గతమా, మరచిపో నన్ను !!!

మంచం పక్కన సైడ్ టేబిల్ మీద పెట్టిన మొబైల్ ఫోన్- రాత్రి పెట్టిన చేసిన టైముని గౌరవిస్తూ ‘ఇంక లేవాలి సుమా“ అంటూ మోగింది. రొజాయిలోంచి చెయ్యి మాత్రం బయటకి తీసి దాని నోరు నొక్కి “ఒక్క పది నిముషాలే” అనుకుంటూ మళ్ళీ రొజాయిలోకి దూరేను. తిరిగి నిద్రలోకి జారుకోబోతూ “ఇంక లాభం లేదు” అని బద్ధకంగా రొజాయి తొలిగించి, కిందనున్న జోళ్ళలోకి పాదాలు దూర్చేను. పక్కనున్న శాలువ కప్పుకుని లేచి అటువైపు చూస్తే, ఎప్పటిలాగే నిండా ముసుగు పెట్టుకుని మనిషి ఆకారం కనపడ్డమే తప్ప అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా బిగదీసుకుని పడుక్కున్నాడు మోహన్. తన వైపు తిరిగి తలమీదనున్న రొజాయిని పూర్తిగా తప్పించకుండా, కనిపించిన చెవిమీదే చిన్నగా ముద్దు పెట్టి బాత్రూమోకి దూరి గీసర్ వేసేను.

వంటింట్లోకి వెళ్ళి, ఒక కప్పులో నీళ్ళు పోసి, మైక్రోవేవ్లో పెట్టి, పిల్లల గదిలోకి నడిచేను. డిసెంబర్ చలికి ముడుచుకుని, మొత్తం శరీరం రొజాయిలోకి దూర్చి నిద్రపోతోంది ఎనిమిదేళ్ళ పియా. దానికి వ్యతిరేకంగా సగం పాదాలూ, వేళ్ళ చివర్లూ, కొంచం మొహమూ బయటకి పెట్టి పడుక్కుంది ఆరేళ్ళ రియా. ఇద్దరినీ కనిపించిన చోటల్లా చిన్న చిన్న ముద్దులు పెట్టుకుని, రొజాయి సరిగ్గా సర్ది, బయటకి వచ్చేను. వేడినీళ్ళ కప్పుని బయటకి తీసి దాన్లో ఒక టీ బాగ్ పడేసి, నిమ్మకాయ కోసి రెండు చుక్కలు పిండి, నడవాలో ఉన్న వార్డ్‌రోబ్లో రాత్రే హాంగర్ మీద పెట్టుకున్న యూనిఫార్మ్ తీసి పక్కనున్న కుర్చీ మీద వేసేను.

స్నానం చేసి, తయారయి, బేగ్ భుజానికి తగిలించుకున్నాను. మళ్ళీ రెండు పడకగదుల్లోకీ తొంగి చూసి, ముందు గదిలో పడుక్కున్న 35 ఏళ్ళ పనమ్మాయి ప్రమీల అలార్మ్‌ సరిగ్గా ఉందో లేదో చూసేను. మరి తను ముందు లేచి మిగతా వాళ్ళని లేపకపోతే ఇంకంతే సంగతి. ముందు తలుపు మెల్లిగా తెరిచి బయటకి వచ్చి శబ్దం కాకుండా మూసి, తాళం పడిందని నిర్ధారించుకుని కిందకి నడిచేను. చల్లగా, తడిగా ఉన్న కారు హాండిల్‌ తెరిచి, లోపల కూలబడి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చేటప్పటికి టైమ్ తెల్లవారున 4. 15. శీతాకాలపు ప్రాతఃకాలం అర్థరాత్రిలా అనిపిస్తోంది. ట్రాఫిక్ కానీ రెడ్ లైట్లు కానీ లేకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ కేటాయించిన ఎంప్లోయీస్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశించేసరికి, షిఫ్ట్ టైమ్ అయిన 5 గంటలు అవడానికి ఇంకా 20 నిముషాలుంది. వెనక సీట్ మీద నిన్న పడేసిన ఆఫీస్ ఓవర్ కోట్ని తొడుక్కుంటూ, బాగ్ ఒక చేతిలోకి తీసుకుని ఇంకొక చేత్తో కార్ తాళం వేసి బయటకి వచ్చేను. రెండు కార్లవతల ఆదిత్యా సేన్‌గుప్తా తన కార్లోంచి బయటకి వచ్చి కార్ లాక్ చేస్తూ కనపడ్డాడు. వడివడిగా నన్ను చూడనట్టు తల తిప్పుకుని అవతలివైపునుంచి టర్మినల్ గేటువైపు దారి తీస్తున్నాడు.

