“భూల్ గయే అనిల్ బుధ్ధూ”

 

నా “జీవిత కాలమ్” లో ఇప్పటి దాకా నా చిన్నప్పటి సంగతులే వ్రాసుకొస్తున్న నేను ఇప్పుడు యాభై ఏళ్ళు లాంగ్ జంప్ చేసి అతి మంచి జనమంచి అనిల్ కుమార్ తో గడిపిన అసంఖ్యాకమైన మధుర ఘడియలని స్మరించుకోకుండా ఉండలేక పోతున్నాను.

అది 1964 అనుకుంటాను. కాకినాడలో మా ఇంజనీరింగ్ కాలేజ్ “డే”…అంటే ఏడాది ఆఖరున విద్యార్ధులందరం చేసుకునే అల్లరి, చిల్లరి సాంస్కృతిక కార్యక్రమం. అందులో ఆ రోజు నాకు సీనియర్లు అయిన నీహార్ అనే కాశ్మీర్ కుర్రాడు ఎకార్డియన్ అనే వాయిద్యం మీద ఏదో హిందీ పాట వాయిస్తూ ఉంటే దానికి “బొంగో” అనే చిన్న డప్పులు అనిల్ కుమార్ అనే కుర్రాడు వాయించాడు. యథా ప్రకారం వాళ్ళు బాగానే వాయించినా మా “కర్తవ్యం” ప్రకారం కొందరు కోడి గుడ్లూ, టొమేటోలూ విసురూ ఉంటే నేను సరదాకి నా చెప్పులు తీసి విసిరేశాను. అవి చూసి “మీ నాన్న ఇంత కంటే మంచి చెప్పులు కొనలేడా? పూర్ ఫెలో” అన్నాడు అనిల్ కుమార్ తిరిగి అవి నా మీదకి విసిరేసి.  అదే అతనితో నా మొదటి పరిచయం. డిగ్రీ పూర్తి అయ్యాక అతను లండన్ వెళ్ళాడని తెలిసింది. అంతే!. పదేళ్ళ తరువాత నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టినప్పుడు నేను మొట్టమొదట చూసిన తెలుగు వ్యక్తి కూడా అనిల్ కుమారే.  ఆ రోజు నుంచీ మొన్న ఫిబ్రవరి 13, 2015 నాడు అతను స్వర్గానికి వెళ్ళిపోయే దాకా నాకు ఒక్క హ్యూస్టనే కాదు , మొత్తం అమెరికాలోనే అతను నాకు  అత్యంత దగ్గర స్నేహితుడు.

నేను 1975, మార్చ్ నెలలో అని గుర్తు…చికాగో నుంచి ముగ్గురు మిత్రులతో ఉద్యోగాల వేట కోసం హ్యూస్టన్ లో  అడుగుపెట్టినప్పుడు ఆ మహా నగరంలో ఒక్క మానవుడు కూడా నాకు తెలియదు. రెండు, మూడు రోజుల తరువాత రైస్ యూనివర్సిటీ లో ఒక ఇండియన్ విద్యార్ధి పరిచయం అయ్యాడు. అతను మాకు దూరపు బంధువే. మాటల సందర్బంలో “ఇక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. వెళ్లి కాఫీ తాగుదాం” అనగానే  ఎగిరిగెంతులేసుకుంటూ “మహారాజా” అనే ఆ రెస్టారెంట్ కి వెళ్లాం. లోపలకి అడుగుపెట్టగానే “వెల్ కమ్ టు మహారాజా” అంటూ అనిల్ కుమార్ నన్ను చూసి, నేను అతన్ని చూసి ఆశ్చర్య పోయి, కావిలించేసుకుని ఆనందపడిపోయాం. అప్పుడు తెలిసింది ఆ మహారాజా రెస్టారెంట్ అమెరికాలో యావత్ దక్షిణ రాష్ట్రాలలో కల్లా మొట్ట మొదటి ఇండియన్ రెస్టారెంట్ అని. ఐదు  నిముషాలలోనే నేను “గురూ, నాకు ఇక్కడ డిష్ వాషింగ్ ఉద్యోగం కావాలి అర్జంటుగా” అని అడిగాను. అనిల్ గుంభనగా “కుదరదు” అన్నాడు. “అదేమిటి గురూ..” అని నేను బతిమాలుతూ ఉంటే “అది నా ఉద్యోగం” అని రహస్యం బయట పెట్టాడు. అంటే ఆ రెస్టారెంట్ కి ప్రొప్రైటరూ, వంటవాడూ, సర్వరూ, క్లీనరూ అన్నీ అనిల్ కుమారే. ఆ రెస్టారెంట్ వంటకాలలో కూడా అతను తన సృజనాత్మకతని పోగొట్టుకో లేదు.  బీఫ్ దోశలు, చికెన్ పకోడీలు లాంటి ప్రయోగాలు చేసేవాడు. ఇక మిక్స్ డ్రింక్స్ మాట కొస్తే మామూలు స్కాచ్ విస్కీ, వోడ్కా లాంటి వాటికి కూడా “కోబ్రా కిస్”, “ఫ్రాగ్ బైట్”, “డెవిల్స్ నెక్టార్” లాంటి తమాషా పేర్లు పెట్టేవాడు. ఆ రెస్టారెంట్ కి దువ్వూరి సూరి, శేష్ బాలా పార్టనర్స్ అని తరువాత తెలిసింది.

