వంశీ: మాస్టర్ ఆఫ్ యాంత్రొపాలజీ

 29810_367552823325631_1651324620_n
జిలిబిలి పలుకులు సెలయేటి తళుకులు అందమైన వేళ్ల మధ్య చిక్కుపడ్డ కళ్లు. విశాలనేత్రాలతో విస్తరించిన తెర. అన్నా! గోదావరి నీ వంశధారా? నొకునొక్కుల జుట్టు తెలుసుగానీ నొక్కివదిలిన చమక్కుల సంగీతం మాత్రం నీతోనే పరిచయమైంది. సెకనుకు ఇరవైనాల్గు ఫ్రేముల్ తెలుసుగానీ ఫ్రేములకొలదీ విస్తరించిన సొంపు నీతోనే పరిచయమైంది. మీ మనోనేత్రాలు రమణీయభరితాలు. ఎందుకని సౌందర్యశాస్త్రం నీకు ఇంత వశమైంది? ఏ నీరు తాగితే వచ్చెనింత కళాకావరము. ఇదంతా నాకే ఉంటేనా ఎంత విర్రవీగేవాడినో నీకేం తెలుసు.
 
వంశీ నిన్ను ఏకవచనంలో పిలవకపోతే కలం పలకడం లేదు. గాలికొండలూ, అరకు రైలుపట్టాలూ పట్టాలమీద తీగలూ తీగలమీద వాలిన పిట్టలూ పిట్టల కూతలూ కిటకిట తలుపులు కిటారి తలుపులు మూసినా తెరిచినా చూసేవాడి గుండెల్లో చప్పుళ్లు. పచ్చగడ్డిమీద పరుచుకున్న మంచుతెరలు. వెండితెరపై తరలి వచ్చిన తెమ్మెరలు. కధను ప్రకృతి ఒడిలో పవళింపజేసి పాత్రలను సెట్‌ప్రాపర్టీలా మలచి నువు దృశ్యమానం చేసిన చలనచిత్రాలు మా ఈస్థటిక్స్ కు ఆమ్‌లజనితాలు.
ఎందుకిదంతా అంటే చెప్పలేను. ఈ ఉదయం వంశీ ఫోన్ చేశాడు. ఇరవైఅయిదో సినిమాకు పాటలు చేయించుకోడానికి ఇళయరాజా దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. ఇన్సిడెంటల్లీ ఇళయరాజా కూడా వెయ్యి సినిమాలు పూర్తిచేసుకున్నాడు. పలకరించాడు కదా మరి కొన్ని జ్ఞాపకాలు ముసురుకోవా. పాటలే కాదుకదా చెప్పుకోవాల్సిన మాటలెన్నో! అందుకే ఇదంతా.
చూసే కళ్లుండాలేగానీ అందమంతా ముందరే ఉన్నది. చెప్పే నేర్పుండాలేగానీ కధలన్నీ నీ కళ్లముందే ఉన్నాయి. వంశీలో పెద్ద మాన్ వాచర్ ఉన్నాడు. నీలోనాలో లేనోడు. మనుషులు. ముక్కోటి రకాల మానవుల జాడలన్నీ వంశీ కనుగొనే పాత్రల్లోనే పరిచయమైపోతారు. పరిచయమైన మరుక్షణమే వీడా మా నారిగాడే కదా అని స్ఫురించేస్తారు. అలా మనతో కనెక్టయిపోతారు.
unnamed
డెస్మండ్ మోరిస్-మాన్ వాచింగ్ అనే పుస్తకం రాశాడు. రైల్వేస్టేషన్‌లో, మార్కెట్‌లో, కాంపస్‌లో, ఆఫీస్‌లో ఎక్కడపడితే అక్కడ కూర్చుని వచ్చేపోయే జనాన్ని చూస్తూ కాస్తూ వడపోస్తూ పరిశోధిస్తూ ఓ మహాగ్రంధమే రాశాడు. మాన్ వాచింగ్ ఈజ్ ఎ హాబీ. వంశీ కూడా పుట్టంగానే బట్టకట్టంగానే మాన్ వాచింగ్ మొదలుపెట్టుంటాడు. కాకపోతే మనుషుల్నీ వాళ్ల యాంబియెన్స్‌నూ కలిపి శోధించడమే మోరిస్‌కీ వంశీకీ మధ్య డివైడింగ్ లైన్. కల్చర్ ఈజ్ మాన్ మేడ్ ఎన్విరాన్‌మెంట్ అన్నాడు మలినోస్కి. మనుషులలోనే సాక్షాత్కరించే సంస్కృతికి సహజావరణాన్ని జోడించి సెల్యులాయిడ్‌పై అద్దే చిత్రకారుడు వంశీ. తెలిసిన మనుషుల్లో తెలియని కోణాలను కొత్తగా దర్శనం చేయిస్తూ మనలాంటి ఎంతోమంది భావప్రపంచంలో సన్నిహితంగా సంచరించే అదృశ్య స్నేహితుడు వంశీ. ప్రేక్షకుడిని స్థలకాలాలలోకి వేలుపట్టుకుని నడిపించే శక్తి వంశీది.
