ముల్లూ, అరిటాకూ… ఒక సమాంతర హింసా…

ల.లి.త.

 

lalitha parnandiలెస్లీ ఉడ్విన్ బి.బి.సి. కోసం తీసిన “India’s Daughter” డాక్యుమెంటరీ నిషేధంలో ఉంది.  కోర్టు దీన్నింకా పరిశీలిస్తోంది.   ‘నిర్భయ’ పేరుతో దేశంలో అందరూ పిలుచుకున్న జ్యోతీ సింగ్ ఢిల్లీలో హింసాత్మకమైన సామూహిక అత్యాచారానికి గురై చనిపోయిన  డిసెంబర్ 16, 2012 నుండీ, నిందితులకు కింది కోర్టు మరణశిక్ష విధించిన రోజు వరకూ జరిగిన ప్రజా ఉద్యమాన్ని వివరించింది ఈ డాక్యుమెంటరీ.  ముఖ్యంగా జ్యోతి తల్లిదండ్రులూ, నేరస్తుడు ముఖేష్ సింగ్ మాట్లాడారు ఇందులో.  నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని లేవగొట్టి, ప్రజాస్వామ్యం సాధించిన చరిత్రాత్మక విజయాన్ని వివరించిన డాక్యుమెంటరీ…  దీనిలో మన దేశానికి జరిగిన అవమానం ఏమీ లేదు.

ఒక సమాజంలోని పరిణతి చెందిన యువతరం ఈ సంఘటనకు ఎంత బాగా స్పందించిందో చెప్పటం మనల్ని తక్కువ చెయ్యటం ఎలా అవుతుంది? దీనిలో పచ్చిగా స్త్రీ జాతికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన లాయర్లతోబాటు సంస్కారం మూర్తీభవించిన జ్యోతి తండ్రీ, ఆమె ట్యూటర్, నిర్భయ చట్టం తయారు చేసిన న్యాయమూర్తుల్లో ఒకాయన కూడా ఉన్నారు.   ఖప్ పంచాయితీలు ఆడపిల్లల చేతుల్లోంచి సెల్ ఫోన్లు లాక్కున్నట్టుగా సమస్యని మూతవేసి, ప్రభుత్వం బి.బి.సి. మీద చట్టపరమైన చర్యకు దిగుతామనటం పిల్లకాయల ఉక్రోషంలా ఉంది.

*****

రేప్ –  “స్త్రీ శరీరం మీద హక్కు స్త్రీది కాదు. అది పురుషుడిది”  అని కొంతమంది బలంగా చేస్తున్న స్టేట్మెంట్.

“మీరు ఏ చట్టాలు చేసుకున్నా మాకు ఒకటే. ఆడది అంటే మాకు ఒక వినోదం. ఆడ శరీరాల మీద హక్కులు మావి. బయటి ప్రపంచం మాది. అక్కడ ఆడవాళ్ళు కూడా తిరుగుతామంటే మేం వాళ్ళని  ఏమైనా చేసేసే అధికారం మాకుంది.”  — ఇది కొద్దిమంది మగవాళ్ళ ఆలోచనే కావచ్చు. కానీ చాలా సంస్కారవంతులుగా కనిపించే మగవాళ్ళు కూడా ఈ మురికి ఆలోచనాధార లోని చిన్న పాయను పంచుకుంటూనే ఉన్నారు. రేప్ జరిగిందని విన్నప్పుడు ఈ పాయలు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి.  “ఈ ఆడపిల్లలు సరిగ్గా బట్టలు కట్టుకోరు. అందుకే అత్యాచారాలు జరుగుతాయి… ఆడపిల్లలు రాత్రివేళ తిరుగుళ్ళు ఏమిటి?… అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి తిరగటం ఎక్కువైపోయింది…”

ఆడపిల్ల కట్టుకున్న బట్టకీ రేప్ కీ సంబంధం ఉంటే పల్లెటూళ్ళలో ఒళ్ళు కప్పుకునే తిరిగే ఆడవాళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?  తెలంగాణా పల్లెల్లో పొలంపని చేసేటప్పుడు పైటను తీసి నడుం చుట్టూ కట్టేస్తారు ముందు తరం ఆడవాళ్ళు. ఉత్తరాంధ్రలో బ్లౌజ్ వేసుకోవడం అంటే సిగ్గు పడే ముసలి వాళ్ళు ఇంకా ఉన్నారు.  జీన్స్, టీ షర్టుల్లో స్త్రీలను చూడటం అలవాటైన చదువుకున్న ‘టెకీ’లకు లంగా, ఓణీల్లో కనిపించే నడుము ఓ వింత.  ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతపు దుస్తులూ, నగరాల్లో సౌకర్యంకోసం పేంట్, షర్ట్ లూ వేసుకు తిరుగుతారు అమ్మాయిలు.  ‘మనకు తెలిసిందే సంస్కృతి’ అనుకునే హ్రస్వదృష్టినుండి వచ్చినదే ఈ దుస్తుల సెన్సారింగ్.

ప్రతీ స్త్రీ ఏదో ఒక పని చేస్తూ బయట తిరిగి ఇంటికీ దేశానికీ తనవంతు తాను ఉపయోగపడుతూ ఉంటే, ఇంకా దుస్తులూ, పగలూ, రాత్రీ అంటూ మాట్లాడటం ఎంత అర్థ రహితం! అయినా రాత్రి అంటే ఎన్ని గంటలు? ఢిల్లీ, హైదరాబాద్ లాంటి అనేక ప్రదేశాల్లో రాత్రి 8 గంటలంటే సాయంత్రం కిందే లెక్క. అలాంటి సమయంలో జ్యోతి రేప్ కు గురయింది.  మాటు వేసే వేటగాళ్ళు పగటిపూట కూడా తిరుగుతారు. ఆడా, మగా కలిసి చదివి, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కలిసి తిరగటం, మాట్లాడుకోవటం, ఇష్టపడటం కూడా ఉంటాయి కదా!  రేప్ నేరాల్ని అదుపు చెయ్యటం అనే వంకతో ఇప్పుడు ఆడవాళ్ళందరినీ వంటిళ్ళలోకి తోసెయ్యటం అసాధ్యం కదా! తిరగబడతారు. తాలిబన్లలాంటి వాళ్ళో, ఖప్ పంచాయితీలో గట్టి పట్టు పడితే తప్ప ఆడవాళ్ళ తిక్క కుదరదనుకుంటే అత్యాచార సమస్యకు అది కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే తాలిబన్లకు కూడా రేప్ అజెండా ఉంది మరి!

