మన ‘చిలాన్ బందీ’కి 120 ఏళ్లు

1 chilan by Delacroix1834కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి. అవసరగత ప్రాణులం కనుక స్పష్టంగా నాకిది కావాలి అనుకుని వెతుకుతూ ఉంటాం. కావాలనుకున్నది అంత సులభంగా దొరకదు. కానీ మనం కోరుకునేదానికి దగ్గరగా ఉండే మరొకటి తారసపడుతుంది. అది మనకు కావలసినది కాదు కదా అని ముందుకు సాగిపోతాం. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. మనం కోరుకునే దానికి దగ్గరున్నవి మన అవసరాలు కొంతైనా తీరుస్తాయి కదా.

తెలుగు ‘చిలాన్ బందీ’ని పరిచయం చేయడానికి ఈ ఉపోద్ఘాతం అక్కర్లేదు కానీ అతడు నాకు తారసపడిన వైనాన్ని చెప్పుకోవాలన్న ఉత్సాహాన్ని ఉగ్గబట్టుకోలేకే ఇదంతా.

మాటలకు అపారమైన స్వేచ్ఛాసౌందర్యాలను అద్ది రంగురంగుల పక్షుల్లా ఎగరేసిన ప్రఖ్యాత ఆంగ్ల రొమాంటిసిస్ట్ కవి లార్డ్ బైరన్ 1816లో ‘The Prisoner of Chillon’ ఖండకావ్యం రాశాడు. 392 లైన్ల ఈ పద్యంలో విశ్వజనీనమైన స్వేచ్ఛాభిలాషను ఎలుగెత్తి గానం చేశాడు. ఎగిరే రెక్కలను గొలుసులతో విరిచికట్టి, చీకటి గుయ్యారాల్లో పడదోసి, అడుగు కదపనీయని దుర్మార్గపు ఖైదును శఠించాడు. రాత్రీపవళ్ల, వసంతగ్రీష్మాల తేడా లేకుండా రోజూ ఒకేలా వెళ్లమారిపోయే దిక్కుమాలిన రోజుల లెక్క తెలియని ఆ నిర్బంధంలో చితికిన ఓ స్వేచ్ఛాపిపాసి అంతరంగాన్ని గుండె కరిగి కన్నీరయ్యేలా, కన్నీరైన గుండె.. ఆ బాధాతప్తుడి హృదయ ఘోషను తట్టుకోలేక మళ్లీ గడ్డకట్టిపోయేలా ఆవిష్కరించాడు. ఆ సంవేదన సర్వమానవాళి ఘోష కనుక ఖండాలు, సముద్రాలు దాటింది. నిర్బంధంలో కొట్టుమిట్టాడుతున్న మరో నేలపైన ప్రతిధ్వనించింది. బైరన్(1788-1824) జీవించిన శతాబ్దిలోనే 1894లో తెలుగులో ప్రతిధ్వనించిన ఈ భువన ఘోషే ‘చిలాన్ బందీ’. దానికి ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ గొంతుకను వ్రిచ్చిమోసినవాడు శ్రిష్టు జగన్నాథశాస్త్రి.

జగన్నాథం అనుసృజించిన చిలాన్ బందీని తెలుసుకోవడానికి ముందు బైరన్ కావ్యం గురించి కొంత. బైరన్ 1816లో తన మిత్రుడైన కవనపు హల్లీసకాల షెల్లీతో కలసి స్విట్జర్లాండ్ లోని జెనీవా సరస్సులో విహరించాడు. ఆ కొలనులోకి చొచ్చుకెళ్లిన మధ్యయుగాల చిలాన్ కోటను చూశాడు. అక్కడి కారాగారంలోకి అడుగుపెట్టాడు. అది పదహారో శతాబ్ది ప్రొటెస్టెంట్ క్రైస్తవ ఉద్యమకారుడు ఫ్రాంకోయిస్ బోనివార్డ్(1493-1570)ను ఆరేళ్లపాటు ఖైదుచేసిన చెరసాల. సవాయ్ పాలకుడు మూడో చార్లెస్ పాలనకు వ్యతిరేకంగా జెనీవావాసులను తిరగబడమన్నందుకు బోనివార్డ్ ను జైల్లో వేశారు. విడుదలైన తర్వాత కూడా అతడు చార్లెస్ కు వ్యతిరేకంగా పోరాడాడు. బైరన్ ఆ చారిత్రక వ్యక్తి వివరాల్లోకి పూర్తిగా వెళ్లకుండా అతని దుర్భర ఖైదును మాత్రమే తన కావ్యానికి ముడిసరుకుగా తీసుకున్నాడు. అందుకే తనది ‘ఫేబుల్’ అని అన్నాడు.

