మనోప్రపంచంలో నా హక్కు కోసం…కథలు!

-కుప్పిలి పద్మ 
మాఘ చంద్రకాంతిని సాయంకాలపు నడకలో ప్రేమించి ప్రేమించి  యింటికొచ్చాక  వొక కథ రాసాను. నూట వొకటో  కథ. యిన్ని కథలు 5 సంకలనాలుగా వచ్చిన తరువాత యిప్పుడు యీ కథ దగ్గర నిలబడి  వెనక్కి చూసుకుంటే  అవును నేను  నా వ్యక్తీకరణకి కధాకాన్వాస్ ని  యెందుకు   యెంచుకున్నాను అని ఆలోచించటం వింతగా వుంది.  గమ్మత్తుగాను వుంది. కొత్తగానూ వుంది.  నాలోకి నేను చూసుకోవటం  ఆసక్తిగాను వుంది. థాంక్స్ టూ సారంగ. 
నాకు యేమనిపించిందంటే…
చిన్న పిల్లలు, వృద్ధులు  కథలు  చెపుతారు. సహజంగా వుంటాయి. ఆ  కథలకి యిమీడియట్ గా వొక లక్ష్యం ప్రయోజనం వుండదు. వుండాలని కూడా  యెవ్వరు అనుకోరు. బాల్యానికి  వృద్ధాప్యానికి మధ్యన కథలు చెప్పటం రాయటం అన్నది  యేదో వొక ప్రత్యేకమైన వ్యాపకంగా అని  అనుకుంటారు. కధలు  రాస్తే యెందుకు రాస్తున్నావు అని అడుగుతారు. దానికి అర్ధవంతంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత యేదో మన మీద వుందని మనం అనుకుంటాం. నిజానికి కథలు రాయటం మొదలుపెట్టటం అన్నది బాల్యానికి వొక కొనసాగింపుగానే జరుగుతుందనుకుంటాను. చిన్న పిల్లలకి వృద్ధులకి వొక మనో ప్రపంచంలో విహరించే వెసులుబాటు వుంటుంది.  నాకు ఆ వెసులుబాటు కావాలి అని చిన్నతనం దాటిన తరువాత యెవరైనా అంటే అది నలుగురికీ వొక వింతలా కనపడుతుంది. కాని అలాంటి వెసులుబాటు కావాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది అమాయకత్వంతో మొండితనంతో ఆ వెసులుబాటును కల్పించుకొంటారు. చెప్పొచ్చేది యేమిటంటే కధలు చెప్పాలి,  మనకో మనో ప్రపంచం కల్పించుకొని అందులో విహరించాలని  అనుకోవటం ప్రతి వొక్కరి హక్కు.
అందుచేత నేను  కధలు యెందుకు రాస్తున్నాను అంటే చిన్నతనం మీద ప్రేమ వదలక. జీవితాన్ని రోజువారి ప్రపంచంలోనే యింకొంచెం విశాలంగా జీవించాలి అని కోరుకునే హక్కుని వదులుకోలేక అనే చెప్పాలి.
యికపోతే యిలాంటి కథే యెందుకు రాస్తున్నావ్? యింకొకలాంటి కథ యెందుకు రాయలేదు? కవిత్వం యెందుకు రాయవు ? యిలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే చాలా నిర్దిష్టంగా   కాకతాళీయంగా సంభవించిన అనేక సంఘటనలని  చెప్పుకోవాలి. అవి చాలా చెప్పాలి. కాని యిప్పుడు సందర్భం ఆది కాదు కనుక కొద్దిగా ఆ విషయాలని పంచుకొంటాను.
 20141231_171613~2~2
నా  వ్యక్తిత్వంలో  మూడు  ప్రధాన ధోరణులు వున్నాయి. వొకటి  భావుకత్వం.  రెండోది  స్వేచ్ఛ. మూడోది  చుట్టూ వున్నా వాతావరణంలో  లీనమైపోవటం. యిందులో  మొదటి  ధోరణికి కవిత్వం మాధ్యమంగా మారింది. రెండవ, మూడవ ధోరణికి  కథ ప్రధానమైన మాధ్యమంగా మిగిలింది. యీ మూడు ధోరణులకి  కాలమ్స్ మాధ్యమంగా మారాయి.
యీ మూడింటిని  విడదీసి వేరువేరుగా వుంచాలనే ప్రయత్నం నేను చేస్తున్నానా లేక అది మాధ్యమం వొక్క ప్రభావమా అనే ప్రశ్నకి సమాధానం  నాకు  తెలీదు.
యిలాంటి కథలే యెందుకు రాసాను అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే వొక స్త్రీ జీవితానుభవం నుంచి నిలబడి ఆలోచిస్తుంటే యివి యే వొక్క స్త్రీ ఆలోచనే  కాదు.  ప్రపంచ వ్యాప్తంగా మా ముందు తరం స్త్రీవాదులు  ఆలోచిస్తున్న అనేక  విషయాలు  అర్ధమవుతూ వచ్చాయి. యీ కథలని స్త్రీవాద సృహ నుంచి రాస్తున్నాననే యెరుక, స్ర్తీ వాదం కూడా ప్రపంచంలో వస్తున్న అనేక ఆర్ధిక సామాజిక మాధ్యమాల మధ్య నిలబడే  తన స్వరాన్ని వినిపించాలన్న విషయం లోతుగా అర్ధమవ్వసాగింది. స్త్రీవాదం కేవలం స్త్రీలకి సంభందించినది మాత్రమే కాదని  పురుషుల జీవితాల గురించి కూడా స్త్రీవాద కోణం నుంచి ఆలోచించాను.  స్త్రీలు కూడా ఆధిపత్య వర్గాలలో ఆధిపత్య రాజకీయాల్లో భాగస్వామ్యం కలిగి వుంటారని తెలిసే కొద్ది   స్త్రీవాదం అంటే కేవలం స్త్రీలని విక్టిమ్స్ గా మాత్రమే చూపించటం కాదు అని ఆ యా రాజకీయాలని కధల్లో రాస్తున్నాను. 

