విశ్వనాథ షట్పదీ శింజానం ” మ్రోయు తుమ్మెద “

                                                                                శివరామకృష్ణ

 

sivaramakrishnaఒక ఉపాసకుడైన నవలాకారుడు తాను కూడా ఒక పాత్రగా మారి, తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి జీవితాన్నే కథావస్తువుగా తీసుకొని నవల రాస్తే ఎలాఉంటుంది? ఆ రచయిత కూడా విశ్వనాథవారి వంటి ఉన్నతశ్రేణి రచయిత ఐతే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబే విశ్వనాథ సత్యనారాయణ గారి మ్రోయు తుమ్మెద నవల.

 పురిటిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు తనకు భూమిమీద నూకలున్న కారణంవల్ల సంతానంలేని ఒక సామాన్య కుటుంబానికి చెందిన దంపతులకు అడవిలో దొరుకుతాడు.  అతనికి జన్మత: మధురమైన కంఠం, అందరినీ సమ్మోహితులను చేయగల స్వరజ్ఞానం ఉంటాయి. బాల్యం లో నీలకంఠం అనే బైరాగి, తరువాత కూచిపూడి భాగవతుడైన వెంపటి వెంకట నారాయణ గారు అతనికి సంగీతంపై అనురక్తి పెరిగేలా చేస్తారు. అప్పటికి అతనికి రాగాలు, వాటి లక్షణాలూ తెలియకపోయినా, శ్రావ్యత అంటే ఇలావుంటుంది అనేలా పాడేవాడు.

ఒకనాడు వెంకటనారాయణగారు అతనికి  శాంతము లేక సౌఖ్యము లేదు అనే త్యాగరాజ కీర్తన వినిపించి, శాంతరసాన్ని ”పిల్లవాని జీవశక్తిలో ప్రవేశ పెట్టెను. ఆ కీర్తనయొక్క యర్థమా పిల్లవాని ప్రాణములో జొచ్చెను. జీవశక్తిలో నాడెను. అతని భవిష్యజ్జీవితమునంతయు పాలించుటకు, నాతని యాయుర్దాయమునకు భంగము లేకుండ జేసెను. ”

ఐతే పిల్లవాని తండ్రికి మాత్రం అతడు బాగా చదువుకొని ఉద్యోగంచెయ్యాలని కోరిక. కాని బాలుడు మాత్రంపాటలు పాడుకుంటూ, ఆ వూరికి వచ్చిన ఉత్తరదేశానికి చెందిన నాటకబృందంవారివద్ద హిందుస్తానీ సంగీతాన్ని మొదటిసారి విని, దాని పట్ల మక్కువ పెంచుకుంటాడు. జీవితమంటే సంగీతమనే భావం ఆ దశలో అతనికి కలుగుతుంది. “తాను జన్మించినది పరీక్షలందుత్తీర్ణుడై సంపాదించి చివరకు చనిపోవుటకు మాత్రము కాదు. మరి దేనికి జన్మించినాడు? తాను గాయకుడు అని తాననుకొనినప్పుడెల్ల తనకే నవ్వు వచ్చును. ఏ రాగము యొక్క స్వరూపమెట్టిదో తెలియదు.  తానెవ్వరి యొద్దనూ శుశ్రూష చేయలేదు. మహా విద్వాంసులతో పరిచయము లేదు. కాని తాను పాడుచుండగా వినుచున్నవాడెల్ల తన్ను గాయకుడనుచున్నాడు. దీనిని వదిలిపెట్టి సుఖము గోచరించని లౌకికపు చదువు వెంట పడుట యెందులకు ” అనుకుంటూ ఉంటాడు.

***

ఇంతవరకూ విశ్వనాథ వారు ఆ బాలుడి పేరు చెప్పలేదు. ఇంతవరకే కాదు, 216 వ పేజీ వరకూ చెప్పరు. ఈ నవలను తమ తండ్రిగారు 1960 లో ఈ నవల వ్రాసినట్టు విశ్వనాథ పావనిశాస్త్రి గారు నవల మొదట్లో పేర్కొన్నారు.  ఆ రోజుల్లో కరీంనగర్ పట్టణం లో ఉండే న్యాయవాది, గాయక సార్వభౌముడు నారాయణరావు గారి జీవితాన్ని ఆధారం చేసుకొని రాసిన నవల ఇది. విశ్వనాథవారు నిజజీవిత వ్యక్తుల జీవితాల్ని ఇలా నవలీకరించడం పరిపాటే! ముంజులూరి క్రిష్ణారావు అనే నటుడి కథను ‘ తెరచిరాజు ‘ నవలగా రాయగా, భావకవి నాయని సుబ్బారావు గారిని వేయిపడల్లోని కిరీటి పాత్రగా మలచారు.