బైరన్ కవిత అంతా ఆ ఖైదీ స్వగతమే. అతని యవ్వనమంతా బందిఖానాలో ఆవిరైంది. అతని తండ్రిని అతని మతవిశ్వాసాలు నచ్చని పాలకులు(జగన్నాథం అనువాదంలో ‘క్రొత్తసిద్ధాంతములకతికోపఘూర్ణమానమానసులైన దుర్మార్గజనులు) సజీవదహనం చేశారు. అతని రక్తమేకాకుండా ఆశయాలనూ పంచుకున్నఆరుగురు కొడుకులపైనా కత్తిగట్టారు. వాళ్లలో ముగ్గురు ఆ జైలు బయట ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని బతికుండగానే తగలబెట్టారు. ఇద్దరిని యుద్ధంలో చంపేశారు. మిగిలిన ముగ్గురిని చిలాన్ దుర్గంలోని చీకటికొట్టులో పడేసి, విడివిడిగా మూడు పెద్దస్తంభాలకు గొలుసులతో కట్టేశారు, ఒకరికొకరు దూరంగా ఉండేలా. కథ చెబుతున్న ఖైదీ ఆ ముగ్గురిలో పెద్దవాడు. పెద్దవాడు కనుక తమ్ముళ్లకు అభయమివ్వాలి, ఓదార్చాలి. పెద్దతమ్ముడికి స్వేచ్ఛే ప్రాణం. కొండల్లో జింకలను, తోడేళ్లను వేటాడిన ఆ యువకుడికి ఈ బందీ బతుకంటే అసహ్యం పుట్టింది. అన్నపానీయాలు నిరాకరించి ఆయువు తీసుకున్నాడు. అందరికీ ప్రాణమైన ముద్దుల చిన్నతమ్ముడు మనోవ్యథతో కృశించి ‘ఎండు సస్యమై’ ప్రాణం విడిచాడు. ఇక మిగిలింది కథకుడు. అతని ఆశలు ఉడిగాయి. ప్రాణావశిష్టుడైపోయాడు. అయితే ఓ రోజు కిటీకీ చెంత కనిపించిన అద్భుతమైన పక్షి పాడిన పాట విని ప్రాణాలు తేరుకున్నాయి. బతుకుపై ఆశపుట్టింది. తర్వాత ఎన్నేళ్లకో అతన్ని జాలి తలచి విడుదల చేశారు. కానీ ఏళ్ల తరబడి ఖైదు తర్వాత, నా అన్నవాళ్లందరూ గతించిపోయాక, హఠాత్తుగా దక్కిన స్వేచ్ఛను ఏం చేసుకోవాలో అతనికి తెలియకపోయింది. సంకెళ్లే నేస్తాలైపోయిన ఆ దుఃఖితాత్ముని మోముపై ఒక నిట్టూర్పు వెలువడింది.

మనసును మెలిపెట్టే ఈ కథాకావ్యంపై రాజమండ్రి ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ జగన్నాథం మనసు పారేసుకున్నాడు. దీన్ని ‘చిలాన్ బందీ అను భ్రాతృసౌహృదము’ పేరుతో తెలుగు చేశాడు. 1894లో ఏలూరులోని ధర్మరాజు శివరామయ్యకు చెందిన శ్రీత్రిపుర సుందరీ ప్రెస్సులో అచ్చేయించాడు. బైరన్ కృతిని అనువదించడం అంత సులభం కాకపోయినా సొబగు చెడకుండా తెలుగు పాఠకులకు అందించడానికి శాయశక్తులా ప్రయత్నించానని, దీని బాగోగులపై ఎవరు సలహాలిచ్చినా స్వీకరిస్తానని వినయంగా చెప్పుకున్నాడు ముందుమాటలో. మన యథాలాప జీవితాల్లో అంతగా గుర్తుకు రాని స్వేచ్ఛను హృదయంతోపాటు రక్తమజ్జాస్థిగతాలూ పలవరించేలా చేసే ఖైదు అనుభవం కొంత నాకు కూడా ఉండడంతో ‘చిలాన్ బందీ’పై నేనూ మనసు పారేసుకున్నాను.

జగన్నాథం అనువాదంపై ఇదివరకు తెలుగులో ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదు. అతని జీవిత విశేషాలూ తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అన్నీ ఇంటర్నెట్లో దొరకవని తెలిసినా ఆశతో తొలుత అక్కడే వెతికాను. “Cultural Production Under Colonial Rule: A Study of the Development Of Painting in Modern Andhra: 1900 To 1947” పేరుతో బి. సుధారెడ్డి గారు హైదరాబాద్ యూనివర్సిటీకి సమర్పించిన పరిశోధన పత్రం కంటబడింది. అందులో శిష్టు జగన్నాథం రిఫరెన్స్ ఉంది. జగన్నాథం చిలాన్ బందీతోపాటు థామస్ గ్రే రాసిన ప్రఖ్యాత ఎలిజీని కూడా అనువదించారని సుధారెడ్డి రాశారు.

