ముచ్చటగా మూడో అడుగు…

 

మూడో వసంతంలోకి అడుగుపెడుతోంది “సారంగ”. ఈ అడుగులో అడుగు వేసి నడుస్తూ వస్తున్న మీ అందరికీ సారంగ కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది ప్రతి సంచికనీ ఒక ప్రత్యేక సంచికగా దిద్ది తీర్చడంలో మీ అందరి సహకారాన్ని  సారంగ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది, ఎందుకంటే సారంగకి ఇది వొంటరి ప్రయాణం కాదని మీరంతా ఇప్పటి వరకూ నిరూపిస్తూ వచ్చారు కనుక!

ఈ గడిచిన ఏడాది సారంగ ఒక వార పత్రికగా తన పరిధిని విస్తరించుకుంటూ వచ్చింది. సాహిత్యం అనే వృత్తంలోనే గిరిగీసుకొని వుండకుండా, మొత్తంగా సాహిత్య ప్రపంచాన్ని ఆవరించుకొని వుండి, దాన్ని ప్రభావితం చేసే ఇతర రంగాలని కూడా సారంగ మనఃస్ఫూర్తిగా హత్తుకుంది. సాహిత్యం అనేది ఒక దంత గోపురం కాదన్న భూమిక మీద నిలబడి, సాహిత్యాన్ని ఒక సాంస్కృతిక క్షేత్రంగా మలిచే వివిధ అంశాల మీద చర్చకి సారంగ కరచాలనం అందించింది. ఈ కరచాలనాన్ని అందుకొని, ఉత్సాహంగానే కాకుండా ఆలోచనాత్మకంగా చర్చల్లో పాల్గొన్నారు పాఠకులు, రచయితలు కూడా!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ఈ సంవత్సరం ప్రధానంగా కథా రంగానికి సంబంధించి సారంగ అందించిన కథలు, కథా చర్చలూ, వివిధ శీర్షికలూ తగినంత ప్రభావాన్ని చూపించాయని అనుకుంటున్నాం. రమాసుందరి నిర్వహించిన “మరో సారి కారా కథల్లోకి…” శీర్షిక ఎందరినో మళ్ళీ కారా మాస్టారి కథాలోకంలోకి తీసుకు వెళ్ళింది. సామాజిక సందర్భం మరీ సంక్లిష్టమైన వర్తమాన సన్నివేశంలో కారా మాస్టారిని ఆయన సృష్టించిన పాత్రల, జీవన దృశ్యాల కేంద్రం నించి చర్చ ప్రారంభించడంలో రమాసుందరి గారు సఫలమయ్యారని మేమే కాదు, మీరూ గుర్తించారనడానికి ఆ శీర్షికకి లభించిన ప్రతిస్పందనే కొండగుర్తు. ఏ రకంగా చూసినా ఇది ప్రయోగాత్మక కథా విమర్శ శీర్షిక. బహుశా, అతిశయోక్తి కాదు అనుకుంటే, తెలుగు పత్రికా రంగంలో ఒక కథా రచయిత గురించి ఇంత విస్తృతంగా ఒక శీర్షిక కేంద్రంగా ఇంతకుముందు ఇలాంటి చర్చ జరగలేదనే చెప్పాలి. ఈ శీర్షిక నిర్వహణకి పూర్తీ బాధ్యత తీసుకొని, ప్రణాళిక మొదలుకొని ఆచరణ దాకా ఎంతో నిబద్ధతతో కృషి చేసిన రమాసుందరి గారికి ధన్యవాదాలు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో అద్భుతమైన రచయిత గురించి యింకో  కొత్త శీర్షికకి రంగం సిద్ధం చేస్తున్నారు రమాసుందరి.

Viramప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న వాళ్లకి అర్థమయ్యే వుండాలి సాహిత్యమూ చిత్రకళా రెండూ కొన్ని సార్లు కలిసి మెలిసి ప్రయాణం చేస్తాయని! తెలుగు సాహిత్య రంగంలో ఈ విధమైన ధోరణి అంతగా లేకపోవచ్చు కాని, మరీ దగ్గిరగా చూస్తే, గతాన్ని తిరిగి నిర్మించుకునే ప్రయత్నం రెండు రంగాల్లోనూ కనిపిస్తుంది. వర్తమాన తెలుగు చిత్ర కళా ప్రపంచం గతంతో ఒక అనుబంధాన్ని నెమరేసుకునే ప్రయత్నంలో పడిందని అన్నవరం శ్రీనివాస్, లక్ష్మణ్ లాంటి చిత్రకారులు చిత్ర  దర్పణం లోంచి చెప్తూనే వున్నారు. ఈ కొత్త ప్రయోగాన్ని ఇంకా కొంచెం వెనక్కి తీసుకువెళ్ళి, క్లాసిక్ యుగంతో చిత్ర సంభాషణ మొదలెట్టారు మమత వేగుంట “మోహనం” శీర్షిక ద్వారా! నవరసాలు అందరికీ తెలుసు. కాని, వాటికి  నవీన చిత్ర కళా ప్రయోగంతో, ఒక ఇంప్రేషనిస్ట్ కోణం నించి చూడవచ్చనీ, అదే వాటికి సరైన వర్తమాన వ్యాఖ్య అవుతుందనీ మమత చిత్రాలు నిరూపించాయి. ఎలాంటి ప్రతిస్పందన వుంటుందో అన్న సంశయంతోనే ఈ శీర్షిక మొదలు పెట్టాం. కాని, అనూహ్యమైన ప్రతిస్పందన రావడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహంతోనే మరో కొత్త పెయింటింగ్  శీర్షికతో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు మమత.