 

కరీంనగర్ పరిసరాల్లో మ్రోయు తుమ్మెద అనే వాగు ఉన్నదట. దాని ప్రవాహపు సవ్వడి తుమ్మెద మ్రోతని పోలి ఉంటుందట.  ఆ మ్రోతని, దాని సమీపం లోనే  పుట్టిపెరిగిన ఈ సంగీతసార్వభౌముడి గళధర్మాన్నీ ముడిపెట్టి ఈ నవలకి మ్రోయుతుమ్మెద అని పేరుపెట్టారు విశ్వనాథ.  నవలలో నాయకుడిని తుమ్మెద అనే పిలుస్తారు విశ్వనాథ

***

పెంచిన తల్లిదండ్రులు తుమ్మెదకి వివాహం చేసారు. ఈ దశలో అతనికి హైదరాబాదు వెళ్ళి పై చదువులు చదువుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి అక్కడికి వెడతాడు. తుమ్మెద బస్సెక్కి హైదరాబాదు వెళ్ళడాన్ని మనోహరంగా వర్ణిస్తారు విశ్వనాథ. దారిలో షామీరుపేట వద్ద బస్సు చెడిపోవడం, తుమ్మెద బస్సుదిగి పరిసరాల్లోని పొలాల్లో ఆ వెన్నెలరాత్రిలో విహరించడం, అక్కడ అతనికి వినిపించిన పక్షికూతల్లోను, చేలగట్లవెంబడె ఉన్న నీటిబోదెలలోని తరగల సవ్వడుల్లోనూ కలగలిసి ఆతని నోట మధురాతిమధురమైన రాగం పలుకుతుంది.

   హైదరాబాదు చేరిన తుమ్మెద చదువులో రాణిస్తూనే, సంగీతసాధన కూడా చేస్తూ ఉంటాడు. పలువురు సంగీతవిద్వాంసులతో పరిచయం కలుగుతుంది. అతడు చక్కని పాటగాడని విన్న నిజామునవాబు కొడుకు మోఅజ్జంషా అతన్ని మిత్రుడిగా సమ్మానిస్తాడు. తుమ్మెదకి శాస్త్రీయ సంగీతం లో సరైన శిక్షణ లేకపోయినా, అతడు ఏ రాగాన్నైనా, యే గాయకుడు పాడినదాన్నైనా వింటే చాలు, అది అతని నోట అమృతవాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది.  కాలక్రమం లో తుమ్మెద చదువుపై  శ్రధ్ధ పెంచుకుంటాడు.

      కాని కొన్నికారణాలచేత తుమ్మెద హైదరాబాద్ వదిలి నాగపూర్ లో చదువు కొనసాగించడానికి వెడతాడు. అక్కడ కూడా చదువు, సంగీతసాధన కొన సాగుతూనే ఉంటాయి. కొందరు సంగీత విద్వాంసులను చూస్తాడు. వారిగురించి విశ్వనాథ ఇలా అంటారు: ” వారభ్యాసము చేసిన వాటిలో పది పన్నెండు కీర్తనలు, వారు రాచి రంపానపెట్టి, నూరి, లేహ్యము చేసి యుండలు చేసినవి. ఆ కీర్తనలలోనే వారు యథేచ్చగా  విహరింతురు.”  శంకరరావు ప్రవర్తక్ అనే విద్వాంసుడి దగ్గర హిందుస్తానీ సంగీతం లోని మెళుకువలు తెలుసుకుంటాడు. అతని పాట అమృతధునీప్రవాహంలా సాగుతూ ఉంటుంది.  

