భూమి గుండ్రమో, బల్లపరుపో…!

వరవరరావు

vv.karaభూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పిన శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణదారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు భూమి తదితర ప్రకృతి సంపదలు, గనులు, కార్ఖానాలు, ప్రజలు ` పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసి – ప్రకృతి –  ప్రజల పరంగా చూసినపుడు ఇపుడు జరుగుతున్నదంతా విధ్వంసక అభివృద్ధి అనే నిర్ధారణకు వచ్చారు. వాళ్ల అధ్యయనం తెలుగులో పుస్తకరూపంలో వచ్చినపుడు ముందుమాట రాస్తూ నేనూ పతంజలి వ్యంగ్యాన్ని ఆశ్రయించాను. ‘పతంజలి నవలల్లో చర్చ ముగిసి భూమి గుండ్రంగా కాక బల్లపరుపుగా ఉంటే బహుశా ఈ ప్రజాసమూహాలు చీమలవలె ఈ భూగోళం మీంచి కృత్రిమ జలప్రళయంలో, ఖనిజ భూకంపంలో విస్థాపన, విధ్వంసం అయి వుండేవారు కారేమో’ అని.

‘గోపాత్రుడు’ (1992)లో చర్చ ఇరుపక్షాల దొమ్మీలో ముగిసింది. మెజిస్ట్రేట్‌ భూమి బల్లపరుపుగానే వున్నదని తీర్పు ఇచ్చాడు. అయితే ఆయన భూమి గుండ్రంగా ఉందని సత్యజ్ఞానంతోనే వున్నాడుగానీ ఈ భూమిమీద వ్యవస్థ సత్యజ్ఞానంతో లేదుగనుక ఆ నిర్ణయానికి వచ్చాడు.

‘‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాలమీద మనకు విశ్వాసం లేదు. మన విలువలమీద మనకు గౌరవం లేదు. మన దేవుడిమీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకు గౌరవం లేదు. మనతోటి వాళ్లమీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ, గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతనలేదు. విశ్వాసానికీ, ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్లబడుతుంది. మన భూమి బల్లపరుపుగా వున్నదిగనుకనే మన సమాజం ఇలావుంది.’’

ఈ విషయాన్ని ఆయన పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. జీవితాన్ని పరిశీలించి నిర్ధారించుకున్నాడు.

మరి గోపాత్రుడు తండ్రికి భూమి బల్లపరుపుగా ఉందని ఎందుకనిపించింది? అతడు అటువంటి బతుకు బతికాడుగనుక. అతడు వైద్యుడుగా చెలామణీ అయ్యాడు. వైద్యమంటే ఏమిటో తెలియకుండానే మహావైద్యుడనిపించుకున్నాడు. జడ్డీపెట్టెలో తాటాకు పుస్తకాలు ఉన్నాయి. కాని అందులో ఏవుందో నరమానవుడికి ఎవరికీ తెలియదు. అది రాసిన అతని తాతయ్యకే తెలియదు…  ‘అందులో ఏవో ఉన్నాయని వూరందరూ అనుకున్నంత కాలమే నువ్వు సెలామణి అవుతావు అది గుర్తుపెట్టుకో. నోటు రాయని బాకీలు ఎగ్గొట్టీ…. నోటురాసిన బాకీలు వొచ్చేజన్మలో మానాయనే తీరుస్తాడని చెప్పు… నేను చచ్చి, దయ్యాన్నై నీకు చేదోడు వాదోడుగా ఉంటాన’ని హితబోధ చేసిన సందర్భంలో ‘మరో సంగతి భూమి గుండ్రంగా వుందిన ఎవరైనా సెప్పితే నమ్మొద్దు. భూమి బల్లపరుపుగా… నేను పడుకున్న మంచంలాగుంటుంది. మరిసిపోవద్దు.’ అని చెప్పాడు. ఇది సత్యశోధనలో వచ్చిన జ్ఞానం కాదు.

‘ఈ సంగతి మా నాయిన పోయేముందు నా సెవులో చెప్పి మరీ పోయాడు. మా తాత యీ రహస్యం మా నాయిన చెవిలో చెప్పి చచ్చిపోయాడట – నువ్వు కూడ నీ కొడుక్కు ఈ రహస్యం చెప్పాల….’ ఇది సత్యాన్వేషణలో పొందిన జ్ఞానం కాదు. వారసత్వ సంచిత స్వార్థ ప్రయోజనజ్ఞానం. కనుకనే రహస్యంగా వారసత్వంగానే అందించబడుతుంది.

ఇంక అక్కడినుంచీ ఇరుపక్షాలకూ స్వార్థప్రయోజనమే  రెండుపార్టీలుగా చీలడానికి కారణం తప్ప భూమి గుండ్రంగా వున్నదని అంటున్నవాళ్లంతా వెనుకటికి  మేజిలెన్ వలె పరిశోధనచేసి తేల్చుకున్నవాళ్లు కాదు. ఇపుడు పార్లమెంటులో భూఆక్రమణ బిల్లు మీద రెండు పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు చీలి ప్రతిష్ఠంభన ఏర్పడుతుందో, అధికారంలో వున్న పార్టీ పడిపోతుందో అనిపించి – చివరకు అంతా ఒకటైపోయినట్లు.

