యంత్రంలోని మనిషితనం వాల్-ఇ

భవాని ఫణి

bhavani-phani.నడిచే అవసరం లేకుడా జీవితాంతం కేవలం పడక కుర్చీల్లో ప్రయాణించగలిగే అవకాశం కలిగితే ? దంతధావనం కూడా యంత్రాలు చేసిపెట్టే సదుపాయం ఉంటే ? ఒక బటన్ నొక్కగానే శరీరంపైనే దుస్తుల రంగు మారిపోయే సౌకర్యం ఏర్పడితే ? అటువంటప్పుడు మానవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే వాల్ -ఇ తప్పనిసరిగా చూడాల్సిందే .

సాధారణ చలనచిత్రాలతో పోలిస్తే యానిమేటెడ్ చలనచిత్రాల నిర్మాణానికి అయ్యే ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువే . కానీ ఆ చిత్రాలతో చెయ్యగలిగే చమత్కారాల పరిధి చాలా విస్తృతమైనది . చాలా మటుకు యానిమేటెడ్ చలనచిత్రాల్లో తొణికిసలాడే జీవకళ , సహజత్వం, మానవీయతా విలువలని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది . అలా  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం వాల్-ఇ (Wall -E ). ఇది కేవలం పిల్లలు చూడదగ్గ చిత్రమని భావిస్తే అది ఖచ్చితంగా పొరపాటే . ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఇంటర్ స్టెల్లార్ చిత్ర దర్శకుడు నోలాన్, 2008లో విడుదలైన ఈ చలన చిత్రాన్ని చూసి ప్రేరణ పొందాడంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు . అవును . వాల్ -ఇ కూడా సైన్స్ ఫిక్షనే. నిజానికి వాల్ -ఇ చిత్రమే ఇంటర్ స్టెల్లార్ కంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు .
ఈ చలన చిత్రం గొప్పతనం ఏమిటంటే మన భూమి ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్యల గురించి , సరళంగా ఆలోచనాత్మకంగా చర్చించడం . వాటిలో ముఖ్యమైనవి రెండు అంశాలు.
1. మనం తయారుచేస్తున్న చెత్త ,మన భూమిపై మనకే స్థానాన్ని మిగల్చదని తెలపడం
2. శరీర భాగాలకి బదులుగా యంత్రాలని వాడితే మానవ జీవ పరిణామక్రమంలో చోటు చేసుకునే మార్పులని ఊహించడం
అంతే కాకుండా ఇది, భూమిపై మనుషులు వదిలి వెళ్ళిన ప్రేమ భావాన్ని ఆకళింపు చేసుకుని వంటబట్టించుకున్న ఒక రోబోట్ కథ కూడా . దర్శకుడు ఆండ్రూ స్టాన్టన్ ,ఈ చలనచిత్ర నేపధ్యాన్ని ‘నిర్హేతుకమైన ప్రేమ, జీవితపు అనుసరణీయతని ఓటమి పాలు చేయగలదని చూపడంగా’ అభివర్ణించాడు.(irrational love defeats life’s programming)
ఇంకా ఈ చలన చిత్రంలో నాస్టాల్జియా(స్వదేశంపై గల వ్యామోహం), మానవ జాతి మనుగడకు వాటిల్లబోయే ముప్పు, కార్పొరేట్ వ్యవస్థ కలిగించే మార్పులు వంటి అంశాలెన్నో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి .

చిత్ర కథ విషయానికి వస్తే  గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా భూమి నివాసానికి అననుకూలంగా మారిపోవడంతో , మనుషులంతా భూమిని వదిలిపెట్టి ఒక అంతరిక్ష నౌక యాగ్జియం(axiom )లో నివసించేందుకు వెళ్ళిపోతారు  . ఇది జరిగిన ఏడువందల సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది . శుభ్రం చేసే పనిలో భాగంగా భూమి మీద మనుషులు వదిలి పెట్టిన మర యంత్రాలు వాల్-ఇ లు(Wall -E : Waste Allocation Load Lifter –Earth-Class)  . కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని శుభ్రపరచడం అసాధ్యంగా భావించి మనుషులు వాటిని కూడా నిలిపివేస్తారు . కానీ ఒకే ఒక వాల్-ఇ మాత్రం ఇన్ని సంవత్సరాల నుండీ భూమిని శుభ్రం చేస్తూ , తనని తానే మరమ్మత్తు చేసుకుంటూ , మానవులు వదిలి వెళ్ళిన చెత్త నుండి తనకి నచ్చిన వస్తువులని భద్ర పరుచుకుంటూ ఒంటరిగా జీవిస్తూ (?) ఉంటుంది . భూమి మొత్తానికి దానికి తోడుగా ఉన్నది అతి మొండి ప్రాణిగా పేరుపడిన ఒక బొద్దింక మాత్రమే.

