ఆకాలంలో మా వూరి జనాలు, సేద్యాలు

ఇది యాబై ఏండ్లకి ముందుకత. మా ఊర్లో  యాబై ఇండ్లకి మించి వుండ్లేదు. సగం ఇండ్లు కాపోళ్లవి.మిగిల్నవి కురవోళ్లు,ఉప్పరోల్లు,మాలోల్లు,మాదిగోల్లవి. కమసలోల్లు,  సాయాబులు,పింజిరోల్లు,బాయోల్లు,బలిజోల్లవి,బాప నోల్లవి ఒగొగ ఇల్లు మాత్రమే ఉండె!!
 
     మా కాపుదన మోళ్లంతా  స్యేదాలు  సేస్తా వుండ్రి.(మా కులం కత తిరగ సెప్పుతా) కురవోల్లు గొర్రెలు మేపి బొచ్చు కత్తిరించి కంబళ్లు నేస్తావుండ్రి.(కన్నడంలో “కురి”అంటే గొర్రి).మాలోల్లు దుప్పట్లు సీర్లు నేస్తా వుండ్రి.మాదిగోల్లు కట్టెలు కొట్టుకోని ఇదూపురానికి మోసుకపొయ్యి అమ్ముతా వుండ్రి.కమసలోల్లు బంగారు సొమ్ములు, రైతులకి ఇనప సామాన్లు సేస్తా వుండ్రి. సాయాబు బుడ్డూలయ్య బువ్వమ్మ- రెడ్ల ఇండ్లలో సినిగిన పాత సీర్లు,బట్లు తీసుకుపొయ్యి సూదీ దారంతో కుట్టుకో నొస్తా వుండ్రి.
పింజరోల్లు పరుపులు కుడతా వుండ్రి. బాయోల్లు పూల సెట్లు పెంచి ఇంటింటికీ తిరిగి పూలు అమ్ముతా వుండ్రి. బలిజోల్లు రైల్లో పని సేస్తావుండ్రి. బాపనోల్లు గుడిలో పూజార్లు.
    మా వూరి దగ్గర ముందుకాలంలో బూమి పైన పొరల్లో ఉప్పు నీళ్లున్నంట! వుప్పరోల్లు పై మన్ను తవ్వి మడులు గట్టి నీళ్లు నింపి, యండకి నీళ్లు ఆవిరి అయ్యినంక ఉప్పు తయారు సేస్తా వుండ్రంట. ఆ ఉప్పుని ఎనుంపోతుల మీద ఏసుక పొయ్యి ఊర్లంటీ అమ్ముతా వుండ్రంట. సముద్రం ఉప్పు ఒచ్చేది మొదలయ్యినంక వాళ్లకి పని జరక్క ఎనుంపోతుల మింద నులకల్తో అల్లిన గంతలు ఏసి సేన్లకి మన్ను తోలేది మొదలు పెట్రంట.
    ఇంగొగు ఇసిత్రం ఏమంటే– పూర్వ కాలంలో దచ్చిణ బారత దేశంలో  ఉండే ఆవులు  శానా సన్నవంట! వాట్ని సిట్టావులు అంటారు. ఈడ సిట్టావులమ్మ పేర్తో గుడ్లు కూడా వుండివి. అవి శ్యారెడో పుడిశడో పాలు ఇస్తా వున్నంట గాని, సిట్టెద్దులకి మడకలు(నాగలి) దున్నేకి అయితా వుండ్లేదంట. అపుడంతా ఎనుం పోతుల శ్యాద్యాలే నంట!!
    ఆర్య జాతోల్లు, సాయాబులు,పరంగొల్లు (ఫెంచి వారు),ఇంగిలీషోల్లు వాళ్ల  దేశాలనుండి మేలు జాతి కుర్రలు తెచ్చి సంకరం సేసి మేలు జాతి ఆవుల్ని తయారు సేసిరంట!! అపుడు యాడ జూసినా ఎనుములే (బర్రెలు) నంట. నల్లెనుము కాపులు,యర్రెనుము కాపులు,బోడెనుము కాపులు…అని మా రెడ్డికులంలో  తేడాలు గూడా వుండివి.
