రహస్య

 

నేను రాత్రినై నక్షత్రాలతో చూస్తున్నప్పుడు

నీవు నదివై చీకటిని చుట్టుకుంటూ పోతావ్-

 

నేను చెట్టునై ఆకులన్నీ చెవులు చేసుకుని నిశ్చలంగా నిలిచినప్పుడు

నీవు గాలిలో లీనమై గలగలల సంగీతంలో ముంచేస్తావ్-

శ్వాసించడం అంటే ప్రతిక్షణం కొత్త ప్రాణాన్ని పొందడమేనని

మరణానికీ మరణానికీ మధ్య చిగురు తొడగడమేనని చెప్పేస్తావ్-

 

నువ్వెవరని వీళ్ళడుగుతారు

‘నువ్వు’కు అర్థం తెలిస్తే

‘నేను’ రహస్యం తెలిసిపోతుందని ఎలా చెప్పడం?

 

నేను వెంటే నువ్వున్నావ్

నువ్వున్న చోట నేను దారి తప్పుతుంటాను

ఏ దారిలోనైనా నువ్వుంటావ్-

 

నువ్వంటే ప్రేమంటారు వీళ్ళంతా

ప్రేమ ఎంత పరిమిత ప్రపంచం?

అది నా స్వార్థమంత అల్పం

అది నా లాలసంత తేలిక

అది నా సుఖమంత క్షణికం-

 

అదే నువ్వు…

నా ఏకాంతమంత అనంతం

నా దేహమంత కారాగారం

నా స్వప్నమంత సందేహం-

నేను నాలోనే తిరుగుతున్నప్పుడు

ఏ చెరువు గట్టు మీదో నిల్చుని చేయందించే దేవరూపం

నేను నీలోనే తేలిపోతున్నప్పుడు

తెరచాపలా రెపరెపలాడే తరంగ నాదం-

 

నేను ధ్యానం

నీవు యోగం

నేను మెలకువనై కలల్ని బహిష్కరించినప్పుడు

నీవు వేకువవై నిజాల్ని ఆవిష్కరించినప్పుడు

వెలుగు లేని పగళ్ళు

చీకటి లేని రాత్రుల మధ్య

రెక్కలొచ్చిన కన్రెప్పలా నేను

కన్రెమ్మలకు వేలాడే జ్వలిత జలపాతంలా నీవు-

 

వెలిగిపోవడానికీ

కాలిపోవడానికీ మధ్య దాగిన రహస్యమేదో

ఇప్పుడిప్పుడే తెలిసిపోతోంది-

  • -పసునూరు శ్రీధర్ బాబు
  • శ్రీధర్ బాబు

     

 

మీ మాటలు

  1. అబ్బా చక్కగా ఉందండి మీ కవిత. మళ్ళీ మళ్ళీ చదువుకునేంత బావుంది.

  2. చిక్కగా మరింత చిక్కగా ఎంతో బాగుంది. మళ్ళి మళ్ళి చదావాలనిపించే లా

  3. చీకటి లేని రాత్రుల మధ్య

    రెక్కలొచ్చిన కన్రెప్పలా నేను

    కన్రెమ్మలకు వేలాడే జ్వలిత జలపాతంలా నీవు- చాలా గొప్ప భావం . కవిత ఎంతో బాగుంది సర్

  4. మంగు శివ రామ ప్రసాద్ says:

    శ్రీధరబాబుగారు మీ ‘రహస్య’ కవితలోని ” నేను మెలకువనై కలల్ని బహిష్కరించినప్పుడు/ నీవు వేకువవై నిజాల్ని ఆవిష్కరించినప్పుడు” అనే పంక్తుల లోని లయ శ్రీశ్రీ ‘అనంతం’ కవితను గుర్తుకు తెస్తూంది. చక్కటి పద చిత్రాలలో చిక్కటి భావాన్ని రసాత్మకంగా పొదిగినందుకు ధన్యవాదాలు

  5. ఎన్ వేణుగోపాల్ says:

    అత్యంత సహజ మానవసంబంధం గురించి ఎందరెందరో కవులు పాడిన ఉద్వేగ గీతాన్నే, స్విన్ బర్న్ చూపిన మార్గంలో అంటూ శ్రీశ్రీ ‘వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై’ అన్న హృద్యంగమ భావననే శ్రీధర్ బాబు ఇక్కడ అత్యంత నూతనంగా, గొప్ప భావస్ఫోరకతతో పాడుతున్నారు. అందరూ పాడిన పాటనే పాతదనం లేకుండా పాడడం రహస్య సాధించిన విజయం. దాదాపు ఇరవై కాంట్రాస్టింగ్ పదచిత్రాలు సృష్టించి, ప్రేమలోని అద్వైత భావనను అపురూపంగా అనేక కోణాలలో అనేక స్థాయిలలో వ్యక్తీకరించడం రహస్య సాధించిన విజయం, ‘నువ్వు’కు అర్థం తెలిస్తే ‘నేను’ రహస్యం తెలిసిపోతుందని ఒక్క మాటలో అనంతమైన నిగూఢమైన అనాది నుంచీ మనిషి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న మానవసంబంధపు సారాన్ని ప్రకటించడం రహస్య సాధించిన విజయం. శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు. అభినందనలు.

  6. బాలసుధాకర్ మౌళి says:

    బాగుంది.
    ‘నువ్వు’కు అర్థం తెలిస్తే
    ‘నేను’ రహస్యం తెలిసిపోతుందని ఎలా చెప్పడం?
    ………… ఈ పంక్తులు చాలా నచ్చాయి.

  7. M.Sampath Kumar says:

    wonderful

  8. వేణుగోపాల్ గారూ… రహస్యను దోసిలి తెరిచి గాల్లోకి సీతాకోకల గుంపులా వదిలేశారు. వాసంత సమీరం లోలోపల ఉలికిపడే హేమంత తుషార బిందువు తడి స్పర్శలోకి, హేమంత తుషార బిందువులో గింగిరాలు తిరిగే వాసంత సమీరాల సంగీతంలోకి లయించే క్షణాల సుదీర్ఘత్వంలో పెల్లుబికిన అక్షరాల ఆనవాళ్ళను ‘అద్వైత భావనను అపురూపంగా’ అంటూ హాయిగా పరామర్శించారు. మీ స్పందనకు ధన్యవాదాలు. మనం అనుభవించిన టైమ్-స్పేస్ ను మరొకరిలోకి వీలైనంత యథాతథంగా పంపించగలిగితే.. అంతకన్నా సంతోషం ఏముంది!

  9. ప్రసూన రవీంద్రన్, ప్రవీణ, భవాని, శివరాంప్రసాద్, బాల సుధాకర్ మౌళి, ఎం. సంపత్ కుమార్… రహస్య యానంలో మీ అనుభవాల్ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  10. నేను చెట్టునై ఆకులన్నీ చెవులు చేసుకుని నిశ్చలంగా నిలిచినప్పుడు

    నీవు గాలిలో లీనమై గలగలల సంగీతంలో ముంచేస్తావ్-
    ….అదే నువ్వు…

    నా ఏకాంతమంత అనంతం

    నా దేహమంత కారాగారం

    నా స్వప్నమంత సందేహం-
    నేను నాలోనే తిరుగుతున్నప్పుడు

    ఏ చెరువు గట్టు మీదో నిల్చుని చేయందించే దేవరూపం– అక్షరాలతో మనోహర దృశ్యమాలికని ప్రత్యక్షం చేశారు.

  11. Thirupalu says:

    భావుకత చాలా లోతుగా ఉంది.

  12. నిశీధి says:

    Too emotional with surrial depth . kudos

  13. నిజంగా ఆ రహస్యాన్ని చేదిస్తే అలుకికానందమే కదా.. ప్రతి పద చిత్రంలో కొత్తదనాన్ని పలికించిన శ్రీధర్ బాబు గారికి అభినందనలతో..

  14. paresh n doshi says:

    చాలా బాగుందండి. మరచి పోలేము

  15. వారణాసి నాగలక్ష్మి, తిరుపాలు, నిశీధి, కెక్యూబ్ వర్మ, పరేశ్ ఎన్. దోషి గారూ… రహస్య మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ స్పందనను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  16. B.Narsan says:

    I could not come out from the webs of feel given by this poem. Poetic depths are so masti masti…

మీ మాటలు

*