ఈ బతుకమ్మ ఒక Incredible Goddess!

 ~ కందుకూరి రమేష్ బాబు

 

 

‘కారు కిటికీ తలుపుల్లోంచి చూడటం’ అని ఒక మాటల రచయిత రాస్తాడు, జీవితాన్ని గురించి!
సినిమాలో!
నిజమే.
నిజంగానే కిటికీ నుంచి చూసినట్లు చూడటం ఒకటి ఉన్నది!

కిటికీ నుంచి చూసినట్లే, ఏదో వాహనంలోంచో లేదా టూ వీలర్ మీంచో… పోనీ నడుచుకుంటూనో వెళుతూ ఉంటే బాటకి ఇరవైపులా కాలిబాటా కనిపిస్తుంది.అక్కడ ఇలాంటి మనుషులెవరో…ఎక్కడివారో…ఏవేవో తమవైన జీవన వ్యాపకాల్లో నిమగ్నమై ఉండనే ఉంటారు.

మామూలుగా చూస్తే ఈ చిత్రం లేదా చ్ఛాయ- మామూలే!
కానీ, కాదనే చెప్పడం!

+++

‘మామూలే’ అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్లు మనకోసం ఏదో చిన్న దుకాణం నడుపుతుంటారు.
తాత్కాలికంగానో, శాశ్వతంగానో ఒక గుడారం వలే జీవిస్తారు.
వాళ్లెప్పుడు ఆ జాగలోంచి వెళ్లిపోతారో వాళ్లకే తెలియదు.
వెళ్లిపోతే…జస్ట్ ఒక ఉనికి… చెట్టుకింద వాళ్లు అదృశ్యమైన దృశ్యం ఒకటి -ఒక క్షణం మన కంట్లో పడి మాయమైతుంది! అంతే!
ఇక ఉంట – వాళ్లు ఉన్నారని కూడా మనకు గుర్తుండదు.
ఏదో పోస్టర్ల మాదిరి కళ్లకు తాకడం – అంతే కదా!

ఉన్నాలేకున్నా మన కళ్లకు ఆనని దృశ్య ప్రపంచంలో వాళ్లు మాత్రం ఉండనే ఉంటారు.
కానీ, కొన్నిసార్లు వాళ్లు తమ ప్రపంచంలోకే తాము వెళ్లి -ఇలా బంగారానికి పుటం పెట్టినట్టు – తమ జీవితాన్ని తాము విచారిస్తారని తెలియదు!
అదీ ఒక రకంగా చూడటమే. దృష్టి సారించడమే! దృశ్యాదృశ్యమే!
అందుకే ఈ చిత్రం.

చూడండి. ఆమెను.
ఆమె వేలుంచి ఆ దేవత పటాన్ని అమిత శ్రద్ధతో ఎట్లా చూస్తున్నదో!

అక్కడికి వచ్చే ముందు మళ్లీ వెనక్కి…
నిజానికి రోడ్డుపై అధికంగా ప్రసారమయ్యే జీవితాలకు ఇండ్లుంటాయి. వాకిళ్లూ ఉంటాయి.
బిల్డింగులూ ఉంటాయి. కానీ, కాలి బాట మీద నివసించే ఇలాంటి వారికి చెట్లుంటాయి. కానుగ చెట్టు నీడ ఒకటి తోడుంటుంది. కొందరికి గుడిసెలూ ఉంటాయి. కానీ, ఫొటోగ్రఫీలో వాడుకలో ఉండే street life మటుకు ఒక అభాస.
paradox.

నిజానికి అది రెండింటి సమ్మేళనం!
ఆ వీధి జీవితంలో రోడ్డూ, కాలిబాటా కలగలసి వుంటుంది, వాస్తవంలా!
కానీ ఆయా ఫొటోగ్రాఫర్లకు ఏ తేడా వుండదు. ఏ పట్టింపూ ఉండదు.
అదే వారి ఛాయా చిత్రణం.

కానీ, వారికి ఎన్నడు అర్థమైతుందో, జీవితం వీధిలో ఉండదని!
వాళ్లు తీస్తున్నది వీధి కానే కాదనీనూ!
చిల్లర దేవుళ్లని కానే కాదనీనూ!

బహిరంగంగా కనిపించే జీవన వ్యాపకమంతా street lifeగా ఎంచే ఫొటోగ్రాఫర్లకు ఈ చిత్రం street కాదని చెప్పడం, life అని గుర్తు చేయడం! అంతకుమించి ఒక కేశవరెడ్డిలా అంచున వున్న జీవితంలో ఒక భీభత్సరస ప్రధానమైన పదును వుంటుందని. అది చూపుడువేలుతో కోస్తుందనీనూ. అదొక devotion అనీనూ. కెమెరా పట్టడమూ అటువంటి ఒక చూపుడు కోతే అనీనూ! లీల అనేనూ!!
అదే ఈ వారం దృశ్యాదృశ్యం.

+++

ఇక మళ్లీ అక్కడికి!
ఆమె వద్దకి వస్తే…

నిజం.
వీధి ఒక టెంపుల్.
ఆమె అందునా ఒక incredible goddess.

ఈ తల్లి భాగ్యనగరంలో, దక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదురు బాటలో, కాలిబాటపై పోస్టర్లు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. పిల్లలు, సీనరీలు, దేవతల పోస్టర్లు- చిన్నవి, మధ్యరకంవి, పెద్దవీ – అమ్ముతూ ఉంటుంది.

