అమ్ములు

ఆర్. దమయంతి

 

 

damayanthi

 

 

 

 

 

‘రూపం లేని ప్రేమకి

ఆయుష్షు మాత్రమే వుంటుంది.

అందుకే అది

మనిషి పోయినా మిగిలుంటుంది.’

*****

 

“ఈ ఏడాది అమ్ములు కి పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాన్రా తమ్ముడూ!” – చల్ల గా మాట చెవినేసింది చంద్రమతి.

శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు. కనుబొమలు ముడిచి, అడిగాడు. “ఏమిటీ! అమ్ములుకి పెళ్ళా?!”

“అవును. పెళ్ళే. ఏం, అదేమైనా  చిన్న పిల్లనుకుంటున్నావా?”

“కాక? నువ్వు తొందరపడి పెళ్ళి చేసేంత పెద్దదయి పోయిందా అప్పుడే?”

“చాల్లేరా నువ్వూ నీ అభిమానమూను.  నీ కళ్ళకి అదెప్పుడూ చిన్నదిగానే కానొస్తుంది. వచ్చే ఏడాది కల్లా డిగ్రీ అయిపోతోంది తెల్సా?” అంది.

“ఆ తర్వాత  అదింకా చదవాల్సిందీ వుంది. అది నీకు తెలుసా?  అయినా, ఏవో కొంపలంటుకుపోతున్నట్టు ఇంతర్జంటుగా  అమ్ములుకి పెళ్ళి చేసేయడమేవిటీ? అర్ధం లేకుండా!” అతని మనసులో చికాకంతా మాటల్లో తెలిసిపోతున్నా, అదేం   పట్టించుకోని దాన్లా తన ధోరణిలో తానుంది  చంద్రమతి. – ” అద్సరే కానీ, ఇంతకీ అమ్ములు పెళ్ళి ఎవరితో అని అడిగావు కాదు?” అంటూ నర్మగర్భంగా నవ్వి, మరి కాస్త నెయ్యి ఒంపింది పప్పన్నంలోకి.

“అదీ నువ్వే చెబుతావ్ గా. అందుకే  అడగలేదు” అన్నాడు రుస రుస గా.

అతని భావమేమిటొ  తనకు బాగా తెలుసన్నట్టు  గుంభనగా నవ్వుకుంటూ అసలు సంగతి చెప్పింది. – “ఇంకెవరనుకుంటున్నావ్? నువ్వే! నీతోనే పెళ్ళి జరిపిద్దామని నిర్ణయించుకున్నా. ఏమంటావురా తమ్ముడూ? అంటూ  అతని  ముఖం లోకి చూసింది.

ఆమె మాటలు వింటూనే షాకయ్యాడు.   నోట్లో పెట్టుకున్న ముద్ద –  గొంతు దిగక, పొలమారడంతో గబుక్కున మంచి నీళ్ళ గ్లాసెత్తి ఇన్ని నీళ్ళు తాగాడు  గడగడా.

ఏ…మి..టీ?..అమ్ములుకి తనతో పెళ్ళా? ఏమంటోంది అక్క? మతి కానీ భ్రమించలేదు కదా? మాట రాని వాడైపోయాడు.

తను అడంగగానే ఎగిరి గంతేస్తాడనుకున్న తమ్ముడు అంత గంభీరం గా మారిపోడానికి కారణం తెలీక, – “ఏరా, నా కూతురు నీకు  నచ్చలేదా?”  అంటూ తమ్ముడి భుజం మీద చేయి వేసి  అడిగింది.

అది కాదన్నట్టు తలూపాడు.

Kadha-Saranga-2-300x268

“మరి?” …ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే స్ఫురించినదాన్లా.. “ఓ, అదా! ఆ పోయింది  తిరిగొస్తుందని  భయ పడుతున్నావా!”

అక్క మాటలకి, చివ్వుమంటూ చూసాడు. గాలికి నివురు  ఎగిరిపోయిన నిప్పు కణికలా ఆమె ప్రశ్నకి అతనికి గతం గుర్తొచ్చింది. మళ్ళీ మంట రాజుకున్నట్టు …జరిగిన ఆ సంఘటన కళ్ళముందు కదిలింది.

అనారోగ్యంతో మంచాన పడ్డ  తల్లి కోరిక మేర,    పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైతే అయింది  కానీ, ‘అమ్మాయి బలహీనం గా వుంది. కాస్త నాలుగు దినాల తర్వాత కాపురానికి పంపుతాం ..దయచేసి కాదనకండి ‘ అని   భార్య తరఫు వారు కోరితే ,  సరే అని  వూరుకున్నారు.

నెల దాటినా   ఏ మాటా లేదు.  ఫ్రెండ్స్ వేళా కోళాలడటం మొదలుపెట్టారు. ‘ఏంట్రా,  మగాడివి గందా,  నువ్వైనా  ఓ సూపు చూసి రావద్దూ  ?’ అంటూ.

అతనికీ మనసు లేకపోలేదు వెళ్ళి రావాలని.  కానీ,  అట్నించి ఏ పిలుపూ లేకుండా ఎలా వెళ్ళడం అనే వెనకా ముందులాడాడు.

‘ఇంట్లో మిఠాయి పొట్లం వుంటే తినకుండా వుండగలమా? కొత్త పెళ్ళామైనా అంతే. తాక కుండా వుండలేం. అదీ అసలైన మగ లక్షణం’కుర్రోళ్ళ  హిత బోధలతో ఉత్సాహంగా బయల్దేరాడు.

వూరు చేరేసరికి, పొద్దు గుంకింది.  ఓ పక్కన  చలి గాలి రివ్వురివ్వుమంటూ కొడుతోంది. మరో పక్క, నిశ్శబ్దం లో కీచు కీచు మంటూ చప్పుళ్ళు. కొన్ని వాతావరణాలకు సైగ భాషేదో వుంటుందనుకుంటా.  జరగరానిదేదో జరగుతుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ వుంటుంది.  అదే సిక్స్త్ సెన్స్. ఏదో జరగబోతున్నట్టు అతనికి అర్ధమౌతోంది.

పొలం గట్టెంట ముందుకు నడుస్తున్న వాడు కాస్త ఠక్కున ఆగాడు. … కొంచెం దూరం లో వున్న  గడ్డి వాము పక్కనించి   గొణ గొణ మంటూ మాటలు వినిపించడంతో  ఆగాడు. ఆగి, చెవి రిక్కించి వినసాగాడు.

“ఎన్నాల్లు నానుస్తావ్? అవతల అత్తోరు పిల్లనెప్పుడు పంపుతారంటూ రోజూ ఫోన్లు చేస్తున్నారు. ఇవాళా రేపు అంటూ రోగం నటిస్తూ వస్తున్నా.   ఇంట్లో వాళ్ళు గెంటి అయినా పంపేలా వున్నారు.”

“అయితే వెళ్ళు..” అంటూ కిసుక్కున నవ్విన మగ గొంతు.

“సిగ్గు లేదూ? –  నాకిప్పుడు   మూడో నెల.  ఇహ దాచడం నా వల్ల కాదు. నువ్వు తీసుకుపోతావా సరే. లేదంటావా చెప్పు, కడుపు కడిగేసుకుని ఆ శ్రీకాంత్ తో  కాపురానికి పోతా… ఏ విషయమూ ఇవాళ తేలాల్సిందే..”

ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. తన పేరు వినిపించడంతో..తన అనుమానం నిజమే అనుకుంటుంటే.. వెన్ను జలదరించింది. అయినా, నిర్ధారణ చేసుకోవాలని నిశ్చయించుకున్న  వాడిలా నిశ్శబ్దం గా కదిలి, గడ్డి వాము వెనక్కి వెళ్ళాడు.

ఎంతో జాగ్రత్త గా చూస్తే తప్ప అక్కడ ఇద్దరు మనుషులున్న జాడే తెలియదెవరికీ.

అతని కళ్ళు టార్చ్ లైట్లుగా మారాయి.

అలికిడికి ఆ ఇద్దరూ విడివడ్డారు. “ఎవరది..ఎవరది..” అంటూ ఆమె కంగారుగా లేచి ముందుకొచ్చింది. జారిన పైట   గుండెల మీద కప్పుకుంటూ!