మొదట్లో  కథలు  రాస్తున్నప్పుడు ఆ టీనేజ్ కి సంబంధించిన చూపుని వొక టీనేజర్ ఆంతరంగాన్ని వొక స్త్రీ దృష్టి కోణాన్ని ప్రతిబింబించే కథలు ‘మనసుకో దాహం’లో,  అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలని ఆలోచించుకొంటు నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా వేగంగా  మారిపోతుండటం, సంక్లిష్టంగా వుండటం, యిలాంటి చోట యెలా నిలబడాలి అనుకుంటున్నవాళ్ళ  కధలు ‘ముక్త’లో  రాసాను. నగరంలో వస్తున్న మార్పులకి  కారణం  ప్రపంచంలో  వస్తున్న అనేక మార్పుల వల్ల అనే  విషయం అర్ధమవుతున్నప్పుడు ‘ సాలభంజిక ‘  కధలు చెప్పటం,  అన్ని వుండి కూడా యెదురుకొంటున్న యిమోషనల్  వయొలెన్స్ ని ‘ మంచుపూలవాన’ లో, వీటన్నిటి మధ్యా నిలబడి వెతుక్కుంటున్న చోటులో దాదాపు అన్ని విధాలా కోల్పోతోన్న అమాయకత్వం ‘ ది లాస్ అఫ్ యిన్నోసెన్స్’ లో ప్రతిబింబించాయి.

దాదాపు అన్ని కథల్లో ప్రోటోగనిస్ట్ స్త్రీ.