ఎప్పటి సేన్‌గుప్తా! ఎలాంటి జ్ఞాపకాలు! అతనితో సంబంధం తెగి పదేళ్ళ పైన అయింది. కానీ నా ఈ జ్ఞాపకాలమీద హక్కు నాది కానట్టుగా, ఆ జ్ఞాపకాలు ఇంకెవరివో అన్నట్టు అనిపిస్తోందెందుకో!
********

టర్మినల్ వైపు నడుస్తూ బాగ్‌లోంచి ఐడెంటిటీ కార్డ్ ఉన్న గొలుసు తీసి మెళ్ళో వేసుకుని వాష్ రూమ్లోకి నడిచేను. మేకప్ కిట్ తీసి యాంత్రికంగా అయిదు నిముషాల్లో మేకప్ వేసుకోవడం పూర్తి చేసి, జుట్టు దువ్వుకుని డ్యూటీ అలాట్మెంట్ గదిలోకి నడిచేను. అప్పటికే డ్యూటీకి రిపోర్ట్ చేసిన అసిస్టెంట్ మేనేజర్లు గదిలో ఉన్నారు. డ్యూటీ షీట్ మీద డ్యూటీస్ రాసి, లోడర్ తెచ్చిచ్చిన టీ తాగుతూ ఉంటే, వద్దనుకున్నా మనస్సు గతంలోకి జారిపోయింది. సీట్ దొరకని పాసెంజర్ల రణగొణ ధ్వని మొదలవడానికి ఇంకా గంటైనా పడుతుంది.

ట్రైనింగ్ అయిన తరువాత డైరెక్ట్ రిక్రూటీగా చేరిన కొత్తల్లో నా పోస్టింగ్ -అసిస్టెంట్ మేనేజర్‌గా(కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ -1ఏ లో అయింది. ట్రైనింగ్ తరువాత రెగ్యులర్ డ్యూటీస్ చేయడానికి అనుభవం లేకపోవడం వల్ల ఒక వారమో, పది రోజులో ఏ సూపర్వైసర్ పక్కనో ఉండి గమనిస్తూ, ఆ సూపర్వైసర్కి అనధికారమైన సహాయకురాలిగా పని చేస్తే కానీ ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలు ప్రాక్టికల్గా చేయడం కుదరదు. మరి అది నా అదృష్టమో దురదృష్టమో ఈ నాటికీ అర్థం కాలేదు కానీ అప్పుడు ఆ మొదటి రోజు సూపర్వైసర్ ఆదిత్యా సేన్‌గుప్తాయే. అది కూడా ఆరోజుల్లో అంతగా రద్దీ లేని ఎరైవల్ హాల్లో. అప్పటికి నాకు ముఖాలు కొత్త. పేర్లు కొత్త. ఎవరే రేంకో తెలిసేది కాదు. మరీ ముఖ్యంగా స్త్రీలయితే-ఒకే రంగు యూనిఫార్మ్ చీరలు. మగ కొలీగ్స్ అయితే కనీసం వాళ్ళ చొక్కాల భుజాలమీద తగిలించుకునే ఎపలెట్స్ బట్టి వాళ్ళు సీనియర్లో, జూనియర్లో అని ఊహించగలిగేదాన్ని.
అతని వెంబడే ఉండి అతను పాసెంజెర్లతో ఎలా డీల్ చేస్తున్నాడో అని గమనిస్తూ, కొంతసేపటి తరువాత “ అనవసరంగా పనికి అడ్డం పడుతున్నానేమోన్న” సంకోచంతో, అడపాతడపా వినిపిస్తున్న అనౌన్స్‌మెంట్లని వింటూ, కన్వేయర్ బెల్టుల కదలికలని గమనిస్తూ, బిడియంగా, అలవాటు లేని చీరతో తాజ్ కౌంటర్‌కి ఎదురుగా నిలుచున్నాను.

