లా చదివి ఫస్ట్ గ్రేడ్లో పాసయ్యాడు. జయపురం మహారాజు, రచయిత, దాత విక్రమదేవవర్మ(1869-51)కు 1930లో ఆంతరంగిక కార్యదర్శిగా చేరాడు. జయపురం(ఒడిశా) ఆస్థానప్రభావంతో గ్రాంధికంలోకి మళ్లాడు. ‘చిత్రమాలికల’తోపాటు చాలా కావ్యాలను రాజుకే అంకితమిచ్చాడు. వర్మ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఏటా లక్ష చొప్పున ఇరవయ్యేళ్లు విరాళాలు ఇచ్చాడు. శతాధిక గ్రంథకర్త, శతాధిక కృతిభర్త. గిడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి ప్రసిద్ధ రచయితలు తమ రచనలను వర్మకు అంకితమిచ్చారు. తెలుగులో తొలి కార్టూనిస్టు, చిత్రకారుడు, కళావిమర్శకుడు తలిసెట్టి రామారావు వర్మకు దివాన్ గా పనిచేశాడు.

1 (1)

సెట్టితో శ్రీశ్రీ అనుంబంధం గురించి. వయసులో ముప్పయ్యేళ్ల తేడా ఉన్నఈ ఇద్దరూ కవితాసమితి సభ్యులు. సెట్టి చాలావరకు ఏది ఎత్తుకున్నామాలికల్లోనే ఎత్తుకునేవాడు. శ్రీశ్రీ తొలి పద్యరచన ‘విశ్వరూప సందర్శనం’ కూడా మాలికే, సెట్టి ప్రభావమే. ‘మనుచరిత్రకన్నా వసుచరిత్ర గొప్పదని బహుశా సెట్టి మాస్టారు శ్రీశ్రీకి చెప్పారు’(ఆరుద్ర). జగన్మిత్ర నాటక సమాజంలో సెట్టి శ్రీశ్రీతో కుశుడు వంటి బాల పాత్రలనేకం వేయించేవాడు. అవధాని చెళ్లపిళ్ల వెంకట శాస్త్రికి సెట్టి వీరాభిమాని. ఓ సారి చెళ్లపిళ్ల విశాఖకు వచ్చి తన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్నప్పుడు, జయపురంలో అవధానానికి రావాలని విక్రమదేవవర్మ తరపున ఆహ్వానించడానికి వెళ్లాడు సెట్టి, కూడా శ్రీశ్రీని వెంటబెట్టుకుని. శ్రీశ్రీకి చెళ్లపిళ్లను చూడ్డం అదే తొలిసారి. సెట్టి మాత్రాఛందస్సులో గురజాడను గుర్తుకు తెచ్చేలా రాసిన ‘బప్పడు’ లోని కొన్ని పద్యాల ప్రభావం శ్రీశ్రీ ‘శైశవగీతి’ లో కనిపిస్తుంది. బప్పడులోని పిల్లల ఆటపాటల వర్ణన ఇలా సాగుతుంది..

‘పది పండ్రెండేడుల ఈడును గల

సిగ్గును తెలియని చిన్న బాలికలు…

కన్నుల నిండా కాటుక రేఖలు..

చిన్ని చప్పట్లు చెరచేవారూ

గడ్డిపువ్వులను కోసేవారూ..

ఎచ్చటను చూచినా తామే ఐ

వచ్చిన చోటికె వచ్చుచు తిరిగీ

పోయిన చోటికే పోవుచు మరియూ..’

 

శ్రీశ్రీ ‘శైవశగీతి’ ఇలా సాగుతుంది…

‘అయిదారేడుల పాపల్లారా..

అచ్చటికిచ్చటి కనుకోకుండా

ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే..’

 

తాపీ ధర్మారావు గ్రాంధిక చంపకమాలకు ప్రతిగా సెట్టి రాసిన శార్దూల మాలికలోంచి

శ్రీశ్రీ కొన్ని పాదాలను ఉటంకించేవాడని అంటాడు ఆరుద్ర.

ఆ పాదాలు..

‘…కేవాస్తే ఇస్తరఫ్, ఇస్లియే, మగరుమా ఫక్ భేష్ చమక్కంచు హిం

దుస్తానీ పదసంచయంబె కృతులన్ దూరుస్తురో లేక నో

యెస్తేంక్స్, మిస్టరు, మైడియర్, మొదలుగా ఇంగ్లీషు శబ్దాలనే

వేస్తారో తమ చిత్తమండి.. బస్తీమే సవాల్..’

 

శ్రీశ్రీ తొలినాళ్ల పద్యాలపై సెట్టి ప్రభావం గురించి ఎవరూ విశ్లేషించినట్లు లేదు. ఆ పనిచేస్తే తొలినాళ్ల శ్రీశ్రీని మరింత బాగా అంచనా వేయొచ్చేమో!

