మళ్ళీ మళ్ళీ చదవాలి!

విమల
విమల

మార్చి 29 పతంజలి పుట్టిన రోజు 

మనకున్న అతి కొద్దిమంది అద్భుతమైన రచయితల్లో పతంజలి ఒకరు. ఈ వ్యవస్ధ పరమ నికృష్టంగా, నీచంగా వుందనీ, మానవ సంబంధాలు వంచన, అన్యాయం, కపటత్వం, అసమానతలు, హింస, దోపిడీ, దుర్మార్గాలతోనూ, సకల మానవీయ విలువల పతనంతోనూ భ్రష్టుపట్టి పోయాయని, మనంత హిపోక్రసీతో బతికే ప్రాణి ఈ భూప్రపంచం మీద మరొకటేదీ లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. సమాజ చలన సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే అక్షరం పతంజలి చేతిలో అస్త్రం అయింది. ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు, అధిక్షేపణలు లోనంతా డొల్లే అయినా, డాంబికాలతో, ఆత్మవంచన, పరవంచనలతో బతికే ఆధిపత్య కులాల జీవన విధానాన్నీ, బూటకపు ప్రజాస్వామ్యపు నాటకాన్నీ ఎండగడతాయి.

రావిశాస్త్రిలానే, పతంజలి కూడా రాజ్యం దాని అంగాలైన, న్యాయవ్యవస్ధ, పార్లమెంటరీ వ్యవస్థ, సాయుధబలగాలు, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే పత్రికారంగం ఎవరి కొమ్ముకాస్తాయో ఎలాంటి శషబిషలూ లేకుండా తెగేసి చెప్పాడు. ఆయన సృష్టించిన పాత్రలు, అవి చేసే తర్కము, వెక్కిరింతలు, చమత్కార సంభాషణలు, ఈ వ్యవస్ధను అపహాస్యం చేసి, దాని అసలు స్వరూసాన్ని నగ్నంగా మన ముందుంచుతాయి. గుండెలను బరువెక్కించే, మండించే, పదునైన, ప్రత్యేక శైలి పతంజలిది. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలని, వస్తువే కాకుండా మనం చెప్పే విధానం,శిల్పం కూడా చాలా ముఖ్యమని నమ్మినవాడతను. మంచి సమాజంరావాలని, సమాజపు అంచులకి విసిరివేయబడ్డ దళితులు, స్త్రీలు తమదైన సాహిత్యాన్ని శక్తివంతంగా సృష్టిస్తారని, వ్యవస్ధలో వున్న సకల అంతరాలూ పోవాలనీ కోరుకున్న వాడు పతంజలి.

ఆయన ప్రాపంచిక దృక్ఫధం ఆయన రచనలన్నిటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాజ్యం తాలూకు హింసనీ, దుర్మార్గాన్నీ తప్పు పడుతూ రాయటంతో పాటూ, ఆయనకు తెలిసిన ప్రాంతపు జీవితాన్ని, అక్కడి భాషని, నుడికారన్నీ రాయటానికి పూనుకోవడం ఆయనే చెప్పుకున్నట్లు ఆయన సాహిత్యంలోని రెండవ దశ. ఖాకీవనం నవల చివరాఖర, సౌలభ్యం కోసం ఈ నవల తెలుగునాట, తెలుగు పాత్రలతో రాయటం జరిగిందనీ, వాస్తవంలో ఈ కధ తెలుగు దేశానికే పరిమితం కాదనీ, దేశంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగివుండవచ్చనీ చెబుతాడు. ఈ నవలే కాదు. పతంజలి ఇతర నవలలోని పాత్రలకీ, ఇలాంటి సర్వజననీయతే వుందనిపిస్తుంది. మానవ స్వభావాలు, వ్యవస్ధ దుర్మార్గాలు, అవి మారటం కోసం మనుష్యులు చేసే పోరాటాలు, వాళ్ళ ఆశలు, కలలు అన్ని చోట్లా దాదాపు ఒకటిగానే వుంటాయి. యధాతధ స్ధితిని రాసి ఊరుకోవటం మాత్రమే కాకుండా, ఆ స్ధితి మారాలని గాఢంగా కోరుకున్నాడు పతంజలి. ఏ వ్యవస్ధలనైతే ఆయన వెక్కిరించి, వాటి ముసుగులు తీసి అసలు రూపు మనకి చూపాడో, ఆ వ్యవస్థలు మరింత దుర్మార్గంగా ఇవ్వాళ్ళ ప్రజల్ని పీక్కు తింటున్నాయి.

