మా అన్నయ్యకి పురుగు ముట్టె !!

     మేము ఇల్లు కొనుక్కొంటిమి అని ముందే సెప్పితి గదా! అది శానా పాతది. దాని వాకిళ్లు రాజుల కాలములో కోటలకి ఉన్నట్లుండె. వాట్ని మూసేకి ఒగరి శాత అయితా వుండ్లేదు. గోడ నాలుగడుగుల ఎలుపు. అంటే అది 1800 సగాల్లో (ప్రాంతంలో) కట్టిండొచ్చు. ముందు  కాలంలో ఆ ఇంట్లోనే కూలి బడి నడుస్తా ఉన్నంట.(మా ఊరి కథ చెప్పే తప్పుడు వివరంగా చెప్ప బడుతుంది)
 
     దాన్ని కొన్న మా నాయిన నూరో ఇన్నూరో రూపాయిలు తక్కువిచ్చినంట.అందుకే నీలకంఠాశారి అయ్యివారు ఇంటి మీదుండే మాడీ (మేడ), దానికి పర్సిండే పలుకులు పీక్కు పాయి నంట. దాన్ని రిపేరి సేయల్ల అని రెండు మూడు నెల్లు మేము ఆ ఇంటికి పోనే లేదు.
    ఒగదినం వాకిలి తీస్తే రామ రామా అది ఇల్లు గాదు శవాల్ని పూడిసేకి గుంతలు తీసిన మశానం మాదిరీ అయిపొయ్యింది!!
    ఆ ఇంటి ఆశార్లు ఊర్లో అందరికన్నా షావుకార్లంట!! వాళ్లు సెప్పిన మాటకి ఎదురు ఉండ్లేదంట. అవుసరాలకి రెడ్లకి ఎండి రూపాయలు అప్పులిస్తా వుండ్రంట. ఆ కాలంలో దుడ్లు  దాసి పెట్టుకొనేకి బ్యాంకులు,బీరువాలూ అట్లావి వుండ్లేదంట. అందుకే దొంగల భయానికి, కుండల్లో పోసి రూపాయల్ని ఇంట్లో గుంతలు తీసి బూమిలో పాతి పెడతా వుండ్రంట. ఆరకంగా ఆ ఇంట్లో దండిగా దనముంది. పూడిసి పెట్టిన కుండ్లు ఒగొగ సారి యజమానికి సిక్కకుండా తావలు గూడా మారుస్తాయి అనే నమ్మకాలతో రాతిరి పొద్దు కొందరు ఆశపోతు  జనాలు లోపలికి దూరి పెద్ద పెద్ద సప్పిడీల్ని (బండల్ని) గడార్ల(గడ్డపార)తో లేవదీసి గోడలకి నిలబెట్టి అయిదారడుగులు లోతు గుంతలు సేసిండారు.
     మా నాయన దాన్ని సూసి తల తలే కొట్టు కోని సదును సేసి బండ్లు పరిపిచ్చె. తిరగ రొన్నాళ్లకి ఆ ఇంట్లో సేరితిమి.
    ఒగ దినం పొద్దున్నే నేనింకా నిద్దర లేయనే లేదు. మా యమ్మ గట్టిగా అబ్బరిచ్చి ఏడుస్తా వుంది. ఊర్లో వుండే జనాలంతా మా పడమర వాకిల్లో దూరి తూరుపు వాకిలి దిక్క పారి పారి పోతా వుండారు. దుప్పటి కప్పుకోని పడసాల్లో పడుకో నుండే నేను దిడుగ్గున (ఉన్న ఫళంగా) లేస్తి. ఏమీ అర్తం కాక నేనుకూడా ఏడ్స బట్తి. అపుడు ఎవురో ఒగాయమ్మ(ఉప్పుర గంగప్ప పెండ్లాము కావొచ్చు) నా దగ్గరికొచ్చి, నా ముకమ్మింద అడ్డం పడిండే యంటికిలు సరి జేసి, దారం తీసుకోని జుట్టు మాదిరీ కట్టి తూరుపు వాకిలి దగ్గరికి పిల్సుకు పాయ.
IMG_0078
     ముందే సెప్పితి గదా అది లంకంత కొంప అని!! అంత పెద్ద ఇండ్లయినా మా ఊర్లో యా ఇంటికి గూడా ఇంటి లోపల బచ్చలి ఉండ్లేదు!! బయట తడకలు అడ్డం ఏసుకోనో, రాతి కూసాలు గోడ మాదిరీ పాతుకోనో, సెట్లు మరుగు సేసుకోనో బచ్చలి మాదిరీ వాడుకొంటా ఉండ్రి.