MroyuTummeda600

అతని పాటకు ముగ్ధుడైన ప్రవర్తక్ ” ఓయి నాయనా! నీవభ్యాసము చేయుచుండగా శతవిధాల సరస్వతీదేవి వచ్చి నీ యెదురుగా కూర్చుండియుండును. సాక్షాత్సరస్వతీదేవి కుసుమించినప్పుడెవ్వడేమి చెప్పగలడు” అంటాడు. క్రమంగా ప్రవర్తక్ వల్ల  సంగీతవిద్యతో పాటు దానికి సంబంధించిన అనేక విషయాలూ, కావ్యపరిచయం అబ్బుతాయి తుమ్మెదకి. సంగీతకచేరీలు, ఆకాశవాణిలో పాడే అవకాశాలూ వచ్చి అతడు మంచి కీర్తితో పాటు జీవికకి అవసరమైన ధనాన్నికూడా సంపాదించుకుంటూ ఉంటాడు. ఐనా, యెప్పటి డబ్బు అప్పుడే ఖర్చైపోయి, “ఆదివారమునాడందలము, సోమవారమునాడు జోలె ” అన్నట్టు ఉంటుంది.

అప్పటికే వివాహమైన తుమ్మెదకి రెండేళ్ళ కొడుకు కూడా ఉంటాడు. చదువుకోసం హైదరాబాదు వెళ్ళినతరువాత అతడు మళ్ళీ అరిపిరాల పోలేదు. బాగా డబ్బూ, పేరూ సంపాదించాకే తిరిగివెళ్ళాలని అతడి ఆలోచన. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే బొంబాయి వెళ్ళి మరింత సంగీతవిద్యను పెంచుకొని, అక్కడ సినిమాల్లో ప్రవేశించి పేరుప్రఖ్యాతులు, వాటితో డబ్బూ పోగుచేసుకోవచ్చు ననుకుంటాడు. బొంబాయి చేరి, అక్కడ తన  గానవిద్య ప్రదర్శించి నలుగురినీ ఆకట్టుకుంటాడు. డబ్బు కూడా బాగానే వస్తూ ఉంటుంది. కొంతకాలానికి మళ్ళీ సంపాదన తగ్గిపోతుంది. కారణం తుమ్మెదకున్న intellectual arrogance.

ఒకసారి ఒక ప్రముఖ గాయకుడితో విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా ఇతని అవిధేయ ప్రవర్తన వల్ల చేజారిపోతుంది. ఇంతలో రెండవప్రపంచ యుధ్ధం వచ్చి, బొంబాయిమీద బాంబుదాడులు జరుగుతాయన్న భయం తోను, భార్యాబిడ్డలు, తల్లిండ్రులపైనా గాలిమళ్ళి స్వగ్రామం చేరుతాడు. అక్కడ తన చిన్నప్పటి గురువు మల్లికార్జునరావుగారి సలహామీద ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడతాడు. ఆ ప్రయత్నంలోనే కొన్నాళ్ళు ఇదివరలో తనను అభిమానించిన నిజాము రాజకుమారుడి దగ్గర ఆంతరంగికుడుగా ఉండి, తన స్వేచ్ఛ కు అది భంగంగా ఉందని తలచి, మానేస్తాడు. తరువాత శ్యామరాజబహద్దరు అనే జాగీర్దారు దగ్గర కొన్నాళ్ళుంటాడు. అనవరంగా ఆయననతో తగవుపెట్టుకొని బయటపపడతాడు. ఆయనన మళ్ళీ పిలిచినా నిరాకరిస్తాడు. “ఈ నిరాకరించుట సిరి రా మోకాలడ్డుట యని యతడికి తెలియును. ఐనా అంతే! ”

మళ్ళీ దేశాటనం! ఈసారి బెంగుళూరు! అక్కడ కూడా తన గాత్రమాధుర్యం తో నలుగురినీ ఆకట్టుకుంటాడు. అక్కడ ఒక వైద్యునికి బాగా దగ్గరౌతాడు. ఆయనదగ్గరికి వచ్చిన కృత్తికోటి స్వామివారు సౌందర్యలహరిలోని ‘అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ’ అనే శ్లోకాన్ని నిత్యం జపిస్తూ ఉండమని, శ్రీచక్రార్చన చేయమనీ ఉపదేశిస్తారు. ఆ ఉపదేశాన్ని తుమ్మెద పాటిస్తూ ఉంటాడు.