హిందుత్వ శక్తులు అధికార పీఠానెక్కాయి. ప్రపంచీకరణ విషఫలితాలు, సమాజంలోని ఆర్ధిక అంతరాలు, కుల వ్యవస్ధ పురుషాధిపత్యం ఏ అట్టడుగు ప్రజల జీవితాల గురించి పతంజలి రాసాడో, ఆ ప్రజల జీవితాల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. పతంజలి మనకి దూరమైన ఈ ఆరేళ్ళ కాలంలో సమాజంలో హఠాత్తుగా చోటు చేసుకున్న పెద్ద మార్పులేవీ అంతగా లేవు. ఆయన మనకు సుదూరకాలపు రచయితేం కాదు. పతంజలి కానీ, ఆయనలా సమాజంలో మంచి జరగాలనీ, మార్పురావాలనీ రాసే రచయితల రచనలు కానీ అలాంటి మార్పు జరిగేంత వరకూ సమకాలీనతని కోల్పోవు. ఆతరువాత కూడా గత సమాజాల్ని అర్ధం చేసుకునేందుకు మనకు పరికరాల్ని అందిస్తాయి. పతంజలి సాహిత్యం అలాంటిదే.

పతంజలి సాహితీ సృజనంతా ఒకెత్తయితే, జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో ఆయన రాసిన కాలమ్స్‌, సంపాదకీయాలు పతంజలి భాష్యంగా వచ్చివవన్నీ మరొక ఎత్తు. వ్యాసాల్లో రాజకీయ అభిప్రాయాలను మరింత సూటిగా, స్పష్టంగా చెప్పేందుకు వీలుంటుంది. ఆయా పత్రికల యాజమాన్యాల వైఖరులను బట్టి కొన్ని సందర్భాల్లో రాయాల్సి వచ్చినా, కొన్ని అభిప్రాయాలు పంటికింది రాళ్ళలా చికాకు పెడతాయి. దానికన్నా ఆయన తన ఇంటర్వ్యూలలో, ఇతర రచయితల రచనల గురించి రాసిన సాహిత్య వ్యాసాలలోనూ తన ధృక్పధాల్ని, అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాడు. ప్రసిద్ధి చెందిన కొందరు రష్యన్‌ రచయితల్ని ఇప్పటికీ మనం మళ్ళీ చదువుకుంటాం. మనలోనూ, సమాజంలోనూ జరిగే మార్పులు, నూతన పరిణామాలను బట్టి ఆ రచనలు మనలో మళ్ళీ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.అవి  కొత్త ద్వారాల్ని తెరుస్తాయి. వాటికి కాలదోషం పట్టదు. పతంజలి నవలలు, కధలు కూడా అలాంటివే.

 

వ్యంగ్యానికి చిరునామా పతంజలి                        

అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్

ఆధునిక తెలుగు సాహిత్యం గర్వించదగ్గ రచయితల్లో కె.ఎన్. వై. పతంజలిగారు ఒకరు. నవలాకారుడిగా, వ్యంగ్య రచయితగా, జర్నలిష్టుగా, ఆయుర్వేద వైద్యుడుగా ఆయన తెలుగు సమాజానికి విశిష్టమైన సేవలు అందించారు. ఇది వరకు అనేక మంది గొప్ప రచయితల రచనల్ని సంపుటాలుగా ప్రచురించి తెలుగు పాఠకులకు ఎనలేని సేవలు అందించిన మనసు ఫౌండేషన్ సంస్థవారు, ఇప్పుడు పతంజలి రచనల్ని కూడా వెలువరించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

పతంజలి రచనలు ఈనాటి సమాజానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయన అనేక సామాజిక వాస్తవాలను తన రచనల్లో వ్యంగ్యాత్మకంగా చిత్రించారు. ఆయన వ్యంగ్యం చాలా బలమైంది. పాఠకుల హృదయాల మీద అది బలమైన ముద్రను వేస్తుంది. మన సమాజంలోని అనేక వైరుధ్యాలను పతంజలిగారు చిత్రించినంత బలంగా చాలా తక్కువమంది చిత్రించారు. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది.

