ఇల్లు

 vijay

 కోడూరి విజయకుమార్

మా నాన్నకు ఒక కల వుండేది

కిరాయి ఇళ్ళ యజమానుల గదమాయింపులతో

ఇబ్బంది పడినపుడల్లా

‘మనకొక సొంత ఇల్లుండాలిరా బాబూ !’ అంటూ

తన కలల బొమ్మరిల్లుని నా ముందు పరిచేవాడు

 

ఒక పేద బడి పంతులు మా నాన్న

బడి వేళల పిదప ట్యూషన్లు చెప్పడం కూడా

నేరమని తలచిన పాతకాలం పంతులు 

కళ్ళు మిరుమిట్లు గొల్పే రంగుల కల కాదు

హాలు – ఒక పడగ్గది – ఒక వంట గది – చిన్న వరండా

ఒక సాదా సీదా బొమ్మరిల్లు ఆయన కల

 

సీదా మనుషుల సాదా కలలకు చోటు లేని లోకంలో

నాన్న కల అట్లా బాధ్యతల కందకాల మీదుగా సాగీ సాగీ

ఉద్యోగ విరమణ తరువాత ఎప్పుడో

మూడు గదుల ఒక చిన్న ఇల్లుగా సాకారమయింది

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన రోజున

ఇంటి గడపపై వెలిగిన రెండు దీపాలు – మా నాన్న కళ్ళు

 

గవ్వల తోరణాలతో గుమ్మాలను అలంకరించీ

ఇంటి గేటుకి నీలి రంగు వేయించీ

గడపలకు రంగుల పూల చిత్రాలు అద్దించీ

మూడు గదుల ఇంటిని

ముచ్చట గొలిపే ప్యాలెస్ లా చూసుకుంటాడు

* * * * *

నాన్నను వెంటాడిన ఈ సొంతఇంటి కల ఏదో

ఒక పీడ కలై నన్నూ వెంటాడింది

మకాం మా వూరి నుండి మహా నగరానికి మారాక

ఇల్లంటే నాదైన స్థలంలో కొన్ని గదుల

బొమ్మరిల్లు కాదని అర్థమై పోయింది

 

 

వున్న భూమిని ప్రభువులు కొందరు

ఎకరాలకు ఎకరాలు మింగి వేసాక  

మరణించిన మనుషులకు ఆరడుగుల నేల కూడా

కరువైన మహానగరంలో

బతికున్న మనుషులు కొన్ని చదరపు అడుగుల

పిట్టగూడులలో తలదాచుకోవలసిందే 

 

మూడు గదుల ఇంటితో ముగిసిన తన కల

ఒక సుందర సువిశాల భవనమై

తన ఇంజినీరు కొడుకు కలగా కొనసాగుతుందని

నా తండ్రికి ఇటీవలి కల

 

ఇక నేనంటారా ….

ప్రతిరోజూ నగర రద్దీ రహదారులని ఈదలేక

మా సకలావసరాలకూ చేరువలో వుండే చోటులో

ఒక నివాసాన్ని కలగన్నాను

నగరం మధ్యలో కూడా మా ఊరిని కలగన్నానేమో

గేటెడ్ కమ్యునిటీ లో నివాసాన్ని కలగన్నాను

 

విలాసంగా బతికింది లేదు – విహార యాత్రలు చేసింది లేదు

వున్న సేవింగ్స్ అంతా వూడ్చేసి, చివరికి

నా భవిష్యత్ ఆదాయాన్నీ తనఖా పెట్టి

తండ్రీ! నేనీ మహానగరంలో ఇంటివాడినయ్యాను

ఇక ఈ శేష జీవితం ఇంటి అప్పు వాయిదాలకు తాకట్టు

 

మిత్రమా ! .. తండ్రీ కొడుకుల ఈ కలల యాత్రల

కథలు విన్నాక నీకేమనిపిస్తోంది ?

*

మీ మాటలు

  1. నిశీధి says:

    Beautiful and touching

  2. ఎంత సరళమో అంత హృద్యం. చాల బాగుంది విజయ్!

  3. నగరం అంటే మోసం అనిపిస్తుంది!

  4. paresh n doshi says:

    if you don’t like your job, take housing loan. you’ll love your job. ఇది గుర్తుకొస్తున్నది. అందరూ వొకే గూటి పక్షులు.

  5. తిరుపాలు says:

    సగటు మనిషి కి ఉన్న కల అనిపిస్తుంది. స్వేచ లన్ని హరించుక పోయే సమాజం లో కల నెరవేరటం అటుంచి, అడుగైనా నిలవనిస్తారా జానెడు నెల మీదా? కాలు నిలవని చోటా ఇక కలలేమి వస్తాయి.? నేరవేరతానికి.కల నెరవేరాలంటే మేలుకోక తప్పదు.

  6. విలాసాగరం రవీందర్ says:

    నా కథ కూడా మీరే చెప్పారు కోడూరు గారు

  7. కల దృశ్యీకరించబడింది …. కళ్ళు తడిపించారు! ప్రణామాలు

  8. koduri vijayakumar says:

    HRK
    Nisheedhi gaaru
    Chidambar reddy gaaru
    Paresh gaaru
    raveendar gaaru
    thirupalu gaaru
    Martin gaaru
    …. Thanks for nice words about my poem!