యికపోతే మొదటిసారి  కథ రాసినప్పుడు అది నలుగురు విన్నప్పుడు యెవరెవరు యెమన్నారు ? ఆ  అన్న మాటలకి మనం యెట్లా అర్ధం  చేసుకున్నాం…  యిదీ  చెప్పుకోవాలి. కాని అందుకు యిది సందర్భం కాదు.
మొత్తం మీద కథలు  యెందుకు  రాస్తున్నావ్ అంటే జ్ఞాపకాలని వున్న వాటిని వున్నట్లే వుండనివ్వకుండా తిరిగితిరిగి అనేక రకాల గతాలని వర్తమానాన్ని, భవిష్యత్తులని నా చేతులతో  నేను నిర్మించుకోవటం  కోసం.  

మీ మాటలు

  1. సుజాత says:

    నా వ్యక్తిత్వంలో మూడు ప్రధాన ధోరణులు వున్నాయి. వొకటి భావుకత్వం. రెండోది స్వేచ్ఛ. మూడోది చుట్టూ వున్నా వాతావరణంలో లీనమైపోవటం. __________________

    అరె ,మొదటి సారి మీ కథలు చదివేటపుడు మీ గురించి అచ్చు ఇలాగే అనుకున్నా నేను!

    మీ కథల్లో స్త్రీల ఆలోచనల్నీ, మనో భావాలనీ వాటి లోతుల్నీ అన్ని కోణాల నుంచీ ఆవిష్కరించేశారేమో అని ఆశ్చర్యం అప్పుడప్పుడు. పద్మ కొత్త కథ రాస్తుంది అంటే “ఇంకా చెప్పనివేం ఉన్నాయి ఆమె పాత్రల ఆలోచనల్లో?” అని ప్రశ్నా, కథ చదివాక “కరెక్టే, ఇది మరో కొత్త కోణం కదా” అనే జవాబూ నాకు దొరికిన సందర్భాలున్నాయి.

    పద్మా, మీ కథల్లో నాకు బాగా నచ్చేది “నిర్ణయం”! ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక కోసం రాశారు. ఆ సంచిక అంతా బాగున్నా ఆ కథ కోసమే దాన్ని భద్రంగా దాచాను. :-)

    నచ్చని కథలూ ఉన్నాయి కానీ, ఈ వ్యాసం చిక్కగా మెత్తగా హాయిగా,స్పష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాటి ప్రసక్తి వొద్దులే! :-)

    చివర్లో రెడ్డింక్ తో రాశారే, ఆ వాక్యాలు ఈ వ్యాసానికి పల్చని జలతారు కప్పినట్టు ఎంత అందాన్నిచ్చాయో!

  2. Kuppili Padma says:

    ‘నిర్ణయాన్ని’ యిష్టపడిన సుజాత గారు, నాలోని నా వ్యక్తిత్వాన్ని పట్టుకొన్న సుజాతగారు మీ స్పందనకి సంతోషపడుతున్నాను. ‘ఇండియా టు డే’ దాచుకోవటం అందమైన జ్ఞాపకం. ( యిప్పుడు ‘ ఇండియా టు డే’ రావటం లేదు.) అన్ని కథలు అందరికి నచ్చటం యెలా సాధ్యమవుతుంది… మనం పాఠకులం మనకి కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవ్. మీరు మీ సమయాన్ని తీసుకొని రాసిన మీ మాటలకి మీకు నా కృతజ్ఞతలు. వైష్ణవి కూడా చెప్పమంది :). వొక మృదువైన జలతారు భావాన్ని నేను మీకు యెంత యిచ్చానో తెలీదు కానీ మీరు మాత్రం నాకు సంతోషపు జలతారు మృదుత్వాన్ని బోలెడంత యిచ్చారు.

