ఆ కురులు…ఆనందాల రెపరెపలు!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshకొందరిని చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి.
మొక్కలు, శాఖలు, ఆకులు, రెమ్మలు, పిందెలు, పూలు.
తర్వాత పండ్లు.

కానీ, చూశారా కేశాలు? వెంట్రుకలను?
అవి చిత్రాలను అద్వితీయం చేస్తాయి, పలుమార్లు!

పిల్లలైనా పెద్దలైనా, వారి కురులను చూస్తే, ఆ కురుల్లో తురిమిన పూవులను చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి. ఉదాహరణకు ఈ పిల్లనే చూడండి.
గులాబీ బాల.

ఈ పాప అందం ఆ నవ్వు, ఆ పువ్వు వల్లనా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం.
చాయాచిత్రాల్లో కురులు నిజంగానే ఒక విశేషం.
వాటిని విడమర్చి చెప్పడం బహుకష్టం.
నిజానికి ఛాయా చిత్రాల్లో వాటిని అలవోకగా పట్టుకోవడమూ అంత తేలిక కాదు.
ఇక. వాటిని వెలుగునీడల్లో సహజంగా బంధించి చూపడం ఇంకా కష్టం. కానీ, అందమైన ఎన్నో చిత్రాలను చూస్తుంటాం. కానీ, వాటిల్లో కురుల పాత్ర అదృశ్యంగా ఉంటుందంటే నమ్ముతారా?
నమ్మాలనే ఈ చిత్రం.

+++

ఛాయా చిత్రం పరిభాషలో గ్రేన్స్ అని వాడుతూనే ఉంటాం.
బ్లాక్ అండ్ వైట్…నలుపు తెలుపు గ్రేన్స్ అంటారు. అట్లే రంగులు.
కానీ, మనిషికి అనువణువూ ఒక ఛాయ.
సూక్ష్మంగా చూస్తే స్వేదగ్రంథులూ, రోమాలూ అన్నీ ఉంటై – కలగలసి ఉంటై.
కానీ, మనసును హత్తుకునే చిత్రాల్లో కొన్నిసార్లు కేశ సంపదా అద్వితీయ పాత్ర పోషిస్తుంది!
ఉదాహరణకు ఈ పాప. ఛాయ.

ఇందులోని అందమంతా ఆ పాప జుత్తే.
తర్వాత ఆ పుష్పమే లేదా చిరునవ్వే.
నవ్వే అలా పుష్పించిందా అనిపించేంత అందం ఈ చిత్రం.
కానీ, ఒక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్రానికి వేర్లు ఆ పాప జుత్తే అని నా భావన.

కానీ, అమ్మాయిలు, నడి వయసు స్త్రీలు, తల్లులు… ఏ వయసు వాళ్లయినా సరే, చిత్రంలో కురులదే మహత్తర పాత్ర.  కొందరికి ఒత్తయిన జుత్తు… మందార పువ్వువలే. మరికొందరికి నెరిసిన జుత్తు…కలువల్లా.
కానీ, ఎవరైనా తలంటుపోసుకున్నాక గుడిలోని దీపంలా,  తీర్థంలా, దివ్యంగా అలౌకికంగా కనిపిస్తారు.
నవ్వితే ఆత్మలు శాంతించేంత బావుంటారు.

అలా వారిని చిత్రాలు తీయడం ఒక దివ్యానుభవం. అదొక పవిత్రం.
పొరబాటుగా వాళ్ల బాహ్య సౌందర్యానికే మీరు తలొగ్గి తీశారా?
తీస్తే తీశారు గానీ ఆ తర్వాత వాటిని ఫొటోషాప్ లోకి వెళ్లి కొంచెం లెవల్స్ పెంచారా?
ఇంకేమైనా కరెక్షన్స్ చేస్తూ పోయారా? లాభం లేదు. ఆ ఫొటో కాస్త ఇంప్రూవ్ కావచ్చును. కానీ, ఆ కురులు పంచే అనురాగం, దయ, కరుణా, లాలస, మాయ, అమాయ- మటుమాయమైపోతుంది. క్షణంలో ఆ కురుల మెరుపు అదృశ్యమైపోతుంది. తర్వాత నవ్వూ, పువ్వూ మిగులుతుంది.

వెంట్రుక వాసి తేడాతో ఆ వెంట్రుకలన్నీ గాఢ నీలిమలోకో లేదా నలుపులోకో దాగిపోయి ఇల్లంతా చీకటైనట్టు తల మాడిపోతుంది. అట్లా ఆ కురులు తమ ఆధ్యాత్మక శోభనుంచి వైదొలగి- చిత్రంలో తెలిసిందే చూస్తూ ఉంటాం. చూసిందే చూస్తూ ఉంటాం కూడా.  అదొక వైచిత్రి.
అందుకే సహజ చిత్రం విలువ సహజంగానే అధికం.

మళ్లీ పాప.
దాని కురులు చూడండి. ముంగురులూ చూడండి.
రెపరెపలు పోయే ఆనందంలా ఉన్న ఆ బాలిక జుత్తు చూడండి.
ఇది ఇంకా ఫలించలేదుగానీ, వెంట్రుక పోగులన్నీ లెక్కబెట్టగలిగేలా తీయడం నిజమైన చిత్రం.