ఇక ‘చిత్రమాలికల’ సంగతి. దీనికో ప్రత్యేకత ఉంది. భారతీయ భాషల్లోనే కాదు, బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ ఇలాంటి పుస్తకం లేదనొచ్చు. వర్ణచిత్రాలపై కవితలు ఆంగ్లం, ఫ్రెంచి తదితర భాషల్లో మధ్యయుగాలనుంచే నుంచే ఉన్నాయి. జపాన్ చిత్రకారులైతే చిత్రాల పక్కనే పద్యాలు రాసేవాళ్లు. లియోనార్డో డావిన్సీ వేసిన మిలాన్ రాజు ప్రేయసి ‘చిచీలియా గల్లెరని’ చిత్రంపైన డావిన్సీ మిత్రుడు బెర్నార్దో బెలీంచియోని శృంగారభరిత పద్యాలు రాశాడు. ‘మోనాలిసా’ చిత్రంపై తెలుగులో చాలా కవితలు వచ్చాయి. అయితే ఒక చిత్రకారుడు వేసిన చిత్రాలపై పనిగట్టుకుని యాబైకిపైగా పద్యాలు రాసింది, అచ్చేసింది మాత్రం సెట్టినే. ఇది సాముగరిడీలా ఉన్నా వ్యర్థవిన్యాసంగా మాత్రం మారిపోలేదు. సెట్టివి పద్యాలే అయినా నారికేళపాకాలు కావు. తెలుగు పలుకుబళ్లతో, సహజ సంభాషణలతో, సరళంగా, ప్రవాహసదృశంగా సాగుతాయి. చిత్రంలోని సారాంశాన్ని కవిచూపుతో కొత్తగా పరిచయం చేస్తాయి. చిత్రమాలికలు ‘కృష్ణా’ పత్రికలో వస్తున్నప్పుడు అన్నీకాకపోయినా కొన్నయినా పాఠకులను ఆకట్టుకున్నాయి. ‘గంగావతరణం’, ‘హంస దమయంతి’, ‘బాలకృష్ణుడు’ వంటివి సెట్టి కవితాప్రతిభకు అద్దంపడతాయి.

సెట్టికి రవివర్మ చిత్రాలు తొలుత విశాఖలో లితోగ్రాఫుల రూపంలో పరిచయం. చిత్రమాలికల ముందుమాటలో తాను చెన్నపట్టణంలో ఇరవై, ముప్పై రవివర్మ చిత్రాలను కొన్నానని సెట్టి రాసుకుంది లితోగ్రాఫుల గురించే. తొలి యవ్వనంలో పరిచయమైన ఆ చిత్రాలు సెట్టిని తుదకంటా వెంటాడాయి. ఆ సంగతులన్నీ చిత్రమాలికల ముందుమాటలో ఉన్నాయి. సెట్టికి కేరళ రంగరి బొమ్మలపై ఎంత ప్రేమంటే, సందర్భశుద్ధి లేకపోయినా పొడిగేంత. ‘ఆంధ్రపత్రిక’ 1930 ఉగాది సంచికలో సెట్టి ‘ఉగాది కానుకలు’ కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కనకగిరి రాకుమార్తె అన్నపూర్ణాదేవిని పెళ్లాడ్డం, అన్నపూర్ణ తన తండ్రి కుట్రబారి నుంచి భర్తను కాపాడుకోవడం ఇందులోని విషయం. ఇక్కడ రవివర్మ చిత్రాల ప్రసక్తి శుద్ధ అనవసరం. అయినా సెట్టి వదల్లేదు. అన్నపూర్ణాదేవి అందాన్ని వర్ణించడానికి రవివర్మ చిత్రాలను అరువు తెచ్చుకున్నాడు. ఆ వర్ణన.. ‘రవివర్మ చిత్రపటములు సుప్రసిద్ధములు. ఆ చిత్తరువులందలి నాయికలందఱు నొక్కవిధమైన యాకారము గలవారు. భేదములు వయస్సులనుబట్టి, వ్యవస్థలను బట్టి, వలువలను బట్టి వచ్చినవి. ఇంచుక పొడుగుపాటి శరీరములు, కొంచెము కోలవాటు ముఖములు, వంగిన కనుబొమ్మలు నిడుదఱెప్పలతోడి వెడఁద కన్నులు, రవంత సూదిగానున్న ముక్కులు, నిండైన క్రిందిపెదవులు, ఉగ్గులుదేఱి నిగ్గులు వాఱిన పెన్నెఱులు: ఇవి యా యాకారమునకు లక్షణములు. స్త్రీసౌందర్యము పరిపూర్ణత్వమున నట్లుండునని యారాజ చిత్రకారుఁడూహించి యుండనోపును. అతని మేనక మేనిసొంపు, మోహిని ముఖకళ, రాధరామణీయకత, కలిసి యన్నపూర్ణాంబ రూపము తేలును…’

రవివర్మ బొమ్మలను ఇంతలోతుల్లోకి వెళ్లి చూసిన సెట్టి ఆ చిత్రకారుడు వేసిన అసలు తైలవర్ణ చిత్రాలను కొన్నింటినైనా చూసే ఉంటాడు. మద్రాస్, విశాఖ, రాజమండ్రి, కాకినాడ ధనికులు, జమీందార్లు రవివర్మతో బొమ్మలు వేయించుకున్నారు. సెట్టికి వాళ్లలో కొందరితోనైనా పరిచయాలు ఉండుంటాయి.