   ఇంటి ముందర తూరుపుకి బెంగులూరు మెయిను రోడ్డు. ఇంట్లో నుంచి బయటికి  అడుగు పెడుతూనే యడం పక్క పెద్ద సీమ జాలి మాను (సీమ తుమ్మ) దానికీ రాతి గోడకీ నడి మద్య ఎండి పోయిండే మిరప సెట్లు (వంట చెరుగ్గా వాడ్డానికి) ఎత్తుగా వామి మాదిరీ ఏసిండారు. అదే మాకి బచ్చలి.
    నిద్దర లేస్తూనే మా నాలుగో అన్నయ్య సదాశివ రెడ్డి కాళ్లు మడిసేకి (ఒంటికి పోసేకి) బచ్చల్లేకి పాయనంట. అట్ల యడం పక్కకి తిరుగుతా వున్నట్లే గోడ రాళ్ల సందులో నుంచి పామొచ్చి కర్సి సరుక్కున ఆ సందులోనే దూరుకొన్నంట!!
   “యనా నా కాలికి పాము కరిశ” అని అన్నయ్య గాట్టిగా అర్సి నంట. గప్పన లోపల్నుంచి మా యమ్మ,నాయిన,అన్నయ్య,అక్కయ్య అందురూ పారొచ్చిరంట!!
    యడమ కాలు పిక్కకి కాట్లు పడిండి వంట. రగతము దిగ్గారి పోతా వుందంట.
   దాన్ని సూసి మా నాయిన “అది పాము కాదురా ఏడిదో పురుగ ముట్టింది. ఏమీ కాదు వూరుకో” అంజెప్పి దాని ఇసం పైనికి ఎక్కకుండా పెద్ద రాయిని ఎత్తిచ్చుకోని పాముల మంత్రం  ఏసే ఆయప్పతాకి ఇందూపురానికి పిల్సుకు పోయిండాడు.
  ఇంటి ముందర గుంపులు సేరి జనాలు ఎవరికి నోటి కొచ్చింది వాళ్లు మాట్లాడ్తా వుండారు. “ఈ పిల్ల గాళ్లు సెప్పితే ఇనరు.ఎనుము గొడ్లు మేపేకి ఏటి గడ్డకు తోలుకు పోతారు. ఆకలయితే ఏడిదో కాయో కసురో తిని ఆడుకోరు. కాల్సుకు తినేకని అడివెలకల బక్కలు తవ్వుతారు. అవిట్లో నుండి పాములు బయటికొస్తాయి. ఈళ్లు రాల్లతో, సన్న సన్న బర్రల్తో సంపేకి సూస్తారు. కానుగ సెట్ల సీదార మద్య అవి తప్పించు కొంటాయి. నాగుబాము పగ నలబై ఏండ్లు అన్నట్లు, ఇట్ల పగబట్టి సంపుతాయి. అని ఒగరు. “మన గ్రాచారం బాగ లేకుంటే తాడే పామై పీకు తుంది ” అని ఒగరు. అనుకొంటా రోడ్లో నిలబడి ఎదురు సూస్తా వుండారు. అప్పిటికే మా ఊర్లో ఒగటి రెండు సైకిల్లుండె.” సైకిలేసుకోని ఎదురు పోండ్రా ఎవరన్నాను ” అని కొందరు ఎవర్నో పురమా ఇస్తా వుండ్రి.
    అంత సేపటికి పెద్ద సిత మాన్ల దగ్గర మా నాయిన వొస్తా వున్నట్ల కనబడె. బుజం మింద అన్నయ్య వుండాడు.
  మా అన్నయ్యకి పది పదకొండేండ్లు ఉండొచ్చు. సూసేకి యర్రగ పల్సగా కుర్ర పెయ్య మాదిరీ వుంటాడు. ఆ పొద్దు పోలీ సోల్లు ఏసుకోనే రకంగా వుండే కాకీ అంగీ నిక్కరు తొడుక్కోని సిపాయి సిన్నోని మాదిరీ వుండాడు. అట్లా ఆయప్పని సూసేకి అందరు ఆత్రమాత్రముగా ఎదురు పొయ్యిరి. ఆ జనాల మద్య నేను గూడా పోతి. ఆయప్ప తలకాయి నాయిన బుజం మీద నుండి యనక్కి యాలాడతా వుంది. కండ్లు మూతలు పడిండివి. నోట్లో తెల్లగ నురగ కారి పోతా వుంది.