+++

ఇంకా చెప్పాలి.
కురులంటే బొమ్మలు కూడా.
అవును.
మనకు కళ్లుంటాయి. అందరికీ తెలుసు.
కానీ, కళ్లపై కనుబొమ్మలుంటాయి. చూశారా? మీరెప్పుడైనా?
ఫలానా వాళ్ల ‘బొమ్మలు’ బావున్నాయని అన్నారా ఎప్పుడైనా? పోనీ ఎవరైనా అనగా విన్నారా?

బొమ్మలు!
అవును. ఒక బొమ్మకు ఆ వంపులు తిరిగిన ఇంద్రధనుస్సు అర్ధభాగాలు రెండు బొమ్మలు.
కలిపితే ఈ బాల. పూబాల.
అవీ కేశాలే కదా. వాటితో కూడిందే కదా ముఖం. చ్ఛాయ. జీవకళ!
అదీ నా పాయింట్.

బొమ్మల కింద కనులే కాదు, కనురెప్పలే కాదు, ఆ రెప్పలపై విప్పారిన నవ్వులా ఆ రోమాలు. వాటినేమంటారు? ఆ ‘ఐ లాషెస్’ కూడా చిత్రంలో ముఖ్యభాగం అని ఎవరైనా గుర్తిస్తారా? అవీ నవ్వుతూ ఉంటాయి, పాపతోపాటు.
అంతేకాదు, బుగ్గ మీసం – సైడ్ లాక్స్ – వాటికీ ముంగురులూ ఉంటై.
అట్లే కొందరికి పుట్టమచ్చ మీద రోమం ఉంటుంది.
అదీ మాట్లాడుతుంది. కవ్విస్తుంది. ఇంకా చాలా.

+++

ఓపికా, శ్రద్ధా.
కుంకుడు కాయలు – షాంపూలు.
కొబ్బరి నూనెలు – సుగంధ ద్యవ్యాలూ – ఇంకా ఎన్నో.
ఎన్నో డొమెస్టిక్ ఈస్తటిక్ సరంజామా. వాటన్నిటితోనూ ఎదిగిన ప్రపంచం, ఈ సిరులు.
దృశ్యాదృశ్యం ప్రతి చిత్రం, జీవకళా.

-ఇట్లా చాలా. అందుకే చిత్రంలో అన్నీ కూడుతాయంటాను, ముఖ్యంగా కురులు చిత్రనిర్మాణంలో్ అవిభాజ్యమైన గ్రేన్స్ అంటాను. వాటితో ఛాయాచిత్రంలో జీవకళ శోభిస్తూ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి.

ముఖ్యంగా స్త్రీలను ఛాయాచిత్రాల్లో చేసేప్పుడు, వాళ్లను సహజంగా చిత్రించేటప్పుడు, ఏ టచింగ్ లేకుండా బొమ్మను చూస్తే అందులో అచ్చెరువొందించే అందమంతా కురులతో కూడిందే అని నా భావన. ఈ చిత్రమే కాదు, స్త్రీల చిత్రాలు ఏవైనా సరే…వారి కట్టూబొట్టూ ఎలాంటిదైనా కేశసౌందర్యం ఒక మోహం. దాహం. అది అణువణువునూ సౌందర్యవంతం చేస్తుంటుంది. అది నిజమైన చ్ఛాయకు బలిమి అనే నా అభిప్రాయం.

కొన్నిసార్లు మహిళల సౌందర్యం తాలూకు అందం అంతానూ వారి ఉంగరాల జుట్టు లేదా నుదుటిపై పడే ముంగురుల నుంచి విరబూస్తుందని అనుకుంటాం. కానీ, విరబోసుకున్న జుత్తు లేదా అల్లుకున్నజడలు, కొప్పులు, చేత్తో వేళ్ల వెనుక భాగంతో.. జడపాయలను నిదానంగా సాపు చేస్తూ చిక్కులు తీయడం…ఇదంతానూ ఒక దృశ్యాదృశ్యం. ఒక్కోసారి శిఖముడి లేదా ఆ ముడి విప్పినప్పుడు పడే జలపాత సోయగం…అంతానూ ఒక వింతైన ఛాయాంజలి.

నిజానికి ఒక్కమాటలో కురులు ఒక గ్రంథం అయితే ముంగురులు, జడకొప్పులు ఇవన్నీనూ అందలి అధ్యాయాలు. తురిమిన ఒక పుష్ఫం ఒక కూర్పు. శీర్షిక.

మీ మాటలు

  1. sundaram says:

    రమేష్ గారు

    మీ వ్యాసాలన్నీ చదువుతూ వుంటాను. చాల కళాత్మకంగా వుంటాయి.
    కానీ, ఈ వ్యాసం ముఖ చిత్రం గా చిన్న పసి బాలికను ఎంచుకోవడం ఎందుకో నాకు నచ్చ లేదు.
    అదీ, కురులు, అందము,మొదలిన వాటి గురుంచి మాటలాడే tappudu, ఒక యువతినో లేక ఒక స్త్రీనో ముఖచిత్రం గా ఎంచుకొని వుంటే బాగా వున్దేదేమోనంబి అనిపించింది.
    క్షమించాలి!

    sundar

  2. kandukuri ramesh babu says:

    నిజమే.
    ముందు ముందు అ మొహమాటం దాటి రాస్తాను, చూపుతాను.
    థాంక్ యు.

  3. కురులు గురించి కాని యువతుల కురుల గురించి కాదు కదా మరి చిన్న బాలిక ఫోటో వేస్తే ఏమైంది ? అసలు ఇప్పుడే మీరు మొహమాటం లేకుండా రాస్తున్నారు .ఇంకా మొహమాటం వదిలేస్తనన్నారు. . బాబోయ్

మీ మాటలు

*