అతను గుర్తుపట్టాడు. ఆమే ఈమె అని. ఆ మరుక్షణం లో నిలువునా రౌద్రం కమ్మింది.   కళ్ళు –  నిప్పులు కురుస్తున్నాయి. ఉక్కు మనిషి లా కదిలి  ముందుకొస్తుంటే …ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.

తన పాపమంతా కళ్ళారా చూసి, ప్రాణం తీయడానికొస్తున్న యముడిలా కనిపిస్తున్నాడు.

పక్కనున్న వాడు ఎప్పుడోనే పలాయించేశాడు.

అతని చేతిలో చావు ఖాయమనుకున్నదో ఏమో, గభాల్న అతని కాళ్ళ మీద పడిపోయింది.   “దయచేసి నన్నేం చేయకండి..మిమ్మల్ని మోసం చేసిన మాట నిజం.. కానీ..నేనిక మీ జోలికి రాను.. నిజం.  సత్తె ప్రమాణం గా చెబుతున్నా…ఈ వూరిడిచి  పోతున్నా… ఈ జన్మలో  నా మొహం చూపించను. ..నన్నొదిలేయండి..నన్నొదిలేయండి..” అంటూ విలవిల్లాడింది.

తప్పు చేస్తూ పట్టుబడ్డ ఏ నేరస్థుడైనా అంతే.  ప్రాణం దక్కితే చాలనుకుంటాడు. నిజం ముందు అబద్ధం  లొంగిపోవడం అంటె ఇదేనేమో.

ఆమెని చూస్తే నే అసహ్యమేసిందతనికి.  ఇంత నీచపు మనిషి మెడలోనా తను తాళి కట్టింది?  “ఛీ”  అంటూ  కాండ్రించి ఉమ్మేసాడు.  అ ఒక్క అక్షరం చాలు.  ఎదుటి వాడు మనిషైతే, అమాంతం ఛావడానికి.

జీవితం లో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనలు మనసు మీద ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయీ అంటె ..కొన్ని సార్లు ఇరవై లొనే అరవై వచ్చేసిందన్నంత అనుభవాన్నిచ్చిపోతాయి. నిండా వైరాగ్యా న్నీ, నిర్లిప్తతని మిగిల్చిపోతాయి.

ఆ రాత్రి ఇంటికెలా  వచ్చాడో  తెలీదు.

“ఏరా, ఇంత వేళప్పుడొచ్చావ్?.. రాత్రికి వుండమని అన్లేదా మరదలు?” అంటూ నవ్వబోయిన చంద్రమతి, వెయ్యిలంఖణాలు పడ్డ తమ్ముడి మొహం చూసి కంగారు పడింది. వెంటనే భుజం మీద   చేయి వేసి,  “ఏ..మైం..ది..రా తమ్ముడూ.. అలా వున్నావు? అంది.

ఆ చిన్ని పలకరింపుకే  అతనొక్క సారి గా కదిలి కదిలి తుఫాను గా మారిపోయాడు.

మోసపోయాక కలిగే దుఖానికి  ఆడ మగా తేడా లుండవు. హృదయం వుండటం లేకపోవటమొకటే వుంటుంది.

సంగతి తెలుసుకున్న చంద్రమతి, తమ్ముణ్ని పసివాడిలా ఒళ్ళోకి తీసుకుంది.

జరిగిన సంఘటనని కొట్టిపారేసింది.  ఏం జరిగినా మంచనుకోమంది. విలువ తక్కువ మనుషులునించి మంచివాళ్ళని  ఆ భగవంతుడే ఇలా వేరు చేసి, వెలుగు మార్గం చూపుతాడని మంచి మాటలతో అతన్ని ఓదార్చింది.

అతను అంత బాధలోనూ –  చంద్రమతి  ధీరత్వానికి ఆశ్చర్యపోయాడు.

ఆడది అబల అంటారు కానీ, కాదు. కీలక సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పురుషుని కంటె కూడా తెలివిగా ఆలోచిస్తుంది.   బలం గా ఢీ కొంటుంది.

తమ్ముణ్ణి అక్కున చేర్చుకుని, అతను చెబుతోంది వింటునే..మరో పక్క తన కర్తవ్య నిర్వహణ గురించి ఆలోచిస్తోంది.  ముందు తను తమ్ముణ్ణి దక్కించుకోవాలి. వాడి గుండెలో గుచ్చుకున్న ముల్లు పెరికిపడేస్తే, అసలు  గాయమైందన్న సంగతే మర్చిపోతాడు. అదొక్కటే ముఖ్యమనుకుంది.

తల్లిలా లాలించి, స్నేహితురాలిలా హితవు పలికి, అతని వెన్నంటే నీడలా నిలిచింది.

ఒక్కోసారి, అతనికి ఈ లోకం అర్ధమయ్యేది కాదు.   తన చుట్టూ వుండే మనుషులూ,  వాళ్ళ మాటలూ – ఏ నిఘంటువు కి   చెందిన అర్ధాలు.. ? అని వెత చెందే వాడు.   కుశలం అడగడానికొచ్చి, కుళ్ళ బెట్టి  పోయేవాళ్ళు. “ ఏరా..బావున్నావా? సంగతి విన్నాను. అట్టెట్టా పెళ్లి చేసుకున్నావు రా? ‘ అంటూ అడిగే వాళ్ళు. aa  మచ్చ ని గుర్తుచేసేవారు.

లోకం అంతే. నువ్వేదైతే మరచిపోవాలనుకుంటున్నావో అదే గుర్తుపెట్టుకుంటుంది.  అలాటి వాళ్ళని నిలువునా దులిపిపారేసేది చంద్రమతి. మళ్ళా నోరెత్తకుండా మాటల్తోనే వాతలు పెట్టి పంపేది.

అక్క  తన మీద చూపే ప్రేమకి కన్నీళ్ళొచ్చేవి.

సముద్రం లో ఈదేవాడికి – ఈత మాత్రమే వస్తే సరిపోదు.  లోతూ తెలిసి వుండాలి. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే  విద్య ఒక్కటుంటే చాలదు. లోక రీతీ తెలిసి వుండాలి.

త్వరలోనే అతను మామూలు మనిషయ్యాడు.

మనసుకయ్యే గాయాలకు మందు – కాలం అని  అంటారు కాని, అది అబద్ధం. oka మనిషి చేసిన గాయాలను కేవలం మరో మనిషి మాత్రమే మాయం చేయగలడు.. అది ప్రేమ వల్లే సాధ్యమౌతుంది.

ఈ రోజు ఈ వూళ్ళో ఇంత పరువుగా, గౌరవంగా, ఒక ఉన్న త స్థాయిలో వున్నాడూ అంటే అదంతా అక్క చలువే. ఆమె ఇచ్చిన  స్థైర్యమే.

‘అక్క నిజంగా తన పాలిట దేవతే. కాదన్లేని నిజం. కానీ, అందుకు కృతజ్ఞత గా అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం మాత్రం పచ్చి అన్యాయం. కూడని ధర్మం.

మరి ఆమెకెందుకు తట్టడం లేదు ఈ విషయం? ‘ ఆవేదనగా అనుకున్నాడు.

“నా ప్రశ్నకి జవాబు చెప్పావు కాదూ?” అక్క మాటలకి ఉలిక్కిపడి చూశాడు. “అదే, ఆ పోయింది వచ్చి గలాటా చేస్తుందని వెనకాడుతున్నావా, అమ్ముల్ని చేసుకోడానికి?”

అక్క వైపు నిశితం గా చూస్తూ, కాదన్నట్టు తలూపాడు.

“మరి? నీకభ్యంతరమేమిటీ?” నిలదీసింది.

అతనికి ఒళ్ళు మండింది. తింటున్న కంచంలో చేయి కడిగేసుకుని, విస్సురుగా లేచి బయట వరండాలోకొచ్చి నిలబడ్డాడు.