ఆ నాటి నుంచీ ఎప్పుడో ఇండియాలో మొదలైన మా స్నేహం మళ్ళీ అమెరికాలో పుంజుకుంది. మరో రెండు, మూడు నెలలకి మే నెల, 1975 లో అనిల్ కి రత్న పాపతో మద్రాసు లో పెళ్లి అయింది. అప్పటికే రత్న పాప వెంపటి చిన సత్యం గారి అభిమాన నర్తకి గా అధ్బుతమైన కూచిపూడి నాట్య కళాకారిణిగా చాలా పేరు తెచ్చుకుంది. పైగా సుప్రసిద్ద జానపద గాయనీ మణులు సీత – అనసూయ లలో అక్క గారైన అనసూయ గారి పెద్ద కూతురు..అంటే పాప  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు.

Anil & Ratna in Samsaaram

అనిలూ, పాపా అతి చిన్న తనం నుంచీ స్నేహితులే. అనిల్ కి ఆరేళ్ళ వయసులో, 1950 లో మూడు భాషలలో తీసిన “సంసారం” సినిమాలో అతనూ, నాలుగేళ్ల రత్న పాపా కలిసి నటించారు. అందులో హిందీ వెర్షన్ లో పాప అనిల్ ని “భూల్ గయే బుధ్ధూ” అంటుంది. వాళ్ళ పెళ్ళయి ఎన్నేళ్ళయినా “ఇంకా అదే సీను గురూ, పాప ఆ డైలాగు వదిలి పెట్ట లేదు.” అనే వాడు ఎప్పుడూ అనిల్ సరదాగా. ఆ సినిమాలో వాళ్ళిద్దరూ “అమ్మా ఆకలీ, బాబూ ఆకలీ “ అని రోడ్లమ్మట అడుక్కుంటూ పాడిన పాట ఆ రోజుల్లో చాలా పాప్యులర్. అప్పుడు పాప అనిల్ కి “బువ్వ” పెడుతున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

పాప ఆగస్ట్ , 1975 లో హ్యూస్టన్ వచ్చినప్పుడు దువ్వూరి సూరి & హీరా వాళ్ళింట్లో రిసెప్షన్ పార్టీ ఇచ్చారు.  ఎడ్వోకేట్ జనరల్ నరస రాజు గారి అబ్బాయి సూరి గురించి ఇండియాలోనే నాకు తెలుసు కానీ అతన్నీ, చింతపల్లి అశోక్ కుమార్ నీ, వసంత & మల్లిక్ పుచ్చా, ఇతరులనీ హ్యూస్టన్ లో నాకు పరిచయం చేసింది అనిల్ కుమారే! ఆ తరువాత అందరం కలిసి 1976 లో తెలుగు సాంస్కృతిక సమితి మొదలుపెట్టడం చక చకా జరిగిపోయింది.  1975 లోనే రత్న పాప వచ్చిన అతి కొద్ది రోజులలోనే, అదే “మహారాజా” రెస్టారెంట్ లో “అంజలి సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్” మొదలు పెట్టి (పనేమీ చెయ్య లేదు కానీ  ఆ సంస్థకి నేను మొదటి డైరెక్టర్ ని) గత నలభై ఏళ్లగా పాప నాట్య కౌశలంతో వేలాది కూచిపూడి నర్తకీ నర్తకులను తయారు చెయ్యగా, ఆ సంస్థకీ, 1994 లో వారిద్దరూ నెలకొల్పిన లాభాపేక్ష లేని “సంస్కృతి” సంస్థ కీ అనిల్ కుమారే వెన్నెముక. తెర వెనుక కావలిసిన గుండు సూది నుంచి అద్భుతమైన ఆడియో, వీడియో, లైటింగ్, వేదిక అలంకరణలు అన్నీ అతనివే. అతని స్టేజ్ మేనేజ్ మెంట్ ప్రతిభని తానా, ఆటా లాంటి సంఘాలు చాలా సార్లే తమ జాతీయ స్థాయి మెగా కార్యక్రమాలకి అనేక నగరాలలో ఉపయోగించుకున్నాయి. మన సంప్రదాయానికి ఒక అద్దం పడుతూ, అటు అమెరికన్ ఆడియో & వీడియో కంపెనీల పని తీరుకు అనుసంధానం చేస్తూ అనిల్ చేసిన సహాయానికి ఆయా సంఘాలు ఎప్పుడూ తగిన విధంగా గుర్తించడం కానీ, గౌరవించడం కానీ చెయ్య లేదు. “పోనీలే గురూ, అంతా మన వాళ్ళేగా” అని సద్దుకుపోయే పెద్ద మనసు అనిల్ కుమార్ ది.