తన పొట్టలోకి చెత్తని వేసుకుని దీర్ఘ ఘనాలుగా నొక్కి వాటిని ఒక దానిపై ఒకటి పేర్చుకుంటూ పోవడం దాని పని . కేవలం చెత్తని ఒక క్రమంలో అమర్చడం కోసం తయారు చేసిన అతి ప్రాథమికమైన రోబోట్ అది . అలా అది అక్కడా ఇక్కడా తిరుగుతుండగా  దానికి ఒక మొక్క కనిపిస్తుంది . భూమిపై పచ్చదనం అంతరించిపోయి చాలా సంవత్సరాలు కావడంతో ఆ మొక్క వాల్-ఇ దృష్టిని ఆకర్షిస్తుంది . దాన్నికూడా తన సేకరణలతో పాటుగా భద్రపరుస్తుంది  .

అండాకారంలో ఉండే తెల్లని అత్యాధునికమైన మరో రకమైన రోబోట్లు ఈవ్(EVE: Extra-Terrestrial Vegetation Evaluator)లు . వాటి పని భూమిపై పచ్చదనాన్ని వెతకడం. ఒకవేళ ఎప్పటికైనా భూమిపై మళ్ళీ మొక్కలు  మొలవడం మొదలైతే , భూమి మళ్ళీ నివాసయోగ్యంగా మారతుందని , అప్పుడు అంతరిక్షాన్ని వదిలి మనుషులు భూమిపై నివసించవచ్చన్న ఆలోచనతో తయారుచేయబడినవి ఈవ్ లు.  అటువంటి ఒక ఈవ్ రోబోట్, అంతరిక్ష నౌకనుండి భూమి పైకి వచ్చినప్పుడు దానికి వాల్-ఇ తో పరిచయం ఏర్పడుతుంది . వాల్-ఇ ,ఈవ్ ని ఇష్టపడుతుంది (పడతాడు) . కానీ తన కర్తవ్య నిర్వహణ నిమిత్తం మొక్కని తీసుకుని ఈవ్ అంతరిక్ష నౌకకి వెళ్ళిపోతుంది .  ఈవ్ కోసం వాల్-ఇ కూడా యాగ్జియంకి చేరుకుంటాడు . ఈవ్ ని కలుసుకుని  భూమి మీదకి తీసుకురావాలని  ప్రయత్నిస్తాడు . ఆ క్రమంలో అనేక అవాంతరాలని ఎదుర్కొని, ఈవ్ తో పాటుగా మనుషుల్ని కూడా తిరిగి భూమికి ఎలా చేరుస్తాడన్నది కథాంశం .

ఈ చలన చిత్రంలో ఎక్కువగా ఆకర్షించే విషయం అంతరిక్ష నౌకలోని మనుషుల శరీరాకృతి . ఏళ్ళ తరబడి అన్ని పనులకీ  యంత్రాల మీదే ఆధారపడుతూ, శరీరానికి కేవలం విశ్రాంతినే ఇవ్వడం వల్ల అక్కడి మనుషుల చేతులు కాళ్ళు చిన్నవిగా మారిపోతాయి. కేవలం పొట్ట మాత్రమే పెరుగుతుంది. ముఖం , మెడ కలిసిపోయి ఉంటాయి . వాళ్ళకి లేచి నిలబడటం కూడా తెలీదు.  ఒక పడక కుర్చీలో కూర్చుని ప్రయాణించడం తప్ప వారికి పనేమీ ఉండదు . పళ్ళు తోమడం , బట్టలు మార్చడం వంటి పనులు కూడా యంత్రాలే చేస్తాయి. మనం ప్రస్తుత  జీవన విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని ఈ చిత్రం తెలియజేస్తుంది .

