కోణార్క్ శిల్ప కళా వైభవం!

      పోయిన నెలలో, మా ఇండియా ప్రయాణంలో భాగంగా, ఒరిస్సా (ఇప్పుడు ఒడిశా అంటారు) రాష్ట్రంలో కొన్ని వూళ్ళకి కూడా వెళ్ళాం. భువనేశ్వర్, పూరి, కొణార్క్, చిల్కా లేక్ మొదలైనవి చూశాం.

ఒరిస్సా (నాకు ఇలా అనటమే అలవాటు మరి, ఏం చేయను?) భారతదేశంలోనే వెనుకపడిన రాష్ట్రాలలో ఒకటి అని చదివాను కానీ, ఎన్నడూ చూడలేదు. అందుకేనేమో ఆ రాష్ట్రం చూస్తుంటే కొంచెం బాధ వేసింది కూడాను. అక్కడి ప్రజలు స్నేహపూరితంగానే వున్నా, రోడ్లను అశుభ్రంగా వుంచటం, ఎక్కడపడితే అక్కడ ఎర్రటి జర్దా కిళ్ళీ ఉమ్ములు వేయటం, మెయిన్ రోడ్ల పక్కన కూడా బహిరంగంగా మూత్ర విసర్జన చేయటం చూస్తుంటే మనం ఎక్కడ వున్నాం అనిపిస్తుంది. భువనేశ్వర్లో కానీ, పూరీలో కానీ, సరైన రోడ్లు కూడా లేవు.

మేము భువనేశ్వర్లో రైలు దిగి, ముందే మూడు రోజులకి బుక్ చేసుకున్న టాక్సీలో పూరీ వెళ్ళాం. పూరి లోనే ఒక రిసార్ట్ హోటల్లో రెండు రాత్రులు వున్నాం. అక్కడ పూరీ, కొణార్క్ చూసుకుని చివరగా భువనేశ్వర్ చూసుకుని, బెంగుళూరు వెళ్ళే విమానం ఎక్కాం.

౦                           ౦                           ౦

పూరీలో జగన్నాధుని గుడి దగ్గర రోడ్డు, వాతావరణం ఎంతో అశుభ్రంగా వున్నాయి. ఎక్కడ చూసినా ఆవులు కాగితాలు తింటూ, పేడ వేస్తూ, మూత్రం విడుస్తూ పాడు చేస్తున్నాయి. రోడ్ల పక్కన ఇటూ అటూ బారులు తీర్చి కూర్చున్న ముష్టివాళ్ళ చుట్టూ దుమ్మూ, ధూళీ, బురద. రోడ్డు మీద ఎర్రటి కార్పెట్ వేసినట్టుగా జర్దా కిళ్ళీ ఉమ్ములు. ఎప్పుడు బయట పడదామా అనిపించింది. అందుకనే, దీని గురించి ఇంకా ఎక్కువగా ఏమీ వ్రాయటం లేదు.

దానికి విరుధ్ధంగా ఎంతో శుభ్రంగా, గొప్పగా వున్నది కోణార్క్ సూర్య దేవాలయం. ఇప్పుడు అక్కడ పూజలూ పునస్కారాలూ ఏవీ లేవు. కోణార్క్ శిల్ప కళా సంపద మాత్రం ఎంతో బావుంది.

ముందుగా కొంచెం కోణార్క్ గురించి తెలుసుకుందాం.

౦                          ౦                           ౦

కోణార్క్ బంగాళా ఖాతం సముద్ర తీరాన, ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి అరవై ఐదు కిలో మీటర్ల దూరంలో వుంది. ఇక్కడ ఎప్పుడూ వుండే జనాభా దాదాపు పదహారు వేలు.

అదృష్టవశాత్తూ మాకు దొరికిన టూర్ గైడ్ కోణార్క్ చరిత్రా, ఆ శిల్ప కళా వైశిష్టం గురించీ కూలంకుషంగా తెలిసినవాడు. అంతేకాక ఇంగ్లీషులో తనకు తెలిసిన విషయాలన్నీ ఎంతో చక్కగా వివరించి చెప్పాడు.

‘నరసింహ దేవ’ అనే కళింగ మహారాజు పదమూడవ శతాబ్దంలో ఇక్కడ సూర్యుడికి కట్టిన మందిరం ఈరోజుకి కూడా వేల మంది యాత్రీకులని విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ కట్టడాన్ని పూర్తిగా నల్లటి రాళ్ళతో కట్టినందు వల్ల, బ్రిటిష్ వారు దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అనేవారు.

ఇప్పుడు చాలవరకూ శిధిలమైంది ఈ శిల్ప కళా వైభవం. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక మ్యూసియంలా నడిపిస్తున్నారు.

satyam1

ఈ కట్టడాన్ని పదమూడవ శతాబ్దంలో కట్టినప్పుడు, దీన్ని సూర్యుని రధంలా కట్టారు. పన్నెండు జతల చక్రాల ఒక పెద్ద రధాన్ని, ఏడు గుఱ్రాలు లాగుతున్నట్టుగా కట్టినట్టు చరిత్ర చెబుతున్నది. ఒక్కొక్క రధ చక్రం మూడు మీటర్ల వ్యాసంతో, ఎంతో అందమైన నగిషీ చెక్కడాలతో ఆనాటి శిల్పుల కళా వైదుష్యాన్ని చాటి చెబుతున్నాయి.