తనచుట్టూ నిండిన ఆవరణాన్నీ అందులో జీవించే మనుషులనూ చదువుతూ గడపడంలోనే చదువు కొనసాగించాడు. వాడు లోకమనే పాఠశాల చదువరి. వసంతకోకిలను మినహాయిస్తే భావసూచిక లాంటి టైటిల్స్ పెట్టిన తెలుగు దర్శకులెవరూ పెద్దగా గుర్తుకురారు. కానీ మంచుపల్లకి టైటిల్‌తోనే వంశీ తనలోని కవితాత్మను లోకానికి ఒక ప్రకటనలా విడుదల చేశాడు. డ్రాన్ ద ఐ బాల్స్. ఐ బాల్స్ అంటే కనులు. మన మనసులతో కలిసి టపటపలాడే కళ్లు. భానుప్రియ, శోభన, అర్చన, మాధురి. కళ్లుండీ చూడలేకపోయిన కళ్లని పరిచయం చేసిన కళ్లు వంశీవి. లేడీకి కళ్లుంటే చాలు. లేడి కళ్లుంటే చాలు. ఫిదా.
7445_482346638512915_139863931_n
మనకు అతిసాధారణమనిపించే సంగతుల్లో అత్యంత విశేషాలను ఒడిసిపట్టుకోగలగడమే వంశీ నైపుణ్యం. చెట్టుకింద ప్లీడర్‌నూ రికార్డింగ్ డ్యాన్సర్‌నూ లేడీస్‌టైలర్‌నూ మన సామాజిక సంబంధాల్లో భాగమైన నానారీతుల, వృత్తుల మనుషులను హోల్‌సమ్‌గా కధానాయకులను చేసి, సన్నిహితమైన జీవితాన్ని అంతే సన్నిహితంగా చూస్తున్న అనుభూతిని కలిగించడమే వంశీ చేసే ఫీట్.
సెమీరూరల్, సబర్బన్ సముదాయాల్లోని సోషల్ నెట్‌వర్క్ ప్రతికధలోనూ నేపథ్యం కావడం తనుమాత్రమే స్పెషలైజ్ చేసిన టెక్నిక్. ఓ నైబర్‌హుడ్- ఎయిటీస్ నాటి ఎస్సార్‌నగరో, రాజమండ్రి రైల్వే క్వార్టరో, రాజోలు మెయిన్‌రోడ్డో, గోదావరి లంకో-ఓ హేబిటాట్‌ను కధలో భాగంచేసి పాత్రల జీవితాలను అల్లికచేసి తెరకెక్కించడంలో కేవలం చిత్ర దర్శకుడిగానే కాదు, మానవనిర్మిత పరిసరాలను డాక్యుమెంట్ చేసిన సాంస్కృతిక చరిత్రకారుడిగా కూడా వంశీ నిలిచిపోతాడు.
హైదరాబాద్‌లో ఒకనాటి హౌసింగ్ కాలనీ ఇరుగుపొరుగు ఎలా ఉండేది. మారేడుమిల్లో, పేరంటపల్లో, గోదావరిలంకల్లో జీవితమెలా సాగేది. అమెరికా వెళ్లకముందు ఊళ్లో వెలిగిన జమిందారుగారి మేడ గోడలెక్కడ. టీవీ లేకముందు, జబర్దస్త్ ప్రోగ్రామ్ రాకముందు ఊరి జాతరలో సాగిన రికార్డింగు చిందులెలా ఉండేవి. రెడీమేడ్ షాపులు రోడ్లంతా బారులు తీరకముందు ఊరి టైలర్‌తో జనం అనుబంధమెలా ఉండేది. అంతెందుకు తెలుగు మహిళా బహిర్భూమికి ముందు కాలకృత్యపు కాలక్షేపంలో నెరపే సామాజిక కలాపమేమిటి. అన్నీ రికార్డు చేసే ఉంచాడు. వంశీ అన్నీ సెల్యులాయిడ్‌మీద భద్రపరిచాడు. సమకాలీన సమాజాన్ని సమకాలికంగా రికార్డ్ చేస్తున్న వంశీని కేవలం ఓ ఫిలిం మేకర్‌లా చూడలేం. వంశీ ఒక కల్చరల్ సైంటిస్ట్. ఎన్ ఆంత్రోపాలజిస్ట్.
సందర్భం వేరే ఏంలేదు. ఇరవైఅయిదో సినిమా! వంశీ కమ్ముకున్నాడు. అంతా గుర్తుచేశాడు. అందుకే ఈ కాస్త!
-అరుణ్‌సాగర్
arun sagar