చేతిలో ఉన్న వాకీ టాకీతో నాదగ్గిరకి వచ్చి, నా మెడనుంచి వేలాడుతున్న ఐడెంటిటీ కార్డ్‌ని పరికించి చూసి. “ఇంకొక అరగంట ఎరైవల్ ఏదీ లేదు. టీ తాగుదామా?” అన్న సేన్‌గుప్తాని చూసి “హమ్మయ్యా, ఇలా బొమ్మలా నిలుచోవడం తప్పింది” అనుకుంటూ తలూపేను. టీ తాగుతున్నప్పుడు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్న చూపులని తప్పించుకుందామని అనిపించలేదు. అతన్నే చూస్తుండిపోయేను. వెడల్పాటి భుజాలు. సన్నటి కళ్ళజోడు ఫ్రేముతో, బెంగాలీలకున్న చక్కటి చర్మంతో మృదువుగా మాట్లాడుతున్నాడతను. “మాట్లాడేటప్పుడు చేతులు తిప్పడం అలవాటనుకుంటాను. బెంగాలీ యాస లేదు. ఢిల్లీలోనే చిన్నప్పటినుండీ ఉండడం వల్ల హిందీ అంత బాగా మాట్లాడుతున్నాడా? కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం భాష ధారాళంగా లేదే! రెయిసీనా బెంగాలీ స్కూల్లో చదువుకుని ఉంటాడు. ” నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. కొంతసేపటి తరువాత అప్పటి ఎరైవల్స్ అయిపోయేయి. ఫ్లైట్ బోర్డ్ చూస్తే గంట టైముంది తరువాత ఫ్లైటుకి. గ్లాస్ తలుపుల అవతలనుంచి అప్పుడే పైకొస్తున్న సూర్యుడు ‘రారమ్మంటూ’ పిలుస్తున్నాడు.
“ఎండ పైకొచ్చింది. టార్మాక్ మీద చిన్న వాక్ చేసి వద్దామా”? అన్న అతని ప్రశ్నకి తలూపి నేనూ అతనితోపాటు బయటకి నడిచేను.

మొత్తం చదువు కో-ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్‌లోనే సాగింది. అయినా అతడంటే ఏదో వింతయిన ఆకర్షణ మొదటి రోజే !

“ఊ, మీ గురించి చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఏ కాలేజీలో చదివేరు?-అతను
“నేనూ మా అమ్మగారూ- అంతే. హిందూ కాలేజ్, తరువాత ఐఐఎమ్-అహమెదాబాద్. “-నేను.

“బోయ్ ఫ్రెండెవరూ లేరా? బయటకి వెళ్తూ ఉంటారా? డైరెక్ట్ రిక్రూటీగా చేరేరే! సిఫారసు ఉందా ఏమిటి?
‘ప్రశ్నల పరంపర.’ ఆఖరి ప్రశ్న ఇంకెవరైనా కనుక వేసుంటే “ ఏం?నాకేమైనా చదువు తక్కువా, తెలివి లేదా సిఫారసు కావడానికి “ అంటూ విరుచుకు పడి ఉండేదాన్ని.

అతని గురించి ఏ ప్రశ్నా వేయాలని కూడా తోచలేదు నాకు. అయినా అతనే తన గురించి చెప్పుకుంటూ పోయేడు.

“భార్య తన్ని అర్థం చేసుకోదు( బంధువుల్లో తప్ప పెళ్ళయిన మగవాళ్ళు పరిచయం లేకపోవడంతో ఈ క్లాసిక్ లైన్ నా మట్టి బుర్రకి తట్టలేదప్పుడు). ఆవిడ సెంట్రల్ గవర్న్‌మెంట్ ఉద్యోగి. ఎప్పుడు చూసినా తన పుట్టిల్లూ, తన పిల్లలూ, తన ఉద్యోగం, తన షాపింగ్ అవీ తప్ప ఇతనికోసం సమయం కేటాయించదు. ఇద్దరికీ పడదు. ఎప్పుడూ పోట్లాటలే. ఇద్దరు పిల్లలు. ఇల్లు చిత్తరంజన్ పార్క్ అనబడే ఇపిడిపి (East Pakistan Displaced Persons Colony) కోలొనీలో.”
“ఖాళీ సమయంలో ఏమిటి చేస్తారు?” వింటూ, ఆలోచనల్లో ములిగిపోయిన నేను ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