ఇక రెండు రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంలో సాహిత్య సన్నివేశం మారింది. సాహిత్య గతంలోకి, అంటే చరిత్రలోకి చూసే దృష్టి మారింది. ఈ పరిణామాన్ని వివరిస్తూ ఎన్. వేణుగోపాల్ “గతవర్తమానం” శీర్షిక సాంస్కృతిక చరిత్రని కొత్తగా తిరగ రాసుకోవాల్సిన అవసరాన్ని చెప్పింది. నిరంతర  పరిశోధకుడిగా, నిశిత విమర్శకుడిగా వేణు ఈ కాలమ్ లో మన చరిత్రలో మనకే తెలియకుండా ఉండిపోయిన అంశాలని వెలికితెస్తున్నారు.

వొకప్పుడు తెలుగులో బాల సాహిత్యం ఒక అద్భుతం. ఇప్పుడు అది అరుదైపోయింది. కనీసం అనువాదాల ద్వారా అయినా కొంత బాలసాహిత్య కృషి అవసరమే. అది ఏ ఒకరిద్దరు రచయితల వల్లనో అయ్యే పని కాదు. చిన్ని దీపమైనా వెలిగించే ప్రయత్నం మైథిలీ అబ్బరాజు గారి “గాజు కెరటాల వెన్నెల.”

drushya drushyam 28ఇటీవలి కాలంలో అటు ప్రయోగంగానూ, ఇటు ప్రయోజనంగానూ రెండు విధాలా ఎక్కువ మందిని ఆకట్టుకున్న ఇంకో శీర్షిక కందుకూరి రమేష్ బాబు “దృశ్యాదృశ్యం”. దృశ్యంలో కవిత్వాన్నీ, వాక్యంలో దృశ్యాన్నీ బంధించగల కెమెరా కన్ను రమేష్! ప్రతి రసాత్మక వాక్యం కవిత్వం కాకపోవచ్చు కానీ, ఈ శీర్షికలో రమేష్ ప్రతి రచనా దృశ్యకావ్యమే!

ఒక బుద్ధిజీవి ప్రయాణం ఎలా వుంటుంది? ఆలోచనకీ అనుభూతికీ వంతెన కట్టే సాంస్కృతిక రూపాల సహవాసంలో ల.లి.త. “చిత్రయాత్ర” మన మేధో ప్రయాణపు డాక్యుమెంటరీ. చదివిన/చూసిన/ కలిసిన కళల సాన్నిహిత్యాన్ని మరచిపోలేని విధంగా అక్షరబద్ధం చేసే శీర్షిక.

ఇక సారంగలో మొదటి నించీ వున్న శీర్షికలలో పాఠక లోకంలో ఒక వినూత్న ఉత్సాహాన్నీ, చరిత్ర, పురాగాథల పట్ల సమకాలీన కోణాన్నీ ఇస్తూ, ఎంతో మంది పాఠకుల్ని సమకూర్చుకున్న శీర్షిక కల్లూరి భాస్కరం గారి “పురాగమనం”. పూర్వచరిత్రని ఎలా చూడాలన్న దృక్కోణాన్ని కలిగించడంలో కూడా ఈ శీర్షిక సఫలమైంది.

ముఖ్యంగా, సారంగలోని వివిధ శీర్షికలకు అడిగిన వెంటనే బొమ్మ సాయం చేస్తున్న మహీ, కార్టూనిస్ట్ రాజు, వర్చస్వి, రాజశేఖర్, అన్వర్ లకు కృతజ్ఞతలు చాలా పొడి మాట.

 

ఇంకా ఎన్నో శీర్షికలతో ప్రతి గురువారం మీ ముందుకు వచ్చి, మీ వారాంతాన్ని ఒక అందమైన/ఆలోచనాత్మకమైన అనుభవంగా మలచడంలో సారంగ పాత్ర కొంతైనా వుందని మా నమ్మకం. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా మీ సహకారాన్ని కోరుకుంటోంది సారంగ!

