మన్యం వోరి మేడ

రాత్రి యానాం చరిత్ర పేజీలు తిరగేస్తున్నప్పుడు నన్ను కొంత శూన్యం ఆవహించింది. కలత నిద్రలో ఎవరూ చెప్పని కథలు వెంటాడాయి. అవి నిజమో అబద్ధమో…ఇంకా ఊహల్లోకి పోతేనే గానీ తెలీదు. ఇక ఉండలేకపోయాను. కూలిపోయి నేలమట్టం కాబోతున్న ఆ మన్యం వోరి మేడను ఒకసారి చూడాలి. ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాను. ఎదురుగా నిలబడి చూస్తున్నాను.

శిధిల భవనం. కథలు కథలుగా చెప్పుకునే ఒకనాటి కాంతిమయ ప్రదేశం. సరిగ్గా నూట ఇరవైఅయిదేళ్ల క్రితం నాటి కట్టడం. కూలుతున్న గుర్తుల్లోంచి ఆ నాటి వెలుగులు ఊహించడం కష్టం కాకపోవచ్చేమో. బయట ఇరు పక్కల చిట్లిన ఫిరంగి గొట్టాలు…కూలిన ప్రహారీ గోడ లోంచి గుట్టలుగా పోగుపడిన ఇటుకలు…నాచుకట్టిన ఇటుకల మధ్య నుంచి పొడుచుకొచ్చిన పిచ్చిమొక్కలు.                              గేటు తీసాను. గరుకు రాతి మీద కత్తులు సానబెట్టే శబ్దం. తడబడే అడుగులతో లోపలికి ప్రవేశించాను. పట్టపగలు…చుట్టూ మెలకువ సందడి. అయినా ఎందుకో భయం.చీకటి తరుముతున్న భావన.

విశాలమైన హాలు. దాటగానే మండువా. నగిషీలు చెక్కిన స్తంభాలు. పైకి చూస్తే`నలుచదరంగా ఆకాశం కనిపిస్తున్నది.మొదటి అంతస్తులో నలువైపులా ఆడవారు నుంచుని క్రింద జరిగే కార్యక్రమాల్ని చూడటానికి వీలుగా మూడడుగుల ఎత్తులో స్తంభాలు నిలబెట్టి కట్టిన పిట్టగోడ. తల వంచుకుని చుట్టూ చూసుకుంటూ తిన్నగా వెళ్లాను.ఎడమ వైపు మెట్లు, పైకి వెళ్లడానికి. కొంచెం దూరంగా బహుశా సేవకులకు కట్టించిన గదులు కాబోలు ఉన్నాయి. మొత్తం మీద భూగర్భంలో కూరుకుపోయి వందల సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో బయలుపడ్డ పురాతన కట్టడంలా ఉంది.

ఇది ఉన్న చోటు యానాంలో మంచి కూడలి. ఏళ్ల తరబడి ఉన్నదున్నట్లుగా ఉంచేసారు.ఏ వాణిజ్య సముదాయంగానో మారిస్తే బోలెడంత ఆదాయం వచ్చేది. అయినా వారసులు ఒక స్మృతి చిహ్నంగా అట్టి పెట్టడం విశేషం.

ఉన్నట్టుండి  తల దిమ్ముగా ఉండి చెమటలు పట్టి కళ్లు తిరుగుతున్నట్లనిపించింది. నిలబడటానికి ఆసరా కోసం చేయి చాపాను. దొరక లేదు.దబ్బున నేల మీద పడ్డాను. అంతే తెలుసు.

కల లాంటి భ్రాంతి. ఏవో దృశ్యాలు…కళ్ల ముందు. చెవి దగ్గర గుస గుసలుగా మాటలు వినబడుతున్నాయి.మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. వాళ్లు ధరించిన దుస్తులు, భాష తేడాగా ఉన్నాయి. తెలుగే. ఉచ్ఛారణ వింతగా ఉంది. పాత ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నాను. కాసేపటికి వాతావరణానికి అలవాటు పడ్డాను. కాలం గుర్తులు ఆధారంగా గమనించిందేమిటంటే ఇది నేనెరిగిన లోకమే.కాకపోతే కొంచెం పురా వాసన. ఇంతోటి యానాం గడ్డ ఎన్నో అనుభవాల్ని గుదిగుచ్చుకుంది.ఉద్వేగాల నడుమ ఫ్రెంచి పరిపాలనా కాలం లోకి వెళ్లడం గమ్మత్తుగా ఉంది. సంగతేమిటో తెలుసుకోవాలని ఆతురతగా ఉంది.చిన్నప్పుడు మా ముత్తాత యానాం విశేషాలు సమయం వచ్చినప్పుడల్లా చెబుతుండేవాడు. నేనెంతో ఇష్టంగా వినేవాడిని.ఆయన ఎక్కువగా దిగజారుతున్న విలువలు గురించి చెప్పేవాడు.Kadha-Saranga-2-300x268

