“ఎవడే సుబ్రహ్మణ్యం”: ఒక అంతర్ యాత్ర!

mohan

మోహన్ రావిపాటి 

మనమెవరమో మనకు నిజంగా తెలుసా ! మన పేరు, సమాజంలో మన హోదా, మనం విద్యార్హత, మన ఉద్యోగం, ఇవేనా మనం ? అసలు నిజంగా మనం అంటే ఎవరో మనకు తెలుసా !! అసలు తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడైనా చేశామా !! మీరెవరు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనం ఏమని సమాధానం ఇస్తున్నాం ? అసలు మనం అనుకొనే మనం కాక ఇంకేదైనా మన గురించి మనం తెలుసుకోవాల్సి ఉందా !! మనకున్న డబ్బుతోనో, లేదా మన హోదాతోనో, మనల్ని మనం మరొకరికి పరిచయం చేసుకోకుండా అసలు మరోలా ఎప్పుడైనా పరిచయం చేసుకొనే ప్రయత్నం చేశామా !! పోనీ మనల్ని ఎవరైనా అలా పరిచయం చేసుకున్నారా !! లేదు కదా !! అసలు మనం ఎప్పుడూ ఆ దిశ గా ఆలోచన కూడా చేయలేదు కదా !!

కరెన్సీ వెంటో, హోదా వెంటో, పేరు ప్రఖ్యాతుల వెంటో, మరో దాని వెంటో మనం పడుతున్నాం తప్ప మనల్ని మనం ఎప్పుడైనా చూసుకున్నమా !! అసలు మనల్ని మనం ప్రశ్నించుకున్నామా !! సమాజంలో మన స్థానం ఏమిటా అని ఆలోచిస్తూ జీవిస్తున్నాం కానీ , సమాజానికి మనలో ఏ స్థానం ఉందో ఆలోచించామా !! అసలు మనకోసం సమాజం ఉందా !! సమాజం కోసం మనం ఉన్నామా !!  ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు .

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం  తెలుసుకోవటానికి చేసిన స్వయం శోధనా ప్రయాణమే “ఎవడే సుబ్రహ్మణ్యం”

సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు(నాని) ఒక సీడ్స్ కంపెనీ లో జి.యం. కంపెనీ మరో కంపెనీ ని టేకోవర్ చేసుకోవటం ద్వారా లాభాలు తీసుకువచ్చి దాని ఓనర్ కూతురు ని పెళ్ళిచేసుకోవాలన్నది అతని ప్లాన్. ఆ రెండో కంపెనీ పెద్ద లాభాపేక్ష లేకుండా రైతులకు సహాయంగా ఉంటూ ఉంటుంది. ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ని మభ్యపెట్టి షేర్స్ కొనుగోలు చేస్తూ ఉంటాడు సుబ్బు, అదే సమయంలో ఓనర్ కూతురు తో అతని పెళ్ళి నిశ్చయమవుతుంది, ఆ నిశ్చిత్తార్ధం జరుగుతున్నప్పుడే సుబ్బు చిన్ననాటి స్నేహితుడు ఋషి ( విజయ్ దేవరకొండ) సుబ్బును కలుస్తాడు.

జీవితాన్ని జీవితంలా చూడటమే నా పాలసీ అనుకొనే మనస్తత్వం ఋషిది. డబ్బు కన్నా జీవితం ముఖ్యం అనుకుంటూ ఉంటాడు, తన చిన్నప్పటి కల హిమాలయాల్లో  ఉన్న  ‘దూధ్ కాశీ” ని సుబ్బు తో కలిసి దర్శించి రావాలి అని,  సుబ్బును దానికోసం కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సుబ్బు షేర్స్ కొనే ప్రయత్నం లో ఆనందిని ( మాళవికా నాయర్) దగ్గర ఉన్న షేర్స్ కొనటానికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయి సుబ్బుకు, ఋషి కి స్నేహితురాలు అవుతుంది . అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ లో ఋషి చనిపోతాడు, ఆ ఆస్తికలను దూధ్ కాశీ లో కలిపితేనే తన దగ్గర ఉన్న షేర్స్ ని సుబ్బుకు అమ్ముతాను అనే కండిషన్ పెడుతుంది ఆనందిని.

yevad2 జీవితాన్ని ఎప్పుడూ డబ్బులు, లెక్కల్లో కొలిచే సుబ్బుకు , జీవితాన్ని కేవలం జీవితం లా చూడాలి, జీవితంలో డబ్బు కన్నా ఆనందం , మరో మనిషి పట్ల ప్రేమ, ఇంకా ముఖ్యం అనుకొనే ఋషి మనస్తత్వాల మధ్య సంఘర్షణే కథాంశం , ఋషి మరణించినా ఆస్తికల రూపంలో వారి వెంటే ఉంటూ ఆ సంగతి ఎప్పుడూ వారికి మానసికంగా గుర్తు చేస్తూ ఉంటాడు . ఆ ప్రయాణం లో సుబ్బు తనను తాను ఎలా సంస్కరించుకున్నాడు . తన మెటీరియలిస్టిక్ జీవితాన్ని ఎందుకు వదులుకున్నాడు,అసలు జీవితం లో ఆనందం అంటే ఏమిటి ? ఎప్పుడు ఆనందంగా ఉంటాం ?? వీటన్నిటిని సుబ్బు తెలుసుకోవటమే ఈ సినిమా .

