నీలాంటి చీకటి

శ్రీకాంత్
ఒక సమాధిని తవ్వుతున్నట్టు ఉంది
   పగటి నిప్పులు పడ్డ కళ్లల్లో రాత్రి చినుకులు ఏవైనా రాలి చల్లబడతాయేమోనని
   ఒక్కడినే ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చుంటే -

ఈ సమాధి ఎవరికి అని అడగకు.
   చీకట్లో కూర్చుని చేతివేళ్ళు విరుచుకునే ధ్వనుల్లోంచి వెళ్ళిపోయింది ఎవరు
   అని అడగకు. వొంగిపోయిన శిరస్సు కింది వొణికే నీడలు
   వెతుకులాడేది ఎవరినీ అని అడగకు. గాలి - ఉండీ లేని

ఈ గాలి - ఆగీ ఆగని ఈ గాలి - ఉగ్గబట్టి అక్కడక్కడే తిరుగాడేది
   ఎవరి కోసమో అని అడగకు. ఎక్కడిదో ఒక నీటి స్మృతీ, మట్టి వాసనా, చుక్కల కింద
   స్థబ్ధుగా నిలబడిన చెట్లూ, చెట్ల కొమ్మల్లోని నిశ్శబ్ధం, మరి

నిశ్శభ్ధాన్ని చెల్లాచెదురు చేసి
   కొమ్మల్లోంచి ఆకస్మికంగా ఎగిరిపోయే ఒక పక్షీ గుర్తుకు తెచ్చేది
   ఎవరినీ అని కూడా అడగకు. సృజనా ఊరకే చదువు-

నిశ్చలమైన సరస్సులో బిందువొకటి రాలి
   వలయాలు వలయాలుగా విస్తరించుకున్న ప్రకంపనల్లో, ఎవరో తమ ప్రతిబింబాన్ని
   క్షణకాలం చూసుకుని, చిన్నగా వేలితో తాకి వెళ్ళిపోయిన సవ్వడి-
   కనుల కింది ఏర్పడ్డ రాత్రి వలయాల్లో ఎవరో కదిలిన సవ్వడి

ఇష్టమైన ముఖాన్ని ఆఖరిసారిగా చూసుకుని
   అరచేతులతో సమాధిలోకి మట్టి వొంపిన సవ్వడి. రెక్కలు విరిగిన సవ్వడి. సన్నగా
   కోసుకుపోతున్న సవ్వడి. లీలగా, ఎవరో ఏడుస్తున్న సవ్వడి. లోపలంతా
   ఇక - మిగలబోయే - బావురుమనే ఒక ఖాళీ సవ్వడి
నువ్వు అనే సవ్వడి

సృజనా - అవును.

నిజంగా ఇక్కడ ఏమీ లేదు. బ్రతికి ఉండగానే మనుషులని నింపాదిగా కొరుక్కుతినే
నీలాంటి చీకటి తప్ప –

                     - srikanth

మీ మాటలు

 1. ns murty says:

  శ్రీకాంత్ గారూ,

  చాలా చాలా బాగుంది. అభివాదములు.

 2. dr.radheya says:

  కవితలో భావ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంది.నన్ను బాగా ఆకట్టుకుంది.

 3. తిలక్ బొమ్మరాజు says:

  ఒక అద్భుత కవిత .చాలా నచ్చింది సర్ ఎప్పట్లాగే.కంగ్రాట్స్ సర్.

 4. వ్యక్తీకరణ బాగుంది

 5. balasudhakarmouli says:

  వస్తువును పరిపరి విధాలుగా వ్యక్తం చేయడం అనే ఆలోచనలోంచి వచ్చే వొక మంచి వ్యక్తీకరణ వల్ల కవిత దేదీప్యమౌతుంది. ఇలాంటి కవితని నిర్మించటం ఎప్పుడూ వొక కళే. శిల్పకళే. ఇదే వస్తువుతో యింకో నలుగురైదుగురు కవులు ఎలా లీనం అవుతారోననే కుతూహలం.

 6. కవిత హృదయాన్ని తాకేదిగా కదిలించేదిగా యుంది చీకటికి అలవాటు పడ్డ మనుషు ల్ల్న్నప్పుడు జరి గేది ఆన్త్తె

 7. రమణ కెవి says:

  మూడు సార్లు చదివినా కవిత అర్థం కాలేదు. గజిబిజిగా అనిపించింది. ఎవరైనా కాస్త వివరిస్తే బాగుంటుంది. లేక బొల్లోజు బాబా గారి డెఫినిషన్ ప్రకారం వస్తువు బలంగా లేక కవిత్వం ఎక్కువైందా?

మీ మాటలు

*