నిషేధం గురించే మాట్లాడు

Painting: Picasso

 

కవికీ

కవిత్వానికి
నిషేధాలుండకూడదంటాను

నీడ కురిపించే చెట్ల మధ్యో
ఎండ కాసే వీధుల్లోనో
గోళీలాడుకుంటున్న పిల్లాణ్ణి బంధించి
చేతులు వెనక్కి విరిచి
కణతలపై గురిచూసి తుపాకీ
కాల్చకూడదంటాను

కవీ
పసిబాలుడే –
చెరువు కాణా మీద కూర్చుని
ఇష్టంగా చెరుగ్గెడ తీపిని
గొంతులోకి మింగుతున్నట్టు –
రాత్రి వెన్నెట్లో
వెన్నెల తీరాల్లో
యిసుక గూళ్లు కట్టుకున్నట్టు –
కుట్రలేని ‘కవిత్వం’ కలగంటాడు

దేశంలో కల్లోలముంటుంది
ఆయుధం నకిలీ రాజ్యాంగాన్ని నడుపుతుంది
అరణ్యం పూల వాసన
ఈశాన్యం కొండల్లోంచి
నైరుతి దిశగా
దేశం దేశమంతా
వీస్తుంది
కల్లోల కాలపు ఎదురు గాలి
వంచన గాలి
రక్తాన్ని ఏ కొంచెమైనా కదిలించకపోతే
రక్త తంత్రులను ఏ కొసనైనా మీటకపోతే
ఎవరైనా
అసలు మనిషే కాదంటాను

మనిషి మీద నమ్మకం వున్నవాణ్ణి నేను
వొళ్లంతా మట్టే అంటించుకుని
మట్టి మీదే పొర్లాడే
అతి సాధారణ మనిషైనా
నిషేధం గురించే మాట్లాడాలంటాను –

మీ మాటలు

  1. బాల సుధాకర్ మౌళి గారూ
    కవిత ఉద్వేగంగా ఉంది. కవికి ప్రేమ ఎంత ముఖమో అన్యాయాలపైన క్రోధం కూడా అంట ముఖ్యం. ఈ కవితకు వాడిన పెయింటింగ్ పికాసోది కాదేమోనని నాకు చిన్నసంశయం..

  2. Wow mouli gaaru . you nailed it again . superb lines .

  3. చక్కని భావోద్వేగ కవిత మౌళి గారూ! అభినందనలు!!

  4. మనషి మీద నమ్మక మున్నవాళ్లు రాసిన కవిత బాగుండక పోవడమా!!

  5. varma.kalidindi says:

    మట్టికి మనిషికి నిషేధం ఉండకూడదు., నిజమైన కవిత్వం ఎప్పుడూ మనిషి వాసన వెస్తూ ఉంటుంది

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*