మధ్యాహ్నపు  ఆకాశం నల్ల మబ్బులేసుకుంటూ వుంది. చెట్లన్నీ చలన రహితం గా నిలబడున్నాయి.  ఒక్క ఆకూ  కదలడం లేదు. ఎక్కడా గాలి సడి లేదు.  పొడి పొడి గా..వాతావరణం కూడా అతని మనసు లా ఉక్కబోతగా వుంది.

తమ్ముడి ప్రవర్తన ఏ మాత్రం బొధపడటం లేదు చంద్రమతికి. అయినా, పట్టు వదలని దాన్లా  అతని వెనకే వచ్చి నిలబడింది. చిన్నగా గొంతు సవరించుకుని మాట్లాడ సాగింది.

“తమ్ముడూ…నీకు నా గురించి తెలీందేముందిరా?  పెళ్లైన కాడ్నించి   నేనే మాత్రం సుఖపడ్డానంటావ్, చెప్పు.” అంది తాను చెప్పదలచుకున్న విష యానికి  ఉపోద్ఘాతం లా.

ఆమె మాటలు అక్షర నిజాలు.    గొప్పింటి వాడని, పిల్ల సుఖపడుతుందని చక్రపాణి కిచ్చి పెళ్ళి చేసారు.    కానీ మోసపోయారు. పట్నంలో బిజినెసు, కాలేజి చదువు అన్నీ అబధ్ధాలు. గొప్పలకు పోవడం. అప్పులు చేయడం. జల్సాగా తిరగడం అతని నైజం.  కాదంటే తిడతాడు. కొడతాడు. చివరికి  తేలిన నిజాలివి.

మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. విలువైనది.  పవిత్రమైనది.  అందుకే చావైనా, రేవైనా అక్కడే. తేల్చుకోవాలంటుంది. తప్పదు. తప్పేదీ లేదు. అయినా, ఆడపిల్ల అత్తారింట్లో బలవంతపు చావు చస్తే కన్నవారికి కలిగే శోకం ..మొగుణ్ని వదిలి పుట్టింట్లో వుంటానన్నపుడు  రాదు. ఫలితం గా ఏ ఆడపిల్లకైనా –  పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు మంట గా మారుతుంది.

సరిగ్గా చంద్రమతి పరిస్థితీ అంతే.

అప్పటికే అమ్ములు కడుపులో పడింది. బిడ్డ పుట్టాకైనా అతను బాధ్యత తెలుసుకుంటాడని ఆశపడ్డారు. మారక పోగా, మరిన్ని వ్యసనాలొచ్చి చేరాయి.    చీడ పురుగు ఒక్క చెట్టుని మాత్రమే పట్టి వదిలేయ దు.  వనమంతా చెరుస్తుందట. చెడ్డలవాటైనా అంతే. ఒకటంటించుకుంటే పది  ఉచితంగా అంటుకుంటాయి.

ఇదంతా శ్రీకాంత్ కి తెలిసిన సంగతే. మళ్ళా గుర్తుచేస్తోంది.

“వున్నదంతా చీట్ల పేకలో తగలేశాడు. తగులూమిగులూ తాగితే తాగనీ అని సరిపెట్టుకున్నా…  చూస్తున్నావ్ కదా! బాగోతం.  చివరి వీధిలో ఎవత్తినో వుంచుకుని.. తందనాలాడుతున్న ..”  ఆమె గొంతు జీరబోయింది.

అతను వింటూండిపోయాడు.

” నాన్న ఇచ్చిన ఈ ఇల్లూ,  నీ చేతిలో పొలం, నాకింకా మిగిలున్నాయీ అంటే అది  నీ బావ   చూపు పడక కాదు. నీ నీడలో నేనుండటబట్టీ అవి ఆగాయి. నువ్వంటే భయం వల్ల నిలిచాయి.

తమ్ముడూ!

కట్టుకున్నోడు  చస్తేనే ఆడది ఒంటరి దవ్వదు. ఇలాటి ఎదవ మొగుళ్ళు  బ్రతికి చచ్చినా ,  ఆమె ఒంటరి పక్షే అవుతుంది. దిక్కులేని అనాధ గా బ్రతుకీడుస్తుంది. ఈ నిరాశ భరించలేక ఎన్నో సార్లు చచ్చిపోవాలని ప్రయత్నించా.   కానీ నీ మీద ప్రేమ, నువ్వు అమ్ములు మీద చూపే ఆప్యాయతకి  నేను బందీ అయి బ్రతికాను రా!..అవును!  మీ ఇద్దర్ని రెండు కళ్ళు గా చూసుకుని బ్రతికాను.” ఆమెకి కన్నీళ్ళాగలేదు.

రాతి బండలో  నీళ్ళుంటాయట. రాయిలా కనిపించినంత మాత్రాన మనిషి లో కన్నీళ్ళెక్కడికి పోతాయి?

అతని మనసు మూల్గింది.

“ఇప్పుడు నాకున్న ఆశా దీపం అమ్ములొక్కటే. నీ పిలుపులో అది బంగారం. అంత బంగారాన్ని ముక్కూ మొహం తెలీని వాడి చేతికెలా అప్పచెప్పమంటావ్?   దాని తండ్రి ఏమంత ఘనుడని పరువు గలవాడొస్తాడంటావ్?

తమ్ముడూ! నీకు ఆస్తి వుందని అడగడం లేదు రా . నీ గుండెలో అమ్ములుందని అడుగుతున్నా. తన కూతుర్నికంటికి రెప్పలా కాచే వాడు  అల్లుడుగా రావాలని  ప్రతి ఆడపిల్లతల్లీ  కోరుకున్నట్టే…నేనూ నిన్ను అల్లుడిగా చేసుకోవాలని ఆశ పడుతున్నాను.  నీ చిటికిన వేలి సాయంతో అమ్ములు జీవితాంతమూ సుఖ శాంతులతో బ్రతుకుతుందనే గొప్ప నమ్మకంతో అడుగుతున్నాను. తమ్ముడూ!  అమ్ముల్నిపెళ్ళి చేసుకోవూ?”  –  ఆర్ద్రం గా అడిగింది.

అదిగో! మళ్ళీ అదే మాట?.. చివ్వున ఇటు తిరిగి, అక్క కళ్ళల్లోకి  చూస్తూ, బాధ గా చెప్పాడు.

“లేదక్కా, చేసుకోను.”

“చేసుకోవూ? ” రెట్టించింది.

“ఊహు. చేసుకోను. అసలు ఈ మాట అడ గడానికి నీకు నోరెలా వచ్చింది అక్కా?” ఆవేశపడుతున్న తమ్ముడి వైపు ప్రశ్నార్ధకం గా చూస్తోంది చంద్రమతి.

మళ్ళీ అతనే అన్నాడు.  ” అమ్ములు బంగారు తల్లి.  నా ప్రాణం. నా ప్రా..ణం కంటే కూడా ఎక్కువ .‘  పట్టలేని ప్రేమోద్వేగం  పొంగి, పొర్లి   గొంతు లో మాటను అడ్డుకుంది. కళ్ళల్లో కన్నీరై ఉబికింది.

ఎంత ప్రేమ! అదే.. సరిగ్గా అతన్లోని ఆ ప్రేమే తన బిడ్డకి సొంతం కావాలని, చంద్రమతి  ఆశపడుతోంది.  తన కూతురికి ఆ సిరి దక్కాలనే ఇంతగా ఆత్రపడిపోతోంది.

మనమనుకుంటాం, రోజులు మారాయి..మారాయని.   కానీ, కాలం ఎంత మారినా, యుగాలు ఎన్నొచ్చినా.. ఎప్పటికీ  స్త్రీ   సౌభాగ్యం maatram-  పెనిమిటే. అతని ప్రేమే ఇల్లాలికి సుఖ సౌధం. స్వర్గ తుల్యం. ఆ విలువేమిటో, ఆ వరమేమిటో  దొరికిన వాళ్ళ కంటేనూ, దక్కని  అభాగ్యులకే  బాగా అర్ధమౌతుంది.

అందుకే చంద్రమతి తొందరపడుతోంది. ఎలాగైనా తమ్ముణ్ని ఈ పెళ్ళికి ఒప్పించాలని. కానీ, చేసుకోనంటున్నాడు. ఎందుకూ?

