పెరట్లో పుట్టింటి నకలు

 

 ‘కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అలా పెరటి తోటలోకి పరిగెత్తుతావ్ , అక్కడ మీ పుట్టింటి నకలు దాచావా శాంతీ?’ మళ్ళీ అదే ప్రశ్న. దీన్నిదెప్పిపొడుపని ఎందుకు అనుకోవాలి? ‘ ఎంతబాగా అర్ధం చేసుకున్నారో! ‘  అనుకుంటే హాయి కదూ! ‘ఈ ఒక్కసారికీ మీరూ రండి నాతో అక్కడ ఏముందో చూద్దురుగానీ’ ! 

నిజమే మరి కష్టమొచ్చినా సుఖమొచ్చినా కాస్త తీరిక దొరికినా, అలసిపోయినా, ఆలోచనేలేక వీగిపోయినా పరుగు పరుగున పెరటితోటలోకివెళ్తే , ‘ ఊతకర్ర పట్టుకున్న తాతగారి లాంటి వేపచెట్టు , మెత్తని మనసున్న నానమ్మ లాంటి అరటి చెట్లూనూ ‘ !

OLYMPUS DIGITAL CAMERA

ఈ తులసివనంలో పరిమళం ఎప్పుడూ నాన్న ముఖంమీది నవ్వు గుర్తు చేస్తుంది. మూడురకాల గన్నేరులు, మా పెద్దన్నయ్య ఉంటే ఒక్క పువ్వూ మిగల్చడు , ఆ పెళుసు కొమ్మలు విరగకుండా కోయడం వాడికే తెలుసు.ఈ రెక్క నందివర్ధనాలు కోసికోసి, ఆ చెట్టుపాలు తగిలి చిన్నఅన్నయ్య బ్రొటనవేలు రంగు కాస్తా మారిపోయి ఎంత గరుకై ఉంటుందని?

chandra-kaanthaalu

ఆ చంద్రకాంతాలు సాయంత్రాలే పూస్తాయి, తెలుపూ, ఎరుపూ, పసుపూ ,నారింజ. అమ్మకు పొద్దున్న పూలు కోసే తీరికుండదుగా ! అందుకని  కాస్త ఎండ ఉండగానే కోసి మాలలు కట్టుకుంటుంది, సాయంత్రం దీపారాధనకి . మాల కట్టేశాక ఆ పుప్పొడి వర్ణాలన్నీ అంటుకొని ఆ చేతులకు అదో అందం!

 

‘ఇక్కడ కాస్త చూసుకొని నడవండి’ , ఈ వరసంతా కనకాంబరాలే ! ఇవి మాత్రం కోయలేను , నాన్నగారి మాటలే గుర్తొస్తాయి,  ” అవి సుకుమారాలు తల్లీ , కోయగానేకమిలి పోతాయి , వాటిని వదిలెయ్ రా ! నీ జడకి ఏ పూలైనా బావుంటాయి, ఇవేనా ఏమిటి? ” అని . 

ఈ చామంతుల కాలం వస్తే అప్పుడే అంకెలు నేర్చుకున్న పసివాళ్ళలా లెక్క పెట్టుకోవడం లోనే సరి , పూల కుంపటి మొత్తం విచ్చుకోగానేచిన్నఅన్నయ్య తెచ్చి బాల్కనీలో నుంచి ఆ చామంతి కొమ్మలను క్రిందకు వ్రేలాడే లాగా వేస్తాడు, వాడికి అదో గొప్ప. మా పైమేడ మీదకు వెళ్తే ఇలాంటి సన్నజాజి తీగేఉంటుంది, కోసినన్ని పూలు.

sannajaajulu

రాధయ్య  శ్రేష్టి గారి మరదలు తెచ్చిస్తే అమ్మ విచ్చుకోకముందే కట్టేసి తడిపిన రుమాలులో చుట్టేస్తుంది . దీపాలు పెట్టే వేళకి ఏంవిరగబూస్తాయని !  అక్కడే కూర్చొని ఆస్వాదించడానికి పసుపు, ఆకు పచ్చని రంగుల్లో వెదురు గుబురూ , భూమి మీద విచ్చుకొనే నైట్ క్వీన్ నక్షత్రాలూనూ ! 

అత్తగారింట్లో ఈ చిన్న తోట  పెంచడానికి, కొన్ని అభిమానాలు కూర్చడానికి పద్నాలుగేళ్ళు పట్టింది మరి.

అయితే ఏం ! పెరట్లోకి ప్రియమైన  పుట్టింటినకలు వచ్చేసినట్టే కదా  !!

-రేఖాజ్యోతి 

మీ మాటలు

  1. రేఖా …ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి! (పని మనిషి రాలేదు అన్న బాధ కాదు కదా అని నన్ను నేనే తరచి చూసుకున్నా కూడాను LOL )మనసు పుట్టింటికై (అమ్మమ్మా వాళ్ళిల్లు అనుకో), నేను కట్టుకోలేని, నా కలలలోని ఫార్మ్ హౌస్ కై (ఖర్మ రా బబూ ఇప్పుడు ఫార్మ్ హౌస్ కి అర్ధాలు మారిపోయాయి!) మనసు పరుగు తీసింది. నేను ఉన్న అపార్ట్మెంట్ లోనే ఆ నాలుగు మొక్కలూ వేసుకుని పరమానందం పొందుతున్నా …దానికి వచన రూపమే నీ వ్యాసం! అసలు ఏమన్నా కాప్షనా …! ఆ captionతోనే పడేశావు! ధన్యవాదాలు రేఖా, మనలో చాలా మంది గుండె చప్పుడును హృద్యంగా, సూటిగా ఆవిష్కరించావు!

