అస్తవ్యస్త వ్యవస్థపై రెండు బాణాలు!

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

 

సాహిత్యానికున్న ప్రధాన ప్రయోజనం మార్పుకి బీజం వేయడం. కథ, కవిత, నవల, నాటకం – సాహితీరూపం ఏదైనా, దాని పరమార్థం హితం చేకూర్చడమే.

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని… ముఖ్యంగా తెలుగువారిని పట్టి పీడిస్తున్న సామాజిక జాడ్యాలు – స్వార్థం, అవినీతి, జవాబుదారిలేనితనం, వస్తు వ్యామోహం, పర్యావరణ విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం వంటి అంశాలను స్పృశిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి.

ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన భారతదేశం, ఇప్పుడిలా ఎందుకు మారిపోయిందని విచారణ చేస్తూ, భారతీయ వ్యవస్థలు అస్తవ్యస్తం కావడానికి బాధ్యులెవరు? పరిస్థితులను చక్కదిద్దాలంటే ఏం చేయాలి? ఎవరు నడుం కట్టాలి?… లాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులిస్తాయి రామా చంద్రమౌళి గారి నవలికలు – “పరంపర”, “ఎటు.?”

***

వ్యక్తి ముఖ్యమా, సమాజం ముఖ్యమా అనే ప్రశ్న చాలా కాలం నుంచి ఉంది. వ్యక్తులు తమ దారి తాము చూసుకుంటూ తమ చర్యలతో సమాజానికి సంబంధం లేదని, అవి తమ వ్యక్తిగతమని భావిస్తారు. తాత్కాలికంగా ఓ చర్య వ్యక్తిగతమనిపించినా… దీర్ఘకాలంలో అది సామాజికం అవుతుంది. వ్యక్తి సమాజానికి బాధ్యత వహించపోయినా, సమాజం వ్యక్తులను దూరం చేసుకోదు, కలుపుకుపోవాలనే చూస్తుంది. కొంతమంది అపరిమితమైన వ్యక్తిగత స్వేచ్ఛ లభించినప్పుడు దానిని తమ స్వార్థం కోసమే ఉపయోగించుకుని, మేధావి అని గుర్తింపు పొంది కెరీర్‌లో అత్యున్నత స్థానాలకు చేరినా, కుటుంబం పరంగా, సమాజం పరంగా ఏమీ విలువ పొందలేక ఆత్మీయులకు దూరమైపోతారు. మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛని, మేధస్సుని సమాజం కోసం ఉపయోగిస్తారు. ఎవరికోసమో అన్నీ వదులుకుంటున్నట్లు కనబడినా, నిజానికి ఎన్నో పొందుతారు, ఎందరినో తమవారిని చేసుకుంటారు. అటువంటి వ్యక్తుల కథ “పరంపర“.

చైతన్య అనే యువ ఏరోస్పేస్ ఇంజనీరు అమెరికా నుంచి ఇండియాకి విమానంలో బయల్దేరడంతో నవలిక ప్రారంభం అవుతుంది. పైన విశాలమైన ఆకాశాన్నీ, క్రింద అనంతమైన జలరాశిని చూస్తూన్న చైతన్యలో ఎన్నో ఆలోచనలు.. అతని అంతరంగంలో ఎంతో అలజడి. ఎన్నో ప్రశ్నల నడుమ తాతయ్య రామాన్ని గుర్తు చేసుకుంటాడు.

అయితే అతనిలో తాతయ్యని చూడబోతున్నాననే ఆనందం లేదు. తాతయ్య పార్థివ దేహాన్ని మాత్రమే చూడగలుగుతాననే దిగులు. తన జీవితానికి దిశానిర్దేశనం చేసిన తాతయ్య ఇకలేడని తెలిసాక… వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ప్రయాణం… అతని ఆలోచనల్లో గతం.

ParamparaYetu Cover

రామం, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. రామం నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో ఇంజనీరు. వాళ్ళది హెవీ మెషనరీ వర్క్‌షాప్‌ ప్రక్కన ఉన్న సి-216 నంబర్‌ క్వార్టర్‌. చైతన్య బాల్యం, చదువు అక్కడే గడిచాయి. చైతన్య లోని ప్రతిభని  తాతయ్య గుర్తించి, సానబెట్టింది అక్కడే. తాతయ్యంటే ఒక ఆదర్శప్రాయుడు. చైతన్యకి అమ్మా నాన్నా లేరా అంటే ఉన్నారు. దూరంగా, రమ్మన్నపుడు రాలేనిచోట ఉన్నారు. తమ ఉద్యోగ బాధ్యతలే తమకు ముఖ్యమనుకునే కెరీరిస్టులు!