కొన్ని సన్నివేశాలు గమ్యం సినిమాని గుర్తు తెచ్చినా, సినిమా ఒక విభిన్నమైన కథాంశం తో కూడిన సినిమా అనే చెప్పాలి . గమ్యం లో హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్ళే ప్రయత్నంలో గాలిశీను అనే పాత్ర ద్వారా. ఆ మార్పు కు నాంది పలుకుతాడు, ఈ సినిమాలో స్నేహితుడి ఆఖరి కోరిక కోసం బయల్దేరిన హీరో కి హీరోయిన్ పాత్ర ద్వారా ఆ మార్పు కు నాంది పలుకుతాడు, ఏదో ఒక బలమైన పాత్ర్ర లేకుండా ఒకరి జీవిత గమనాన్ని మార్చటం సులభం కాదు. అందుకే అలాంటి పాత్ర .

ఇక నటీనటుల విషయానికి వస్తే మరోసారి నాని తాను ఎంత గొప్ప నటుడినో నిరూపించుకున్నాడు, విజయ్ దేవర కొండ రూపంలో మరో మంచి నటుడు తెలుగు తెర కు పరిచయం అయ్యాడు, ఇక మాళివికా నాయర్ అత్యధ్బుతంగా నటించింది, దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఇలాంటి విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు అభినందించాలి,అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినా , తప్పక చూడాల్సిన సినిమా.

*

మీ మాటలు

  1. Nisheedhi says:

    Cool ! Felt like watching the movie after reading your review .

  2. gnana prasuna mamanduru says:

    చాల బావుందండి రివ్యూ… జీవిత విలువలే అన్నిటికన్నా ముఖ్యమని నమ్మే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. థాంక్స్ మోహన్ గారు…

  3. sunita gedela says:

    మీ రివ్యూ చాల ఇన్స్పైరింగ్ గా వుంది. నిజంగా మూవీ కూడా ఇలాగే వుంటే చాలా బాగుంటుంది. ఇంత మనీ మైండెడ్ గా వున్న మనిషి తనను తానూ తెల్సుకునే పరిస్తితులు కలగజేయడం లో డైరెక్టర్ విజయం సాధించాడనే చెప్పాలి చివరికి తనేంటో తెల్సుకునేసరికి ఎలా వున్నాయి అతని ఫీలింగ్స్ తెల్సుకోవాలని చాలా ఈగర్ గా వుంది . బలమైన పాత్ర ఎలా వుంటుందో చెప్పడానికి గాలి శీను పాత్ర ప్రస్తావించడమ్ మంచి పోలిక. మీ రివ్యూ బట్టే మూవీ చూస్తా. బాగోలేకపోతే టికెట్ డబ్బులు మీరే ఇవ్వాలి.

  4. mohan.ravipati says:

    మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను , చూడండి

  5. Swarna.M says:

    మీ రివ్యూ చాలా బాగుంది. “ఎవడే సుబ్రహ్మణ్యం”: ఒక అంతర్ యాత్ర!
    టైటిల్ లోనే సినిమా గురించి చక్కగా చెప్పారు..

  6. తిరుపాలు says:

    మనం అంటే ఎవరో మనకు తెలుసా !! ముందు ఒక శరీరం నుండి ఉద్బవిoచిన మరో శరీరం. దాన్నుండి ఒక నామం, ఒక గోత్రం, ఒక కులం, ఆ కులానికి ఉన్న సామాజిక గుర్తింపు, తండ్రి పేరు,దాన్ని బట్టి చదువు, తరువాత వృత్తి, దాన్ని బట్టి స్టేటస్, దాన్ని బట్టి దాన్ని బట్టి సంపాదన, అక్కదేక్కడో కనిపించి కనిపిoచి కనిపించ ని వ్యక్తిత్వం .ఇన్ని కలిపితే ఒక వ్యక్తి మన సమాజంలో. మీ సినిమా రివ్యూ చాలా బాగుoది. ఇటీవలి కవితా ప్రసాద్ గారి వ్యక్తిత్వ వికాస పా టo u Tub వీడియో చూసాను అందు లో నాకు మనుష్యు లను మతాలు మభ్య పెట్టటo కoటే ఎక్కువగా కనిపిoచలేదు.

    • mohan.ravipati says:

      మనం ఎవరు అనే ఆలోచన ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, మన హోదానే కొందరికి ముఖ్యం , కొందరికి కాదు, review మీద మీ అభిప్రాయం తెలియచేసినందుకు thanq

  7. devulapalli durgaprasad says:

    సరి అయిన సినిమా కి సరి అయిన రివ్యూ రాసారు మీరు. ఈ సినిమా చూసి వచ్చిన స్నేహితుడు నాకు ఈ సినిమా గురించి చాల బాగా చెప్పాడు. మరిన్ని నిమిషాల లోనే మీ రివ్యూ చదవడం జరిగింది. మీ రివ్యూ తో ఆ సినిమా మీద మరింత సదభిప్రాయం కలిగింది. ఇక సినిమా చూడడం మాత్రమే మిగిలింది. నాని, అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్ళ సినిమాలు కచ్చితంగా ఎంతో కొంత సంతృప్తిని యిస్తాయ్. కల్పన అయినా, కధ అయినా హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకుడిని మోసం చేయాలని చూడవు. ప్రేక్షకుడికి మనం ఏమి చెప్తే అంత అన్న అహంకార ధోరణి ఈ సినిమా లలో కనిపించదు.

    • mohan.ravipati says:

      సినిమా చూడండి ; తప్పకుండా మీకు నచ్చుతుంది అనే అనుకుంటాను

  8. మీ వ్యాసం చదివాను. సినిమా కూడా చూసాను. సినిమా చూసాక మీ వ్యాసం మళ్ళీ చదివాను. ఓ మంచి సినిమా చూసిన ఆనందానికి మంచి సినిమాపై మంచి పరిచయం చదివిన తృప్తి తోడయింది.
    థాంక్యూ మోహన్ గారూ..

మీ మాటలు

*