మై ఛాయిస్ – ఎందుకోసం?

 వినోద్ అనంతోజు

 

vinodదీపికా పదుకునే నటించిన ఒక వీడియో మీద గత కొన్ని రోజులుగా చాలా చర్చ జరుగుతోంది. “My Choice – Deepika on Women Empowerment” అనే పేరు ఉన్న ఆ వీడియో లో దీపికా చెప్పిన అభిప్రాయాలకి చాలా గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లింక్ లో ఆ వీడియో చూడొచ్చు.

https://youtu.be/KtPv7IEhWRA

ఇది విడుదలైన వెంటనే అన్ని వైపుల నుంచీ దాడి మొదలయ్యింది. రెండో రోజుకల్లా దానికి సమాధానంగా “Male Versions of My Choice” వీడియోలు తయారు చేసి అప్ లోడ్ చేసారు. సాధారణ జనం దీన్ని మగవాళ్ళని కించపరిచినట్టుగా అర్థం చేసుకుని వెంటనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇది కేవలం ఆడా, మగ లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.

ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచించాలి. Vogue లాంటి ఒక మల్టీ నేషనల్, ఫాషన్ బ్రాండ్ ఈ వీడియోని ఎందుకు నిర్మించింది? ఏ లాభం లేకుండా Women Empowerment కోసమే చేసారు అనే భ్రమలు ఉంటే వదిలించుకోవాలి. దీని వెనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది వ్యాపార లాభం.

vogue3

ఉదాహరణ కి, ఇండియాలో సెక్స్ గురించి లేదా స్త్రీల ఋతుస్రావం గురించి మాములు స్థాయి గొంతుతో మాట్లాడడానికి కూడా జనం ఆలోచిస్తారు. అలాంటి ఒక rigid culture ఉన్న దేశంలో Sanitary Napkins లాభసాటిగా ఎలా అమ్మాలి? ముందు ఇక్కడి కల్చర్ లో ఆ విషయం పట్ల “అది ఒక సాధారణమైన విషయమే” అనే అభిప్రాయ మార్పు తీసుకురావాలి. ఈ ప్రచారం కోసం T.V. రేడియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు లాంటి వాటిని ఉపయోగించుకుంటారు. ఈ మధ్య T.V. లో ప్రసారమయ్యే advertisements లో చాలా ఎక్కువ మోతాదులో Whisper, Carefree యాడ్స్ ప్రసారం అవుతుండడం మనం గమనించవచ్చు. రోడ్ల పక్కన అంతంత పెద్ద హోర్డింగుల మీద ఇంతింత చిన్న చెడ్డీలు వేసుకుని అమ్మాయిలూ, అబ్బాయిలు “Jockey or Nothing” అని చెప్పే పోస్టర్లు కనపడతాయి. అది కూడా ఇందుకే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యాడ్స్ లక్ష్యం ఒక్కటే. జనం ఆ Napkins / Underwears  గురించి మాట్లాడుకొనేటప్పుడు ఉండే ఇబ్బందికరమైన భావం పోవాలి. ఇది వాళ్ళ సేల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

అలాగే Vogue Magazine సేల్స్ ఇండియాలో పెరగాలంటే దానికి అనుగుణమైన Fashions, Lifestyle నీ ఇక్కడి వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా ప్రచారం జరగాలి. ఈ వీడియో మహిళా సాధికారికత అనే ముసుగులో చాలా బలంగా వాటినే ప్రచారం చేస్తోంది.

ఇందులో పొట్ట నింపుకోవడం కోసం వ్యభిచారం చెయ్యాల్సిన దౌర్భాగ్యంలో ఉన్న మహిళల గురించి లేదు, ఒక వైపు సైన్సు పరుగులు పెడుతున్నా సతీసహగమనాల వల్ల ఆహుతైపోతున్న మహిళల గురించి లేదు. చదువుకీ, ఉద్యోగాలకీ దూరంగా వంటిళ్ళలో ఉడుకుతున్న ఆడవాళ్ళ గురించి లేదు. మగవాళ్ళతో సమానంగా పని చేస్తూ కూడా పేదరికంతో అల్లాడుతున్న స్త్రీల గురించిలేదు, అత్యాచారాల గురించి లేదు, వివక్ష గురించి లేదు. మరి ఏముంది ఈ వీడియోలో?

Vogue1

స్త్రీల Sexuality గురించీ, వాళ్ళు వేసుకునే బట్టల విషయంలో వారి కుండే స్వేచ్ఛ గురించీ తప్ప ఏమీ లేదు. ఈ రెండేనా మహిళా సాధికారికత – Women Empowerment – అంటే? కాదు. మరి ఈ విషయం ఆ వీడియో నిర్మించిన వాళ్లకి తెలియదంటారా? తెలియదనుకోవడం అమాయకత్వమే! తెలిసే చేసారు. ఎందుకంటే Vogue ఆ రెండు విషయాలకే సంబంధించిన మ్యాగజైన్ కనుక ! అలాంటి మ్యాగజైనులు కొని చదివే వర్గాలకి (విలాసాల కోసం డబ్బు ఖర్చు చెయ్యగలిగే వాళ్లకి) ఇలాంటి మహిళా సాధికారికతే వినడానికి రుచికరంగా ఉంటుంది కనుక !

మరి మిగతా వాళ్ళు? (చదువురాని వారు / పేదలు)

మిగతావాళ్ళు గంగలో కలిసిపోయినా మాకనవసరం !

దీనినే “బూర్జువా ఫెమినిజం” అంటారని ఈ మధ్యే తెలిసింది.

అసలు ఈ “Fashion & Lifestyle” Magazines లో ఏముంటుందో అని నాలుగైదు మ్యాగాజైనులు తిరగేశాను – Vogue, Femina, GQ, Elle, Cosmopolitan – లాంటివి. Sex, Fashion, Food, Beauty తప్ప ఇంకో ముక్క ఉంటే ఒట్టు. వాటిలో ఉన్న శీర్షికలు చాలా వరకు ఇలా ఉన్నాయి…

“అందమైన ఆకారం కోసం ఏం తినాలి?” (ఆరోగ్యం కోసం కాదు తినడం!!)

పార్టీలో “హాట్” గా కనపడాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి? (ఎందుకు కనపడాలి హాట్ గా?)

“మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం క్రీం పూసుకోవాలి?

“సన్నగా ఉండడం వల్ల సెక్స్ సుఖాలు !!”

