నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు

భగవంతం

 

ఆడుకుంటూ ఆడుకుంటూ
భూగోళం మీది నుండి
ఒక్క గెంతు గెంతితే
చందమామ తగలాల్సిన పసివేళ్ళకు
తగిలించబడ్డ గుదిబండల వెనుక
కనిపించని తడి. . .

పువ్వులకింది నీడలు పొందే
పరమ సుఖాన్ని –
మబ్బుల వెనక చీకటి పొందే
మహా మోక్షాన్ని
పురుషుడికి ప్రాప్తింప జేయగలిగిన స్త్రీకి –
కట్టలేకపోయిన గుడిమీద
కురుస్తోన్న కుండపోత . . .

శీతవేళ రాత్రుల్లో
ముడుతలుపడ్డ చేతులు వెలిగించిన
స్మృతుల చలిమంట చెంత
చెవులు కాచుకోలేకపోతున్న
లోకం చుట్టూ
ఘనీభవిస్తోన్న గుండ్రని సరస్సు . . .

అంతరిక్ష రహస్యాల
అంతరంగమేదో తెలిసినట్లై
ఎగిరెగిరి వచ్చి
సరాసరి నీమీదే వాలాలని అరాటపడ్డ
సీతాకోక రెక్కల నుండి
రాలిపోతోన్న అరణ్యాల వెనక
నాలుక పిడచకట్టుకుపోయిన జలపాతం . . .

ఆమెను అందుకోలేకపోవడానికి
అడ్డుగా నిలబడ్డ
అన్ని గోడల్ని కూల్చడానికి
అనాదినుండి అతడు చేస్తోన్న ప్రయత్నాలు చూసి
ఏ అర్థరాత్రో
కొందరి చేతివేళ్ళను కౌగలించుకొని
రోదించిన రంగులూ. . . సిరా చుక్కలూ

~

మీ మాటలు

 1. పద భావాల పొందికైన సమ్మేళనం

 2. Vijay Kumar says:

  గ్రేట్ ఎక్స్ప్రెషన్..

 3. Prasuna Ravindran says:

  chaala chaala bavundandi.

 4. “…ఒక్క గెంతు గెంతితే చందమామ తగలాల్సిన పసివేళ్ళకు తగిలించబడ్డ గుదిబండల వెనుక కనిపించని తడి. . .” :( , “.. కొందరి చేతివేళ్ళను కౌగలించుకొని రోదించిన రంగులూ. . . సిరా చుక్కలూ ” పదునైన వాక్యాలు నేరుగా తగుల్తున్నాయి ( వాటి వెనుక అర్ధవంతమైన చిత్రాలు కళ్ళకు కట్టినట్టు) Superb !

 5. మమత says:

  “ఆడుకుంటూ ఆడుకుంటూ/భూగోళం మీది నుండి/ఒక్క గెంతు గెంతితే/చందమామ తగలాల్సిన పసివేళ్ళకు/తగిలించబడ్డ గుదిబండల వెనుక/కనిపించని తడి.”, “అంతరిక్ష రహస్యాల/అంతరంగమేదో తెలిసినట్లై/ఎగిరెగిరి వచ్చి/సరాసరి నీమీదే వాలాలని అరాటపడ్డ/సీతాకోక రెక్కల నుండి/రాలిపోతోన్న అరణ్యాల వెనక/నాలుక పిడచకట్టుకుపోయిన జలపాతం…” గుండెలో ఎప్పటికీ ఉండిపోయే కవిత ఇది. ‘ఇంతేనా జీవితం” అని ఎప్పుడైనా అనిపిస్తే, చెయ్యాల్సింది ఎంత వుందో గుర్తు చేసే వాక్యాలు. రియల్లీ సూపర్బ్.

మీ మాటలు

*