1977 మార్చ్ నెలలో మొట్టమొదటి ఉగాది కార్యక్రమానికి ఏదైనా నాటకం వేద్దాం అనుకున్నప్పుడు నేను బొంబాయి లో ఉండగా వ్రాసి ప్రదర్శించిన “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నాటకాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో నేను బామ్మ వేషం, అనిల్ కుమార్ & మోహన రావు  బ్రహ్మచారులు, డి. ఎ. ఎ. ఎస్. నారారాయణ రావు గారు తాతయ్య వేషం వేశాం. అనిల్ కుమార్ దానికి దర్శకుడు. నాకు తెలిసీ అమెరికాలో స్వంతంగా రాసుకుని ప్రదర్శించబడిన మొట్ట మొదటి తెలుగు నాటకం అదే. ఆ తరువాత అది అమెరికాలో సుమారు ముఫై నగరాలలో ప్రదర్శించారు. మేం ముగ్గురమూ ఉన్న ఆ నాటి ఆ నాటిక ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

బామ్మాయణం 1

బామ్మాయణం

ఇంచుమించు అదే రోజులలో గుత్తికొండ రవీంద్రనాథ్ గారు న్యూయార్క్ నుంచి పిలిచి 1977 మే నెలాఖరున ఆయనా, కాకర్ల సుబ్బారావు గారూ తలపెట్టిన తొలి అమెరికా తెలుగు సాంస్కృతిక సభల విషయం గురించి సంప్రదించారు. ఎగిరి గెంతులేసి హ్యూస్టన్ నుంచి నేనూ, అనిల్, పాప, సూరి, నారాయణ రావు గారు వెళ్ళడానికి తయారయిపోయాం. రత్న పాప ఎలాగా కూచిపూడి నాట్యం చేస్తుంది కాబట్టి మేము ఏదైనా బుర్ర కథ లాంటి స్పెషల్ అంశం చేస్తే బావుంటుంది కదా అనుకున్నాం. వెంటనే నేను వారం రోజులు కుస్తీ పడి “బెబ్బులి పాపారాయుడు” బుర్ర కథ రాశాను. అందులో సూరి ప్రధాన గాయకుడు, నేను హాస్య గాడిని , అనిల్ కుమార్ వంత పాటగాడు. ఆ బుర్ర కథ అద్భుతంగా వచ్చింది. ఉత్తర అమెరికాలో చెప్పబడిన మొట్టమొదటి బుర్ర కథ అదే!. దానికి దర్శకుడు అనిల్ కుమారే. అప్పటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. నూయార్క్ సభలకి ఇండియా నుంచి అనసూయ-సీత గారూ కూడా వచ్చి, వాళ్ళు పాడుతూ ఉండగా రత్న పాప “మొక్క జొన్న తోటలో” పాటకి నృత్యం చెయ్యడం నేను ఈ జన్మలో మర్చిపోలేని అనుభవం. ఆ తరువాత వాళ్ళిద్దరూ హ్యూస్టన్ వచ్చినప్పుడు నేనూ, అనిల్ కుమారూ ప్రొడ్యూసర్లు గా “మన పల్లె పదాలు” అని అనసూయ-సీత గార్ల చేత స్టుడియోలో పాడించి ఒక 78 RPM  గ్రామఫోన్ రికార్డు 1977 ఏడాది ఆఖరున అనుకుంటాను, విడుదల చేశాం. అమెరికాలో విడుదల అయిన తొలి తెలుగు గ్రామఫోన్ రికార్డు అదే! దానికి అనిల్ & డేవిడ్ కోర్న్టీ డప్పు వాయించగా, నాతో సహా మా స్థానిక గాయనీ గాయకులు వంత పాట పాడారు.