మీ మాటలు

 1. Rammohanrao says:

  రివ్యు బాగుంది.

 2. datla devadanam raju says:

  కదిలే బొమ్మల్ని దృశ్యకావ్యంగా మలచడం…అందమెక్కడున్నా ప్రేమగా ఆరాధనగా చూడటం… ఆద్యంతం గొప్ప పరిశీలనా శక్తితో మెలగడం…అపురూప దృశ్యానికి వుప్పొంగిపోవడం…ఒకింత భావుకతతో పులకించిపోవడం…ఆస్వాదిస్తున్న వెన్నెల్ని సైతం తడిసేలా విప్పారడం…వంశీకి తెలిసిన విద్య…అరుణసాగర్ గారూ కొన్ని జ్ఞాపకాల్ని కదిలించినందుకు అభినందనలు

 3. అందానికి మరింత అందంగా తానూ పరవశించడమే కాదు, నలుగురికీ పంచడం వంశీ కి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదేమో!
  సినిమా తీసినా, చిన్న కథ రాసినా వెన్నెలజలతారు తీగలే!

 4. చక్రపాణి ఆనంద says:

  ఆర్టికల్ చాలా బాగుంది. వంశీ గారి సినిమాలను, అందులోని తెలుగుదనాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చారు. గోదావరి అందాలు, నుడికారం, విప్పారిన విశాలమైన కళ్ళు, మన పక్కనే వుండే మనుషుల తాలూకు పాత్రలు, ఇళయరాజా సంగీత ఝురి… ఇలా చెప్పుకుంటూ పోతే మదినిండా ఎన్నో వూసులు. నవయవ్వనపు అనుభూతుల కాసులు….. ధన్యవాదాలు అరుణ్ సాగర్ గారూ.

  • ramesh hazari says:

   అట్లా తెలంగాణా జీవితాన్ని తెరకెక్కించాలని అనిపిస్తది . అదే విషయం వో సందర్బం ల కలుసుకున్నపుడు వంశీ’ తో అనుంటి..నవ్విండు . తెలంగాణా జీవితం తీస్తే బాగుండు మీరు అన్న.తెలియంది చేయలేను గదండి అన్నడు.
   నచ్చాల లేకుంటే మనిషిని అసలు గుర్తించని బాపతు.మోకమాటం లేదు .ఇష్టపడితే బారా ఖూన్ మాఫ్ .
   సెటిల్ ఆడుడు యిష్ట మనుకుంట..పాత్రలతోటి అట్లనే ఆడిపిస్తడు తెరను.
   గోరేటి ఎంకన్నోలె జీవితాన్ని పట్టిండు.ఆయిన పాట.యీనెది ఆట .
   వర్దిల్లాలే కవి కల .మనిషన్నంక తనకో ప్రత్యక మైన కల( అల ) అబ్బాలే .లేక పోతే ఎంజేస్కోను జీవితం.