 

జ్యోతి కేసులో నేరస్తుల తరఫున వాదించిన లాయర్ ఏ.పి. సింగ్ చదువుకున్న చదువు అతని మూర్ఖత్వాన్ని ఏమాత్రం తీసెయ్యలేక పోయింది. “నా చెల్లెలో, కూతురో ఇలా పెళ్ళికి ముందు మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే ఫార్మ్ హౌస్ లో కుటుంబం అందరిముందూ దాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను” అని ఆనాడు న్యూస్ చానెల్స్ కు చెప్పిన మాటనే మళ్ళీ నొక్కి చెప్పాడు ఈ డాక్యుమెంటరీలో.

nirbhaya-case

రేప్ –  “పబ్లిక్ స్పేస్ ఆడవాళ్లది కాదు” అనే ఒక తీవ్రమైన స్టేట్మెంట్.

“ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. ఉండాలి. అదే వాళ్ళ చోటు. బయట వాళ్ళకేం పని? బైటకొస్తే కుటుంబ సభ్యులతోనే రావాలి. ఒంటరిగా తిరగరాదు. మగ స్నేహితులతో అసలు తిరగరాదు.”  ఈ రూల్ బుక్ పట్టుకుని ప్రవచించే మగవాళ్ళు మనకి చాలామందే ఉండటం మరో బాధ. ‘అరిటాకు మీద ముల్లు పడ్డా ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకుకే నష్టం’ అనే సామెతను పాతబడనీయకుండా రేప్ నేరాల్లో బాధితులే నేరానికి కారణం అని నింద వేస్తున్నారు.  ఇలాంటి వాళ్ళతో,  స్త్రీలు బయట స్వేచ్ఛగా తిరిగే హక్కు కోసం స్త్రీలూ, స్త్రీవాదులూ, కొంతమంది  మగవాళ్ళూ చేస్తున్న యుద్ధాన్ని ఎంతైనా అభినందించాలి.

కొంతైనా మార్పు అనేది మగపిల్లలను పెంచే తీరు, పోలీసుల బాధ్యతాయుతమైన ప్రవర్తన, నేరానికి శిక్ష త్వరగా వెయ్యటం … వీటివలన వస్తుంది కానీ, ఇంకా ఆడపిల్లలను గంపకింద కోడిపిల్లల్లా మూసిపెట్టాలనుకునే ఆలోచనల వల్ల రాదు. బాధాకరమైన విషయం ఏమిటంటే పబ్లిక్ స్పేస్ కోసం మనసులో ఎంత తాపత్రయ పడుతున్నా, ఢిల్లీ లాంటి చోట్ల ఆడపిల్లలు సాయంత్రం ఏడుగంటలనుండీ గంపకింద చేరుతున్నారు.  రేప్ కి కారణం ఆడవాళ్లేనని ఎక్కువమంది చెప్తుంటే ఆడవాళ్ళలో అభద్రత ఎలా పోతుంది? ఎవరు పోగొట్టగలరు? అలా మాట్లాడేవాళ్ళను  గట్టిగా నిరసించటంలో మాత్రం స్త్రీలు వెనుదియ్యటం లేదు. రేప్ జరిగితే ధైర్యంగా రిపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సంధి కాలంలో “వీళ్ళు నోళ్ళు విప్పే ధైర్యం చేస్తే ఊరుకోం” అంటూ దౌర్జన్యాన్ని సిగ్నల్ గా పంపిస్తోంది రాతిలా ఘనీభవించిన పురుషాధిక్యత.  ఈ డాక్యుమెంటరీలో నేరస్తుడు ముఖేష్ సింగ్ “బట్టలు విప్పటం, దౌర్జన్యం చెయ్యటం లాంటివి చేస్తే ఎవరూ బైటకు చెప్పుకోలేరనే ధైర్యంతోనే తన అన్న రాం సింగ్ (జైలులో ఉరేసుకుని చనిపోయిన నిర్భయ రేపిస్టు) ఇలాంటి పనులు చేస్తుండేవాడ”ని చెప్తాడు.

చదువుకున్న స్త్రీకి అలవడే చైతన్యం ఈ అణచివేతను ప్రశ్నించకుండా ఉండనివ్వదు. మీడియా ఈ చైతన్యానికి సహాయాన్ని అందిస్తోంది.  అప్పుడిక రాజకీయ నాయకులూ, మేథావులూ, వివేకవంతులైన యువకులూ, అందరూ ఈ సమస్య గురించి ఆలోచించక తప్పదు. మొత్తం సమాజం అంతా కూడా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అసమానతల వైపు నడుస్తూ, ఆడవాళ్ళను మాత్రం ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించి చట్టాలు చేస్తోంది. ఇది  నిర్భయ చట్టాన్ని తక్కువ చేయడం కాదు. చట్టాలను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే,  మొదటిగా పబ్లిక్ స్పేస్ ఆడవాళ్లది కూడాననే అవగాహనను నాయకులూ, పోలీసులూ తల కెక్కించుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

కొందరు మహా ఉద్రేకంగా రేప్ నేరస్తులకు మరణశిక్ష వెయ్యలంటారు. ఇది మాస్ హిస్టీరియాలోంచి వచ్చిన మాట. అసలు మరణ శిక్షనే రద్దు చెయ్యాలనే మానవీయ ప్రయత్నం నుంచీ వెనక్కు తీసే పరుగు.  ఈ మాట చెప్పేవాళ్ళు “India’s Daughter” లో నిర్భయ కేసులో నేరస్తుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ చూడాలి. అతని దృష్టిలో రేప్ చాలా సామాన్యమైన నేరం. దానికి మరణశిక్ష ఏమిటో అతనికి అర్ధం కాదు. “రేప్ కి మరణశిక్ష లాంటిది ఏదైనా వస్తే, రేపిస్టులు బాధితుల్ని చంపి పారేస్తారు.  Death … అంతే”. అన్నాడతను చాలా మామూలుగా.