6

సెట్టి చిత్రమాలికలకు ప్రేరణ అతని సహాధ్యాయి మారేపల్లి రామచంద్రశాస్త్రి(1873-1943). ఆ వివరాలు సెట్టి ముందుమాటలో ఉన్నాయి కనుక ప్రస్తావించడం లేదు. సెట్టి చిత్రమాలికలను రవివర్మ చిత్రాలతో సచిత్రంగా ముద్రించాలనుకున్నాడు. అయితే ఆనాడు చిత్రాల ముద్రణ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కనుక సాధ్యం కాలేదు. చివరకు బొమ్మల్లేకుండానే అచ్చువేశాడు.

చిత్రమాలికలను పాఠకులు చదవబోతున్నారు కనుక వాటి గుణగణాల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. మచ్చుకు సెట్టి విసిరిన చమక్కులు కొన్ని..

విష్ణువు శ్రీదేవి, భూదేవిలను గద్దపై ఎక్కించుకుని వలపు పారవశ్యంలో

‘ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే, మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి.. మేన్ పులకితంబగుచుండగఁ…’ వెళ్తున్నాడని వర్ణిస్తాడు సెట్టి మాస్టారు ‘శ్రీమహావిష్ణువు’ మాలికలో.

‘గంగావతరణం’ మాలికలో ఆ నది దివి నుంచి భువికి..

‘రంగత్తుంగతరంగసంఘములు తోరంబై చెలంగం గడుబొంగం బాఱుచు, జాఱుచున్, దొరలుచుం, బొర్లాడుచున్, వేనవేల్ పంగల్ పెంచుచున్, జెంగలించుచును, బైపై లేచుచుం, దేఱుకొంచుం.. భ్రమించుచున్.. నురుఁగుతోఁ జూపట్టుచున్.. హోరుమంచుం..’ దూకిందంటాడు.

దమయంతి వనవిహారంలో ఉండగా, ‘గుప్పగఁ బడ్డ దూది తెఱఁగుం గల హంసము కానిపించె’ నంటాడు ఓ మాలికలో. మరో మాలికలో.. కారడవిలో తన చీరను చించుకుని నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన భర్తను తలచుకుంటున్నదమయంతితో ఇలా అనిపిస్తాడు.. ‘నీదు హక్కౌటచే, మేనఁ జీరను జించుకొంచరిగితే? మేనో, శిరస్సో తెగంగా నీ చేతను ద్రుంచిపోవునెడ, నిక్కష్టంబు లేకుండు?’

వనంలో వయ్యారంగా మేనువాల్చి దుష్యంతునికి తామరాకుపై లేఖరాస్తూ, వలపు తలపుల్లో మునిగిపోయి ‘లేఖలో బంతులు నొండు రెండయిన బాలిక వ్రాయఁగ నేర,దంతయున్ సాంతము చేసి సంతకము సల్పుటకెంతటి సేపు పట్టునో?’ అని సంశయిస్తాడు ‘శకుంతలాపత్రలేఖనం’లో.

‘బాలకృష్ణుఁడు’ మాలికలో.. వెన్నెల వెదజల్లే నవ్వుతో కళ్లను చల్లగ చేసే తన బిడ్డను చూసి యశోద, ‘నా ముల్లె, మదీయ గర్భలత పూచిన మల్లె’ అని మురిసిపోతుంది. దాపున కూర్చున్న రాధతో  ‘నోసి రాధ, మేనల్లుని సంబరంపడుచు నారయుటే యనుకొంటివేమొ? నేఁడెల్లి కొమార్త నోర్తు కని యీ వలెన్ సుమీ ’ అని మేలమాడుతుంది. అందుకు రాధ, ‘యేమిరా యల్లుఁడ!  ‘యత్త, యత్త,’ యని యందువు నత్తిగ: నిందుకోసమా?’ అంటూ చిట్టి మేనల్లుని పాదము ముడుతుంది నవ్వుతూ.

‘మృద్భక్షణము’ మాలికలో.. మన్నుతిన్న కృష్ణుడిని తల్లి మందలిస్తూ ‘చిన్నతనంబునన్ విషము చేరిచి పూతన నీదు నోటికిం, జన్నొసఁగంగఁ గ్రుక్కుకొని చప్పునఁ జప్పునఁ జప్పరించినా,వన్నియు నిట్టి పాడు రుచులబ్బినవేమిర?’ అని అంటుంది.

