జీవాగ్ని

ఇండస్ మార్టిన్ 

~

 

ఒక అగ్గిరవ్వ పుట్టాలి

నీ చేతికి అక్షరం ఉగ్గు తగలకముందే

నీమస్తిష్కంలో ఆలోచనా వివసత్వం రేకెత్తకముందే

 నిన్ను నిలువునా దహించే

ఒక కార్చిచ్చు రాజెయ్యబడాలి

 నిన్ను నువ్వు ప్రసవించడానికి

 ఒక అగ్నిపర్వత విస్పోటనం జరగాలి

 నీభావనలకు ఒక రూపం రాకముందే

మాటలకు ప్రతీకల వలువలు దిగెయ్యకముందే

 ఒక్క నగ్నాంగారకం నీ తొలి అస్తిత్వం కావాలి

ఇప్పుడు ప్రారంభించు

నీ ప్రతిసృష్టి ఒక దావానలమై

 నీచుట్టూ వున్న అడవుల్ని యధేచ్చగా మ్రింగేస్తూ

 బడబానలమై నీలోని అఖాతాల్ని నిరంకుశంగా ముంచేస్తూ

 ప్రతీ వాక్యంలో నిన్ను నువ్వు హరించుకుంటూ

 ప్రతీ కావ్యంలో దహించుకుంటూ

నిన్ను నువ్వే రగుల్చుకుంటూ

 అగ్నినాల్కలు చాచి చెప్పు

కళ ఎప్పటికీ కాదు వర్తమానానికి ప్రతిబింభం

 కళ ఎప్పటికైనా కావాలి భవిష్యత్తుకు నిదర్శనం

కడపటికి జీవార్తి గల ఒక మొక్కవైతే

 మేలిమి చివురులతో పల్లవిస్తావు

 చచ్చిన మానువైతే బుగ్గిలో చెల్లిపోతావు.

ది వాటికన్ మ్యూజియం (3డి) చూసిన స్పూర్తితో

image1

మీ మాటలు

  1. నిశీధి says:

    Very well chosen words made into lovely poem . kudos . specially. కళ ఎప్పటికీ కాదు వర్తమానానికి ప్రతిబింభం

    కళ ఎప్పటికైనా కావాలి భవిష్యత్తుకు నిదర్శనం so true.

  2. ns murty says:

    Indus Martin గారూ,

    చాలా చక్కగా ఉంది కవిత.

    హృదయపూర్వక అభినందనలు.

  3. Indus Martin says:

    నిశీధి గారూ , ఎన్ ఎస్ మూర్తి గారూ ప్రోత్సాహానికి వందనాలు !

  4. విలాసాగరం రవీందర్ says:

    బాగుంది మర్టిన్ గారు

  5. sriramoju haragopal says:

    మార్టిన్ నీ జీవార్తి బాగుంది .
    జీవార్తి గల ఒక మొక్కవైతే

    మేలిమి చివురులతో పల్లవిస్తావు

    చచ్చిన మానువైతే బుగ్గిలో చెల్లిపోతావు…..మంచి పదాలతో అల్లిన మంచి కవిత. అభినందనలు.

  6. P V Vijay Kumar says:

    ఎప్పుడో…అరుణతార మేగజైన్ లో ఇలా తీక్షణంగా వచ్చేవి…..
    good one. thanq

  7. indusmartin says:

    థాంక్ యూ రవీందర్ విలాసాగరం గారు, దండాలు హరగోపాల్ గారు! మీ ప్రేమ !

  8. indusmartin says:

    పి వి విజయ్ కుమార్ గారు, వందనం

  9. మేలిమి చివురులతో పల్లవించే జీవార్తి గల మొక్క గొంతును వింటున్నట్లుంది. నాకోసం బుక్ చేసిన టికెట్ ని మీ కాంబినేషన్ ని మిస్సయినందుకు ఇప్పుడు మరోసారి చిన్నబోతున్నాను. ఉగాది నాటి అనుభూతికి అక్షరరూపం కూడా త్రిమితీయంగా వుంది. బ్రేవో మార్టిన్ జీ…

  10. Eleazar Pavithran says:

    సూపర్ సర్…..కుడోస్…..

  11. Aranya Krishna says:

    ఇప్పుడు ప్రారంభించు

    నీ ప్రతిసృష్టి ఒక దావానలమై

    నీచుట్టూ వున్న అడవుల్ని యధేచ్చగా మ్రింగేస్తూ

    బడబానలమై నీలోని అఖాతాల్ని నిరంకుశంగా ముంచేస్తూ

    ప్రతీ వాక్యంలో నిన్ను నువ్వు హరించుకుంటూ

    ప్రతీ కావ్యంలో దహించుకుంటూ

    నిన్ను నువ్వే రగుల్చుకుంటూ

    అగ్నినాల్కలు చాచి చెప్పు

    కవి కవితని రాయటానికి పూనుకున్నప్పుడు నిజాయితీగా ఉండాల్సిన మానసిక స్థితి, ఉద్వేగ స్థాయి గురించి రాసిన కవిత. కవిత వస్తువుని శక్తివంతంగా వ్యక్తీకరించిన కవికి అభినందనలు.

Leave a Reply to కట్టా శ్రీనివాస్ Cancel reply

*