  3. తిలక్ బొమ్మరాజు says:

    మీ కథలు నా చిన్నప్పటినుండి చదువుతున్నాను.2001 ఆ ప్రాంతంలో మీ “మంత్ర నగరి సరిహద్దులలో” వార్త లో ప్రచురితమైన కథంటే ఇప్పటికీ నాకు చాల ఇష్టం.ఇప్పుడు మీ ఈ విశ్లేషణ చదవడం సంతోషంగా ఉంది.ఎందుకు రాయాలి?ఎందుకు రాస్తున్నాం ?అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరుకుతోంది మీ ఈ ఆర్టికల్తో.ధన్యవాదములు సారంగకు ఇటువంటి మంచి వ్యాసాలను ప్రచురిస్తున్నందుకు.థాంక్యు కుప్పిలి పద్మగారు ఇంత మంచి ఆర్టికల్ రాసినందుకు.

    • Kuppili Padma says:

      తిలక్ గారు, మీకు మంత్రనగరి నచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ విశ్లేషణ చదవడం సంతోషంగా వున్నందుకు, యెందుకు రాయాలి?యెం దుకు రాస్తున్నాం అనే ప్రశ్నలకు యిప్పుడు సమాధానం దొరుకుతోంది అన్నందుకు సంతోషం. యిటువంటి మనో భావాలకి అవకాశం యిస్తున్న సారంగ వారికి కృతజ్ఞతలు.

  4. Mythili abbaraju says:

    ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో వచ్చిన ‘ ఆకృతి ‘ నవలికనుంచి మిమ్మల్ని ‘ పట్టించుకుంటూ ‘ ఉన్నాను…మనసుకో దాహం లో స్నిగ్ధత్వం, ముక్త లో స్వాతంత్ర్యం , సాలభంజిక లోని బాధా దయా , తిరిగి మంచుపూలవాన లో లాలిత్యం….!

    .మీ రచనల మీది ఇష్టం నా కూతురి కీ వారసత్వమైంది, ఇంతకు మించి నానుంచి ఏమున్నది ….

  5. Anil battula says:

    Good one.

  6. పద్మగారూ, మీ రచనల నిండుగా ఉండే భావుకత్వం నాకు ఎంతో నచ్చుతుంది. కానీ .మీకథలు పెద్దగా చదివే అవకాశం రాలేదు . చదివింది అజేయ ఒక్కటే . అది కూడా బాగా నచ్చింది . మీ మనో ప్రపంచంలో రూపుదిద్దుకున్న మరిన్ని కథలు చదివే సమయం కోసం ఎదురుచూస్తున్నాను .

    • Kuppili Padma says:

      Bhavaani gaaru Thank You. మిగిలిన కథల మీదా మీ మనసుని వినాలని వుంది. యెదురు చూస్తుంటాను.

  7. కధలను కుప్పలుగా పోసి నచ్చిన కధలు ఏరుకోమంటే ఖచ్చితంగా మీరు రాసిన కధలు కొన్నైనా ఉంటాయి ఏరుకున్న వాటిలో.

    • Kuppili Padma says:

      ప్రవీణ గారు భలే చెప్పారు. చాలా సంతోషం గా అనిపించింది. Thank You.

  8. sreenivas says:

    భావాలని ముసుగు వేయకుండా మీరు అనుభవించి ఆస్వాదిస్తూ రాసే శైలి ఒక్కోసారి గుచ్చుతూ, ఒక్కోసారి ప్రశ్నిస్తూ, చేయి పట్టుకుని జీవితం లోని వేర్వేరు దశల్లోకి నడిపిస్తూ, అనుభూతుల ముసురు లో ముద్దగా తడుపుతుంది

    • Kuppili Padma says:

      శ్రీనివాస్ గారు, భావాలకి ముసుగులు వెయ్యాలనుకున్నప్పుడు అసలు రాయటం యెందుకనిపిస్తుంది నాకు. యెలా రాస్తాను అన్న
      విషయాన్ని మీకు పట్టుకున్నందుకు ఆనందించాను. నా భావాలు అనేక రకాల భావనలు కలిగిస్తున్నాయనే ముచ్చటని షేర్ చేసుకొన్నందుకు ముచ్చటగా అనిపించింది. Thank You Sreenivas gaaru.