అమ్మ పేరు చైత్ర… పెద్ద చదువులు చదివి.. తల్లినీ తండ్రినీ వదిలి ఉద్యోగరీత్యా దేశదేశాలు తిరుగుతూంటుంది. బహ్రేన్‌లోని ఉద్యోగం చేస్తుండగా.. అక్కడ ఓ ప్రముఖ భారతీయ దినపత్రికకు ఈస్ట్‌ ఏసియన్‌ బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్న రాజేంద్రకుమార్‌ బన్సల్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కొన్నాళ్ళకి చైతన్య పుడతాడు. మూడు నెలల శిశువుగా ఉన్నప్పుడే కొడుకుని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది చైత్ర. దాంతో చైతన్యని అమ్మమ్మ తాతయ్యలే తల్లీ తండ్రీ అయి పెంచుతారు.

ఒక ఇంజనీర్‌గా ఎన్నో ప్రమాదకర సందర్భాలలో రామం చేసిన సాహసోపేత సేవల గురించి ఆయన రిటైర్‌మెంట్ సభలో వక్తలు చెబుతూంటే, చైతన్యలో గర్వం, సంతోషం.. పులకింత, ప్రేరణ! భాషకందని ఏదో తృప్తిని అనుభవిస్తాడు చైతన్య.  ఆ క్షణాన్నే ఒక నిర్ణయం తీసుకుంటాడు.. ఏదో ఒక విలక్షణమైన పనిని తను చేసి ఒక అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని. ఫలితమే తాతయ్యకి దూరంగా రెసిడెన్షియల్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలలో చదువు, పరిశోధనా- ఆపై నాసాలో ఉద్యోగం!

రిటైరయ్యాక.. సొంత ఊరిపై మమకారంతో ‘కాకతి’కి వచ్చి స్థిరపడతారు రామం, రాజ్యలక్ష్మి దంపతులు. అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఊరిని సంస్కరించడానికి సిద్ధమవుతారు రామం. అందరినీ కలుపుకుని, వాళ్ళల్లో చైతన్యం కలిగిస్తారు. బాగుపడదాం అన్న ఆశావహమైన కోరికని కలిగిస్తారు. ఊరి వారందరినీ కలుపుకుని, నమ్మశక్యంకాని విధంగా.. యిరవై ఏళ్లలో ‘కాకతి’ గ్రామాన్ని తీర్చిదిద్దుతారు రామం. గ్రామస్తులలో స్వార్థరాహిత్యాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని, సహనశీలతను అలవర్చి కలను నిజం చేసి చూపిస్తారు.

రామం శవయాత్ర ప్రారంభమయ్యే సమయానికి చైత్ర, రాజేంద్రకుమార్, చైతన్య కాకతి చేరుతారు. అక్కడి అభివృద్ధి చూసి విస్తుపోతారు. రామంగారి కోరిక మేరకు శవాన్ని వైద్యకళాశాలకి అందజేశాక, రాజేంద్రకుమార్ బన్సల్ వెళ్ళిపోతాడు. చైత్ర, చైతన్య ఇంటి కొస్తారు. రామం జ్ఞాపకాలను స్మరిస్తూ తల్లీ కొడుకులు చెరో గదిలో అంతర్ముఖులవుతారు. ఇద్దరూ తమ జీవితంలోకెల్లా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకతిలోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంటారు. తాతయ్య లక్ష్యాలను కొనసాగించడం కోసం, ఊరిలో మహత్తర అభ్యుదయ కార్యాలు చేపట్టడం కోసం చైతన్య కార్యోన్ముఖ్తుడు కావడంతో నవలిక ముగుస్తుంది.

***

ఎటు.?” నవలిక తన జీవితం తనకి నచ్చడం లేదని హిమ అనే ఇరవై మూడేళ్ళ అమ్మాయి తన తల్లికి ఉత్తరం రాస్తూండడంతో ప్రారంభమవుతుంది. జీవితం తనకెందుకు నచ్చడంలో చెబుతుంది హిమ. ఆమె తల్లి ఐ.ఎ. ఎస్, తండ్రి ఐ.పి.ఎస్ ఆఫీసర్లు. విపరీతంగా కరప్టడ్. ఒక అతి సామాన్యమైన నిరక్షరాస్యుడు చేసే తప్పుతో పోలిస్తే, ఉన్నతమైన చదువులు చదివిన తన తల్లిదండ్రులు చేస్తున్న దోపిడి కోటిరెట్లు పెద్దది, ఎక్కువ తీవ్రమైనదని హిమకి తెలుసు.

తల్లిదండ్రుల విపరీత ధోరణిని భరించలేని హిమ వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళలో మార్పు రాదు. నిరాశ చెందిన హిమ హాస్టల్ ఏడో అంతస్తులోని తన గది కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆఖరి క్షణంలో ఆమెలో ఆలోచన! తను చనిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ మారుతారన్న ఆశేమీ లేదని గ్రహిస్తుంది. అలాంటప్పుడు చచ్చి సాధించేదుముందని తనని తాను ప్రశ్నించుకుంటుంది.