అట్లా ఒకటి కాకపోతే పోలీసోడు అందరినీ బొక్కలో తోసి ఒకటి చేస్తాడు. ఇప్పుడు పోలీసంటే ప్రపంచ పోలీసు  అమెరికా.

‘భూమి గుండ్రంగా లేదు. భూమి బల్లపరుపుగా కూడ లేదు. భూమి నా టోపీలాగుంటది. భూమి పోలీసోడి  లాఠీ లాగుంటాది తెలిసిందా?’ అని అడిగి తెలీకపోతే మళ్లా ఒకసారి గదిలోకొచ్చి తెలిసేట్లు చేస్తానంటాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.

అయితే ఇన్‌స్పెక్టర్‌కున్న విశ్వాసాన్ని కూడ తాత్కాలికంగా మెజిస్ట్రేట్‌ వమ్ముచేసాడు.

‘ఇదేం న్యాయం, నల్లగౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి, మిగిల్నోల్ల నమ్మకాలు విలువలేకుండా ఎలాపోతాయి?’… ఇందులో ఏదో మత్లబు ఉన్నది.

అది డిఎస్పీ సిఐకి అర్థం చేయించాడు. సిఐ కుట్రకేసుల మీద కుట్రకేసులు బనాయించి అందులో మెజిస్ట్రేట్‌నే సాక్షిని చేసి ఇరికించాడు. సెషన్స్‌జడ్జి ‘‘ఒకవేళ కుట్రకేసంటూ పెడితే నీమీదే పెట్టాలని నాకు అనిపిస్తున్నదయ్యా’’ అన్నాడు. ఎందుకంటే మెజిస్ట్రేట్‌ తన పరిధి దాటి జీవితంవైపు తొంగిచూసాడు. ‘‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నాకూడ పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిండిలాగ కలిపి, గుండ్రంగా చేయగలరని నేను నమ్ముతాను… మున్సఫ్‌ మేజిస్ట్రేట్‌గా నీ నమ్మకంకన్నా సెషన్స్‌జడ్జిగా నా నమ్మకానికి ఎక్కువ విలువుంటుంది గదా. అప్పుడేమంటావు?’’

‘‘కేసులు పరిష్కరించు. అదే నీ పని. జీవితాన్ని పరిష్కరించే బాధ్యత మనది కాదు’’ అని మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌కు హితబోధ చేసి సెషన్స్‌జడ్జి గారు కుట్రకేసుల కట్ట అందుకున్నారు.

హితబోధలో పోలీసుల శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆ సంగతి మేజిస్ట్రేట్‌కే కాకుండా పోలీసులకు కూడ జడ్జిగారు గుర్తుచేసారు గనుక సి.ఐ. తటాలున లేచి కుట్రకేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే 92లో పతంజలి ఈ నవల రాసేనాటికే పోలీసోడి పవరూ, మెజిస్ట్రేటు పవరూ – ఆ మాటకొస్తే పిలకతిరుగుడు పువ్వు (95)లో సెషన్స్‌జడ్జి పవరూ, శాసనసభ, ప్రభుత్వపాలన, న్యాయవ్యవస్థ, మీడియా అన్నిటి పవరునూ శాసించే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మన దేశంలో నూతన ఆర్థికవిధానాల రూపంలో వచ్చింది. మీడియాకు సంబంధించిన పవరును ‘పిలకతిరుగుడుపువ్వు’లో కొంత, ‘పెంపుడు జంతువులు’లో వివరంగా పతంజలి చెప్పే ఉన్నారు.

‘పిలకతిరుగుడుపువ్వు’ 1995 ఇండియాటుడే సాహిత్య ప్రత్యేకసంచికలో అచ్చయింది. అప్పటికి సాధారణ ప్రజలు పోలీసుగా గుర్తించే రాజ్యాంగయంత్రం కూడ ప్రపంచబ్యాంకు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే స్థితి మనదేశంలో వచ్చింది.

ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. పతంజలి నవలల్లోని ఫ్యూడల్‌ భూస్వామ్యం, పోలీసు వ్యవస్థగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రాజ్యాంగయంత్రం, సాపేక్ష స్వాతంత్య్రం కలిగి ఉంటుందనుకునే న్యాయవ్యవస్థ,  ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభమనుకునే మీడియా అన్నీ కార్పోరేటు ప్రయోజనాలు నెరవేర్చే దళారీలుగా మారిపోయాయి. ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా లేదు. పోలీసుటోపీ లాగ లేదు. లాఠీలాగ లేదు.