   నాయిన బరువుగా అడుగులేసుకోని ఒస్తా వుండాడు.
   “అన్నా! అనుమంతన్నా! ఇట్లియ్యన్నా పిల్లోన్ని ఎత్తుకొంటాను” అని ఎవరో అడుగుతా వుండారు. మా నాయిన మొకం సూసేకి కాకుండా వుంది.గొంతు ఆరుకు పొయ్యి, ఏమీ మాట్లాడ కుండా బలంతంగా ఏడుపు బిగ బట్టి నట్లుండాడు. కాళ్లీడ్సు కొంటా వొచ్చి ఇంటి  ముందర పండేశ. ఎవరో పారొచ్చి ఆ యప్ప కిందకి శిరి సాప ఏసిరి.
    యల్లెలికిల పండుకోనుండే అన్నయ్యని సూసి అందరూ గొళో అని ఏడ్స బట్రి.” అయ్యో సివంగట్లా కొడుకు పొద్దున్నే కాపీ గూడా తాక్కుండా కాలమయ్యి పాయ గదమ్మా” అని తల  తలే కొట్టు కోని మా యమ్మ ఏడుస్తా వుంది. సుట్టూ పక్కల ఇండ్లొల్ల మాట్లు ఇనే కొద్దీ   అందరి కండ్లల్లో నీళ్లు కార బాట్టె.  ” అప్పయ్యా కాసంత సింత సిగర కావల్ల అంటే ఎదురు సెప్పుకుండా సెట్తెక్కి పీక్కోనొస్తా వుండె. శాత గాదంటే బాయిలో నీల్లు సేది పోస్తా వుండె. బంగారట్లా పిల్లోనికి ఇంత బిరీన నూరేండ్లు నిండిపాయనే!!అని ఏడుస్తా వుండ్రి.
    అంత సేపటికి జొమ్మాని పల్లి నరసిమ్మప్ప అని మాకి మామ వరసవుతాడు. ఆ యప్ప వొచ్చె.
   “పిల్లోనికి ఏమీ కాదు రవ్వంత సేపట్కి బతుకు తాడు. నేను సెప్పినట్ల మీరంతా యినండి” అని సుట్టూ ముసురుకోనుండే జనాల్నంతా దూరం జరిపె.
  “ఎవరూ సేతులు కట్టి నిలబడొద్దు.తలకి రుమాలు సుట్టుకో వద్దు. వక్కాకు నమిలే వొల్లు ఉమిసేసి నోరు కడుక్కొంది. బీడీలు, సిగరట్లు తాగొద్దు.” అని అందర్నీ అదుపు సేశ.
   మా ఇంటికి ఈశాన్యం మూలకి రెండు మైళ్ల దూరం లో రైలు స్టేషనుంది. అట్ల తలెత్తి పార జూస్తే కనిపిస్తుంది. దాంట్లో ఆవులప్ప (కన్నడం లో హావు అంటే పాము అని  అర్థం)అనే ఆయప్ప పంజేస్తాడంట. యట్లా పాము కర్సినా మత్రమేసి ఎక్కిన ఇసం ఎనక్కి తీస్తాడంట. ఒగొగు సారి కర్సిన పామే తిరిగొచ్చి కాటేసిన తావే నోరుపెట్టి ఇసం అంతా తాగేస్తుందంట. అట్ల శానా మందిని బతికిచ్చి నాడని సెప్పి నరసిమ్మప్ప మామ  సైకిలులెక్కి స్టేషనుకి పాయ.
   రవ్వంత సేపటికి తిరిగొచ్చె.
   పాం మంత్రగాడు ఆవులప్పకి ఆపొద్దు డూటీ బెంగులూరు లోనంట. స్టేషన్లో నుంచే ఫోన్ సేసి సదాశివ రెడ్ది పేరు, అమ్మా నాయిన పేరు, వయస్సు అన్నీ సెప్పిండాడంట. ఫోన్లోనే మంత్రాలు సదివి రెండు గంటల లోపల బతికిస్తానని మాట ఇచ్చిండాడంట. ఇదంతా మామ సెప్పుతూనే శానా మందికి నమ్మకం కుదిరినట్లుంది. ఏడ్సకుండ గప్చిప్ అయిపాయిరి.
