ప్రేమోత్సవం

                               1797324_1554574958090172_7329323992269709774_n

సాంధ్య రాగం పిలిచే వరకూ

సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి

 

ఆకాశాన్ని ప్రేమిస్తూ

తన ఆరాధనంతా పూవుల్లోనో, పళ్ళలోనో

ఏదీ లేకుంటే తన దేహంలోనో నింపుకుని

ప్రేమకి నిర్వచనమవుతుంది చెట్టు

 

రాళ్ళని అలంకరించే సెలయేట్లోనూ

విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ

మట్టి పొత్తిళ్ళలో గుర్తింపుకి నోచుకోని చిట్టి రాళ్ళలోనూ

అన్నిట్లోనూ ప్రేముంది.

కారణాల్లేకుండానే ప్రేమ పంచగల దమ్ముంది.

 

మనిషికి మాత్రం

కాలమంతా ప్రేమమయం కావాలనేమీ లేదుగానీ

నియంత్రిత నైసర్గిక ప్రపంచాన్ని దాటి

శిఖరాగ్రం మీద కాసేపు

తన గుండె చప్పుడు తాను వినడానికీ

నక్షత్రాల వెలుగు లిపిలో మనసు వ్రాసుకోవడానికీ

అరణ్య పుష్ప సుగంధాల్లో స్నానించి

స్వప్న గ్రంధాల్ని ఆవిష్కరించుకోడానికీ

ఓ కారణం తప్పకుండా కావాలి.  

 -ప్రసూన రవీంద్రన్ 

(painting: Mamata Vegunta)

మీ మాటలు

  1. సూక్ష్మంగా హాయిగా వుంది మీ కవిత ప్రసూన గారూ ‘ సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి’ , ‘ విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ…. ‘ , ఈ వాక్యాలు మరీ బావున్నాయి . TQ

  2. Chaala baagundi.

  3. ఎంతో బాగుంది ప్రేమకి ప్రేమగా జరిగిన ఈ ఉత్సవం

  4. srivasthava says:

    చాల బాగుందండి

మీ మాటలు

*