మేమూ మా తెంగ్లిష్ ఉగాది!

 సుధా శ్రీనాథ్ 

sudha“అమ్మా! నీకో విషయం తెలుసా? క్యాతి హు చెప్పింది వాళ్ళకూ మనలా లూనార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలవుతుందట. రేపట్నుంచి వాళ్ళకి  New Year తెలుసా!” ఆరేళ్ళ పాపకారెక్కుతున్నట్టే తనకారోజు తెలిసిన కొత్త విషయాన్ని చెప్పింది. రెండవ తరగతిలో ఉన్న చైనీస్ అమ్మాయి క్యాతి నా కూతురికి సహపాఠి. పాప కళ్ళలో ఉన్న మెరుపు చూసి క్యాతి తమ కొత్తసంవత్సరపు వేడుకల ఉత్సాహాన్ని మా పాపకూ రుద్దిందనిపించింది. ఈ రోజంతా చైనీస్ పండగ గురించే తన మాటలు అనుకొన్నాను.

 

పాప రోజూ ప్రొద్దున ఏడున్నరకు స్కూల్‍కు నాన్న జతలో వెళ్ళేది. పాపని స్కూల్లో దింపి తను వెళ్తే, మధ్యాహ్నం మూడున్నరకు తనని స్కూల్ నుంచి ఇంటికి నేను తీసుకొచ్చేదాన్ని. నా కారుదగ్గరికొస్తున్నట్టే పాప టీచర్‍కు, అక్కడున్న స్నేహితులకూ టాటా బై బై చెప్పి నవ్వులతో కారెక్కేది. కారెక్కుతున్నట్టే తాము ఆ రోజు స్కూల్లో ఏమేం చేశామన్నది వివరంగా చెప్పేందుకు మొదలుపెట్టేది. తన స్నేహితుల్లో ఎవరు ఏమేం మాట్లాడారని, టీచర్ ఏమన్నారని, టీచర్ ప్రిన్సిపల్ రూమ్‍కెళ్ళినప్పుడు ఎవర్ని క్లాస్ లీడర్ చేశారని, ఆ రోజు ఎవరెవరు స్కూల్‍కు రాలేదని, ఒకటా, రెండా,అన్ని విషయాలూ చెప్పేది. లంచ్ టైంలో తన పక్కన ఎవరు కూర్చొన్నారని, ఆ రోజు వాళ్ళ స్కూల్ క్యాంటీన్‍లో ఏమేం చేశారని, ఎందరు పిల్లలు లంచ్ పార వేశారని, తను లంచ్‌కని ఇంటి నుంచితీసుకెళ్ళింది ఖాళి చేశాననో, చేయలేదనో, ఆటవిడుపుల టైమ్‍లో ఏ ఏ ఆటలు ఆడిందని, ఏదైనా ఆడలేదంటే ఎందుకు ఆడలేదని ఇలాగే ప్రతియొక్కటీ పూసగ్రుచ్చినట్టుగా చెప్పేది.

 

పాప క్లాస్ ఒక చిన్ని ప్రపంచంలాగుంటుంది. ఇద్దరు కొరియన్స్, ఇద్దరు చైనీస్, ముగ్గురు ఇండియన్స్, ఒక రష్యన్, ఒక జాపనీస్, శ్రీలంకన్ ఒకబ్బాయి, ఒక పాకిస్తానీ అమ్మాయి, మిగతా అమేరికన్లుఉన్నారు. పాకిస్తానీ అమ్మాయితో మరియు ఒక జాపనీస్ అమ్మాయితో పాపకు భలే స్నేహం. నాకు యూనివర్సిటీలో కొన్ని అంతర్రాష్ట్రీయ స్నేహాలు దొరికితే పాపకు రెండో తరగతిలోనే నాకంటేఎక్కువ దేశాల వారితో స్నేహం కుదిరింది. అందరూ అక్కడ మాట్లాడేది ఇంగ్లిష్‍లోనే అయినా తమ కుటుంబం గురించి చిన్ని చిన్ని విషయాలను తమ బాల భాషలోనే ఒకరికొకరు తెలుపుతుంటారు.కొరియన్ అమ్మాయిలయితే ఈ చిన్ని వయసులోనే చక్కగా సంగీతాభ్యాసంలో ఉన్నారట. చైనీస్ పిల్లలు ఆదివారాల్లో తమ మాతృభాషను నేర్చుకొంటున్నారట. క్యాతి ఇంట్లో చైనా నుంచి వచ్చినఅవ్వా తాతా ఉన్నారట. వాళ్ళకు ఇంగ్లిష్ అస్సలు రాదు కాబట్టి ఇంట్లో తమ భాషలోనే మాట్లాడుతారట. రోజూ కారెక్కుతున్నట్టే మొదలయ్యే పాప మాటలు వినేందుకు నేను కూడాఎదురుచూసేదాన్ని. ప్రతి రోజూ తన మాటలు నన్ను మళ్ళీ చిన్న పిల్లల లోకవిహారానికి తీసుకెళ్ళేవి. అదొక international చిన్నారుల colourful లోకం.