ఇవి కేవలం కవర్ పేజీలు మాత్రమే. లోపలున్న దుర్మార్గాలన్నీ చెప్పడం కష్టం. ఆడవాళ్ళని వాళ్ళ కొలతలని బట్టి, వాళ్ళ శరీర ఛాయ ని బట్టి కొలతలు వేసే ఈ Vogue మ్యాగజైన్ Women Empowerment గురించి మాట్లాడుతోంది !! ఈ సదరు బూర్జువా ఫెమినిస్టులు మగవాడు ఆడవాళ్ళని Objectify చేసి చూడడాన్ని వ్యతిరేకిస్తూ, ఆడవాళ్ళు తమని తాము  “అందమైన” objects గా ప్రదర్శించుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. దీపిక పదుకొనే నటించిన ఈ వీడియో నే ఇందుకు ఉదాహరణ. ఈ వీడియోలో సన్నగా తెల్లగా Well-Polished గా ఉన్న ఆడవాళ్ళనే చూపించడం గమనించవచ్చు. ఒకరిద్దరు మామూలు స్త్రీలని చూపించినప్పటికీ అది తప్పక తీసుకొచ్చి అతికించినట్టు తెలిసిపోతోంది. వీరికి ఆ కొలతలు పాటించని మామూలు స్త్రీలు, ఫాషన్ లకి దూరం గా బతికే స్త్రీలు స్త్రీలుగా కనపడరు.

maxresdefault (1)

దీపిక “Its My Choice”  అని చెప్తూ బ్రా హుక్ తీయడాన్ని చూస్తే మహిళా సాధికారికత కంటే, మహిళా సాధికారికత పేరుతో చేస్తున్న మోసం ఎక్కువ కనిపించింది.

ఈ Fashion / Cosmetic కంపెనీల వ్యాపారాలన్నీ మనుషులకు “అందం” అనే దాని మీద ఉన్న భ్రమల చుట్టూనే జరుగుతాయి. “అందం” మీద భ్రమలన్నీ వదిలిపోయి మహిళలు నిజం గా సాధికారికత వైపు నడిస్తే, అది వీళ్ళ లాభాలకి దెబ్బ. అలాగని పెరిగిపోతున్న మహిళా చైతన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం కుదరదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కార్పొరేట్ కంపెనీ లు కనిపెట్టిన మార్గం – అసలైన ఫెమినిజాన్ని హైజాక్ చేసి పక్కదారి పట్టించడం. “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని” హైజాక్ చేసి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” గా మార్చేసారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ రోజున ఫాషన్ షో లు జరుగుతున్నాయి. రాను రాను “మహిళా సాధికారికత” అనే పదానికి అర్థం “చదువుకున్న మహిళల సాధికారికత” గా మార్చేశారు.

vogue5

ఈ సందర్భంగా నాకు బొలివియా దేశపు గని కార్మికురాలు దొమితిలా చుంగారా మెక్సికో అంతర్జాతీయ మహిళా సభలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

ఆ సభలలో ఎక్కువ భాగం ఉపన్యాసాలు ఇలా సాగాయి “మగవాళ్ళకి/మొగుళ్ళకి ఉండే సౌకర్యాలన్నీ ఆడవాళ్ళకీ ఉండాలి. మగవాళ్లు తిరుగుతారు, తాగుతారు. మనమూ తాగాలి, తిరగాలి. వాళ్ళు ఎంతమంది ప్రియురాళ్ళతో సంబంధం పెట్టుకుంటారో మనకీ అంతమందితో సంబంధం పెట్టుకునే హక్కు కావాలి….”

ఇవన్నీ వింటున్న దొమితిలా ఇలా చెప్పబోయింది. “మా పోరాటం మా భర్తల మీద మాత్రమే కాదు. మిమ్మల్ని పేదలు గా చేసిన ప్రభుత్వం మీద, పోలీసుల మీద, వ్యవస్థ మీద.”

Vogue2అక్కడ ఉన్నవాళ్లు “ఈ సభలో కేవలం ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి. పోలీసులు, పేదరికం లాంటివి కాదు!!” అని అడ్డు తగిలారు.

అప్పుడు దొమితిలా అక్కడకి వక్తలు గా విచ్చేసిన ధనవంతులైన మహిళామణులని ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది. “సరే ఆడవాళ్ళ గురించి మాత్రమే చెబుతాను. నాకూ నా పిల్లలకూ ఒంటి నిండా బట్టలు కూడా ఉండవు. మీరు తళ తళ మెరిసే బట్టలతో, నగలతో ఉన్నారు. మా కుటుంబమంతా ఒక చిన్న అద్దె గదిలో ఉంటాము. మీ ఇళ్ళలో పది గదులు ఉంటాయి. రోజుకి 16 గంటలు పని చేస్తాము. మాకు కడుపు నిండా తిండి లేదు. నీళ్ళు లేవు. స్నానాల గదులు లేవు. మా పిల్లలకు చదువులు లేవు. మీరు కార్ల లో తిరుగుతారు. ఏ పని కైనా నౌకర్లు, డ్రైవర్లు ఉంటారు. మనిద్దరం ఆడవాళ్లమే మరి మీకూ మాకూ సమానత్వం ఎక్కడుంది? మా సమస్యలు మీకు ఎక్కడున్నాయి? మా భర్తలు కూడా పెత్తనం చేస్తారు. మేమూ పోట్లాడతాము. అయినా దానికంటే కూడా మా పేదరికమే మా అసలైన సమస్య. మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.”

మహిళలలోనే ఉన్న భిన్న వర్గాలనీ, వాటి మధ్య ఉన్న  అంతరాలనీ, వైరుధ్యాలనీ విస్మరించి, అందరు మహిళలని ఒకే గాటన కట్టి చూసే ఫెమినిజం పెద్ద బూటకం.

ఈ వీడియో తీసినందుకు కేవలం దీపికాను తిట్టినంత మాత్రాన, ఆడవాళ్ళనీ, ఫెమినిజాన్నీ విమర్శించినంత మాత్రాన ఏ ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వీడియోలు, పుస్తకాలు, అభిప్రాయాలు ఇంకా చాలానే వస్తాయి. వీటన్నిటి వెనక ఉన్న మోసాన్ని గ్రహించకపోతే మహిళా సాధికారిక ఉద్యమం చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

 ~

మీ మాటలు

  1. కోడూరి విజయకుమార్ says:

    వినోద్ గారు
    అవసరమైన సమయం లో అవసరమైన విషయాలు రాసారు ….
    మీ ఆర్టికల్ అందరూ చదవాలని ఆశిస్తున్నా !

    • వినోద్ అనంతోజు says:

      ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు.

  2. mohan.ravipati says:

    well said, vinod garu, The pity is woman empowerment is already hijacked , now its revolving around beauty

  3. “మహిళా సాధికారికత” అనే పదానికి అర్థం “చదువుకున్న మహిళల సాధికారికత” గా మార్చేశారు.”

    ఒట్టి చదువుకున్న కాదండీ, ‘చదువుకున్న స్వతంత్ర మహిళల సాధికారత ‘ గా మర్చారండీ!

    ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్ తో సంబంధం వివరిస్తూ చాలా బాగా చెప్పారు.. ఇదే విషయం మీద, మొన్నొక వీడియో కూడా చూశాను,
    యూట్యూబ్‌లో :)

    • వినోద్ అనంతోజు says:

      ఈ వీడియో చాలా సూటిగా ఉన్న విషయాన్ని చెప్పింది. :)

      • Lalitha P says:

        ఈ వీడియో బాగుంది. మీ వ్యాసం కూడా.. కేపిటలిస్ట్ పులులు ఏ రకం సాధికారత గురించి మాట్లాడినా అనుమానించాల్సిందే. చెప్తున్నది ఎవరు అనేది ఎప్పుడూ మనం గమనించుకుంటూ ఉండాల్సిందే.