  9. హృదయపు లోతుల నుంచి వ్రాసిన జీవితానుభవ గేయకధ ఇది.
    ఈ అనుభవం చేదని చెప్పను. చాలా మంది ఎదుర్కొనే చేదనుభవం ఇటువంటిదే. ముఖ్యంగా బడిపంతుళ్ళు పడే పెద్ద బాధ ఇదే – ఉండడానికి ఓ కొంప. పాతకాలం బడిపంతుళ్ళు డబ్బు సంపాదించలేని దౌర్భాగ్యులు!
    ఏది ఎలా వున్నా, ఒక్కటి మాత్రం నిజం – మన దేశ పరిపాలనా వ్యవస్థ – దానికి ఆజ్యం పోస్తున్న మన సమాజం.
    మన సంమాజం నిజమైన “చదువు”ని గుర్తించాలి, గౌరవించాలి. మన పాలనా వ్యవస్థ అసలుసిసలైన బడిపంతుళ్ళను నియమించి, గౌరవించి, ఆదరించాలి. లేకపోతే సరైన చదువు చెప్పే అధ్యాపకులు మనదేశంలో పూర్తిగా నేలమట్టమైపోతారు.
    ఇక రచన వైపు దృష్టి మళ్లిస్తే, రచయిత ఓ క్రొత్త శైలిలో వ్రాసారు ఈ జీవితానుభవ కధను. శైలి చక్కగా, క్రొత్తగా ఉంది. హృదయాన్ని హత్తుకుంది. కానీ పర్యవసానమేమిటి? చదివేసి, “అయ్యో! పాపం” అనుకోవటమా?
    ధన్యవాదాలు
    పాలన
    కొలంబస్, ఒహాయో

  10. B.Narsan says:

    మనందరి జీవితాలు అసున్టివే. రచన హృద్యంగా ఉంది . కానీ మరీ ముచ్చట చెప్పినట్లి ఉంది.% of poetic structure పెరిగితే ఇంకా బాగుండేది.

  11. Rajendra prasad Chimata says:

    కథలాగా కవిత్వం చెప్పొచ్చు అని చూపించారు. ఎందరి హృదయాలనో కదిలించారు.కవిత ఆశయం అదే కదా

  12. P V Vijay Kumar says:

    middle class dreams getting shattered……

  13. koduri vijayakumar says:

    Palana గారు
    Narsan గారు
    Rajendraprasad గారు
    Vijayakumar గారు
    dhanyavaadaalu!!

  14. balasudhakarmouli says:

    అన్ని పోయెమ్స్ ఒకేలా వుండవు. ఒక కవి అనేక సందర్భాల మధ్య, అనేక సంఘర్షణల మధ్య జీవిస్తున్నప్పుడు.. వస్తువును కొత్తగా వ్యక్తం చేయాలని తపించే క్రమంలో మరీ కొత్త అభివ్యక్తి ముందుకు వస్తుంది. నేను ఈ ఇల్లు కవితను యిలాగే భావిస్తాను. చాలా సులువుగా చదివేసాను. కవి దేన్నైతే విషయాన్ని చెప్పాలనుకున్నాడో అది పాఠకునిగా నేను గ్రహించాను. లోపల నుంచి కవిత్వం చాలా వుబుకుతుంది. కవిత్వంలో వొక మంచి అభివ్యక్తిని నేనైతే గ్రహించాను. కవిత చదివాక చాలా ఆనందమనిపించింది. ఆ మధ్య ‘పాలపిట్ట’ మాసపత్రికలో ‘బెజ్జారపు రవీంద్ర’ గారి ‘పరాయి గ్రహం’ – కధ చదివాను. అది కూడా ఈ కవితలో చర్చించిన వస్తువునే చెప్పింది. ఆ వస్తువే బహుశా కవిత్వంగా రూపుకడితే.. యిది మంచి రూపమే అని అంటాను. అదీ కవిత స్వీయ అనుభవం నుంచి వచ్చింది. స్వీయ అనుభవాన్ని ఒక ప్రత్యేకమైన రూపంతో కవిత కట్టడం బాగుంది. నాకు కవిత చాలా నచ్చింది. ఈ కవిత నుంచి నేనేం నేర్చుకోవాలో అది నాకు అందింది.

  15. కోడూరి విజయకుమార్ says:

    Mouli
    Thanks for your nice words

  16. kalyanadurgam swarnalatha says:

    inti kala nijanga manishini appula paalu chestondi..chakkati bhavanni tanadaina saililo chepparu vijay gaaru..abhinandanalu

  17. కవి గారు మీరు చెప్పా దలుచు కొన్నది వ్యాసం గానూ లేదా కథ గానో రాసి వుంటే ఇంకా బాగా పందేదని నాకు అనిపించింది.

    ఇందులో కవిత్వం ఎక్కడ ఉన్నదో నాకు తెలియటం లేదు.

  18. కోడూరి విజయకుమార్ says:

    Swarnalatha gaaru …. Thanks for your nice words
    Apparao gaaru …..
    Meeku kavitvam kanipinchakapothe vodileyandi; falaanaa chota vundani defend cheskolenu
    Thanks for your comment!

  19. నైస్..-ప్రస్తుతం నేనూ అదే.., శేషజీవితాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం లోనే…

  20. కోడూరి విజయకుమార్ says:

    రాఘవ గారు
    … .

  21. Sreedhar Parupalli says:

    తన కలల బొమ్మరిల్లుని నా ముందు పరిచేవాడు ….ఇంటి గడపపై వెలిగిన రెండు దీపాలు – మా నాన్న కళ్ళు
    ఎవరన్నారు విజయ్ కుమార్ కవిత్వం రాదని, మాటల్లో కవిత్వం లేదని? కవిత్వం రాస్తేనే గొప్పవారవుతారా? అక్కడికి విజయకుమార్ ని గొప్పవాడిని చేయటానికి ఎవరో కాచుకుని కూర్చన్నట్లు….ఎందుకీ జడ్జిమెంట్లు? పనికిరాని ఆర్గ్యుమెంట్లు? ఒక ఇతివృత్తం తీసుకుని అదే వృత్తం చుట్టూ కథనడిపితే.. కథో, కవితో అని పేరుపెట్టేదాకా నిద్రపట్టదా? మూడు గదుల ఇంటిని ముచ్చటగొలిపే ప్యాలెస్ లా చూసుకుని మురిసిపోయిన ఆ సంతోషాన్ని ఒక విభాగంతో కొలవాలా? అందులో శిల్పం చూడాలా? అభివ్యక్తి చాలదా? చూడగానే చదవాలనిపించింది. చదివాను నాకెంతో నచ్చింది. కోడూరి విజయకుమార్ శైలి ఏమిటంటూ.. ఆగకుండా చదివించటం. మళ్లీ చదువుదాంలే అని పడేయబుద్ధి కాలేదు. రచనకు, రచయితకు అంతకంటే కావలసినదేముంది? హ్యాట్సాఫ్ విజయకుమార్ గారు.
    – శ్రీధర్ పారుపల్లి

  22. కోడూరి విజయకుమార్ says:

    శ్రీధర్ గారు !
    సంతోషంతో కడుపు నిండిపోవడం అంటే ఇదేనేమో ! thanks a lot friend! … your complement has given me enough energy to write poetry for some more time, without getting down by a few negative remarks!

