పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సంగతేమో గాని మనుషులుగా ఎదిగిన వాళ్ళు, కాలం గడిచే కొద్దీ మరింతగా మనుషులయ్యే లక్షణమున్నవాళ్ళు .. చనిపోతే అది అది విషాదమే. ఆ మనుషులు కళాకారులో, రచయితలో, శాస్త్రవేత్తలో, సమాజాన్ని కదిలించే .. సరైన వైపుకు నడిపించే చోదక శక్తులో అయినప్పుడు .. ఆ విషాదం మరింత పెద్దదైపోతుంది. సమాజ గతిక్రమానికి తీరని నష్టమవుతుంది. అయినా కళాకారులు, రచయితలు, శాస్త్ర వేత్తలు చనిపోతారా అసలు? చచ్చిపోయినా బతికుండగానే చచ్చిపోతారా? శుభ్రంగా చచ్చిపోతారు. అయితే ఎలా చచ్చిపోతారు?

కొందరేమో కొన్ని నాడీకేంద్రాలను మర్చిపోయి, కొన్ని స్పందనలను కోల్పోయి, తమకు తామే పరాయి వాళ్ళయిపోయి .. గడ్డకట్టి, ఘనీభవించి .. తమకు తామే ఒక ఇరుకైన కరుకైన, కానీ భద్రమైన గూడు కట్టుకొని .. ఆత్మహత్య చేసేసుకొంటారు. కొందరు అమాయకులు, పెద్దవాళ్ళవుతున్న తమలో ఉన్న పసివాడ్ని పోగొట్టుకోని వాళ్ళు, ఘనీభవించని హృదయాన్ని, అందులో ఉన్న చైతన్యాన్ని నిలిపి వుంచుకున్నవాళ్ళు .. పాపం! ఊహానీ, ఊహించే స్వేచ్చని, స్వేచ్చ నిండిన వ్యక్తీకరణనీ వదలని వాళ్ళు, పెరుమాళ్ మురుగన్ లాంటి పిచ్చి పంతుళ్ళు – ఆత్మహత్య చేసుకోలేరు. హత్య చేయబడతారు. “మేము చచ్చిపోయాం” అని బ్రతికుండగానే ప్రకటిస్తారు. మనలో తీరని గుబులు పుట్టిస్తారు. గుండెలింకా మిగిలే ఉన్న వాళ్ళకు కునుకును దూరం చేస్తారు. చూసే కళ్ళు ఉన్నవాళ్ళకు కన్నీళ్ళను తెప్పిస్తారు. చేతులున్నవాళ్లకు, ఆ చేతులకు వేళ్ళు ఉన్న వాళ్ళకు పిడికిళ్ళను మొలిపిస్తారు.

images

కొన్ని రోజులుగా తెల్ల గడ్డం పెంచుకొని తలవేలాడేసుకొన్న పెరుమాళ్ మురగన్ ముఖం దినపత్రికల్లో, జాలా పత్రికల్లో, బ్లాగుల్లో విరివిగా కనిపిస్తుంది. ఆ ముఖం రచనా వ్యాసంగం ఇష్టంగా, ఆహ్లాదంగా, తమలో రగులుతున్న భావోద్వేగాల ఆవిరులు బయటికి పోయే మార్గంగా, మనసులో సహజంగా వచ్చే ఊహలను అల్లుకుంటూ పోయే మానవ ప్రవృత్తిగా, ఆ ఊహలను కాగితం మీద చిత్రించి దర్శించుకోవాలనే కోరిక తీరే దారిగా భావించే వారందరిని వ్యాకుల పరిచింది. ఆ ముఖం దేశం నుండి వెళ్ళగొట్టబడిన హుస్సేన్ తొంభై ఏళ్ళ మైనారిటీ అభద్రతను గుర్తుకు తెస్తుంది. బహిరంగ వేదిక మీదకు ముస్లిం ఛాందసవాదులు మొహంపై రాళ్ళు రువ్వితే అదోలా చూసిన (క్షమించండి. ఆ  భావాన్ని నేను పదాలతో వర్ణించలేను) తస్లీమాకు ఆశ్రయం ఇవ్వలేని ఈ దేశ ఓట్ల రాజకీయం గుర్తుకు వస్తుంది. ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ “మూలింటామె” రాసిన తరువాత నామిని పడిన ఆందోళనా, “ఎవరు ఏమనుకొన్నా ఈ కధ రాసి చచ్చిపోదామనుకొన్నాను” అన్న ప్రకటన కూడా గుర్తుకు వచ్చాయి. అన్నట్లు నామినీ కూడా ఆ నవలను ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు కదా.