  4. చాలా మంచి వ్యాసం.అన్నిటిని మింగేసినట్లే పెట్టుబడి ఫేనినిజాన్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఫెమినిస్టులకు అర్ధం మారి పోయీ… ఇంకో పక్క ఫ్యూడలిస్టుల వెటకారానికి గురి అవుతుంది. మీ వ్యాసం నీడ్ ఆఫ్ ద అవర్. శోబా డే కూడా ఈ సారి ఎందుకో ఈ వీడియో మీద ఇలాంటి వివేకవంతమైన కామెంట్ చేసింది.

  5. k.balaji says:

    వాస్తవాన్ని సహేతుకంగా వివరణ ఇచ్చారు….

    ధన్యవాదములు…

  6. srinivas bale says:

    excellent

  7. మీ ఆర్టికల్ చాలా బాగుంది ముఖ్యంగా టివి ఇతర మీడియా లో వస్తున్నా యాడ్స్ ప్రయోజనం ఏమిటో ఇది చదివినాక చక్కగా బోధ పడింది..

  8. Ramesh Lalam says:

    మీ వ్యాసం చాలా బాగుందండి వినోద్ గారు

  9. Thirupalu says:

    కేతవరపు రామ కోటి శాస్త్రి (కాత్యాయని విద్మ హే గారి తండ్రి) బూర్జువా పెమినిజానికి వ్యతిరేకంగా ” విమనిజం” అనే మాట వాడారు. ఈమాట వాడుక లోకి తెస్తే బాగుంటుంది. బూర్జువా పెమినిజం సామ్రాజ్య వాడ సంస్కృతిని ఐ లైట్ కేస్తూ, స్త్రీలకు వ్యతిరేకంగా , వారి కన్నును వారే పొడుచుకొనే విధంగా, వర్గాది పత్యం లో భాగంగా వెర్రి తలలు వేస్తున్న ది. వ్యాసం బాగుంది.

  10. Sangu Sridhar says:

    చాలా బాగా చెప్పావ్ వినోద్, నిజంగా నువ్వు చెప్పింది నూటికి నూరు పాలు అక్షర సత్యం..!!

  11. ఎ.కె.ప్రభాకర్ says:

    మహిళా దినోత్సవాలూ , మహిళా సాధికారతలూ పేజి 3 మహిళల కోసమేనని మరోసారి బలంగా చెప్పినందుకు వినోద్ గార్కి అభినందనలు.
    ఎ.కె.ప్రభాకర్.

  12. ధన్యవాదాలు . భావ గందరగోళం సృష్టించడమే ఇలాంటి వాదాల లక్ష్యం.

  13. Vanaja Tatineni says:

    వ్యాపార ప్రకటనలు వ్యాపార దృక్ఫదంతో రూపొందించబడతాయి. కానీ వాటి ప్రభావం సగటు భారతీయులపైనే ! సాంస్కృతిక కాలుష్యం ఇంతగా వర్దిల్లుతున్నప్పుడూ …యాడ్స్ లో దృష్టికి వచ్చిన విషయాలపైనే అనవసర రగడలు ఎందుకు ? శోదించాల్సిన విషయాలు, చర్చించాల్సినవిచాలా ఉండగా !
    బూర్జువా పెమినిజం గురించి బాగా చెప్పారు. నిజమైన మహిళా సాధికారత గురించి విస్తృతంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది . అభినందనలు వినోద్. .

  14. నిశీధి says:

    ఆర్టికల్ బాగుంది . కాని ఒక రెండు నిమిషాలు వీడియో లో ఎముంది ఎలా ఉంది (బ్రా హుక్కులు విప్పుకున్నారా పాంటీతో మాత్రమే ఉన్నారా లాంటి అంశాలు అన్నమాట ) ఎవరు తీశారు ఎందుకు తీశారు వాళ్ళ వాళ్ళ వ్యాపార లావాదేవిలు వగయిరా కాసేపు పక్కన పెడితే . ఆ వీడియోలో ఒక వాక్యాం ఒకే ఒక్క వాక్యం “మై లైఫ్ మై చాయిస్ ” అన్న వాక్యమలో ఒక ఫిమేల్ తనకి కూడా మగ జాతితో సమానంగా ఉన్న సెక్సువల్ రైట్స్ గుర్తించమన్న విశయం మీద కదా అసలు చర్చ జరుగుతున్నది . ఉడ్విన్ వీడియో తీస్తే పక్క దేశంవాళ్ళు మన సంస్కృతిని అవమానిస్తున్నారు వోగ్ వీడియో తీస్తే వ్యాపారం కోసం తీస్తున్నారు అంటూ అసలు అంశం పక్క దారి పట్టడం కూడా మనకి కొత్త ఫ్యాషన్ అయింది అనుకుంటాను . ఆ విశయం కనీసం ఇక్కడన్నా చర్చకి వస్తే బాగుండేది . పోతే నిజంగానే క్లాస్ కల్చర్ ని బట్టి ఎంపవర్మెంట్ అర్ధాలు మారటం విషాదకరమే

    • నిజమే .. మీరన్నట్టు క్లాస్ కల్చర్ ని బట్టి empowerment అర్థాలు మార్చేయ్యడమే అసలు వంచన . అన్ని వర్గాల స్త్రీలకూ ఒకే రకమైన సమస్యలుండవు. కొంత మంది స్త్రీలకు లైంగిక స్వేచ్చ మాత్రమే సమస్య కావొచ్చు. దోమితిలా లాంటి మహిళలకు అంత కన్నా పెద్దవైన ఆకలీ, దారిద్ర్యం లాంటి సమస్యలు ఉన్నాయి. వాటిని ఈరకమైన empowerment ఎలా పరిష్కరించగలదు? సమాజంలో అత్యధిక శాతం ఉన్న పేద శ్రామిక మహిళల empowerment యే అసలైన women empowerment . ఆ పదం యొక్క అర్థాన్ని మార్చెయ్యడం విషాదకరం మాత్రమె కాదు .. అది శ్రామిక మహిళల పట్ల జరుగుతున్న కుట్ర అని నేను అనుకుంటాను.

    • Sriram Naresh Akula says:

      నిశీధి గారు…బాగా చెప్పారు! ఐన హిపొక్రాట్స్ కి మీరు చెప్పేది అర్ధం కాదు, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించరు కూడా.

  15. rachakonda srinivasu says:

    ఆ వీడియో మీద వున్నా పాజిటివ్ బ్రమలు తొలగించారు
    అసలు వ్యాపర సూత్రాన్ని అవిశాకరించారు.