రమణ అనే ఇంజనీరు మరో ముఖ్యమైన పాత్ర ఈ నవలికలో. తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజిలు ఏర్పడడం, ప్రమాణాలు, అర్హతలు లేకుండా…. ప్రతి సంవత్సరం మూడు లక్షలకి పైగా  – ఉద్యోగాలకు పనికిరాని మానవచెత్తను తయారు చేస్తూ దేశం మీదకి వదలడం గురించి దుఃఖించే వ్యక్తి.

ప్రభుత్వం వారి వీధి బడిలో అక్షరాభ్యాసం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, కార్పోరేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నత చదువులు చదివి తనని తాను తీర్చిదిద్దుకున్న మరో పాత్ర జయ. ఎమ్మెస్సీ పూర్తయి, డాక్టరేట్ అయిపోవస్తుండగా… తల్లితండ్రుల ఒత్తిడి మీద పెళ్ళి చేసుకుంటుంది. అంతే, ఆ వివాహంతో – నిప్పులాంటి తెలివైన పిల్ల ఒక భల్లూకపు గుహలోకి ప్రవేశించినట్లయింది. భర్త తనని శారీరకంగా, మానసికంగా ఎంతలా హింసిస్తున్నా భరిస్తుంది, సహిస్తుంది…

కాని ఎంత కాలం? ఈ ముగ్గురు తమ తమ అసంతృప్తుల నుంచి బయట పడాలనుకుంటారు. తమకు వీలైనంతలో సమాజానికి ఉపయోగపడాలనుకుంటారు. జీవితంలో ఎటు వెళ్ళాలో తెలుసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తోటి వారికి మార్గదర్శకులవుతారు.

శీర్షికలోనే ప్రశ్న ఉన్న ఈ నవలికలో ఎన్నెన్నో ప్రశ్నలు… సమాధానాలు లేని ప్రశ్నల్లా అనిపించినా… నిజాయితీగా ఆత్మశోధన చేసుకుంటే జవాబులు దొరకగలిగే ప్రశ్నలు.

***

Prof.RaamaaChandramouliమనిషి మనుగడకు మూలమైన, మౌలికమైన సకల సూత్రాలన్నీ భారతీయ చింతనలో నిక్షిప్తమై ఉన్నాయని ఈ రెండు నవలికలూ స్పష్టం చేస్తాయి.  వీటిల్లో లోతైన తాత్త్వికత ఉంది. పద గాంభీర్యమే గాని పదాడంబరం లేదు. “మనిషి బుద్ధికి మాత్రమే విద్యనిచ్చి, నైతిక విలువల గురించి ఏమీ నేర్పకపోయినట్లయితేఅతను సమాజానికి చీడ పురుగులా తయారౌతాడ”ని థియోడర్ రూజ్‌వెల్ట్ చెప్పిన సత్యాన్ని రమణ పరంగా చెప్పడం బావుంది. మొదటి నవలికలో చైతన్యకి మార్గదర్శనం చేసినది తాతయ్య రామం అయితే, రెండో నవలికలో రమణకి దిశానిర్దేశనం చేసింది రాములు సార్. పేర్లలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ సారూప్యత ఉన్న మహోన్నతులు వాళ్ళిద్దరు. అటువంటి వారు ఊరికొకరు ఉన్నా, మన వ్యవస్థల్లోని అస్తవ్యస్తతలని సరిదిద్దుకోగలుగుతామేమో.

ఈ రెండు నవలికలలో ఎన్నో మౌలికమైన అంశాలను తేలికైన పదాలతో పాఠకులు సులభంగా గ్రహించేలా వ్యాఖ్యానిస్తారు రచయిత. ప్రపంచీకరణకి విరుగుడు స్థానికీకరణ అని, ఆ చింతనని ఒక ఉద్యమంలా అభివృద్ధి చేస్తే జన జీవనంలోని అశాంతి క్షీణించి భారతదేశం పురోగమిస్తుందని రచయిత సూచిస్తారు.

“పరంపర” చిత్ర మాసపత్రిక మార్చి 2013 సంచికలో అనుబంధ నవలికగా ప్రచురితం కాగా, “ఎటు.?” చిత్ర మాసపత్రికలో 2014 జూన్ నుంచి నవంబర్ దాకా ధారావాహికంగా ప్రచురితం. ఈ రెండు నవలికలను ఒకే సంపుటంగా సృజనలోకం, వరంగల్లు వారు ప్రచురించారు. 142 పేజీలున్న ఈ పుస్తకం వెల 150 రూపాయలు. నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద పుస్తకం దొరుకుతుంది. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

మీ మాటలు

  1. concise n well reviewed…

మీ మాటలు

*