  23. కథనాత్మక కవిత్వం పట్ల మనవాళ్లకు చిన్నచూపెందుకో. తమిళ్ లో, మళయాలంలో హిందీలో అనేక కవితలు కథనాత్మక శైలిలో సాగుతాయి. అలంకారాలు, ప్రతీకలు ఉంటేనే కవిత్వమా? శ్రీశ్రీ కూడ అనేక కథనాత్మ కవితలు వ్రాసాడు. కానీ శ్రీశ్రీ వేగంలో అవి కథనాత్మకమని గ్రహించం.

    ఈ కవితలో భావం చాలా ఆర్ధ్రమైనది. ఆ తడిని అందుకునే పాఠకునికి రససిద్ది కలుగుతుంది. అంతకు మించి ఇంకేమి కావాలి ఒక రచననుండి.

    కవితలో కవేంచెపుతున్నాడు– మునుపటితరంలో సొంత ఇంటి కోసం జీవితకాలం శ్రమను వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రేపటి జీవితాన్ని కూడా తాకట్టు పెట్టాల్సివస్తుంది అని. (రేపెక్కడ చచ్చిపోతామో అని మనడబ్బుతోనే బాంకువాడు మన జీవితాన్ని ఇన్సూర్ చేసుకొంటాడు-ఇదెంత దారుణం)– ఈ ఇతివృత్తానికి ఎలాంటి అలంకారాలు అద్దినా కోతిపిల్ల అవుతుంది. ఇలాగ ప్లెయిన్ గా, పారదర్శకంగా ఉన్నప్పుడే లోతుగా గుచ్చుకొంటుంది.

    నిజానికి ఈ కవితా వస్తువును కవితాత్మకంగా వ్రాయాలనుకొంటే ఇలా మొదలవుతుంది

    //మానాన్నను ఓ కల వెంటాడేది
    కిరాయి ఇళ్ళ యజమానుల మాటల శరాఘాతాలకు
    అభిమానం రెక్కతెగిన పక్షిలా నేలరాలినపుడల్లా
    “మనకొక ఇటుకల చెట్టునీడ ఉండాలిరా” అంటో
    మెలుకువలో కూడా వెంటాడే తన కలను నా చేతిలో పెట్టేవాడు//

    ఎంత కృతకంగా ఉందీ.

    వస్తువు బలంగా ఉన్నప్పుడు, కవిత్వీకరణ చేయటం అంటే అనవసర గందరగోళం కలిగించటమే అని నా అభిప్రాయం.

    మంచి కవితనందించారు విజయకుమార్ గారు. ధన్యవాదాలు

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    • రమణ కెవి says:

      //వస్తువు బలంగా ఉన్నప్పుడు, కవిత్వీకరణ చేయటం అంటే అనవసర గందరగోళం కలిగించటమే అని నా అభిప్రాయం.//
      మీ అభిప్రాయం భలే ఉంది. వస్తువు బలంగా లేనప్పుడే కవిత్వం రాస్తారన్న మాట!

      • రమణ గారు
        థాంక్యూ
        ఇక్కడ బలం అంటే నా ఉద్దేశం, శ్రీశ్రీ “పదండిముందుకు” లోలా, శిఖామణి వాడే అశుద్దమానవుడు లోని కవితావస్తువులా, గొప్ప ఫోర్స్ తో, ఉదృతితో, అలంకరించుకొని వెళదాం అనుకొనే ఆలోచన లేకుండా అని.

  24. కోడూరి విజయకుమార్ says:

    బొల్లోజు బాబా గారు …. ! థాంక్స్ ఎ లాట్ !!
    నేను చెప్పాలనుకున్నది నా మనసులోకి దూరి, గ్రహించి, మీరు చెప్పినట్టుగా వుంది –
    నిజమే .. ఇంటికి సంబంధించిన ఈ పెయిన్ ని కవిత్వీకరించే ప్రాసెస్ లో అనవసర , అందమైన తొడుగులేవీ లేకుండా – ఇంకా చెప్పాలంటే , Prose-Poem లాగా చెబితే బాగుంటుంది అనుకుని రాసాను.
    ఈ కవిత ఇట్లా కొంత నిరలంకారంగా ఉంటేనే , సహృదయులైన కవిత్వ పాటకులతో ఈ కవిత ద్వారా నేను పంచుకోవాలనుకునే పెయిన్ చేరుతుంది అనుకున్నాను. నాకు అర్థమైనది ఏమిటంటే, నేను ఊహించినట్టుగానే, ఎక్కువ మంది పాటకులు నేను పంచుకోవాలనుకున్న పెయిన్ తో ఐడెంటిఫై అయ్యారు.

  25. Thirupalu says:

    అనవసర , అందమైన తొడుగులేవీ లేకుండా – ఇంకా చెప్పాలంటే , …..నిజమే సాదారణ వ్యాక్యాలతో కధనాత్మక పద్దతిలో మంచి కవిత్వా న్ని సాదిమ్కా వచ్చు అంటారు చే ,రా గారు. ఉదా : కొండెపూడి నిర్మల గారు అనుకుంటాను ( పోరా పాటైతే క్షిమిమ్చాలి) ‘ ఆపీసులో నామొగుడున్నాడు అని అన్నయ అన్నపుడే నాకర్ధమై పోయింది … ‘ ఒక కవితను ఎత్తి చూపారు. ఒక భావ సమన్వయాన్ని సాధిమ్చినపుడు అది కవిత అవుతుంది అని అంటారు. మరి అది కవిత్వమైనపుడు ఇది ఏమ్డుకాడు ?