  16. ఎన్ వేణుగోపాల్ says:

    వినోద్ అనంతోజు గారూ,

    చాల మంచి, లోతైన విశ్లేషణ. ఆ ప్రకటన గురించీ, దాని వెనుక ఉన్న వోగ్ వంటి, కాస్మెటిక్ సరుకుల బహుళజాతి సంస్థల ప్రయోజనాలపై అవసరమైన వెలుగు ప్రసరింపజేశారు. అభినందనలు. కృతజ్ఞతలు.

    ఇక్కడ రెండు విషయాలు పంచుకోవాలనిపిస్తున్నది.

    ఒకటి, దీపికా పదుకునే వ్యాపార ప్రకటన, దాన్ని తీసినవారి ఉద్దేశ్యాలు, ప్రయోజనాలు, అందులో మహిళా సాధికారతకు ఇచ్చిన తప్పుడు నిర్వచనాలు అన్ని విషయాలలోనూ మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తూనే, ఆ ప్రకటన పాఠం మీద ఒకసారి దృష్టి పెట్టమని కోరుతున్నాను. దానికి నేను చేసిన అనువాదం ఇది:

    “నా దేహం, నా మనసు, నా ఇష్టం
    సున్నా సైజో, 50 సైజో నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరిస్తాను
    నా మనసు నగ్నంగా తిరిగినా సరే
    నా మనసుకు పట్టే సైజు దుస్తులు లేవు
    ఎప్పటికీ తయారు కావు
    నేత బట్టలో సిల్కు బట్టలో నా మనసును బంధిస్తాయనుకుంటే
    విశ్వ విస్తరణను అడ్డుకోవాలనుకున్నట్టు
    సూర్యుని అరచేత పట్టాలనుకున్నట్టు

    నీ మనసే పంజరంలో ఉంది, దాన్ని విడుదల చెయ్యి
    నా శరీరం పంజరంలో లేదు, దాన్నలాగే ఉండనీ

    నా ఇష్టం
    పెళ్లాడాలా, వద్దా
    లైంగిక సంబంధం పెళ్లికి ముందా, వివాహేతరమా,
    అసలు లైంగిక సంబంధమే వద్దా
    నా ఇష్టం
    తాత్కాలికంగా ప్రేమించాలా, శాశ్వతంగా కామించాలా
    నా ఇష్టం
    మగవాడిని ప్రేమించాలా, ఆడదాన్ని ప్రేమించాలా, ఇద్దరినీ ప్రేమించాలా

    గుర్తుపెట్టుకో నువ్వే నా ఎంపిక, నేను నీ హక్కు కాదు
    నా నుదుటిమీద సింధూరం, నా వేలికి ఉంగరం, నా పేరుకు నీ ఇంటి పేరు
    అవన్నీ తీసెయ్యగలిగిన ఆభరణాలు
    కాని నీ మీద నా ప్రేమ తీసెయ్యగలిగింది కాదు, దాన్ని పదిలంగా చూసుకో

    ఎప్పుడు ఇంటికి వస్తాననేది నా ఇష్టం
    తెల్లారగట్ల నాలుగింటికి వచ్చానని చికాకు పడకు
    సాయంత్రం ఆరింటికే ఇల్లు చేరానని మురిసిపోకు

    నీకు బిడ్డను కనాలా లేదా నా ఇష్టం
    ఏడు వందల కోట్ల అవకాశాల్లో నిన్నే ఎందుకోవాలో లేదో నా ఇష్టం
    మిడిసిపడకు
    నా ఆనందం నీకు దుఃఖం కావచ్చు
    నా పాటలు నీకు గోల కావచ్చు
    నా పద్ధతి నీకు అరాచకం కావచ్చు
    నీ తప్పులు నాకు ఒప్పులు కావచ్చు

    నా ఇష్టాలు నా వేలిముద్రల లాంటివి
    అవి నన్ను విశిష్ట వ్యక్తిని చేస్తాయి.
    అడవిలో చెట్టును నేను
    మంచుతరకను కాను, హిమపాతాన్ని
    నువ్వొక మంచు తరకవు
    లే, ఈ పెంట తుపాను నుంచి బైటపడు
    నీ పట్ల సానుభూతి పడాలా
    పట్టించుకోకుండా ఉండాలా నా ఇష్టం
    భిన్నంగా ఉండడం నా ఇష్టం

    నేను విశ్వాన్ని
    అన్ని దిక్కులా అనంతంగా వ్యాపించేదాన్ని
    అదే నా ఇష్టం”

    అది రాసినవాళ్ల, చిత్రించినవాళ్ల, నటించినవాళ్ల, ప్రచారం చేస్తున్నవాళ్ల ప్రయోజనాలు ఏమైనా, ఈ మాటలు ప్రస్తుత సందర్భంలో, స్త్రీ స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి కొత్త కొత్త ఎత్తుగడలు వస్తున్నరోజుల్లో, ఇండియాస్ డాటర్ లో సుప్రీం కోర్టు న్యాయవాది దగ్గరి నుంచి ఆశారాం బాపు దాకా ఈ దేశపు పురుషులందరూ స్త్రీ ఏ దుస్తులు ధరించాలో, ఎప్పుడు బైటికి వెళ్లాలో, ఎవరితో బైటికి వెళ్లాలో నిర్దేశిస్తున్నరోజుల్లో, అవసరమైన మాటలేనని నా అభిప్రాయం.

    రెండు, మీరు ఈ వ్యాసంలో దొమితిలా బారియోస్ ది చుంగారా ‘మా కథ’ నుంచి ఉటంకించడం నన్ను ముప్పై నాలుగేళ్ల వెనుక ఆ పుస్తకం నేను అనువదించిన రోజుల్లోకి తీసుకెళ్లి చాల సంతోషకరమైన పురాస్మృతుల్ని కదిలించింది. కృతజ్ఞతలు.

    • వేణు గోపాల్ గారు,
      వాక్యాల అర్ధాలు విడిగా గొప్పగా ఉండొచ్చు. కానీ అవి ఏ నోటి నుండి వెలువడ్డాయి, ఏ గూటి పలుకు పలుకుతున్నాయి అనేదే అసలు విషయం కదా? అక్షరాలను అబ్సల్యూట్ గా ఎలా చూడగలమ్ సందర్భం ఏమైనా?

  17. Sai Subash says:

    వినోద్ గారు చాల బాగా వ్రాసారు , అన్ని విషయలును రంగరించి . నాకు తెలిసి వీటి అన్నిటికి మొదలు కారణం మన “వెస్ట్రన్ ఓరియెంటెడ్” చదువలు .ఈ చదువులు వల, వాళ్ళ భాష మరియు సంస్కుతి మన మీద పడుతుంది.వీటితో పాటు ఈ చదువలు మనిషి లో అహంభావ ధోరణి పెంచుడుంది.ఈ అహంభావ ధోరణి వాళ్ళ వాడు / ఆమె చేసేది తప్పు అఈన దాని నే ఒప్పు అని రూజువు చేయటానికి ట్రై చేస్తారు .అల్లాటిదే ఈ “మై ఛాయస్” బై దీపిక.