సరుకుగా ఉన్నది. మార్కెటు సరుకుగా ఉన్నది. ఇప్పుడది ఆలమండ దొమ్మీకేసులోని సమస్యగా లేదు. ఇది మామూలు దొమ్మీకేసుగా కాక ప్రత్యేక దొమ్మీకేసుగా మున్సిఫ్‌మెజిస్ట్రేట్‌ గుర్తించినట్లుగానే ఇరవయ్యేళ్లు పోయాక మనం దీనిని పార్లమెంటు ముందు ఉన్న భూఆక్రమణబిల్లుగా గుర్తించాల్సి ఉన్నది. అదీ పతంజలి దూరదృష్టి, ముందుచూపు.

భూమి పోలీసుటోపీ లాగ ఉన్నదనుకున్నపుడు అధికారబలం, అది కూడ లాఠీలాగ ఉన్నదనుకున్నపుడు కండబలం – అందువల్ల వచ్చిన అధికారబలం అనుకునే సామాన్యజ్ఞానం (స్వతంత్రం వస్తే హెడ్డ్‌ బదిలీ అయిపోతాడా అనే ‘కన్యాశుల్కం’లోని జట్కావాని సమస్య వంటిదే) నుంచి వ్యవస్థగా చూసినపుడు మనం ఒక సంక్లిష్టజ్ఞానంలోకి కళ్లు తెరవాల్సి ఉంటుంది. అది వేమన చెప్పిన ఎవరైనాసరే ‘పసిడిగల్లవాని బానిసకొడుకులు’. ఆ పసిడి ఇవ్వాళ భూమి. గర్భంలో పసిడిమాత్రమే కాక సమస్త విలువైన ఖనిజాలు ఉన్నందువల్ల, మార్కెట్లో సరుకయినందువల్ల అది భూమితో సంబంధమున్న ప్రజల చేతినుంచి భూస్వామి చేతినుంచి ఇపుడు కంపెనీల చేతిలోకి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్నది. కనుక భూమి గుండ్రంగా ఉన్నదో బల్లపరుపుగా ఉన్నదో కంపెనీవాడు నిర్ణయించేదే సత్యం. అందాకా ప్రజలు గుండ్రంగా ఉన్న భూమిమీద చీమలవలె పడిలేస్తూ పోరాడుతూ ఉండాల్సిందే.

~

 

 

మీ మాటలు

  1. పతంజలి ని పూర్తిగా చదవాలని ఉంది .

  2. కోడూరి విజయకుమార్ says:

    ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా లేదు. పోలీసుటోపీ లాగ లేదు. లాఠీలాగ లేదు.సరుకుగా ఉన్నది. మార్కెటు సరుకుగా ఉన్నది. ….. నిజం !

  3. రాఘవ says:

    అవును..అవును..అవును..పోరాడుతూ ఉండాల్సిందే…

  4. Delhi Subrahmanyam says:

    మంచి విశ్లేషణ వరవర రావు గారూ. ఇప్పుడు మీరు చెప్పినట్టు భమి సరకు చుట్టూ వుంది,. బల్లపరుపుగానా లేక గుండ్రంగాన అన్నది ఆ అసరుకు తయారుచేసే వాళ్ళు వాళ్ళకి సహాయ పడే ప్రభుత్వం చేతుల్లో వుంది. గత 25 సంవత్సరాలగా మన ప్రభువుల దగ్గర నుంచి (ఏ రకమయిన వారయినా సరే) మనం పెట్టుబడి కి సహకరించే విధానలగురించే మాటలే కానీ ప్రజలకి సహకరించే నీతుల గురించి ప్రణాళికల గురించి వినటం లేదు. అలా వినాలనుకోవడం ఈ వ్యవస్థ లో తప్పే.

  5. Rajendra prasad Chimata says:

    కఠోరమైన నిజం. ప్రజాస్వామ్యమనే ముసుగు క్రమంగా పోతోంది. కానీ మెజారిటీ ప్రజలకు భ్రమలు తొలుగుతున్నట్టు కనపడడం లేదు.భ్రమలు తొలిగిన వాళ్ళను ప్రభుత్వం ఏదో ఒక ముద్ర వేసి తొలిగిస్తోంది.చివరికి ప్రజలది ప్రేక్షక పాత్రే.

    • Delhi Subrahmanyam says:

      చాల కరెక్ట్ గా చెప్పారు రాజేంద్రప్రసాద్ గారు. మీరు చెప్పిన ఢిల్లీ రీసెర్చ్ పుస్తకాన్ ఎక్కడ దొరుకుతుంది?

  6. Rajendra prasad Chimata says:

    ఢిల్లీ పుస్తకం గురించి వరవర రావు గారు ప్రస్తావించారు, వారే చెప్పగలగాలి

  7. Thirupalu says:

    ‘పసిడిగల్లవాని బానిసకొడుకులు’. గురించి రాసిన పతంజలి గారి గుర్తు చేస్తున్నందుకు దానయ వాదాలు,

Leave a Reply to రాఘవ Cancel reply

*