“పోనీ నీ అభ్యంతరమేమిటో చెప్పు.” సీరియస్ గా అడుగుతున్న అక్క వైపు కోపం గా చూస్తూ…”నిజంగా నీకు తెలీదా?” అన్నాడు మరింత కోపంగా.

“నిజంగా ఏం ఖర్మ. అబధ్ధం గా కూడా తెలీదు. నువ్వు చెప్పు.” అంది వింతపోతూ.

“అక్కా, ఇది పరిహాసాలకి సమయం కాదు. నాకూ, అమ్ములుకి మధ్య ఎంత వయసు తేడా వుందో నీకు తెలీదా? ఒకటి కాదు రెండు కాదు.” ముఖమంతా ఎర్ర గా చేసుకుంటున్న తమ్ముడి వాలకం చూసి  ఫక్కుమంటూ బిగ్గరగా  నవ్వింది. – ఓస్..ఇదా నీ మనసులో వున్నదీ అనే అర్ధం ధ్వనించేలా నవ్వింది.

నీ మొహం. అమాయకుడ్లా మాట్లాడకు. వయసు తేడానా?  ఏమంత తేడా అనీ? నాకూ మీ బావకీ పదేళ్ళ  తేడా లేదూ?”

“హు. అందుకేగా మీ ఇద్దరి ఆంతర్యాల మధ్య అంత దూరం!’  బాధగా తలపట్టుకున్నాడు.

“అసలు అమ్మకీ నాన్నకి మధ్య ఎంత తేడా వుందో తెలుసా?”

‘తెలుసు. ఇరవై యేళ్ళ తేడా..ఆవిడకి ఊహ వచ్చేసరికి ఈయన వూరు  దాటుకు పోయాడు. తనని కట్టుకుంటే రేపు అమ్ములు జీవితం కూడా అంతె కాదూ?’ వీల్లేదు..వీల్లేదు..ఊహలో సైతం ఊహించడానికి అతని మనసొప్పుకోవడం లేదు. ఇక నిజ జీవితం లోకి అమ్ముల్నెలా  ఆహ్వానిస్తాడని?

“అంత వరకెందుకు, మన సుబ్బులు ..” చెప్పబోతున్న అక్క మాటలకి బ్రేక్ వేస్తూ ‘ఇక ఆపు’ అంటూ చేత్తో సైగ చేసాడు.  – “నువ్వెన్ని చెప్పు. నేను అమ్ముల్ని చేసుకునే ప్రశ్నే లేదు. ఇక ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేద్దాం.” అంటూ మరో మాటకి తావీకుండా, తేల్చి చెప్పేశాడు.

తమ్ముడు అంత ఖచ్చితం గా ఖరా ఖండిగా వొద్దనేస్తాడని ఏ మాత్రం ఊహించని చంద్రమతి కి ముందు అవమానమేసింది. ఆ తర్వాత కోపం ముంచుకొచ్చింది. అది ఆగ్రహం  గా మారింది. ఇదంతా ఒక్క క్షణం లోనే! మరు క్షణం లో  ఆమె కాళికావతారమెత్తిపోయింది.  ఉఛ్వాస నిశ్వాసలు పాము బుసల్ని తలపిస్తున్నాయి.

“నాకు తెలుసురా. నీ మనసులో ఏముందో   నన్నడుగు చెబుతా.  నేనింత గా ప్రాధేయ పడుతున్నా నువ్వొద్దంటున్నావంటే నేను నీకు   సొంత  తోబుట్టువుని  కాదు కాబట్టే గా?   హు. ఎప్పటికైనా సవితి తమ్ముడు సవితి తమ్ముడే అని నిరూపించావ్…మా మీద ప్రేమ నటించి..ఈ రోజు మనసులోని విషం కక్కావ్. బుధ్ధొచ్చింది. నిన్ను నా రక్త సంబంధం అనుకున్నాను చూడు..అది..అదే నేను చేసిన పాపం. ”

అక్క మాటలు తూటాల్లా పేల్తున్నాయి.   గురి పెట్టి వదిలిన తుపాకీ గుండు సూటిగా  గుండెల్లోకి దిగబడిపోయినట్టు… ప్రాణాలు విలవిలా కొట్టుకుంటున్నాయి.   ‘ఎంత మాటంది అక్క? అసలు తనకు గుర్తు అయినా లేదే..ఆమె తన సొంత అక్క కాదని.. తండ్రి మొదటి భార్య  సంతానమని, ఆమ్మ కూతురని ఎప్పుడైనా..అనుకున్నాడా? అసలు  తన నీడైనా తలచిందా ఆ మాట?

“అలా మాట్లాడకు అక్కా..ప్లీజ్…” అతనికి   దుఃఖం మేస్తోంది. ప్రాధేయపూర్వకంగా ఆమె చేతులు పట్టుకోబోయాడు.

విసిరి కొట్టింది.  ఎర్రబడ్డ కళ్ళతో మనిషి మొత్తం – పోటెత్తిన సముద్రం లా ఊగిపోతోంది.

“ఒరేయి..నువ్వొద్దన్నంత మాత్రాన అమ్ములు పెళ్ళి ఆగిపోతుందనుకోకు.  చూడూ! అమ్ములు పెళ్ళి నేను చేస్తా. నీ కళ్ళముందే, నీ కంటె గొప్పోణ్ణి తీసుకొచ్చి చేస్తా. వారం లో.. ఒక్క వారం లో దాని పెళ్ళి చేసి,  అత్తారింటికి పంపక పోతె లేదూ? నేను చంద్రమతినే కాదు. “ అంటూ చిటికేసి చాలెంజ్ చేసింది. పక్కనున్న  కుర్చీ ఎత్తి, నేలమీద విసిరేసింది. ఆ వెనకే  పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ, గడప దాటింది. ఏదో గుర్తుకొచ్చిన దాన్లా వెనక్కి తిరిగి అరిచింది. ‘ఒరేయి, శ్రీకాంతూ!  ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. నే బ్రతికుండంగా నీ గుమ్మం తొక్కను.  నువూ అంతే. నా వైపు చూసినా, నా బిడ్డతో   మాట్లాడినా.. అమ్ములు చచ్చినంత ఒట్టు. అంతే. నీకు నాకు ఈ క్షణంతో  సంబంధం  తె..గి..పో..యిం..ది. అంతే. అంతే “ అంటూ వేగంగా  వెళ్ళిపోయింది.

స్థాణువైపోయాడు. మెదడు మొద్దుబారిన మనిషిలా..  వున్నవాడు వున్నచోట్నే కూలబడి పోయాడు.

తమ శరీరాలు రెండు. ఆత్మ ఒక్కటే అనుకున్న అక్క …ఇదేవిటీ, ఇట్టా… అతను తెల్ల బోతున్నాడు.

ఒకరికొకరం అంతా అర్ధమైపోయామనుకోడం చాలా పొరబాటుతనం. మన సొంత వారి మనసులో- మన మేమిటో మన స్థానమేమిటో తెలియాలంటే వాళ్ళు ఆత్మీయం గా వున్నప్పుడు కాదు, ఆగ్రహం వచ్చినప్పుడు తెలుస్తుంది. కడుపులో దాచిన అసలు నిజాల్ని కక్కేస్తూ మాట్లాడే మాటల్లో మనల్ని మనం చూస్తాం. అసల్ది  తెలుసుకుంటాం.

అక్క తనని అర్ధం చేసుకుంది ఇంతేనా!.. అతన్ని చంపేయడానికి ఆమె కత్తి తీసుకున్నా అంత గా ఖిన్నుడయ్యేవాడు కాదేమో!

సోదరి  వ్యక్తిత్వం ఏమిటో అతనికి బాగా తెలుసు. ఆమె ఎంత మంచిదో అంత చెడ్డ తిక్కది. పరమ కోపిష్టిది. మాటంటే మాటే. దిగి రాదు గాక రాదు.  తను ప్రస్తుతం అక్క  శాపానికి గురైనాడని తెలుసు. ప్రేమకి మారుపేరయిన అక్కకి తను దూరమైపోయాడనీ తెలుస్తోంది. అయినా సరే. అతడు తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు. అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం అంటే…తెలిసీ తెలిసీ ఆ అమాయకురాలికి అన్యాయం చేయడమే అవుతుంది.  అంత ద్రోహం తను చేయలేడు.