    ఆమె హిందూ cleavage కాంట్రవర్సీ తో చాల భాద పడీ, ఆమె నమిందే/ చేసింది కరెక్ట్ అన్ని ప్రూవ్ చేయటానికి చేసిందే ఈ “మై ఛాయస్”.ఈ ప్రాబ్లం ఆమె ఒక్కరి దానిదే కాదు ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టం లో చుడువు కున్న వారి అందరిది .

    ఉపనిషద్ లో అష్టావక్ర చెప్పినటు , చదువు అనేదీ ఆత్మ జ్జానం కోసం మని కాని ఈ చదువలు ఆవి మనకు యీచేది సూన్యం మరియు మనలందరిని వాళ్ళ కు భానిసలు చేస్తుంది .చీవరగా మన దేశం లో చాలామంది చదువుకున నీరష్యరాసులు.
    ధన్యవాదాలు .
    సాయి సుభాష్ .

  18. A.M.R.Anand says:

    ఏనినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో గ్రహించకపోతే మోసపోకతప్పదు. మంచి విశ్లేషణ…..

  19. bhavani says:

    ఆడది పలకరిస్తేనే లేకితనంగా , పనిలేనితనంగా భావించే ఈ సమాజం నించి , తను చెప్పినట్టు నడుచుకున్నంతసేపే పూజలందించే ఈ గొప్ప సమాజం నించి ఇంత కంటే ఏం ఆశించిందో పాపం దీపిక!!

  20. Subrahmanyam says:

    చక్కటి విశ్లేషణ వినోద్ …. సాధికారత ఎప్పుడు వస్తుంది అంటే మగ ఆడ ఇద్దరు సమాజం లో ఒక్కటి గానే ఉన్నపుడు … పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకునే తత్త్వం వచ్చినపుడు …

  21. కె. కె. రామయ్య says:

    వినోద్ గారూ,

    బూర్జువా పెమినిజం గురించి, కాస్మెటిక్ సరుకుల బహుళజాతి సంస్థల గురించి బాగా చెప్పారు. అభినందనలు. నిజమైన మహిళా సాధికారత గురించి విస్తృతంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది .

    బొలివియా దేశపు గని కార్మికురాలు దొమితిలా చుంగారా మెక్సికో అంతర్జాతీయ మహిళా సభలో చెప్పిన మాటలు ” మా పోరాటం మా భర్తల మీద మాత్రమే కాదు. మిమ్మల్ని పేదలు గా చేసిన ప్రభుత్వం మీద, పోలీసుల మీద, వ్యవస్థ మీద. మా పేదరికమే మా అసలైన సమస్య. (ధనికులైన) మీరూ, (పేదలైన)మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.” ఎంతో స్పూర్తిదాయకంగా ఉన్నాయి.

  22. వ్యాపారలాభం కోసం పాశ్చాత్య ధొరణిని భారతీయ సంసృతి లోకి చొప్పించటానికి ఇటువంటి పత్రికలు చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వాలకు పట్టక పోవడం శోచనీయం…
    పైగా దానికి మహిళా సాధికారత అని పేరు పెట్టడం చాలా వింతగా అనిపించే విషయమే.
    ప్రజలలో ముఖ్యంగా మహిళలలో ఇటువంటి మోసాలపై అవగాహన ముఖ్యం…
    మీ వ్యాసం మరింత మంది చదవాలని ఆశిస్తున్నాము.

  23. Doctor Nalini says:

    వ్యక్తుల సమూహమే సమాజం . అలాంటి సామాజిక ప్రయోజనాలకి వ్యతిరేకంగా సాగే వ్యక్తిగత స్వేఛ్చ ని సమర్ధించాలా లేదా అనేది ఏళ్ల తరబడి సాగుతున్న చర్చ .మైమరపు చూపుతో బ్రా హుక్ తీసే మహిళా -చిరుగు పాతల బరువు బతుకును దాచుకోబోయే మహిళా ఒకటి కాదు . నున్నటి శరీర ఛాయాతోనో, పసందైన సెంటు వాసనలతోనో మగవాళ్ళని చుట్టూ తిప్పుకునే స్త్రీ- శ్రమతో వడిలి, కమిలి ,చెమటతో తడిసిన స్త్రీ ఒకటి కాదు . అలాంటి శ్రామికులకు ఎలాంటి choices ని guarantee చేస్తున్నాము ? కనీస అవసరాలకు నోచుకోని ఆ పేద మహిళల సాధికారత గురించి ఈ సెలబ్రిటీస్ ని మాట్లాడ మనండి. మహిళల మరుగుదొడ్ల గురించి విద్యాబాలన్ చేస్తున్న ప్రచారం లాంటివి చేయమనండి.సమాన వేతనాల గురించి మాట్లాడమనండి . మాతాశిసు మరణాలని తగ్గించే ఉపాయాలు చెప్పమనండి . అంతే గాని ఎవరి వ్యపారాన్నో పెంచడం కోసం దయచేసి మహిళని, మహిళా సాధికారతని పణంగా పెట్టకండి . ఇలాంటి వ్యాపార ప్రకటనల్లో మహిళా విముక్తి కోసం వెతకకండి .

  24. ఓకవేళ ఇదే పలుకులు దీపిక చేత ఒక అరుంధతీరాయో, ఒక మోదీనో, లేక గాంధీనో పలికించి ఉంటే అప్పుడది సరైనదేనా?

    గుర్తుకు తెచ్చుకోండి, దీపిక చెప్పినవన్నీ ప్రాధమిక హక్కులు. ఒక వ్యక్తికి స్త్రీ పురుష భేదంలేకుండా ఒక సమాజంలో ప్రతివ్యక్తికీ దఖలుపడాల్సిన మౌలిక హక్కులు. వాటికి woman empowerment అంటూ సొగసులద్దితేగానీ అవి ఒక చర్చకునోచుకంటూ హీనస్థితిలో మన సమాజం ఉందన్నమాట.

    ఈ విషయంలో నా గమనింపు : “స్త్రీల పవిత్రత” లేదా “వారేం చేసి ఆదర్శంగా నిలవాలి” అన్న విషయాలమీద మత/జాతీయ/సంస్కృతీవాదులూ, వామపక్షవాదులూ ఒకేరకంగా ఆలోచిస్తారు. ఒక వ్యక్తి ఎలాఉంటే అది ఉన్నతమో, ఎలా లేకుంటే అది దిగజారుడుతనమో చెప్పే జడ్జిమెంట్లిచ్చెయ్యాలన్న తపన, ఒకరకమైన వయ్యరిస్టిక్ టెండెన్సీ ఇరువురిలోనూ ఉంటుంది. దాన్ని మరోసారి ఈవ్యాసమూ, ఇక్కడి కామెంట్లూ మరోసారి ఋజువుచేశాయి.

