ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!

రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు రోజు కుంతల జలపాతం ప్రయాణం. బుల్లి బస్సులో గలగలా ఉన్నారు మనుషులంతా. పచ్చని చిక్కని అడివిలో ప్రయాణం హాయిగా సాగింది. దారిలో నిర్మల్ లో బొమ్మల కోసం దిగాం. డాక్టర్ కేశవరెడ్డి నిజామాబాద్ లోనే కదా ఉండేది, ఇంత దూరం వచ్చి కలవకుండా ఎలా?

అలసిపోయిన చాలా మంది బోధన్ వెళ్ళిపోయారు. నేనూ, నరేంద్ర, సడ్లపల్లి చిదంబరరెడ్డి, నంద్యాల శ్రీనివాసులురెడ్డి, బత్తుల ప్రసాద్, గొరుసు జగదీశ్వరరెడ్డి, శిరంశెట్టి కాంతారావు నిజామాబాద్ వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాం. విష్ణు తనూ వస్తానంది. బస్సులోంచి మేం మాత్రం ఒక కారులోకి మారాం. ఫోన్ లో అడ్రస్ కనుక్కుని వెతుక్కుంటూ వెళ్ళాం . చదవడమే తప్ప నేను అప్పటిదాకా కేశవరెడ్డిని చూడనేలేదు. ఉద్వేగభరితంగా పేజీల వెంట పరుగులు తీయించే అరుదైన తెలుగు రచయితని కలుసుకోబోతున్న ఉత్సాహం. ఏం మాట్లాడాలి?

స్నేహితుల మధ్య..

స్నేహితుల మధ్య..

మాలో చాలా మందికి ఆయనతో పరిచయం బానే ఉంది. మాటలు అవే దొర్లుతాయి. కరెంటు స్తంభం పక్కన కారు ఆగింది. పాత అపార్ట్ మెంట్..పాత ఇల్లు..కొంత దుమ్ముబారినట్టున్న అరలు..లోపల పాతబడిన పుస్తకాలు.. కుర్చీలో కేశవరెడ్డి. గళ్ళ లుంగీ, అరచొక్కా. పలచగా తెల్లని పోచల్లా తల మీద మిగిలిన వెంట్రుకలు.. ఎందుకో చూడగానే కొంచం దిగులుగా అనిపించింది. పొడి నవ్వుతో పలకరించారు. కొంచం మొహమాటంగా కనిపించారు. భార్యను పరిచయం చేశారు. ఇదంతా ఆయన స్వభావం.

అక్షరాల్లోనూ ఆయనేం ఆడంబరంగా ఉండరు. ఆయన రచనల్లోని ఒక పాత్ర లాగే కనిపించారు కేశవరెడ్డి నాకు. ఒక రైతు, ఒక యానాది, మనేదతో తనతో తనే మాట్లాడుకునే ఒక స్త్రీ. వీళ్ళంతా కేశవరెడ్డేనా?! బహుశా వీళ్ళలో చాలా పాళ్ళు ఆయనే కావచ్చు.

కేశవరెడ్డి పాత్రలు వెంటాడుతూ ఉండేది అందుకే. కథకీ, నవలకీ మధ్య ఎక్కడో ఒక గీత గీసుకుని రాసుకుంటూ పోయాడు ఆయన. చిత్తూరు జిల్లా తలపులపల్లె లో పుట్టి, ఈ పరిసరాల్లోనే పెరిగి, పాండిచ్చేరిలో చదువుకుని డాక్టరై, డిచ్ పల్లిలో వైద్యం చేసిన ఈయన మాటల్లో, వాక్యంలో ఈ ప్రయాణం ప్రభావం ఉంటుంది. ఇష్టంగా చదువుకున్న ఆంగ్ల రచనలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నాయి. పాత్రలు చిత్తూరు జిల్లా పల్లెలోనే ఉన్నా, కథా ఇక్కడే నడిచినా, నడకలో తేడా అందుకే అనిపిస్తుంది. కేశవరెడ్డి పుస్తకం తెరిస్తే, ఇంటర్ లో మధుబాబునో, ఇంకా ముందు జానపద కథలనో, ఇంకా కొంచం ముందు చందమామనో పట్టుకున్నట్టే.

