ఆ అడివిలో వెన్నెలా వుంది!

10979273_10205663055756776_1692790498_n

లోగో: బంగారు బ్రహ్మం

 

అప్పుడప్పుడు వాక్యం తడబడుతుంది. గడబిడిగా నడుస్తుంది. వదులుగా వేలాడుతుంది – కాని వాక్యం యెప్పుడూ తడబడకుండా గడబిడిగా నడవకుండా వదులుగా వేలాడకుండా వుంటుందో ఆ వాక్యమే కేశవరెడ్డి గారిది. యెండలో తడిసిన రానెస్, వర్షంలో ఆడిన ఫ్రెష్ నెస్, మంచులో మునిగిన తేమ నిండిన అతని వాక్యం మనలని చుట్టుకుంటుంది. వాక్యాలు వాక్యాలుగా చుట్టుకుపోతుంది. అతని వాక్యాలని మనం వదిలించుకోలేం. పెనవేసుకోనూలేం. వుక్కిరిబిక్కిరవుతాం. మళ్ళిమళ్ళి కావాలనిపించే సొగసుకాఠిన్యం పెనవేసుకున్న ఆ వుక్కిరిబిక్కిరి రాతగాడు మనలని అడవులని జయించమంటారు.

కనిపించినవాటినల్లా  పిప్పరమెంట్స్ లా చదివే అలవాటున్న నాకు వొక రోజు మా యింటి లైబ్రెరిలో అనుకోకుండా వో రోజున వో పుస్తకం చేతుల్లోకి తీసుకొన్నాను. ఆంధ్ర పత్రిక లో సీరియల్ గా వచ్చినప్పటి కాగితాలని చక్కగా కుట్టి మామిడిపండు రంగు అట్ట వేసుంది. పుస్తకం పైన ‘అతడు అడివిని జయించాడు’ అని పైన నీలి సిరాతో గుండ్రని చేతిరాత. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. చాల యిష్టాన్ని పుట్టించాయి. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. వాటిని అలానే వెయ్యాలని ప్రయత్నిస్తూ వో రెండు రోజులు గడిపాను. చదవటం వదిలేసి- అసలు యింత అందమైన బొమ్మలున్న యీ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్ళి చదివాను. యిప్పటిలానే నన్ను అడివి వెన్నెల పట్టుకున్నాయి.

చలం గారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింత చెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాన్నపు  యెండ మైమరపించినట్టుగా యిప్పుడు ఆ అడివిలో వెన్నెల్లోని నడకలు  భలే హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డి గారు పరిచయం అవ్వగానే ‘ ఆ వెన్నెల అడివి భలే రాసారు’ అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. మళ్ళి నవ్వారు. నవ్వటం ఆపి ‘ యింత అందంగా, కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరు చెప్పలేదు. యిప్పటి వరకు అంతా చాల గాంభీర్య మైన ఫీడ్ బ్యాక్ చెప్పారు. కుప్పిలి పద్మ అంటేనే అడివి, వెన్నెల, మంచు పువ్వులు, వాన ‘అని నవ్వారు. నేను నవ్వాను. అది మొదటిసారి కలిసినప్పటి సంభాషణ.

కేశవరెడ్డి గారి  యే నవల్లోనైన యితివృతం యీ సమాజం పెద్దగా పట్టించుకోని మనుష్యులు, వర్గాలు, ప్రాంతాలు, వృత్తులు. మనకి అసలు పరిచయం లేని సమాజపు వ్యక్తులు కావొచ్చు లేదా కొద్దిపాటిగా తెలిసిన జీవితాలు కావొచ్చు. కాని మనం ఆయన రచనలు చదివితే ఆ మనష్యులు మన మనుష్యులైపోతారు. ఆ అనుభవాలన్నీ మనవైపోతాయి. నవలలు, కొన్ని కథలు అని లెక్కలు తీయవచ్చు కాని ఆయన వొక నవలనో కథనో రాయరు. రాయలేదు. జీవితాలని ఆవిష్కరించారు . కులం మతం వర్గం వృత్తి, ప్రాంతాల నడుమ మనుష్యుల జీవితానుభవాల వైవిధ్యాల నీడల్ని ఛాయల్ని మన చూపులకి వినమ్రంగా సమర్పిస్తారు. ఆ యా జీవితాల్లోని అంతర్గత సంఘర్షణలు బహు పార్శ్వాలుగా మన మనో రెక్కలపై వాల్తాయి. అవి మనలని సమీపించగానే మనం మనంగా వుండం. వుండలేం. యిలాంటి సమర్పణ అందరు చెయ్యలేరు.