ఈ ఎలిజీ ప్రస్తావన జగన్నాథం చిలాన్ బందీ ముందుమాటలో ఉంది. బైరన్ కృతి.. గ్రే ఎలిజీలాగే ప్రసిద్ధమని జగన్నాథం చెప్పాడే కానీ దాన్ని తాను అనువదించినట్లు అందులో లేదు. విలియం కూపర్ రాసిన ‘On the receipt of my mother’s picture’ను రాజమండ్రికే చెందిన ఆంగ్లోపాధ్యాయుడు వావిలాల వాసుదేవశాస్త్రి.. ‘మాతృస్వరూప స్మృతి ’ పేరుతో, టెన్నిసన్ రాసిన ‘Locksley Hall’, ‘Lotus Eater’ కవితలను మద్రాస్ కు చెందిన దాసు నారాయణరావు ‘కాముక చింతనము’, ‘విస్మృతి వృక్షప్రభావము’లుగా అనువదించినట్లు ఉంది. బైరన్ ఖైదీ తెలుగులోకి రావడానికి ముందు ఇలాంటి అనువాదాల నేపథ్యముందని, వీటికి ఆంగ్లవిద్యాభ్యాసం వంటివి కారణమని తెలుసుకోవడానికే ఈ వివరాలు. ఇంచుమించు ఇవి వెలువడిన కాలంలోనే వెలుగు చూసిన కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రకు మూలం ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘Vicar of the Wakefiled’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

‘చిలాన్ బందీ’పై ఇంకొంత సమాచారాన్ని ‘తెలుగు రచయితలు రచనలు’ సాయంతో కనుక్కున్నాను. ‘చింతామణి’ మాసపత్రికలో చిలాన్ బందీ ప్రస్తావన ఉన్నట్లు ఆ పుస్తకంలో ఉంది. జగన్నాథం ఊరినుంచే వెలువడిన చింతామణి 1894 సెప్టెంబర్ సంచికలో చిలాన్ బందీపై ‘కృతివిమర్శనము’ శీర్షిక కింద చిన్న సమీక్ష వచ్చింది. జగన్నాథం కాళికావిలాసం వంటి గ్రంథాలు రాసినట్లు సమీక్షకుడు ఏ.ఎస్(ఏ.సుందరరామయ్య) చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే.. ‘హూణభాషాకావ్యము నాంధ్రీకరించుట మిక్కిలి కష్టతరమైన పని.. అయినను శాస్త్రులవారు వారి శక్తి సామర్థ్యాదుల ననుసరించి చక్కగానే వ్రాసియున్నారు. శైలి మృదువై సులభగ్రాహ్యమై యున్నది. హూణులకును, ఆంధ్రులకును అభిప్రాయభేదము మెండుగావున హూణకవీంద్రుల యభిప్రాయములను తద్భాషాపరిచితేతరులకు దేటపడునట్లు మార్చుట సులభసాధ్యము కాకపోయినను గ్రంథకర్తగారు చేసిన భాషాంతరీకరణము కొంతవరకు దృప్తికరముగానే యున్నదనుట కెంతమాత్రమును సందియముండకూడదు..’ అంటూ అనువాదంలో తనకు నచ్చిన ఆరు పద్యాలను ఉదహరించారు.

2chianbandi cover
1890ల నాటి సాహిత్య పత్రికలను జల్లెడ పడుతుండగా.. మరో మాసపత్రిక ‘వైజయంతి’ 1894 నవంబర్ సంచికలో చిలాన్ బందీపై ఎన్.రామకృష్ణయ్య రాసిన పరిచయం దొరికింది. ‘పశ్చిమఖండకావ్యముల నాంధ్రీకరించుట కష్టసాధ్యమని యెల్లవారు నెఱింగిన విషయమే. అయినను శాస్త్రిగారు కూడినంతవఱకు శ్రమపడి మొత్తముమీఁదఁ దృప్తికరముగానే తెనిఁగించియున్నారు.. ఇది తిన్నగా సవరింపఁబడకపోవుటచే ముద్రాయంత్రస్ఖాలిత్యముల నేకము లగుపడుచున్నవి. .. గ్రంథకర్తగారి దోషములుగూడ నొకటిరెండు గానవచ్చుచున్నవి. గీ. లేదుకీడు విచారించి చూడఁజూడ. గీ. ముగ్ధతనుదాల్చి నిశ్చలతను వహించి. ఇత్యాది స్థలముల యతి భంగపెట్టిరి.. ముద్రాయంత్ర స్ఖాలిత్యమున నిట్లయ్యెనేమో..’ అంటూ పరిచయకర్త ‘ఛందోదోషాలు’ పట్టుకుని మూడు పద్యాలు పొందుపరిచారు. పోల్చడం అసంగతమైతే కావచ్చు కానీ, నామటుకు నాకు విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ నారికేళ పద్యాలకంటే, అంతగా కొరుకుడుపడని కొన్ని జాషువా పద్యాలకంటే ‘చిలాన్ బందీ’ పద్యాలు వందలరెట్లు సరళంగానే కాకుండా హృద్యంగానూ అనిపించాయి.