‘నికుంజరాధ’, ‘మాలినీ కీచకులు’, ‘ఉషానిరుద్ధులు’ వంటి మాలికలూ భావయుక్తంగా సాగుతాయి. ‘చిత్రమాలికలు’ ఒకరకంగా చిత్రాలకు అనువాదం లాంటివి. ఓపక్క రవివర్మ రంగరించిన సౌందర్యాన్ని అక్షరాల్లోకి తోడాలి. మరోపక్క మక్కికి మక్కీ చెప్పినట్లు కాకుండా, భావశబలతతో తెలుగు సొబగులు చెడకుండా చిత్రికపట్టాలి. సెట్టి ఈ పని బాగానే చేశాడు. చేయలేదని అనడానికి వేరొకరు ఆ పని చేసి ఉంటే కదా!

***

 

4

శ్రీ చిత్రమాలికలు

పీఠిక

నా యీ చిత్రమాలికల రచనకుఁ ప్రారంభము 1897 సంవత్సరమున: అప్పటికి నాకుఁ బదునెనిమిది యేఁడుల యీడు;  విశాఖపట్టణమున ఎఫ్.ఏ. తరగతిలోఁ జదువుచుంటిని. ఇటీవలఁ గవిగారని సార్థకనామము గాంచిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు నా సహపాఠి. తత్పూర్వమే యాయన రవివర్మ చిత్రించిన మేనకావిశ్వామిత్రచిత్రముఁ గూర్చి యొక మాలిక రచించియుండెను. అది వినుట వలనఁ గలిగిన కుతూహలము, తరువాతి కథను దెలుపు శకుంతలాజననచిత్రముఁ గూర్చి యొక మాలిక వ్రాయ నన్ను బురికొల్పినది. రామచంద్రశాస్త్రిగారు హూణవిద్య చాలించుటయు, మఱొక యేఁడాదికి బి.ఏ. చదువు నిమిత్తము నేను చెన్నపట్టణము వెళ్లుటయు, మా చిత్రమాలికా రచనము మూలఁబడుటకు హేతువులైనవి. నాఁటికిని నేఁటికిని వారు వ్రాసిన చిత్రమాలిక యది యొక్కటియే. అది వారు కేవలము మఱచియే పోయిరి. నాకు ముఖస్థమై యుండెను. శృంగారకంఠాభరణమునకుఁ బంపితిని. అందలి కాలవలాహకాంతరేతి పద్యమదియే.

చెన్నపట్టణమునకు నేను వెళ్లిన సరికి రవివర్మ చిత్రములమీఁద జనాదరము ముమ్మరమై యుండెను: అవి యమ్మకమునకుఁ జూపని యంగడి లేదు; అలంకరింపని గృహము లేదు; యభినందింపని జనులు లేరు. ఇరువది ముప్పది చిత్రములు నేనును గొంటిని. అందలి రంభాశుక, మదాలసాఋతుధ్వజు, చిత్రములు రెండింటిని మాత్రమే వర్ణించి మాలికలు వ్రాసితిని. అప్పటికింకను జిత్రమాలికలను విశేషముగా వ్రాయవలయునన్న సంకల్పము నామనసున నంకురింప లేదనుట నిశ్చయము.

1900 సంll రము జనవరిలో నేను బి. ఏ. పరీక్షయందుఁ దేలితిని. పిమ్మట బహుకాలము గడచినది. విశాఖపట్టణమున మిస్సెస్. ఏ. వీ. ఎన్. కాలేజీలో నేనుపాధ్యాయుఁడనుగా నుంటిని. 1915వ సంవత్సర ప్రాంతమని జ్ఞాపకము: బ్రహ్మపురనివాసులును, మ. రా. రా. దేవళరాజు వేంకటసుబ్బరావుపంతులుగారు నాయొద్దఁ గల మూడు మాలికలు విని, తమ వేగుఁజుక్క కథావళియందుఁ సచిత్రముగాఁ బ్రకటించు నభిలాషమును దెలిపిరి. శకుంతలాజననమాలికలోఁ దత్పూర్వమున్న స్త్రీజనసామాన్యవర్ణనము బాలెంతరాలి వర్ణనముగా మార్చి ఇచ్చితిని; వారు ప్రకటించిరి. తూఁగక వేగుఁజుక్క కథావళి వారాఁప వలసి వచ్చినది. ఒక్క దానితో నా మాలికలు నాఁగ వలసి వచ్చినవి.

మఱికొంత కాలమునకుఁ, దత్పద్యమునే కృష్ణాపత్రికకుఁ బంపితిని. అది 1916వ సంll రము అక్టోబరు 21 వ తేదీ పత్రికలోఁ బ్రకటితమైనది. నాఁటి నుండి వారము వారము నేనొక మాలిక పంపుటయు, అది ప్రకటితమగుటయు, 1918 వ సంll రము ఏప్రిలు 13 వ తేదీ వరకు జరిగినది. అలాగున నేను బంపినవి 33 మాలికలు. నేను వ్రాసిన మాలికల వరుసను విషయసూచికయందలి కుడి ప్రక్కను గల యంకెలు తెలుపఁ గలవు. అమూల్యమైన తమ పత్రికలో నా మాలికలకుఁ దావిచ్చి, తద్రచనకుఁ బ్రోత్సాహము కలిగించిన కృష్ణాపత్రికాధిపతులకు నేను గృతజ్ఞుఁడను.