అంతేకాక అంతరిక్ష నౌక కెప్టెన్ తను చెందిన భూమి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో మట్టి , భూమి,సముద్రం, నాట్యం వంటి పదాల్ని వెతుకుతూ, వాటికి చెందిన రికార్డెడ్ వీడియోలు చూస్తూ నాస్టాల్జియాకి గురికావడం మనల్ని కూడా గొప్ప భావోద్వేగానికి గురి చేస్తుంది . “మనుషులు మట్టిలో విత్తనాలు వేసి , నీళ్ళు పోసి పిజ్జాల్లాగా ఆహారాన్ని పండించేవారట!” అని అతను తెగ ఆశ్చర్యపోతాడు . అలాగే వాల్ -ఇ, తను చూసిన ఒక పాత సినిమా పాటలోని హీరో హీరోయిన్ల మాదిరిగా ఈవ్ తో చేతులు కలిపి పట్టుకోవాలని  తాపత్రయపడటం ముచ్చట కలిగిస్తుంది . ఇటువంటి సన్నివేశాల ద్వారా మనం చిన్న చిన్న మానవ సంబంధిత ఉద్వేగాలని, భావాల్నికూడా యంత్రాల నుండి నేర్చుకునే దుస్థితికి త్వరలోనే దిగజారిపోతామని  ఈ చలనచిత్రం సూచిస్తుంది .  .

ప్రమాదవశాత్తూ తమ కుర్చీ వాహనాల్లోంచి జారిపడిన అంతరిక్ష నౌకలోని మనుషులు , లేచి నిలబడలేని అశక్తతలో ఒకరి మీద ఒకరు పడి కొట్టుమిట్లాడటం మన స్వయంకృతాపరాధపు భవితవ్యానికి ప్రతీక అయితే  , వారిలోనుండి ఒకరిద్దరు వ్యక్తులు లేచి నిలబడే ప్రయత్నం చేసి మిగిలిన వారికి స్పూర్తిగా నిలవడం , మనిషిలోని ఆశావహదృక్పధానికీ, పట్టుదలకీ ఉదాహరణ .

మొత్తానికి ఈ చిత్రం భవిష్యత్తుపై భయాన్ని కలిగించి , చేస్తున్న పొరపాట్ల గురించి ఆలోచించుకునే దిశగా మనల్ని నడుపుతుంది. మన జీవితాల్లోని యాంత్రికత మనల్ని ఎటువంటి ప్రమాదంలోకి నెడుతుందో సున్నితంగా తెలియజేస్తుంది . అత్యద్భుతమైన యానిమేషన్ సహజమైన వాతావరణాన్ని సృష్టించి ఒక కొత్త కోణంలోమనం సృష్టించుకుంటున్న  అసహజత్వాన్ని మనకి చూపుతుంది. మానవ తప్పిదాల్ని యంత్రాలు సరిదిద్దే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తుంది .

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సందేశాత్మక చిత్రాన్ని సృజనాత్మక మేధకు అత్యుత్తమ నమూనాగా  అభివర్ణించవచ్చు . ఈ చలనచిత్రంలోని మనుషులకి మళ్ళీ తమ జీవితాల్ని మొదటి దశనుండీ నిర్మించుకునే అవకాశం వాల్-ఇ కారణంగా లభించింది . మరి మనకి లభిస్తుందో లేదో! ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని చాలా మంది చూసే ఉంటారు . ఒకవేళ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. పిల్లలకి కూడా చూపించండి.
~

మీ మాటలు

  1. చాలా చక్కగా వివరించారు భవాని గారు. నాకు చాలా బాగా నచ్చిన చిత్రాల్లో వాల్ ఈ ఒకటి. అభినందనలు.

  2. sahithi says:

    చాలా బావుంది పెద్దమ్మా !!!
    ఇంకా ఇలాంటి సినిమాలుంటే తప్పకుండా తెలియజేయి.
    నీ ప్రియమైన
    సాహితి

  3. Bhavani says:

    థాంక్ యూ రా సాహితీ , తప్పకుండా చెప్తాను

  4. థాంక్యూ మా… చక్కని రివ్యూ…

Leave a Reply to Bhavani Phani Cancel reply

*