రేప్ – విల్లాలుగానూ మురికి కూపాలుగానూ విడిపోయిన రెండు ప్రపంచాల ఘర్షణలో స్త్రీల విలవిల.

ముఖేష్ సింగ్ ప్రపంచమే వేరు. “రేప్ కి మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ బాధ్యులు. ఆడవాళ్ళు ఇల్లు చూసుకుంటూ ఉండాలి. రాత్రివేళ అబ్బాయిలతో సినిమాలూ డిస్కోలూ ఏమిటి? జ్యోతికీ, ఆమె స్నేహితుడికీ అలా తిరగకూడదని మా అన్న ఓ పాఠం చెప్పాలనుకున్నాడు. వాళ్ళు తిరగబడి అతన్ని కొట్టడంతో అది రేప్ కి దారి తీసింది. అయినా ఆమె ప్రతిఘటించకుండా ఉండాల్సింది. (నోరు మూసుకుంటే చచ్చిపోకుండా ఉండేదని ధ్వని)…     ఇవీ అతని ఆలోచనలు.

ముఖేష్ సింగ్ మాటల్లో అపరాధ భావన కనిపించదు. “You are what you were before fourteen years of age” … ఎటువంటి బాల్యం అతనిది? వాళ్ళు ఉండే రవిదాస్ క్యాంపు అనే ఢిల్లీ మురికివాడలో నేరస్తులు ఆరుగురూ స్నేహితులు అయారు. తిండి కూడా సరిగ్గా లేని బాల్యం అందరిదీ. తిట్లూ, దెబ్బలూ వాళ్లకు అతి సామాన్యం. తల్లిని, అక్క చెల్లెళ్ళనూ  కొడుతూ ఉండే మగవాళ్ళు…  నోళ్ళు మూసుకునే ఉండే ఆడవాళ్ళు, తిండి కోసం శరీరంతో వ్యాపారం చేసే ఆడవాళ్ళు… వీళ్ళు చూడని మొరటుతనం అంటూ ఏదీ మిగిలిలేదు.  ఆడవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళకు లోబడే ఉండాలనుకునే తత్వాన్ని చేపకు ఈతంత సహజంగా అలవరచిన వాతావరణం… ఇదొక అథోజగత్తు.

మరోవైపు మాల్స్ అనే దివ్యలోకాల్లో కొంతమందికే దొరికే సంపద మెరుపు…  ఆ అథోజగత్తుకీ,  ఈ ఇంద్ర భవనాలకీ మధ్య నిచ్చెనలు వెయ్య ప్రయత్నించే మధ్య తరగతి…

నగరాల్లో మధ్యతరగతి అమ్మాయిలమీద చేసే దాడి, స్త్రీ మీద ఆధిక్య ప్రకటనే కాకుండా, తమకంటే బాగా బతికే మనుషులమీద తీర్చుకునే కక్ష కూడా!  “మన సిటీ బాగానే ఉంటుంది. బైటనుంచి పనులకోసం వస్తున్నారు చూడండి. వాళ్ళవల్లే నేరాలు పెరిగిపోతున్నాయి” అంటారు కొందరు.  సిటీ కొందరికోసం ధగధగ మెరిసే జీవితాన్ని అందిస్తోంది. మరి కొందరికోసం మురికివాడల్ని తయారు చేస్తోంది. ఈ ఎగుడు దిగుళ్ళ నేలమీద ముందుగా బలయ్యేది ఆడవాళ్ళు, పిల్లలు.

దిగువ మధ్యతరగతికి చెందిన జ్యోతి తండ్రి, తల్లి.  వీళ్ళిద్దరూ సంస్కారంలో తమ సమాజంలో చాలా మంది కంటే ముందున్నారు. జ్యోతి చదువుకోసం పొలం అమ్మారంటే, వాళ్ళు తమ బిడ్డకు ఎంత విలువ ఇచ్చారో అర్థం అవుతుంది. ఇది ఉత్తర భారత దేశంలో చాలా అరుదైన విషయం.  “జ్యోతి పేరు బైటకు చెప్పటానికి నాకు సంకోచమేమీ లేదు. జ్యోతి ఒక చిహ్నంగా మారిపోయింది. ఈ సమాజం ఆడవాళ్ళకి ఇస్తున్న విలువ ఏమిటని ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది”.  అంటున్నాడు జ్యోతి తండ్రి.

మరోపక్క పైపైకి ఎదిగే ఆశలతో ఢిల్లీ మధ్యతరగతి యువత… ఆడా మగా కలిసి భుజాలు కలిపి చదువులూ, ఉద్యోగాలతో పబ్లిక్ స్పేస్ ని సమంగా పంచుకుంటున్న తరం. సినిమాకు అమ్మాయీ అబ్బాయీ కలిసి వెళ్ళటం అనే మామూలు విషయాన్ని గురించి కొంతమంది పెద్దవాళ్ళు అదేదో తప్పులా మాట్లాడటం వీళ్ళకు అర్థమే కాదు.  వీళ్ళ  ప్రపంచం జ్యోతిమీద జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పోయింది.  ఏ నాయకుడూ లేకుండానే నెల రోజులపాటు ఉద్యమం చేసి నిర్భయ చట్టాన్ని సాధించుకుంది.  ఆ కొత్తల్లో మరికొన్ని రేప్ కేసులు కూడా కోర్టుల్లో వేగంగానే కదిలాయి.

nir1

రేప్ – జాతుల, తెగల, కులాల, వర్గాల కుమ్ములాటలో స్త్రీకి తగిలే లోతైన గాయం.