ఎన్నడూ చూడకపోయినా ఆయన నన్ను గుర్తుపట్టారు. బిస్కెట్లు, టీలు, అందరికీ చాలినన్ని కుర్చీల కోసం వెతుక్కోవడం, దుమ్ము దులిపి, కడిగి కప్పుల్లో టీ అందించడం…ఎందుకో ఇష్టంగా అనిపించింది. నలుగురు వస్తే, ఒక స్టూలునో, కుర్చీనో, మంచాన్నో లాక్కుని సర్దుకుని కూర్చునే ఊళ్ళోని మా ఇల్లే ఇది. పరిసరాలు సహా ఆయనా, ఆమె కూడా పరిచయం లేనివాళ్ళలా కనిపించలేదు.

మాటలు నడిచేకొద్దీ ఆయన ఇంకా దగ్గరవుతున్నట్టనిపించింది. పొడి మాటలే గానీ, చతురమైన వాడే! వైద్యం వల్ల తల ఇట్లా తయారైందని చెప్పారు. ఆ మాటల్లో ఎక్కడో ఒక నిర్వేదపు గీర. ఇంతలో డాక్టర్ నక్కా విజయరామిరెడ్డి వచ్చారు. కేశవరెడ్డి మీద ఎంతో శ్రద్ధ. కొడుకంత బాధ్యతగా కనిపించాడాయన. ఒక గంట గడిపి బోధన్ కి బయలు దేరాం గానీ, దిగులు దిగనేలేదు. పుస్తకాల సభకి ఆయన రానేలేదు.
ఫిబ్రవరి 13న ఉదయం నరేంద్ర ఫోన్.. మునిసుందరం గారు చనిపోయారని. కోటకొమ్మల లేఅవుట్ ఇరుకు సందులోని ఆయన ఇంట్లోనే గాజుపెట్టెలో ఆయన. కాసేపు అక్కడే తచ్చాడి, ఆఫీసుకి రాగానే, మళ్ళీ నరేంద్ర ఫోన్..ఇంకో బ్యాడ్ న్యూస్ అంటూ.

ఒకే రోజు చిత్తూరు జిల్లా రచయితలు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఒకరు ఇక్కడ. ఇంకొకరు నిజామాబాద్ లో, జ్ఞాపకాలుగా మారిపోయి.

-ఆర్. యం.ఉమా మహేశ్వర రావు 

మీ మాటలు

  1. kandukuri ramesh babu says:

    వైద్యం వల్ల తల ఇట్లా తయారైందని చెప్పారు. ఆ మాటల్లో ఎక్కడో ఒక నిర్వేదపు గీర.

  2. paresh n doshi says:

    అద్రుష్టవంతుడివి ఉమా, ఆ మహానుభావుడిని కలవగలిగావు. Unique story teller he was.
    RIP Kesava Reddy.

  3. ఎందుకో కొందరు రచయితలు తల్లి తండ్రుల కంటే మిక్కిలి గా అని పిస్తారు. అందులో కేశవ రెడ్డిగారొకరు.వ్యాసం ఆర్తిగా వుంది.

  4. srinivas reddy.gopireddy says:

    చిన్న అచ్చు తప్పు ఉమా గారూ,వారు నక్కా విజయరామ రాజు గారు.చదువుతుంటే ఆర్ద్రం గా ఉంది.నాటి సంఘటనల్లో నేనూ మీతో ఉండటం వాళ్ళ ఆ రోజును మరోసారి గుర్తు చేసుకున్నాను.

  5. ఉమా ఆర్ద్రంగా ఉంది

  6. ఆది శేషయ్య says:

    చాలా ఉద్వేగ పూరితమైన అనుభవం సార్.

Leave a Reply to paresh n doshi Cancel reply

*