ఎపుడైనా చూస్తే, ఆమె కనిపించదు. చుట్టూ మూగి ఉంటారు.
లేదా కనిపిస్తే ఆమె ముందు ఎవరో ఒకరిద్దరు బేరం చేస్తూ ఉంటారు.
ఎవరూ లేనప్పుడు చూస్తే ఆమె దేవత.

అవును.
పనిలో ఉండగా ఆమెలో ఏ విశిష్టతా కనిపించదు.
కానీ, పనిలేనప్పుడు ఆమె తల్లి అవుతుంది. బిడ్డ బొమ్మను చూస్తుంది.
భావుకురాలూ అవుతుంది, సీనరీలో తలమునకలు అయి సంతషిస్తుంది.
కానీ, ఈ చిత్రం తీసేప్పుడు మాత్రం ఆమె ఒక దేవతామూర్తిని లేదా లక్ష్మీదేవి పటాన్ని అమిత శ్రద్ధగా చూస్తోంది. తన దారిద్ర్య రేఖ దిగువ జీవితాన్ని అట్లా ఎత్తి, ఆ పటంపై చేయుంచినట్లు వుంచి, ఆ దేవత ఆసీనమైన తామర పుష్పం కిందుగా వుంచి మరీ తదేకంగా చూస్తోంది.

చూడటం అంటే విచారణ.
జీవితాన్ని విచారిస్తుందేమో అనిపిస్తోంది.

ఎప్పుడూ ఒక మనిషి ఇంత విచారణ చేయగా నేను చూడలేదు.
ఒక ఫొటోను! లేదా చిత్రాన్ని!!

కావచ్చు, అది దేవతా పటమే కావచ్చు.
కానీ, గర్భగుడిలో ఒక భక్తురాలు అలా నిలబడి తదేక ధ్యానంలో దేవతకు తన మొర ఆలకించుకోవడం చూశాను. తన దుస్థితి నివేదించుకుని తల్లడిల్లే భక్తులనూ చూశాను. కన్నీరువలే ఆనందబాష్పం విడవటమూ కన్నాను. కానీ, అది గుడి. కానీ, ఇలా -వీధిలో ఒక వనిత… తన జీవన వ్యాపారంలోనే ఉన్న ఒకానొక పటాన్ని ఏకాంతంలో తన ముందే పెట్టుకుని – అలా తల పూర్తిగా వంచుకుని – తన తలరాత ఎలా వుందో అన్నట్టు ఆ తల్లితోనే విచారణ చేస్తున్నట్లు చూడటం –  చూపుడు వేలుతో చూడటం- ఇది మాత్రం ఇదే తొలిసారి- బహుశా మళ్లీ చూడాలనీ లేదు, ఇలా ఎవర్నీ!

రాత!

ఒక సుద్దరామె. శూద్రురాలు.
కడు పేదరాలు. అబాగ్యురాలు.
నమ్మశక్యం కాని బతుకునొకదాన్ని భరిస్తూ ఉన్న బతుకమ్మ.
క్షుద్ర జీవితంలో ఒక స్త్రీ – Goddess.
an incredible moment.

మొత్తంగా ఒక విచారణ ఈ వారం – దృశ్యాదృశ్యం.

Kandukuri Ramesh

మీ మాటలు

  1. B.Narsan says:

    జీవితాన్ని వాతావరణాన్ని అక్షరీకరించిన తీరుతో ఆ ఛాయాచిత్రం ఓ షార్ట్ ఫిలిం అయ్యింది. రమేష్ బాబు కెమెరా కంటికి ఓ నిబద్దత వుంది.ఓ పరిణితి వుంది. a unique personality in telugu journalism.

  2. kandukuri ramesh babu says:

    షార్ట్ ఫిలిం. ఈ మాట చాలా నచ్చింది నరసన్ అన్న.
    థాంక్ యు అండ్ విల్ కీప్ అప్ ది లైఫ్.

  3. Lakshmi Prasanna says:

    అన్నా,కళ్ళు చమ్మగిల్లినై.

  4. kandu kuriramesh babu says:

    థాంక్ యు లక్ష్మి ప్రసన్న గారు.

  5. Vanaja Tatineni says:

    దృష్టిని బట్టే సృష్టి అర్ధమవుతుంది అంటారు కదా ! మీ దృష్టి కి అందిన దృశ్యాన్ని విచారణా బద్దంగా పరిచయం చేసిన తీరు చాలా నచ్చింది. నిజంగానే కన్ను చేమ్మగిల్లింది. వెరీ నైస్ అండీ !

  6. kandukuri ramesh babu says:

    ‘విచారణా బద్దంగా’…అన్నందుకు నిజంగా థాంక్స్.
    ‘చూడటం’ ఒకటి మెల్లగా నలుగురి దృష్టి లోకి తెస్తున్న చిరు ప్రయత్నం సఫలం అవుతున్నందుకు హ్యాపీ.

  7. Raghu Mandaati says:

    తీసే చిత్రాల్లో అంత ఉంటుంది కాని ఆ చిత్రానికి, తీసే మనసుకు మధ్యనే వంతెనల రెప రెప లాడే జీవితం మాత్రం అవుట్ ఫోకస్లో మేము గమనించాలనే ఆలోచనే రానంతా మసగ్గా మిగిలిపోతాయి మా చిత్రాలు. నిజమే బహిరంగంగా కనిపించే జీవన వ్యాపకమంతా street lifeగా ఎంచే మా లాంటి ఫొటోగ్రాఫర్లకు జీవితాలకి దగ్గర చేయడానికి చేరుకోడానికి ఖచ్చితంగ మీ చిత్రాలు దోహదపడుతాయి.

మీ మాటలు

*