జగన్నాథం అనువాదం ముఖపత్రం, ముందుమాట, తప్పొప్పుల పట్టికలను వదిలేస్తే 24 పేజీల కావ్యం. మక్కికిమక్కి అనువాదంలా కాకుండా మూలంలోని సారాంశాన్ని ప్రాణవాయువులా శ్వాసిస్తూ, సమగ్రంగా సాగుతుంది. జగన్నాథం తొలుత బైరన్ ను ప్రశంసించి, మూలంలోని స్వేచ్ఛావర్ణన అందుకుంటాడు. అనువాదంలో నాకు నచ్చిన భాగాలను, వాటి మాతృకలను అందిస్తూ పరిచయం చేస్తాను. సౌలభ్యం కోసం అనువాదంలోని పదాల మధ్య విరామం ఉంచాను. ఛందస్సు వగైరాల వివరాల జోలికి పోలేదు.

మూలంలోని బైరన్ నాందీప్రస్తావన.
Eternal spirit of the chainless Mind!
Brightest in dungeons, Liberty! thou art:
For there thy habitation is the heart—
The heart which love of thee alone can bind;
And when thy sons to fetters are consigned—
To fetters, and the damp vault’s dayless gloom,
Their country conquers with their martyrdom,
And Freedom’s fame finds wings on every wind.
Chillon! thy prison is a holy place,
And thy sad floor an altar—for ’twas trod,
Until his very steps have left a trace
Worn, as if thy cold pavement were a sod,
By Bonnivard!—May none those marks efface!
For they appeal from tyranny to God.

బంధానీకము గట్టజాలని మనోభ్రాజిష్ఠనిత్యాత్మ! ని
ర్బంధంబేమియులేక క్రాలెడు ‘‘స్వతంత్రేచ్ఛ’’! కారానివే
శాంధబందుఁ బ్రకాశంబందెదవు నీయావాసమచ్చోఁ గనన్!
బంధాతీత హృదంతరంబగుటనిన్బంధంపవీబంధవుల్!

అట్టిదానిని బంధింపనలవియైన
దేమికలదు విచారింపనిలఁ ద్వదీయ
గాఢనిశ్చలబద్ధరాగంబొకండు
దక్క స్వేచ్ఛానుగామి స్వాతంత్ర మహిమ! !

భవదాత్మ ప్రభువుల్ స్వతంత్ర గరిమా! బద్ధాంఘ్రులై యార్దమై
పవలుగానని మిద్దెలో మెలగుచో బందీగృహాంధబునన్
భవదర్థంబగు హింసయే జయముగా భావంబునన్లోక మెం
చవియద్దేశమునింపెరవాయురయ పక్షశ్రేణినీకీర్తితోన్

పావనాలయమనీబందిగంబుచిలాన బలిపీఠమా నీదుపాడునేల
బావివర్డనునొక్క పావనపురుషుండు బహువత్సరములందు బాధఁబడియె
నడుగుల రాపిడినరుగునంఘ్రల చిహ్నమశ్మమయీస్థలినసటఁబోలి
దిగియంటునందాక తిరిగెనాతండట నుసురెల్లనచ్చటనుడిపి కొనుచు! !

అట్టి పదపద్మచిహ్నములణగి చెరగి
పోకనిలుచుండు గాతనే ప్రెద్దునచటఁ
గ్రుద్ధదుష్టాధిపాలక క్రూరకర్మ
నీశునకుఁ జూపియవి మొరలిడుచునుంట! !

.. బైరన్ భావతీవ్రతను జగన్నాథం ఛందోబంధనాల్లోనే ఎంత అలవోకగా పట్టుకున్నాడో చూడండి. Holy placeను పావనాలయమని, sad floorను పాడునేల అని సహజంగా మార్చేశాడు. Libertyని ‘‘స్వతంత్రేచ్ఛ’’ అని చెప్పడమే కాకుండా కోట్స్ లో పెట్టాడు. ఇది అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న భారతావని స్వేచ్ఛాభిలాషకు నిగూఢ నిదర్శనమా?

There are seven pillars of Gothic mould,
In Chillon’s dungeons deep and old,
There are seven columns, massy and grey,
Dim with a dull imprison’d ray,
A sunbeam which hath lost its way,
And through the crevice and the cleft
Of the thick wall is fallen and left;
Creeping o’er the floor so damp,
Like a marsh’s meteor lamp:

ప్రాచీనోన్నతకుడ్యసంవృత గుహాభ్రాంతిప్రభూతాఢ్యమై
యాచిల్లాన్ జెరసాల గ్రాలునటమధ్యన్ గొప్పనై తెల్లనై
తోచున్ స్తంభములేడు కోణములతోఁదోరంబులై చూడ్కికిం
దోచుంభానుకరంబొకండ సదుమైధూమక్రియంబదినాన్

మందమైనట్టికుడ్యంబుమధ్యమందు
బీటువారిన రంధ్రంబువెంటదూరి
మార్గమేదినకరంబు మసకకాంతి
చేతఁగను వెలుగొందెనాచెరగృహంబు

మిగులఁదేమగల్గు మేదినిపై ప్రాకు
లాడు తరణికిరణమచటనమరెం
బర్రభూమిమీదంబైనుండిపడియటఁ
గ్రాలురిక్కవెలుఁగు కరణిందోప

.. అంధకార బంధురమైన ఆ గుయ్యారంలోకి బీటువారిన గోడ రంధ్రంలోంచి ఓ సూర్యకిరణం దారితప్పి వచ్చింది. ఆ మసకకాంతిలోనే చెరగృహం వెలిగిపోయింది.