సమాజంపై ధిక్కారంతో రాసిన రాత, గీసిన గీత, పాడే గొంతు నిషేదాలకు గురి అవటం ఇక్కడ కొత్త కాదు. అయితే దానికి సమాంతరంగా భావవ్యక్తీకరణ స్వేచ్చను చేతులు అడ్డం పెట్టి కాచుకొన్న ప్రజాస్వామిక హృదయాలకు కొదవ లేదు ఇక్కడ. అయితే ఈ సంఘటన మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నాగరిక ప్రపంచంలో జీవిస్తూ ఒక రచన చేసిన పాపానికి గడగడలాడుతూ ఘోరావ్ లకు, ధర్నాలకు, పుస్తకాల కాల్చివేతకు గురి అయ్యి .. జిల్లా యంత్రాంగం ముందు చేతులు కట్టుకొని నిలబడిన దీన స్థితి ఒక రచయితకు, అందునా పెరియార్ రామస్వామి నడయాడిన భూభాగంపై నివశించే వ్యక్తికి ఎలా దాపురించింది?

మతాన్ని, దేవుడిని, ఆర్య సంస్కృతిని ద్వేషించి, జీవిత కాలమంతా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి గొప్ప ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేసిన పెరియార్ రామస్వామి నడిచిన నేల మీద ఒక రచయిత చేతులు కట్టుకొని కుల శక్తుల ముందు, మత శక్తుల ముందు తలవొగ్గడం ఎంత విచారకరం! సాంస్కృతిక ఉద్యమం పాదుగా చేసుకొని ఎదిగిన ఇప్పుడున్నఅక్కడి  రాజకీయవ్యవస్థ ఈ సంగతిపై స్పందించక పోవటం (చివర్లో స్టాలిన్ కంటితుడుపు వ్యాఖ్యలు తప్ప) ఇంకో  గొప్ప విషాదం. పెరియార్ ఆలోచనలు జీర్ణించుకొని పరిపుష్ట అయిన మద్రాసీ సమాజం ఈ విషయం పై ప్రదర్శించిన నిర్లిప్తత, నిరాసక్తత … ఆ సమాజం, అది అందించిన సాహిత్యం, కళలు, దృక్కోణాల పట్ల ఆశలు కలిగిన వారికి పెనుఘాతం. రష్యన్ సామ్యవాదం కూలినప్పటి దుఃఖం మళ్ళీ అనుభవమవుతుంది.

ఇంత గొడవకూ, గందరగోళానికి తెర తీసిన ఈ మదో రుబాగన్ నవలలో (One part woman) ఏమి ఉంది? పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు దాటిన పొన్న, కాళీ దంపతులకు పిల్లలు ఉండరు. అన్ని విధాలుగా సంతృప్తికరమైన సంసార జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులు ఈ కధా కాలానికి  (వంద సంవత్సరాల క్రిందటి) భూస్వామ్య సమాజపు వత్తిడులకు గురి అవుతారు. పిల్లలు పుట్టనందుకు స్త్రీగా పొన్న ఎన్ని అవమానాలు పొందుతుందో, పురుషుడుగా కాళీ కూడా అంతే అవమానాల పాలు అవుతాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమాభిమానాలు ఇంకో పెళ్ళికి ప్రేరేపించవు. కాళీ రెండో పెళ్ళి చేసుకొన్నా కూడా పొన్నను ఇంట్లో ఉంచుకొంటే చాలు అనే అంగీకారానికి పొన్న తల్లిదండ్రులు కూడా వస్తారు. అయితే కాళీ వివేకంతో వ్యవహరించి పొన్న పట్ల తన ప్రేమను ప్రదర్శించుకొంటాడు. పిల్లలు లేరనే సమాజపు సతాయింపులకు దూరంగా ఇద్దరు ఇంటికి పరిమితమై అన్యోన్యంగా బతుకుతుంటారు. అయినా ఆ సెగ వాళ్ళకు తగులుతూనే ఉంటుంది.