ఆ తరువాత సుమారు ముఫై ఏళ్ళు మేము అనేక మంది సహకారంతో హ్యూస్టన్ మహా నగరంలో చెలరేగిపోయాం అనే చెప్పుకోవాలి. తెలుగు, తమిళం, హిందీలలో ఒకటా, రెండా, కొన్ని వందల సాంస్కృతిక కార్యక్రమాలూ, నాటకాలూ, స్థానిక అమెరికన్లకి మన సంస్కృతిని తెలియజేసే అనేక ప్రదర్శనలూ, రేడియో ప్రోగ్రాములూ, టీవీ కార్యక్రమాలు చేశాం. అన్నింటికీ అనిల్ కుమారే వెన్నెముక. ఉదాహరణకి అమెరికా టీవీలో ఎంతో ప్రసిద్ది పొందిన “Saturday Night Live”  తరహాలో “పొటేటో చిప్స్ ఆర్ కాల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ హియర్” అనే వెరైటీ హాస్య కార్యక్రమం, మూడు సార్లు వేసిన “హీరాలాల్ కీ చాచీ” అనే  డ్రామా (అందులో నేను చాచీ..అంటే ఆడ వేషం పాత్ర వేశాను), లవర్స్ త్రూ ఏజెస్ అనే డాన్స్ డ్రామా, నేను వ్రాసిన యమ సభ,  ఆఠీన్ రాణి, మొదలైన డజను పైగా తెలుగు నాటకాలు వేశాం. అన్నింటికీ అనిల్ కుమారే దర్శకుడు.

అనిల్ కుమార్ గురించి మరొక ప్రత్యేక  విశేషం ఏమిటంటే అతని గొంతుకకి అధ్బుతమైన “deep & resonating tone”  ఉంది. రేడియోలోనూ, మైక్ లోనూ వింటే మైమరచిపోవలసినదే. అందుకే మేము ఏ కార్యక్రమం చేసినా..ఆఖరికి న్యూయార్క్ లో చెప్పిన బుర్ర కథలో కూడా అందులో “కమర్షియల్ బ్రేక్స్ “ అని పెట్టి హాస్యంగా అతని చేత వాణిజ్య ప్రకటనలు చేయించే వాళ్ళం. ఉదాహరణకి, అలనాటి రేడియో, సినిమా ప్రకటనల్ని అనుకరిస్తూ “అందాల నర్తకి రత్నపాపకి రొంపా…అయితే ఆ రొంప అనే జబ్బుకి బ్రహాండమైన దెబ్బ విక్స్ వేపొరబ్బ” అని అనిల్ చెప్తూ ఉంటే నేను దానికి జలుబుతో బాధపడుతున్న అమ్మాయిలా అభినయం చేసేవాడిని. ఇక నవ్వులే నవ్వులు.

బుర్ర కథ

బుర్ర కథ

అనిల్ కుమార్ కి ఉన్న హాస్య ప్రియత్వానికి హద్దులే లేవు.  గత అనేక సంవత్సరాలగా వారానికి పలు మార్లు ఈ-మెయిల్ లో ఏదో జోక్ పంపిస్తూనే ఉండేవాడు. అతని ఒరిజినల్ జోక్స్ చెప్పలేనన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఒక సారి నాకు ఏదో వీడియో కేమేరాలో సమస్య వస్తే అతని దగ్గరకి తీసుకెళ్ళాను. నా సమస్య వినగానే నా వీడియో సిస్టమ్ ని ఓ గంట సేపు పరీక్ష చేసి  “లాభం లేదు గురూ, ఎక్కడో ఫింకి పోయింది. రేపు చూద్దాం” అని మా ఇద్దరికీ ధర అందుబాటులో ఉండే “బక్ హార్న్” అనే బీరు అందుకున్నాడు.ఆ బీరు ఒక సిక్స్ పేక్ కి కేవలం 99 సెంట్లు. ఇద్దరం బీద వాళ్ళమే కాబట్టి దాంతో సరిపెట్టుకునే వాళ్ళం. ఆ తరువాత ఈ వీడియో సిస్టమ్ లో అసలు ఈ “ఫింక్” అనే పార్ట్ ఎక్కడ ఉంటుందా అని నాలుగు రోజులు అన్ని పుస్తకాలూ వెతికి, ఎక్కడా దొరక్క మళ్ళీ అనిల్ ని పిలిచి “గురూ, ఈ ఫింక్ అనేది ఒక నట్టూ, బోల్టూ లాంటిదా…దాని గురించి ఈ రిపేరు పుస్తకంలో ఎక్కడా లేదు. కొనుక్కోవాలంటే ఏం అడగాలి? ఇప్పుడెలాగా?” అని అడగగానే అనిల్ పక పకా నవ్వి, “నీ మొహం. అదేదో ఉత్త ఊత పదం లా అన్నాను కానీ అలాంటి పార్టు ఏమీ లేదు” అన్నాడు. పదేళ్ళ తరువాత “ఫింక్ పోయింది” అని ఒక కథ రాసి నేను మంచి పేరు తెచ్చుకున్నాను.