… Painful to these eyes
Which have not seen the sun so rise
For years—I cannot count them o’er,
I lost their long and heavy score
When my last brother droop’d and died,
And I lay living by his side.

భారంబులయ్యెఁ బ్రొద్దుపొడువన్ బహువత్సరముల్ గనుంగొనన్
దూరములైనపాడుకనుదోయికి నీదినముల్ గణింపగా
నేరను వత్సరంబులవి నేటికినిన్నిగతించెనందు నే
నారసిచెప్ప దీర్ఘగణనావళివిస్మృతి నొందిపోయినన్

లెక్కమరచితి నాతమ్ముండొక్కఁడుండి
కుందిమృతినొంది ధారుణిఁ కూలినపుడు
బ్రతికి జీవచ్ఛవంబనవానిప్రక్క
కదలనేరకపడియున్నకాలమందు

We could not move a single pace,
We could not see each other’s face,
But with that pale and livid light
That made us strangers in our sight:
And thus together—yet apart,
Fetter’d in hand, but join’d in heart,
’Twas still some solace in the dearth
Of the pure elements of earth,
To hearken to each other’s speech,
And each turn comforter to each
With some new hope, or legend old,
Or song heroically bold;

ఒక్కయడుగైనఁ గదలంగనోపలేము
కడగియన్యోన్యవదనముల్ గానలేము
మమ్ముగ్రొత్తఁగఁజూపు నామసకకాంతి
యచటలేకున్న వైవర్ణ్యమందియయిన

ఇట్లు కలిసియు మరియు ప్రత్యేకముగను
హస్తములఁగట్టుపడి హృదయములఁగలసి
యేకమైయటమెలగెడు నేముపుడమిఁ
బంచభూతాప్తికిని బేదపడితిమకట

ఆ దశనైననొండోరుల యార్తనినాదములాలకించి యా
శాదరవాక్కులాడి యితిహాసముఁ జూపి పురాణవీర గా
నోదయముల్ ఘటించి మరియొండొరుచిత్తములుల్లసిల్లఁ గా
నాదరఁమొప్పఁజేతు మదియాత్మవిషాదము కొంతవాపఁగన్

.. అన్నదమ్ములను ఒక్కో స్తంభానికి కట్టేశారు. స్తంభాలకు ఇనుపకడియాలు ఉన్నాయి. కడియాలకు గొలుసులు, వాటికి మనుషులు. అడుగు కదపలేరు. ఒకరిదగ్గరికొకరు వెళ్లి ఆప్యాయంగా చూసుకోలేరు. అయినా హృదయాలు మాత్రం కలసే ఉన్నాయి. ఒకరి ఆర్తనాదాలొకరు విని శాంతధైర్యవచనాలు చెప్పుకుంటున్నారు.

We heard it ripple night and day;
Sounding o’er our heads it knock’d;
And I have felt the winter’s spray
Wash through the bars when winds were high
And wanton in the happy sky;
And then the very rock hath rock’d,
And I have felt it shake, unshock’d,
Because I could have smiled to see
The death that would have set me free.

అనిల వేగోపహతినిర్మలాంబరమున
హిమతుషారంబుల చలివేళనెగసియాడఁ
గలుఁగు గొనగొనరొద రేపవలుచెలంగి
తలలపై మ్రోగనెడలేని యులివు వింటి

మీదఁబడఁగంటిఁ గడ్డీలమించివచ్చి
యపుడు చెరసాల యశ్మమెయల్లలాడె
నూపుదగిలియుఁ జలియింపకుంటిని మదిని
శ్రమవిమోచకమృతి సంతసంబునీదె

.. ఆ చెరసాల గోడలనంటి లెమాన్ అనే రమ్యసరోవరముంది. గోడపక్కనుంచి తరంగాలు బందీఖానాను చోద్యంగా పలకరిస్తుంటాయి. పెనుగాలి వీచినప్పుడు నీటితుంపర్లు జైల్లో విసురుగా పడుతుంటాయి. ఆ తాకిళ్లకు జైల్లోపలి గోడరాళ్లు అల్లాడతాయి. వాటి తాకిడి తగిలినా చలింపడు. వేదనను తీసేసే చావు సంబరమే కదా.

The flat and turfless earth above
The being we so much did love;
His empty chain above it leant,
Such Murder’s fitting monument!

వాని విడఁగొట్టు శృంఖలవ్రాతమరయఁ
బాతిపెట్టిన శవముపైఁ బడియటుండె
నరయనది దానిపై గోరియనఁబరగె
ఘోరహత్యార్హమైనట్టి గురుతనంగ

.. పెద్దతమ్ముడు చనిపోయాడు. అతన్ని బందిఖానాలో కాకుండా సూర్యరశ్మి తగిలే చోట ఖననం చేయాలని కథకుడు ప్రాధేయపడ్డాడు. వాళ్లు పరిహసించారు. తమ్ముడి గోరీపై అతని సంకెల ఆ దారుణానికి గుర్తుగా మిగిలింది. ఇక రెండో తమ్ముడి సంగతి..