   సాగరన్న…అదో వల . సాగరం ల పడి తన్లాడే మనిషిని వొడిసి పట్టి వోడ్డుకేసే కల (అల) దాని సొంతం. పాటల ఎగిరే గోరేటి మనిషి వంశీ తెర మీంచి మనోని కలం ల నించి జాలు వారాల్సిందే . పాత్రలే కావు శ్రుష్టి కర్తలు కూడా మనుసులే కదా ..ఆల్లను మని (అణ) దీపాలు జేసి మంచు పల్లకి ల మోద్దాం..
   అరునన్న మంచిగ జెప్పినవే
   — హజారి

 5. soooooooooooooper

 6. వంశీ గారు మానవ సంబంధాల్నీ, అనుభూతుల్నీ, అనుభవాల్నీ దృశ్యీకరిస్తే , మీరు ఆయన దృశ్య కావ్యాల్ని అక్షరాలుగా చిత్రీకరించారు . చాలా బాగుంది .

 7. నిశీధి says:

  అమ్మాయి అందం చూపడం అంటే మెడ దిగువ భాగంలో కెమెరా ఫోకస్ చేయాలి అనుకొనే ఇండస్ట్రీ లో స్త్రీత్వం అంటే కళ్ళు , పాదాలు చూపి మోహపరిచిన మాంత్రికుడే వంశీ . మంచి ఆర్టికల్ , బోలెడు మెమోరీస్ అలా కళ్ళ గిర్రున తిరిగాయి

 8. వంశి గారన్న , ఆయన సినిమాలు అన్న చాల ఇష్టం …..అరుణ్ అన్న ఆర్టికల్ చాల బాగా రాసావు….థాంక్స్….

 9. వంశీ గారి గురించి మీరు చెప్పిన విషయాలు బావున్నాయి. ‘ఆల్లను మని (అణ) దీపాలు జేసి మంచు పల్లకి ల మోద్దాం..’ అన్న హజారి గారి మాటలు మరింత బావున్నాయి.

 10. ఆయ్ బాబోయ్ వంశీ గారు ఇంత మాట్లాడారా …?? ఫోన్ లో ..!!

 11. Jayashree Naidu says:

  వంశీ ఒక కల్చరల్ సైంటిస్ట్. ఎన్ ఆంత్రోపాలజిస్ట్.
  ఎస్… తెలుగు వెండితెర పై సామాన్యుడిని మహారాజు చేసి అన్ని భావ ప్రవాహాల్లో ఇప్పటికీ కొట్టుమిట్టాడేలా చేసిన మాంత్రికుడు.
  లవ్ ఆల్మోస్ట్ అల్ హిస్ ఫిల్మ్స్

 12. చాలా చక్కగా రాసారు అరుణ్ సాగర్ గారు.

  వంశీ గారి సినిమాలలో సంగీతం చాయాగ్రహణం అందంగా కలిసి పోతాయి. ఆయనకున్న ఏస్తేటిక్ సెన్స్ తెలుగు సినిమా దర్శకులలో చాలా తక్కువగా కనపడుతుంది.

  ఆయన మహర్షి సినిమా చాలా రోజులు వెంటాడింది.

 13. chandra says:

  ఔను నిజం ఔను నిజం
  నీవన్నది నీవన్నది నీవన్నది నిజం నిజం
  గొప్ప నిజం

 14. buchanna says:

  చాలా బాగా రాశారండి. తెలుగులో అద్భుతమైన సినిమాలు తీశారు వంశీగారు. సాహిత్యం…. సంగీతం…. దృశ్యం…. అన్నీ జీవితానుభవాలే.
  ’’మన మనసులతో కలిసి టపటపలాడే కళ్లు. భానుప్రియ, శోభన, అర్చన, మాధురి. కళ్లుండీ చూడలేకపోయిన కళ్లని పరిచయం చేసిన కళ్లు వంశీవి. లేడీకి కళ్లుంటే చాలు. లేడి కళ్లుంటే చాలు. ఫిదా.‘‘ యుఆర్ కరెక్ట్ అండీ…

 15. శ్రీరామ్ వేలమూరి says:

  వంశీ గారి సినిమా లాంటి అందమైన వ్యాసం .. ధన్యవాదాలు అరుణ్ సాగర్ garoo

మీ మాటలు

*