సూర్యుడి లోపల…మరి కొన్ని కవితలు

మూలం: గిల్లెవిచ్ 

అనువాదం: పరేశ్ ఎన్ దోశి

 

 

ఫ్రాన్స్ లోని కార్నాక్ లో పుట్టిన గిల్లెవిచ్ ప్రముఖ ఫ్రెంచ్ కవుల్లో వొకడు. ఈ కవితలు Penguin Modern European Poets series లోని Guillevic Selected Poems లోనివి. వస్తువుల గురించి వ్రాసినా, జ్యామితి రూపాల గురించి వ్రాసినా, ప్రకృతి మీద వ్రాసినా, సృజన మీదే వ్రాసినా వొక కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తాడు. అందులో అవలీలగా ప్రవేశించడం ప్రవేశిస్తాము గాని, తర్వాత దాన్ని మరచిపోవదం సాధ్యం కాదు. పుస్తకం ముందు మాటలో వ్రాసినట్లు, అతను వస్తువులను చూస్తూ తదేక ధ్యానంలో పడిపోతాడు, ఆయా వస్తువులు అతనితో నంభాషణ మొదలుపెట్టే వరకూ.

 

వొక కవిత చూడండి:

గణితం మొత్తం
నీ అలల హోరులో కొట్టుకుపొయింది.

బ్రిటనీలోని సముద్ర తీరంలో యెన్ని సాయంత్రాలు మౌన సంభాషణల తర్వాత యిది వ్రాసాడో.

తినబోతూ రుచెందుకు గాని, అడుగుపెట్టండి అతని అద్భుత లోకంలోకి.

 

1.

చీమ

చీమ శవం గురించా
నువ్వు మాట్లాడుతున్నది?
అంతేనా?
పచ్చని గడ్డి మీద చీమ శవం గురించేనా?

ప్రపంచం మనిషి కోసం సృష్టించబడినది
మనకు బాగా తెలిసిందేగా
అందుకే, విధాత పొరపాట్లను
వాటిని అంతమొందించి
దిద్దాల్సిందే.

జలదరింపు కలిగించే,
మానవుడి అవగాహనకు బయటే
పాకే మిమ్మల్ని ఆ స్వర్గానికి పంపాల్సిందే.

కాని, మీరే గనక వెయ్యిరెట్లు పొడుగు వుండి
తుపాకీ చేతబట్టి వుంటే
మీరు గౌరవాన్ని  పొంది వుండేవారు
యిట్లా మరుగుతున్న నీళ్ళకు బదులు.
2.

NEWS ITEM

కుర్చీ గురించి యింత రచ్చ అవసరమా?

_ కుర్చీ నేరమేమీ లేదే!

పాత చెక్కతో చెసింది
యిప్పుదు విశ్రాంతిగా
ఆ చెట్టుని మరచిపొయి
దాని పాత వైరాన్నీ మరచిపొయి
యిప్పుదది యెట్లాంటి శక్తీ లేకుండా.

యిప్పుడు దానికింకేమీ అక్కర్లేదు
యే బాకీలు యిక లేవు
తన సుడిగాలిలోనే తాను
స్వయంపోషక.
3.

గొడ్డు మాంసం
చర్మం వొలిచేసిన ఆవు.
దీని మాంసంలోనే ప్రవహించింది
స్పందిస్తున్న
అద్భుతమైన
అర్థంకాని
వొక వెచ్చదనం

యిప్పటికీ ఆ వెచ్చదనం
ఆ చిన్ని కళ్ళల్లొతుల్లో
యిప్పటికీ నువ్వు దాని వొంటిని నిమరవచ్చు
నీ తలను దాని వొంటికి ఆనించి
నీ భయాన్ని నిద్రపుచ్చవచ్చు.
4.

వడ్రంగిని చూశాను

వడ్రంగిని చూశాను
మానును పోడవాటి పలకలుగా కోస్తూ

వడ్రంగిని చూశాను
వేర్వేరు పలకల పోడవులను కొలుస్తూ

వడ్రంగిని చూశాను
చక్కగా వచ్చిన పలకను ముద్దు చేస్తూ

వడ్రంగిని చూశాను
వాటిని యింటికి తీసుకేళ్తూ

వడ్రంగిని చూశాను
దానికి యెట్లాంటి లోపం లేకుండా చక్కని రూపాన్నిస్తూ

వో వడ్రంగీ! దాన్ని బీరువాగ మలుస్తున్నప్పుడు
నిన్ను పాట పాడుకుంటూ వుండడం గమనించాను
నీ రూపాన్ని, ఆ చెక్క వాసనతో సహా,
నా మనసులో పదిలపరచుకున్నను

యెందుకంటే పదాలతో నేను చేసే పని
నీ పనినే పోలివుంటుంది.
5.

స్పర్శ రేఖ (Tangent)

నేను నిన్ను వొక్కసారే తాకుతాను
రహస్యంగా
అది నీకూ తెలుసు

నన్ను పిలవడమూ వృథా
నన్ను గుర్తు తెచ్చుకోవడమూ వృథా

నీకు చాలా విరామం
నీకు నీవు పదే పదే
యీ క్షణం గురించే చెప్పుకోవడానికి

అలాగే మనిద్దరమూ
వొకరి మీద వొకరు ఆధారపడి వున్నామని
నీకు నీవు నమ్మించుకోజూస్తావు.

 

6.

సమబాహు త్రిభుజం (Right Angle Triangle)

చాలా దూరమే వచ్చెశాను
అనియంత్రిత వెర్రిగా చక్కదిద్దుకుంటూ

యింక యిందులో యెట్లాంటీ
భవిష్యత్తూ లేదు.
7.

ప్లేట్లు

వాడిన పింగాణి ప్లేట్లు
తెలుపులోకి రంగులన్నీ వెలిసిపోయి.
మా యింటికి వచ్చినప్పుడు అవి
కొత్తవి

యీ లోగా మేము చాలా నేర్చుకున్నాం.
8.

సూర్యుడు

సూర్యుడు,
తన లోపల తప్ప,
యెప్పటికీ రాత్రిని చూడడు.

యెందుకంటే అతను
చీకట్లను బయటకు
విసిరేసినప్పుడల్లా
అది తన చుట్టూ
వెల్తురుగా పరచుకుంటుంది.

 

9.

సుత్తి

నా చేతి కోసమే చేసినట్లున్న
నిన్ను చేత్తో కుదురుగా పట్టుకుంటాను
బలవంతుడిగా భావిస్తాను
నీ బలంతో

నువ్వు గాఢ నిడ్రలో
నీకు చీకటి తెలుసు
నీకు బలం తెలుసు

నిన్ను తాకుతాను
చేతిలోకి తీసుకుని
సర్దుకుంటాను
నా అరచేత్తో నిన్ను వెచ్చ బరచి
చెయి యెత్తుతాను

నీతో నేను తిరిగి
యినుములోకి, చెక్కలోకి
జారుకుంటాను

నువ్వు నన్ను లాగుతావు
నన్ను పరీక్షించటానికి
నువ్వు ఘాతం వెయ్యదలిచావు.

*

మీ మాటలు

  1. Great poetry. Extordinary translation sir

Leave a Reply to bolloju Cancel reply

*