 

పుచ్చిపోయిన “నాలుగవ స్తంభం” గుట్టు విప్పిన పతంజలి

రమాసుందరి

రమాసుందరి

పతంజలి … ఇరవై ఒకటో శతాబ్ధపు ఆలోచనలను రగిలించిన అగ్గి. తల్లక్రిందులుగా వేలాడుతున్న సమాజపు పోకడ పట్ల ఆయనకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన గుండె పొరలు చీల్చుకొని, కంఠనాళాలు ఉబ్బి, కంటి జీరలు ఎర్రగా పొంగి … చివరాఖరుకు ఆయన కలంలోని సిరాతో  బులుగు రంగు అద్దుకొన్నాయి. ఆ బులుగు రంగు తీక్షణత వెటకారం అవతారం ఎత్తింది. ఆ వెటకారం ఒకసారి వీరబొబ్బిలిగా మారి మనసు లోగిళ్ళలో స్వేచ్ఛగా విహరిస్తూ మన హిపోక్రాటిక్ ఆలోచనలను మెల్లిగా నాకుతుంది. ఒక్కోసారి అదే వెటకారం గోపాత్రుడు రూపంతో భూమి బల్లపరుపుగా ఉందని వితండ వాదన చేసి గెలుస్తుంది.

సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని ఫోర్త్ ఎస్టేట్ బండారాన్ని మనకు పరిచయం చేసినమిత్రుడు పతంజలి. “వెర్రి వెధవ. నీకు రాజకీయాలేమిటి?” అంటూ ఒక మినిస్టర్ ని ఎకసెక్కం చేసే విలేఖరి ఈ కొత్త లోకాలలో గవర్నరు బంగాళా కాడా, అసెంబ్లీ మెట్ల మీదా ఉంటాడు. నిత్యం టీవీల్లో చూసే పరిసరాలే. పాత్రలే సామాన్య ప్రజానికానికి అపరిచితం. జర్నలిష్టుగా తనకు మాత్రమే తెలిసిన సత్య లోకాలను తెలుగు పాఠక లోకానికి సంశయం లేకుండా విదితం చేశాడు పతంజలి. పడి పోయిన రైల్లో డబ్బు, బంగారం దోచుకొనే రిపోర్టర్లతో మొదలు పెట్టి, ఆ దోపిడికి మూలాలు ప్రధాన మంత్రి  కుర్చీలోనే ఉన్నాయని నిర్భయంగా వెల్లడి చేశాడు. బొగ్గు నుండి, వేవ్ లెంగ్త్ దాకా అమ్ముకొన్న అధికార రాజకీయాలు గుర్తుకు రావటం లేదూ?

పత్రికలనైనా, ప్రపంచాన్నయినా శాసించేది డబ్బు. ఆ డబ్బు ముంగిట్లో తాగి దొర్లే విలేఖరులు కూడా ఈ వ్యవస్థలో భాగమే. తన స్వజనం గురించి నిర్మొహమాటంగా మొదలు పెట్టి పెట్టుబడికి సాగిల పడే పత్రికా యాజమాన్య  వైఖరిని ఆయన బట్టబయలు చేసి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా చెప్పవచ్చేదేమిటంటే ఇప్పుడు రాజకీయాలు, పెట్టుబడి, పత్రికలు మూడూ ఒకే శరీరానికి అంటుకొని ఉన్న మూడు ముఖాలు. ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో ముఖం కనబడుతుంది. పతంజలి! నువ్వు తొట్ట తొలిగా తొలిచిన రంధ్రంలో చూసిన లోకాన్ని  ఈ రోజు ఆమ్ ఆద్మీ 70 ఎం.ఎంలో చూస్తున్నాడు.