కానీ, అక్క వైపు చూడకుండా, ప్రాణానికి ప్రాణమైన  అమ్ముల్తో  మాట్లాడకుండా ఎలా వుండటం?

ఏమో! ఏమీ తోచనట్టు గా వుందతనికి.  దిక్కు తోచని వాడిలా చూస్తుండిపోయాడు.

*****

అనుకున్నట్టు గానే చంద్రమతి – అమ్ములు కి  పెళ్ళి సంబంధం ఖాయం చేసేసింది. ఈ శుభ వార్త వూరంతా గుప్పుమంది.

కనీసం మాట మాత్రం గా నైనా చెప్పలేదతనికి.

ఇరవై నాలుగ్గంటలూ ‘మావయ్యా మావయ్యా’ అంటూ వెనకెనకే  తిరిగే అమ్ములు కంటికి కనిపించనైనా కనిపించడం మానేసింది.  ఇద్దరిళ్ళకీ మధ్య వున్న ఆ చిన్న పిట్ట గోడ ఇప్పుడు ఇనప కోటగా మారడం విధి విచిత్రం. ఎంతైనా విషాదం.    ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ ..ఈ గడపలోంచి ఆ గడపలోకి చీమల్లా వెళ్ళొస్తుండే మనుషులు ఇప్పుడు బందీలైన ఖైదీలకు మల్లే అయిపోయారు.

మనిషికీ మనిషికీ మధ్య మనసు లేనప్పుడు..ఒకరి పట్ల మరొకరికి అభిమానాలు  అంతరించిపోయినప్పుడు ఈ జీవులు  – ఎవరికి ఎవరైనా ఏమౌతారని? – ఉత్తి శిలలు  కాకుంటే?

అమ్ముల్ని పెళ్ళి కూతుర్ని చేసారు. హోరున పెళ్ళి మేళాలు మోగుతున్నాయి.

ఇంట్లో కూర్చున్న అతన్ని  ‘మేన మామవి, పెళ్ళి బుట్ట పట్టాలి రా!’అంటూ లాక్కొచ్చారు బంధువులు.   చంద్రమతి తమ్ముడి వైపు  వైపు చూడ్నైనా  చూళ్ళేదు.   అమ్ములు   – వంచిన తల ఎత్తనూ లేదు.

కానీ…పెళ్ళి కూతురి అలంకరణ లో కుందనం బొమ్మలా మెరిసిపోతోంది.  అతని ముఖం వెలిగిపోయింది. అంతలోనే ఆరిపోయింది. ‘మనసు  చీకటౌతోందెందుకనీ?..అమ్ములు –  పెళ్లై వెళ్లిపోతున్నందుకేమో!’ కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి.

పీటల దగ్గర  – తెర కవతల  కూర్చున్న వాని  వైపు చూడబుధ్ధైనా కాలేదతనికి.

విరక్తిగా  వెనక్కొచ్చి ..తలుపులు బిగించి సోఫాలో కూలబడిపోయాడు.

అమ్ములు పెళ్ళై వెళ్ళిపోతోందా?..ఇంక ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతోందా?

‘ఈ చేతుల్లో  పెరిగిన అమ్ములు..గుండెల మీద నిద్రపోయిన అమ్ములు…ఈ ఇల్లంతా తనదే అన్నట్టు తిరగాడిన అమ్ములు..పెళ్ళై వెళ్ళిపోతోందా?

నిన్న జరిగింది గుర్తుకొస్తోందతనకి.

..తల్లికి తెలీకుండా   చాటుగా వచ్చింది. చూసి ఉలిక్కిపడ్డాడు. కాదు. సంబర పడ్డాడు. నిలువెత్తు పండగై పోయాడు.

వచ్చి, ఎదురుగా తలొంచుకు నించుంది. మౌనంగా.

‘అమ్ములు నోరు విప్పి ఏమన్నా మాట్లాడితే బావుణ్ననిపించింది. కానీ, ఏమంటుది. పసిది! తనకు ఆమెకూ మధ్యనున్న  అనుబంధానికి పేరేమిటో, ఇంత వయసొచ్చిన తనే  సరిగా నిర్వచించలేకపోతున్నాడు.  ఇక ఆ పసిది, ఏమని వివరణలిస్తుందనీ? ‘ అతడింకా ఆలోచనల్లోంచి తేరుకోకముందే,  గభాల్న అతని పాదాల మీద వొంగింది…ఆ లేత చేతుల స్పర్శ కంటే ముందుగా  వెచ్చటి కనీళ్ళొచ్చి పడ్డాయి. “అమ్ములూ..’  ఆమె రెండు భుజాలు పట్టి పైకి లేపాడు.

‘మావయ్యా..అమ్మ..అ మ్మ..” వెక్కుతోంది.

“పిచ్చి పిల్లా! అమ్మ గురించేనా నీ బెంగ. నేను చూసుకుంటాను రా..నువ్వేం భయపడకు. ..” ఇంకేదో చెప్పబోయాడు. అమ్ముల్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనిపించింది. గుండెలకు హత్తుకుని, అసలు ..ఏమిటేవిటో చెప్పాలనుంది.. కానీ ఒక్క మాటా  రావడం  లేదు.

‘అమ్ములూ’ అక్క కేక వినిపించడం తో… ‘అమ్మో..అమ్మ!’ అంటూ   వెనక గుమ్మం వైపు పరుగు తీసింది.

అమ్ములు ఎందుకొచ్చింది? ఆ కన్నీళ్ళ భాష కి భాష్య మేమిటీ?  అర్ధమైతే బావుణ్ణు కదూ?

అదిగో! మాంగల్య ధారణ జరిగిపోతోంది. ఒక్కసారిగా బాజాలు మారుమోగిపోతున్నాయి.  గట్టిగా చెవులు మూసుకున్నాడు. విన్లేనివాడిలా.

సూది మొనలా మొదలైన ఒక శూన్యం అంతులేని ఆకాశమై అతన్ని మింగేస్తోంది.   శరీరం నించి జీవాన్ని బలం గా   లాక్కుని పోతున్నప్పుడు కలిగే నరక బాధ ఎలా వుంటుందో ప్రత్యక్షంగా   అనుభవిస్తున్నాడు.

ఇలా ఎందుకౌతోందనేది,  అతనికింకా అర్ధం కావడం లేదు కానీ, ప్రేమంటే అంతేగా! –  దూరాన్ని సహించలేకపోవడం. బాధని ఓపలేని వాడైపోయాడు. కొత్తగా అలవాటు చేసుకున్న ఆల్కహాల్ ని తనివిదీరా తాగి..తాగి..గాఢ నిద్రలోకెళ్ళిపోయాడు.

****

‘శ్రీకాంత్..ఒరేయ్ శ్రీకాంత్..’ తలుపులు పగిలిపోయేలా బాదుతున్నారు.

“ ఊ..ఎవరది?” – మత్తులోనే నత్తి నత్తిగా ఉరిమాడు.

“శ్రీకాంతు. లేవరా. కొంప మునిగింది. పెళ్ళి బస్ కి యాక్సిడెంటైందట్రా..” రావుడు మావయ్య గొంతు వొణుకుతోంది.

వినంగానే,  పక్కలో పిడుగు పడ్డట్టు   ఒక్క ఉదుట్న కదిలి ..తలుపు తీసాడు. “ఇంటి ముందు గుంపు గా జనం. కలకలం గా మాట్లాడుకుంటున్నారు.

“పెళ్ళి బస్సు కి ఆక్సిడెంటైంది… అమ్ములు సంగతి తెలీడం లేదు..” వార్త వింటూనే…కంపించిపోయాడు. మరు క్షణంలో గాలి కంటే వేగం గా కదిలాడు. రెండు నిమిషాల్లో కారు బయల్దేరింది.  శర వేగంతో దూసుకుపోతోంది.