  26. రమణ కెవి says:

    ఇందులో కవిగారు అసలు దేనికి బాధపడుతున్నారో అర్థం కాలేదు. తండ్రిగారు జీవితమంతా అద్దె ఇళ్ళలో గడిపి చివరికి పొదుపు చేసిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు. కొడుకు ఉద్యోగంలో ఉండగానే గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకుని సొంత ఇంటి సుఖం అనుభవిస్తూ అప్పు తీర్చుకుంటున్నారు. తండ్రి కంటే కొడుకు బాధపడాలా, సంతోషించాలా? జీవితమంతా అద్దె ఇళ్ళలో గడపకుండా అప్పు ఇచ్చి సొంత ఇంటి కలను ఫలింపజేసిన బ్యాంకులను తిట్టాలా, పూజించాలా? పైగా వాలెంటరీగా…అందులోనూ గేటెడ్ కమ్యూనిటీకి ఎగబాకి మరీ… వెనకటి తరంతో పోల్చితే ఇప్పుడు మధ్యతరగతివారికి చాలమందికి సొంత ఇంటి కల తీరడం నిజం కాదా? కవిగారి ఆలోచనలోని ఇంత absurdity, అప్పు ఇచ్చిన వాడిని ఆడిపోసుకునే దుర్మార్గం స్పందించిన వాళ్ళలో ఒక్కరికీ కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఇది కలియుగం కాదు కవియుగం.

  27. రమణ గారి కామెంటుపై నా అభిప్రాయలివి

    //కవితలో కవేంచెపుతున్నాడు– మునుపటితరంలో సొంత ఇంటి కోసం జీవితకాలం శ్రమను వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రేపటి జీవితాన్ని కూడా తాకట్టు పెట్టాల్సివస్తుంది అని. //

    ఈ కవిత ఇల్లుకి సంబంధించి, ప్రస్తుక కాలంలోని ఆర్ధిక సామాజిక, రాజకీయ అంశాలను స్పృశిస్తుంది.
    ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల వల్లనో, సామాజిక పరిస్థితుల వల్లనో, ఇల్లు అనేది ఒక పెద్ద విషయం కాదు. గ్రామాల్లో ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే, గ్రామపెద్ద ఎక్కడో ఒకచోట స్థలం చూపి ఇల్లు కట్టుకొని ఉండమని చెప్పేవారు. ముఖ్యంగా చేతివృత్తులకు సంబందించిన వారికి.

    మొన్నమొన్నటి వరకూ కూడా నివాస స్థలం అనేది ఒక జీవితకాల పెట్టుబడి గా లేదు.

    కానీ ఇప్పుడు భూమి (రియల్ ఎస్టేట్) ఎవరి చేతుల్లోకి పోయిందొ అందరికీ తెలుసు.
    ఇల్లు నిర్మాణానికి అవసరమైన (ఇప్పుడెక్కడా తాటాకు, గడ్డి ఇళ్ళు లేవు), ప్రకృతివనరులు (గనులు) ఎలా ఎలా చేతులు మారుతున్నాయో తెలియనిది కాదు.

    బాంకులు పిలిచిమరీ అప్పులివ్వటం ఎవరిని ఉద్దరించటానికో అర్ధమౌతూనే ఉంటుంది

    మరలాంటప్పుడు ఆ రొంపిలోకి దిగటమెందుకు, దానికి ఏడవటమెందుకు? అన్న మీ ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఒక మాట — దిగాలి కనుక దిగటం, ఏడుపొస్తున్నది కనుక ఏడవటం …. అంతే…. అంతకు మించేమీ లేదు….. బహుసా సాహిత్యం ఉన్నది అందుకోసం కూడా కదా!

    ఈ నేపధ్యంలో వ్రాసిన ఈ కవితలో, రాజకీయ, ఆర్ధిక, సామాజిక ప్రాసంగిత ఉన్నదనే భావిస్తున్నాను.

    ఇందులో అబ్సర్డిటీ నాకైతే కనిపించటం లేదు

  28. రమణ కెవి says:

    బొల్లోజు బాబాగారూ, ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు,సామాజికపరిస్థితులు, గ్రామాలు, గ్రామపెద్ద స్థలం చూపించి ఇల్లు కట్టుకొమనడం, చేతివృత్తుల వాళ్ళు, భూమి చేతులు మారడం, రియల్ ఎస్టేటు, తాటాకు గడ్డి ఇళ్ళు, ప్రక్రుతివనరులు, గనులు అంటూ మీరు చాలా విషయాల్లోకి వెడుతున్నారు. ఈ కవితకు పరిమితం అవుదాం. మధ్యతరగతికి చెందిన తండ్రి-కొడుకు-ఇల్లు ఇందులోని విషయం. //మొన్నమొన్నటి వరకూ కూడా నివాస స్థలం అనేది ఒక జీవితకాల పెట్టుబడి గా లేదు// అని మీరు అనడం ఇంకో ఆశ్చర్యం. తండ్రికి ఇల్లు కట్టుకోవడం ఒక జీవిత కాలం పెట్టుబడి అయిందనే కవి అంటున్నారు. ఇంకా ఈ తండ్రి నయం. ఒకటి రెండు తరాల వెనక జీవితకాలంలో కూడా ఇల్లు కట్టుకోలేక జీవితం అంతా అద్దె ఇళ్ళలో గడిపినవాళ్ళే చాలామంది. ఇప్పుడు సంఖ్య తగ్గినా ఇంకా ఉన్నారు. ఈ కవితలో ఉన్నది మధ్యతరగతే కనుక నేను వాళ్ళ గురించే అంటున్నాను. చనిపోతే శవాన్ని ఇంటికి తేవడానికి ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో హాస్పటల్ నుంచి మార్చురికో, నేరుగా స్మశానికో తీసుకెళ్ళే దయనీయ బతుకుల్ని కూడా చూస్తుంటాం. అది అసలైన కవితా వస్తువు. గేటెడ్ కమ్యునిటిలో ఇల్లు తీసుకోని జీవితమంతా అప్పు కట్టాల్సి వస్తోందని ఏడవడం కవితావస్తువు కాదు. పైగా రొంపి లోకి దిగాలి కనుక దిగుతాం, ఏడుపొస్తోంది కనుక ఏడుస్తాం, సాహిత్యం ఉన్నది అందుకోసమే అని మీరు అనడం ఇంకా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కావాలని అప్పుచేసి గేటెడ్ కమ్యూనిటి ఇల్లు కొనుక్కుని అందులో సుఖంగా కూర్చుని అప్పిచ్చిన బ్యాంకు వాళ్ళను శాపనార్థాలు పెడుతూ సెల్ఫ్ పిటీతో ఏడుపుగొట్టు కవితలు రాయడానికే సాహిత్యం ఉందనడం చాలా దారుణంగా ఉందండి. కవిత్వం నిప్పులు కక్కాలని అగ్గి రవ్వలు రాల్చాలని విన్నాం కాని పనికి మాలిన కన్నీళ్ళు కార్చాలనడం వినలేదు.