అక్షరాల మీద ప్రేమతో రిపోర్టరు వృత్తిలో చేరి, అదే అక్షరాల మీద జుగుప్సతో బతుకీడుస్తున్నవారు ఈ వృత్తిలో కోకల్లలు. కొత్త రాజధాని ప్రాంతంలో భూములిస్తున్న  రైతులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారనీ అబద్ధాలు రాసీ రాసీ అలసి పోవటం లేదా? వీడియోలలో ప్రశ్నిస్తున్న రైతులను కత్తిరించి కత్తిరించి చేతులు నొప్పి పుట్టటం లేదా? పతంజలి చెప్పినట్లు అక్షరాలు ఖాళీ పంజరాల్లాగా, ఓటి కుండల్లాగా, ఎవరినో దగా చేస్తున్నాట్లు, వేళ్ళ సందులో నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు అనిపించటం లేదూ? ఒక రాయి విసరలేక పోవటం, ఒక కత్తి దూయ లేక పోవటం, ఒక చెంపపెట్టు వార్త రాయలేక .. ప్రసారం చేయలేక పోవటం .. అక్షరాలను కడుపు కూటి కోసం, టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంటు కోసం  అమ్ముకొంటున్న అశక్తతని ఎన్నడో పతంజలి అర్ధం చేసుకొన్నాడు. ఆ అక్షర హత్యలనూ, ఆ గాయాలను సహృదయులైన తెలుగు పాఠకులకు చూపించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ వర్గాల దృక్పధంతోనే జీవితాన్ని విశ్లేషించే మీడియా ప్రపంచపు మోసాన్ని జగద్విదితం చేశాడు.

రిపోర్టరు భార్యగా కాలరెగరేసుకొని తిరిగిన రాధిక అత్యాచారానికి, హత్యకు గురి అయినపుడు, ఆమెను పత్రికా రిపోర్టర్ల పేరంటాలుగా పేర్కొన్న దమ్ము పతంజలిది. “మందు బుడ్డీలకూ, పోసుకోలు కబుర్లకూ, అబద్ధాలకూ, కుట్రలకూ, క్షుద్ర రాజకీయాలకు అలవాటైనా పాపిష్టి ప్రెస్ క్లబ్ ను కూలదోసి మనందరం ఆవిడకు అక్కడ ఒక గుడి కట్టాలి.” అని  రెండు దశాభ్డాల క్రితం ప్రతిపాదించాడు పతంజలి. పేగులు తెగేదాకా  అత్యాచారానికి గురి అయి, చచ్చిపోయి ..  దేశమంతా అలజడికి కారకురాలైనా ‘నిర్భయ’ను కనీసం ‘ఇండియన్ డాటర్’ గా నిరాకరించే స్థితిలో ఇంకా మేము ఉన్నాము అని మీకు మనవి చేసుకొంటున్నాము పతంజలి!

“పాలక వర్గాలు తమ దోపిడీ స్వేచ్ఛకు ప్రమాదం అనిపించినప్పుడల్లా ప్రజాస్వామ్యానికి ముప్పు అని గగ్గోలు పెట్టినట్లే, మీరు మీ వ్యాపార స్వేచ్ఛకు హాని కలిగినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని గోల చేస్తారు. వెర్రి నా ప్రజలు రెండూ నమ్ముతారు.”

ప్రజలు హక్కులను గుర్తు చేసుకోకుండా ఏమార్చి, వారి కలలు నులిమేసి .. పత్రికలు పాలక వర్గాలకు కొమ్ముకాస్తున్న ఈ వర్ధమాన సందర్భం, ‘పత్రికా స్వేచ్చ’ గురించి చేస్తున్న జపం ..  మనం పతంజలిని ఎంత స్మరించాలో కదా!

 

పతంజలిని చదువుతుంటే ఏమవుతుంది?

29-raghava
రాఘవరెడ్డి

పతంజలిని  చదువుతున్నప్పుడు ఏమవుతుంది? చిరునవ్వు మొలుస్తుంది. చురుక్కుమంటుంది. కసి రేగుతుంది. ఎప్పటి నుండో పేరుకు పోయిన కసి తీరుతున్నట్లుగాను తోస్తుంది. పదునైన కత్తి అంచు మీద పరుగు పెడుతున్నట్లు ఉంటుంది. గట్టిగా తొడపాశం పెట్టినట్లు ఉంటుంది. గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. ఆ అక్షరాలు పరమ  ధైర్యంగా, కరుగ్గా పదునెక్కి తోస్తాయి. సూటిగా, ధాటిగా వెంటాడే వాక్యాలై నిలుస్తాయి. కళ్ళు తెరిపిస్తాయి. భ్రమల్ని బద్దలుగొడతాయి. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకొంటూ, పడక్కుర్చిలో అలా ఆరాముగా పడుకొందామనుకొంటే ఎక్కడో తగిలి కసుక్కున గుచ్చుకొంటాయి. అసలు మనుషులంతా సగం మంది జైళ్ళలో, సగం మంది పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్ళు అంటూ అధారిటీ చేస్తాయి.

