ఒక రచన… రెండు కవితలు..!

 

పుట్టుమచ్చలు సరే.
వాటిని ఎందుకు తీయాలో, ఎలా తీయాలో, తీస్తూ ఏం చెప్పగలుగుతామో అంతుపట్టనే లేదు.
ప్చ్. కానీ, పచ్చబొట్టు తీయడం మాత్రం ఒకటి మెలమెల్లగా ఆవరిస్తున్నది.

ఒక పదేళ్ల క్రితం.
‘సామాన్యుడి ఆటోగ్రాఫ్’ అన్న కార్యక్రమం ఒకటి ఒక టెలివిజన్ కోసం వారం వారం చేసేవాడిని.
ఆ పనిలో భాగంగా పోచంపల్లి వైపు వెళ్లి ఆ ఊరి నుంచి తిరిగి వస్తుంటే, జీపు కిటికీలోంచి బయటకు చూస్తే, ఆమె. ఒక మధ్య వయస్సు స్త్రీ.

ఏదో చేసంచి పట్టుకుని ఉండగా ఆ చేయి బలంగా కిందికి జార్చి ఉండగా ఒక చిత్కళ.
చేతిపై పచ్చబొట్టు.

చూస్తే అది వంకీలు వంకీలుగా రాసి ఉంది.
‘జానకి’ అని ఉంది.

బహుశా అది తన పేరే కాబోలని మాటలు కలపగా నోటికి కొంగు అడ్డుగా పెట్టుకుని నవ్విందామె.
అర్థం కాలేదంటే, ‘అది నా స్నేహితురాలు పేరు’ అని చెప్పింది. తన పేరు ‘మాలక్ష్’మి అట. ‘జానకి చేయిపై తన పేరుంటుందట! చెప్పి మళ్ల నవ్విందామె. సిగ్గుతో!

కాస్త గడిచాక ఇంకా చెప్పిందామె. ఒకానొక పున్నమి నాడు జరిగే జాతరలో ఇద్దరు స్నేహితులు ఒకరి పేరు ఒకరు పచ్చబొట్టుగా వేయించుకున్నారట! అది కూడా తమ పెళ్లి కాక ముందర నట!
నాటి విశేషాన్ని యాది చేసుకుంటూ నేనడిగిన వాటన్నిటికీ ఆమె సంబురంగా జవాబిస్తుంటే మా జీపులోంచి కెమెరా మెన్ అన్నాడు, ‘సామాన్యుడి ఆటోగ్రాఫ్’ అంటే ఇదే గదా అని!

ఆమె ‘ఆ సంగతేందోగానీ మేమైతే ఏడాదికొకసారి కలుస్తూనే ఉంటామయా’ అంది.
ఇద్దరికీ తర్వాత పెళ్లిళ్లయ్యాయట. వీళ్ల పిల్లలకూ పెళ్లిళ్లయినాయట. తమ దోస్తాన్ గురించి చాలా  చెప్పింది. విశేషం ఏమిటంటే, ఆ పచ్చబొట్టు గురించి ఆమె మాట్లాడుతుంటే మళ్లీ ఆమె యవ్వనవతి వలే సిగ్గిల్లి జవాబిస్తుంటే చూడాలి! ఎంత బాగా ఉన్నదో ఆమె!

బహుశా ఆమెకు నలభై ఏదేళ్లుంటాయి. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఆ ఫలానా గ్రామంలో జాతరకు తప్పక వెళుతారట. పున్నమి వెన్నెల్లో మనసు విప్పి మాట్లాడుకుంటారట. కష్టసుఖాలు చెప్పుకుని కంటతడి పెట్టుకుంటారట. పేర్లు, జిలేబీల పొట్లాలతో, పంచుకున్న తీయటి జ్ఞాపకాలతో, సేదతీరిన మనసుతో ఇంటికి తిరిగి వెళతారట. వెంట ఎవరు వచ్చినా, రాకపోయినా ఆ స్నేహితులిద్దరూ వెళ్లడం ఖాయం అట!

+++

అంతిమంగా పచ్చబొట్టు అన్నది చెదరని తమ స్నేహానికి తీపి గురుతుగా చెప్పిందామె. చెప్పి, వెళ్లిపోయిందామె.తర్వాత నా చేయి చూసుకున్నాను. బోడగా కనిపించింది. నాకంటూ ఎవరైనా అంత ప్రేమగల స్నేహితులున్నారా? అని క్షణం ఆలోచించి భంగపడ్డాను. నేనే కాదు, చాలామంది భంగపడతారేమో! అలా పచ్చబొట్టు వేయించుకుని జ్ఞాపకాల్లో పదిలంగా వుంచుకోలేనందుకు! రెక్కల్లో రెక్కయి తమ స్నేహం ఎగరడం అన్నది క్రమేపీ తరగిపోతున్న స్థితికి చేరువైతున్నందుకు!

అనిపించింది, అదంతా ‘జానపదం’ అనీ అనిపించింది.
ఆ పచ్చబొట్టు అచ్చమైన, ఆత్మగల్ల – నవనాగరికతా వ్యామోహాలు లేని –  తీరుబడితో కూడిన జీవితంలోని – ఒకానొక మేలు కవిత్వం- అనిపించింది. ఒక రాగం, మరొక శోకమూ అనిపించింది. ఒక రచన రెండు కవితలూ అనిపించింది, వాళ్లిద్దరిని అర్థం చేసుకుంటుంటూ!