కారణాంతరమున హఠాత్తుగా నిలిచిన మాలికలు 1922 వ సంll రము తుదిని మరలఁ బ్రారంభమైనవి: ఈ మాఱు, పునరుద్ధారణము గన్న వేగుఁజుక్క కథావళియందు. అట్లు ప్రకటితమైనవి యాఱు మాత్రమే. గత సంవత్సరమున ‘అహల్య’ యను నాటకము రచించి, దానికొఱకు రెండు మాలికలు వ్రాసితిని; శృంగారకంఠాభరణము కొఱకు నికుంజరాధ, యమునాతటరాధ, యని మఱి రెండు. అక్కడకు మొత్తము నలుబదిమూడు.

మొదటి మాలికలు 22 పంక్తులును, దురువాతివి కొన్ని 23 పంక్తులును, గలవిగా వ్రాసినను ఇప్పుడన్నియు 24 పంక్తుల వానిఁగా జేసితిని. వాడిన ప్రాసము మరల వాడలేదు. త్రివర్ణచిత్రములను జూచి మొదటిలో మాలికలు వ్రాసితిని గాని, యిటీవల మాత్రము చిత్రశాలాముద్రాక్షరశాలవారు పుస్తకరూపముగా వెలువరించిన చిత్రములను జూచియే వ్రాసితిని. అస్పష్టమైన ముద్రణమగుటచేత, స్థితులతో నేనెచ్చట నైనను బొరపడి యుండ వచ్చును. మన్నింపఁ బ్రార్థన.

మనోరమ మనుచరిత్రలోని స్వరోచి భార్యగా నేను వర్ణించితిని. తత్కథ యాంధ్రకవితాపితామహుని నేర్పు కతముఁ దెలుగు దేశమున సుప్రసిద్ధము. అది మార్కండేయపురాణమందలి కథయే యైనను, రవివర్మ యది యుద్దేశించెనా యన్నది సందేహకరము.

సచిత్రముగా మాలికలను ముద్రింపుమని పలువురు మిత్రులు నాతోఁ బలుసారులు చెప్పుచు వచ్చిరి. 64 మాలికలైనను గాకుండ ముద్రించు నుద్దేశము నాకు లేకుండెను. 1932 వ సంవత్సరముఁ గల్యాణీశృంగారగ్రంథమాలాధిపతులు బ్రహ్మశ్రీ గంటిసూర్యనారాయణశాస్త్రిగారు నన్నందు విషయమై తొందరపెట్టిరి. అందుచేతఁ దొందరతొందరగా మఱి పదునొకండు పద్యములు వ్రాసి ముగించితిని. దీని యచ్చు బాధ్యతను బూనుకొని, శాస్త్రిగారు చిరకాలము గ్రంథముంచుకొని, తిరిగి పంపిరి. చిత్రములను గూర్చిన ప్రయత్నములన్నియు విఫలములయినందున సచిత్రముగాఁ బ్రకటింప లేకుంటిని.

అడిగినంతనే యంకితమొందుటకనుగ్రహబుద్ధితో నంగీకరించిన మత్ర్పభువర్యులు, శ్రీజయపురరాజ్యధుర్యులు, శ్రీశ్రీశ్రీ శ్రీవిక్రమదేవవర్మమహారాజు గారికి నేనీవిధముగానేయన్న మాట యేమి, యన్ని విధములను గృతజ్ఞుఁడను: వారు నాకన్ని విధములను వంద్యులు.

 

విశాఖపట్టణము

1-10-1935                                                                                                                                                                                                  సెట్టి లక్ష్మీనరసింహము

 

 

అంకితము.

శ్రీకరముగా సలకసృష్టిచిత్రముల వి-

చిత్రలీలఁ జిత్రించి, తచ్చిత్రసముద-

యావలోకనమునఁ బలుభావములొద-

వించి, చిత్రకారులకుఁ గవిప్రతతికి

హేతువౌ భగవంతుండు కృష్ణచంద్ర-

దేవపుత్రు, శ్రీవిక్రమదేవవర్మ-

ధారుణీకళత్రు, మహితోదారు,  జ్ఞాన-

సారు, సుగుణనిస్తంద్రు, శ్రీజయపురనృప-

చంద్రు, నాయురారోగ్య విస్తారసౌఖ్య-

యుతునిగాఁ జేసి, రక్షించుచుండు గాక!