 

మనం ఉగాది రోజు పైరు పచ్చకి, సమృద్ధికి సంకేతమని వాకిలికి మామిడాకుల తోరణాలు కట్టి, కొత్త బట్టలో లేక పట్టు బట్టలో వేసుకొని పూజలూ, ప్రార్థనలూ, విందులూ చేస్తాం. చైనీస్ తమ నూతనసంవత్సరాదికని వాకిలి, కిటికీలను ఎరుపు రంగు కాయితాలతో అలంకరిస్తారట. విశేషమేంటంటే ఆ రోజు అందరు ఎర్ర రంగు దుస్తులనే ధరించే సంప్రదాయం ఉందంట. ఎరుపు రంగు దుష్ట శక్తులనుపారద్రోలి అందరికీ శుభం చేకూరుస్తుందనే నమ్మకం వాళ్ళది. ఎరుపు రంగు సత్యం, సంతోషం మరియు నిజాయితీని సూచిస్తుందట.

 

పాడ్యమికి ముందు రోజు అంటే అమావాస్య సాయంత్రం పెద్దలకీ, దేవతలకీ గౌరవం సమర్పించి కుటుంబ సభ్యులందరు జతలో కూర్చొని విందారగిస్తారట. కొత్త సంవత్సరానికని స్పెషల్ కేక్ చేసిదాన్ని బంధు మిత్రులందరికీ పంచి తింటారట.  పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఎరుపు రంగు కవర్లో డబ్బుంచి గిఫ్ట్ ఇవ్వడం కూడా కొన్ని కుటుంబాలలో చేస్తారంట. మొత్తానికి ఎరుపు రంగుకు చాలాప్రాధాన్యతనిస్తారట. ఇన్ని విషయాలు పాప చెప్తుండగా చాలా ఆశ్చర్యంగా విన్నాను. అంతకు ముందు నాకీ విషయాలు తెలిసుండలేదు.

 

మన ఉగాదికి సరిగ్గా రెండు నెలల ముందు చైనీస్ కొత్త సంవత్సరం మొదలవుతుంది. అంటే మన ప్రకారం మాఘ శుద్ధ పాడ్యమి రోజు. వాళ్ళక్కూడా మనలాగ అధిక మాసాల రకంలెక్కాచారాలున్నాయట. ఇవి నేను నా చైనీస్ మిత్రుల నుండి తర్వాత సంగ్రహించిన విషయాలు. చైనీస్ నూతన వర్షారంభమైన తర్వాత సరిగ్గా రెండు మాసాలకు మన తెలుగువాళ్ళకు చాంద్రమానఉగాది అన్న మాట. ఇది తెలుగువాళ్ళమే కాకుండా కర్నాటక మరియు మహారాష్ట్రాల్లో కూడా ఆచరించే కొత్త సంవత్సరపు పండుగ. కర్నాటకలో యుగాది అంటారు మరియు మహారాష్ట్రంలోగుడిపాడ్వ అని అంటారు.

 

మనం వసంతాగమనాన్ని చైత్ర మాసంలో వసంత నవరాత్రులనే పేరుతో ఆచరించి సంభ్రమాలు జరుపుకొంటే చీనీయులు వారి నూతన సంవత్సర ఆరంభం స్ప్రింగ్ ఫెస్టివల్ అంటూ అమావాస్య నుంచిపౌర్ణమి దాకా వేడుకలు జరుపుకొంటారు. మనలో కూడా కొన్ని సముదాయాల్లో చైత్ర పౌర్ణమిని వసంత పౌర్ణమియని విశేషంగా కవిగోష్టులు, నృత్యాల వేడుకలతో జరుపుకొంటారు.