గతానికి వర్తమానానికి మధ్య కాలంలో వచ్చిన మార్పుల ప్రస్తావనే  ఉండేది.అందులో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విలువల పతనమే ఎక్కువగా ఉండేది. కథ చెప్పే తీరు  ప్రత్యక్షంగా వెండి తెర మీద చూస్తున్నట్లు అనుభూతి కలిగించేది.ఇంకా చెప్పాలంటే ముత్తాత తన సహజ శైలిలో వర్ణించి చెబుతుంటే మనం చదువుకుంటున్నట్లుండేది…సంఘటన జరిగే సమయంలో నేను అక్కడే ఉంటున్నట్లుండేది.ఇప్పుడూ నాకు అట్లాంటి

అనుభవమే కలుగుతూంది. ఆ అనుభవాన్ని మీకూ పంచడానికే  ఈ కథ.



 

మహలక్ష్మమ్మ గొప్ప పరోపకారి. మానవత్వం గుబాళించే మంచి మనిషి. ఆవిడకు సాధారణంగా కోపం రాదు.ఎవరైనా ఆపదల్లో ఉంటే ఆదుకోవడం ఆమె నైజం.అసత్యం ఒప్పుకోదు. ముసుగులో గుద్దులాట కుదరదు.నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. అందరూ అలాగే ఉండాలనుకుంటుంది. నమ్మించి మోసం చేస్తే మటుక్కి భరించలేదు. యానాం పెద్దొర సి.రెనండి కు ఆమె అంటే ఎంతో అభిమానం.అన్‌హోమ్‌కీసే టుజువో బ్యో పార్లే (కలకాలం చెప్పుకోదగ్గ మనిషి) అని పొగుడుతాడు కూడ. ఆవేళ మహలక్ష్మమ్మకు విపరీతమైన కోపం వచ్చింది.

అందరి మీద విరుచుకుపడిపోయింది. చెడామడా తిట్టి పోసింది. ఒక దశలో సంయమనం కోల్పోయి ఎప్పుడూ లేనిది దివాను సుబ్రహ్మణ్య శాస్త్రులును  సైతం ఏకవచనంలో సంబోధించింది. శాస్త్రులు మాట్లాడే సాహసం చేయలేదు.మౌనంగా ఉండిపోయాడు.

మహలక్ష్మమ్మకు నలభై నాలుగేళ్లు. పెళ్ళైన తొమ్మిదేళ్లకే భర్త కనకయ్య పోవడంతో ఆస్తుపాస్తుల మీద పెత్తనం ఆమె మీద పడిరది.వందలాది ఎకరాల పంట ఆదాయం, శిస్తు వసూళ్లు చూసుకోవడం తలకు మించిన పనే. పైగా ధర్మవడ్డీకి అప్పులివ్వడం ఆ కుటుంబానికి ముందు నుంచీ ఉన్న అలవాటు. పరిపాలకులైన ఫ్రెంచి వారికి కూడ అవసర సమయంలో అప్పు ఇచ్చేవారు. పాండిచేరీ నుండి సొమ్ము రావడం ఆలస్యమైతే మన్యం కుటుంబం వారి దగ్గర్నుంచే ఫ్రెంచి వారు తీసుకునేవారు. ఇంతకీ ఆరోజు మహలక్ష్మమ్మ అంత తీవ్రంగా స్పందించడానికి కారణాలేమిటి?

సుబ్రహ్మణ్య శాస్త్రులు ఒక మనిషిని అంచనా వేయడంలో పొరబాటు పడ్డాడు. దాని ఫలితమే ఇది.సత్యలింగం అనే వాడిని మహలక్ష్మమ్మకు పరిచయం చేసాడు. సత్యలింగం కల్లబొల్లి కబుర్లు ఏన్నో చేప్పాడు. ఏడ్చాడు.అవసరం చెప్పుకుని ప్రాధేయపడ్డాడు. ఊరికి కొత్తయినా నమ్మకానికి మొదటివాడినన్నాడు.

‘‘ అయ్యగారూ…మీరే కాపాడాలి. చిన్న వ్యాపారం.దెబ్బతిన్నాను. పారేసిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు.మీరు దయ తలిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతాను. యానాం వచ్చి ఆరు మాసాలైంది. అధిక సంతానం. నా ప్రారబ్దం కొలదీ ఇంకా ఇతర సమస్యలు చుట్టుముట్టాయి. మీరు కనికరించకపోతే ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు’’ అంటూ కాళ్ళ మీద పడ్డాడు సత్యలింగం.