అయితే ఇంతకీ పతంజలిని ఇప్పుడు కూడా చదవాలా? ఈ పిజ్జా, బర్గర్ తరానికి ఆయనేం చెబుతాడు ఇప్పుడు? పాత వాసన కొట్టడా? కొట్టడు. మేడి పండు పొరలు వలిచి, “ఇదిగో ఇవిరా నాయనా దీని లుకలుకలు.” అని చూపెడతాడు. ఉన్న రంగులన్నీ కడిగేసి “ఇదిగో, ఇదీ అసలైన ముఖం.” అని తెలియ చేస్తాడు. మన సర్వ సత్తాక లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం .. ఎంత సుందరమైనదో, ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నత ఉదాత్త ఉత్కృష్టమైనదో మన కళ్ళకు కడతాడు. ఎంత గొప్ప స్వేచ్చ మనకుందో, అది మనం ఏం చేయనంత వరకూ మనకుంటుందో అర్ధం చేయిస్తాడు.

అయితే ఒక దుర్మార్గపు పనికి కూడా పూనుకొంటాడు. నాలుగు స్థంభాలూ కలిసి నమ్మకంగా నీ కళ్ళకు గట్టిన గంతలు ఉన్నాయే! నీకు చాలా సుఖాన్నిస్తున్న గంతలు. నా యిల్లు, నా పిల్లలు, నా పెళ్ళాం, నా భద్ర జీవితం అనుకొంటూ  వెచ్చగా రగ్గు కప్పుకొని, కమ్మగా నిద్ర పోవటానికి అవకాశం యిస్తున్న గంతలు. వాటికి ఎసరు పెడతాడు. పుస్తకం మూసి, పక్కన పెట్టి పడుకొన్న తరువాత కూడా వెంటపడి, వేధించి, కలల్లోకి దూరి నీ గంతలు దొంగిలిస్తాడు. వ్యవస్థను నగ్నంగా నీ ముందు నిలబెడతాడు. నీ శాంతిని దూరం చేస్తాడు. నిన్నూ నొప్పి పుట్టేటంతగా డిస్టర్బ్ చేస్తాడు. వీలయినంత వొంగి, లేదా నేలకు అంటుకొని సాగుతున్న ఆలోచనలను జుట్టు పట్టుకొని పైకి లేపీ, ‘నువ్వు సకశేరుకానివి రా నాయనా’ అని అనవసరంగా గుర్తు చేస్తాడు. నాలుగు చితుకులేరీ పోగు పెట్టి, మంట రాజేస్తాడు. శివుడాజ్నను ధిక్కరించకుంటే చీమలు నలిగిపోక తప్పవనీ నిరూపిస్తాడు. మనిషన్నాక ఒక పాట ఉండద్దా అంటాడు. పాటన్నాక ఒక చూపు ఉండద్దా అంటాడు.

మరి కొత్త తరం పాఠకులు? మీ గంతలు మీకే ఉండాలనుకొంటే, మీ నిద్రలు మీరు పోవాలనుకొంటే, డిస్టర్బ్ అవద్దనుకొంటే హాయిగా దేశభక్తితో సంచరించండి. ఈ వైపుకు చూడద్దు. ఈ పెద్ద సూటైన రాస ముక్కు పెద్ద మనిషి వైపు రావద్దు.

 *

మీ మాటలు

  1. నాకు పతంజలి అనే పేరు తెలియదు. సాక్షి పత్రికలో ఒక కాలం నిర్వహిస్తున్నప్పుడు చదువుతూ అబ్బుర పోయాను .ఉన్నట్లుంది వారి కాలం ఆగిపోయింది.పల్లెలో ఉండడం వాళ్ళ వారి పుస్తకాలు నాకు దొరక లేదు.మనసు ఫౌండేషన్ వీరి రచనలు వేస్తున్నారని తెలిసి .చాల ఆనందంగా ఉంది.పుస్తకం వసునే చదివి స్పందించాలని నా ఆశ .

