అనుభవాల మధ్య బంధుత్వమే మంచి కథ!

 రాధ మండువ

నేను చాలా చిన్నప్పటి నుంచే – ఐదవ తరగతి నుంచే పిల్లల కథలు చదివేదాన్ని. ఆ తర్వాత మా ఊళ్ళో నాగేశ్వరమ్మక్క, శేషమ్మక్క, విశాలక్క అందరూ మా వీధి వాళ్ళు ఒక్కొక్కరూ ఓ పత్రికని, నవలలని (అద్దెకి) ఒంగోల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న నా చేత తెప్పించుకునే వారు. వాటిని వస్తూ వస్తూ బస్ లోనే చదివేసే దాన్ని.

ప్రభ, పత్రిక, భూమి, జ్యోతి, చందమామ, బాలమిత్ర ఒకటేమిటి ఏది దొరికితే అది…. అయితే అన్ని కథలు, నవలలు చదివినా ఏ రచయితనీ చూడలేదు. వాళ్ళంటే ఏదో చాలా గొప్పవాళ్ళని ఊహించుకునే వయసు అది.

నా పెళ్ళయ్యాక మద్రాసులో ఉన్నప్పుడు మా ప్రక్కింటి తమిళావిడ కథలు రాస్తుందని తెలిసింది. ఆ తమిళ రచయిత్రిని చూడగానే నాకేమీ కొత్త అనిపించలేదు. ఆమెని చూడగానే నాకూ కథలు రాయాలనిపించి నాలుగైదు కథలు రాసి పత్రికలకి పంపాను.

ఆంధ్రభూమి వాళ్ళు నా కథ “కాగితపు ముక్కలు” వేసుకున్నారు. డబ్బుల చెక్ వచ్చినపుడు తెలిసింది నా కథ పడిందని. టి. నగర్ లోని పాత పుస్తకాల షాపులకెళ్ళి వెతుక్కుని, పత్రికని పట్టేసి కథని చూసుకున్నాను. మిగిలిన కథలు తిరిగొచ్చాయో, ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో తెలియదు.

తర్వాత ఇరవై ఏళ్ళ పాటు నేను కథారచన జోలికి పోలేదు. రిషీవ్యాలీ వచ్చాక ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, అద్భుతమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు, సాయంకాలాల్లో వచ్చే లేత వంకాయ రంగుతో కలగలిసిన బంగారు కాంతి కిరణాలు, పచ్చని చెట్లు, వాటి గుబురుల్లో ఎక్కడో దాక్కుని వినిపించే పక్షుల కిలకిలారావాలు, వెన్నెల్లో స్వచ్ఛమైన తెల్లని కాంతినిచ్చే చంద్రుడు, ఏ పొరలూ లేకుండా మిలమిలా మెరిసే నక్షత్రాలు, విశాలమైన పచ్చిక మైదానాలు చూస్తుంటే ఇంత అద్భుతాన్ని లోపల ఇముడ్చుకోలేని అలజడితో రాసిన కథ “సమ్మోహనామృతం”. దాన్ని ఈమాట వాళ్ళు ప్రచురించారు.

అయితే ప్రకృతి వర్ణన రాసినంత మాత్రాన అది కథ కాదు కదా అనిపించి ఇతివృత్తాలని తీసుకుని వరసగా కథలు రాయడం మొదలు పెట్టాను. నా కథని (సాహచర్యం) మొట్ట మొదటగా ( ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత) ప్రచురించిన పత్రిక సారంగ. ఇక నా జీవితం లో కథలు రాయడం అనే ప్రస్థానం మొదలయింది. ఈ రెండున్నరేళ్ళలో ఇప్పటికి దాదాపు ముప్ఫై కథలు, నలభై దాకా పిల్లల కథలు, ఐదు సమీక్షలు, ఆరేడు మ్యూజింగ్స్, ఇరవై గుజ్జెనగూళ్ళ పేరుతో మా అక్క మనవరాలి మాటలు, కాసిన్ని కవితలు రాశాను. ముప్ఫై జానపద కథలని అనుసృజన చేశాను.

అయితే కథలు ఎందుకు రాయాలి?

ఈ లోకానికి మనం ప్రయాణీకులుగా వచ్చాం. సహ ప్రయాణీకులలోని వివిధ భావాలనీ, వైరుధ్య భంగిమలనీ పట్టుకోగలుగుతున్నాం. మంచి చెడుల రూపాలనీ వాటి ప్రభావాల్నీ చూడగలుగుతున్నాం. వాటిని అక్షరాలుగా తీర్చి దిద్దగలిగే సామర్థా్యన్ని పెంపొదించుకున్నాం. ఇక రాయకపోవడానికి అడ్డేమిటి అనుకోగానే కలం కదిలింది. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత నిశితంగా పరిశీలించడం మొదలయింది.

radhaస్త్రీ పురుషుల భావోద్యేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను “ఆకాశమల్లి” అనే కథలో చూపగలిగాను. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది – ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అని కూడా ఆ కథ ద్వారా చెప్పాను.

చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు అభినందనలు తెల్పుతూ. ఆ ఫోన్ కాల్స్ అటెండ్ అవుతుంటే, పాఠకులతో మాట్లాడుతుంటే – రచనలు చేసేటప్పుడు రచయితకి ముఖ్యంగా కావలసినది ‘నిబద్ధత’ అని తెలిసింది. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది.

జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినపుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అనుభవాలని ఆవిష్కరించడానికి, సృజించడానికి రచయితలు పిల్లల్లా మారి తమ చుట్టూ గమనించాలంటాను నేను. వాళ్ళు దేన్నైనా ఎంత ఆసక్తిగా, ఏకాగ్రతగా గమనిస్తారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. అంత దీక్షగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే, వారితో సహానుభూతి చెందితే మనలోని అంతర్ దృష్టి తనంతట తనే కథలను సృష్టించుకుంటుంది.

ఇలాంటి అనుభవంతో రాసిన కథ “చివరి చూపు” ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణ.

అలాగే నాకున్న మరో అదృష్టం ఎప్పుడూ పిల్లలతో గడపగలిగే అవకాశం ఉండటం. ఈ పిల్లల సహాయంతోనే రాసిన మరో కథ “మనసుకు తొడుగేది” – ఇది కూడా ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణే. స్కూల్లో కొత్తగా చేరిన పిల్లలని ఒకసారి ఈ చుట్టు ప్రక్కల ఉన్న కొండల మీదకి హైకింగ్ కి తీసుకు వెళ్ళి అక్కడున్న మూడు కొండలని చూపిస్తూ వాటి పేరు “త్రీ సిస్టర్స్” అన్నాను. అందరూ ఒక్కసారిగా నా మీదకు దూకి “ఎందుకా పేరు వచ్చింది? వాటికేమైనా కథ ఉందా?” అని అడిగిన వారి తీవ్రమైన ఆసక్తి వల్ల పుట్టినదే ఈ “మనసుకు తొడుగేది” కథ.

ఇక్కడ స్కూల్లో పిల్లలకి చెప్పులు రిపేరు చేసి పెట్టే కొండప్ప మౌనంగా ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవడం చూసి ఇన్ స్పైర్ అయి రాసిన కథ “చెప్పుల తాత” (కినిగె).

నాకు తాత్తి్వక కథలంటే ఇష్టం. అలాంటి కథలు రాసే ఆర్.ఎస్. సుదర్శనం, వసుంధరాదేవి, జలంధర, శ్రీవల్లీ రాధికలు రాసిన కథలు చదివీ, హై సొసైటీ వాళ్ళని దగ్గరగా చూస్తుంటాను కనుక వాళ్ళని గమనించీ రాసిన కథలు “విముక్తం” (ఈమాట) “నిర్వేదం” (ఆంధ్రభూమి వారపత్రిక), అంతర్మధనం (పాలపిట్ట).

పల్లెలో పెరిగాను, చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయి కాబట్టి ఆ ఆనుభవాలతో రాసిన కథలు “మాన్యత” (విపుల), “చందమామోళ్ళవ్వ” (ఆటా బహుమతి లభించిన కథ), “చందమామ బిస్కత్తు” (ఫేస్ బుక్ కథ గ్రూప్ బహుమతి లభించిన కథ).

చుట్ఙు ప్రక్కల ఊళ్ళల్లోని యువకులని, యువతులని గమనించి రాసిన కథలు నాలుగైదు ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి నచ్చిన కథ “గౌతమి” (ఈమాట). ఒక స్త్రీ గా తోటి స్త్రీల అనుభవాలతో, వారి భావాలతో సహానుభూతి (ఎంపతీ) చెంది రాసిన కథలు “ప్రేమ జీవనం” (వాకిలి), “కృతి” (ఇంకా ప్రచురింపబడలేదు). నిరర్థకమైన విషయాల కోసం కొంతమంది తమ జీవితాలను వృథా చేసుకుంటారెందుకో అనిపించి రాసిన కథలివి.

ప్రజల సమస్యల కోసం బంద్ లు చేయాలి. కాదనను. కాని వాటిల్లో నోరు లేని, అమాయకులైన పిల్లలని భాగస్వాములని చేయడం, స్కూళ్ళు మూసేయడం ఎంత అమానుషం? సీమాంధ్ర – తెలంగాణా బంద్ అప్పుడు స్కూళ్ళు మూసేయడం వల్ల ఇక్కడ ఉన్న పల్లె పిల్లల దుస్తితి చూసి రాసిన కథలు “సానుభూతి” (సారంగ), “ఎర్రసున్నా” (సాక్షి) – “ఎర్రసున్నా” నాకు చాలా నచ్చిన నా కథ.