నిర్భయ చట్టం వచ్చిన తరువాతే ఉత్తరప్రదేశ్ బదాయూఁ లో చీకటివేళ బహిర్భూమికి వెళ్ళిన ఇద్దరు ఆడపిల్లలని చెట్టుకు ఉరివేసి చంపినవాళ్ళ రాక్షసత్వానికి దేశమంతా నిర్ఘాంతపోయింది. ఆ కేసులో అరెస్టులు జరిగినా, సరిగ్గా కేసును వివరించ లేకపోయారు పోలీసులు. ఆ పిల్లల హంతకుల రహస్యాలు గంగానది వరదల్లో సమాధి అయిపోయాయి.  ఈ హీనమైన అత్యాచారాల వెనుక ఉన్న బలమైన స్టేట్ మెంట్ ఏమిటి ? ఆధిక్య ప్రదర్శన… అసలు రేప్ స్వభావమే అణచివేత…  యుద్ధాలు జరిగే చోట్ల రేప్ లు అడ్డూ ఆపూ లేకుండా జరుగుతాయి. ఆస్తుల మీదా, భూమి మీదా ఆధిక్య ప్రకటన కోసం చేసే అణచివేత ఆడవాళ్ళ మీద మానభంగం అనే రూపాన్ని తీసుకుంటుంది. అక్కడ అది ఒక అజెండా. ఆడవాళ్ళ గర్భాల్లో తమ మతాన్నీ తెగనూ పాతి, వేరే మతాన్నీ తెగనూ అణచివేసే ఎత్తుగడ.  అలాగే దళితులూ స్త్రీలూ “మేమూ మీతో సమానమే. భూమి హక్కులు కావాలి. ఆత్మ గౌరవం కావాలి” అని తిరగబడ్డచోట (కారంచేడు, ఖైర్లాంజీ, రాజస్తాన్ లో భన్వారీదేవి), ఊరి పెద్దలు ఆ దళితుల్లో మగవాళ్ళను నరికీ, ఆడవాళ్ళను రేప్ చేసీ ఆధిక్యత ప్రకటిస్తారు. మానభంగాన్ని శిక్షగా వేస్తున్న సమాజాలు ఇంకా ఉన్న దేశం మనది.  పల్లెటూళ్లలో రేప్ కి ఉన్న ఈ అణచివేత స్వభావాన్ని అందరం ఇంచుమించుగా ఒప్పేసుకుంటాం. మన గ్రామీణ ప్రపంచం ఇప్పుడు మనకు సంబంధించినది కాదు. అందుకే బదాయూఁ, రోహతక్ లు అందరి దృష్టినీ ఆకర్షించవు. నగరాల్లో బతుకుతూ మీడియా తో సహా అందరం దీన్నంతా collateral damage గా భావించి మర్చిపోతాం.

రేప్ –   ఒంటరి మనసుల్లోంచి సుడి తిరిగి బైటపడుతున్న ఉన్మాదపు వాంతి.     

నిర్భయ సంఘటన జరిగిన రెండేళ్లకు, మళ్ళీ అదేరకమైన రేప్ కేసు వార్తల్లోకి వచ్చింది.  ఈ మధ్య మతి స్థిమితంలేని ఒక నేపాలీ అమ్మాయిమీద రోహతక్ లో దాడి జరిగింది.  జ్యోతీ సింగ్ శరీరంలో గుచ్చినట్టే ఈమె శరీరంలోనూ బ్లేడ్లు, రాళ్ళు గుచ్చారు. అత్యాచారం చెయ్యటమే కాకుండా మధ్యయుగాల మాదిరిగా శరీరాన్ని హింసించటం చూస్తుంటే, ఈ చిత్రహింసల ఊహలు ఎక్కడినుండి వస్తున్నాయని  భయం వేస్తుంది. ఆ అమానుషత్వం చూడలేక ఢిల్లీ లాగే రోహతక్ కూడా వణికింది.  ప్రజలు రోడ్డున పడ్డారు.  ఆ రోజు ఒళ్ళు చితికిపోయి ఆరిపోతున్న జ్యోతి, తన శక్తంతా కూడదీసుకుని గుప్పున వెలిగి, జరిగిందేమిటో చెప్పి పోరాడింది.  తనకేం జరిగిందో కూడా సరిగ్గా చెప్పలేని ఈ పిచ్చి పిల్లకు  నోరు విప్పే అవకాశమే లేకుండా చేసి చంపి పారేశారు రాక్షసులు.  జనం గోల పెడితే గానీ పోలీసులు ఈసారీ కదల్లేదు.

ప్రపంచం అంతా ఒకే ఊరుగా మారాక  ఒక్కసారిగా 24 గంటల టీవీలూ, సినిమాలూ, క్రైమ్ సీరియళ్ళు, ప్రతి వీధిలో వైన్ షాపులూ, నెట్ లో సెక్స్ ట్యూబులూ సునామీలా మనల్ని చుట్టేశాయి. అరచేతిలో ఇమిడే సెల్ ఫోన్ అనబడే నిషిద్ధ ఫలం ఇప్పుడు అందరిదీ…  సినిమాలని చాలామంది తప్పు పడతారు గానీ,  వాటికంటే ఇంటర్నెట్ సెక్స్ వీడియోల విచ్చలవిడి అందుబాటుకీ, స్త్రీల మీద జరిగే అత్యాచారాలకీ ఉన్న సంబంధం గట్టిదేనేమో ఆలోచించాలి.