  25. Thirupalu says:

    దీపిక ఏ వేదిక నుండి మాత్లాడుతుమ్దనేది ముఖ్య మైన ప్రశ్నే .

    • అలా మీకనిపిస్తుందేమో! నేనుమాత్రం “ద్వంద్వవిలువలు” అన్నపదాన్ని అర్ధం చేసుకోవడానికి దీన్నో ఉదాహరణగా భావిస్తున్నాను.

      అయినా ఇప్పుడు మీరు చేస్తున్నది వ్యక్తివిమర్శ అనుకోవచ్చా? ఏం చెప్పారు అన్నదాన్ని వదిలేసి, ఎవరు చెప్పారు అని వెదకడాన్నే ఇంతకుముందు ఇదే సైటులో “తప్పులెన్నిన వేలిని నిర్లక్ష్యించి, వేలెవరిది?” అని ప్రశ్నించడంతో పోల్చారు. ఇప్పుడు మీరుచేస్తున్నదీ అదే పననుకోవచ్చా? పైన కామెంటేటర్లలో ఒకరు వీడియో కంటెంటుని, తెలుగులోకి తర్జుమాచేసి వ్యాఖ్యగా ఉంచారు. అందులో ఏవైనా ఉండకూడని భావాలుంటే చర్చిద్దాం. అంతేగానీ, దాన్ని ఎవరు తెరమీద పలికారు, నటించారు అని ఆలోచించడం సరైనపనని నాకు అనిపించడంలేదు.

      పైన ఇంకెవరో అనేశారు. విద్యాబాలన్‌లాగా వీళ్ళు “మంచి”దని భావిస్తున్న ఒక సేవాకార్యం తలపెట్టిఉంటేనవారికేగానీ, దీపికలాంటివారికి ఆ స్క్రిప్టును పలికే అర్హత ఉండదని. నిజంగా! Arm chair మేధావులు (ఈమాట నిందార్ధంలో వాడడంలేదు దయచేసి గమనించండి) మనుషుల్లో ఆలోచనలను రగల్చడానికి కేవలం సాహిత్య రచనకే పరిమితమౌతారు. ఒక భావజాలానికి అందరికంటే ఎక్కువసేవచేసేది చాలాసార్లు వీళ్ళే. మరి వాళ్ళసంగతేమిటి? మీరు దీపికలాకాక ఏవో సేవా కార్యక్రమాలు చేసుండవచ్చు, అవన్నీ upto the mark కాదు, మీరు “ఫలానా” సేవాకార్యక్రమ్మాల్లో పాలుపంచుకొని ఉంటేనే ఈ విషయమ్మీద అసలు మీకు వ్యాఖ్యానించడానికంటూ అర్హత ఉంటుంది అంటే, దానికి మీరేం సమాధానం చెప్పగలరు?

    • Thirupalu says:

      /ఓకవేళ ఇదే పలుకులు దీపిక చేత ఒక అరుంధతీరాయో, ఒక మోదీనో, లేక గాంధీనో పలికించి ఉంటే అప్పుడది సరైనదేనా? /
      సరైనదే నని అనుకుంటాను. ‘ నా దేహం నాయిష్టం ‘ అన్న దాంట్లో మనకు ఎటువంటి బేధాభి ప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.ఉన్నా మనమేమి అడ్డు పెట్టలేము. కాక పోతే మాట్లాడిన వేదిక ” దయ్యాలు వేదాల” వల్లీమ్చినట్లు కనబడ లేదా? ఇక్కడనుండి మాట్లాడినప్పుడు అది వ్యక్తీ వాదానికి దారి తీస్తుమ్ది. దాన్ని సామ్రాజ్య వాద సంస్కృతీ దానికి అను కూలమ్గా మలుచు కో గలదు మహిళా సాది కారికత పేరుతో. .పెమినిజమైనా ఉమనిజమైనా సమాజమలో ఒక భాగమే. – అమ్టే సమిష్టి వాదానికి లోబడి ఉండాలి. దాని పలితాలు మల్లీ సమాజాన్ని భాదిమ్చ కూడదు. సమాజం అమ్టే – సాటి స్త్రీలను. ఇక్కడ దీపికా వ్యక్తీ గా మనం ఏమి అనాల్సిన అవసరం లేదు. ఆమె ఆ సంస్కృతీ కి దాసోహ రాలు.

      • ” దయ్యాలు వేదాల”

        వేదాలగురించి, వాటిలోని మంచివిషయాలగురించి నాకు తెలియదు. మనకు మంచిని బోధించేది, మనను ముందుకు తీసుకెళ్ళేది దయ్యమే ఐతే దాన్ని దేవుడనడానికి నాకే అభ్యంతరమూ లేదు. (bye the way sir దేవుడు అనే సంస్కృత పదానికి వికృతి దెయ్యము).

        వ్యక్తివాదం తప్పని మీరెందుకనుకుంటున్నారు? వ్యక్తిపైని సమాజపు రుబాబు సరైనదని మీరెందుకనుకుంటున్నారు?

        నాదృష్టిలో సమాజము అన్నది వ్యక్తుల త్యాగఫలము (society is nothing but the sacrifice of individual freedome). A society that has has nothing to make offer to an individual has no right to demand a morsel from the individual. మనుషులు వేసిన భిక్షతో పొట్టనింపుకొని పెరిగిన నికృష్టజీవి సమాజము. అది మనిషిని వాడి/దాని స్వాతంత్ర్యానికి దూరంచేయడం ఎంతమాత్రము సరైనదికాదు.

  26. kondepui nirmala says:

    దీపికా పడుకోని డాక్యుమెంటరీ మీద రేగిన చర్చ చూశాను. ఎక్కువ మంది వ్యతిరేకిస్టున్నవారే కనిపించారు.
    ఇది మార్కెటింగ్ , బాధ్యతా రాహిత్యం , పేదల ఎజెండా కాదు లాంటి అభిప్రాయాలూ చూశాక నా ఆలోచనలు కొన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను.
    స్త్రీలలో వర్గాలున్నమాట నిజమే. ఒక్కో వర్గానికి ఒక్కో రకమయిన సమస్యలు, విలువలు, ప్రాధాన్యతలు వుంటాయి. దీపిక ఒక గ్లామర్ తార. అ౦త మాత్రాన ఆమె హిందూ క్లీవేజ్ కాట్రవర్సీతో పడిన బాధ చిన్నది కాదు. ఆ వర్గంలో గృహ హింసా , లైంగిక దోపిడీ లేవని చెప్పలేం. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలీ, ఎవరికి వద్దు అని పాలక వర్గాలతో బాటు బాధితులూ నిర్ణయించేసుకోవడం వల్ల ఎక్కడి గొంగళి అక్కడే వుంటుంది. భన్వారీ దేవి మీద జరిగిన అత్యాచార౦ క్షమించరానిదే. అయితే రూపేన్ బజాజ్ కి జరిగిన అవమాన౦ చిన్నది కాదు . అలా చేస్తే జూట్టూ కత్తిరించుకున్న ఆడవాళ్ళ గురించి శరద్ యాదవ్ చేసిన విపరీత వ్యాఖ్యాలా వుంటుంది . రెండింటిటీమీదా తిరుగుబాటు జరగాలి. నిరసనలు వెల్లువెత్తాలి. నేనేం చెబుతున్నానంటే , మనం సమస్యని మానేసి అది ప్రకటీస్తున్న వర్గం మీద కోపాన్ని వ్యక్త౦ చేస్తున్నామేమో అని. దీపిక చెప్పిన “ నా శరీరం నా ఇష్టం. నచ్చిన బట్టలు కట్టుకు౦టాను, మానవ సంబంధాలు , జీవన విధానం నాయిష్టం “ అనే మాటలు స్త్రీల హక్కులలోకి ఆ మాటకొస్తే మానవ హక్కుల్లోకి చేరవా?
    ఈ మాటలు నందితా దాస్ చెప్పినప్పుడు ఆలోచిస్తాం. సిల్క్ స్మిత చెబితే వ్యతిరేకిస్తాం , మేధా పాడ్కర్ చెబితే అంగీకరిస్తాం. సమస్య సమస్యలో లేదు. చెప్పిన వ్యక్తిని బట్టీ మారింది.
    ఈ డాక్యుమేటరీ ప్రేరణతో తయారయిన “ఇట్స్ మై ఛాయిస్” మేల్ వర్షన్ కూడా చూశాను. స్త్రీల హక్కులు పేరెత్తగానే ( స్వేచ్చ అనే మాట అసలే మింగుడు పడ్డంలేదు.) భారతీయత గురి౦ఛీ , స్త్రీల శీల సౌశీల్యాలు గురించీ పురాణ ప్రవచనాలు (అందులో బట్టలు విప్పే కీచకులు ,అది వీక్షించే కౌరవ సభలు వున్న సరే ) పలుకుతున్న నేపధ్యంలో అది “యువర్ బాడీ ఈజ్ మై ఛాయిస్” అని వుంటుందేమో అని కూడా ఆందోళన పడ్డాను. అప్పుడది ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీలో రేపిస్టు ప్రేలాపన లా వుండేది. కానీ అలా లేనందుకు ధన్యవాదాలు చెప్పాలి. .
    ఈ చర్చ ప్రారంభ వ్యాసంలో ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో సీరియస్ విషయాల కోసం వెతికి వేసారిపోయినట్టు ఒక వాక్యం వుంది. అది వృధా ప్రయాస. సీరియస్ మ్యాగజైన్స్ లోనూ , చివరికి రోజువారీ వార్తా పత్రికల్లోనూ ఫ్యాషన్స్ కోసం ఒక పేజీ కేటాయించి అందరితో కొనిపించాలనుకోవడంలో మార్కెటింగ్ లేదూ.

    • “ఈ మాటలు నందితా దాస్ చెప్పినప్పుడు ఆలోచిస్తాం. సిల్క్ స్మిత చెబితే వ్యతిరేకిస్తాం , మేధా పాడ్కర్ చెబితే అంగీకరిస్తాం. సమస్య సమస్యలో లేదు. చెప్పిన వ్యక్తిని బట్టీ మారింది” …

      ఈ ఒక్క వాక్యంలో మొత్తం సమస్య తాలూకూ చర్చనంతా క్రోడీకరించారు.
      మానవ దృష్టి కోణం సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి, చెప్పిన వ్యక్తులను బట్టి – అంతిమంగా తన ఆలోచనా పరమైన అన్వయింపుకు జత పడే ఇష్టా ఇష్టాలను బట్టి కూడా మారుతుంటుంది. అదేమీ నిర్డుష్టమైనదీ శాశ్వతమైనదీ కాదు. కాస్తంత అటూ ఇటూగా తామరాకు మీది నీటి బొట్టులాంటిదే.
      మనకు జరిగితే అన్యాయం గానూ ఇతరులకు జరిగితే కరెక్ట్ గా జరిగిందనే దృష్టి కోణం మనకు మనకుగా చాలా సార్లు, ఇంచు మించుగా అందరి అనుభవం లోనిదే. ప్రతి సమస్యకూ ఉండేది మూడు కోణాలే (అటూ, ఇటూ,మధ్యే). ఛాయస్ – మై ఛాయస్ : ఆలోచించడం లేక వ్యతిరేకించడం లేక అంగీకరించడం.

      “స్త్రీల హక్కులు పేరెత్తగానే ( స్వేచ్చ అనే మాట అసలే మింగుడు పడ్డంలేదు.) భారతీయత గురి౦ఛీ , స్త్రీల శీల సౌశీల్యాలు గురించీ పురాణ ప్రవచనాలు (అందులో బట్టలు విప్పే కీచకులు ,అది వీక్షించే కౌరవ సభలు వున్న సరే ) పలుకుతున్న నేపధ్యంలో అది “యువర్ బాడీ ఈజ్ మై ఛాయిస్” అని వుంటుందేమో అని కూడా ఆందోళన పడ్డాను. అప్పుడది ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీలో రేపిస్టు ప్రేలాపన లా వుండేది. కానీ అలా లేనందుకు ధన్యవాదాలు చెప్పాలి”
      well said నిర్మల గారూ …

    • Thirupalu says:

      వ్యక్తీ వాదానికి సమిష్టి వాదానికి ఎప్పుడు ఆమడ దూరమే ! వ్యక్తీ వాదం వ్యక్తుల అహంకారానికి మరో రూపమ్. తానూ చెప్పిమ్దే వేదం తానూ పాడిందే నాదం. తానూ అన్నిట్లో అందరికంటే గొప్పే! ప్రపంచాన్ని తానూ మాత్రమే చుట్టి చంకలో పెట్టు కోవాలి.సమాజం తన కాళ్ల కింద దాసోహం . నీ కాల్మొక్కుతా బాంచన్ అని తనని మాత్రమే కొనియాడాలి – ఇది వ్యక్తీ వాదం. అందుకు వ్యతిరేకంగా సమష్టి వాదం మనుషులందరూ కలిసి నిర్మించు కున్న అందమైన బొమ్మ సమాజం. దానితో అమ్దరూ సమానంగా ఆడుకో గలగాలి. ఎవడో ఒక్కడు వల్లా సమాజం ఏర్పడలేదు. సమానత్వం కలిగేమ్త వరకు వ్యక్తికీ వ్యవస్తకి ఘర్షణ తప్పదు. ఆ ఘర్షణ నుండి మాత్రమే మంచి సమాజం ఏర్పడుతుందని కొందరు పెద్దలు చెపుతుంటారు. ప్రపంచాన్ని ఏలుతున్న పది శాతం మంది ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టు కోవాలని చేస్తున్న ప్రయోగాలలో దీపిక ఒక పావు మాత్రమే! సిల్క్ స్మితాను ఎలా వగ దేమ్చిమ్ది అందరికి తెలుసు. దీపికాకు ఆ గతి రాక?ఊడదని ఆశిద్దాం.