    కర్నాటక దేశంలో కావేరీ నదికి సుట్టూపక్కల ఇపరీతంగా నీళ్లున్నంట. ఆడ ఎనుముల్ని దండిగా మేపుతా వుండ్రంట. ఉత్తర దేశం నుంచి వొచ్చిన ఆవులోళ్లకి- ఈల్లకి తగాదా లొచ్చినంట. యాలంటే ఎనుములు బురదలో మునుగులాడి గడ్డి మింద తిరగలాడతాయి. ఆ గడ్డిని ఆవులు తినవు. అవి మడుగ్గట్టిన పెద్ద కులము రకమంట! ఎనుములు మాత్రం దూర ముండాల్సిన శూద్ర జాతికింద లెక్కంట!! అందుకే ఈ ఆవులోళ్లు రాజుల్తో జత సేసుకోని పెద్ద తపస్సు మాదిరీ సేసిరంట. ఒగ దేవతని ఒళ్లు మిందకి పూనకం మాదిరీ తెచ్చుకోని ఎనుములు మేపే వాల్లనందర్నీ సంపిరంట. అందుకే ఆడుండే మహిషాల ఊరు “మైసూరు” అయ్యిందంట!! ఎనుము లోళ్లని దేవత సంపిచ్చిందని, ఆయమ్మ పేరిట “మహిషాసుర మర్దిని”అనే గుడి కూడా వుందంట! ఇదంతా మా నాయిన కతల మాదిరీ సెప్పుతా వుండె!!
    1950 కి ముందు రాత కోతలు సూస్తే మా కులంలో “రెడ్డి” అనే మాటే కనిపించదు కొండ, తిమ్మ , రామ, యంగట,సిదంబర,లింగ…అనే వుండివి!! పులిని సూసి నక్క వాతలు పెట్టు నొన్నట్ల ,యాడో పెద్ద శేద్యాలు సేసి “రెడ్డి రికం” ఉద్యోగంతో మీసాలు తిప్పే వాళ్లని సూసి మా ఊరి జనాలు కూడా పేరుకు యనక తోక మాదిరీ రెడ్డి ని తగిలిచ్చుకో నుండారు! కులం మాత్రం “కాపు” అనే సెప్పుకొంటారు.
   పెన్నేటి గట్లో రెండు మూడు కుటుంబాలకి ఒగ బాయి. ఒగ బాయి కింద రెండు మూడు యకరాలకి మించి పంట పెట్టేకి కుదర్దు. పగలంతా కపిల(మోట) తోలల్లంటే ఆరి జతల ఎద్దులు కావల్ల. దాని జతకి మడకలు దున్నల్ల,ఒండుమన్నులు, ఎరువులు,పచ్చాకులు తోలల్ల.నీళ్లు కట్టల్ల.కలుపులు తియ్యల్ల.బెల్లం గానుగలు ఆడల్ల. అందుకే కులాలు తేడా లేకుండా రెండు మూడు కుటుంబాలు కల్సి- బదులుకు బదులు- పన్లు సేసుకొంటా వుండ్రి.
    రెండెకరాల్లోనే ఒడ్లు,రాగులు,సెరుకు,మిరప సేన్లో అన్నిరకాల తర్కారీలు,కందులు,శెనగలు,పెసులు,పగాకు,తలకు రాసే నూనె, తమల  పాకులు,వక్కలు,యర్ర గడ్డలు,తెల్ల గడ్డలు…అన్నీ పండిస్తా ఉండ్రి.ఇంట్లో సన్న పిల్లోల్లు యాడాదంతా తినేకి, ఉలవలు, శనగలు ఏంచుతా వుండ్రి. బొరుగులు,శెనగ పప్పులు,శెనిగిత్తలు కలిపి న్యాత(లేత) బెల్లంతో కలిపి “పాకం పప్పు” తయారు చేసి పెద్ద పెద్ద గుడవల్లో (మట్టి కడవలు) దాచి పెడతా ఉండ్రి.
     కాఫీ పొడి,బీడీలు,అగ్గిపెట్టె,బట్టలు,సీమనూనె,కుంకుమ,గాజులు…ఇట్లాంటి వాటికి  మాత్రమే డబ్బుల అవసరం.డబ్బుల చలామణీ లేదు. అంతా ఊరుమ్మడి బతుకులు. అయిదారు ఇండ్లోళ్ళు ఎనుములు మేపి పెరుగు నెయ్యి ఇందూపురానికి తీసుకపొయ్యి అమ్ముతా ఉండ్రి.శుక్కుర వారం సంత.ఆపొద్దు మాత్రమే రెండు మైళ్ల దూరంలోని టవునుకు కొందరు పోతావుండ్రి.
     మా యమ్మ మా నాయనతో గలాటకి పెట్టుకోని దినామూ ఏడిసేది! ఇంత మందిని పుట్టిచ్చిండావు. ఇంట్లో పండుకొనే దానికి సోటు లేదు. కడుపు నిండకా కూడులేదు. నువ్వు జూస్తే – దిమ్మి రంగా దీపాల పండగ- అని నెలకొగసారి దేశాలంటి యల్లబారి పోతావు? ఇంత సంసారాన్ని నాకి మోసేకి శాతగాదు, సెరువో,బాయో సూసుకొంటాను- అని అలుగుతా ఉండె.