ఈ సూర్య దేవాలయం తూర్పు – పడమరల దిశగా కట్టబడింది. ఇది పూర్తిగా కళింగ సాంస్కృతిక పరంగా కట్టిన శిల్ప కళ. కోణ అంటే కోణం. ఆర్క అంటే సూర్యుడు. సూర్య గమనానికి అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగింది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో కనిపిస్తుంది. 16 ఫిబ్రవరి 1980 తేదీన వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణ మార్గంలో కోణార్క్ దేవాలయం వచ్చింది అంటారు. 12 వందల మంది నైపుణ్యంగల శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

1568వ సంవత్సరంలో అక్బర్ తొత్తు అయిన ముకుంద గజపతిని ఓడించి, ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన బెంగాల్ సుల్తాన్ సులైమాన్ ఖాన్ కర్రాని కోణార్క్ దేవాలయాన్ని నాశనం చేయాటానికి కారకుడయాడు. ఆ సుల్తాన్ క్రింద జనరల్ కాలాపహాడ్ ఆధ్వర్యంలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. తర్వాత పదిహేడవ శతాబ్దంలో మొగలాయీ చక్రవర్తి జహంగీర్ ఎన్నో దేవాలయాల్ని నాశనం చేస్తూ, ఈ కోణార్క్ సూర్య దేవాలయంలో మిగిలిన శిల్పాలను కొన్నిటిని నేల మట్టం చేశాడు.

satyam2

ఇప్పుడు ఏడు గుఱ్రాలలో, ఆరు గుఱ్రాలు మాత్రం శిధిలావస్థలో మిగిలి వున్నాయి. అలాగే చాల చోట్ల,

అంత చక్కటి శిల్పాలను నేల మట్టం చేయటానికి జహంగీరుకి చేతులెలా వచ్చాయో కానీ, ఆ విరిగిపోయిన శిల్పాలు ఇంకా చరిత్రను మాత్రం చెరపకుండా చూపిస్తున్నాయి.

అక్కడి శిల్పాలు ఎన్నో శిధిలాలుగా మిగిలిపోయినా, ఆ శిల్ప కళా సౌందర్యం మాత్రం ఇంకా సౌరభాలు వెదజల్లుతూనే వుంది.ఇప్పుడు వాటిని చాలవరకూ మళ్ళీ నిలబెట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక్కడ చెప్పవలసినది ఇంకొక విషయం వుంది. కుజరహో లాగానే ఇక్కడ కూడా ఎన్నో వందల కామ సూత్ర సంబంధమైన శిల్పాలు వున్నాయి. రకరకాల భంగిమలతో కొన్ని ఆశ్చర్యకరంగా కూడా వున్నాయి. నేను చాల ఫొటోలు తీశాను కానీ, ఈ కుటుంబ పత్రికలో ప్రచురిస్తే బాగుండదని ఇక్కడ చూపించటం లేదు. ఏనాడో చదివిన తాపీ ధర్మారావుగారి “దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు?” అనే పుస్తకం గుర్తుకొచ్చింది.

satyam4

తర్వాత చిల్కా లేక్ మీద పడవ విహారం కూడా చేశాం. చాల సరదాగా బాగుంది. మా సరంగు మాట్లాడిన భాష అర్ధమయి వుంటే ఇంకా బాగుండేదేమో!

కొంచెం ఎండగా వున్నా, చల్లటి గాలి తగులుతుంటే ఆహ్లాదకరంగా వుంది. అక్కడ రకరకాల పక్షులతో పాటూ, నీళ్ళల్లో కొన్ని డాల్ఫిన్లను కూడా చూశాం.

అలా అయింది మా ఒరిస్సా యాత్ర!

-సత్యం మందపాటి

satyam mandapati  

మీ మాటలు

  1. Sivakumara Sarma says:

    ఆ మొగలాయీ పాలకులకంటే హిట్లరే నయంలా వున్నాడు. ఈ మధ్యనే చూసిన “మాన్యుమెంట్స్ మేన్” లో కళా ఖండాలనన్నింటినీ తన మ్యూజియంలో పెట్టాలనుకున్నాడని చూపించారు! ఈనాడు తాలిబన్లూ, ఐసిస్ వ్యక్తులూ ఈ చరిత్ర విధ్వంసకాండని కొనసాగిస్తున్నారు.
    కొన్నేళ్ల క్రితం లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో అమరావతిలోని బౌద్ధ స్థూపాల శకలాలనీ, చోళ, పాండ్య రాజుల కాలంనాటి శిల్పాలనీ, ఈనాటి పాకిస్తాన్లోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ నించీ దాదాపు పన్నెండు శతాబ్దాల క్రితపు శిల్పాలనీ చూసి బ్రిటిశర్లమీద కోపగించుకున్నాను – వాళ్లు వాటిని లేపుకుపోయినందుకు. కానీ, ఈనాటి ప్రపంచ పరిష్టితులని చూస్తుంటే వాళ్లు మంచిపని చేశారని ఒప్పుకోక తప్పట్లేదు.

  2. Satyam Mandapati says:

    శివకుమార్ శర్మగారు:
    మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీతో అంగీకరిస్తున్నాను. అలా అని నేను హిట్లర్ అభిమానిని కానండోయ్. హిట్లర్ దుర్మార్గాలను త్వరలో నా జెరూసేలమ్ యాత్రలో వ్రాస్తాను.
    సత్యం

మీ మాటలు

*