అన్నీ ఉన్నతనం, ఏమీ లేనితనం … ఈ రెండూ నిరంతరం ఎదురెదురుగా బతుకుతున్నాయి మన నగరాల్లో. డబ్బు చెట్టు విస్తరించి ఎన్ని పళ్ళు పండినా, అవి చాలా మందికి అందని ద్రాక్షలై, రాళ్ళతో చెట్టును కొట్టి పళ్ళను అందుకోమంటున్నాయి.  తీరని కోరికలూ, ఉక్రోషాలూ, తలకెక్కుతున్న వికారాలూ కలిసి దౌర్జన్యానికి ఉసిగొల్పుతున్నాయి.  ఏదెలా ఉన్నా అసమాన సమాజపు అణచివేతలూ, నేరాలూ, ఆధిక్య ప్రకటనల్లో జరిగే collateral damage  ఆడవాళ్లకే… ఎప్పుడైనా… ఎక్కడైనా…

 

 *

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. చాలా బాగుంది వ్యాసం. ముఖ్యంగా రేపుల గురించి మీరు పెట్టిన సబ్ హెడ్డింగ్స్ కరక్ట్ గా ఉన్నాయి.

  2. Vanaja Tatineni says:

    ఈ వ్యాసం చదివిన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. వ్యాఖ్యానించడానికి కూడా మాటలు లేనంత . సమాజం ఆరోగ్యంగా లేకపోతే ముందుగా బలయ్యే ఆడవాళ్ళు పిల్లల విషయం చరిత్ర చెపుతోన్న సత్యం . వర్తమానం ఎదుర్కుంటున్న సమస్య. భవిష్యత్ కి సవాల్ విసురుతుంది . చాలా భయమేస్తున్దండీ !

  3. Thirupalu says:

    ఈ ‘రేప్’ ల గురించి కొడవటి గంటి కుటుంబరావు ఒక చోట అంటారు ఆయన చిన్న తనం లో గుంటూరు పోలిస్టేషన్ లో ఒక కైదీ భార్య కైదీ కి అన్నం తీసు కొచ్చి నపుడు ఒక కానిస్టిబుల్ ఆమెను రేప్ చేశాడట. ఆ విషయం బయటికి పొక్కటం తో ఆ మరునాడు అటు ఆత్మా హత్య చేసు కొని చనిపోయాడట. ఆకాలం మనదృష్టిలో ఎంత వెనుక బడి దైనా ఒక సమాజక నైతికత ఆ నాడు ఉమ్డి ఉంటుంది. కాబట్టే ఆటను చేసిన తప్పుకు అతనే ప్రాయచ్చిత్తం చేసుకున్నాడు. ఈ నాడు గ్ళొభలైజేషన్ కాలం లో అడుగంటి పోయి ఉన్న మాట కాందసాన్ని, దాన్ని అంటి పెట్టుకొని ఉన్న పురుష దుర అహంకారాన్ని నీరు పోసి పెర్టిలైజ్ చేసి మరీ పెంచుతున్నది సామ్రాజ్యవాదం.

  4. Sharada Sivapurapu says:

    సమాజములో రేప్ కి ఉన్న అన్ని కోణాలూ స్పృసిస్తూ సాగిన్దీ వ్యాసం. నిజమే సమాజంలో పేద ధనిక వర్గాల మధ్య అంతరం భూమ్యాకాశాల్ల ఉన్నంత కాలం పేద వర్గాల పిల్లలకి సరైన విద్య తిండి బట్ట ఇవ్వడం మీద ద్రష్టి పెట్టనంత కాలం ఆడవాళ్ళ మీద అత్యాచారాలను చట్టాలను మార్చడం వలనో శిక్ష వెంటనె అమలు చెయ్యడం వలనో పూర్తిగా అరికట్టలెము. నిజానికి లింగ వివక్ష పూర్తిగా పేదరికానికి సంబంధించిన సమస్య మాత్రమె కాదు. ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించడం మాత్రమె జరుగుతుంది.

  5. మనసులో నుంచి వణుకు పుడుతుంది. ఎవరో పోగోడితే పోతుంది పరువు అనుకుని గగ్గోల్లు పెడుతున్న వారికి సమస్య మూలాలు, పరిష్కార మార్గాలు పట్టవు. ది ల్యాండ్ అఫ్ హిపోక్రాసి.
    మంచి వ్యాసం.

  6. Chandrika says:

    నిజంగా ఈ డాక్యుమెంటరీ ఏం చూపించింది? భారత దేశపు చట్టం లో తెచ్చిన మార్పుని చూపించిందా? ఏ మాత్రం లేదు. పోనీ వేరే దేశాల్లొ ఆడవారికి హక్కుల కోసం మీరు వీళ్ళలాగా ఇలాగే పోరాడాలి అని సందేశం ఇచ్చిందా? అదీ లేదు. ముఖేష్ సింగ్ ఒక కరడు కట్టిన నేరస్థుడు. అందుకే ఉరి శిక్ష వేయబడింది అన్న సంగతి అందరూ ఙాపకం పెట్టుకోవాలి. ఇంక అతని లాయర్లు. అతని తరుఫున వాదిస్తున్న వారు. సాధారణ మనుషుల్లాగా మాట్లాడుతారు అనుకోడం చాలా పొరబాటు. లెజ్లీ ఉద్వైన్ గారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఏం సాధించారో అర్ధం కాలేదు. అందరూ ఈ డాక్యుమెంటరీ చూపించించాలనే కాని, నేరస్థులకి శిక్ష తొందరగా అమలు చేయాలని ఎవ్వరూ బ్లాగుల్లో రాయట్లేదు, ఎక్కడా ధర్నాలు చేయట్లేదు. ఇది చాలా శొచనీయం. ఇంక బట్టల విషయం. అమ్మాయిల బట్టలు అనగానే చేతులు కూడ లేకుండా డిజైను చేస్తున్నారు. అమ్మాయిలు అంటే చులకన చేస్తున్నట్లు కాదా? మరి ఈ డిజైనర్ల మాటేమిటీ?

  7. buchireddy gangula says:

    అఫ్సర్ గారు

    నా request…(మీ బుక్ )—request.. గానే మిగిలి పోయింది
    రాష్ట్రం లో అన్ని బుక్ స్టోరస్ ల లో గాలించాను —చెరబండ రాజు గారి బుక్స్ కోసం కూడా
    వెతికాను — no..luck…??
    మీరు copy..చేసి పంపుతే —అన్ని కర్చులు యివ్వగలను —దయతో

    మీ సారంగ ద్వారా పరిచయం అయిన anand..book..store…నుండి కొన్ని పుస్తకాలు
    తెప్పించుకోన్నాను —thanks..