‘‘ మీ కులం వాడిని. మీరు గాక నాకెవరు సాయపడతారు?’’ అని కూడ అన్నాడు. సుబ్రహ్మణ్య శాస్త్రులు  వత్తాసు పలికాడు. ఇంకేముంది? మహలక్ష్మమ్మ కరిగిపోయింది. ఎట్లాంటి హామీ లేకుండా వెయ్యి రూపాయిలు ఇచ్చేసింది.  వందేళ్ల క్రితం అదిపెద్ద మొత్తమే. వడ్డీ నామమాత్రం.వ్యాపారం సవ్యంగా చేసుకుని అన్నమాట ప్రకారం సొమ్ము తిరిగి చెల్లించమని చెప్పింది. మహదానందంగా చేతులు జోడిరచి నమస్కారాలు చేస్తూ వెళ్లిపోయాడు సత్యలింగం.

గడువు దాటింది. సత్యలింగం పత్తా లేడు. ఎన్ని కబుర్లు పంపినా మనిషి ఆచూకీ దొరకలేదు. కుటుంబం యానాం లోనే ఉంది. సత్యలింగం నెల రోజులుగా కనిపించడం లేదు.

ఆరా తీస్తే చాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోదావరి అవతల అమలాపురానికి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న తాటిపాక అతని ఊరు.అక్కడ దొరికిన చోటల్లా datlaఅప్పులు చేసేసి రుణదాతలకు ముఖం చూపించలేక యానాం  వచ్చేసాడు. ఫ్రెంచి వారి ఇలాకా కావడం చేత దివాళా ఎత్తినవాడికి యానాం ఒక రక్షణ వలయంగా పనికొచ్చేది.బ్రిటిష్‌రక్షకభటులు ఇక్కడకు వచ్చి విచారించరు. ఇరవయ్యో శతాబ్దం తొలిరోజుల్లో ఇలా చాలమంది వచ్చి తల దాచుకునేవారు. నైతికమో అనైతికమో ఉన్న కొద్దిపాటి చేను అమ్ముకోకుండా నిలుపుకునే ప్రయత్నంలో పలాయనం చిత్తగించడం ఒక మార్గంగా తలచేవారు. అప్పులు తీర్చే పని కాలానికి వదిలి యానాం చేరుకునేవారు.యానాం ప్రజలు తెలివైన వారు. అలా  వచ్చిన వ్యక్తుల పేర్లకు ముందు దివాళా అనే పదం చేర్చేసేవారు. దాంతో అతని గురించి మిగిలినవారు తెలుసుకుని జాగ్రత్తపడి ఆర్థిక వ్యవహారాల్లో దూరంగా ఉండేవారు. దివాళాగా పిలుస్తుంటే సిగ్గుపడి తలెత్తుకు తిరగడానికి జంకేవారు. అంచేత సిగ్గు అనేది రుణం ఎగబెట్టనివ్వని గుణంగా జమకట్టుకోవచ్చు. కొన్ని రోజులు గడిచాక ` వచ్చిందే దక్కుడు అనే పరిస్థితికి రుణదాత వచ్చేయడం జరిగేది. ఆ సమయం కనిపెట్టి కాళ్ళు, కడుపు పట్టుకుని తృణమో దుగ్గాణో ఇచ్చి బాకీ లేదనిపించుకునేవారు.

సత్యలింగం తెలివైనవాడు. తన గతం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.బంధువుల ఇంటికి చుట్టంచూపుగా వచ్చినట్లుగా యానాం చేరిపోయాడు.బతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చినవాడి గానే చెలామణీ అయిపోయాడు. అతని పేరు ముందు దివాళా చేరలేదు. అతని దురదృష్టం కొలదీ యానాంలో చేస్తున్న వ్వాపారం కూడ బెడిసికొట్టింది. అత్యాశాపరుడుగా అతను తీసుకున్న నిర్ణయాలే వ్యాపారం దెబ్బతినడానికి కారణం.ఆ సమయంలో కొంత సొమ్ము అవసరమై  మహలక్ష్మమ్మని ఆశ్రయించాడు. ఆవిడ దయతో ఇవ్వడం జరిగింది.

మహలక్ష్మమ్మ సుబ్రహ్మణ్య శాస్త్రులుకు వారం రోజులు గడువిచ్చింది సత్యలింగాన్ని వెతికి తీసుకురావడానికి.

