రైల్లో కూర్చుంది మొదలు…

స్వర్ణలతా నాయుడు

 

రైల్లో కూర్చుంది మొదలు

దూదీపింజలా తేలిపోయే మనసు

రైలు ముందుకు వెళ్తుంటే …

కిటికీ పక్కన కూర్చుని

వెనక్కి వెళ్ళే పర్వత సానువుల అందాల్ని

మళ్ళిమళ్ళి కళ్ళలో ఒంపుకుంటుంది  !

నేత్రాలకూ ఆత్రుతెక్కువౌతుంది

ఇంకా ముందుకెళ్తే..మనోజ్ఞమైన వనాలు

పలకరిస్తాయని..హృదిని గుబాళింపుల గొడుగులో

నడిపిస్తాయని చేరవలసిన గమ్యాన్నికి

సోబగులద్దుతాయని

మనసుని ఊహలకి అప్పగించేస్తాం

అంతరంగాన్ని తట్టిలేపి అంతరాయం లేకుండా

చర్చించాలని ఆశపడతాం !

మెత్తని జ్ఞాపకాలను కంటిదోసిలితో పట్టుకుంటాం

కనురెప్పలపై మంచు బిందువుల తడికి

సంతోషపు వర్ణాలద్దుతాయ్  !

తోటి ప్రయాణికులు పలకరించినా

అన్యమనస్కంగా జవాబిస్తుంది మనో కుసుమం

లోపలి మనసుని వదిలి రావడం ఇష్టం లేక !

ఆకలి కడుపులో సంచరిస్తుంటే

హృదయాన్ని పక్కన పెట్టి వస్తాం

నాలుగు మెతుకులు ఆదరాబాదరాగా గుటుక్కుమనిపిస్తాం !

మరోమారు మదిలోకి దూరిపోతాం

కళ్ళని కిటికీలోంచి కదిలే దృశ్యాలకి అతికించేస్తాం

ఎన్నో నదులూ, వంతెనలు దాటుకుంటూ

వెళ్ళిన అంతరంగం అలిసిపోతుంది

నీరసంతో పక్కకు తిరిగి చూస్తే

సామాన్లు సర్దే హడావుడిలో తోటివారు

గమ్యాన్ని చేరామని..అంతరంగం మాయమైంది

స్వార్ధం కమ్మేసిన ప్రపంచంలో ఇమడలేనంటూ !

 *

మీ మాటలు

  1. chandoluchandra sekhar says:

    నిజంగా మీ కవిత వాస్తవానికి దగ్గరగా వుంది
    నేను ఎప్పుదూ కిటికీ దగ్గరగా ఉంటేగాని బస్సు ,రైలు ఎక్కను అదో అనుభూతి
    కళ్ళని వరిమాగాణి కి అతికించి వంతెనల రొదని గుండెలయలో వింటూ మళ్ళి సకల రోగాల నిలయమైన వాస్తవం లోకి వస్తాం నిజంగా నా గుండెని తాకినా కవిత ఇది

మీ మాటలు

*