ఒక రోజు కాళీ తల్లి, పొన్న తల్లి సంప్రదించుకొని ఒక ప్రతిపాదనతో కాళీ తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది. పొన్న పుట్టింటికి దగ్గరలో ఉన్న తిరుచెంగొడే పట్టణంలో ‘పర్వత’ అనే (అర్ధనారీశ్వర రూపం) దేవుడుకి ఏటా తిరునాళ్ళు జరుగుతాయి. పధ్నాలుగు రోజులు జరిగే ఈ తిరునాళ్ళలో నాలుగవ రోజు దేవుళ్ళు కొండ మీద నుండి కిందకు వచ్చి పధ్నాలుగవ రోజు మళ్ళీ పైకి వెళతారని నమ్మకం ప్రజలలో ఉంటుంది. ఆ పధ్నాలుగవ రోజు దగ్గర ప్రాంతాల నుండి పురుషులు అక్కడ రాత్రి సంచరిస్తారు. వాళ్ళను ‘దేవుళ్ళు’ అని అంటారు. ఆ రాత్రి స్త్రీలు ఆ అపరిచిత పురుషులతో సంభోగించవచ్చు. వాళ్ళను దేవుళ్ళగానే చూస్తారు. ఆ నాటి సమాజం దాన్ని తప్పు పట్టదు. దేవుడితో సంభోగించినట్లే భావిస్తుంది. ఎక్కువగా పిల్లలు లేని స్త్రీలు ఈ తంతులో పాల్గొంటారు. పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటారు. పెళ్ళి కానీ అబ్బాయిలు ఒక అనుభవం కోసం ఇక్కడకు వస్తారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో నయినా ఆ రాత్రి గడపవచ్చు. అలాగే స్త్రీలు కూడా.  ఆ ఒక్క రాత్రి అక్కడ ఉన్న దేవదాసీలను ఎవరూ పట్టించుకోరు.

‘ఈ రాత్రి అందరూ దేవదాసీలే’ అని వాళ్ళు నవ్వుకొంటారు. నిజానికి కాళీకి కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. పొన్నతో ఆయన బంధం గట్టి పడ్డాక ఆ వ్యవహారాలన్నీ మానుకొన్నాడు. ఆ పధ్నాలుగవ రోజు పొన్నను అక్కడికి పంపితే దేవుళ్ళ వలన గర్భం వస్తుందని తల్లి తెచ్చిన ఆ ప్రతిపాదన అతనిని బాధిస్తుంది. భార్యను వేరే పురుషునితో ఊహించుకోలేకపోతాడు. తల్లిని కూడా అసహ్యించుకొంటాడు. అసలు  ఆ సంవత్సరం భార్యను తిరునాళ్ళకు పంపడు. పొన్నకు ఈ ప్రతిపాదన గురించి  చెప్పడు కూడా. ఈ  సంవత్సరం తరువాత ఒక రాత్రి ఆమెకు ఈ విషయం చెప్పి “వెళతావా?” అని అడుగుతాడు.

‘మావా, నీకు బిడ్డ కావాలంటే వెళతాను.’ అని అమాయకంగా చెబుతుంది పొన్న. కాళీ షాక్ తింటాడు. ఆ సమాధానాన్ని ఊహించలేదు అతను. పొన్న అతని ముఖాకవళికల నుండి తను తప్పు చేశాను అని గ్రహిస్తుంది.  అతన్ని ఆలింగనం చేసుకొని తన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కాని కాళి ఆమెను ఇదివరకటి లాగా చూడలేక పోతాడు. తనకు తెలియకుండానే ఆమెను హింస పెడతాడు. ఒక సందర్భంలో పొన్న దండం పెట్టి ఇంతకంటే నన్ను చావబాదమని అడుగుతుంది. చివరకు పొన్న అక్కడకు వెళుతుందా, లేదా అనే విషయం అప్రస్తుతం. ఈ మొత్తం వ్యవహారంలో కాళి లోని అంతర్మధనం, అతను పడిన మానసిక సంఘర్షణ , పొన్న పడిన హింస ఈ కధలో ప్రధాన వస్తువు. పురుషాధిక్య సమాజం వలన పురుషుడు కూడా వెంపర్లకు గురి అవుతాడనేది ఈ కధాంశం.

