పునరపి రణం

 

తన చుట్టు తాను చుట్టుకుంటూ ఇపుడున్నదంతా దుఃఖమే
కలలను కూడా కలుషితం చేస్తూ కొన్ని తడి లేని అశ్రువులు
అశ్రువుల మీద ఎవరో సంధించి వదిలిన ఒక అస్త్రాన్ని నేను
దుఃఖం మీద ఎవరో ఎగరేసిన తిరుగుబాటు బావుటానూ నేనే

నేనంటే ఏ నేనైనా, ఎన్ని నేనులైనా

ఈ తోలు చేతులు కత్తులై, ప్రతి వ్రేలి కొసనా నేనొక కొవ్వొత్తినై;
ఏదీ వుండనప్పుడు; విరిగిన రథ చక్రం, ఇంటి దూలం ముక్క ఏదీ
వుండనప్పుడు నెత్తురోడే శిరస్సును గదాయుధం చేసుకునేది నేనే
చివరి వూర్పు కూడా మంటను మరి కాస్త ఎగదోసి వదుల్తుంది;
హతమవుతుంది గాని ఈలోగా శరీరమే నా ఆయుధం, దీన్నే
నేనిప్పుడు జమ్మి చెట్టు మీది నుంచి జాగర్తగా దింపుకుంటున్నా

మళ్లీ మరొక ఆఖరి యుద్దానికి

                                                                                                      -హెచ్చార్కె

hrk

మీ మాటలు

  1. Thirupalu says:

    ‘ పునరపి రణం ‘ అనివార్యమైనపుడు జమ్మి చెట్టు మీది నుంచి జాగర్తగా దింపు కోక తప్పదు మళ్ళి ఒక ఆకరి యుద్దానికి దుఖాన్ని తరిమి కొట్టడానికి. అద్బుతం సార్!

  2. కోడూరి విజయకుమార్ says:

    “విరిగిన రథ చక్రం, ఇంటి దూలం ముక్క ఏదీ
    వుండనప్పుడు నెత్తురోడే శిరస్సును గదాయుధం చేసుకునేది నేనే”
    “హతమవుతుంది గాని ఈలోగా శరీరమే నా ఆయుధం”
    ……….. హెచ్చార్కె కవిత్వ మెరుపులు ఎప్పుడూ కొంగొత్తగా పలకరిస్తాయి

  3. balasudhakarmouli says:

    గొడ్డలిబుజం కవిత్వం తర్వాత..

  4. రమణ కెవి says:

    //శరీరమే నా ఆయుధం, దీన్నే
    నేనిప్పుడు జమ్మి చెట్టు మీది నుంచి జాగర్తగా దింపుకుంటున్నా//
    సీనియర్ కవి హెచ్చార్కే గారి కవిత గంభీరంగా ఉంది. పై వాక్యంతో అనారోగ్యంతో పోరాటం గురించి చెబుతున్నారా?

  5. కె.వి. రమణ గారి వ్యాఖ్య చూసి నవ్వొచ్చింది. ఇలా కూదా అర్థమవుతుందా అని కాస్త ఆశ్చర్యం కూదా వేసింది. పోరాడడానికి శరీరం తప్ప మరేం లేని వాళ్ళు కూదా వుంటారు, ఆరోగ్యమయినా అనారోగ్యమైనా. :-)

  6. రమణ కెవి says:

    ఎటువంటి పోరాటమో, ఎవరి పోరాటమో చిన్న క్లూ కూడా ఇవ్వనప్పుడు దానిని వ్యక్తిగత జీవిత పోరాటంగా తీసుకోవడం తప్పా?
    //హతమవుతుంది గాని ఈలోగా శరీరమే నా ఆయుధం, జమ్మి చెట్టు మీది నుంచి జాగర్తగా దింపుకుంటున్నా
    మళ్లీ మరొక ఆఖరి యుద్దానికి//
    అన్నప్పుడు, ఇంతకాలం శరీరం అనే ఆయుధాన్ని జమ్మిచెట్టు మీద దాచి మనసుతో, భావాలతో పోరాడాననీ, ఇప్పుడు శరీరాన్ని దింపుకుని మళ్ళీ మరొక ఆఖరి యుద్ధానికి సిద్ధమవుతున్నాననీ చెబుతున్నట్టు నాకు అర్థమైంది. శరీరం అనే ఆయుధం, ఆఖరి యుద్ధం అన్నారు కనుక అది అనారోగ్యంతో పోరాటమా అన్నాను. వెనకటి రోజుల్లోలా అజ్ఞానిని చూసి జ్ఞాని, పామరుని చూసి పండితుడు నవ్వి ఊరుకుంటే ఎలా? కాస్త బోధపరచండి,

  7. అయ్యో, మిమ్మల్ని నొప్పించాలని కాదు. రమణ గారు, మీరలా అనుకోడానికి పద్యంలో చాల అవకాశం వుంది.
    ‘… ఇంతకాలం శరీరం అనే ఆయుధాన్ని జమ్మిచెట్టు మీద దాచి మనసుతో, భావాలతో పోరాడాననీ, ఇప్పుడు శరీరాన్ని దింపుకుని మళ్ళీ మరొక ఆఖరి యుద్ధానికి సిద్ధమవుతున్నాననీ చెబుతున్నట్టు నాకు అర్థమైంది.’ ఈ మీ మాటల్లో వున్నదే నేను నా వివరణలో చెప్పడానికి ప్రయత్నించాను. అనారోగ్యం సంగతి అప్ఫ్పుడు నా ఉద్దేశం కాదని చెప్పాలని కూడా అనుకున్నాను. నాకు నవ్వొచ్చింది నా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అర్థం మీదనే, మీ వ్యాఖ్య మీద కాదు. మీరు చెప్పిన స్ఫురణ వస్తుందని నేను గుర్తించాల్సింది. మీ విమర్శ సరైంది. ఇదంతా చెప్పుకోడానికి వీలిచ్చింది మీ పలకరింపు. థాంక్ఫ్యూ వెరీ మచ్.

    • రమణ కెవి says:

      థాంక్యూ హెచ్చార్కే గారు, కవితను అర్థం చేసుకోవడంలో నేను పొరపాటు పడలేదని మీరు అనడం పెద్ద సంతృప్తి నాకు. నేను మిమ్మల్ని నొప్పిస్తే సారీ.

Leave a Reply to కోడూరి విజయకుమార్ Cancel reply

*