+++

చకచకా పదేళ్లు.
గడిచాయా అంటే గడిచాయనే చెప్పాలి.
కానీ, నగరం నట్టనడుమ ఎన్నో చిత్రాలు చూశాను. ‘జానకి’ పచ్చబొట్టు చూసిన పిమ్మట ఇక అలాంటి ‘జానపదాలు’ చూడటం సాగుతూనే ఉన్నది. ఛాయాచిత్ర యాత్రణంలో ఇలాంటి అరుదైన సంతకాలెన్నో చూస్తూ ఉండటం అలవడింది.

కానీ, అందరిలాగే – ఆధునిక సాహిత్య పోకడ తెలిసి, కావ్యం ఏమిటో, నాటకం, నవల, కథ, కథానికా ఇంకా కవిత్వం ఏమిటో మెలమెల్లగా అభ్యాసం చేసుకుంటూ అక్షర ప్రపంచంలో కాటగలసి పోతూ ఉండగా, అనుభవాలు, అనుభూతులూ కేవలం తెరిచిన పుస్తకాల్లోంచే చూసి ఆనందిస్తూ ఉంటూ ఉండగా -హఠాత్తుగా దృశ్యాదృశ్య ప్రపంచం ఒకటి ఐదేళ్లుగా ఆవరించడం నా అదృష్టం. దాంతో మళ్లీ సజీవంగా మనుషులు, కథలు కథలుగా కనిపిస్తూ ఉన్నారు. అలా, కెమెరాతో తిరిగి మనిషిని చదవడం అభ్యాసం చేసుకుంటూ ఉండగా ‘జానపదం’ అన్నది ఒక కవితలా అరుదెంచిన అద్భుత ఛాయా చిత్రణ ఘడియలు ఇవి.


నిజానికి రెండు చిత్రాలూ చేశాను.  కాంపొజిషన్ పరంగా ఇవేమీ గొప్పవి కాకపోవచ్చు. కానీ క్షణం గడిస్తే అదృశ్యమయ్యే దృశ్య ప్రపంచంలో వాటిని ఒడిసి పట్టుకోవడం నా రచనా స్రవంతిలో మేలిమి వ్యక్తీకరణలే అని నా భావన. మరి ఎప్పుడంటారా? గత ఏడు, ఒకానొక సాయంత్రం తీశాను. వెలుతురు తగ్గుముఖం పడుతూ ఉండగా… అది హైదరాబాద్ లోని సెంట్రల్ చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ మధ్య… జనం బాగానే ఉండగా జరిగింది.

బండ్లు…యాక్సిలేటర్లు ‘ఝుమ్..ఝుమ్’ అంటూ మనసు ఒకదానిపై చూపు నిలిపేంత శాంతినీ ఇవ్వడంలేదు. కానీ, నా భుజానికి ఉన్న బ్యాగ్ లో కెమెరాకు ఎప్పుడూ కన్నంటుకోదు. అది మేలయింది! దాని కన్నుతెరిచే ఉంది.ఒకతను లూనామీద వెళుతూ ఆ జనసమ్మర్థంలో కొన్ని క్షణాలు ఆగి ఉండగా అతడి చాపిన చేయిని అలా చూసి చూడగానే….అతడి ‘ కవిత’ ను చూడగానే, ఆ పచ్చబొట్టు చప్పున ఆకర్శించి నా చేత కెమెరా ఒక చిత్రం తీయించింది. అది తొలి రచన.

+++

అతడెవరో తెలియదు.
ఆ ‘కవిత’ తన అర్థాంగో, ప్రియురాలో? ఏమో.
తల్లో, చెల్లెలో, స్నేహితురాలో, మరేమో!
కానీ, బాగ్యనగరంలో ఒక జానపద వైఖరి ఒకటి ఆధునిక కవిత్వంలా శోభించి నా గుండె పులకించింది.
అంతకన్నా ఎక్కవ అతడ్ని ‘కవి’ని చేసిన ఛాయాచిత్రం నేను చేసిన మలి రచన.
అవును. దాంతో నా మది ఆనంద తాండవమే చేసింది.

ఆ రెండో చిత్రం మరింత కవిత్వం.
అవును మరి. అతడి హ్యాండిల్ బార్ మీద పుష్పం ఒకటి మరి!
అది మల్లెపూవా?  కావచ్చు. కాకపోవచ్చు. కానీ పుష్ఫం!
కానీ, అది ఏకాంతంగా అతడి హృదయాన్ని అపూర్వంగా నగరం మీద ఒక ప్రేమగీతికలా ఊరేగిస్తూ ఉన్నది.
చేయిపై ఆ ‘కవిత’ తనతో ఊసులాడుతున్నట్టే ఉన్నది.

ఇక ఒక లోటు భర్తీ అయినట్టే అయింది.
నగరంలో జానపదం.

ఇప్పుడు నా చేయిపై స్నేహానికీ, ప్రేమకీ గురుతుగా ఒక పచ్చబొట్టు లేని భావనే లేనే లేదు.
పోయింది.
బహుశా- కెమెరా భుజానికి ఉన్న కారణంగానో ఏమో, ఒక ‘కవిత’ నాలో పలు రచనలు చేయిస్తూనే ఉంది.
దృశ్యాదృశ్యం అంటే ఇదేనేమో!

Kandukuri Ramesh

మీ మాటలు

  1. నిశీధి says:

    Beautiful narration

మీ మాటలు

*