“పుస్తకాలు చదువుతాను” –అసంకల్పితంగా.
అదేదో జోక్ అన్నట్టు అతను పగలబడి నవ్వేడు.
“మీరు పుస్తకాలు చదవరా?” అయోమయంగా అడిగిన నేను.
“అంత టైమెక్కడా వేస్ట్ చేసుకోడానికి?”
బెంగాలీ వాళ్ళకి సాహిత్యమన్నా, లలిత కళలన్నా ప్రాణం అన్న లేమాన్ అభిప్రాయం మాత్రం నాకుండేది. దానికి నా బెంగాలీ క్లాస్‌మేట్స్ కూడా దోహదపడ్డారు. ఆటల్లో తప్ప అన్నిట్లో సామాన్యంగా వాళ్ళే ముందుండేవారు. పుస్తకాలు చదవడం అలవాటులేని బెంగాలీయా! సామాన్యంగా అయితే అదొక అనర్హత నా దృష్టిలో. కానీ అతనికి అనర్హత అన్న మాటని ఆపాదించడానికి ఎందుకోకానీ మనసొప్పలేదు.
ఇలా పిచ్చాపాటీ మాట్లాడుతూ తిరిగి టర్మినల్ బిల్డింగ్ వైపు నడుస్తున్నప్పుడు అతను నాకు దగ్గిరగా జరిగేడు. కొద్ది నిముషాల్లో నా కుడి చెయ్యి అతని చేతిలో ఇరుక్కుని ఉంది. అభ్యంతరం అనిపించలేదు. టర్మినల్ బిల్డింగ్ సమీపిస్తుండగా నా చేతిని వదిలి దూరం జరిగేడు.

***

అన్నట్టు ఇంత ఉపోద్ఘాతమూ చెప్తూ, నా గురించి మాత్రం చెప్పలేదు కదూ! నా పేరు మోహన. మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయేరు. అమ్మ బాంక్ ఉద్యోగిని. ఒక్కర్తే నన్ను పెంచింది. తల్లితండ్రులు పెట్టిన నా పేరు తనకి నచ్చలేదని నిరూపించాలనుకున్నాడేమో దేవుడు! చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్ నా ముఖంమీద చిన్న గుంటలని వదిలింది.

