మిగిలిన సగాన్ని వెతుకుతూ…

(కథా రచనలో కృషికి ఈ నెల 25 న మాడభూషి రంగాచార్య అవార్డు  సందర్భంగా)
 
ఆటలు లేవు, వేరే పనేదీ లేదు, బడి లేదు, స్నేహితులు ముందే తక్కువ.
 
పూజ, వంట, భోజనాలతో అలసిపోయిన అవ్వ, నాయినమ్మ, అమ్మ.. అందరూ మధ్యాహ్నం కునుకు తీస్తారు. చప్పుడేదైనా చేస్తే నీ తాట తీస్తారు. తాత, నాన్న డిటో డిటో.
 
అలాంటి ఎంతకీ గడవని అతి నిశ్శబ్దమైన పొడుగైన వేసవి మధ్యాహ్నాలు నన్ను మంచి చదువరిగా మార్చాయి.
 
ఇల్లంతా కలియతిరిగితే మా నాయినమ్మ దగ్గర చిన్న పాకెట్‌ పుస్తకం ‘అంబరీష చరిత్రము’ దొరికింది. ఇక వేరే ఏమీ దొరకని పరిస్థితిలో దాన్నే బోలెడన్నిసార్లు చదివి విసుగొచ్చేసింది. అనుకోకుండా ఒక సాయంత్రం మా నాన్న నన్ను దగ్గర్లోని లైబ్రరీకి తీసుకెళ్లారు. ఒకటే ఆశ్చర్యం…. ‘ఇన్ని పుస్తకాలుంటాయా ప్రపంచంలో’ అని.
37cde126-fb20-46de-b8e7-bb261260aa54
అమితమైన ఉత్సాహంతో ‘సముద్రపు దొంగలు’ ‘అద్భుత రాకుమారి’ వంటి నవలలు చదువుకుంటూ ఉంటే.. అప్పుడు మొదలైంది అసలు బాధ.
పాడుబడుతున్న ఇంట్లో అరకొరగా నడిచే ఆ లైబ్రరీకి వచ్చేవాళ్లు అతి తక్కువమంది. అది సాకుగా ఆ లైబ్రేరియన్‌ వారంలో మూణ్ణాలుగు రోజులు సెలవు పెట్టేసేవారు. దాంతో ఆ లైబ్రరీ ఎప్పుడూ మూసే ఉండేది. పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవచ్చని నాకు అప్పటికి తెలియదు.
తలుపులు మూసిన లైబ్రరీ లోపల, చక్కటి చీకట్లో – ఎలకలు, పందికొక్కులు పుస్తకాలను ఆరారగా చదువుతూనే ఉండేవి. అవీ పసివేనేమో, లేదా పిల్లల పుస్తకాల గది మరీ అనువుగా ఉండేదేమో తెలీదుగాని, నేను ఆత్రంగా చదివే పుస్తకాలకు ఆద్యంతాలు లేకుండా భోంచేసేవి మా ఊరి ఎలకలు.
సగం చదివిన పుస్తకం మిగతా సగం దొరక్కపోతే పడే బాధేమిటో ఇక్కడ చాలామంది అర్థం చేసుకోగలరు.
అందులోంచి పుట్టేవి ఊహలు. అవి ఆ కథల్ని పూర్తి చేసేవి.
అప్పటికి వాటిని కాగితం మీద రాయొచ్చని తెలీదు.
అందుకే నా ఊహాలోకంలో అల్లుకున్న ఎన్నో కథల సగాలు ఉదయపు మబ్బుల నీడల్లో, డాబా మీద నుంచి దూరంగా కనిపించే కొండల నీలిమలో, సాయంత్రం విరిసిన సన్నజాజుల సువాసనలో, రాత్రి మెరిసే చుక్కల మెరుపులో కలిసిపోయాయి.
మరికొన్ని కథలు వేసవి రాత్రుల్లోని ఉక్కపోతలో, చలికాలాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే దుమ్ములో, వర్షపు నీటిలో కలిసిపోయిన కాలవల దుర్వాసన లో… కొట్టుకుపోయాయి.
ఇంకొన్ని కథలు అగ్రహారాల అనుబంధాల్లో, వేరంగా మారిపోతున్న సామాజిక దృశ్యాల్లో, అక్కచెల్లెళ్ల అన్నదమ్ముల అమెరికా సంబంధాల్లోకి చెరువు నీళ్లు మాయమైనట్టు మాయమైపోయాయి.
వాటన్నంటినీ తిరిగి తెచ్చుకోవడానికి వీల్లేనంత పరుగులో ఇప్పటి నేను చిక్కుపడిపోయాను.
వాటిని వెతుకుతున్న క్రమంలో ‘చందనపు బొమ్మ’ ఒట్టి ప్రిపరేషన్‌. అంతే.
arun1
పాత్రికేయ జీవితంలో పరిచయమైన కొందరు అపురూపమైన మనుషుల్ని, కొన్ని జ్ఞాపకాల్ని – ఇంకొన్ని అసంగతమైన విషయాలను గుదిగుచ్చడంలో చందనపు బొమ్మ నాకు సాయపడింది.
ఇప్పటికైతే నేను మంచి రచయిత్రినని అనుకోవడం లేదు. కాని మంచి పాఠకురాలిని.
మల్లాది, శ్రీపాద, రావిశాస్త్రి, పతంజలి, ఇస్మాయిల్‌ – వీళ్ల వాక్యాల్లోని పదును, సున్నితత్వమూ కూడా నాకెప్పటికీ పట్టుబడవన్న సత్యం తెలుసుకున్న దుఃఖభరితురాలిని.
వాళ్లందరి వరకూ ఎందుకు?
భావన ఏదైనా ఎంతో కవితాత్మకంగా వ్యక్తపరిచే నిషిగంధ, మెహర్‌, బండ్లమూడి స్వాతి, ప్రసూనారవీంద్రన్‌, మోహన్‌ ఋషి వంటి ఇంకొందరిని విస్మయంగా చూసే పాఠకురాలిని.
ఆంధ్ర మహాభారతాన్ని సావకాశంగా చదువుతూ వందల ఏళ్ల క్రితమే మానవ స్వభావ చిత్రణ చేసిన కవుల ప్రతిభకు ఆశ్చర్యపోతున్న అవివేకిని.
ప్రపంచం, జీవితం – రెండూ ఆటే అని అర్థం చేసుకున్నాక కలిగిన వైరాగ్యం కొంత, అందర్నీ ఆడనీ,  నేను ఆట్టే ఆడి అలసిపోవడమెందుకు అని అలవాటయిన బద్దకం కొంత –
 