ఆ మహారాజు మామక స్వామి యనుచుఁ,

గవివతంసంబంనుచుఁ, బండితవరుఁడనుచుఁ,

సారము గ్రహింపఁ జాలు రసజ్ఞుఁడనుచుఁ,

దప్పులొప్పులఁ జేయు నుదారుఁడనుచు,

ఆంధ్రవిశ్వవిద్యాలయంబధికవృద్ధి

నొంద వత్సరలక్షల నొసఁగిన నెఱ

దాత యనుచు, జ్ఞాని యనుచు, ధర్మమూర్తి

యంచు, నర్హుండనుచు, నే రచించినట్టి

చిత్రమాలికాకృతిని దచ్చిత్తవృత్తి

యెఱిఁగి, తదనుజ్ఞఁ బడసి, ప్రహృష్టుఁడనయి,

ప్రభువరునకు నభ్యుదయపరంపరాభి-

వృద్ధి, వంశవృద్ధియుఁ గార్యసిద్ధియుఁ నిర-

తమును గల్గింప దేవు ప్రార్థనమొనర్చి,

యంకితంబిచ్చువాఁడఁ బ్రియముతోడ.

_

 

కవి విషయము.

ప్రచురయశుండు తత్ర్పభుని ప్రాపును గాంచిన చిత్రమాలికల్

రచనమొనర్చినట్టి కవి, ప్రాజ్ఞులకెల్లను గేలుదోయి మో-

డ్చి చెలఁగు సెట్టిలక్ష్మినరసింహము: సెట్టి కులాంబురాశిలో-

ని చలువఱేఁడనన్ ధర జనించిన యప్పలసామినాయుఁడున్

సుచరిత వేంకయాంబయు మనోరథసిద్ధిగఁ గన్న పుత్రుఁ; డా-

స చెడక స్వీయమౌ బలిజె జాతి కనుంగొన, వాసి గన్న వాఁ-

డు; చదువునన్ గురుల్ తనుఁ గడుం గరుణింప బి.యే. పరీక్ష బు-

ద్ధిచతురతన్ సమున్నతిగఁ దేలి, విశాఖపురంబునందు లో-

క చరిత మిస్సె. సే.వి.యెను కాలేజిలోపలి బోధనంబు చే-

యుచు, మఱి యెల్.టి.యై, యచట నొజ్జగ నిర్వదియేఁడులుండి, శి-

ష్యచయము సెట్టి మాస్టరన సన్నుతి గన్న యతండు; ఫస్టు గ్రే-

డు చదివి, ఫస్టెయై, తగునటుల్ పది యేఁడులు న్యాయవాదిగా

నచటనె యున్నవాఁడు; తెనుఁగందొక యించుక పూర్వవాసనన్

రుచి గని, పూర్వసత్కవులు త్రొక్కిన త్రోవఁ గవిత్వఫక్కి నే-

రుచుకొని, తప్పులున్న చదురుల్ సరిదిద్దుదురంచుఁ బద్దెముల్

వచనములున్న గ్రంథములు వ్రాసి, సుధీతతి వల్ల మెప్పు నొం-

దుచుఁ గవిభూషణాఖ్యఁ గృపతో నృపుఁడీయఁగఁ గన్న వాఁడు; మం-

చి చనవు గల్గునట్టులుగ శ్రీయుతవిక్రమదేవవర్మరాట్

శచిపతి యంతరంగము నొసంగుచుఁ దద్విధకార్యదర్శిగా,

సచివునిగాఁగఁ బెట్టుకొన, స్వామి హితంబునె కోరి యున్న వాఁ;

డచలపతిత్వమున్ను హరియందు, మహేశ్వరునందు, భక్తిఁ దా-

ల్చుచుఁ దమితో నిజప్రథమసూనుని వేంకటశబ్ధమాది ని-

ల్పుచు రమణుండటంచుఁ, బెఱ పుత్రుని దా శివరావటంచుఁ బి-

ల్చుచు, నిటులిష్టదైవముల సూక్ష్మముగాఁగను గొల్చునాతఁడున్.

_

 

 

కృతజ్ఞత.

ఆదికావ్యమగు రామాణయంబు రచించి-

నట్టి వాల్మీకిం, బురాణభార-

తగ్రంథకర్త వేదవ్యాసు, నాటక-

కావ్యముల్ వ్రాసిన కవులఁ గాళి-

దాసు, శ్రీహర్షు, శూద్రకు, భవభూతిని,

నుతియించి కొల్చి, సంస్కృతమునందు

నవ్వారు రచించినట్టి పురాణేతి-

హాస కావ్యాదుల నాంధ్రభాష

విరచించినట్టి కవిత్రయంబునకుఁ బో-

తనకు, భాస్కరునకుఁ దక్కినట్టి

వారికిన్ మ్రొక్కి, గీర్వాణపురాణాదు-

లందున్న కథల రమ్యమగు భంగి

వర్ణించి, చిత్రించి, వానిని గన్నుల

యెదుటికిం గొనితెచ్చి, హృదయములను

నవరసంబులు సముద్భవమొందఁ జేసిన

చిత్రకారవరుండు, క్షత్రియుఁడయి

రాజవంశంబునం బ్రభవించియును శ్రద్ధ

కలిగి విద్యను సమగ్రముగ నేర్చు-

కొని ప్రసిద్ధుండైన ఘనుఁడు, భారతదేశ

మునఁ జిత్రకళ కలదనుచు నితర

ఖండములను వాసి కలుగఁ జేసిన మేటి,

గృహవితతి నలంకరించిన హితుఁ,-

డని కృతజ్ఞబుద్ధి నౌచు రాజారవి

వర్మకేనొనర్తు వందనములు.