ఈలోగానే తుమ్మెద తన కుటుంబంపెరుగుతూ ఉండటంతో ఉపాధ్యాయవృత్తి వదిలిపెట్టి, న్యాయవిద్య నభ్యసించి, కరీంనగర్లో న్యాయవాదవృత్తి స్వీకరిస్తాడు. సంపాదన కూడా వృధ్ధిపొందుతుంది.

***

ఇదే సమయంలో మనదేశానికి స్వతంత్ర్యం  వస్తుంది. కొన్నాళ్ళకి కరీంనగర్లో నారాయణరావుకి (తుమ్మెదే, ఇక్కడినించీ విశ్వనాథవారు అతన్ని అసలు పేరుతోనే సంబోధించారు) జువ్వాడి  గౌతమరావు గారు పరిచయంఅవుతారు. ఆయనద్వారా ఆ వూరి కళాశాలకి అధ్యక్షుడు గా వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారూ పరిచయం అవుతారు.  రోజూ రాత్రి వీరంతా నారాయణరావు ఇంట్లో సమావేశం అవుతూ, అతని సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉంటారు. వేములవాడనించి రాధాక్రిష్ణ శాస్త్రి అనే ఆయన వచ్చి తుమ్మెదకి శ్రీచక్రాన్ని ఇచ్చి దాని ఉపాసనాక్రమాన్ని నేర్పుతారు.  కాలక్రమం లో తుమ్మెద అనబడే నారాయణరావు గొప్ప దేవీ ఉపాసకుడై, న్యాయవాదవృత్తి కూడా చేసుకుంటూ సుఖంగా ఉంటాడు.

***

ఈ నవల విశ్వనాథవారి నవలల్లో అగ్రేసరాలని చెప్పదగ్గ వాటిలో ఒకటి అని నా అభిప్రాయం.  అప్పటికి సజీవుడై ఉన్న ఒక మహా కళారాధకుడి జీవితాన్ని ఒక కథగా నవలీకరించడం మాటలు కాదు. అందులో తాను కూడా ఒక పాత్రగా ఉండడం కూడా అబ్బురపరిచేదే! తనకు కథానాయకుడితో గల పరిచయాన్ని ఇది తెలియచేస్తుంది.

నవల ఆరంభం లోని ” శ్రీవాణీగిరిజా సమష్ఠి రూపమైన యొక శక్తి అనంతాకాశమున అణ్వణ్వంతర సూక్ష్మవియత్సమ్మర్ద క్లిష్టముగా నున్న యొక వేళ, నెగువనున్న యొక గుట్టపై చక్కగా క్రమ్మికొనియున్న  జాజిమొగడలలోని కింజల్కముల తావికి తాత్కాలికముగా దూరమై పశ్చిమాభిముఖముగా దవ్వునగల మాఘ్యవనీపరీమళాశాగత ప్రసార రమణీయముగా  తెల్లనిరెక్కలుజాచి నేలపారుగా నిస్తులాపురమునకు ప్రక్కగా నెగురుచున్న యొక తుమ్మెద అరిపిరాల వచ్చి, హైదరాబాదు పోయి, నాగపురమున విహరించి, బొంబాయిలో తన కంఠనాదమునందు విద్వత్తునలవరించుకొని అటునిటు తిరిగి మరల నరిపిరాల చేరినది” అన్న వాక్యాలనే అంతంలో కూడా చెబుతారు. దీనివల్ల నారాయణరావు జీవితం ఒక చక్రం లా ఎలా పరిభ్రమణం చెందిందో చెప్పినట్టయింది.

 అరిపిరాలకు సమీపం లో ఉన్న వాగు పేరు మ్రోయు తుమ్మెద. దాని అలలసవ్వడి తుమ్మెదరొదలా ఉంటుందట.  ఆ సమీపం లోనే పుట్టిపెరిగిన నారాయణరావు జీవితమంతా సంగీత సాధన లోనె తుమ్మెదఝంకారం లా సాగుతుంది. ఆ వాగుకీ, ఇతని జీవితానికీ సామ్యం ఈ నిరంతర జుంజుంరావమే!    