వీడియో కెమెరాలు వచ్చిన కొత్తలో ఎంతో బరువైన ఆ కెమెరా, రెండు పెద్ద బాక్సులూ ఎక్కడికైనా సరే మోసుకెళ్ళి వీడియోలు తీసే వాడు అనిల్. మా  పెళ్ళయిన కొత్తలో మా ఆవిడకి తెగ వీడియోలు తీసి “ఎంత బావుందో అమ్మలు. పాపం ఏం చెప్పి మోసం చేశావు గురూ?” అని కొస మెరుపుగా “నువ్వు ఎప్పుడైనా డైవోర్స్ చేస్తానంటే చెప్పు” అని కన్ను గీటాడు. అంత దగ్గరి స్నేహం మాకు ఉండేది. అందుకే అతన్ని మా ఆవిడా, పుచ్చా వసంత లక్ష్మి, మరి కొందరూ అతన్ని “అనిల్ బావ” అనే పిలిచే వారు.  ఈ విడియోలో తీసే అలవాటుని ముందు సరదాకి మొదలు పెట్టి తరువాత దాన్నే వ్యాపారంగా మల్చుకుని “వీడియో కుమార్” గా పేరు తెచ్చుకున్నాడు అనిల్. హ్యూస్టన్ నగరంలో ప్రొషెషనల్ స్థాయిలో పెళ్ళిళ్ళకీ, పుట్టిన రోజులకీ, అన్ని సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలకీ వీడియోలో తీసి, ఎడిట్ చేసి, వాటికి తగిన మ్యూజిక్ పెట్టి, వేల మందికి తీపి గుర్తులని మిగిల్చిన తొలి వ్యక్తి అనిల్ కుమారే. మా సాంస్కృతిక సమితి వెబ్ సైట్ లో హ్యూస్టన్ వచ్చిన శ్రీశ్రీ, బాపు, ఆరుద్ర మొదలైన ఎందరెందరో ప్రముఖుల వీడియోలో అన్నీ అనిల్ తీసినవే. వాళ్ళ పక్కన తెర మీద కనపడ్డాను కాబట్టి నేను పేరు తెచ్చుకున్నాను అనిల్ ధర్మమా అని.

ఇక తనూ, రత్న పాపా సంస్థాపించిన “సంస్కృతి” కళా సంస్థ (Two Worlds, One Stage) లో అనిల్ సృజనాత్మకత పరాకాష్ట  అందుకుంది అనే చెప్పాలి. రత్న పాప కొరియాగ్రఫీ చేసిన వందలాది నృత్య నాటికల ప్రదర్శన అంశాలు ఒక ఎత్తైతే అతను రూప కల్పన చేసి అఖండ విజయం సాధించిన “బాలీవుడ్ బ్లాస్ట్”, “ఇన్ క్రెడిబుల్ ఇండియా” లాంటి కార్యక్రమాలు వేల కొద్దీ అమెరికన్ ప్రేక్షకులని ఏళ్ల తరబడి ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అనిల్ కి ఇంతటి కళా తపన అతని తండ్రి జనమంచి రామకృష్ణ గారి దగ్గర నుంచే వచ్చింది. ఆయన ఆల్ ఇండియా రేడియో , మద్రాసు కేంద్రానికి తొలి డైరెక్టర్లలో ప్రముఖులు. అలనాడు ఘంటసాల, సుశీల, బాల మురళి, రజని మొదలైన వారికి రేడియోలో పాడే అవకాశాలు కలిపించిన ఆయన స్వతహాగా మంచి రచయిత. మద్రాసు లో పుట్టి ఆ సాంస్కృతిక వాతావరణం లోనూ, సినిమా రచయితలతోనూ, కళాకారుల మధ్య పెరిగిన అనిల్ కి కళారాధన, అభినివేశం కలగడం పెద్ద ఆశ్చర్యం కాదు. మా చిన్నప్పుడు రేడియో అన్నయ్య – అక్కయ్య వారి బాలానందం కార్యక్రమంలో అనిల్ కుమార్, కందా మోహన్, దువ్వూరి సూరి మొదలైన వాళ్ళు ప్రధాన పాత్రధారులు. బాపు గారితో నేను ఎప్పుడు మాట్లాడినా “రామకృష్ణ గారి అబ్బాయి ఎలా ఉన్నాడండీ?” అనే అడిగే వారు. అలాగే ఎస్.పి. బాలూ కి అనిల్ కుమార్ అత్యంత ఆప్త మిత్రుడు.