_

 

శ్రీమహావిష్ణువు.

శ్రీకలశాబ్ధిపుత్రియు, ధరిత్రియు భూషితగాత్రులై పవి-

త్రాకృతులొప్పఁ బార్శ్వములయందు వసించుచు, మేను మేనులన్

సోఁక గగుర్చుచున్, సొలపుఁజూపుటళుల్ తన మోముతామరం

బైకొన నిర్నమేషలయి బాళిని జూచుచుఁ జామరంబులం

జేకొనియుం గదల్చుటకుఁ జేతులు రాని యవస్థ నుంటచే,

ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే-

మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి, యా

తాఁకుడుచేత మేన్ పులకితంబగుచుండఁగ, నేత్రముల్ సుఖో-

ద్రేకముఁ దెల్పుచుండ, నునుతేటనిగారపు నవ్వు మోవిపైఁ

బ్రాఁకుచునుండ, మూర్ధమున రత్నకిరీటమునున్ ధరించి, లే-

దో కలదో యనం దిలకమూర్ధ్వముగా నొసటన్ ఘటించి, వ్రేఁ-

గై కదలాడు కుండలములందపు వీనులఁ బూని, సుప్రభా-

శ్రీకరవైన కౌస్తుభము సిస్తు దలిర్ప నుంబు మీఁద శో-

భాకమనీయహారముల ప్రాపునఁ దాలిచి, వైజయంతిఁ దా-

నా కెలనన్ గదించి, యదిరా! మది రాగమటన్నదెన్నఁడున్

లేక చరించు యోగులఁ జలింపఁగఁ జేసెడి మోహనాకృతిం

గైకొని, -గోళ్లతోడ గజకచ్ఛపభారము మోసినట్టి య-

స్తోకబలాఢ్యుఁడౌ గరుడు తోరపు వీఁపునఁ గూరుచుండి, తన్

నాకనివాసులెల్లరు ననాకులభక్తి మెయిన్ భజింపఁగా,

ఆకసముందు మెల్లగ విహారమొనర్చుచు, మింటినుండి భూ-

లోకము వారి మీఁద నెదలోఁ గల దివ్యదయామృతంబు నా-

లోకనజాలమార్గమున లోపము చేయక క్రుమ్మరించు ప్రే-

మైకవరస్వభావుని, ధృతాఖిలజీవుని, విష్ణుదేవునిన్,

నా కరముల్ మొగిడ్చి వృజినంబులు పో భజనంబొనర్చెదన్.

_

 

 

శ్రీమహాలక్ష్మి.

తామరసంబుఁ దా మృదుపదంబుల మెట్టుట, కిట్టకుంటనో?

ధామమటంచునో? పువుల దండను దాలిచినట్టి తొండమున్

సామజమెత్తు, టర్చననొనర్చుటొ? మరాళతతుల్ తన పజ్జ నుంట, య-

త్తామరసోద్భవుం గనిన తల్లి యటంచునొ? యానవైఖరిం

దాము సమభ్యసించెడి విధంబొ? యన గల యట్టి సంశయ-

స్తోమము నంతరంగములఁ జూపఱకుం గలిగించుచున్, సర-

స్సీమ సరోజమధ్యమునఁ జేతులఁ దమ్ములఁ బూని, హస్తికిన్

సామమెలర్పఁగా నభయసంజ్ఞను జేతను జేసి, యంచలం

బ్రేమను జేతితోఁ బలుకరించి, కరంబులు నాలుగున్ శ్రిత-

క్షేమనిమిత్తమే యనుచుఁ జెప్పక చెప్పెడి యీమె లక్ష్మియే!

సోముని చెల్లెలీమె యనుచుం బలుకం దగినట్టి మోముతోఁ,

గాముని కన్నతల్లి యనఁగాఁ దగు మిక్కుటమైన గోముతో,

శ్రీమహిళామతల్లి యని చెప్పెడి మైసిరితోడ, ముద్దు నె-

మ్మోమొక యద్దమై యచటఁ బూసిన పాదరసంబుఁ బోలె ని-

ద్దామెఱుఁగున్ ఘటించెడి మితమ్మయినట్టి స్మితమ్ముతోడఁ, బ్రే-

మామృతముబ్బి వెల్లువగునట్లు వెలార్చెడి కన్నుదోయితో,

లేమల లోన నీమె యెన లేని విలాసిని యయ్యెఁ; గాననే

యా మరునయ్య తా మరులు నందుచుఁ; బాల్కడలిన్ జనించు రం-

భాముఖులైన  యచ్చరలపై మనసుంచక, యొక్క యీమెకే

కాముకుఁడయ్యె: లోకపితకామిని కావున, లోకమాతయై

యీమె తనర్చె; శ్రీ గనుక, నిచ్చు సిరుల్ శరణన్న వారికిం;

గామితకల్పవల్లియు, జగంబుల తల్లియుఁ, గాన వేమఱున్

నా మనమందుఁ గొల్తుఁ గరుణారసమందిర యైన యిందిరన్.