    ఇక ఈ నవలలో మనకి ప్రముఖం గా కనిపించేది కవిసమ్రాట్టు యొక్క సంగీతవిద్యాపరిజ్ఞానం. రాగాలూ, వాటి లక్షణాలూ, స్తాయీభేదాలూ, ఒక స్వరాన్ని మారిస్తే యే రాగం ఎలా మరోరాగం గా ధ్వనిస్తుందో అన్నీ చదువరికి ఆశ్చర్యం కలిగేలా చెబుతారు. ఈ నవల చదివిన వారికి విశ్వనాథవారికి ఈ భూమండలం లో తెలియని విషయం లేదేమో ననిపిస్తుంది.  చివరంచులు లేని విస్తృతి ఆయన జ్ఞానసాగరానిది. ఈయన ఇన్ని విషయాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారా అనిపిస్తుంది.  

విశ్వనాథవారి నవలలన్నింటిలోనూ స్థూలం గా చూసే చదువరులకి పేజీలకొద్దీ చర్చలు కనిపిస్తాయి. కానీ సూక్ష్మంగా చూస్తే వాటన్న్నింటికీ కథతో ఏదో ముడి ఉంటుంది. నేనేది రాసినా తెలిసే రాస్తాను అని ఆయన అన్నదే1

ఈ నవలలో కూడా అటువంటివి చాలానే ఉన్నాయి. మచ్చుకి కొన్ని చూద్దాం:

శాస్త్రంఅంటే యేమిటోచెబుతున్నారు: “లోకమునందున్న విషయములను పరిశీలించి, విభజించి, వానియందు రసభావములెచ్చటనుండునో నిర్ణయించి, ఆ రసభావములు ప్రకటితములగుటకు నే మార్గము నవలంబించవలెనో యా మార్గమును నిరూపించి బోధించునది శాస్త్రము.”

మరో చోట మతానికి ప్రాణభూతమైనది శమాది షట్కము. అది లేని మతము మతము కాదు అంటారు. నిజమేగా!

“కవులకు ఊహలు సమృధ్ధిగా గలుగుటకు మన వేదశాస్త్ర  పురాణేతిహాసములందు ననంతములైన వస్తువులు కలవు. కవితాదరిద్రులు మన భాషల నాశ్రయించినచో కవితాసముద్రులగుదురు. ”

కథానాయకుడైన తుమ్మెదను ఒకచోట ఇలా వర్ణిస్తారు విశ్వనాథ వారు:

” అది యొక  పుష్పితోద్యానము! జాజులు, మల్లెలు, పొగడలు, మావులు, తంగెళ్ళు, అవిసెలు పూచియున్నవి. ఒక మదబంభరము జుమ్మని మ్రోయుచు పుష్పోద్యానము నందలి బహు పుష్పముల మీద వ్రాలుచు తన సంచారము చేత పుష్పవనవీధిని పులకితము చేయుచున్నది. ప్రాతర్మందమలయానిలములు వీచుచున్నవి. తోట నడిభాగమున దీర్ఘిక కలదు. దానిలో కపిలను తోలుచున్నారు. కపిలత్రాడు-బరువుగల నీటిబాన పైకి వచ్చునప్పుడు క్రొత్త కట్టె నొరసికొని బొంయి మని ధ్వనిచేయుచున్నది. నీరు తూములోనికి జొచ్చి ప్రక్కకు మరలి బిల్లుమని పోవుచున్నది. చిన్నపిట్ట యేదో యాకాశమున కూయుచున్నది… అట్టి సుందరమైన బాలాతప విహారభూమియైన పూదోటలో సంచరించుచున్న తుమ్మెదవలె నాతడున్నాడు.”