    • రమణ గారికి, నమస్తె
      1. ఇక్కడ ఇల్లు కొనుక్కోవటమ్ గురించి వస్తువు కనుక, మొన్న ఇలాలేదు కానీ నిన్న జీవితకాలమ్ పెట్టుబడి అయ్యింది. నేడు జీవితమే తాకట్టు అయింది – ఈ విషయంలో విబేధం లేదనుకొంటాను.
      2. ఇలా అవ్వటానికి కారణాలు రాజకీయ సామాజిక, ఆర్ధికపరమైనవి అన్నది కూడా వ్యతిరేకించరనుకొంటాను
      3. ఆయా కాలమాన పరిస్థితులకు, మానవ మనస్సు ఏ విధంగా స్పందిస్తున్నది అనేదాన్ని రికార్డు చేసేది సాహిత్య కారుడు మాత్రమే
      అదే ఈ కవితలో జరిగింది. అది ఏడుస్తూ చేసాడా, నవ్వుతూ చేసాడా, నిప్పులు చిమ్ముతూ చేసాడా అనేది ఆయా సందర్బాలపై ఆధార పడి ఉంటుంది.
      4. ఏడుపుల్ని నవ్వుల్ని వ్యక్తికరించేదే కవిత్వమని ఒక నిర్వచనం.

      నా అభిప్రాయాలలో స్పష్టం గానే ఉన్నాననుకొంటున్నాను
      మీకు మాత్రం దిగ్బ్రాంతులు, దారుణాలు కనిపిస్తున్నాయి

      శలవ్

      బొల్లోజు బాబా

  29. రమణ కెవి says:

    బొల్లోజు బాబా గారు,
    1. // ఇక్కడ ఇల్లు కొనుక్కోవటమ్ గురించి వస్తువు కనుక, మొన్న ఇలాలేదు కానీ…// ఒప్పుకున్నందుకు సంతోషం.
    //నిన్న జీవితకాలమ్ పెట్టుబడి అయ్యింది. నేడు జీవితమే తాకట్టు అయింది – ఈ విషయంలో విబేధం లేదనుకొంటాను//
    తప్పనిసరిగా విభేదం ఉంది. అప్పు చేసి ఇల్లు కొనుక్కుని వాయిదాలు కట్టడం జీవితం తాకట్టు పెట్టడం కాదు. అది వాలెంటరిగా చేస్తున్న పని. జీవితమంతా అప్పు తీర్చుతూనే ఉండడం అందరి అనుభవం కాదు. మధ్యలోనే అప్పు తీర్చేసిన వాళ్ళు ఎందరో ఉంటారు. బ్యాంకులు అప్పు ఇస్తున్నాయి కాబట్టే మధ్యతరగతి వాళ్ళు ఎందరో సొంత ఇల్లు సంపాదించుకుంటున్నారు. కిందటి తరాలలో లేని అవకాశం ఇది. బ్యాంకులు అప్పు ఇవ్వడం మానేయమనండి చూద్దాం. హాహాకారాలు పుడతాయి.

    2. //ఇలా అవ్వటానికి కారణాలు రాజకీయ సామాజిక, ఆర్ధికపరమైనవి అన్నది కూడా వ్యతిరేకించరనుకొంటాను//
    రాజకీయ సామాజిక ఆర్థిక విషయాలపై ఉండవలసిన అవగాహనతో కాక పడికట్టు మాటలుగా వీటిని మీరు వాడారు. అవగాహన ఉంటే ఇవి ఈ కవిత ఏ వర్గం గురించి చెబుతోందో ఆ వర్గానికి ఇవి బాగా అనుకూలించేవన్న సంగతి తెలిసేది. ఈ వర్గానికి మరిన్ని మేళ్ళు చేయడంకోసమే మోడీని ఎన్నుకున్నారు.

    3. //ఆయా కాలమాన పరిస్థితులకు, మానవ మనస్సు ఏ విధంగా స్పందిస్తున్నది అనేదాన్ని రికార్డు చేసేది సాహిత్య కారుడు మాత్రమే. అదే ఈ కవితలో జరిగింది. అది ఏడుస్తూ చేసాడా, నవ్వుతూ చేసాడా, నిప్పులు చిమ్ముతూ చేసాడా అనేది ఆయా సందర్బాలపై ఆధార పడి ఉంటుంది.//
    నేటి సాహిత్యకారుడికి మనస్సు ఒక్కటే ఉంటే సరిపోదు. ఆలోచించగల బుద్ధి కూడా ఉండాలి. సాహిత్యకారుడి గురించి మీ అవగాహన సరైనది కాదు. నవ్వాల్సిన సందర్భంలో ఏడిస్తేనే ఇబ్బంది. ఈ కవితలో ఉన్నది ఏడవాల్సిన సందర్భం కాదు.

    4. //ఏడుపుల్ని నవ్వుల్ని వ్యక్తికరించేదే కవిత్వమని ఒక నిర్వచనం//
    ఇక్కడ కూడా కవిత్వం గురించి మీ అవగాహన సరైనది కాదు. కవి ఏడ్చినా, నవ్వినా దానికి వెనుక బుద్ధికి సంబంధించిన ఒక సమంజసమైన కారణం, సందర్భం ఉండాలి. కారణం లేకుండా ఏడవడం, నవ్వడం కవి చేయవలసిన పని కాదు.