ఆయన ఊరూ వాడా గాలించాడు.ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించింది. యానాంకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న పక్క గ్రామం నీలపల్లిలో ఉన్నట్లు సమాచారం అందింది.మహలక్ష్మమ్మ ఎదుట హాజరుపరచి ఊపిరి పీల్చుకున్నాడు శాస్త్రులు. సత్యలింగం గెడ్డం పెరిగి ఉంది.బుగ్గలు లోతుకు పోయాయి. ముందరి పన్నులు ఊడిపోయాయి. కళ్లల్లో

జీవం లేదు. సర్వం కోల్పోయినవాడిలా ఉన్నాడు. భయపడుతూ చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు.

మహలక్ష్మమ్మ రాజసంగా వాలుకుర్చీలో కూర్చుంది. పరిచారిక విసనకర్ర విసురుతూంది. పక్కన చేతికందేంత

దూరంలో స్టూలు మీద యాపిల్‌ముక్కలతో వెండిపళ్లెం ఉంది. మూతబెట్టిన వెండి గ్లాసులో మంచినీళ్లున్నాయి.సత్యలింగం ముఖకవళికల్ని గమనించింది.

‘‘ మీరు సత్యలింగమేనా? మీ రూపురేఖలు చిత్రంగా మారిపోయాయి. ఆనవాలు పట్టలేకపోతున్నాను. ఇంతలోనే అంత మార్పా? మీరు మీరేనా?’’ మహలక్ష్మమ్మ ఒకింత ఆశ్చర్యంతో అడిగారు.

‘‘మనోవ్యథ తల్లీ….అంతకుమించిన రోగమేముంది? చేసిన పని ఏదీ కలిసి రావడం లేదు. మా తాటిపాక లోని భూమిని అయినకాడికి అమ్ముకుందామన్నా కొనేవాడు లేడు. శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. నా బాధ అన్యులకు తెలీదు. మా ఊరికి ముఖం చూపించలేకపోతున్నాను. దయాగుణం అపారంగా ఉన్న లక్ష్మీ స్వరూపులు…మిమ్మల్ని దర్శించుకోలేకపోతున్నాను. కాస్త గడువు ఇస్తే తమరి బాకీ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. పిల్లలు గలవాడ్ని…మన్నించండి’’సత్యలింగం దీనంగా అన్నాడు.

afsar mannem vori

వినమ్రంగా తగ్గు స్వరంతో సత్యలింగం మాట్లాడిన తీరు ఎవరినైనా జాలిగొలిపేలా చేస్తుంది. మహలక్ష్మమ్మ ఎంత? ఆవిడ తొందరపడి ఔదార్యం కురిపిస్తుందేమోనని సుబ్రహ్మణ్య శాస్త్రులుకు అనుమానం కలిగింది.

‘‘ అతని మాటలు నమ్మకండి. అతని చరిత్ర మొత్తం కూఫీ లాగాను. ఇతను నమ్మదగ్గ వ్యక్తి కాడు.ఎప్పటికి ఏది మాట్లాడి తప్పించుకోవచ్చో బాగా తెలుసున్నవాడు. సత్యలింగం ఊరి వాళ్లే అతని అసలు రంగు విప్పారు. ఊళ్ళోని కొండ్ర అమ్ముకుని అప్పు తీర్చే ఉద్ధేశ్యం అతనికి ఎంతమాత్రం లేదు. చాలా అప్పులున్నాయి. బాకీలు ఎగ్గొట్టి యానాం వచ్చి పడిపోతే అవన్నీ పోతాయనుకుంటున్నాడు. ముఖ్యంగా అప్పు తీర్చే గుణం అతనికి లేదు. అతని స్వభావం విశ్వసించదగింది కాదు. దయ చేసి జాలి చూపించకండి’’ అంటూ సత్యలింగం గురించి తన బాధ్యతగా పూర్తి సమాచారం అందించాడు సుబ్రహ్మణ్య శాస్త్రులు.

సత్యలింగం వణుకుతున్నాడు. బెదురు చూపులతో బేలగా నిలబడ్డాడు.నిస్సత్తువగా కింద పడిపోతాడనిపించింది. అతని స్థితిని  మహలక్ష్మమ్మ గమనించింది. సత్యలింగాన్ని బల్ల మీద కూర్చోమంది. కూర్చున్నాడు. మంచినీళ్ళిమ్మని పురమాయించింది. తాగాడు. అతని కేసి  సుబ్రహ్మణ్య శాస్త్రులు గుర్రుగా చూసాడు.