తుమ్మెద ఒకసారి వరంగల్లు కోటను చూడడానికి వెడతాడు. ఆ కోటను చూసేక అతడికి ఆ “దుర్గము సంగీతశాస్త్ర పధ్ధతి మీద నిర్మించినట్లనిపించెను. సంగీతశాస్త్రము సప్తస్వరముల మీద నిర్మింపబడినది. ఓరుగల్లు రాజ్యము సప్తప్రాకారముల మీద నిలువబడెను. కాకతీయప్రభువుల సంఖ్య యేడు. అదియును సప్తస్వరములకు సంబంధించినదే! సహస్ర మంటప నిర్మాణము కూడ సంగీతశాస్త్రము మీదనే నిర్మించబడినది. ఇప్పటికిని జూడవచ్చును, ఏడేడు స్తంభములు గుంపుగా నిర్మించబడిన కట్టడమది. ”

విశ్వనాథవారు ఎక్క డో ఒకచోట మన చదువుల ఔన్నత్యాన్నీ, పాశ్చాత్య విద్య లోని డొల్లతనాన్నీ యెత్తిచూపుతూనే ఉంటారు. ఈ నవలలో ” కడుపున కన్నతల్లి విస్తరిలో నన్నము వడ్డించుచున్నది. పూటకూటింటి యమ్మయు వడ్డించుచున్నది. ఈ రెండు భోజనములకును భేదమున్నదందువా, లేదందువా? ఇది మన చదువయ్యా, మన చదువు! మన ఇంటిలో మనము తినుచున్న యన్నము, వారి ఇంట తినుచున్న యన్నము నొకటి కావు. మనము చదువుచున్న వారి చదువు యెట్టిది? పూటకూటింటి తిండి వంటిది. ఆకలియగుచున్నది కనుక తినుటయే కాని, యది మన యిల్లా? మన కచ్చట స్వేచ్చయున్నదా? ”

ఇక ఈ నవలలోని చివరి అధ్యాయం నవలంతటికీ మకుటాయమానంగా ఉంటుంది. అప్పటికే సిధ్ధసంకల్పుడైన నారాయణరావును మ్రోయు తుమ్మెదతో పోలుస్తూ విశ్వనాథవారు ఇలా రాస్తారు:

” (తుమ్మెద సేకరించిన మధుకణములు) సర్వరోగహర మధురరాగ సంభరితములై, సర్వరక్షాకర మధురనినాద మేదురములై, సర్వార్థసాధక మంత్రాక్షర సముద్గీర్ణములై, సర్వసౌభాగ్యదాయకములై, సర్వసంక్షోభణ విచిత్రారోహణావరోహణ సంచాలన క్షమములై, సర్వాశాపరిపూరకములై త్రైలోక్యమోహనములై విరాజిల్లుచున్నవి. ”

“దాని సవ్వడి ఒకప్పుడు సకార హకారములుగా మారి ‘సోహం’ అన్న పధ్ధతిగా కనిపించును. ఉచ్చ్వాసము సకారమై, నిశ్వాసము హకారమై హంసాకృతి నవలంబించుచుండెను. ఇదియే అజపా గాయత్రి. ఈ తుమ్మెదయొక్క మ్రోత నిరంత కృతోచ్చ్వాస నిశ్వాసరూపపరిణతాజపాగాయత్రి రూపమున కూడ ప్రవర్తిల్లుచుండెను.”

నారాయణరావు శ్రీచక్రార్చకుడయ్యాడు. అతని ఉపాసన పరిపక్వస్థితిని చేరుతుంది. అతడొక మ్రోయు తుమ్మెద. “ఆ బంభరము ఆ తల్లినుపాసించుచున్నది. ఆమెను స్తోత్రము సేయుచుండును. తన యుచ్చ్వాసనిశ్వాసములనామెకు సమర్పించుచుండును” అంటారు విశ్వనాథ. ” మ్రోయు తుమ్మెద యొక్క మధురరావము దేవీచరణకమల మధువన విహారి బంభరారావముగా, మధుర యామినీ సంచరదనిల నవనవాధ్వానములు పులకింపజేయుచున్నవి”  అని ముగిస్తారు విశ్వనాథ వారు.  రచయితకి తనపాత్రల మీద ఉండే మమకారమంతా విశ్వనాథవారికి తుమ్మెద మీద ఉంది. కనుకే అతడు దేవీచరణమంజీరాలవద్ద కూడా వాటికి తోడుగా సుస్వరాలు పాడుతున్నట్టు ముగించారు.