  9. Kuppili Padma says:

    ‘ఆకృతి’ రాసినప్పుడు, కొన్నేళ్ళ తరువాత మీ స్నేహం, యిష్టంతో సహా మీ నుంచి అందమైన అపురూపమైన అర్ధవంతమైన అత్యంత విలువైన వారసత్వపు కానుక పొందుతానని అసలు వూహించలేదు అప్పుడు.నిత్యం మనసుని పరిమళింప చేసే కానుక. నా అక్షరాలు యీ ప్రేమకి చెమర్చాయి. Thank You Mythili Abbaraju గారు. పాపాయికి బుగ్గ మీద ముద్దు. Love .

  10. పద్మ గారు మీ అంతరంగాన్నిలా చదవడం చాలా బాగుంది . ఎవరినయినా ఆత్మీయంగా , నిగర్వంగా మెచ్చుకోగలగడం ,కష్టమొచ్చినపుడు నేనున్నానని చెప్పడం … మీ హృదయంలో కల్మషం లేని పసిదనం వుంది ,అది మీ కథల్లో ప్రతిఫలిస్తుంది అందుకే అవంతగా అందరికీ నచ్చుతాయి ..

    • Kuppili Padma says:

      విలక్షణమైన విశిష్టమైన రచయిత్రి , విభిన్న అంశాలని విభిన్న ప్రక్రియల్లో చిక్కగా రాయగలిగే రచయిత్రి, మంచి ఎడిటర్, చక్కని చదువరి అయిన మీకు నా కథా అంతరంగం నచ్చినందుకు భలే ఆనందించాను. నా గురించి ప్రేమగా మీరు చెప్పిన మాటలకి ప్రేమపూరిత కృతజ్ఞతలు సామాన్య గారు. Love You too Samanya garu.

  11. మణి says:

    పద్మా! మీరు రాసిన కధల లో ఒక సున్న్తితమైన భావన,అది ఎప్పుడూ నన్ను ఆకట్టుకుంటుంది. అన్నీ కధలూ చదవలేకపోయాను.
    “మనకో మనో ప్రపంచం కల్పించుకొని అందులో విహరించాలని అనుకోవటం ప్రతి వొక్కరి హక్కు”. నా మనసులో మాట కూడా అదే. ఒక్కోళ్ళకి ఒక్కో శైలి ఉంటుంది. మీ కధలలో అక్షరాలని నేను అమితంగా ప్రేమిస్తాను.

    • Kuppili Padma says:

      మీరు నేను రాసిన సంగతులపై మీ అభిప్రాయం చెప్పినందుకు ఆనందంగా అనిపించింది. నా కథల్లో అక్షరాలని అమితంగా ప్రేమించే మీకు కృతజ్ఞతలు మణి గారు.

  12. Vanaja Tatineni says:

    పద్మ గారు మీ కథలు దాదాపు అన్నీ చదివాను . ఒకోసారి సహజత్వానికి కి భిన్నంగా ఉన్న కథలని కూడా ఆస్వాదించాను
    మీరు ఈ వ్యాసంలో చెప్పిన ఈ మాటలు చాలా నచ్చాయి . స్త్రీవాద దృక్ఫదాన్ని నిక్కచ్చిగా చెప్పారు .చాలా మంది అనుకుంటారు కొంతమంది పురుష ద్వేషంతో వ్రాస్తున్నారు అని. కానీ స్త్రీల జీవితాలలో పురుషులతో పాటు సమాజం మొత్తం కూడా ఉంటుంది కదా !
    ” స్త్రీవాదం కేవలం స్త్రీలకి సంభందించినది మాత్రమే కాదని పురుషుల జీవితాల గురించి కూడా స్త్రీవాద కోణం నుంచి ఆలోచించాను. స్త్రీలు కూడా ఆధిపత్య వర్గాలలో ఆధిపత్య రాజకీయాల్లో భాగస్వామ్యం కలిగి వుంటారని తెలిసే కొద్ది స్త్రీవాదం అంటే కేవలం స్త్రీలని విక్టిమ్స్ గా మాత్రమే చూపించటం కాదు అని ఆ యా రాజకీయాలని కధల్లో రాస్తున్నాను”