    ఆయాడాది బెల్లంలో అంతో ఇంతో దుడ్లు మిగిలంట్లుంది. కిరికేరి బీగాల కొండప్ప తావ మానాయన అప్పుతెచ్చి ఒగ ఇల్లు కొనె. అది యంత పెద్దది అంటే నూరు అడుగుల పొడవు, యాబై అడుగుల ఎలుపు. అరవై అంకణాల లంకంతది. నీలకంఠ శారి అనే కమసల అయ్యవార్ది. తూరుపుకి బెంగళూరు రోడ్డు. పడమరకి కొత్తగా ఏసిండే కంకర రోడ్డు. రెండు సన్నిండ్లు(రూములను అప్పుడు చిన్నిల్లు అనే వారు) వొండే ఇల్లు,హాలు, పది జీవాలు కట్టేసే గాటిపట్టు.(అప్పుడు పశువుల్ని ఇంటిలోపలే కట్టేసే వారు). మాకు  ఇల్లు కొనిన సంబ్రం ఆర్నెల్లు కూడా మిగల్లేదు.
 వాన ఏటిచ్చె. పెట్టిన పంటలన్నీ ఎండుకు పాయ.ఇంట్లో తిండి గింజలు లేవు.మా నాయన ఊర్లంటీ పొయ్యి విరాట పర్వం సదివి గింజలు తెస్తా వుండె.(విరాట పర్వం చదివితే వర్షాలు పడతాయని అప్పుడో మూఢ నమ్మక ముండేది) పశువులు మేసేకి బూమ్మింద గడ్డి పాసుగూడా లేదు. నేను ఎనుముల్ని ఊరెనక్కి తోలుకు పొయ్యి సరగమాడిస్తా ఉంటి(కక్కసు తినడానికి తోలడం). అంత పెద్ద జీవాలకి సరగము యా లెక్క?? కండుల్తో సూసేకి కాకుండా అయిపాయ. అవి అన్నో ఇన్నో పాలిస్తేనే అమ్మి సంసారం సాగల్ల!
     ఒగదినం సుతారంగా గడ్డిలేదు. గాట్లో కట్టేసింటే,కడుపుకి ఏమీ లేక దొక్కలు ఇరబోసుకోని కండ్లు కండ్లు ఇడుస్తా ఉండివి.అంబా అని అరుస్తా ఉండివి. అవిట్ని సూడలేక మా రవిందర్రెడ్డన్నయ్య,దూళి దూళి మబ్బవుతూనే  ఉరెనక్కి పొయ్యి,ఎవరి  వామిలోనో ఒట్టి స్వాగ (చెరకు పంట అయ్యాక  ఎండు సోగ వామిగా వేస్తారు.అది కేవలం గుడిసెల పైకప్పడానికి,చెరకు పాలు కాంచడానికి మాత్రమే పనికొస్తుంది.గాడిదలు కూడా తినవు) దొంగగా తెచ్చాడు.  గాట్లో ఏసి వాకిలి మూశినాడు.ఆ దరిద్రం దాన్నే ఆత్రం   ఆత్రం గా ఎనుములు మేస్తావుండివి.
     అంత సేపటికి ఎవరో వొచ్చి వాకిల్ని దబా దబా తట్రి.మా నాయన రవ్వంత  సందుసేసి తొంగి సూసె.”ఏమి రెడ్డీ వాన కురిస్తే కారకుండా గుడిశ మింద కప్పుకొందామని,వాళ ఈళ్ల కాళ్లుబట్టి,బంగారు మాదిరీ కంపలేసి దాపెట్టింటే, మీ పిల్లోడు ఎత్తుకోని ఒచ్చినంట కదా!!కాపుదనమోళ్లు మీరే ఇట్ల సేస్తే యట్లన్నా!!” అనె మాల యంగటప్ప.
 “నీకి ఎవరు సెప్పిరన్నా? మేమేమిటికి తెస్తుము?” అనె మా నాయిన.
  “అన్నము తినే నోట్లో అబద్దం యాల సెప్పుతావు రెడ్డీ?” వాకిలి మూస్తే మాత్రము జీవాలు సర్ సర్ అని మేస్తా వుండే శ్యబ్బుదం ఈతాకి ఇనపడతావుంది.” అనె యంగటప్ప.
    మా నాయనికి గొంతు ఆరినట్లుంది. ” మబ్బులో ఎవుర్ని సూసి ఎవరను కొంటినో లేన్నా!” అని నీళ్లు నములుకొంటా ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటా వాకిలి మూసేశ. యంగటప్ప వాకిలి అవతలే నిలబడి ఏడిదేడిదో రవ్వంతసేపు తిట్టుకోని ఎల్లిపాయ.