‘‘ స్థిమితంగా ఉన్నారా? నా మాటలు వినగలుగుతున్నారా? మా పూర్వీకులు చెప్పిన ఒక విషయం మీకు చెప్పాలని ఉంది. వినే ఓపిక ఉందా? అని ప్రశ్నించింది మహలక్ష్మమ్మ వాలు కుర్చీలో వెనక్కి జారగిలపడి పైకి చూస్తూ. అక్కడున్న వారందరకూ ఇదంతా కొత్తగా ఉంది. ఆవిడ ఎప్పుడూ ఇంత సావకాశంగా సమయాన్ని వెచ్చించదు.

‘‘ ఎంత మాట? తప్పకుండా…చిత్తం చిత్తం…’’ అంటూ గొణుగుతున్నట్టుగా అన్నాడు సత్యలింగం.

మహలక్ష్మమ్మ తమ విలువైన కాలాన్ని సత్యలింగం లాంటి వాడికి నీతులు చెప్పడానికి ఉపయోగించడం ఎవరికీ ఇష్టం లేదు.  సుబ్రహ్మణ్య శాస్త్రులు అయితే మరీ ఎక్కువ అసహనంగా ఉన్నాడు. అవతల తోలుబొమ్మలాటల వాళ్ళు వచ్చి ఉన్నారు, తమ కొత్త కథ ఆడటానికి. తొలి కథ మహలక్ష్మమ్మ ముందు ప్రదర్శించి కానుకలు పొందడం వారికి అలవాటు. గ్రామీణ కళాకారులను ఆదరించడంలో మహలక్ష్మమ్మ తర్వాతే ఎవరైనా.

మహలక్ష్మమ్మ గోడ మీది తైలవర్ణ చిత్రం కేసి ఒకసారి చూసింది. అందమైన తలపాగాతో జమీందారీ దుస్తులతో హుందాగా ఉందది. నుదుటబొట్టు…మీసాలు…పులిగోరు పతకం…కోటు…బంగారు బొత్తాలు…సంపద ఉట్టిపడుతున్నది.

‘‘ ఇట్లాంటి సందర్బంలో పెద్దలు ద్వారా విన్న సంగతులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికి ఎనిమిది వందల ఏళ్ళ క్రితం అంటే పదమూడవ శతాబ్దంలో ఆనాటి సమాజంలో ఉన్న ఒక పద్ధతి గురించి చెబుతాను. యాదృచ్ఛికంగా నా బుర్రలోకి వచ్చింది. కాలానుగుణంగా విలువల్లో మార్పులు రావడం సహజం. మనం ఎరుగని కాలంలో మనుష్యుల ప్రవర్తన నియబద్ధంగా నిజాయితీగా ఉండేదని చెబుతుంటారు. సంఘం కట్టుబాట్లు అందుకు దోహదపడేది.ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్నాడనుకుందాం. అప్పు అంటే రూకలే కానక్కర్లేదు.వస్తురూపం కూడా కావచ్చు. తీసుకున్న వ్యక్తి ఎన్నాళ్ళకూ సరిపెట్టడం లేదనుకుందాం. రుణదాత ఓపికతో ఎదురుచూసినంత కాలం ఎదురుచూసేవాడంట. ఎన్నాళ్ళని భరిస్తాడు? మంచి ముహూర్తం చూసుకునేవాడు. అందరూ కిక్కిరిసి మసిలే సరైన కూడలిలో ఉండగా అప్పు తీసుకున్నవాడిని దొరకపుచ్చుకుని కంది కర్రతో అతని చుట్టూ గిరి గీసి చేతులు జోడించి  నమస్కారం చేస్తూ బాకీ చెల్లించి గానీ కదలడానికి వీల్లేదని కోరేవాడట. రుణగ్రహీత అదేదో కంచె కట్టినట్లుగా  నిట్రాడలా చలనం లేకుండా నిలబడిపోయేవాడట. కాళ్ళు కట్టేసినట్లు విలవిలలాడేవాడట. ఫలానా రోజుకల్లా మొత్తం బాకీ సీదా చేస్తానని ఒట్టు పెట్టి బతిమాలుకునేవాడట. అతని మాటల మీద నమ్మకం కలిగి తనకు ఆమోదయోగ్యం అనిపించి సమ్మతిస్తే  బరి నుంచి విడుదల చేసేవాడట రుణదాత.ఒకవేళ రుణం తీసుకున్నవాడు తెగించి గీత దాటితే సంఘంలో నీతిబాహ్యుడుగా ముద్రపడి అప్రదిష్ట  పాలయ్యేవాడట. గత కాలపు ఈ కట్టుబాటు ఎలా ఉంది, సత్యలింగం గారూ…మరి మీరేమో అప్పులు ఎగ్గొట్టడానికి ఊళ్ళు దాటి వచ్చినవారు. ఎక్కడున్నా అప్పు వదులుతుందా? ఆ సొమ్మును సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు మరింత సంపాదించుకుంటారు కదా. పాడు బుద్ధి పుట్టి  తప్పుడు ఆలోచనలు చేస్తే జీవితంలో  ముందుకెళ్లలేం. అది గ్రహించండి’’ అని చెప్పి వెండిగ్లాసు అందుకుని మంచినీళ్లు తాగింది మహలక్ష్మమ్మ.