    • suchismita says:

      దుశ్శాసనుడు అక్కా . కీచకుడూ, ఆయనబాణీ వేరే.

  27. ari sitaramayya says:

    దీపిక శ్రామిక వర్గ స్త్రీల సమస్యల గురించి మాట్లాడలేదు, నిజమే. వోగ్ వేదిక మీద మాట్లాడింది. నిజమే. వోగ్ ఒక వ్యాపార పత్రిక. నిజమే. కానీ, ఆమె మాట్లాడిన విషయాలు మధ్య తరగతి స్త్రీలకు అందరికీ వర్తిస్తాయి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గరనుంచి కాలేజీలకు వెళ్ళే అమ్మాయిల దాకా అందరికీ వర్తిస్తాయి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, సాయంత్రం ఎప్పటిలోగా ఇంటికి చేరుకోవాలి, ఎవరితో బయటకు వెళ్ళవచ్చు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవ్వరికి వారు నిర్ణయించుకోగలిగే దాకా దీపిక మాట్లాడిన విషయాలు చర్చనీయాంశాలే.

    ఆన్ లైన్ పత్రికలో కామెంట్లు రాసేవారు, కంప్యూటర్ ముందు కూర్చుని పత్రికలు చదివే సమయం ఉన్న వారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారు, వీరిది ఏ వర్గమండీ? ఈ మధ్య మీరు శ్రామిక వర్గ స్త్రీలకు ఎం చేశారండీ? హిపోక్రసీ తెలుగువారి హాబీ లాగా ఉంది.

  28. vaageeshan says:

    వేణుగారు ఆమాటల అనువాదాలను చేసి మంచిపని చేసినారు. శ్రామిక మహిళా పడుతున్న కష్టం దీపిక మై చాయిస్ లో పలకని మాట నిజమే .దీపిక గొంతూ ,ఆమెను చిత్రించిన వోగ్ మాగజైను ,అది కనిపించిన మీడియం , అరి సీతారామయ్య గారు అన్నట్టు మధ్యతరగతి కి అందుబాటులో ఉండేవే .అదీ ఆమె ఇంగ్లీషులో మాట్లాడింది . ఈ మొత్తం విషయాలను గమనిస్తే అది మధ్యతరగతి అందుకుంటున్న మన తరం ఆడమనిషి గొంతులాగా ఉన్నది అనేది అబద్దం కాదు . స్త్రీ వ్యాపారీకరణ , స్త్రీలలోని వర్గ కుల వివక్ష ఈ చిన్న వీడియో లక్ష్యాలు కావు . ఈ వీడియో అంత పవర్ఫుల్ గా ఈ సమస్యలమీద వీడియోతీయడం అవసరం . నేను ఆ వీడియో పాఠాన్ని ,తీసిన తీరునూ స్వాగతిస్తున్నాను. మనిషికి నిజంగా ఉండే స్వేచ్చ ఎంత అన్నది వేరే చర్చ. ఈ వీడియో “భారతీయ విలువలను” మంటగ లుపుతున్నది అనో, దానిలో ‘పీడించ బడుతున్నజనాల’ విషయం లేదనో విమర్శించడం కంటెంట్ నూ కళాత్మక దృశ్యంగా మలచ డాన్ని వదిలినదిగా కేవలం ఐడియాలజీ తో కూడుకున్న గా మారుతుంది.

  29. Thirupalu says:

    సారంగా సంపాదక వర్గం అన్ని వర్గాల సమస్యల సాహిత్యానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది. మధ్య తరగతి వారే వెబ్ మేగజైన్లు చదువుతున్నార్u గనుక ఆ సాహిత్యానికే పెద్ద పీట వేయడ లేదో మరి?

  30. చర్చ దీపికా పడుకోనికి, మనకు వున్న వైరుధ్యంలాగా సాగుతుంది. నిజానికి దీపిక పెట్టుబడి సంస్థల వాహిక మాత్రమే. ఆ మాటలు ఆమె రాసినవి కావు. ఆ మాటల పట్ల ఆమెకు భావ సారూప్యత ఉంటే ఉండొచ్చు. అది ఇక్కడ పరిగణించదగ్గ విషయం కాదు. ప్రజాదరణ పొందిన ప్రతి విషయాన్ని డబ్బు చేసుకోవటం పెట్టుబడికి ఉన్న లక్షణం. (వాళ్ళకు ఇబ్బంది లేనంత వరకు)

    మొన్నా మధ్య ఒక టీవీ చానల్ లో విప్లవ గీతాల కార్యక్రమం చాలా రోజులు వచ్చింది. ఆ కార్యక్రమంతో ఆ టీవి రేటింగ్స్ విపరీతంగా పెరిగాయని విన్నాను. విప్లవ భావజాలాన్ని కూడా కాష్ చేసుకోగల సత్తా పెట్టుబడికి ఉంటుంది. మహిళా స్వేచ్చా, సాధికారిత పట్ల జనంలో, ముఖ్యంగా మహిళల్లో పెరుగుతున్న స్పృహ ఇప్పుడు వాళ్ళకు సరుకుగా మారింది. అయితే అది నిజమైన స్పృహను కలిగిస్తే మళ్ళీ ప్రమాదం. దాన్ని లైంగిక స్వేచ్ఛగా మారిస్తే అంత ప్రమాదం ఉండదు.

    సాహిత్యంలో కూడా ఈ ట్రెండ్స్ బాగా కనబడుతునాయి. మగవాళ్ళకు అనుకూలమైన స్త్రీల లైంగిక స్వేచ్చకధల్లో వస్తువు అవుతుంది. ఒక కధలో జీవితంలో మోసపోయిన ఒక స్త్రీ ఎలాంటి బంధాలు, బాధ్యతలు లేని శారీరిక సంబంధాలలో ఉండటానికి ఇష్టపడుతుంది. తెలిసీ తెలియక స్త్రీలు కూడా ఇలాంటి కధలు రాస్తున్నారు. గొప్ప ఫెమినిష్టిక్ కధలుగా ఇవి చలామణి అవుతున్నాయి. సాంప్రదాయవాదులు ఒక విధంగా వీటిని వ్యతిరేకిస్తారు. నిజమైన స్త్రీ స్వేచ్చ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఇంకో రకంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇద్దరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకటే అనే నిర్ధారణ సరైంది కాదు.

    అక్షరాలకూ ఆత్మ ఉంటుంది. ఎంత సౌందర్యంగా పైకి కనబడుతున్నప్పటికీ వాటి వెనుక మర్మం, ఉద్దేశ్యం చాలా కౌర్యంగా స్త్రీల వైపు చూస్తుంటాయి. ఆ అక్షరాలు ఇనుప పాదాలతో అసలే అణగారి ఉన్న మహిళలను ఇంకా తొక్కి వేస్తాయి.

  31. మంజరి లక్ష్మి says:

    చాలా బాగా రాశారు రమా సుందరి గారు.

Leave a Reply to Doctor Nalini Cancel reply

*