    గడ్డి సాలక పాలిచ్చేది ఎనుములు తగ్గిచ్చె. పొదుగులో శారెడుగూడా ఉంచకుండా పిండుకొనేది మొదలు పెట్రి. పెయ్యకి పాలు సాల్లేదు. అది శరీరమంతా జుబ్బర(బొచ్చు)పెరిగి,ఉరుకులు పడి(దూడల్లో పడే పేలవంటివి) సచ్చిపాయ. దాన్ని మా నాయన మాదిగ నారాయణప్పకి ఎత్తిచ్చె. ఆయప్ప దాన్ని కోసుకు తిని శాటపెయ్య తయారు సేసిచ్చె.(చేట పెయ్య=చచ్చిన దూడ చర్మాన్ని వొలిచి, ఎండబెట్టి, అందులో గడ్డి దూర్చి దూడలా తయారు చేసి తల్లి బర్రె ముందు వుంచేది). అయినా గూడా ఎనుము పాలు పిండ్లేదు.ఎగేసుకోనె.
    ఒగ శుక్కురువారము దినం మా నాయన సంతకు తోలి ఎనుమును అమ్మేశె.
    ఇందూపురంలో అమ్మిన ఎనుములూ,ఎద్దులూ,గొర్రిలూ,మేకలూ అన్నీ మా ఇంటి ముందరనుంచే బెంగుళూరికి పోవల్ల. మద్యానం ఒంటిగంటకు అయిదారు ఎనుముల్ని పెనేసి కట్టి రోడ్డంటీ తోల్తా వుండారు. మెడగ్గట్టిండే తాడుని పుటుక్కున తెంపుకోని మా ఎనుము ఇంటి ముందరికిచ్చి కుడితిలో నీళ్లు గొటగొట్న తాగబట్టె. దాన్ని సూసి మా యమ్మ” అయ్యో! బంగారట్లా ఎనుముకు యన్ని తిప్పలొచ్చినమ్మా! యంత దప్పిగోనిందో గదా?” అని ఇంగ రవ్వన్ని  నీళ్లు బకీట్లో తెచ్చే దానికి పాయ. అంత సేపటికి మందని తోలుకుపోయే కూలి జనాలు వారల శెలకోల్తో ఫెళా ఫెళా వాంచబట్రి. “అయ్యొ య్యో ! పాపిస్టి జనాల్లాలా ఆ పసరాన్ని రవన్ని నీళ్లన్నా తాగనియ్యండ్రా!!”అని మా యమ్మ ఏడ్సబట్టె. అయినా వాళ్లు దాన్ని బలంతుముగా ఈడ్సుకు పాయిరి.
     ఆ ఎనుము మా పక్క, మా ఇంటి దిక్క, కుడితి దిక్కా సూసుకొంటా దీనుముగా నడిసి పొయ్యింది నా జన్మంలో మర్సి పోలేను.(నేను 16సం.వయస్సులోనే రాయడం మొదలు పెట్టాను. మొదటగా రాసింది పెద్దకొడుకుగా కష్టపడిన ఎద్దుల్ని ముక్కూ మొగం తెలియని వారికి అమ్మేస్తే వారు వాటిని ఎంత భయంకరంగా హింసిస్తారో తెలిపే గేయం. ఎనుమును గురించి ఎందుకు రాయలేదంటే! చిన్నప్పుడు చదివిన ఏ పుస్తకం లోనూ వాటి ప్రస్తావన లేక  పోతే , రాయగూడదేమో అనే శంక!! అది ప్రచురనకు నోచుకోలేదు. అయితే 1995 లో “పశువులు” అనే కథ రాశాను.శశి శ్రీ సంపాదకుడుగా కడప నుండి వచ్చే సాహిత్య నేత్రం దానికి ప్రత్యేక బహుమతి నిచ్చారు.)
-సడ్లపల్లె చిదంబర రెడ్డి
 

మీ మాటలు

  1. Nisheedhi says:

    Delightful reading

  2. Nisheedhi గారు ధన్య వాదాలండీ

  3. Aravind reddy says:

    నాకు కూడా మా బర్రె ను అమ్మేసినప్పుడు అది నన్ను మా ఇంటిని చుసిన చూపు ఇప్పటి కి నన్ను మరచిపోనివ్వడం లేదు అంకుల్.అది కష్టాలలో మాకు తోడుగా ఉంది మాకు సుకాలు వచెటప్పటికి వెల్లిపొఇన్ది .

మీ మాటలు

*