    టయిమయి పోతా వుంది. ఒంటి గంటాయ. బెంగళూరు నుంఛి నందీ మోటారు గూడా వొచ్చె.( అప్పుడు హిందూపురం నుండి బెంగలూర్ కి యన్.యం.యస్. మరొకటి సి.పి.సి.అని రేండే బస్సులు. ఇప్పుడు ప్రతి పది నిముషాలకూ ఒక బస్సు. జతకు రైల్లు,కార్లు,టూ వీలర్లు,లారీలు చెప్పలేని రద్దీ) ఆ బస్సులోనే మేము కర్నాటకము లోని మేన మామగారి ఊరు కల్యాకన పల్లి కి  వొచ్చి పోతావుంటాము. ఆ బస్సొల్లంతా మాకి వాడికి. ఇంటిముందర జనాల్ని సూసి వాల్లు గూడా దిగొచ్చి “అయ్యో పాపము యంత పని జరిగింది” అని అంగలార్సి పొయ్యిరి.
   కడాకి ఎవరో వొచ్చి “మీకి బుద్ది వుందో లేదో. ఇసం ఒల్లంతా ఎక్కి ఎర్రగా వున్న పిల్లోడు నల్లగ కమురుకు పొయ్యిండాడు. నిప్పుల మిందేసిన పూల తీగిమాదిరీ మాడి కండ్లతో సూసేకి కాకుండా అయ్యిండాదు.ఇంకా బతుకు తాడనే ఆశ యాల పెట్టుకొంటారు?” అని బుద్ది మాట్లు సెప్పితే రెండు గంటలకి ఎత్తుకు పొయ్యి ఒలుకుల్లో పూడ్సి పెట్రి.
   ఆ కాలం లో మా ఊరిదగ్గరికి పాములు పట్టే దానికి అరవోల్లు వస్తా వుండ్రి.వాళ్లు బతికిన పామునే పట్టుకోని శర్మం వొల్సుకోని అమ్ము కొంటా వుండ్రి.వాల్లు సేన్ల దగ్గర  కరెంటు రూముల్లో ఉంటా వుండ్రి.
   వాళ్లకి ఎవురో సెప్పినట్లుడారు. మా ఇంటి దగ్గరికొచ్చి– పామును మేము పట్టేస్తాము  రెడ్డీ– అని సెప్పి శలాకాల్తో గోడని ఒగ పక్క నుంచి పీక బట్రి. యంత సేపు వాళ్లు అవస్త బడినా పాము కనబడ్లేదు. మబ్బయి పాయ. వాళ్లు ఎల్లి పాయిరి.
     ఇంగ రాతిర్లో ఇంట్లో పండుకొనే దేట్లా?? దాని జతకి సలుము పట్టిండే పాములు ఇంకా యందర్ని సంపుతాయో?? అనే బయము. అపుడు గడ్డం పెంచుకో నుండే ఒగ స్వామి ఒచ్చె.
   ఆ స్వామి అంతకు ముందే ఒగ సారి మా ఊర్లో తేలు మంత్రం ఏసి పొయ్యిండె. ఒగరిద్దరు తేలు కర్సి సచ్చి పొయ్యిరంట. అది తెలిసి ఆ గడ్డం స్వామి అందరి ఇండ్లలోనా దూలాలు,దంతెల మిందా శాకు పీసుతో “ఆస్తిక మహర్షి” అని రాసి పొయ్యిండె. యంత రాసినా మా ఇంట్లో యా మూల్లో జూసినా తేల్లు జర్రిలే!!
   ఆ స్వామి ” మీకేమీ బయ్య లేదు” అని సెప్పి రాగులు తెప్పిచ్చి కండ్లు మూసుకోని  మంత్రమేసి ఇచ్చె. అందర్నీ నైరుతీ  మూల్లో వుండే సిన్నిట్లో( రూములో) పడుకోని,కడప మాను మింద రాగులు ఏసుకొమ్మనె. అట్లే రెండు మూడు దినాలు సేస్తిమి.
   ఒగ దినము మా నాయిన తూరుపు వాకిలి పక్కలో బాతిండే రాయి మింద కూకో నుండాడు.  యాముల పల్లి నుంచి, ఒగాయప్పొచ్చి ” ఏమన్నా! పిల్లోడు కాలమయ్యి పాయ అని ఎవరో సెప్పిరి యంత పని జరిగిందన్నా” అని ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటా నిలబడె.