ఇది రచయిత ముందు రక్తమాంసాలతో నడిచిన మనిషి జీవితం కాబట్టి మానవుడి జీవితం లోని సహజమైన విరుధ్ధ భావాలన్నింటినీ మనం తుమ్మెదలో చూడవచ్చు. ముందు సంగీతమే ప్రాణం అనుకోవడం, తరువాత కుటుంబం కోసం ధనాన్ని అధికం గా సంపాదించాలనుకోవడం, కోపతాపాలకు గురవడం, అనవసరమైన పట్టుదలకిపోయి అందిన అవకాశాలు దూరం చేసుకోవడం వంటి గుణాలన్నీ అతనిలో చూస్తాం. ఐనా అతని జీవలక్షణం లో శాంతగుణాన్ని వెంపటి వెంకటనారాయణ గారు బాల్యం లోనే బలంగా నాటారు. చివరికి అదే అతనికి దారి చూపించింది, పురాకృతపుణ్యఫలం అతన్ని గొప్ప ఉపాసకుడిని చేసి దేవీకటాక్షానికి దగ్గరచేసింది.

     ఈ నవలలో విశ్వనాథవారు తన పుత్రవియోగ దుర్భరదశను, తరువాత మధ్యాక్కరలు శివార్పణంగా రాయడాన్నీ కూడా చెప్పారు. ” ఆంధ్ర సారస్వత ప్రక్రియ దేశమునందు మారిపోయినది. పూర్వపధ్ధతియందభిమానము తగ్గినది. తగ్గనిచో నా క్రొత్త మార్గము కొన్నియేండ్లు గడచిన తరువాత సమాదరింపబడును….నా మార్గమునకు కాలముమీద నంగీకృతి కలుగును” అంటారు. అది ఇప్పుడు ఆయన రచనలపట్ల నిజమౌతున్నది.

మ్రోయుతుమ్మెద నవల నిజంగా విశ్వనాథ అనే తుమ్మెద చేసిన మధురమంజుల జుంజుంరావమే!

   ***

మీ మాటలు

 1. Mythili abbaraju says:

  ఈ నవల మిమ్మల్ని కదిలించిన తీరు ఆంతా ఇక్కడ ధ్వనిస్తోంది , శ్రవణాలను అధిగమించి ఆ లోపలికి ! [ మీ ] ‘ సప్తస్వర నాద జలాధిపుని’ దయ చేతను , విశ్వనాథ బృహద్భాగీరథీ ధారను ఈ ఒడ్డు కు పట్టించినందుకు – ధన్యవాదాలు .

 2. kameswari yaddanapudi says:

  అంతే కాదు ఈ నవలలో విశ్వనాథ వారి సంగీత పాటవమంతా ముఖ్యంగా హిందుస్తానీ సంగీత పరిజ్ఞానం అంతా చక్కగా తెలుస్తుంది. అయన ఏ రచన చేసినా బాధ్యతగా, చేస్తారనటానికి ఇది నిదర్శనమ్. శివరామకృష్ణ గారికి అభినందనలు.

 3. భవాని says:

  ఒక గొప్ప నవల గురించిన మీ విశ్లేషణ చాలా బాగుందండీ .ధన్యవాదాలు

 4. రమణ కెవి says:

  ఒక ఉపాసకుడైన నవలాకారుడు అని మొదలుపెట్టారు. కానీ తుమ్మెద ఉపాసన గురించి రాసారు కానీ, నవలాకారుని ఉపాసన గురించి ఏమి రాయలేదు. చివరిలో నా మార్గమునకు కాలము మీద అంగీక్రుతి కలుగును అన్న విశ్వనాథ మాటను పేర్కొని అది ఇప్పుడు అయన రచనల పట్ల నిజమవుతోందని అన్నారు. ఎలా నిజమవుతోందో చెప్పలేదు.

  • సంతోష్ says:

   నవలాకారుని ఉపాసన మనం నవల ద్వారానే తెలుసుకోవడం ఒక విధానం. నవలలోని ముఖ్యపాత్ర ఐన తుమ్మెద ఉపాసనను నవలాకారుడు ఏ రకంగా తెలుసుకుని రాయగలడు. కేవలం పైపైని పరామర్శతో, విషయాన్ని తెలుసుకుని రాస్తే ఆ విషయం పాఠకుడికి తెలిసిపోతుంది. గాఢంగా తెలిస్తేనే, కొంతవరకూ తనకూ అనుభూతి ఉంటేనే చాలామంది నవలాకారులు నిజాయితీగా రాయగలుగుతారు. కనీసంలో కనీసం నవలను రాసేప్పుడైనా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలా అవగాహన ఉంది కనుకే తుమ్మెద ఉపాసన గురించి అంత చక్కగా రాయగలిగారు రచయిత. వ్యాసకర్త కూడా ఈ ఉద్దేశంతోనే రచయిత వ్యక్తిగతమైన ఉపాసన గురించి చెప్పలేదేమో. ఈ వ్యాసం పరిధి అంతవరకే వున్నా మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే విశ్వనాథ శారద మొదటి భాగంలో విశ్వనాథలోని నేను అన్న పేరుతో ఆయన శిష్యులు రాసిన వ్యాసాన్ని చదువుకోండి. విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని సరిగా తూచి అంచనావేసి అర్థంచేసుకునే క్రమంలో చాలానే వ్యాసాలు వెబ్జైన్లలో రావడాన్ని మనసులో ఉంచుకుని వ్యాసకర్త //నా మార్గమునకు కాలము మీద అంగీక్రుతి కలుగును// అన్న విశ్వనాథ మాట నిజమౌతోందని వ్రాశారు.

 5. రమణ కెవి says:

  //నవలాకారుని ఉపాసన మనం నవల ద్వారానే తెలుసుకోవడం ఒక విధానం//
  భలే ఉందండీ మీ సమర్ధింపు. నవలాకారుని ఉపాసన గురించే ఎందుకు, ఈ వ్యాసంలో రాసిన విషయాలన్నీ నవల ద్వారానే తెలుసు కోవచ్చు. అది కాదు విషయం. ఒక ఉపాసకుడైన నవలా కారుడు అన్నారు కనుక, విశ్వనాథ ఉపాసన గురించి తెలియని పాఠకులు ఉంటారు కనుక ఆయన ఉపాసన గురించి చెప్పడం కామన్ సెన్స్ విషయం. అది వ్యాసం పరిధిలోకి వచ్చేదే.
  //విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని సరిగా తూచి అంచనావేసి అర్థంచేసుకునే క్రమంలో చాలానే వ్యాసాలు వెబ్జైన్లలో రావడాన్ని మనసులో ఉంచుకుని వ్యాసకర్త //నా మార్గమునకు కాలము మీద అంగీక్రుతి కలుగును// అన్న విశ్వనాథ మాట నిజమౌతోందని వ్రాశారు//
  ఇది కూడా కామన్ సెన్స్ విషయమేనండీ. రాసిన దంతా మనసులో ఉన్నది బయట పెట్టడమే కదా? కొంత బయటపెట్టి కొంత బయటపెట్టకపోవడం ఎందుకు? ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఆధారం చెప్పాలి కదా.

 6. శివరామకృష్ణ గారూ, చక్కని శీర్షికతో సాగింది మీ వ్యాసం. మరువలేని నవల. నన్ను నాస్టాల్జియా లోకి నెట్టింది. విశ్వనాథుల వారు మా ప్రిన్సిపాల్ గా ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి. క్లాస్ లో నారాయణ రావుగారి గురించి ఏంతో తాదాప్త్యంతో మాట్లాడేవారు విశ్వనాథ వీరాభిమాని శ్రీ ధూళిపాల శ్రీరామ మూర్తి గారు. విశ్వనాథుని కావ్యగానం చేస్తూ గౌతమ రావు గారు పరవశాశ్రువులు రాల్చడం నాకింకా గుర్తు. నీలకంఠ బైరాగి మఠం మా వూరిదే (ఎలగందుల-కరీంనగర్ కు 6 మైళ్ళు).
  ఆ నవలలోని తాత్విక లోతులు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతటి అపూర్వ నవలను అద్భుతంగా ముచ్చటించిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

 7. P.K. Anand says:

  విశ్వనాథ గురించి ఒక్కో విషయం తెలిసికున్నప్పుడల్లా ఆయన నా మనస్సులో ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతున్నారు. శివరామకృష్ణ!
  ఆయన గురించి నీకున్న జ్ఞానము అపారం. అందులో నాకింత దానం చేసినందులకు ధన్యుణ్ణి.

మీ మాటలు

*