“ ఒరేయి..పెళ్ళికొడుకు పోయాడట్రా…తెలీంగానే మీ అక్క తెలివితప్పి పడిపోయింది…” మావయ్య మాటలు  వినిపిస్తున్నా అతన్లో ఎలాటి మార్పూ లేదు. కంటి రెప్ప కదల్లేదు. కనుబొమ ముడుచుకోనూలేదు.

ఆ క్షణం లో అతనెంత   రాయిలా కనిపిస్తున్నాడంటె..అతన్ని  చలింపచేసే విషయమేదీ ఈ ప్రపంచంలో లేదన్నంత గంభీరం గా వున్నాడు. భయంకరమైన గంభీరం గా వున్నాడు.

కారు చక్రాలు భూమికి  ఆనడం  లేదు. వాహనం గాల్లో తేలుతోందా   అనేంత  వేగం గా డ్రైవ్ చేస్తున్నాడు.

హుటాహుటిన  ప్రమాద స్థలానికి  చేరారు.

అక్కడి బీభత్స దృశ్యాలు చూసి అందరూ.. కళ్ళు మూసుకున్నారు. రోదనలు..శోకాలు..కెవ్వుకెవ్వు కేకలు..రక్తపు మడుగులు ..చెల్లా చెదురుగా పడున్న నిర్జీవ శరీరాలు..అతనికివేమీ కనిపించడం లేదు. అతని కళ్ళు వేగంగా.. అతి వేగం గా కదులుతున్నాయి..’అమ్ములు…అమ్ములు…అమ్ములు…’ఒరేయ్! కనిపించరా…ఈ మావయ్యకొక్కసారి కనిపించరా అమ్ములు.  లోలోన రోదిస్తున్నాడు.

అదిగో..అక్కడ ..దూరంగా..ఆ ముళ్ల కంప పక్కన..బొర్లా పడి..నేలనతుక్కుపోయిన శరీరం. రక్తం తో తడిసిన పూలజడ…చూడంగానే..గుండె కి అప్పుడొచ్చింది స్పర్శ. “అమ్ములూ…’ భూమి దద్దరిల్లేలా కేక పెట్టాడు.

అసుపత్రి కి తరలించే ఏర్పాట్లు వెంటవెంటనే.. చక చకా  జరిగిపోయాయి.

*****

అప్పటికి మూడు నెలలైంది ఆ సంఘటన జరిగి. ఘోర ప్రమాదం నించి అమ్ములు బ్రతకడం ఒక మిరాకిల్ అన్నారు డాక్టర్లు.   అతని శ్వాస ఆమెకి తిరిగి ఆయువు పోసిందేమో! అతని స్పర్శ ఆమెలో చలనాన్ని కలిగించిందేమో. తెలీదు. అమ్ములు  మామూలు మనిషైంది.

ఆసుపత్రి నించి ఇంటికి తీసుకొచ్చేసారు.   బాగా కోలుకుని, ఇప్పుడు కాలేజ్ కి కూడా వెళ్తోంది.

ఎటొచ్చీ..చంద్రమతే..తమ్ముడి కి మొహం చూపించలేకపోతోంది.

కూతురికి ఇష్టం లేకపోయినా పంతం కొద్దీ పెళ్ళి చేసింది. తమ్ముని నిజమైన ప్రేమని దూషించింది. అవమానించింది.   ఏమైంది చివరికి?

సమయానికి వాడే గనక ఆదుకోకుంటే..అమ్ములు తనకు దక్కేదా?

కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్న అక్క వైపు చూసాడు. ఎలాటి మనిషి ఎలా అయిపోయిందీ!   ఆడ పులిలా వుండేది.  ఇప్పుడేమో..పిచ్చుకలా అయిపోయింది. ఆ ఠీవీ, హుందాతనమెక్కడికి పారిపోయాయో. చెప్పలేని దైన్యం గా  ..దిగులుగా వుంటున్న అక్కని చూడలేకపోతున్నాడు.

“తమ్ముడూ!” పిలిచింది.  ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని గ్రహించి “చెప్పక్కా..” అన్నాడు.

“అమ్ముల్ని తీసుకుని పట్నం వెళ్ళిపోదామనుకుంటున్నానురా..”  తలొంచుకుని చెప్పింది.

అక్క మనోగతం  అర్ధమైంది అతనికి. లోక నిందకి భయపడి వెళ్ళిపోతానంటోంది. కాదు తన నించి పారిపోతానంటోంది.

లేదు. అలా జరగకూడదు. అందుకే బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అక్కా, అమ్ములు తనకు దూరం కాకుండా వుండాలంటే.. దగ్గరయ్యే మార్గం ఒకటే.

అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం.

హు!తనని పెళ్ళి చేసుకుంటే అమ్ములు కలకాలం పసుపు కుంకాలతో సువాసినిలా వర్ధిల్లదని..అపోహ పడ్డాడు. కానీ ఏం జరిగింది? తన వల్ల ఆమెకి అన్యాయం జరుగుతుందనుకున్నాడే కానీ మరొకరి వల్ల జరగదన్న గారంటీ లేదని ఆ దేవుడు నిరూపించలేదూ? అంతా ఆ పై వాని లీల.

కాకపోతే?- అమ్ముల్ని ఎలా బ్రతికిస్తాడు? తిరిగి దక్కింది అంటే, శాశ్వతం గా  దక్కించుకోడానికే అని అతనికి బలం గా అనిపిస్తోంది. ఇది ఆ దైవాజ్ఞ గా శిరసావహించదలచుకున్నాడు.  అందుకే ధైర్యంగా చంద్రమతిని అడిగాడు. “అక్కా, నీ దీవెన్లతో అమ్ముల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను..ఏమంటావ్?” అని.

వింటొంది తనేనా? అంటోందీ తమ్ముడేనా  అన్నంత ఆశ్చర్యానందాలతో  పట్టలెని ఉద్వేగంతో తమ్ముణ్ణి కౌగిలించుకుని ఏడ్చేసింది.  ‘ఒరేయి నువ్వు దేవుడివిరా..దేవుడివి…’ మరింత గా వెక్కెక్కి పడుతూ చెప్పింది.

చంద్రమతి ని ఓదారుస్తున్న శ్రీకాంత్ కి – అమ్ములు మాటలు మరో సారి మననంలోకొచ్చాయి.

ఆసుపత్రి నించి డిస్చార్జ్ అయి వచ్చేస్తుంటే… అమ్ములు అతని చేయందుకుని అన్న మాటలు.

‘మావయ్యా..నేను అమ్మ దగ్గరకి వెళ్ళను. నీ దగ్గరే వుంటాను. ఎప్పుడూ.. ఎప్పుడూ నీ దగ్గరే వుండాలనుంది మావయ్యా…’ అంటూ గుండెల్లో ముఖం దాచుకున్న అమ్ములు..గుర్తొచ్చి..హాయిగా నవ్వుకున్నాడు.

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. అమ్ములు కథ చదివాను ..ఆర్ద్రం గా ఉంది ..ఇప్పటికీ మేనమామ తో వివాహాలు జరుగుతున్నాయి అంటే నే నాకు ఆశ్చర్యం గా ఉంది ..మేనమామ తండ్రి తో సమానం అంటారు ..వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే ఉంటుంది .అక్క తో ముందుగా శ్రీకాంత్ తను అమ్ములు నీ ఎందుకు పెళ్ళి చేసుకోలేక పోతున్నాడో వివరం గా చెప్పి ,ఆమె వివాహం తను చేస్తానని చెప్పి , ఒప్పించినట్టు ఉంటే ఎలా ఉండేది కథ ? కథ లో పాత్రలు మనం ఊహించిన విధం గా ప్రవర్తించరు ..రచయిత్రి చేతిలో ఉంటాయి పాత్రల తీరూ తెన్నులు ..మేనరికాల వల్ల జన్యూ సంబంధిత రోగాలు తో పిల్లలు పుడుతున్నారని చెపుతున్నా మన ఆంధ్ర దేశం లో ఈ మేనరికాల సంబంధాలు ఇంకా జరుగుతున్నాయి ..కొత్త వారితో సంబంధాల కన్నా ఇలా తెలిసిన వారు నయం అని ఒక భావన కాబోలు ..దమయంతి గారూ ! మీరింకా మంచి కథలు రాయగలరు ….త్వరలో నే చదవగలనని ..ఆకాంక్షిసిస్తూ ..
    వసంత లక్ష్మి .