అందర్నీ ఒకసారి తేరిపారి చూసింది.మురుగేశన్‌ఏదో చెప్పబోతున్నవాడిలా లేచాడు.అతను కూడ ఆవిడ దగ్గర పనిచేసే ఉద్యోగే. పాండిచేరీ నుంచి వచ్చాడు.అయిదేళ్ళుగా యానాంలో ఉంటున్నాడు.తెలుగు చక్కగా మాట్లాడతాడు. తమిళ యాస కనిపించదు.మురుగేశన్‌అంటే మహలక్ష్మమ్మకు ప్రత్యేక అభిమానం. ఆవిడకు తమిళం నేర్పుతున్నాడు.చాల నమ్మకమైనవాడు. అతని నిజాయితీ అనేకసార్లు రుజువైంది.తనది కాని దాన్ని చిల్లుగవ్వ కూడ ముట్టడు.

‘‘ ఏదో చెప్పాలనుకుంటున్నావు,మురుగేశన్‌…చెప్పు’’ అని అతని కేసి తిరిగింది.

‘‘ నడువలో వందదికు మన్నిక్కణమ్‌(మధ్యలో కలుగజేసుకుంటున్నందుకు మన్నించండి.) నిజాయితీ…సంఘం కట్టుబాట్లు…వింటుంటే పురాతన తమిళ గ్రామాల ఆచారాలు గుర్తుకి వస్తున్నాయి,అమ్మా…ఏనాటి సంగతులో ఇవి. ఒక గ్రామంలో ఎవరైనా వ్యక్తి ఆర్థికంగా చితికిపోతే మొత్తం గ్రామమంతా చింతించేది. నివారణగా ఆ మనిషిని ఆదుకోడానికి చూసేది. ఎట్లా అంటే ఒకరోజు అతని ఇంటికి కూడకట్టుకుని భోజనానికి వెళ్ళేవారు. భోజనం చేసిన వారంతా తినేసిన విస్తరి కింద కొంత సొమ్ము ఉంచేవారు. ఆ సొమ్ము రుణవిముక్తుడయ్యేందుకు సరిపోయేది. అదీ ఆనాటి సమాజం గొప్పతనం. బాకీ చెల్లించే తలంపు ఉంటే కష్టమైనా దారి దొరక్కపోదు. ఏది ఏమైనా తీసుకున్న సొమ్ము తల తాకట్టు పెట్టైనా జమ చేయడం ధర్మం…’’ మురుగేశన్‌అన్నాడు సత్యలింగం కేసి చూస్తూ.

‘‘ ఏమంటారు, సత్యలింగం…వింటున్నారా? ఒకే మాట చెప్పండి. పదే పదే వాయిదాలు వద్దు. పోనీ డబ్బులు ఇవ్వలేనంటే…అదయినా చెప్పండి. పెట్టుబడి పెట్టడం…సాయంగా ఇవ్వడం…మా ఆదాయం పెంచుకోడానికి కాదు. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడటం మా వంశాచారం. అదే  తప్పయితే మా విధానం మార్చుకుంటాం…దాని వల్ల మీ లాంటి ఇతరులు నష్టపోతారంతే…’’ మహలక్ష్మమ్మ లేచి నిలబడిరది.

సత్యలింగం తల వంచుకున్నాడు. కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు. చేతులు జోడిరచాడు.

‘‘సరిగ్గా ఇదే రోజు శుక్రవారం మిమ్మల్ని కలుస్తాను.నా లాంటి వాళ్ళను మీరెప్పుడూ ఆదుకుంటూనే ఉండాలి. తోటి మనుష్యుల పట్ల మీ నమ్మకం సడలకుండా ఉండేలా నడుచుకుంటాను. సెలవు ఇప్పించండి’’ అన్నాడు సత్యలింగం.