అనిల్ కుమార్ 1

అనిల్ గురించిన అనేక విషయాల కంటే అతి ముఖ్యమైనది, అతని మనస్తత్వానికీ, మానవీయతకీ అడ్డం పట్టేది అతను తన పిన్నత్త గారైన “అమ్మా- పిన్ని” గారి కి చేసిన సేవ. సుప్రసిద్ధ జానపద గాయనీ మణులైన సీతా – అనసూయలలో చెల్లెలైన వింజమూరి సీత గారు అనిల్ కుమార్ కి పిన్నత్త గారు. ఆమె అవివాహిత. ఎనభై ఐదేళ్ళ వయసులో ఆవిడ అమెరికాలో పాప -అనిల్ దగ్గరే చాలా ఏళ్ళగా ఉంటూ, గత మూడేళ్ళ నుండీ అల్జైమర్స్ వ్యాధితో మంచానికే పరిమితమై ఉన్నారు. ఆమెని రోజు కి ఇరవై నాలుగు గంటలూ దగ్గర ఉండి చూసుకోడానికి అనిల్ తన వీడియో వ్యాపారాన్ని తగ్గించుకుని, ఇంట్లోనే పనులు చేసుకుంటూ అహర్నిశలూ ఆవిడకి సేవ చేస్తున్నాడు. “మా అమ్మ నా చిన్నప్పుడే తన 42 వ ఏట పోయింది. మా అమ్మకి చెయ్య లేని సేవ ఈ విధంగా అమ్మా పిన్నికి చేసుకుంటున్నాను” అనే వాడు అనిల్ కుమార్.

అలాంటిది గత ఆగస్ట్ లో రొటీన్ “ఏంజియోప్లాస్టీ” అనే మెడికల్ ప్రొసీజర్ కి హాస్పిటల్ లో చేరిన అనిల్ కి డాక్టర్లు అన్యాయం చేశారు. వారి అవక తవకల కారణంగా అనిల్ కోమా లోకి వెళ్లి పోయి, కొన్ని నెలలు తీవ్రంగా పోరాడి ఫిబ్రవరి 13, 2015 న నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ రంభా, ఊర్వశి, తిలోత్తమలలో ఎవరైనా రత్న పాప అంత గొప్పగా నృత్యం చెయ్యగలరా అని చూడడానికే అయి ఉంటుంది. ఇంద్రాది దేవుళ్ళకి ఈ పాటికి పాప బయో డేటా చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే, అతను జీవితాంతం ఆరాధించిన భారతీయ కళారూపం పేరే రత్న పాప. ఆమె భారత ప్రభుత్వం వారి కేంద్ర సంగీత నాటక ఎకాడెమీ వారి “ఎక్స్ లేన్సీ ఇన్ డాన్స్ “ పురస్కారానికి ఏకైక ఎన్నారై నర్తకి గా ఎంపిక అయినప్పుడు కానీ, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆమెకి గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పుడు కానీ, ఇంకెన్నో అత్యున్నత స్థాయి అమెరికా పురస్కారాలు ఆమెని వరించినప్పుడు కానీ, అనిల్ కుమార్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. తన జీవితమే ధన్యమైనట్టు భావించే వాడు. తెర ముందు ఒక గొప్ప కళాకారుడిగా నిలబడడానికి అన్ని అర్హతలూ, ప్రతిభా ఉన్నా, ఇతరులకి ఆ అవకాశం కలిగించి తెర వెనుక నుంచి కళాకారులకి బ్రహ్మరథం పట్టిన అపురూపమైన వ్యక్తి జనమంచి అనిల్ కుమార్. వార్ధక్యం లో ఉన్న అమ్మా పిన్ని గారిని నిరంతరం కను పాప లాగా కాపాడుకున్న అనిల్ కుమార్ లాంటి వ్యక్తి నా “జీవిత కాలమ్” లో అత్యంత ఆప్త మిత్రుడు అవడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ కొన్ని మధుర స్మృతులతో ఈ నివాళులు అర్పిస్తున్నాను.

 -వంగూరి చిట్టెన్ రాజు

chitten raju 

మీ మాటలు

 1. నాకు బాగా గుర్తున్న తొలి కానుక, వెస్పా స్కూటర్ మీద మా ఇంటికి ఒక సాయంత్రం వచ్చి “ఒరేయ్..నువ్వు బొమ్మలు బాగా వేస్తావు రా. ఇంకా చక్కటి బొమ్మలు వెయ్యాలి” అని అంటూ, 24 రంగుల క్రేయాన్స్ ఇచ్చింది జన ‘మంచి’ మామయ్య. అదే ప్రోత్సాహంతో నా బొమ్మలన్నింటి జరిగిన ప్రతి డ్రాయింగ్ ఎక్జిబిషన్‌లో ప్రదర్శనలో ఉంచిన, కామేశ్వరి ‘టీచర్’ (అరుద్ర గారి ఒదిన) ని ఎలా మరిచిపోగలను?