వెరసి ఏమీ రాయడానికి మనసొప్పడంలేదు. రాయకుండా ఉండలేనని తెలుసుగానీ,
మా నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల్లాగా… అప్పుడు ఎండి, అప్పుడు పొంగే ఇంకెన్నో భావాలు ఉరకలెత్తితే , కథల్లో మిగిలిన సగాలు విస్తారంగా రాస్తానేమో మరి.
-అరుణా పప్పు 

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    First of all, I congratulate you on being selected for the prestigious award! Your frankness, humility, receptiveness, effort and passion will prove you an euvrous writer!

  2. Thank you Satyanarayana garu

  3. Jayashree Naidu says:

    కంగ్రాచులేషన్స్ అరుణా
    మీ అవార్డ్ ఫంక్షన్ రోజు అటెండ్ అవుదామని ప్లాన్ వేసుకున్నాను
    కాలేజీ లో వర్క్ లేట్ అయ్యి… మిస్ అయ్యాను.
    హోప్ టు గెట్ ఇట్ అండ్ రీడ్ ఇట్

  4. ఆర్.దమయంతి. says:

    మీకివే నా అభినందనలు అరుణ!

  5. Thank you jayasree garu, how are you?
    Dear damayanthi garu, meeru baga rastunnaru. Naku ishtam

  6. అరుణ గారూ, అవార్డ్ పొందినందుకు అభినందనలు. మరిన్ని మంచి మంచి కథలు మీ నుంచి ఎదురుచూస్తూ – ప్రసూన.

  7. అవార్డు అందుకున్నందుకు అబినందనలు.

  8. mani kumar says:

    డబ్బు చుట్టూ తిరిగే ఆలోచనల విద్వంసాన్ని ఆపకు. నీ ప్రయాణం ఇంకా ఇప్పుడే మొదలయింది.

మీ మాటలు

*