ఆదిమ కమ్యూనిష్టు సమాజం నుండి స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు రకరకాలుగా అభివృద్ధి  చెందాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే  దంపతీ వివాహం అన్నిటికన్నా అభివృద్ధి కరమైనది అనుకొన్న తరువాత కూడా గత సమాజపు బహు సంబంధాలను పురుషుడు ఈ నాటికీ అనుభవిస్తున్నాడు. స్త్రీలకు ప్రాతివత్య ధర్మాలను నిర్దేశించినా అక్కడక్కడా కొంత వెసులుబాటు అరుదుగా కనిపిస్తుంది. అదీ ఈ కధా కాలం వంద సంవత్సరాల క్రితం అయినందున ఈ ఆచారం అసహజంగా అనిపించదు. గుంపు వివాహాల అవశేషాలు ఈ ఆచారాలలో కనిపిస్తాయి. మహాభారతంలాంటి  ఇతిహాసాలలో ఇలాంటి ప్రాచీన కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.

700x380xImage.jpg.pagespeed.ic._Vue3PwAdP

తమిళనాడు ప్రాంతంలోని కొంగునాడులో ఎక్కువ జీవించే కమ్యూనిటీ కొంగు వెళ్ళాళ గౌండర్లు. ఇది ఒక వ్యవసాయ కులం. పెరియార్ రామస్వామి ఈ కొంగు వెళ్ళాళ గౌండర్లు, వన్నియార్లు, దళితుల సాంస్కృతిక జీవితాలకు పెద్ద పీట వేసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. బ్రాహ్మణ ఆధిపత్యానికి బ్రాహ్మణిజానికి తేడా చెప్పాడు. ‘నేను బ్రాహ్మడిగా పుట్టినందుకు ఎవరినీ ద్వేషించను.’ అని స్పష్టంగా అన్నాడు పెరియారు.

అక్కడి ప్రజలు ఈ సాంస్కృతోద్యమాన్ని ఎంత ఆదరించారంటే ఈ నాటికీ కమ్యూనిష్టులు అక్కడ నిలదొక్కుకోలేక పోయారు. కొంగు వెళ్ళాళ గౌండర్లు స్త్రీలకు ఆస్తి హక్కు వద్దంటే, అటు దక్షిణ ప్రాంతంలో వున్న వన్నియార్లు దళితుల పట్ల తీవ్రమైన అణచివేత ప్రదర్శించారు. ఈ వ్యవసాయ కులాలు  ఎదిగి దళితులకు, స్త్రీలకు వ్యతిరేకంగా తయారు కావడానికి కారణాలు వెదకటం సామాజిక శాస్త్రవేత్తల పని. ద్రవిడిజం అంటే దళితిజమే. మూల వాసుల సాంస్కృతిక పరిరక్షణకు పెద్ద ఉద్యమాలే జరిగాయి. బాలచందర్ మనకు గొప్ప డైరెక్టర్ గా కనిపిస్తాడు. కానీ తమిలియన్స్ కి భారతీ రాజా గొప్ప డైరెక్టర్. బాలచందర్ సినిమాలో లీలగా కనిపించే సాంప్రదాయవాదాన్ని కూడా వాళ్ళు సహించలేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళ సాహిత్యం, కళలు నిరలంకారంగా ఎలాంటి రంగులు అంటుకోకుండా తమ ప్రత్యేకతలో వదిగి ఉంటాయి. అలాంటి చోట వస్తున్నఈ  మార్పులు గర్హనీయం.