అనేకంగా కనిపించే యింత పెద్దప్రపంచంపు జీవనసారపు అంతస్సారం వొక్కటే అనే అపారమైన అర్ధవంతమైన మానవీయమైన తాత్వికత వుంటేనే అలా సమర్పించగలరేమో… మనకి ఆ పాత్రల ఆలోచనలు, ఆశలు, కోరికలు సమస్త భావోద్వేగాలు వాటి స్వభావస్వరూపాలు అన్ని అర్ధమైపోతున్నట్టే వుంటాయి. అంతలోనే అర్ధం కానట్టనిపించి అసలు ఫలానా పాత్ర యేమంటుంది… యిలా అనలేదా అనిపిస్తుంది. మళ్ళి మరోలా అనిపిస్తుంది. ‘రాముడుండాడు రాజ్జి వుండాది’ చివరి గుడిసె ‘ మూగవాని పిల్లన గ్రోవి, ‘మునెమ్మ’ యే నవలైనా సరే చదువరి యిమేజినేషన్ కి బోలెడంత స్పేస్ యిచ్చిన రచయత కేశవరెడ్డి గారు. అలానే విషయం ఏమైనా కావొచ్చు ఆయన యెప్పుడు ఆ  అంశాలకి సంబంధించిన యీస్థటిక్స్ ని అలవోకగా గుమ్మరించారు. తను తీసుకున్న జీవితాల పట్ల తను నమ్మిన సారవంతమైన సమాజం పట్ల వొక నిబద్ధత వుండటం వల్లే ఆయన రచనలు జీవితాలకి దగ్గరగా వుంటాయి. కొన్ని సందర్భాలల్లో రస్టిక్ బ్యూటీతో మనలని మెస్మరైజ్ చేస్తుంటాయి.

యిలా యెన్నెన్నో విషయాలు కేశవరెడ్డి గారి రచనల్లో నల్లని నీళ్ళ ప్రవాహంలా జరజరా పారుతుంటాయి.

యివన్ని వొక ఎత్తు అయితే,  కేశవరెడ్డి గారికి సినిమాల పై బోలెడంత యిష్టం, ఆసక్తి వున్నాయి. అప్పుడప్పుడు ఆ విషయాలని మాట్లాడుకొనేవాళ్ళం. ‘చిక్కని స్క్రీన్ ప్లే రైటర్ మీరు’అన్నానోసారి. అప్పుడు మాత్రం కేశవరెడ్డి గారు సినిమాలు సినిమా కథలు స్క్రీన్ ప్లే యిలాంటి విషయాలపై ఆగకుండా మాటాడేవారు. సంభాషణ చక్కగా సాగేది. ఆయన రెండు నవలలూ   త్వరలో సినిమాలుగా రూపొందుతాయని ఆశ. తన రచనల గురించి కానీ  తన ఫలానా నవల చదివేరా అని కానీ  ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్ట మైన సుసంపన్న మైన రచయతతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ళ మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం  నేను చూడలేదు. వినలేదు.

నేను కొత్తగా రాస్తున్నప్పుడు తను చదివినప్పుడు కేశవరెడ్డి గారికి నచ్చితే ఆ విషయం చెప్పేవారు. అంత పెద్దాయన చెపితే యెంత సంతోషంగానో అనిపించేది. ‘మైదానం’ కాలమ్ బాగుంది, కొత్తగా అన్నారు. ఆయనెప్పుడూ కొత్తగా express చెయ్యాలనే వారు. కొత్త గా చెప్పేవి ఆయనకి చాలా నచ్చుతాయి. అలా యిప్పటికి ఆయన కొత్త రచయితలవి చదివినప్పుడు నచ్చితే ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ మధ్య సామాన్య  ‘మహిత’ గురించి చెప్పారు. సంతోషాన్ని, బలాన్ని యిచ్చే మంచిని వొకరి నుంచి మరొకరికి మృదువైన మంచి నీటి ప్రవాహంలా ప్రవహించాలని నమ్మే నేను ఆ విషయం ఆమెకి చెప్పాను.