ఉన్నదున్నట్లుగా, వాస్తవికంగా రాయడానికి ప్రయత్నించాలి అనే మాట నిజమే కాని కథకి చదివించే గుణం కావాలి కాబట్టి మనం కథకి కావలసిన టెక్నిక్ ని తెలుసుకుని రాయాలి. దాని కోసం మనం మన పాత రచయితలు వేసిన నిచ్చెనలు ఎక్కాలి. ఆ పఠనం వల్ల రచయితలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడే మనలో ఉన్న ముడిరూపానికి మెరుగులు దిద్దుకోగలిగే పరిజ్ఞానం కలుగుతుంది.

కథలు రాసి సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేది భ్రమ అంటారు కొంతమంది. కావొచ్చు కాని “రాయడమంటే సామాజిక బాధ్యత” అని రచయిత తెలుసుకోవాలి. మనం రాసిన రాతలకి మనమే జవాబుదారీ అని గ్రహించిన రచయిత వ్యక్తిగా ఎదుగుతాడు. కథ అనేది ముసుగులని తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని గ్రహిస్తాడు.

మీ మాటలు

 1. ఇంటరెస్టింగ్ ….కథ…మీ అనుభవం….

 2. Vanaja Tatineni says:

  రాధ గారు మీ రచనా ప్రయాణం చాలా బావుంది . ముఖ్యంగా మీరు చెప్పిన ఈ మాట నచ్చింది

  “రచనలు చేసేటప్పుడు రచయితకి ముఖ్యంగా కావలసినది ‘నిబద్ధత’ అని తెలిసింది. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది.”

  చాలా త్వరితగతిన మీ రచనా ప్రయాణం కొనసాగింది. ఆశ్చర్యమేస్తుంది ప్రతి రోజూ మీరు వ్రాస్తూనే ఉంటారు కదా ! మీ రచనలలో నాకు బాగా నచ్చింది “నిర్వేదం ” ఆకాశామల్లి ” . ఇంకా మంచి మంచి కథలు వ్రాయాలి. మనఃపూర్వక అభినందనలు.

 3. దుస్తితి – అని ఒకచోట తప్పుగా పడింది ఫ్రెండ్స్, “దుస్థితి” సరియైన స్పెల్లింగ్ :)

 4. థాంక్ యు అనిల్

 5. అవును వనజగారూ, ఇంత రాస్తున్నా ఇంకా ఏదో రాయాలనే తపన వదలడం లేదు ఎందుకనో… అయినా మీరు నాకు ఇన్సిపిరేషన్, ముఖ్యంగా బ్లాగు నిర్వహించడంలో…. మీకు ధన్యవాదాలు

 6. Vasantha mukthavaram says:

  రాధా మండువా గారు ,చాలా మంచిగా రాస్తున్నారు .విశ్లేషణ కూడా పచ్చానాకంత బావుంది .

 7. Thirupalu says:

  మీ కధా రచనానుభవం చాలా భావున్నదమ్డి రాధ గారు. “రాయడమంటే సామాజిక బాధ్యత” అన్న మీ వాక్కుకు ప్రసంశలు. .

 8. పచ్చనాకంత సాక్షిగా నేను నా అనుభవాలని కథలుగా మలిచాను. మీకు పచ్చనాకు అంటే ఎంతిష్టమో నాకు తెలుసుగా వసంతక్కా

 9. థాంక్ యు తిరుపాలు గారు

 10. బాగా చెప్పారండి మీ కధా ప్రయాణం గురించి.

 11. ధన్యవాదాలు రమాసుందరి గారూ…

 12. రాధ గారూ, మీ అంతరంగాన్ని ఇలా పంచుకోవడం చాలా బావుందండీ. “స్త్రీ పురుషుల భావోద్యేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ..” కదా . కథల్లో పాత్రల ద్వారా ఆ భావోద్వేగాల్ని సరిగ్గా వ్యక్తం చేసి పాఠకుల చేత చదివించడం అంత సులభమేమీ కాదు. మీ కథలన్నీ బావుంటాయి. అభినందనలండీ.