    • ఆర్.దమయంతి. says:

      1…. అమ్ములు కథ చదివాను ..ఆర్ద్రం గా ఉంది

      * ఈ కథకి ఒక రియల్ స్టోరీ ప్రేరణ వసంత. అందుకే సహజమైన హృదయ స్పందన కలుగుతుంది. కథ పై మీ మొదటి వాక్యమే అందుకు సాక్ష్యం గా నిలుస్తుంది.

      2. ఇప్పటికీ మేనమామ తో వివాహాలు జరుగుతున్నాయి అంటే నే నాకు ఆశ్చర్యం గా ఉంది ..

      * అంత ముమ్మరంగా లేకున్నా, మొత్తానికి జరుగుతున్నా మాట వాస్తవం. ఇది అలా జరిగిందే గా మరి!

      3. మేనమామ తండ్రి తో సమానం అంటారు ..
      * మీరు అంటుంటే గుర్తొస్తోంది వసంతా! ..ఒక సారి పేపర్లో చదివాను. తన కాబోయే భర్త తన తండ్రిలా వుండాలని (అంత అపురూపంగా చూసుకోవాలని అర్ధం ) కొందరు యువతులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వారిలో ఒక సినీ నటి కూడా వున్నారు. చదవం గానే మనసు ఆర్ద్రమైన మాట నిజం. బహుశా ఈ కథ లో కూడా ఆమె కి మేనమామ లో ఆ ఫిగర్ షేడ్స్ కూడా అగుపిమ్చి వుండొచ్చు అని అనుకుంటున్నా..

      4…వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే ఉంటుంది .

      * ఈ కథలో ని నాయకుని కీ అదే బాధ! అందుకే వెనకాడాడు వివాహానికి.

      5.అక్క తో ముందుగా శ్రీకాంత్ తను అమ్ములు నీ ఎందుకు పెళ్ళి చేసుకోలేక పోతున్నాడో వివరం గా చెప్పి ,ఆమె వివాహం తను చేస్తానని చెప్పి , ఒప్పించినట్టు ఉంటే ఎలా ఉండేది కథ ?

      * ఒక రైటర్ గా చెప్పాలంటే చాలా ఆర్టిఫిషియల్ గా వుండేదనిపిస్తోంది..ఎందుకంటే – అమ్ముల్ని ప్రేమించాడు కనక!..

      7. కథ లో పాత్రలు మనం ఊహించిన విధం గా ప్రవర్తించరు ..రచయిత్రి చేతిలో ఉంటాయి పాత్రల తీరూ తెన్నులు ..
      * మీరు చెప్పింది నిజమే వసంత. ఒక రైటర్ గా మీకు అనుభవమే కదూ?

      8. మేనరికాల వల్ల జన్యూ సంబంధిత రోగాలు తో పిల్లలు పుడుతున్నారని చెపుతున్నా మన ఆంధ్ర దేశం లో ఈ మేనరికాల సంబంధాలు ఇంకా జరుగుతున్నాయి ..
      * ఈ కథ గురించి అడిగి తెలుసుకున్న మా పక్కిమ్టామె చెప్పారు. తను చూసిన సంఘటన గురించి.
      మేనరికం చేసుకున్న ఆ జంట కి ముందు గా ఆడపిల్ల పుట్టిందట. ఆ వెనక మగపిల్లాడట. కథ ఎలా మొదలైమ్దంటే..మనవరాలు మేనమానే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తే ..చేసేదేం లేక పెళ్లి జరిపించారట. వింటుంటే..విడ్డూరం గానే అనిపించింది నాకు.

      9. కొత్త వారితో సంబంధాల కన్నా ఇలా తెలిసిన వారు నయం అని ఒక భావన కాబోలు ..దమయంతి గారూ !
      * వ్యక్తీ గతంగా నేనూ వ్యతిరేకినే వసంతా! (మొన్నా మధ్య సూపర్ హిట్ అని అందరూ అనుకున్న సినిమాలో కూడా అత్త కొడుకు.. బావ పిలుపు ఆ వలపు నాకు నచ్చలేదు.) ‘మనం ఒక స్థాయి కొచ్చేసాం. ఇంకా ఇవన్నీ ఏమిటీ, అర్ధం లేకుండా’.. అని కొట్టిపారేస్తున్నాం కానీ.. జరిగే చోట్ల జరుగుతూనే వున్నాయి.

      10. మీరింకా మంచి కథలు రాయగలరు ….త్వరలో నే చదవగలనని ..ఆకాంక్షిసిస్తూ ..
      * అంటే – ఇది చెడ్డ కథ అనే గా మీరు అంటోందీ? :-) ( ఊరికే అన్నా లేండి. లైట్ తీసుకోండి.)
      మీకు నా పై గల నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోడానికైనా సరే తప్పకుండా మరో మంచి కథ రాస్తాను.
      ఎంతో ఓపికగా కథ చదివి, మరెంతో ఓర్పు గా రెవ్యూ నిచ్చినందుకు ఆనందం గా వుంది.
      మరో మాట.. లేడీ రైటర్స్ ఒకరి కథలోకరు చదివి, ఒకరి జడలో ఒకరు పూలు పెట్టుకుంటున్నారు అనే అపప్రద నించీ బయట పడేసింది మీ విమర్శ.
      అందుకు మీకు బోలెడు ధన్యవాదాలు తెలియచేసుకోవాలి.
      థాంక్యూ వెరీ మచ్ వసంతా..

  2. krishna mohan mocherla says:

    కథ బాగుంది, కధనం బాగుంది. ఈ తరం రచయితలు, పాఠకులకు నచ్చక పోవచ్చు. కారణం మారిన కాలంలో పాఠకులు రచన నుంచి ఆశించేది వాళ్ళకు తెలిసిన అర్ధం అయ్యే relations and expectations. The story is narrating about certain, specific situations and how a person responds to those situations. The story is more relevant to the past years society conditions rather than present day society in a big town or city. When reader reads the story as is without expectations or using any judgement its more enjoyable. But human brain do not enjoy the present moment, runs between past and future and with a judgement of characters hence a conflicting opinions may form after reading the story. But for me, as I read the story it reflected reality of earlier times where మేనరికం marriages were most common in the society. It would have been better if the writer mentioned the time line when the story took place (directly or indirectly) in the story. In short I like the story as is, as I did not expected any message or any teaching from the story and just read the story as is. Regards .దమయంతి గారూ

    • ఆర్.దమయంతి. says:

      ‘…. In short I like the story as is, as I did not expected any message or any teaching from the story and just read the story as is.’
      * నిజమేనండీ. సమాజాన్ని మార్చేయాలనే ఉద్దేశంతో నేనీ కథ రాయలేదు. ఒక యదార్ధ కథని ఆధారం గా చేసుకుని అల్లిన కథ. ఇది జరిగి ఎంతో కాలం కూడా కాలేదు. ఇటీవలే!
      మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు కృష్ణ మోహన్ గారు.
      శుభాభినన్దనలతో..

  3. రమణ కెవి says:

    కథ చదివించింది. చివర సినిమాటిక్ గా ఉంది. ఐతే అక్కా, తమ్ముడు, మేనమామ, మేనగోడలు సెంటిమెంట్ తో అంత బరువెక్కించక్కర్లేదు. అతను మొదట మేనగోడల్ని పెళ్లిచేసుకోకూడదని అనుకున్నాడు. తర్వాత ఆమెకు పెళ్ళయి భర్త చనిపోయాక ఆమె పరిస్థితిని బట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇందులో మేనరికం మొదలైన చర్చ అక్కర్లేదు. అప్పుడు కూడా తనే ఆ అమ్మాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయించినట్టు చెప్పినా మంచి ముగింపే అవుతుంది. ఊరికే సెంటిమెంట్ ను దట్టించెయ్యకుండా under-statement గా deal చేస్తే దమయంతిగారు ఇంకా మంచి కథలు రాయగలరు.