వంశపారంపర్యంగా లేని పొట్టితనాన్ని ఎక్కడినుండి కొని తెచ్చుకున్నానో కానీ నా ఎత్తు అయిదడుగులు మాత్రమే. పోనీ సన్నగా, నాజూగ్గా ఉంటానా అంటే గుమ్మటం అనడానికి లేదు కానీ ఆ లెక్కే. దానివల్ల చదువులో అయితే ముందుండేదాన్ని కానీ నాతో చదువుకునేవారితో బయటకి వెళ్ళడాలూ అవీ తక్కువే. నా క్లాస్‌మేట్స్‌కి నా రూపురేఖల గురించి పట్టింపుండేది కాదు. కానీ ఎక్కడికయినా తిరగడానికి వెళ్దామంటే నేనే ఒక విధమైన న్యూనతాభావంతో “ఈ సారికి మీరెళ్ళి రండి. మరోసారి వస్తాను” అనేదాన్ని. నా క్లాస్‌మేట్సయిన అబ్బాయిలు నన్ను తమలో ఒకదానిగా భావించేవారే తప్ప నన్ను ఒక అమ్మాయిగా జమకట్టేవారే కారు. అయితే వాళ్ళ దయవల్ల అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో అని మాత్రం బాగానే నేర్చుకున్నాను. కానీ బోయ్‌ఫ్రెండ్స్‌ ఎక్కడినుంచి వస్తారు?
అది నా మొదటి మార్నింగ్ షిఫ్ట్. ఆదిత్య ఆ షిఫ్ట్ తప్ప వేరేదేదైనా సరే, తప్పించుకునేవాడు. ఆ తరువాత ఏదో మధ్యమధ్యలో తప్ప ఒక సంవత్సరం పొడుగూ నేనూ అర్లీ మార్నింగ్ షిఫ్ట్ తప్ప ఇంకేదీ చేసేదాన్ని కాదు. కొన్నిసార్లు డ్యూటీ పూర్తి అయేక దూరంగా ఉన్న ఏ హొటెల్లోనో గది తీసుకోవడం, తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఆ హోటెల్ జ్ఞాపకాలు మధురమైన స్మృతులుగా మాత్రం మారలేకపోయేయి.
న్యూస్ పేపర్లే సరిగ్గా చదవని అతనితో మాట్లాడ్డానికి శ్రమపడవలిసి వచ్చేది. తను చూసే టివి సీరియళ్ళన్నిటి గురించీ మాట్లాడే మాటలు మాత్రం వినేదాన్ని. స్టార్ డస్ట్, ఫిల్మ్ ఫేర్ లాంటి పత్రికల్లో వచ్చే గాసిప్ కాలమ్స్ గురించి మాట్లాడటం నేర్చుకోవడానికి ప్రయత్నించేను. నేను చదివే పుస్తకాల గురించి ఎప్పుడైనా చెప్పబోతే “ అబ్బా అవన్నీ ముసలితనంలో పనికొస్తాయిగా! ఈ వయస్సులో అంత పెద్ద సంగతుల గురించెందుకు?” అని విసుక్కునేవాడు. “ఈ దారి నీ నాశనానికే సుమా” అని హెచ్చరిస్తున్న అంతరాత్మని నేను లక్ష్యపెడితే కదా! ఎలిజిబిల్ బాచిలర్స్ అందరూ అతని ముందు దిగదుడుపే నా దృష్టిలో. కొంతకాలం తరువాత ఆ హోటెలూ అవీ కూడా తగ్గిపోయేయి. కళ్ళకి తొడుక్కున్న రంగుటద్దాలు కాస్తా మెల్లిమెల్లిగా రంగు కోల్పోయి, తేటపడటం మొదలుపెట్టేయి. కానీ అలవాటయిన జాడ్యం ఒక పట్టాన్న వదలదే!

ఒక సాయంత్రం నాకెప్పటిలాగే అతనితో మాట్లాడాలనిపించింది. మొబైళ్ళ కాలం కాదది. గతంలో అతను పదేపదే చెప్పిన జాగ్రత్తలనీ, చేసిన హెచ్చరికలనీ మరిచిపోయి ఒక సాయంత్రం అతనింటికి ఫోన్ చేసేను. ముందెవరో పిల్లల కంఠం ఆ తరువాత ఒక స్త్రీ గొంతూ వినిపించేయి. అతని గొంతు వినిపించేవరకూ ఎవరు ఫోనెత్తినా ఏదీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తూనే ఉన్నాను. ఆఖరికి అతనే ఎత్తేడు కానీ కోపంగా, లోగొంతుతో ‘తనకి ఇష్టం లేకపోయినా భార్య తల్లీ తండ్రీ వచ్చేరని’ చెప్పి “ఇలా ఫోన్ చేయడానికి ముంచుకు పడిపోయిన కారణాలేమైనా ఉన్నాయా?” అని కూడా అడిగేడు.