    వంగూరి ఫౌండేషన్ books…donors..కు –vip..లకు మాత్రమే చేరుతాయి —చదవని వాళ్ళ కు ?????
    శివారెడ్డి గారి complete.collection—part1–part2–part..3–(big.ones..)by..mistake..2..sets..
    పంపారు —మీకు కావాలంటే mail..చేయగలను
    సారంగ లో రాయడం తో ఎవరయినా మిత్రులు చెరబండ రాజు గారి బుక్స్ వివరాలు
    చెపుతారని రాస్తున్న —సారీ
    buchi..g.reddy..
    26.cellini..
    aliso..Viejo..ca..92656..
    usa…

    • విరసం ప్రచురించిన “ ఈ తరానికి చెరబండరాజు చిరునామా ” పుస్తకం లో చెరబండరాజు గారు వ్రాసిన పుస్తకాల వివరాలు ఇచ్చారు.
      మా పల్లె , ప్రస్థానం , నిప్పురాళ్ళు — నవలలు.
      దారి పొడుగునా — నవలిక.
      చిరంజీవి — కథలు.
      గంజి నీళ్ళు — ఏకాంకిక.
      గామాలు మేల్కొంటున్నాయి – నాటకాలు , నాటికలు.
      గౌరమ్మ కలలు — కథా కావ్యం.
      దిగంబర కవితా సంకలనాలు , దిక్ సూచి , ముట్టడి , గమ్యం , కాంతి యుధ్ధం , జన్మహక్కు , పల్లవి , కత్తిపాట , చెరబండరాజు కవితలు,పాటలు. — కవిత్వం.
      ఇవన్నీ విరసం పచురించిన చెరబండరాజు సమగ్ర సాహిత్యం సంపుటాలలో వున్నవి.

  8. కల్లూరి భాస్కరం says:

    లలితగారూ…ఉద్వేగం, ఆవేశం, దుఃఖం, బాధ నిండిన మీ వ్యాసాన్ని నిన్ననే చదివాను. వెంటనే స్పందించాలనిపించింది కానీ మాటలు దొరకలేదు. ఎదురుగుగా భయంకరమైన మౌనం, శూన్యం పరచుకున్నాయి. ఈ సంగతి చెప్పడానికి కూడా మాటను ఆశ్రయించక తప్పడం లేదు.

    డాక్యుమెంటరీ విషయానికి వస్తే, ఈ వివాదంలో నిషేధం ఒక్కటే కాక, దురదృష్టవశాత్తూ ఇంకో అంశం కూడా ఉంది. అది నిందితుడైన ముఖేష్ సింగ్ ను మాట్లాడించడం. మొదట ఇదే ఎక్కువ వివాదాస్పదమైంది. దీనిని అడ్డుపెట్టుకునే ప్రభుత్వం దీనిని నిషేధించేవరకూ వెళ్లింది. దాంతో వివాదం మిశ్రమ స్పందనకు అవకాశమిచ్చింది. నిషేధాన్ని వ్యతిరేకించాలి కానీ, నిందితుడితో మాట్లాడించడం వ్యక్తిగతంగా నాకైతే నచ్చలేదు. దానిని కొందరు సమర్థించుకున్న తీరు కూడా పేలవంగానే అనిపించింది.

  9. venkata ramana pasumarty says:

    లలిత అక్క,

    చాల బాగా రాసేవు, కానీ రేప్ కి మరణ శిక్ష కాకుండా వారి శరీరంలో ఏదో ఒక అంగాన్ని తీసివేసే చట్టం వస్తే బహుశా రేప్ కేసులు కొన్నినైన తగ్గు తాయని నా భావన.

  10. PVSNMurty says:

    సమాజం లోని తారతమ్యాలు పెరిగి పోతున్నాయి. ఇవి కూడా ఈ నేరాలకి మూలాధారలు . విద్య జీవనాధారాలు అందరికీ అందుబాటు లోకీ రానంత కాలం , ఈ సమస్యల కి సమాధానం దొరకదు.

  11. Raghu Mandaati says:

    గాయం విలువ గాయపరిచే వారికేం తెలుసు..
    క్షణ క్షణం రక్షణలో బంది నయ్యననుకుంటున్నా నూలుగు గుడ్డల వెనకే ఎప్పుడు రెప్పవాలని మా చూపులు. .
    నిలువునా తగలెడతాం తగలబడతాం అయినా చల్లబడవు మా డాషులు
    నీతులు నిజాయితులేరగని ముసుగు తొడిగిన మానసిక పైశాచులం మేము
    స్వేచ్చ స్వాతంత్ర్యం అని వారి వాదనే మాకు మరింత ఆసరా అనుకునే ముర్కులం
    కళ పేరుతో కళాత్మకమనే సాకుతో ఖండంతారాలకు ‘స్త్రీ’ దేహాలను మార్కెట్ సరుకుగా ఉసిగొలిపే రసికాహృదయులం మేమే..
    ఓ భరతమా ఆరధానంటే ఎరుగని నీచపు మగ స్వతంత్రాలం కదా మేము.
    ఓ భరతమా రమించని మమ్మల్ని రాకసులై.. చీకటి వేకువతో ఎం పని
    లొట్టలేసుకోడానికి కళ్ళల్లో వొత్తులెసుకొనె మాకు కండ కండాలుగా చీల్చిన గుండె కోషని ఈ కొవ్వత్తుల నీరజనాలెం తీరుస్తాయి.
    అయినా మేము మారం తల్లి పాల ప్రేమ ఎక్కడో కనుమరుగయ్యి
    కరుణ లేని కారడవిలో సెగతో రగిలే కర్చిచ్చులం కదా మేము
    బూడిదయ్యేంత వరకు నీచమనుకునె నీ మగ బిడ్డలా బతుకులింతే ఓ భరతమా…

  12. నిశీధి says:

    అన్ని అంశాలు కవర్ అయిన apt వ్యాసం . ఒక కోణం మర్చిపోయారేమో అనిపిస్తుంది వీడియో బయటకి వచ్చాక అదేదొ నిర్భయ రేప్ అన్నది పూర్తీ దేశీ వ్యవహారంలా ఉడ్విన్ ని తప్పుపడుతున్న సాంప్రదాయ వాదులు మాటల ముకేష్ ల గురించి రాయాలసిన అవసరం చాల ఉంది అనిపిస్తుంది

  13. buchireddy gangula says:

    తల్లి తండ్రులకు లేని పట్టింపులు — ప్రబుత్వానికి ఎందుకు ??వీడియో నిలుపుదల —stupid..
    వ్యవహారం —
    స్త్రీ నా స్వంతం అనుకోవడం —తెలివితక్కువ తనం

    నేరస్తుడు — మాట్లాడటం లో తప్పు ఏమిటి ???