 13. Thank you Prasuna Garu. చాలా సంతోషంగా ఉంది, తోటి రచయితలు, రచయిత్రులూ నాతో ప్రయాణించడం, మీరు కూడా మరని్న కథలు రాయాలని కోరుకుంటున్నాను

 14. Thank you Prasuna Garu. చాలా సంతోషంగా ఉంది, తోటి రచయితలు, రచయిత్రులూ నాతో ప్రయాణించడం, మీరు కూడా మరిని్న కథలు రాయాలని కోరుకుంటున్నాను

 15. Rajendra prasad Chimata says:

  ఉన్నదున్నట్లుగా, వాస్తవికంగా రాయడానికి ప్రయత్నించాలి అనే మాట నిజమే కాని కథకి చదివించే గుణం కావాలి కాబట్టి మనం కథకి కావలసిన టెక్నిక్ ని తెలుసుకుని రాయాలి. దాని కోసం మనం మన పాత రచయితలు వేసిన నిచ్చెనలు ఎక్కాలి. ఆ పఠనం వల్ల రచయితలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడే మనలో ఉన్న ముడిరూపానికి మెరుగులు దిద్దుకోగలిగే పరిజ్ఞానం కలుగుతుంది.

  కథలు రాసి సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేది భ్రమ అంటారు కొంతమంది. కావొచ్చు కాని “రాయడమంటే సామాజిక బాధ్యత” అని రచయిత తెలుసుకోవాలి. మనం రాసిన రాతలకి మనమే జవాబుదారీ అని గ్రహించిన రచయిత వ్యక్తిగా ఎదుగుతాడు. కథ అనేది ముసుగులని తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని గ్రహిస్తాడు.
  చాలా పరిణతి చెందినఅభిప్రాయాలు

 16. Rajendra prasad Chimata says:

  మీరు ఇంకా చాలా మంచి రచనలు చేయగలరు.రచనలను ఎంజాయ్ చేస్తూ రాయగలగడం అదృశ్ఃటం
  టాబ్లో టైప్ చెయ్యడం లో తప్పులు దొర్లుతున్నాయి క్షమించ గలరు

 17. వ్యాసం నచ్చినందుకు సంతోషంగా ఉంది రాజేంద్రప్రసాద్ గారూ… ధన్యవాదాలు

 18. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది. ఏకిభవిస్తునే…”“రాయడమంటే సామాజిక బాధ్యత” ఔనా కాదా అన్నది రచయిత నిర్ణయించుకోవాలేమో అనిపిస్తుంది సమకాలీన తెలుగు రచనలు చదువుతుంటే!

 19. ”కథ అనేది ముసుగులని తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని ”ఎంత బాగా చెప్పారు రాధ గారు . మీ కథా ప్రయాణం ఇలాగే పచ్చగా పది కథలుగా సాగాలి . ఆల్ ది బెస్ట్

 20. నిజమే, ఆలోచించాల్సిన విషయమే అనిల్ గారూ!

 21. హాయ్, సామాన్యా! బావున్నారా? మీ విషెస్ కి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది –

 22. మీ వివరణ బాగుంది.

 23. రాధగారు , మీ వ్యాసం బావుంది. మీ సాహితీ ప్రయాణం ఆలస్యంగా మొదలైనా , ఆగకుండా వేగంగా సాగడం అభినందనీయం !
  మీ కథలు ఒక సంపుటిగా వస్తే బావుంటుంది.

 24. నాగలక్ష్మి గారూ, పుస్తకంగా వేయించడమనే ఆలోచన…. చూద్దాం. ఎవరైనా పబ్లిషర్స్ వేస్తామంటే ఇస్తాను. మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు

 25. చిదంబరరెడ్డిగారు, థాంక్ యు సర్

 26. indra prasad says:

  పరిపక్వత కనిపిస్తుంది మీ రచనల్లో. మనుషుల పట్ల సానుభూతి , దయ, కరుణ , అపారమైన ప్రేమా మీ ఆధార భూమిక.

  • ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమాపణలు ప్రసాద్ గారూ, “దయ, కరుణ, అపారమైన ప్రేమ భూమికగా కథలు” – ధన్యవాదాలు. సంతోషం కలిగించే కామెంట్ :)

 27. మీ నిర్వేదం నా ఫేవరెట్, అలాగని అన్ని చదివేసానని కాదు, ఇప్పటివరుకు చదివిని వాటిల్లో 😊

 28. sreelatha says:

  అభినందనలు రాధగారు. మీ కథా రచన ప్రయాణం గురించి చాలా చక్కగా రాశారు. మీ కథలు కొన్నింటిని చదవని నాలాంటి వాళ్ళకోసం మళ్ళి షేర్ చేయండి ప్లీజ్. నేను చదివిన మీ కథల్లో ” నిర్వేదం ” , ఆకాశమల్లి , కథలు ఎక్కువ నచ్చాయి. మీరింకా మరిన్ని కథలు రాయగలరు. రచనా శైలి సరళంగా ఉంటుంది.

మీ మాటలు

*