  హైద్రాబాద్‌కి వెళ్ళిపోయిన తరువాత కూడ జనమంవి మామయ్య మద్రాసు వస్తే మమ్మల్ని కలవకుండా వెళ్ళింది లేదు.

  అభిరామపురంలో వారింటికి ఎన్ని సార్లు నేను, మా నాన్న నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామో నాకు గుర్తు లేదు. వెళ్ళి ప్రతిసారి నాతో ఏదో ఒకటి తినిపించిగాని పంపేది కాదు సుశీల అత్తయ్య. ఎంత ప్రేమో నేనంటే వారిద్దరికి.

  అనిల్ తో ఆ సాయంత్రాలు వాకింగ్ వెళ్ళిన రోజుల్ని మరిచిపోలేదు.
  శర్మ గారి ‘జర్మన్ స్కూల్’ లో నన్ను చేర్పించడానికి జనమంచి మామయ్య, నాన్న వెళ్ళినప్పుడు..,అక్కడి నా పేరు అడిగితే…”అనిల్” పేరే వీడికి పెడదాం అను అనుకున్న నాన్న, జనమంవి మామయ్యని ఎలా మరిచిపోతాను? అనిల్ ని ఎలా మరిచిపోతాను!
  మనుషులని ప్రేమించడాన్నే వాళ్ళందరూ నాకు నేర్పారు. ఆ విషయంలో నేను అదృష్టవంతుడ్ని…దురదృష్టవంతుడిని కూడా!

  రత్నపాపని, అనిల్‌ని ఆఖరు సారి కలిసింది అనుకోకుండా మిడ్‌లాండ్ లో “వూడి ఆలెన్” సినిమా, సెకండ్ షో కి వెళ్ళినప్పుడు 1970’s లో అనుకుంటాను! రత్నపాప was carrying then. దేవులపల్లి వారిని, వింజమూరి సిస్టర్స్ని, బుజ్జాయ్‌గార్లని …

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అందరికీ దగ్గర వాడు అయిన మిత్రుడు అనిల్. మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు.

 2. rachakonda srinivasu says:

  వ్యక్తిని పరిచయం చేస్తూ, మిత్రుని స్మరించుకుంటూ, సాహిత్య చరిత్రను సృజిచ్తు, విదేశాల్లో తెలుగు ప్రతిభను చిత్రీకరిస్తూ ,గొప్పవాళ్ళను గుర్తుంచుకొని మీ వ్యాసం చాల అధ్బుతం గా వుంది.

  • rachakonda srinivasu says:

   అమానవీయ విలువలు ఏలుతున్న ఈరోజుల్లో విదేశాల్లో మానవీయతకు నిలువేత్హు విగ్రహాన్ని పరిచయం చేసారు .పిన్నికి అమ్మ కి తేడా చూపకపోవడం అధ్బుతం.మీ అనుభందం అపురూపం . జె .అనిలకుమర్ లాంటి గొప్ప వక్తిత్వ శిఖర విస్వరుపాన్ని చూపించారు .

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు సార్

 3. Uma Bharathi says:

  Raju garu,
  a wonderful tribute indeed! Thank you very much for sharing…. Anil garu – a wonderful person, a dear friend to the entire Houston Indian community. he will be remembered fondly for ever….
  ఉమా భారతి…

 4. katyayani vidmahe says:

  వ్యాసం చాల ఆసక్తికరం గా సాగింది. సమాచారం ,స్నేహం కలగలసిన ఆర్ద్రత అనుభూతుల సమ్మేళనం .చాల బాగుంది .

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు.

 5. Satyam Mandapati says:

  రాజుగారు: ఎంత బాగా వ్రాశారండీ మిత్రుడు అనిల్ గురించి చదువుతుంటే, ముందుగా అతని వ్యక్తిత్వానికి, జీవితంలో చేసిన కళారాధనకీ మనసులో చెప్పలేని ఉల్లాసం, తర్వాత ఆతను మన మధ్య ఇక లేడే అనే బాధ. కళ్ళు చెమర్చాయి. ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టు వ్రాసినందుకు ఎన్నో ధన్యవాదాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీకు కూడా అనిల్ బాగా తెలుసు కాబట్టి ఆ ఆవేదన అదే స్థాయిలో పంచుకోగలరు సత్యం గారూ. మీ స్పందనకి ధన్యవాదాలు.