    చూపించుకోవాలనుకోవడం — ఎవరు చేసిన తప్పే —

    చక్కగా చెప్పారు madam…
    ———————————–బుచ్చి రెడ్డి గంగుల ———————–

  14. Lalitha P says:

    భావోద్వేగంతో స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. రేప్ గురించి చర్చ నిర్మొహమాటంగా జరగాల్సిన సమయం, సందర్భం ఇది. ఈ చర్చకి ముందుకొచ్చిన జ్యోతి తల్లిదండ్రులను అభినందించాలి. ముఖేష్ సింగ్ లాంటి నేరస్థులు అరుదే. కానీ వాళ్ళ చేత మాట్లాడించటం కూడా అంతే ముఖ్యమని నా అభిప్రాయం. నిర్భయ నిందితులు చేసినట్టే రోహతక్ నేరస్థులూ ప్రవర్తించటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి నేరస్థుల మనసుల్లో ఏముందో తెలుసుకోవటం సమాజానికి అంతటికీ అవసరమే. రోగం ఏమిటో తెలుసుకుంటే కదా మందుగురించి ఆలోచించేది !

    ఇది ఫీచర్ ఫిలిం కాదు. డాక్యుమెంటరీలలో దెబ్బ కొట్టేవాళ్ళు, దెబ్బ తినేవాళ్ళు అందరూ మాట్లాడ్డం జరుగుతుంది. ఏ వైపూ మాట్లాడకుండానే ఇంటర్వ్యూ లతోనే ఫిలిం నడిపించి సరైన అవగాహనకు మనం వచ్చేలా చేసే పధ్ధతి కూడా డాక్యుమెంటరీలలో ఎక్కువ. ‘ఇండియాస్ డాటర్’ టీవీ స్పెషల్ రిపోర్ట్ స్థాయికి చాలా ఎక్కువ, డాక్యుమెంటరీ స్థాయికి కొంత తక్కువ. సంప్రదాయవాదులు సరే, కొంతమంది స్త్రీవాదులు కూడా దీన్ని నిషేధించాలని అనటమే విచారకరం.

    • Chandrika says:

      ముఖేష్ లాంటి వారు అరుదైన వారేం కాదు. ఇండియా లో నిరక్ష్యరాస్యత ఎక్కువ. మన సమాజం లొ ఇలాంటి వారు ఎంతో మంది వున్నారు. అవకాశం రావాలే గాని నేరం చేయటానికి వెనుకాడరు. ఇలాంటి వార్ని ఇంటర్వూలు చేయడం వల్ల ‘వాడికి ఏ శిక్ష పడలేదు. చలాకీ గా స్టూలు మీద కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. కాబట్టి ఏం చేసినా పర్వాలేదు’ అన్న ధోరణి ఉంటుంది. అసలు మనమే ఇలాంటి మహిషాసురుల్ని మనకి తెలియకుండానే పెంచుతున్నామేమో కూడా!! ముందు చిన్న చిన్న విషయాల లో మన దృక్పథం మార్చుకొవాలి. వంట చేయటం, అంట్లు తోమటం, బట్టలు మడత పెట్టడం, బట్టలు ఆరేయటం ఎంత మంది మగ వారు మనలో ఏ నామోషి పడకుండా చేస్తారు? కూతురికి జడ కూడ వేయలేరు భార్య ఇంట్లో లేకపొతే. కోడలు, అల్లుడు ఇంటికి వస్తే ఏ అత్తగారైన అల్లుడు తిన్న కంచం తీస్తే ఊరుకుంటుందా? కోడలు తీయకపోతే ఊరుకుంటుందా? స్కాన్నింగు కి వెళ్ళగానె బిడ్డ ఆడో మగో చెప్పమని ఆడవారే అడుగుతుంటారు. మగ పిల్లవాడు పుట్టాలని మొక్కులు మొక్కే ఆడవారు (చదువుకున్న వారే మళ్ళీ) ఉన్నారు. అమెరికా లోనే అబ్బాయి కావాలని ఫెర్టిలిటి సెంటరు కి వెళ్ళీ తీరా అమ్మాయి అయ్యేసరికి ఐదొ నెలలో ఇండియా కి వచ్చి గర్భస్రావం చేసుకున్నవారు ఉన్నారు. మన ఇంట్లో పని చేసే పనమ్మాయిల కథ భర్త తాగడం డబ్బులు ఇంట్లొ ఇవ్వకపోవటం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనలో ఎంతమందిమి సీరియస్ గా తీసుకుంటాము? ఏదొ కాస్త ఆ పిల్లకి చేతిలో డబ్బు పెట్టెస్తాము చాలా సహాయం చేసాము అనుకుంటాము. అలా తాగి బాధ్యతారహితంగా వున్న వాడికి సహాయం చేసినట్లే కదా? ఇలాంటి ఎన్నో విషయాలలో తో మనం మగవారే ఎక్కువ అన్న సందేశాన్ని సమాజానికి అందిస్తున్నాం!! చిన్న విషయాలలో మార్పు కనిపించినపుడే ఇలాంటి నేరాలు తగ్గుతాయి. ఆడపిల్ల రాత్రి తిరగ కూడదు అని మన పెద్దవారు కూడ చెప్తారు. ఎందుకంటే రాత్రి పూట మద్యం తాగి విచ్చలవిడి గా తిరిగే వారు ఉంటారు. మద్యం తాగిన వాడు పశువు కంటె హీనంగా ప్రవర్తిస్తాడు. మన ప్రభుత్వం మద్యం ని నిషేదించదు మరి!! ఇవన్నీ చర్చించటానికి వ్రాతలు రాయటానికి బావుంటాయి. కాని ఎంతమంది ఆడపిల్లల తల్లితండ్రులకి ధైర్యానిస్తాయి?