   “ఏమి జేస్తామన్నా! ఎది గొచ్చిన కొడుకు కండ్లు ముందరే నా సేతుల్లోనే పానా లిడిసె.నాది శానా దురాద్రుస్టం బతుకన్నా. యంత మరుస్తాము అన్నా మరుపుకు రాదు..” అని అంగలార్సు కొంటా కూకోనివుండే బండ మిందనించి కిందకి దిగె.
   “ఇంట్లో నుంచి బయటికొచ్చి బచ్చల్లోకి ఇట్ల తిరిగిండాడు  అంత సేపుకు ఈ రాళ్ల సందులో నుంచి ఒచ్చినంట” అని ఆయప్పకి సూపిస్తా వుండాడు.
    ఆ మాట్లు ముగీ కున్నట్లే గోదుమ నాగు పాము నాలుకులు జవురు కొంటా బుస్సు అని బయటికొచ్చె. నేను కమసల దాస గాడూ ఆడే ఆడుతా వుంటిమి. దాన్ని సూసి మా నాయిన “ఒరే పాము ఈడే ఉందిరా!! ఇంగా యందర్ని సంపేకి కాసుకో నుందో ఈ దీనమ్మ ఈ పొద్దు దీన్ని సంపి పారేస్తాము రాండిరో ” అని గట్టిగా కేకలేసె.
    ఊర్లో అందరూ గడార్లూ, శలాకులూ,బర్జీలు(పాముల్ని పడిచేవి),కట్టెలూ తీసుకోని గుంపులు గుంపులు వొచ్చిరి.పొద్దుబడి నాలుగ్గంటలు నుండి ఒగ పక్కనుండి గోడ పీక బట్రి. అంకనం ఎలుపు ఇంటినంతా పడగొట్టినా పాము కని పించలేదు. మబ్బయితా వుంది.సీమ నూనె లాంతర్లు,సాకలోల్లు ఇలాటి కట్లు( కాగడాలు) తెచ్చిరి. కడాకి తొమ్మిది గంటల టయానికి  అడుగు వరుసలో ఒగ బండ కింద సుట్టుకోని పండుకోని వుండె. దాన్ని బర్జీ తో పొడ్సి బయటికి యల్ల బీకిరి.
    నడి మద్యకి దిగగుచ్చి పైకెత్తి, జనాలకి దాన్ని సూపిస్తా వుంటే అది నోరు తెర్సి పడగనిప్పి బుస్స్ బుస్స్ అని మెలికలు తిరుగుతా వుంది.
    మా అప్పప్ప(చిన్నాయన) కోపము తట్టుకో లేక సేత్తో పట్టుకొనే దానికి పాయ. ఎవరో ఆయప్పని తబ్బుల కర్సు కొన్రి. ఆ రాచ్చాసి పాముని రాళ్ల సందు నుండి తెస్తా  వుంటే రాళ్ల తోను,సెప్పులు తోను, కట్తెల తోను,ఆడోల్లు పరకల తోను వాంచ బట్టిరి. “రత్న మట్లా బిడ్డని యద మీద ఏసుకు పోతివి గదా లంజా” అని కోపాలు ఆరే దంకా తిట్ట బట్రి.
    దాని నోట్లో రూపాయి బిల్ల పెట్టి ఆ పక్కలో వుండే ఎండు మిరప సెట్లేసి నున్నగా  కాల్సి పారేసిరి. బొగ్గు మాదిరీ కాలినంక ఊరిముందరి సేనుల్లోకి మాదిగ నారాయణప్ప  గుడిశె ముందరికి ఇసిరి పారేసిరి.
(నాకు ఈ పాములతో అతి భయంకర మైన అనుభవాలున్నాయి. ఆ యా సంధర్భాలను  బట్టి  కానీ, అన్నీ ఒకే సారి కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను)

మీ మాటలు

  1. Nisheedhi says:

    Loved it sir . very emotional and touchy .

  2. ధన్య వాదాలు నిశీధి గారూ

  3. థాంక్స్ అండి

  4. నాకు పాములంటే భయం లేదు గానీ, ఇప్పుడు ఇది చదివాక భయం వేస్తోంది.

మీ మాటలు

*