With all the while a cheek whose bloom
Was as a mockery of the tomb
Whose tints as gently sunk away
As a departing rainbow’s ray;
An eye of most transparent light,
That almost made the dungeon bright;
And not a word of murmur—not
A groan o’er his untimely lot,—
A little talk of better days,
A little hope my own to raise,
For I was sunk in silence—lost
In this last loss, of all the most;
And then the sighs he would suppress
Of fainting Nature’s feebleness,
More slowly drawn, grew less and less:
I listen’d, but I could not hear;
I call’d, for I was wild with fear;
I knew ’twas hopeless, but my dread
Would not be thus admonishèd;
I call’d, and thought I heard a sound—
I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;

ఇట్టి దుర్దశనున్ననెవ్వాని చెక్కిళ్ళకెంజాయ గోరీకిఁ గేలియయ్యె
నిద్దంపు చెక్కిలి నిగనిగల్నిరసించెనింద్రాయుధస్ఫూర్తి యేపు తరిగి
మెల్లమెల్లఁబోవు మెలపునఁదళతళ మించుల కనుకాంతిమించి తొడరి
వెలిగించెఁ జెరసాల విస్మయంబుఁగనట్టి మానిసిసణుగుల మాటయొక్క
టైనబలుకఁడు నిట్టూరుపనైననిడడు
కనియునిట్టియకాలసంఘటన తనకుఁ
గలిగినను నూత్నవిశ్వాసబలముచేత
సహనముననోర్చె నెట్టికష్టములనైన

మంచిదినములుకలవన్నమాట కొంత
యడఁగు నాయాస నిలిపెడునాసకొంత
పలుకునాతఁడు గొణిగెడు పలుకుతోఁడ
మౌనమగ్నుఁడనై నేను మ్రానుపడఁగ

.. నిగనిగల బుగ్గల తమ్ముడు మనోవ్యథతో చిక్కిపోయాడు. అంత్యకాలం. నిట్టూర్పు సన్నమైంది. పిలిచినా పలకలేదు. అయినా భ్రాంతిపాశము వదల్లేదు.

I burst my chain with one strong bound,
And rushed to him:—I found him not,
I only stirred in this black spot,
I only lived, I only drew
The accursed breath of dungeon-dew;

గొప్పలంఘనమున నాదు గొలుసుఁ ద్రెంచి
కొనిరయోద్ధతిఁజనితినాతనిసమీప
మునకునైనను ఫలమేమి మున్నె కాలుఁ
డసవుఁగొనిపోయెనిఁకనటనాతఁడేడి

అక్కటా! వానిఁగనుఁగొననైతినెచట
నేనొకఁడనుంటిఁ జీకటినెలవునందు
నేనొకఁడనఁబ్రతికినేనొకండఁ
బాడుచెరతడిశ్వసనంబుఁ బడయుచుంటి

What next befell me then and there
I know not well—I never knew—
First came the loss of light, and air,
And then of darkness too:
I had no thought, no feeling—none—
Among the stones I stood a stone,
And was, scarce conscious what I wist,
As shrubless crags within the mist;
For all was blank, and bleak, and grey;
It was not night—it was not day;
It was not even the dungeon-light,
So hateful to my heavy sight,
But vacancy absorbing space,
And fixedness—without a place;
There were no stars, no earth, no time,
No check, no change, no good, no crime
But silence, and a stirless breath
Which neither was of life nor death;
A sea of stagnant idleness,
Blind, boundless, mute, and motionless!

చిత్తవృత్తి నశించెను జేష్టదక్కె
నింద్రియజ్ఞానమంతయునిమ్ముదప్పె
శూన్యమయ్యెను సర్వంబుఁజూడనచటి
రాలలోపల నేనొక్క రాయినైతి

మంచుముంచిన పొదలేనిమలలమాడ్కి
జ్ఞానమజ్ఞానమును రెండుగానకుంటి
సర్వమత్తరిశూన్యమై శైత్యమయ్యె
మరి వివర్ణముఁగాఁదోచె మానసమున

కనుఁగొననదినిశ కాదదిపవలును గాదు భారములైన కన్నులకును
భారమైతోచెడు కారాలయములోని కనుమాపుచూపు గాదు చూ
డ! నావరణము మ్రింగునాకాశశూన్యంబు స్థానంబునెరుగని స్థావ
రంబు లేవునక్షత్రముల్ లేదుధారుణితరి లేదువర్ణంబులు లేవులేవు

లేదు పరివర్తనము లేదులేదుమేలు
లేదు కీడు విచారించి చూడఁజూడ
మౌనమును మృతిజీవానుమానకుంభ
కంబునిశ్చల భావంబుఁగలియుండె

గాఢనిశ్చలజాడ్యసాగరమునందు
రూపమడఁగియపారమైనచూపుమాసి
ముగ్దతను దాల్చినిశ్చిలతనువహించి
యున్నట్లయ్యె నేనప్పుడున్నరీతి

.. తోడబుట్టినవాడొకడైనా మిగిలాడులే అన్నఆశతో జీవించాడు. అదీ పోయింది. మనిషి ఉన్నట్లుండి జడమైపోయాడు. చిత్తము చెదరింది. సర్వం శూన్యమైంది. రాత్రీపవళ్లకు తేడా తెలియకపోయింది. మౌనం కమ్ముకుంది.