 

ఇన్ని విషయాలు ఉగాది వేడుకల రోజు మా తేనె తెలుగు క్లాసులో పిల్లలకు తెలిపినప్పుడు అందరి ముఖాల్లో వసంతోత్సవం వెల్లి విరిసింది. దేశం వేరైనా, భాషలు వేరైనా మనుష్యులంతా ఒక్కటేఅనిపిస్తుంది కదూ అనిందో చిన్నారి. అవునన్నట్టు పిల్లలూ, పెద్దలూ కూడా తలలూపారు. ప్రపంచంలోని వేర్వేరే దేశాల్లో ఏ విధంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారో తెల్సుకోవడంబావుంటుందన్నారు కొందరు. అవునవునన్నారు అందరు.

 

తెలుగెంత ఎక్కువగా వింటే మాట్లాడ్డం అంత సులభమవుతుందనే ఉద్దేశ్యం మా క్లాసుది. అందుకే మా క్లాసులో ప్రాథమిక పాఠశాల విధంగా కాకుండా కొద్దిగా రాత, చదువు అయిన తర్వాత ఏదైనాఒక విషయం పైన కబుర్లెక్కువగా ఉండేవి. అందులో పిల్లలు మరియు పిల్లల్ని క్లాస్‌కు తీసుకొచ్చిన పెద్దలు తెలుగు ఇంగ్లిష్ కలిపిన తెంగ్లిష్‌లో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ పాల్గొనేవారు. ఆరోజు చర్చా విషయం ఉగాది.

 

ఉగాది రోజు మనకు షడ్రుచుల మిశ్రణమైన ఉగాది పచ్చడి తినడం ఎంత ముఖ్యమో అలాగే కర్నాటకలో ‘బేవు బెల్ల’ అనే పేరుతో వేప పూవు బెల్లం కలిపి ప్రసాదంలా స్వీకరించడం అంతే ముఖ్యం.అలాగే ప్రతి సముదాయంలోనూ అట్లాంటిదే ఏదో ఒకటి జీవితమంటే తియ్యటి అనుభూతులే కాదు, ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అయినా అన్నిటినీ ధైర్యంగా స్వీకరించి, ఎదురించి ముందుకుసాగడమే జీవితం అనే సందేశాన్నిచ్చేవుంటాయి. మామిడికాయి, కొత్తగా వచ్చిన చింతపండు, బెల్లం, వేప పూలు, మిరపకాయలు, ఉప్పు వేసి చేసే మన ఉగాది పచ్చడి కూడా అదేసందేశాన్నిస్తుందని పిల్లలకు తెలిపాను. ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు ఇదే అర్థానిచ్చే ఒక శ్లోకం కూడా పఠిస్తారని గుర్తుచేశారొకరు.

 

“ఉగాది పండగ గురించి ఏదైనా కథ ఉందా?” అడిగిందో చిన్నారి. మాటలు మళ్ళీ గంభీరమైతే పెద్దలకేమో పర్వాలేదు, అయితే పిల్లలకి ఒకటే బోర్ కొడ్తుంది. ప్రతి పండగ గురించి ఏవైనా పురాణకథలుంటే క్లాసులో చెప్పడం అలవాటు. పిల్లలకు కథలంటే భలే ఇష్టం. అందులోనూ ఆ రోజు మా చర్చకు సరిపడేదుంటే మరీ బాగుంటుంది. శ్రీ మహావిష్ణువు ఇంక తొమ్మిది రోజులకు రాముడైభూలోకంలో అవతరిస్తున్నాడని ఆకాశవాణి అయిన రోజని చెబుతారు. అది విన్న జనం పరమానంద భరితులై రామావతారణతో కొత్త యుగమే ప్రారంభమని యుగాది అనే పేరిట పండగ చేయడంమొదలయ్యిందంట. అంతే కాదు, నవమి రోజు రాముడు పుట్టేంత వరకూ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులని పండగ వేడుకలు కొనసాగాయట అని చెప్పాను.

 

“నవ అంటే కొత్త అని కూడా అర్థం కదూ.” దసరా పండగలో చెప్పిన మాట గుర్తుందన్న ఓ బాబు మాటకు అందరి నుంచి అభినందనాపూర్వక చప్పట్లు. టీచర్లకు మరియు తల్లిదండ్రులకైతే బాబుమాట విని సగర్వ సంతోషం.