*****

            పొరలు విడిపోయాయి. సన్నగా వెలుతురు. నూతి లోంచి వస్తున్నట్టు ‘దేవా’ అని పిలుపు. మెలకువ పిట్ట కన్ను తెరిచింది. వాస్తవం అనుభవం లోకి వచ్చింది. చుట్టూ చూసాను. ఎవరూ లేరు. ఇంత దాకా కళ్ళ ముందు దృశ్యమై కదలాడిన అద్భుతమైన పాత సినీమా లోని నలుపు తెలుపు సన్నివేశం ఏదీ? జమీందారీ జిలుగు సొగసులు ఎక్కడకు పోయాయి? ఇపుడు నేనెక్కడున్నాను? నాలోకి దూరి కథ చదివి పెట్టిందెవరు? చరిత్ర పుటల్ని విప్పిందెవరు? కాలం దారులంటా పయనింప చేసి విలువల ఊసుల్ని ఒలకబోసిందెవరు? అవే జాడలు…అవే నీడలు. కాకపోతే రంగు వెలిసిన శిథిలమైన ఆనవాళ్ళు. పెచ్చులూడిన పైకప్పు. మన్యం వోరి మేడ చుట్టూ అల్లుకున్న రహస్యోదంతాల కబుర్లు. చిక్కు వీడని ప్రశ్నల దొంతరలు.

వేద మంత్రాల ఘోషలతో దద్దరిల్లిన ప్రాంగణం….దాన ధర్మాల వితరణల గాథలు…పండిత పోషణల ఔదార్యం…సంస్కృతీ పరిరక్షణల గమనాలు.మరొక వైపు మేడ పెరటిలో జరిగిందనుకునే మానవ బలి ఉదంతమో ….తరతరాలు సంతాన లేమితో దత్తులే వారసులవుతున్న విచిత్ర వైనమో…ఊహల రెక్కలతో ఎంతైనా ఎగరగలం. పరిమితి లేదు. అంతు చిక్కని  గిరగిరా వలయాల్లా తిరుగుతున్న సందేహాలెన్నో….నమ్మేవెన్నో …నమ్మనివెన్నో.మన్యం వోరి మేడ ఎన్ని కథనాలైనా వినిపించగలదు…ఎన్ని సంఘటనలకైనా సాక్షిగా నిలబడగలదు.

భళ్లున శబ్దం. ఆలోచనలు తెగిపోయాయి.ఉలిక్కిపడ్డాను. గది గోడ పడిపోయింది. దుమ్ము రేగింది.శకలాలపై రెండు పిల్లులు…తీక్షణంగా చూస్తున్నాయి. గగుర్పాటు. భయం…వెన్ను లోంచి జలదరింపు…

నెమ్మదిగా లేచాను. గొంతు లోంచి పెడబొబ్బలు, అసంకల్పితంగా. క్షణంలో సగం వీధి గేటుకు చేరాను.

విష్ణాలయం వీధి తీర్థంలా సందడి సందడిగా ఉంది. ఉపద్రవమేదో సంభవించినట్టు గుండెలు బాదుకుంటూ పరుగులు పెడుతూ కొందరు…గుమిగూడి చర్చించుకుంటూ కొందరు…రహస్యంగా గుసగుసలు పోతూ కొందరు…ఏమైయిందేమయ్యింది? ఏయ్‌…బాబూ…ఏమిటి సంగతి? ఒగురుస్తూ ఒగురుస్తూ అసలు విషయం చెప్పాడు. గుండె గుభేలుమంది.మరో కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లే.యానాంలో దాని ప్రకంపనలు ఎట్లా ఉండబోతున్నాయో?

రెండువేల పదిహేనులో షరా మామూలే అయిన వ్యవహారం ఇది. పదే పదే మోసపోయే ధన క్రీడ. ఈజీ మనీ సంపాదనలో పాతదే మళ్ళీ మళ్ళీ కొత్తగా. ఊరంతా విస్తుపోయి ఇంటింటా మెరుపులా పాకిపోయిన వార్త. దిమ్మ తిరిగి మెదడు నరాలు కుచించుకుపోయిన వార్త. జనం సొమ్ముతో ఉడాయించిందట…గోపాల్‌నగర్‌చీటీల వెంకటలక్ష్మి. ఆమె ఒంటి మీది బంగారు జిలుగులు…వరసలు కలిపిన పలకరింపు లోని ఆత్మీయ జడులు…నెలనెలా తలుపుకొట్టి ఇచ్చిన నమ్మకాల వడ్డీ మొత్తాలు…చీటీలు పాడి కూడా ఆమె దగ్గరే మదుపు పెట్టిన భరోసాలు…ఏమయ్యాయి? అరచేతిలో కాసులు పోసి గుప్పెట మూసి తేలుకుట్టిన దొంగల్లా గమ్మునుండిపోయే అక్రమార్జనల సొమ్మైతే పర్వాలేదు.  పిల్ల పెళ్ళో పిల్లాడి చదువో…రూపాయిలు కూడబెట్టిన వారి వేదనలు…రెక్కలు ముక్కలు చేసుకుని చెమట ముంచిన రూపాయల వెతలు ఎవరికి చెప్పుకోవాలి?