A light broke in upon my brain,—
It was the carol of a bird;
It ceased, and then it came again,
The sweetest song ear ever heard,
And mine was thankful till my eyes
Ran over with the glad surprise,
And they that moment could not see
I was the mate of misery;
But then by dull degrees came back
My senses to their wonted track;

కలకలరవములఁబలుకులు
చిలుకుచు వ్యధఁజెందునాదు చిత్తంబునకున్
వెలుఁగిడువిధమునఁ దెలివిడు
పులుగొక్కటి వచ్చె గానములు విలసిల్లన్

గానమప్పుడు విరమించెఁ గ్రాలెమరల
వీనులెన్నడునటువంటి వింతమధుర
గానమాలించి యెరుగవు గానఁగనులు
హర్షవిస్మయములఁగృతజ్ఞాంచితముగ

And song that said a thousand things,
And seemed to say them all for me!
I never saw its like before,
I ne’er shall see its likeness more:
It seem’d like me to want a mate,
But was not half so desolate,
And it was come to love me when
None lived to love me so again,
And cheering from my dungeon’s brink,
Had brought me back to feel and think.
I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!

ఆసంగీతము వీనుదోయికొసగెన్ హర్షంబు వేసుద్దులన్
భాసిల్లంబ్రకటించెనాకొరక చెప్పందల్చెనోయేమొకో
యీసాదృశ్యముగల్గు పక్షినిలమున్వీంక్షింపఁగాలేదికే
వాసంబందునఁగాననంచుమదిలోఁ బల్మారునేఁదల్చితిన్

అదియు నావలె సహవాసినాత్మఁగోరి
వెతకుచున్నట్లుతోచె నామతికిగాని
నేనుబడ్డట్టికష్టార్ధమైనఁగాని
పొందకుండటనిక్కమాపులుగురేడు

ననునిలపైఁబ్రేమించెడు
జనులెవ్వరులేరటన్నసౌహృదభావం
బునను బ్రేమించుటకై
చనుదెంచెంబోలుఁ బక్షిచంద్రంబటకున్..

.. ఆ పిట్ట చెరచివర కూర్చుని పాటలుపాడింది. ఖైదీకి ఉత్సాహమొచ్చింది.

I know not if it late were free,
Or broke its cage to perch on mine,
But knowing well captivity,
Sweet bird! I could not wish for thine!

…. దానిని విడిచిరో తప్పించుకొని పంజరమునుండి నా పంజరమునవ్రాల
వచ్చెనోగాని యెరుగనువాస్తవంబు
చెరవిధంబెల్లబాగుగఁజిత్తమునకుఁ
దెలసియుండుట నీకదివలదటంచు
బుద్ధింగోరెదనించుల పులుగురేడ

Or if it were, in wingèd guise,
A visitant from Paradise;
For—Heaven forgive that thought! the while
Which made me both to weep and smile—
I sometimes deem’d that it might be
My brother’s soul come down to me;
But then at last away it flew,
And then ’twas mortal well I knew,
For he would never thus have flown—
And left me twice so doubly lone,—
Lone as the corse within its shroud,
Lone as a solitary cloud,
A single cloud on a sunny day,
While all the rest of heaven is clear,
A frown upon the atmosphere,
That hath no business to appear
When skies are blue, and earth is gay.

అదిచూడ దివినుండి యాకాశపధమునఁ బక్షివేషముదాల్చివచ్చినట్టి
అలపరామర్శికుఁడని మదిభావింతుఁ గడచన్నమద్భ్రాత గరుణ న
న్నుచూడంగ దిగివచ్చినాడేమొయని కొన్నిమారులు దలచితిని మన
మునందు, దుఃఖంబుహర్షంబుఁ దోచునుఁదోడుగ నామాటమదికె
కిక్కినప్పుడెల్ల! !

దేవ క్షమియింపుమామాట తెలియకంటి
బారిపోయెనుఁదుదకు నాపక్షియప్డు
మర్త్యఖగమని దృఢముఁగ మదికిఁదట్టె,
కాదో విడనాడి చనునెయాకరణి మరల

నన్నురెండవపరియిట్లు ఖిన్నుఁజేసి
మరలనొంటరిగాఁజేసి మరలఁడఁతడు
పాడెపైబెట్టినట్టి శవంబనంగ
నొక్కఁడనయుంటి నక్కడనుక్కుదక్కి..

.. కొన్నాళ్లకు బందీ అవస్థ చెరపాలకుల్లో మార్పుతెచ్చింది. సంకెలను విడగొట్టారు. ఖైదీ అటూ టూ తిరిగాడు..

Returning where my walk begun,
Avoiding only, as I trod,
My brothers’ graves without a sod;
For if I thought with heedless tread
My step profaned their lowly bed,
My breath came gaspingly and thick,
And my crush’d heart felt blind and sick.