ఈ మార్పులు ఎప్పుడు, ఎలా ప్రారంభం అయ్యాయి అంటే ‘ధ్వజస్తంభం, ఉరితాడు’ ఒకటైన చోట అంటాడు తెరేష్ బాబు. అంటే మతం, రాజ్యం ఒకటైతేనే ఈ మార్పులు నిర్ధిష్ట రూపాన్ని పొందుతాయి. తమిళనాడులో  హిందుమున్నని ఈ విషయంతో మాకు సంబందం లేదని ప్రకటించింది. కానీ ఇక్కడి హిందూ పక్షపాత పత్రికలు పెరుమాళ్ బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని అంటున్నాయి. ఆయన రాసిన విషయాలు రుజువు చేయాలని కూడా అంటున్నాయి.  అయితే అందరు అంటున్న మతమౌఢ్యం ఎక్కడ ఉంది? అది ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే తీసుకొని పెరుమాళ్ ను బోనులో నిలబెట్టిన రాజ్య యంత్రంలో ఉంది. ఆయన చేత బలవంతపు క్షమాపణలు చెప్పించి, ఆయన పుస్తకాలను వెనక్కు తీసుకోమని హెచ్చరించిన  జిల్లా యంత్రాంగం మెదళ్ళలో ఉంది.

కులమౌడ్యానికి,  మతదురహంకారం తోడై నపుడు ప్రమాదకర శక్తులు పుడతాయి. వాటికి రాజ్యం చేయి అందిస్తే వందలమంది   పెరుమాళ్ళ కలాలు ఎండిపోవాల్సిందే. ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగాయి. సృజనకారులు ఉలిక్కి పడ్డారు. పెరుమాళ్ కు మద్దతుగా గొంతు విప్పారు. నిజానికి ఈ గొంతుకలు తమ కోసం తాము అరుచుకొన్నవి. భావజాలాలు ఎలా ఉన్న సృజనకారుల ఊహాజనిత శక్తిని నియత్రించే ప్రయత్నాలు దుర్మార్గమైనవి అనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.

ఇక ఈ కధలోని  అంశాలను రుజువు చేయాలి అనే వాదనలకొద్దాము. చరిత్రను సాహిత్యంలో..  అదీ కాల్పనిక సాహిత్యంలో వెదకటం తెలివి కల పని కాదని.,  దానికంటే చరిత్ర ప్రతిఫలనాలను సాహిత్యం ఏ మేరకు ప్రతిబింబించిందో చూడాలనీ అట్టాడ అప్పలనాయుడుగారు అన్నారు. ఇలా జరిగిందా లేదా అనే విషయాన్ని సాహిత్యకారులే రుజువు చేయాలనే షరతు ఉంటే భారతీయ సాహిత్యం, ఇంకా ప్రపంచ సాహిత్యం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ ఆంక్ష మనిషిలోని సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు. మానవ నాగరికత ఊహతోనే అభివృద్ధి చెందింది.

ఇక స్త్రీలను అవమానించారు అనే వాదన. నామిని మూలింటామె వచ్చినపుడు కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేశాయి. కొన్ని సామాజిక, చారిత్రిక పరిస్థితుల్లో స్త్రీలు ఎలా ప్రవర్తించారో, ప్రవర్తించాల్సి వచ్చిందో దాచిపెట్టి స్త్రీని వారిచ్చిన నమూనాలో మాత్రమే సాహిత్యంలో కాని, చిత్రంలో కాని చూపించాలనే వాదన వాస్తవికతను తిరస్కరించటమే. ఇక్కడ అమానవీయమైన వ్యభిచారం ఉంది. స్త్రీలను పల్లెల్లో చెడ్డ మాటలతో పిలుస్తారు. వాటిని ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించిన రచయిత స్త్రీ వ్యతిరేకి అవుతాడా? ఆ రచయిత ఎటు ఉన్నాడో, అతని ఆత్మ ఎటు వైపు మొగ్గుతుందో వివేకవంతుడైన పాఠకుడు, పాఠకురాలు  గ్రహించగలరు. స్త్రీలను వారనుకొన్న నమూనాలో బంధించి, దానికి భిన్నంగా రాసిన రాతలను అవాస్తవాలని అనటం ఒక స్వీయాత్మక ధోరణి మాత్రమే అవుతుంది.

నిజానికి ఈ కధలో కూడా దేవుళ్ళుగా భావించే పురుషులతో సంగమించడం ఆ నాటి సమాజ ఆచారమైనప్పటికీ పురుషుడిలో ఉండే పొసిసివ్ నెస్స్ దానికి అనుమతి ఇవ్వదు. ఆచారాలకు, నమూనాలకు, భౌతిక వాస్తవాలకు వున్న ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో ఇక స్త్రీలు నిర్ణయించుకొంటారు., తామెటు ఉండాలో. నిజాయితీపరుడైన సాహితీవేత్తతోనా, గుప్పిట్లోకి తీసుకోవాలనుకొనే మాయల పకీరుతోనా అనేది.