  2. మనసు ఫౌండేషన్ వారి పతంజలి సాహిత్యం రెండు భాగాలు 2012 లోనే వచ్చాయి.అన్ని చోట్ల దొరుకుతున్నాయి.

  3. Thirupalu says:

    పతంజలి సాహిత్యo మీద తెరలేపిన రచయితులు వ్యాఖ్యా నించిన తీరు, ఆయనకిచ్చిన నివాళి బాగుంది.
    ఈ పిజ్జా, బర్గర్ తరానికి ఆయనేం చెబుతాడు? ఏమీ చెప్పడు. కాదు, కాదు, వారు వినిపిమ్సికోరు. శివుడాజ్నను ధిక్కరించకుంటే చీమలు నలిగిపోక తప్పవనీ నిరూపిస్తాడు కాబట్టి, ఆ చీమాలు ఆయనను సెవినేసుకొంటాయి.
    రమా సుందరి గారూ ఫోర్త్ ఎష్టేట్ ఆయన ఎక్కుపెట్టిన తీరును అద్బుతంగా ప్రదర్సిoచారు.

  4. buchi reddy gangula says:

    గొప్ప రచయిత
    అవార్డ్స్ — రివార్డ్స్ రావలిసి ఉండే —అంతగా గుర్తింపు లేకుండానే ????
    నివాళులు — అందరు చక్కగా చెప్పారు

    ———————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  5. Rajendra prasad Chimata says:

    రాఘవ రెడ్డి గారి మాటలు అక్షర సత్యాలు, మనసంటూ ఉండే మనుషులకు

  6. కొత్త రాజధానిలో రైతులు ఆనందబాష్పాలు రాలుస్తున్నారా? లేక కన్నీళ్లు కారుస్తున్నారా? అనేది పక్కన బెడితే…బంగారు తెలంగాణాలో రైతులు మాత్రం..బంగారు పంటపొలాలు చూడలేక అక్కడే ఉన్న బంగారు చెట్లకు బంగారంతో చేయించిన తాళ్లతో ఉరిపేనుకుని చనిపోతున్నారా? అక్షరాల మీద ప్రేమ ఉన్నవారు, వ్యాపారానికి లొంగనివారు ఇదెందుకు చూపించడం లేదు. రైతుల ఆత్మహత్యలు ఒక చెంపపెట్టు వార్త కాదా? కడుపు కూటికోసం, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ‘దొర’ ముందు సాగిలపడని నిఖార్సనైన రాతగాడెవరో….?

    • శ్రీనివాసుడు says:

      “మందు బుడ్డీలకూ, పోసుకోలు కబుర్లకూ, అబద్ధాలకూ, కుట్రలకూ, క్షుద్ర రాజకీయాలకు అలవాటైన పాపిష్టి ప్రెస్ క్లబ్ ను కూలదోసి మనందరం ఆవిడకు అక్కడ ఒక గుడి కట్టాలి.” అని రెండు దశాభ్డాల క్రితమే ప్రతిపాదించారు కదండీ పతంజలిగారు.
      మరి ఇరవైయేళ్ళల్లో ఇంకా ఎంతో ఎదిగిపోయివుండాలి కదండీ పాత్రికేయ వటవృక్షం? తన నీడలో మొక్క కూడా మొలవని ఆ చెట్టుకే రైతులు ఉరివేసుకునే రోజులు దగ్గర్లోనే వున్నాయి.
      కంకాళభైరవుని ఫాంహౌస్ వ్యవసాయం – 55 ఎకరాల్లో సాలుకు 10 కోట్ల ఆదాయం, డ్రిప్, గ్రీన్ హౌస్ వ్యవసాయం, 2014 లో ఆవిష్కరించిన ఆ మహత్తర వ్యవసాయాన్ని తెలంగాణాలోని ప్రతి రైతుకీ నేర్పితే సరిపోతుంది కదా.
      ఎకరాకి కోటి రూపాయలు సాధించిన ఆ అద్భుత ఆదర్శరైతును బ్రతిమిలాడుకుంటే రైతుల కష్టాలు తీరవచ్చేమో.

Leave a Reply to Thirupalu Cancel reply

*