  15. ఇదే విషయంపై నా స్పందన / ఆవేదన దాదాపు ఇవే భావాలతో, ఒక కవిత రూపంలో పరిశీలనలో ఉంది. అందువల్ల షేర్ చేయలేక పోతున్నాను గాని అన్ని కోణాలూ స్పృశిస్తూ సమగ్రమైన వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు.

  16. డా. చిఱ్ఱావూరి సుబ్రహ్మణ్యం says:

    సామ్రాజ్యవాదం, గ్లోబలైజేషన్, ముల్లు, అరిటాకు … … ఎన్నో, ఎన్నెన్నొ భావజాలాలు . కాని నేను వెతుకుతున్నది ఇవి కాదు
    ముఖేష్ సింగ్ ఒక కరడు కట్టిన నేరస్థుడు, అతని లాయర్ల ఇంటర్వ్యూ తో మాటలు ?
    ఇవి ఉపయోగపడే మాటలు కాదు
    వీళ్ళ మాటలు కాదు సమాజానికి వినిపించాల్సింది X

  17. G B Sastry says:

    మానభంగాలు అవి కలిగించే మానసిక శారీరిక క్షోభ అందుకు గురైన స్త్రీకి గుండెలుపిండేసే బాధ ఆమె తల్లితండ్రులకి తోటివారికి ఆవార్తవిన్న మనసున్న మనుషులకి నిజం.
    అటువంటివి జరగకుండాఉండాలని మనసున్న మనుషులందరూ కోరుకుంటారు ఆ కోరిక తీరాలంటే ఈ ప్రమాదాలకి మూల కారణం తెలుసుకోడం ముఖ్యం వ్యాధి నిర్ధారణ చేసాకే చికిత్స సరైన మార్గాన నడుస్తుంది.
    ఈ నిజ నిర్ధారణలో మనకు కొన్ని మింగుడుపడని నిజాలను ఎదుర్కొనే శక్తి,పరిపక్వత అవసరం.
    మనిషి తప్ప మరే జీవి ఈ అకృత్యానికి పాల్పడదు.
    మానవుడొక్కడే లైంగికత లైంగిక సంబంధాల మీద ఆంక్షలు పెట్టలేదు.
    ఈ ఆంక్షలు పెళ్లి కుటుంబ వ్యవస్థలని కాపాడి పెంచి పెద్దచేయడానికి అవసరంగా భావించాడు దానిని అతిచేసి పాతివ్రత్యం,ఏకపత్నీ వ్రతం ప్రేమ అమలిన శృంగారమ్ వంటి లేని మెరుగులుదిద్దాడు
    ఇందులో సమాజమంగీకరించే మార్గంలో తమ శారీరిక అవసరాలని తీర్చుకునే అవకాశం లేనివారికి ఏమి మార్గాలు చూపలేదు
    ఇవన్ని మానవసంతానం మిగిలిన జంతు సంతానం కన్నా ఎక్కువకాలం తన కాళ్ళపై తానూ నిలబడడానికి తీసుకోడమే కారణం
    పై పరిస్థితిని మగాడు తన ఆధిపత్యం స్థిరమ్చేసుకోడానికి బాగా వాడుకుని తననొక మకుటంలేని మహారాజుగా చెలామణి చేసుకోసాగాడు
    అందుకోసం శీలం మీద మరింతగా ,ముఖ్యంగా ఆడవారికి అవసరమ్లేనన్త ప్రాముఖ్యమివ్వసాగాడు,దీన్ని సాకుగా ఆడతనం మీద అనేకరగాల దాడులు ప్రారంభమయాయి ఆడపిల్లని ఏడిపించడాలు,చాటుమాటు గా ఇంట్లోవారె ఆడవారిపై తీసుకోరాని చనువు తీసుకోడాలు పనిచేసే చోట జరిగే అకృత్యాలు వస్తాయి.
    ఆడవారి చదువు సంపాదనా పెరగడంతో పాత ఆలోచనలవారికి ఒకరకమైన అసూయ ప్రారంభం అయింది
    ప్రపన్హీకరణ ప్రభావంతో కాస్తగా పెరిగిన మధ్యతరగతి జీవన స్థాయి,శైలి ఆర్ధిక పుష్టి ఆర్ధికంగా బాగులేనివర్గాలకి కన్నేర్రగామరింది వర్గ వివక్ష ఈ కన్నెర్ర కలిసి తరతరాలుగా పాతుకుపోయిన పురుషాహంకారం ఈరకమైన చెడ్డలకి బీజమయింది.
    వీటన్నింటిమీదా ద్రష్టి పెట్టి మన పిల్లల్ని రక్షించుకోవలసిన బాధ్యతమన ది.
    స్త్రీ తనని తాను ఒక ఆకర్షణ కేన్ద్రమన్న ధృక్పధమ్ నుంచి బయట పడాలి.
    పురుషుడు స్త్రీ తనకొక భోగ్యమను భావనకు దూరంకావాలి
    ఆడమొగాకలిసి బతుకు పండించుకొనే ఒక భగవదత్తమైన ఆనందమని ఎరిగి లైన్గికానందాన్ని గౌరవంగా చూసే తేరు అలవరుచుకోవాలి అందుకు అందరూ ముందుకు రావాలి
    ముందు లైంగికతను అశ్లీలమనుభావమ్ వీడాలి అందరం
    .
    i

Leave a Reply to PVSNMurty Cancel reply

*