కేశవరెడ్డి గారు నన్ను అప్పుడప్పుడు ఆశ్చర్యఆనందాలకి లోనుచేసేవారు.’ యే అడివి వెన్నెలా మీరు రాసింది’ అని అడిగాను వొకసారి. ‘మీరు చూసిన అడివి వెన్నెల చెప్పండి’ అన్నారు కేశవరెడ్డి గారు. నన్ను మేస్మరైజ్ చేసిన వో అడివిలో వెన్నెలని ఆయన ముందు మాటలతో కుప్పపోసేను. ఆయన తనెప్పుడు అడివిలో వుండి వెన్నెలని చూడలేదన్నారు. ‘నిజమా’ అంటే చిన్నగా నవ్వేరు.

కేశవరెడ్డి గారు అప్పుడప్పుడు ‘మా వూరిలో వెన్నెల వచ్చింది.’- ‘ మీరు మీ వూరి వెన్నెలతోనే వున్నారా’ అనో ‘వెన్నెల్లాంటి మీ అక్షరాలని చదివాననో ‘ యిలా పలకరించేవారు. పోయినసారి కేశవరెడ్డి గారు ‘ వూరు వూరంతా వెన్నేలేనండి. మీరు వెన్నెల్లో వున్నారా?’ అని పలకరించారు. ఆ రోజు వాసంతోత్సవం. నేను ఫాం హౌస్ లో వున్నాను. అవునండి యిక్కడ తెల్లగులాబీల నిండుగా వెన్నేలేనండి ‘ అని చెప్పాను. ‘చూడండి ‘ నేను రాసిన అడివిలో వెన్నెలకంటే బాగుంది కదా… నిజానికి మీరు రాసే వెన్నెలా ,వాన నాకు నచ్చుతాయి’ అన్నారు కేశవరెడ్డి గారు. వో అద్భుతమైన తన రచనలో అడివిలో వెన్నెల బాగుంది అని అమాయకంగా చెప్పటం ఆ విశిష్ట మైన రచయిత యెప్పుడు మరచిపోలేదు. తన రచనల నిండుగా యెవ్వరు పట్టించుకోని సమాజం వైపు స్థిరంగా నిలబడిన కేశవరెడ్డి గారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా.

నమస్సులు కేశవరెడ్డి గారు.

-కుప్పిలి పద్మ

Kuppili Padma Photo

మీ మాటలు

 1. కేశవరెడ్డి గారి గురించిన రచన ఇంకా రాలేదేంటా సారంగలో అనుకుంటున్నాను . పద్మ గారూ ఓ జ్ఞాపకంలో కూడా మీరు ఒంపిన ఇంత భావుకత నిజంగా అడవిలో కాసిన వెన్నెలంత నిండుగా ఉంది. వాక్యాలతో వెన్నెల్లు సృష్టించిన ఒక గొప్ప రచయిత వెలిగి ఆరిపోయినందుకు ఎంతో బాధగా ఉంది .

  • Kuppili Padma says:

   Thank you Bhavani garu. మనం మళ్ళిమళ్ళి కేశవ రెడ్డి గారిని చదువుకుంటుండటమే మనం చెయ్యగలిగేది.

 2. తిలక్ బొమ్మరాజు says:

  నిజంగా నిండు వెన్నెల్లా ఉంది మీ ఆర్టికల్ కుప్పిలి పద్మ గారు.
  ఈ వ్యాసం చదివాకా ఇప్పటి వరకు కేశవ రెడ్డి గారి సాహిత్యాన్ని చదవనివాళ్లకి చదవాలనిపించేట్టు ఉంది.ఆయన సాహిత్యాన్ని చదువుకున్న వాళ్ళు మళ్లీ తిరిగి మరొక్కసారి తప్పకుండా చదవాలనిపించేట్టు ఉంది.