    • Thirupalu says:

      /అప్పు ఇచ్చిన వాడిని ఆడిపోసుకునే దుర్మార్గం స్పందించిన వాళ్ళలో ఒక్కరికీ కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఇది కలియుగం కాదు కవియుగం./
      పై మీ వ్యాఖ్యలు చూశాక మిమ్మల్ని అచ్చర్య పరచడం లో మాకేమి మాకేమి ఆశ్చరయ మనిపిమ్చడం లేదు. కవి కోణానికి మీకోణం వ్యతిరేక దిశలో ఉమ్దికనుక కవిత మీకర్ధం కాక పోడంలో ఆశ్చర్యం మేమి లేదు. అప్పులిచ్చే వారంతా మీ దృష్టి లో దేవుళ్ళు అయినంత మాత్రానా అందరికి అలాగే కనిపించాలా? ప్రపంచ బ్యామ్క్ చాలా దేశాలకు అప్పులిస్తుమ్ది గనుక అది దేవుళ్ళకు రారాజు అయి ఉమ్డవచ్చు. కార్లకు, టు వీలర్లకు ఇళ్ళకు విపరీతమ్గా అప్పులిచ్చే బ్యామ్కులు రైతులకు ఎండు కివ్వడం లేదో ? ప్రధాని మీరు వ్యవసాయ దయ దార్లను ఆదుకోండి అని రికేమేమ్ద్ చేయాల్సి వచ్చింది ఎండు కానీ ? మనుషుల్లో కోరికల్ని రెచ్చ గొట్టి – కన్సుమ్రిజాన్ని- ముఉలలో కూర్చున్న వాళ్ళని కూడా రోడ్డు మిఇడికి తెచ్చి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల్ని అప్పులిచ్చి మరి కొనిపిస్తున్న వ్యాపారా సంస్కృతిలో నిజమెంతో తెలియక పోటి పది మరి కొనుక్కో లేక ఆత్మా హాత్యలకు సైతం పాల్పడుతున్నారు. తనకు మించిన భారం తనకెందుకు అంటున్నారు . నిజమే ! ఆ భారానికి మనుషుల్నిఉరి వేస్తున్నదెవరూ? – ఇక్కడ కోరిక ఉండడం నేర మైతే ఆ కోరికల్ని రెచ్చ గోటే వాళ్ళు ఎంత నేరస్తులో ? సమాజం లో ఒక ఇంజినీర్ గా తమ సాదారణ స్టేటస్( అది ఫాల్స్ దైనా) నిలుపుకోవాలంటే ఆ కోరిక ఉండటం నేరం కాదు.ఇలాంటి వన్నీ మిఇకు తెలిస్తే కవిత మిఇకు అర్ద మైనట్టే!

      • రమణ కెవి says:

        ఈ కవితకు పరిమితం కాకుండా బొల్లోజు బాబా గార్లానే మీరు కూడా ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారండి. ప్రపంచ బ్యాంకు అప్పులకి, బ్యాంకులు రైతులకు అప్పు ఇవ్వకపోవడానికి, ఈ కవితలోని విషయానికి ఎలాంటి సంబంధం లేదు, సంబంధంలేని విషయాల్ని తీసుకొచ్చి మీ అయోమయాన్ని బయటపెడుతూ కవిత మీకే అర్థం కాలేదంటున్నారు. మీరు కూడా ఏ అజ్ఞాత ప్రపంచంలోనో జీవించడం కాకుండా ఈ సమాజంలోనే బతుకుతూ చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటూ ఇంటి కోసమో మరో అవసరం కోసమో అప్పు చేసే వారు ఆయుంటే తప్పకుండా అప్పు ఇచ్చిన వాణ్ని దేవుడిగానే చూస్తారండి. చూడకపోతే మనిషిలో ఉండాల్సిన ఒక సహజధర్మం లోపించిందని, పాలు పోసిన వాణ్ని కాటేసే నాగుపాములాంటి కృతఘ్నత మీలో ఉందని అర్థం. కన్స్యూమరిజానికి మరిగే వాణ్ని విడిచిపెట్టి, దానిని ప్రోత్సహించేవాన్ని మీరు ఆడిపోసుకున్న తీరు కూడా అలాగే ఉంది. ఈ కవితలో ఉన్నది వ్యాపారసంస్కృతిలోని నిజమెంతో తెలియని అమాయకుడు, చదువుకోనివాడు కాదు, ఇంజనీరు. సమాజంలో ఒక ఇంజనీర్ గా స్టేటస్ నిలుపుకోడానికి( ఫాల్స్ స్టేటస్ అయినా సరే) ఆ కోరిక ఉండడం నేరం కాదా? అప్పు ఇచ్చి ఆ కోరికను ప్రోత్సహించేవాడిదే నేరమా? ఎంత దుర్మార్గమైన భాష్యమండీ ఇది! అవినీతి ఉండడం తప్పు కానీ, తను కూడా అవినీతికి పాల్పడి కోట్లు కూడా బెట్టాలన్న కోరిక ఉండడం తప్పు కాదన్నట్టు ఉంది. మీ భాష్యం చూస్తుంటే యథా కవీ తథా పాఠకుడు అనిపిస్తోంది. అయోమయంలో ఒకరికొకరు సరిపోయారు.