    • ఆర్.దమయంతి. says:

      .. సెంటిమెంట్ తో అంత బరువెక్కించక్కర్లేదు.
      * సెంటిమెంట్ అంటేనే బరువైనది అని అర్ధం కదమ్డీ? కాదా! :-)

      … ఇందులో మేనరికం మొదలైన చర్చ అక్కర్లేదు. అప్పుడు కూడా తనే ఆ అమ్మాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయించినట్టు
      చెప్పినా మంచి ముగింపే అవుతుంది.
      * అలా జరగలేదండి..అలా జరిగుంటే నేనీ కథ రాసే దాన్ని కాదేమో, బహుశా!

      ఊరికే సెంటిమెంట్ ను దట్టించెయ్యకుండా under-statement గా deal చేస్తే దమయంతిగారు ఇంకా మంచి కథలు రాయగలరు.
      * కథని బట్టి సెంటిమెంట్ దట్టించడం..దట్టించకపోవడం అనేది ఆధారపడి వుంటుంది. అయినా ఒక మంచి పాఠకుని గా మీరు చెబుతున్న మాటల్ని కొట్టిపడేయలేను. తప్పకుండా మీ సూచనలని, సలహాలని దృష్టిలో వుంచుకుంటానండి.

      రమణ గారు, కథంతా చదివి, మీ విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ..
      శుభాభినందనలతో..
      .

  4. ‘రూపం లేని ప్రేమకి ఆయుష్షు మాత్రమే వుంటుంది.అందుకే అది మనిషి పోయినా మిగిలుంటుంది’ మంచి వాక్యాలు మేడం , కథ బాగుంది .

    • ఆర్.దమయంతి. says:

      చాలా థాంక్సండి భవాని గారు, కథ చదివి, మీ ప్రశంస ని అందచేసినందుకు.

  5. Chimata Rajeandra Prasad says:

    ఒకరికొకరం అంతా అర్ధమైపోయామనుకోడం చాలా పొరబాటుతనం. మన సొంత వారి మనసులో- మన మేమిటో మన స్థానమేమిటో తెలియాలంటే వాళ్ళు ఆత్మీయం గా వున్నప్పుడు కాదు, ఆగ్రహం వచ్చినప్పుడు తెలుస్తుంది. కడుపులో దాచిన అసలు నిజాల్ని కక్కేస్తూ మాట్లాడే మాటల్లో మనల్ని మనం చూస్తాం. అసల్ది తెలుసుకుంటాం.
    ఈ కథ లోని జీవిత సత్యం

    • ఆర్.దమయంతి. says:

      అలా నిజమే కదండీ!..కోపం లో మన వాళ్ళు భలే మాటలనేస్తుంటారు. ఆ తర్వాత..మర్చిపోతారు.
      కానీ..విన్న వాళ్లు మరచిపోరన్న సంగతి అన్న వాళ్లకి తెలీదెందుకో అని అనుకుంటూ వుంటాను.
      ఈ కథని మీరు పూర్తిగా చదివారన్నందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వాఖ్య! ధన్యవాదాలు – రాజేంద్ర ప్రసాద్ గారు.

  6. కథ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది (దమయంతి మామ్, రీడర్స్ చేత ఎలా చదివించాలొ మీకు బాగా తెలుసు).

    • ఆర్.దమయంతి. says:

      :-) థాంక్స్ సురేష్. ఎప్పట్లానే, ఈ కథ కి- మీరిచ్చిన కితాబు కి సంతసమైంది మనసు.
      కథ కి జీవం- రీడబిలిటీ అనే సత్యాన్ని మీ స్పందన ద్వారా తెలియచేయడం ఎంతైనా ముదావహం.
      మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
      శుభాకాంక్షలతో…

  7. తిలక్ బొమ్మరాజు says:

    కథ చాలా బాగుంది దమయంతి గారు.ప్రేమా ,ఆప్యాయత నిండిన కథ.నచ్చింది.అభినందనలు.

    • ఆర్.దమయంతి. says:

      తిలక్ గారు,
      మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు.
      శుభాకాంక్షలతో..

  8. B.PRATHAPKUMAR REDDY says:

    దమయంతి గారూ! ఒక్క మాట లో చెప్పాలంటే కధ చాల బాగుంది మేడం… మొదట అక్క అడిగినప్పుడు మేనకోడలిని ఎందుకు చేసుకోను అన్నాడో సులభంగా ఊహించొచ్చు ..అక్క అనుకున్న వయసు తేడా ఒక్కటే కాదు.. ఇంట్లో నే చిన్నప్పటి నుంచి చూస్తున్న,కళ్ళ ముందే పెరిగిన పిల్ల మీద ప్రేమ చాల ఉంటుంది..కాని భార్య గా అనుకునే ప్రేమ కాదు ..ఉండదు కూడా..మేనకోడలిని తన భార్యగా ఊహించుకోలేక పోయాడు ..అంతే..చివరగా ఎందుకు చేసుకున్నాడు అంటే తన కళ్ళ ముందే తన మేనకోడలికి అన్యాయం జరగకూడదు అన్న ప్రేమతో నే… మంచి కధ చదివించారు మేడం..సినిమాటిక్ గా కూడా ఏమి లేదు..నిజం చెప్పాలంటే వాస్తవానికి దగ్గర గా కూడా ఉంది… :)

  9. ఆర్.దమయంతి. says:

    ” సినిమాటిక్ గా కూడా ఏమి లేదు..నిజం చెప్పాలంటే వాస్తవానికి దగ్గర గా కూడా ఉంది…”
    నిజమే ప్రతాప్! ఇది నిజం గా జరిగిన సంఘటన ఆధారం గా అల్లిన కథ.
    సినిమాటిక్ అనుకుంటాం కానీ..జీవితం లో జరిగే కొన్ని సన్నివేశాలను..తెరకెక్కించే కెమెరాలుండవు. చూస్తున్న కళ్ళు మాత్రమే వుంటాయి. కన్నీళ్ళన్నీ కథలు కాలేవు. కొన్ని గుండె చప్పుళ్ళు కొందరికే అర్ధమవడం ఎంత విచిత్రం కదూ?..బహుశా ఈ కథలో చెప్పాలనుకున్నదీ అదే అయి వుంటుంది.
    ధన్యవాదాలు ప్రతాప్, కథ చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు.
    శుభాకాంక్షలతో..

  10. V.V.Satyanarayana Setty says:

    క థ చా లా బా గుం ది . ద మ యం తి గా రి నుం డి మ రి కొ న్ని ఇ టు వం టి క థ లు ఆ శి స్తు న్నా ను .

    • ఆర్.దమయంతి. says:

      V.V.SATYANARAYANA SETTY
      గారు, :-) చాలా చాలా థాంక్సండి, కథ పై గల మీ అభిమానానికి!
      తప్పకుండా మంచి కథలు రాసే ప్రయత్నం చేస్తాను.
      మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      శుభాకాంక్షలతో

  11. V.V.Satyanarayana Setty says:

    Katha chaalaa baagundi.

  12. లక్ష్మీ నారాయణ బి వి says:

    ఏంటో వెలితి…………..బహుశా నిడివి ఎక్కువైనట్లుంది…..సినిమాటిక్ మలుపులు కథను నడిపించినట్లుగా వుంది. పల్లెల్లో సెంటిమెంట్లూ పంతాలూ ఎక్కువే …..శిల్పం వరకూ ఓకే…..మధ్యలో ఆంగ్ల అక్షరాలు పంటి కింద రాళ్ళు…..నాకైతే….నాటిక చూసిన అనుభూతి….దమయంతి గారు కొన్ని పాత్రలు చెక్కడంలో నేర్పరి….భేష్

  13. ఆర్.దమయంతి. says:

    ఒక మెరుపు, ఒక విరుపు గా సాగిన వ్యాఖ్య భలే నచ్చేసింది!
    బెహెరా తమ్మునికివే నా ధన్యవాదాలు తెలుపుకుంటూ
    శుభాకాంక్షలతో…

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

*