 3. c.v.suresh says:

  కేశవరెడ్డి రచనల్లో అ౦తా౦తర౦గాల్ని పరిశోధి౦చి , పరిశీలి౦చి రాసిన వాఖ్యాన౦. చాలా లోతైన విశ్లేషణ….అభిన౦దనలు పద్మ జి

 4. varma.kalidimdi says:

  ధన్యవాదాలు మంచి వ్యాసం

 5. గొప్ప రచయితకి తగ్గ సంస్మరణ వ్యాసం. కేశవరెడ్డి గారి రచనల గురించి మరింత చర్చ జరగాలి. చాలా నవలలు ప్రపంచస్థాయి సినిమాలుగా రాదగ్గ కంటెంట్ ఫాం ఉన్న నవలలు. సినిమాలుగా రూపుదిద్దబడాలి.

 6. పద్మ గారు
  మీ రచనలో కేశవరెడ్డి గారి నవల్లోని భావుకతను ఆనవలల్లో ఆయన ప్రదర్శించిన శిల్పనైపుణ్యాన్ని అద్భుత
  ఆవిష్కరించారు మీదైన శైలితో.ప్రతి నవల మీద ఒక వ్యాసం రాయండి.అభినందనలు

  • Kuppili Padma says:

   Thank you rajaram.t.garu. ప్రతి నవల మీదా రాయమన్నారు. ప్రయత్నిస్తాను.

 7. వెన్నెలంత చక్కని వ్యాసం పద్మ గారూ. ధన్యవాదాలు.

 8. ఆయనన్నది నిజం. ఆ నవల గురించి ఎప్పుడూ బరువైన మాటలే కానీ ఇంత అందమైన మాటలు విని ఉండలేదు. భావకురాలంటే మీరే సుమీ :) అతను ఒంటరిగా ఆ అడివిలో వెన్నెలను అనుభవించడం అనే ఆలోచనే ఎంతో బావుంది!
  థాంక్స్ అగైన్!

 9. నిశీధి says:

  మీ మాటల్లో అయన మళ్ళీ తిరిగోచ్చినట్టుగా ఉంది . కుడోస్

 10. kandukuri ramesh babu says:

  ఆయనెప్పుడూ యెదుటివాళ్ళ మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం నేను చూడలేదు. వినలేదు. థాంక్స్ ఫర్ రైటింగ్ సుచ్ ఆ బ్యూటిఫుల్ అబ్సర్వ్.

  • Kuppili Padma says:

   అవును రమేష్ గారు, ఆయన చాలా మృదువైన వ్యక్తి. Thank you.

 11. మనం జీవితమ్ గురించి తత్వాన్వేషణ చేస్తూ ఏ హిమాలయ పర్వాతాల్లోనో కూర్చొని తపస్సు చేస్తూ ముని పుంగ వులవాల్సిన అవసరం లేదు. ఏ బాబాల పంచనో చేరి ఆయన కాల్మొక్కుతూ, ఆయనకు చేవ చేస్తూ జీవిత మంటే ఏమిటి స్వామీ! అని అడగక్కరలేదు. కేశవ రెడ్డి గారి నవలలు చదివితే చాలు పమ్డు వలిచి చేతిలో పెట్టి నట్లు అందు లోని సుఖం దుఖం, మంచి చెడు ఇట్టే అర్ధ మయి పోతాయి. జీత లోతుల్ని ఇట్టే కనిపెట్ట వచ్చు.
  ఆయనకు నివాళులు అర్పించిన పద్మ గారి వ్యాసం అంటే అద్బుతంగా వుంది. ధన్య వాదాలు.

 12. prasadamurty says:

  సమాజం పట్ల ఎంతో నిబద్ధత వున్న రచయిత గురించి మీరు కురిపించిన జ్ఞాపకాల వెన్నెల హాయిగా వుంది. సూర్యుడు మీద చందమామ రాసినట్టుగా వుంది. మంచి ట్రిబ్యూట్

 13. Krishna Veni Chari says:

  A fitting tribute to a great author.

 14. వారి నవలల్లోని ఉధృతమైన భావావేశం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

 15. B.Narsan says:

  కేశవరెడ్డిగారి మరణం తర్వాత వచ్చిన వ్యాసాల్లో అత్యధికం, వ్యాసకర్తలు ఆయనతో తమకున్న విశిష్ట పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు, మనతో పంచుకున్నారు కాని, ఆయన రచనలలోని విశిష్టతను తట్టి మన మనసులను తడిపిన వాక్యాలు పద్మగారివి.
  కేశవరెడ్డిగారు గొప్ప వ్యక్తిగా, గొప్ప రచయితగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉంటారు.

మీ మాటలు

*