సాహితీకారులు ఒంటరిగా లేరని రుజువయ్యింది. రచయిత ఏమి చెప్పదలుచుకొన్నాడో స్పష్టంగా చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. యిచ్చిన మాట రాజ్యాంగం తప్పినా నాగరిక సమాజం భిన్నాభిప్రాయాన్ని గౌరవించింది. ఇక్కడ హైకోర్టు కూడా పెరుమాళ్ పక్షానే నిలిచినట్లు కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగాన్ని మొట్టాల్సింది మొట్టింది. రచయితను కోర్టుకు ఆహ్వానించింది.

కలం పై దాడి అంటే అక్షరం పై దాడి, అంతిమంగా నాగరిక ప్రపంచం పై దాడి. అక్షర సైనికులుగా మనమే మారదాం. అందరం పెరుమాళ్ళ మవుదాం.

  -రమాసుందరి

ramasundari

మీ మాటలు

  1. //కలం పై దాడి అంటే అక్షరం పై దాడి, అంతిమంగా నాగరిక ప్రపంచం పై దాడి.//
    ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్న రచయితలు తాము గాఢంగా విశ్వసించే భావజాలాలకు వ్యతిరేకమైన అభిప్రాయాల విషయంలో ఏం చేస్తారు. వాటి నోరు నొక్కేందుకు తమ పక్షం వారే బయలుదేరితే కూడా ఇంతే బలంగా మాట్లాడతారా? ‘‘నీ అభిప్రాయాన్ని నేను ఖండిస్తాను. కానీ దాన్ని వ్యక్తపరిచే నీ హక్కుకు సవాళ్ళు ఎదురైతే మాత్రం నా ప్రాణాన్ని అడ్డుపెట్టి పోరాడతాను.’’ అన్న వ్యాఖ్యలే అప్పుడూ శరణ్యమా?

  2. మొత్తానికి పెరుమాళ్ వ్యవహారంలో సృజనకారులు ఆయన పక్షాన వ్యవహరించి ఆయను నిలబెట్టారు. ఇంతకీ పెరుమాళ్ గారు ‘‘నేను రచయితగా మరణించాను’’ అన్నదాన్ని వెనక్కి తీసుకున్నారా? ఆయన మళ్లీ సాహిత్యసృజన చేస్తారా?

  3. /పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!/
    శీర్శిక చాల పొందికగా ఉంది. పెరియార్ రామస్వామి నాయక్కర్, త్రిపురనేని రామ స్వామీ చౌదరి గారిని దక్షిణ భారత దేశం లో ఆత్మా గౌరవ పోరాటాలకు ఆధ్యులుగా చెప్పుకుంటారు. వారు (పెరియార్) ఇప్పుడు లేరు గనుక వారి అనుయాయులు ఎప్పుడో రాజీ పడి పోయారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్నారు తప్ప వారిని ఎప్పుడో మరిచి పోయారు. కుల కజ్జి గాళ్లు తెరమీదికొచ్చాక పెరియార్, ద్రవిడ అనే పదాలు తెరమరుగవుతున్నాయి. ఇది నాగరిక ప్రపంచం అనుకోవటం మరో ఆత్మా వంచన. మీ వ్యాసం చాలా బావుంది.

  4. buchireddy gangula says:

    అందరం పెరుమాళ్ళ అవుదాం —చాల చక్కగా చెప్పారు ర మా సుందరి గారు
    రచయితలు గళం విప్పాలి —-

    ordered… వెయిటింగ్ for.. that..book…
    ——————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  5. Srinivas Vuruputuri says:

    రమాసుందరి గారికి

    మీ వ్యాసం బావుంది. ఒకట్రెండు విషయాలు:

    1. కొండల్లో దేవత పేరు “పవత”. “పర్వత” కాదు.

    2. “పవత”, అర్ధనారీశ్వరుడు వేర్వేరు. ఆవిడ గ్రామదేవత. నవలలో ఒకచోట ఓ పూజారి కాళీ దగ్గర డబ్బులు లాగేందుకు పవతా-అర్ధనారీశ్వరుడూ ఒక్కటే అని చెబుతాడు, అంతే!