మరియుఁదిరుగుచు ననుజసమాధియుగము
మట్టిచెక్కైన లేకుండవట్టిగుంట
దానిపై కాలుబడనీక తడవితడవి
కడగి తప్పించితిరిగితిఁ గతమువినుడు

కడుఁబరాకున నాకాలువడనపూత
మౌనుగద వారి భూశయ్యలనుతలంపు
లపుడు గలిగించునెగరోజునవిళరముగ
నంధమయమయిభ్రమనొందు నాత్మవిరిగి

.. తొట్రుపడుతూ తమ్ముళ్ల సమాధుల వద్దకు వెళ్లాడు. పల్లంగా ఉన్నాయి. పరాకున వాటిపై కాలుపడితే అపవిత్రమవుతాయని జాగ్రత్తగా అడుగులు వేశాడు. దుఃఖంతో ఆత్మ విరిగిపోయింది.

My very chains and I grew friends,
So much a long communion tends
To make us what we are:—even I
Regain’d my freedom with a sigh.

కాళ్ళబిగఁగొట్టినట్టి శృంఖలము నేను
సహచరత్వముంబుఁ గంటిమి సాహచర్య
దైర్ఘ్యముననుంటనిట్టి తాత్పర్యమబ్బె
విడుదలైనను నిట్టూర్పు విడచికొంటి

.. మనోదేహాలు ఛిద్రమైపోయాక దక్కిన స్వేచ్ఛ ఇది. ఇది ఒక్క చిలాన్ బందీ వేదనేకాదు, లోకపుటన్యాయాలను ప్రశ్నించి చెరసాలల పాలైన ప్రతి ఒక్కరిదీ. తళతళమెరిసే తమ కళ్లలోని స్వేచ్ఛాకాంతితో చీకటిజైళ్లను వెలిగించి, జైలుబయట ఉషస్సులను, వసంతాలను నింపిన వాళ్లందరిదీ.

–పి.మోహన్

P Mohan

(చిలాన్ బందీ తెలుగు అనువాదాన్ని ఈ లింకులో చూడొచ్చు. http://archive.org/search.php?query=chilabandi%20anubhraatrxsauhrxdamu)

మీ మాటలు

 1. కల్లూరి భాస్కరం says:

  మంచి పరిచయం. చాలా ఆసక్తి కలిగించింది. 19వ శతాబ్దికి చెందిన, ఇప్పటివారికి తెలియని ఒక అప్రసిద్ధ అనువాద కావ్య పరిచయం కావడం ఒక కారణం. మీరు అన్నట్టు అనువాదం కూడా మూలంలోని భావస్ఫుర్తికి తగినట్టు ఉండడం ఇంకో కారణం. వెనకటి శతాబ్దాలలో ప్రసిద్ధ ఆంగ్ల కవుల కవిత్వానికి తెలుగు అనువాదాలు చాలానే వచ్చినట్టు ఉన్నాయి. వీటిని ఒకచోట చేర్చి, వీటికి సంబంధించిన సాహిత్య చరిత్రను ఎవరైనా రాసారో లేదో తెలియదు. సాహిత్య చరిత్ర కోణంలో ఇదొక విలువైన పరిశీలన అవుతుంది. అలాగే మీ వ్యాసం కూడా. అభినందనలు.

 2. N Venugopal says:

  మోహన్

  ఎంత బాగుందో…. చాల చాల సంతోషం. అభినందనలు, ధన్యవాదాలు.

  నీలో కళా విమర్శకుడు, కళా ప్రేమికుడు తెలుసు గాని ఇంత లోతయిన చరిత్ర – సాహిత్య చరిత్ర పరిశోధకుడు ఉన్నాడని తెలియడం మరింత ఆనందం.

 3. భాస్కరం గారికి, వేణు గారికి ధన్యవాదాలు.
  మరుగున పడిపోయిన ఇలాంటి పుస్తకాలు చాలా వున్నాయి. మన వర్సిటీలు దృష్టి పెట్టాలి. అందరికీ పనికిరాకున్నా చరిత్ర రికార్డు కావాలి కదా. పైగా మతం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రకు మసిపూస్తున్న రోజులివి.

 4. మీ వచనం ఎంతో బాగుంటుంది . నాలా నేర్చుకోవాలనీ తెలుసుకోవాలనీ అనుకునేవారికి మీ రచనలు పాఠ్య పుస్తకాల్లా ఉంటాయి . ఒక ప్రాచీన కావ్య పుష్పాన్ని సుగంధీకరణం చేసినందుకు ధన్యవాదాలు .

  • భవాని గారికి ధన్యవాదాలు.
   నేను కూడా మీలాగే నేర్చుకుంటున్న, తెలుసుకుంటున్న వాడినే. నా రచనలు మరీ అంత గొప్పవి ఏం కావండి. నాలుగు కొత్త విషయాలు తెలుసుకుని, నలుగురితో పంచుకోవాలన్న తపన.. మీలాంటి వారి మెచ్చుకోళ్ళు కొండంత బలం.

మీ మాటలు

*