  30. ఎన్ వేణుగోపాల్ says:

    విజయ్,

    కవిత చాల బాగుంది. రెండు తరాల జీవన వాస్తవికతలూ, వాటి వెనుక ఉన్న రాజకీయార్థిక పరిస్థితులూ, మారుతున్న విలువలూ గొప్ప ధ్వనితో, కవితాత్మకంగా, వాచ్యం కాకుండా, వచనం కాకుండా చెప్పావు. అభినందనలు. కృతజ్ఞతలు

  31. E sambukudu says:

    విజయ్ గారు
    వేణుగోపాల్ గారు చెప్పినట్టు మీ కవితలో చాలా ధ్వనులున్నాయి,మీ కవితలో ఎక్కడ స్త్రీలు ఆలోచనలు లేకపోవడం,యిది పురుషాధిక్య సమాజమని చెప్పకనే చెపుతోంది.మూడు గదుల ఇంటితో ముగిసిన తన కల మీతరంలో మీరు మహానగరంలో ఒక సుందర సువిశాల భవనం కలగనడం సమాజం ఫ్యూడల్ వ్యవస్థ దాటి పెట్టుబడి దారి వ్యవస్థలోకి మారుతున్న స్థితి ధ్వనిస్తోంది.యిలా చాలా ధ్వనులున్నాయి.
    మనకు ఆకవి నచ్చితే (తెలిసినవాడైతే) మొహమాటపు అభినందనల ధ్వని మొత్తం కామెంట్లనిండా ఉంటుంది.
    యిన్ని ధ్వనులు ధ్వనించే మీ పోయంకు అభినందనలు

  32. కోడూరి విజయకుమార్ says:

    స్పందించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు ….. ముఖ్యంగా ,ఒక్క నా కవితకే కాకుండా సారంగ లోని ఇతర కవితలకూ మంచి వ్యాఖ్యలు పెడుతున్న రమణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు !
    శంభూకుడు గారికి …..
    ఇక్కడ స్పందించిన మిత్రులలో వేణు గోపాల్ లాంటి ఒకరిద్దరు మిత్రులను మినహాయిస్తే మిగిలిన వారితో నాకు కనీస పరిచయం కూడా లేదు
    కవి కవిత రాయడం పూర్తి చేసి పాటకుల ముందు తన కవితని పెట్టాక, అది చదివిన వాళ్ళలో ఎవరెవరికి ఏమేమి ధ్వనిస్తాయన్నది కవికి సంబంధించిన అంశం కాదన్నది మీకు తెలియని విషయం కాదనే భావిస్తాను. ఒక చిన్న అభినందన కనిపిస్తే ఆ అభినందన తెలిపిన వాళ్ళు ఖచ్చితంగా కవికి తెలిసిన వాళ్ళే అయి ఉంటాడని శంభూకుడు గారు తీర్మానించడం కొంచెం బాధగా వుంది … మీకు నా కవిత నచ్చకపోయి వుంటే ‘మొహమాటం లేకుండా ‘ చెప్పండి …. కానీ, కొన్ని పాసిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళవి ‘మొహమాటపు అభినందనల ధ్వని ‘ అంటూ అగౌరవ పరచడం బాగో లేదు !

  33. E sambukudu says:

    విజయ్ కుమార్ గారూ,
    మిమ్మలనిగానీ,మీ పోయం ని గానీ కించపరిచే ఉద్దేశం నాకెంతమాత్రమూలేదు.అలా అనిపిస్తే సారీ!,మీ పోయంస్ గతంలో చాల చదివాను.మీరు మంచికవి అనే నా అభిప్రాయం.అయితే మంచి కవైనవాడు రాసిన ప్రతిపోయం మంచిదే లేదా గొప్పదే అనేంత విశాలహృదయం నాకులేదు.అది మీఒక్కరనేగాదు.ఎవరైనాకావచ్చు.

    కవి తన అలోచనలకు అక్షరరూపమిచ్చి పోయం రాస్తాడు.పాఠకుడైనవాడు తరతమ స్థాయిని బట్టి అర్ధం చేసుకుంటాడు.అందులో తప్పు పట్టవలసినదిఏమిలేదు.

    అయితే పెద్దవాల్లనుకునేవాళ్ళు కవిత్వపు మంచిచెడ్డలు తెలిసినవారు కూడా మొహమాటాలకు పోయి,మరికొందరు యింకేవో ఆశించో..!?,లేదా యింకెందుకు.. చేస్తారో తెలియదుగానీ వాస్తవానికి భిన్నమైన వ్యాఖ్యానాలు చేస్తారు.అది ఆకవికి కవిత్వానికి కూడా చాలా నష్టం చేస్తుందన్నది వారికి తెలియదా!.

    దురదృష్ట వశాత్తు తెలుగు సాహిత్య రంగంలో ఈ అవాంఛిత ధోరనే ప్రబలంగా ఉంది.

    దానిపైనే నా ఆగ్రహం తప్ప మీమీదగానీ మీ కవిత్వం పైనగానీ కాదని మనవి.
    ఒక మంచి కవి,ఒకానొక సందర్భంలో రాసిన పోయం అంత బలమైన వ్యక్తీకరణ కాలేక పోవచ్చు అంతమాత్రాన అతనికిగాని అతని కవిత్వానికి గాని వచ్చిన నష్టమేమిలేదు.
    ఓ కొత్తకవి విషయంలో ప్రోత్సాహానికిమంచిగా రెండు మాటలన్న నష్టంలేదు గానీ.ఒకస్థాయి గుర్తింపు వున్నవారివిషయంలో కూడా అలాగే రాయటం వాంఛనీయంకాదు.

    • Thirupalu says:

      / కవి తన అలోచనలకు అక్షరరూపమిచ్చి పోయం రాస్తాడు.పాఠకుడైనవాడు తరతమ స్థాయిని బట్టి అర్ధం చేసుకుంటాడు.అందులో తప్పు పట్టవలసినదిఏమిలేదు./
      ..అయినపుడు ఇంకేంటి సమస్య ? పేవరిటిజమ్ సాహిత్య అభి మానం లో కూడా ఉమ్డాలా ? కొందరి రచయితలకు ఉన్న స్నేహితులు కొందరు అలా రాయ వచ్చు. అందరు అలానే ఉమ్టారన్న మీ అవగాహనను ఏమనుకోవాలి? నాకయితే తెలిసిన , ముఖ పరిచయమున్న సాహిత్య కారులు ఎవరు లేరు. మీ వ్యాఖ్య మా వంటి పాఠకులను అవమాన పరిచేదిగా ఉంది. ఆ మధ్య ఇదే వేదిక మీద ఒక రచయితమ్టి వా ఇలాగే మాట్లాడాడు. మీ మీ స్నేహ సుహర్ధాలు ఇలాంటి పత్రికలెకెక్కడమ్ సమిచితమ్ కాదు. అలా ఐతే మన రాజ కీయాలకు సాహిత్య లోకానికి పెద్ద వ్యత్యాసం ఉమ్డ బోదు. అయితే ఇక్కడచ్సు సాహ్యిత్య వ్యాఖ్యానాలు వారి స్నేహితులు చేస్త్న్నన్న మాట. అనుకోవటమే చాలా అసవ్యంగా ఉంది. ఈ ఆలోచనటో మంచి సాహిత్యాన్ని అమ్దిమ్చ బోరు. రాదు కూడా. అలా వచ్చిన రాజకీయ పార్టిల లాగ చాలా కాలం మన బోదు. సాహిత్య మనేది ఈ తరానిది మాత్రమే భావిష్యుతరాలది కూడా. మంచి రచనలైతే. అది ఒక సామాజిక బాధ్యతతో రాసే వాళ్లకు గాని, చదివే వారికి గాని చాలా సీర్యస్ అయినది సాయిత్యం. సాహిత్యం జీవితాలను ముందుకు నడపాలి. ఈ విషయంలో పైన వ్యాక్యానిమ్సిన రమణ గారికి మీకు పెద్ద తేడా వుందా బోదు,