    • పెరట్లోని మొక్కలు ఎంత అక్కున చేర్చుకున్నంత సంతోషంగా వుంది మీ స్పందన సుగుణశ్రీ గారూ . TQ

  2. Nenu inka try chestune unnanu. Nakalu Kudaratledu enduko :(
    Mee peradu vachi choostanu twaralo :)

  3. Mythili abbaraju says:

    గుండె సేదదీరగలిగే ఆ చిట్టి గూడు అల్లటమే బ్రహ్మవిద్యల లో ఒక్కటి….జ్ఞాని అవుతోన్న రేఖ కోసం సంతోషం :)

    • గుండెను సేదతీర్చి అక్షరాలు నేర్పిన మీకు ఎప్పుడూ నా నమస్సులే !! _/\_

  4. ఒక సీతాకోక చిలుకలా ఈ పూలన్నిటినీ క్లోజ్ అప్ లో చూస్తూ మీ పెరటి తోటలో తిరిగితే, మీ పుట్టింటికి వెళ్ళొచ్చినట్టైంది.

    • ‘ సీతాకోక చిలుకలా ఈ పూలన్నిటినీ క్లోజ్ అప్ లో చూస్తూ ‘.. అద్భుతమైన ఆలోచన , చాలా ధన్యవాదాలండీ !!

  5. Rajaram ch says:

    బాగుంది,చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి
    రాజారామ్

  6. సుజాత says:

    మా పుట్టింటికి తీసుకెళ్ళారే నన్ను :-)

  7. రేఖ గారూ, అచ్చం మా పుట్టింట్లో కూడా ఇలాగే ఉండేదండీ. ఎంత మైమరపించారో కాసేపు మీరు. ఇక్కడ ఈ కాంక్రీట్ అరణ్యంలో ఫ్లాట్‍లో ఎప్పటికీ అలా నేను పెంచలేను. అయినా పెరడూ, ఆ మట్టీ, మొక్కలూ, ఆ అందం ఫ్లాట్ కారిడార్‍లో ఎన్ని కుండీలు పెట్టినా రాదు.
    మీ ఆనందంలో నా తీరని కోరికని చూసుకుని మురిసిపోతాను కాసేపు. ః-)

    • నిజమే ప్రసూన గారు , కుండీల్లో వుండే పూలు పూయని పచ్చని తీగల్లోనే చూడాల్సి వస్తోంది ‘ పెరటి నకలు ‘ ని ! Thank u

  8. paresh n doshi says:

    పూల, మొక్కల సన్నిహిత్యం ఇచ్చే మత్తు, ఆనందం అలాంతిది మరి. బాగుందండి.

  9. రేఖ చాల బాగుంది నువ్వు వ్రాసింది నాకు అమ్మమ వాళ్ళ వూరు తెలియదు, కానీ మా నానమ్మ వాళ్ళ వూరు బాగా గుర్తు కొచ్చింది.

  10. చిన్న ప్రయత్నాన్ని ఆస్వాదించిన అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు _/\_

  11. యెంత చక్కగా వ్రాశారండీ…
    మమతానురాగాల పువ్వుల కుండీలు
    మనసులో పేరుస్తూ … పూయిస్తూ …
    మొన్నటి రాగాలు
    చిన్నగా మిన్నగా … తీయగా హాయిగా ఆలపిస్తూ …

    అభినందనలు …

  12. ‘ మనసులో పేరుస్తూ … పూయిస్తూ …’ , ధన్యవాదాలు మీ మంచి మాటలకు NMRAOBANDI గారూ!

  13. డా. చిఱ్ఱావూరి సుబ్రహ్మణ్యం says:

    యంతో చక్కగా వ్రాశారండీ

    కాని….

    మీ స్త్రీలకోసం రాసుకున్నారు

    హ్రుదయం ఉన్న అందరికి మీ తోట, భావజాలం చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి

    డా. చి. సు.

  14. p.annapurna says:

    అవును.నీ భావాలన్నీ పూల పరిమలంలా నన్ను చుట్టుకున్నాయి

  15. ఉమాదేవి(ఉమారవి నీలారంభం) says:

    చాలా బాగుంది రేఖాజ్యోతిగారూ! మీ నకలుతో ఎంతమందిని పుట్టిళ్ళకి పంపించారో! ఒక్కసారిగా ఆ మొక్కలనీ పూలనీ పుట్టింటి ఆత్మీయుల్లా తీసుకొచ్చీ కళ్ళముందుంచారు. మనసు పొంగిపోయింది. పూలతో ఆడుకున్న ఊసులూ… పూలు కట్టుకుంటూ అక్కచెల్లెళ్ళాడుకున్న ఊసులూ అన్నీ గుర్తుచేసారు.

Leave a Reply to Rekha Jyothi Cancel reply

*