    అందుకే మీ కథలు ఇంకా ఇంకా రావడం చాలా అవసరం. . .కథన రంగంలో మీ అంతరంగాన్ని కూడా సున్నితంగానే చెప్పారు అభినందనలు

  13. Kuppili Padma says:

    వనజ గారు, నేను రాసిన కథలు దాదాపు అన్నీ చదివినందుకు, సహజత్వానికి భిన్నంగా వున్నాయి అని
    మీకు అనిపించిన కథలని కూడా మీరు ఆస్వాదించినందుకు, యిప్పుడు యీ కథా అంతరంగం నచ్చినందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  14. DrPBDVPrasad says:

    నూటొక్క కథలు రాశారా?5సంకలనాలు కూడా వచ్చాయా? (I may enrich my library)ప్రత్యేకసంచికల్లోని e-పత్రికల్లోని10లోపు కథలు(నవలికలతో కలిపి) చదివుంటాను.
    విస్తృతపరిథి ఉన్న కథని మీ సాహిత్యరంగంగా ఎంచుకోవటమే కాక మూస ధోరణికి భిన్నంగా మీ రచనలు ఎందుకుంటాయో మీ ఆలోచన చక్కగా పంచారు
    రాస్తున్నకొద్దీ మనలోని ఏ ఒక్క భావమో కాక, మరెన్నో ఆశయాలు వాస్తవాలను చుట్టుకొని కథలై అలరిస్తాయి.
    మీరు మరిన్ని కథలు రాయాలి

    • Kuppili Padma says:

      DR PBDV PRASAD అవునండి… నాకు యిప్పటికి కథ రాస్తుంటే అదే మొదటి కథ అన్నట్టు వుంటుంది. కాని 101 కథలు. అప్పటికి నేను చాలా సోమరిని. మీకు నచ్చినందుకు మీరు మీ స్పందనని చెప్పినందుకు కృతజ్ఞతలు. ‘ముక్త’ ‘సాలభంజిక’ ‘మంచుపూలవాన’ …’శీతవేళరానీయకు’ కూడా మీ లైబ్రరీలోకి చేరిపోవాలి త్వరగా… :) Thank you.

  15. పూల దారులంట … – థాంక్యూ ..

    • Kuppili Padma says:

      రాఘవ గారు, మనమంతా కథల పరిమళంతో పూలదారులల్లో … Thank You Sir.

  16. ఆపకుండా చదివించే మీ శైలి, ఆసక్తి రేపే మీ దృక్కోణం, ఏ కథైనా నచ్చితే ఆ రచయితని మీలా మనసారా మెచ్చుకునే హృదయం … 101 కథలు రాశారంటే నేను చదవనివి చాలా ఉన్నాయన్నమాట . ఈ సారి తప్పక తెచ్చుకుంటాను.

  17. Kuppili Padma says:

    వారణాసి నాగలక్ష్మిగారికి, మీకు నా శైలి ,దృక్కోణం, నచ్చినందుకు కృతజ్ఞతలు. నేను ముందు రీడర్ ని. నచ్చినవాటిని పంచుకోవటం యిష్టంగా వుంటుంది. మీరు యీ కథా అంతరంగం చదివి మీ అభిప్రాయాన్ని రాసి నాకు సంతోషాన్ని యిచ్చారు. Thank You very much Naga Lakshmi gaaru.

  18. vijay kumar says:

    ” What creative person does is to hide his resources” is what albert einstein said. U hav unique resources of ur own which noone can steal, it seems…:)

మీ మాటలు

*