అన్ని రోడ్లూ అన్ని నడకలూ గోపాల్‌నగర్‌వైపుకే. గగ్గోలుగా ఉంది. సిరికిం చెప్పడు అన్నట్టు…ఎలాగుంటే అలా…పరుగులు.ఒకరు మరొకరితో మాటలు లేవు. ఎవరి ఆదుర్దా వారిది.ఆలసించిన ఆశాభంగం…ఇపుడు కాకపోతే మరెప్పుడూ దక్కదు అన్నట్లు…రయ్య్‌మని వాహనాల  దూకుడు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లో దూరి బీరువాలు తెరచి ఎవరికి దొరికింది వాళ్ళు దోచేయడానికి…వీళ్ళ వెర్రి గానీ అన్నీ సర్దుకుని పకడ్బందీ ప్రణాళికతో ఎగిరిపోతే…ఇక మిగిలేదేమిటి?

నాకూ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. గుండె ఆగిపోబోయి నిదానించుకుంది. ఎందుకంటే…ఎందుకంటే…నేనూ అందులో ముక్కనే…నా బాధా ఎవరైనా పంచుకోవాల్సిందే…నేనూ ఆశోపహతుడ్నే. పెళ్ళాం పోరు పడలేక కొంత సొమ్ము నేనూ ఆ బూడిదలో పోశాను. అణుకువ…నెమ్మదితనం…కష్టసుఖాల్లో ఆదుకునే స్నేహశీలిలా వేషం వేసుకుని…ఎంత నమ్మకద్రోహం? యుగధర్మాన్ని కనిపెట్టలేకపోవడం…కాలం  చిందులు గమనించలేకపోవడం…ఇవ్వన్నీ ఎప్పటికీ నేర్వని పాఠాలు…ప్రలోభాల మాయలు… నిలువునా ముంచెత్తాయి.

ఆకాశం పిడుగులు పడుతున్న చప్పుడు.

వేయి టన్నుల ఇనుప గోళం గుద్దినట్లు…కట్టడం పెటీల్మని పేలి…గత కాలపు యశ: కలాపాలేవో పాతాళం లోకి జారినట్టు…పెద్ద శబ్దం.మన్యం వోరి మేడ నేలమట్టమయ్యింది. పాత కొత్త కాలాల వంతెన కూలిపోయింది.

నేనలాగే ఒక శూన్యాన్ని చూస్తున్నట్టు…

*

చిత్రం: వర్చస్వి 

 

 

మీ మాటలు

  1. Sivakumara Sarma says:

    ఈ వ్యాఖ్య కథకి కాదు గానీ ఇందులో వాడిన ఒక పదానికి సంబంధించినది. మీ వేరే కథలో కూడా ఇదే విధంగా వాడడాన్ని చూశాను గనుక అడుగుతున్నాను..”విష్ణాలయం” కి బదులుగా “విష్ణ్వాలయం” అని కదా ఉండాలి?

  2. నేను ఉద్యోగ రీత్యా1995 ప్రాతంలో రెండు సార్లు యానాం వెళ్ళాను.ఒకసారి అక్కడ నాతో వచ్చిన వ్యక్తి (పిఠాపురానికి చెందిన వాడు) యానాంలో ఒక కూడలి లో ఒక పురాతనమాన మేడ చూపించి అది మన్యం లేక మరిడీ మహాలక్ష్మి మేడ అని చెప్పాడు. మీరు కథలో చెప్పినది దాని గురించేనా.మహాలక్ష్మి చారిత్రిక వ్యక్తేనా? తెలుసుకోవాలని ఉంది.కథ బాగుంది.

  3. శ్రీమతి మన్యం మహలక్ష్మమ్మ గారు మా ఊరు ప.గో.జి లోని గూటాల గ్రామం జమిందారు శ్రీ మన్యం కనకయ్య గారి భార్య,శ్రీ కనకయ్య గారి మరణానంతరం యానాం చేరేరని మా పెద్దలు చెప్పేవారు. నేనెరిగుండగా మా ఊళ్ళో ఒక పెద్ద దివాణం ఉండేది, గోదావరి గట్టున, ఆమె వితరణ శీలి, ఇది కథ కాదు, నిజమని నా నమ్మిక..

మీ మాటలు

*