    “ఇక ఈ కధలోని అంశాలను రుజువు చేయాలి అనే వాదనలకొద్దాము…ఇలా జరిగిందా లేదా అనే విషయాన్ని సాహిత్యకారులే రుజువు చేయాలనే షరతు ఉంటే భారతీయ సాహిత్యం, ఇంకా ప్రపంచ సాహిత్యం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ ఆంక్ష మనిషిలోని సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు. మానవ నాగరికత ఊహతోనే అభివృద్ధి చెందింది.” అన్నారు మీరు.

    నిజమే. కానీ ఈ వాదనలో ఒక లోపం ఉన్నదని నాకనిపించింది:

    రచయిత తన కథకు విశ్వసనీయతను సమకూర్చటం కోసం ఒకానొక గుడిని ఆ గుడికి సంబంధించిన ఆచారాన్నీ ఆధారం చేసుకున్నారు కదా. అలాంటప్పుడు అదంతా రుజువు చేయనక్కరలేదని అంటే నవలకున్న విశ్వసనీయత దెబ్బ తింటుంది కదా.

    పైగా పెరుమాళ్ మురుగన్ తన సబ్జెక్టూ గురించి లోతుగా పరిశోధన చేస్తాడని పేరున్నవాడట. “Murugan was intrigued on encountering several men in the region past the age of 50 who were called Ardhanari (Half-woman) or Sami Pillai (God-given child). On digging further he found out…” అని కారవాన్ వ్యాసం.

    ఇది కల్పనా/నిజమా అని అకడమిక్ ప్రశ్న వేయటం తప్పు కాదనుకుంటా. ఇంకెక్కడైనా అర్ధనారీశ్వరుడి గుళ్ళున్నాయా? అక్కడ ఇలాంటి ఆచారాలేమైనా ఉండేవనేందుకేమైనా దాఖలాలున్నాయా? తిరుచెంగోడులో ఒకప్పుడు ఉండిఉంటే (అందునా స్వాతంత్ర్యం రావటం కన్నా కొన్నేళ్ళ ముందు) ఈ ఆచారాన్ని ఇంకెవరైనా ప్రస్తావించారా?

    శ్రీనివాస్

    • శ్రీనివాస్ గారు,
      ఇంత తెలిసిన వారు మీకు చెప్పవలసినదేముంది. ఇది అకడమిక్ ప్రశ్నగా వేస్తే సమాధానాలు వేరే ఉండొచ్చు. ఆ ప్రశ్నను రచయిత చావు బతుకుల సమస్యగా చేసినపుడు రచయిత, అతన్ని అల్లుకొని వున్న నాగరిక, ప్రజాస్వామ్య లోకం సమాధానం అదే ఉంటుంది.

  6. Srinivas Vuruputuri says:

    “సారంగ పేజీల్లో వేడి వేడి చర్చలవుతున్న సమయంలో ప్రస్తావించటం సబబు కాదేమో కానీ పెరుమాళ్ మురుగన్ లాంటిదే మరో భావప్రకటనా స్వేచ్ఛ కేసు – షిరీన్ దల్వీ – గురించి ఇక్కడ ఎవ్వరూ మాట్లాడుతున్నట్లు లేదు: హిందూ పేపర్ వ్యాసం

  7. Rajendra Prasad Maheswaram says:

    చక్కటి విశ్లేషణ. “కులమౌడ్యానికి, మతదురహంకారం తోడై నపుడు ప్రమాదకర శక్తులు పుడతాయి. వాటికి రాజ్యం చేయి అందిస్తే వందలమంది పెరుమాళ్ళ కలాలు ఎండిపోవాల్సిందే. ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగాయి. సృజనకారులు ఉలిక్కి పడ్డారు. పెరుమాళ్ కు మద్దతుగా గొంతు విప్పారు. నిజానికి ఈ గొంతుకలు తమ కోసం తాము అరుచుకొన్నవి. భావజాలాలు ఎలా ఉన్న సృజనకారుల ఊహాజనిత శక్తిని నియత్రించే ప్రయత్నాలు దుర్మార్గమైనవి అనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ”
    I too agree with this ..

Leave a Reply to pavan Cancel reply

*