_

 

మీ మాటలు

 1. కల్లూరి భాస్కరం says:

  సెట్టి లక్ష్మీ నరసింహము గారి గురించి వినడమే కానీ, ఆయన వివరాలు మొదటిసారి మీ వ్యాసం ద్వారానే తెలిసాయి. గురజాడలానే ఇంగ్లీషు, ఇంగ్లీషు సాహిత్య పరిచయంతో తెలుగు సాహిత్యంలో కొత్త కొత్త రీతుల్ని ప్రవేశపెట్టాలన్న ఉత్సాహం ఉరకలెత్తే తొలి తరం నవ్యుల కోవలోకి ఈయన కూడా వస్తారని ఈ వ్యాసం ద్వారా అర్థమైంది. అక్కడినుంచి ఆధునిక తెలుగుసాహిత్యచరిత్రను మదింపు వేసే ప్రయత్నం ఎంతవరకు జరిగిందో, ఎంత సమగ్రంగా జరిగిందో ఇప్పటికిప్పుడు చెప్పలేను కానీ, ఆ ప్రయత్నం మరోసారి జరగవలసిన అవసరాన్ని మీ వ్యాసం గుర్తుచేసింది, సెట్టిగారు తానే రాసిన కావ్యాలను శ్రీనాథుడు, మోహనాంగిలకు ఆపాదించడం మాత్రం ఆశ్చర్యం, బాధ కూడా కలిగించాయి. తెలుగు సాహిత్యం మొత్తంలో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్ని ఉన్నాయో! సెట్టి గారి సోదరి సీరం సుభద్రమ్మగారు కూడా రచయిత్రి కావడం ఇంకొక అపురూపమైన విషయం. తొలి తరం రచయిత్రుల గురించి చెప్పెటప్పుడు ఈమె పేరు ప్రస్తావనకు వచ్చినట్టు లేదు. అలాగే శ్రీశ్రీ శైశవగీతిపై సెట్టిగారి కవిత ప్రభావం ఉందని మీరు చూపించడం కూడా మంచి సమాచారం. ధన్యవాదాలు మోహన్ గారూ…

  • భాస్కరం గారు
   ధన్యవాదాలు. తొలి తరం రచయిత్రుల్లో చాల మందికి అన్యాయం జరిగిందేమోననిపిస్తోంది. ముఖ్యంగా బీసీ, దళితులకు. చరిత్రను ఎప్పటికప్పుడు కొత్త ఆకారాలతో పునర్లిఖిస్తూ వెళ్తే ఈ అన్యాయాలను కొంతవరకైనా సరిదిద్దగలం.

   • Anappindi Surya Lakshmi Kameswara Rao says:

    శ్రీ పి మోహన్ గారు,
    నేను చాలా కాలం గా సెట్టి లక్ష్మీ నరసింహం గారు రాసిన “రవి వర్మ” బొమ్మలపై “చిత్ర మాలికలు” పుస్తకం కోసం, ముఖ్యం గా “గంగావతరణం” శార్దూల పద్యాలకోసం వెదకుతున్నాను.
    అనుకోకుండా ఈ రోజు మీ వ్యాసం “రంగుల భోజనం …గొంతులో వీణలు” సారంగ సాహిత్య పత్రికలో ఏప్రిల్ 8, 2015 న ప్రచురించినది చదవగానే చాలా సంతోషం వేసింది.
    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? గంగావతరణం పద్యాలు , మరి కొన్ని వీలు చూసుకుని నా మైల్ కు పంపగలరా?
    Thanking you in advance
    Anappindi Surya Lakshmi Kameswara Rao
    9-6-17/T2, Thirumalarao Street, Gandhinagar
    Kakinada -533004
    aslkrao@gmail.com
    cell : 9963647402
    Date 22-06-2016

 2. Vijaya Babu Koganti says:

  చాలా ఆసక్తికరమైన విషయాలనందించిన పరిశోధనాత్మక వ్యాసం. శీర్షికతో ఆసక్తిని పెంచిన వ్యాసంఆసాంతం అలానే సాగింది. కేవలం శ్రీ శ్రీమాత్రమే కాదు చాలా మంది ప్రముఖమైన కవులు కూడా శ్రీ సెట్టి నరసింహం గారి రచనలకు ప్రభావితులై కూడా ప్రకటించని విషయం సత్యమనిపిస్తోంది. మంచి వ్యాసం అందించినందుకు అభినందనలు.

మీ మాటలు

*