ఈ వారం నుంచి సారంగ ముఖపత్రంలో మార్పులు కూడా మీరు గమనించండి. వివిధ శీర్షికల కింద గతంలో అచ్చయిన కొన్నిపాత రచనలు కొత్త పాఠకులకు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో అవి ముఖపత్రంపై అడుగు భాగంలో కనిపించేట్టు మార్చాం. ఈ వారం శీర్షిక కింద కనిపించేవి మాత్రమే ఈ వారం తాజా రచనలు!

 లోగో: మహీ

ARTIO, Hyderabad 

 

 

 

మీ మాటలు

  1. నిజంగానే సారంగ ద్వారా సారంగమై తేలి వచ్చి, మా మనసుల తీరాన్ని తాకిన ప్రయోగాత్మక శీర్షికలన్నీ సాహిత్య సృజనకు సరి కొత్త ఆరంభాలు . ముఖ్యంగా కాంతి చిత్రాల్ని అక్షరాల్లో బంధించడం , వర్ణ చిత్రాల్ని కవిత్వంగా మెరిపించడం చాలా గొప్ప ఆలోచనలు . విలువైన వ్యాసాలూ , వైరుధ్యమైన రచనలూ అందరికీ అందుబాటులోకి తెచ్చిన సారంగ , మా వంటి విద్యార్థుల కోసమే స్థాపించబడిన ఓ అత్యున్నత పాఠశాల.

  2. DrPBDVPrasad says:

    తెలుగు సాహిత్యాంభోధిని చుట్టేస్తూ
    సరంగులై ఈ నావని మీరు చేరుస్తున్న తీరాలు
    గమిస్తున్న తీర్థాలు
    ఉత్సవ విశేషాన్ని సంతరించుకుంటున్నాయి
    సాహిత్య యాత్రార్థికి నిస్సందేహంగా e–పత్రికే ఉత్తమోత్తమ సాధనం
    నా మట్టుకి నాకు వారాంతంలో కళ్ళు అలసటకి లోనైనా ఒళ్ళు పులకాంకితమవుతుంది
    -డా।పిబిడివిప్రసాద్

  3. Mangu Siva Ram Prasad says:

    సారంగ అంతర్జాల వార పత్రిక కోసం ప్రతి బృహస్పతి వారం ఎదురు చూడడంలో ఎంతో ఆనందం ఉంది. రచయితలకు పాఠకులకు మధ్య ఒక వెలుగు వారథిగా సారంగ ఎప్పటికప్పుడు వినూత్న కాంతులు మనోజ్ఞంగా వెదజల్లుతూంది. సాహిత్యం అనే పదానికి భోజనం అని కూడా ఒక అర్థం ఉంది. వారం వారం ఒక అద్భుతమైన విందు భోజనాన్ని సారంగ సౌజన్యంతో ఆస్వాదిస్తూ రాసనందాన్ని పొందుతున్నాం అనడంలో అతిశయోక్తి లేదు.

  4. నిశీధి says:

    అరచెతుల్లో విశ్వం అంటూ ఇంటర్నెట్ వాడకం మొదలు పెట్టాక ఫస్ట్ మిస్ అయింది ఎమిటీ అంటే తెలుగు సాహిత్యం . అక్కడొకటి ఇక్కడొకటి బ్లాగులు అని అవని చదువుతూ ఉన్నా ఒక మూస ధొరణిలో సాగే వ్యక్తిగత రచనలు అదే పనిగా చదవటం కష్టంగానే ఉండింది . నిజానికి వైవిధ్యం అన్న పదాన్ని ఎమో మిస్ అయింది . నా మట్టుకు నాకు సారంగా ఆ కొరత తీర్చిందనే చెప్పాలి . కంగ్రాట్స్ . అలాగే రాజకీయంగా మతపరంగా రోజు రోజుకి వ్యక్తులు అతి చిన్న సమూహాలు గా కుంచించుకు పోతున్న పరిస్తితుల్లో సమూహాల కంటే మనిష్యులకి మానవ్త్వనికి ఎక్కువ విలువ ఇవ్వవలసిన అవసరం దానికి కావలసిన సబ్జెక్ట్ అవేర్నెస్ పెంచగలగడము సాహిత్య పత్రికల మొదటి పనిగా ఉండాలి . అది సారంగా సాధిస్తుంది అన్న నమ్మకంతో .

  5. m.viswanadhareddy says:

    అడుగు దాటి అడుగు … మూడో అడుగు ముచ్చటగా … శ్రమదమాదులకు ఓర్చి .. అలా నిరంతర ప్రయాణం … అభినందనలు .. కవితలు వ్యాసాలూ .. కథలు పంపగల విధానం .. తెలియచేయగలరు ..

Leave a Reply to bhavani Cancel reply

*