 6. సుజాత says:

  సత్యం గారి మాటే నాదీనూ! ఎంత బాగా రాశారో!అంత గొప్ప కళాకారుడిని, కళాభిమానిని మీ నివాళి ద్వారా మా వంటి లేటు తరం ప్రవాసాంధ్రులకు పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు రాజు గారూ!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మొదటి తరం మెల్ల మెల్లగా నిష్క్రమిస్తోంది అనడానికి అనిల్ మరణం ఒక సూచన ఏమో ! ఏమో

 7. Rajendra PrasAd Chimata says:

  అద్భుతమైన వ్యక్తికి అద్భుతమైన నివాళి

 8. When we first came to Houston to study at Rice University, Anil was one of the first Telugus we met. His voice was like butter. Smooth and deep, his voice over the radio used to take us places that we longer for. We were poor students; and yet, he always was hanging out with us, in local festivals. I am saddened to hear about this news. I always that I would run into him somewhere soon and can hang out like in the old days.

  Thanks to Chittenraju for a wonderful tribute.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   Thank you, Ramarao garu. I remember those days when I also met you & Ananda Kishore at Rice University and you were kind enough to type my Telugu drama on your computer in Telugu script..very unusual at that time….and you guys invented that. Anil was heck of a nice guy all along…and I miss him as many others also do….

 9. Balamurali Krishna Goparaju says:

  మనం జీవితంలో కొంత మందిని మొదటి సారి కలిసినప్పుడు అనిపిస్తుంది, అయ్యో వీరిని ఇంకా ముందే కలిసి వుంటే బావుండేదే అని.
  అటువంటి భావం కలిగించిన, కలిగించగలిగే వ్యక్తులు అరుదుగానే తటస్త పడుతుంటారు. స్వర్గీయ అనిల్ కుమార్ గారిని కలిసినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఆయన తో మొదటి సారి కలిసి మాట్లాడినప్పుడు, ఎంతో ఆత్మీయతతో ఎన్నాళ్ళనుండో తెలిసిన స్నేహితుడిలా పలకరించారు. అటువంటి సౌలభ్యం, సౌశీల్యత నేను మళ్ళీ స్వర్గీయ శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి దగ్గర కనిపించింది. నేను చాల సార్లు అనుకునే వాడిని కూడా, వీలు చేసుకుని అంజలి సెంటర్ కి వెళ్లి కొంత సమయం అనిల్ గారితో వారి సహజ వాతావరణం లో కలిసి మరి కొంచెం స్నేహం చేసుకోవాలని.

  కానీ ఇది జీవితం. మనకి భగవంతుడు ఎంత సమయం ఇచ్చాడో తెలిస్తే మనం అందరం ఇంకోలా ఉండే ప్రయత్నం చేసే వారమేమో?
  కానీ భగవంతుడు ఇచ్చిన ఆ కాస్త సమయంలో, తనదైన శైలిలో ఒక ముద్ర వేసి, ఎందరికో తన స్నేహం అందించిన అనిల్ గారు ధన్యులే.

  రాజు గారూ, ఒక మంచి స్నేహితుడికి, మంచి వ్యక్తికి చక్కటి నివాళి మా అందరి తరపునా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
  అటువంటి అరుదయిన వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  బాల మురళీ కృష్ణ గోపరాజు

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు. ఎప్పుడు సాహిత్యం కార్యక్రమాలు చేసినా అతను ముందు ఉండే వాడు..పూర్వం రోజుల్లో.

 10. Raju garoo
  Mee mitrudu late sri Anil Kumar gari meeda nivali chala goppaga undi. Mee rachanalu oka charitranu record chestunnayi. Meeru rayaka pote, అమెరిక బయట నివసిస్తున్న వారికీ అమెరికా లో మీరు, అనిల్ కుమార్ లాంటి వారు పయనీర్ చేసిన కార్యక్రమ గురించి తెలిసే అవకాసం చాల తక్కువ.
  అలాగే, మీరు సీతా అనసూయ గార్ల గురంచి మరియు రత్న పాపా గారి గురుంచి ఇంకా రాస్తే చదవాలని వున్నది.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు మోహన్ గారూ, మీరు చెప్పినట్టీ ఈ వంగూరి జీవిత కాలమ్ లో అన్నీ రాసుకొస్తున్నాను..చిన్నప్పటి నుంచీ ..ఇంకా అమెరికా దాకా రాలేదు అంతే! .

మీ మాటలు

*