 

యుగాది అనే బదులు మనం ఉగాది అని అంటామెందుకని అడిగారు పిల్లలు. యుగాది పదమే రూపాంతం చెంది ఉగాది అయిందంతేనన్నాను.

 

“For red colour ఎరుప్ అనాలా? ఎరుపు అనాలా? ఎందుకంటే తెలుగులో కారు, వ్యాను, ఫోను, ఫ్యాను అంటారుగా. అందుకే అడిగాను” చిన్నారి ప్రశ్నతో పాటు ఇచ్చిన సంజాయిషీ విని చాలామంది నవ్వాపుకోలేక పోయారు. అమేరికాలో పెరిగే పిల్లలే అంత. తెలిసింది అనుమతి తీసుకొని చటుక్కున చెప్పేస్తారు. తెలియనిది మొహమాటం లేకుండా అడుగుతారు. తప్పయితే సారీఅనేస్తారు. పిల్లల్లోని ఈ గుణం నాకు చాలా నచ్చింది. వాళ్ళకి స్కూల్లో please, thank you అనేవి మ్యాజిక్ పదాలని బాగా నూరి పోస్తారు.

 

ఇంగ్లిష్ పదాలకు ప్రథమా విభక్తి ప్రత్యయమైన ‘వు’ చేర్చి తెలుగీకరిస్తాం. అయితే ఎరుపు తెలుగు పదమేనని నవ్వుతూ చెప్పాను. తనూ కిల కిలా నవ్వేసింది.

 

విద్యుచ్ఛక్తితో నడిచే మొట్టమొదటి రెండు రెక్కల విద్యుత్ విసనకర్రను కనిపెట్టిన షుయ్లర్ వ్హీలర్‌ది మాతృ భాష ఇంగ్లిష్ కాబట్టి దానికి ఫ్యాన్ అనే పేరే ఖాయమయ్యింది. ఇంగ్లిష్‌లో విసనకర్రకూ ఫ్యాన్అంటారు. విద్యుచ్ఛక్తితో నడిచే విసనకర్రను కూడా ఫ్యాన్ అంటారు. కొన్ని విదేశీ పదాల్ని తెలుగుకు రూపాంతరం చేసేటప్పుడు కూడా ప్రథమా విభక్తి ప్రత్యయం చేర్చడం వాడుకలోకొచ్చింది. అందుకేఫ్యాన్ కాస్తా ఫ్యాను అయ్యింది. మనమేదైనా అందరికీ ఉపయోగకరమైన కొత్త వస్తువును కనిపెట్టినప్పుడు ఆ వస్తువు మన భాషలోనే ప్రచారమవుతుంది. పదాల ప్రచారం కావాలి అంటే పదాలజతలో పదార్థాలు కానీ పద్ధతులు కానీ ఉండి తీరాలి. మనవాళ్ళు కనిపెట్టిన వస్తువులకు మన భాషలోనే పేర్లు పెట్టొచ్చు. ఎవరు కొత్తవి కనిపెట్టారో వారు పెట్టిన వారి భాషలోని పేర్లే ఆయావస్తువులకు ప్రపంచాద్యంతం నిల్చి పోతాయని పెద్దాయనొకరు స్పష్టం చేశారు. ఆయన తేల్చి చెప్పిన ఈ నిజం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందనిపించింది.

 

“అవునవును. యోగ మరియు మంత్ర అనే పదాలు మన దేశం నుంచి వచ్చిన పదాలే కదూ” అన్నారొకావిడ. అందరికీ కొత్త సంవత్సరంలో సరికొత్త సంతోషాలు సమకూరాలని కోరుతూ ఆవిడ తనుఇంట్లో చేసుకొచ్చిన ఉగాది పచ్చడిని అందరికీ పంచారు. క్లాస్ ముగిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కోవెల్లో పంచాంగ శ్రవణానికని బయలు దేరాం. పిల్లలూ మాతో గలగలామాట్లాడుతూ కల్సినందువల్ల కోవెల కళకళలాడింది.

మీ మాటలు

  1. Vidya Tejas says:

    ఇంత information ఎంత చక్కగా రాసారండి.

  2. దీన్నిప్పుడు చదివాను. చాలా బాగుంది.

మీ మాటలు

*