      • E sambukudu says:

        తిరుపాలు గారూ, మీరు గందరగోళంలో ఉన్నారు.గొప్ప ఆవేశంతో కూడా ఉన్నారని మీ మాటలు చెపుతున్నాయి.మీ ప్రశ్నలే చూద్దాం.

        పేవరిటిజమ్ సాహిత్య అభి మానం లో కూడా ఉమ్డాలా ?
        ఉండకూడదనే నేనంటుంటే తిరిగి నన్నడుగుతున్నారు.

        అందరు అలానే ఉమ్టారన్న మీ అవగాహనను ఏమనుకోవాలి?
        అందరి మాటానేనన్లేదు….”.మనకు ఆకవి నచ్చితే (తెలిసినవాడైతే) మొహమాటపు అభినందనల ధ్వని మొత్తం కామెంట్లనిండా ఉంటుంది”.అటువంటి వ్యక్తుల మొత్తం కామెంట్లే తప్ప ‘పాఠకులన్దరి’ కాదని నాఉద్దేశమ్.
        యిక నా అవగాహన గురించి… మీరు ఏమైనా అనుకోవచ్చు మీకా హక్కు వుంది.

        అలా ఐతే మన రాజ కీయాలకు సాహిత్య లోకానికి పెద్ద వ్యత్యాసం ఉమ్డ బోదు. ..
        యిప్పుడు ఉందని అనుకుంటున్నారంటే మీరమాయకులనే అనుకోవాలి.

        ఈ విషయంలో పైన వ్యాక్యానిమ్సిన రమణ గారికి మీకు పెద్ద తేడా వుందా బోదు, ఉండకపోవచ్చు లేదా ఉండవచ్చు, ఏ అభిప్రాయమూ ఒంటరిదికాదు.దేనిని సమర్ధించే సమూహం ఎంతో కొంత ఉంటుంది.అది మంచైనా..చెడైనా కూడా

      • Thirupalu says:

        శంభూకుడు గారు,
        మీరన్న దానిలో వాస్తవం ఉమ్డి ఉమ్డవచ్చు. ఉమ్డ కూడదనే నేను కోరు కుంటాను గనుక కాస్త నా గొంతులో కాస్త తీవ్రత చోటు చేసు కుమ్డెమో? అలాంటి సాహిత్యం మనం కాదవకుమ్డా ఉండటమే మంచిది. అయినా మనం ఎం చేస్తాం లెండి. పదుగురాడు మాట పాటి అయ్ ధరజెల్లు. అన్నాడు వేమన. వాళ్ళదే పై చేయి కానీ లెండి.

  34. లక్ష్మణరావు says:

    విజయ్ కుమార్ గారు..
    నమస్సులు. కవిత్వం వర్తమాన స్థితికి అద్దంపట్టింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో వేతన బానిసైనా, కూలీ అయినా ‘సొంత ఆస్తి’ కోసం కలగంటే చివరికి మిగిలే సారం “ఈ శేష జీవితం అప్పు వాయిదాలకు తాకట్టు”. అది గుర్తెరిగి నడుచుకోవడమే తండ్రీ కొడుకుల కన్న కల చెప్పిన కథా సారాంశంగా నేను భావిస్తున్నాను.

  35. లక్ష్మణరావు says:

    విజయ్ కుమార్ గారు. నమస్సులు. వర్తమాన స్థితికి మీ కవిత అద్దం పట్టింది. పెట్టుబడి దారీ వ్యవస్థలో వేతన బాసినైనా, ఇచ్చింది పుచ్చుకునే కూలీ అయినా ‘సొంత ఆస్తి’ కలగంటే చివరికి మిగిలే సారం ‘ శేష జీవితం అప్పుల వాయిదాలకి తాకట్టు’ . ఇది గుర్తెరిగి నడుచుకోమనే తండ్రీ కొడుకు కన్న కల చెప్పిన కథాసారాంశంగా నేను భావిస్తున్నాను.

  36. లక్ష్మణరావు says:

    విజయ్ కుమార్ గారికి నమస్సులు. వర్తమాన స్థితికి మీ కవిత అద్దంపట్టింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో వేతన బానిసైనా, ఇచ్చిందిపుచ్చుకునే కూలీ అయినా ‘సొంతఆస్తి’ కలని సాకారం చేసుకోవాలనుకుంటే చివరికి మిగిలే సారం “శేష జీవితం అప్పుల వాయిదాలకిి తాకట్టే”. ఇదే తండ్రీకొడుకులు చెప్పిన కలల కథాసారాంశంగా నేను అవగాహన చేసుకుంటున్నాను.

  37. విజయ గారు కవిత కథలా సాగింది. భావుంది. మధ్య తరగతి వర్గం ఇల్లు రూపంలో పెట్టుబడి పోగుచేస్తున్న వైనాన్ని మహబాగా చెప్పారు

  38. కోడూరి విజయకుమార్ says:

    SAMBUKUDU gaaru , THIRUPALU gaaru , SURESH gaaru , లక్ష్మణరావు gaaru ….. Thank You!

Leave a Reply to Apparao Cancel reply

*