chinnakatha

ఏదో తప్పు చేసినట్టు తడబడుతూ ఉన్న నా గొంతు పెగిలేలోగానే బాక్‌గ్రౌండ్లో అతని భార్య గొంతు వినిపించింది. భర్తంటే ఇష్టం లేకపోయిన ఆమె అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతోంది. మౌత్ పీస్ అరిచేత్తో మూసినట్టున్నాడు. అంత స్పష్టంగా వినపడలేదు కానీ బెంగాలీలో ఆమెతో గారాబంగా ఏదో అంటున్నాడు. ఫోన్ ఏ చెక్కబల్ల మీదో పెట్టిన శబ్దం అయింది. ఇప్పుడు నవ్వులూ, కేరింతలూ అన్నీ గట్టిగా వినిపిస్తున్నాయి. అతను నాకు చెప్పిన కథకి పూర్తి వ్యతిరేకంగా ఉంది అక్కడి పరిస్థితి. “షోనా”, “ధన్” అన్న పిలుపులతో నా చెవులకి చిల్లులు పడి, కంపరం పుడుతున్నా కానీ కొత్తగా నేర్చుకున్న మిడిమిడి బెంగాలీ జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఫోన్ నా చెవి దగ్గిరే పెట్టుకుని వింటున్నాను. కొంత సేపటి తరువాత అతనికి గుర్తొచ్చింది కాబోలు తను ఫోన్ కింద పెట్టి అవతలికి వెళ్ళిపోయేడని. ఫోనెత్తి “ ఇంకా ఇక్కడే ఉన్నావా” అన్న అర్థం వచ్చే ఛీత్కారంలాంటిది చేసి ఠాక్కుమంటూ పెట్టేసేడు.

మా ఇద్దరి సంగతీ ఎయిర్ పోర్టులో మొదటే బయటపడింది. డెస్క్ జాబ్స్ కావు కాబట్టి ఎవరూ వెనక ఎంత గుసగుసలాడుకున్నా కానీ మా ముందు మాత్రం బయటపడేవారు కాదు.

మర్నాడు అతను సెలవు పెట్టేడు. ఆ మర్నాడు అతను నాకు ముందుగానే డ్యూటీకి రిపోర్ట్ చేసేడు. నేనింక ట్రైనీని కాను కాబట్టి నా డ్యూటీ అలాట్ చేసేదొకరు, అతని డ్యూటీ వేసేదింకొకరు. మా ఇద్దరి సంగతి తెలిసినప్పటినుంచీ వీలయినంతవరకూ మేమిద్దరం ముందే ఆలోచించుకుని ఒక చోటే డ్యూటీ వేయించుకునేవాళ్ళం. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా- నేనిప్పుడు అతనికి సుపీరియర్ని. నేనదంత పట్టించుకోలేదు కానీ అతనికి మాత్రం అది పెద్ద సమస్యగా మారిందని త్వరలోనే అర్థం అవడం మొదలయింది. నాతో పాటు డ్యూటీ పడినప్పుడు అతను తన పనిని కావాలని నిర్లక్ష్యం చేయడం, పేసెంజెర్ల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మాయం అవడం ప్రారంభించేడు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించడం నామోషీగా అనిపించేది. కొత్తగా అసిస్టెంట్లుగా చేరిన అమ్మాయిల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం, వాళ్ళతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం- అది అతని అసలు స్వభావం అని అర్థం అయితే అయింది కానీ నాకు నేను ఎంత మట్టుకు నచ్చచెప్పుకున్నా, అసూయ మాత్రం పుట్టుకు వచ్చేది.

ఆ రోజు మాత్రం డిపార్చర్ హాల్ కిటకిటలాడుతున్నప్పుడు, అలవాటు కొద్దీ ఆదిత్య తన డ్యూటీ పోయింట్‌ని పట్టించుకోకుండా ఇద్దరమ్మాయిలతో కూర్చుని టీ తాగుతున్నాడు. అది చూసిన ఒక పాసెంజర్ అతన్నేవో వ్యంగ్యమైన మాటలని అని, నాదగ్గిరకి వచ్చి ‘కంప్లైంట్ బుక్ ఇస్తే అతని మీద కంప్లైంట్ రాసిస్తానని’ చెప్పేడు. ఎంత నచ్చచెప్పినా వినకపోతే విధి లేక అతనికి కంప్లైంట్ బుక్ అందించేను. సామాన్యంగా పేసెంజెర్లెవరైనా ఎన్ని మాటలన్నా కానీ లిఖితపూర్వకమైన ఫిర్యాదు వస్తే మాత్రం ఎయిర్‌పోర్ట్ మానేజర్ దానిమీద తప్పక ఏక్షన్ తీసుకుంటారు. అప్పటికే తన ఇంటికి ఫోన్ చేసినందుకు పోట్లాట పెట్టుకోడానికి నెపం వెతుకుతున్న ఆదిత్య ఈ సంఘటనతో నిగ్రహం కోల్పోయి, పేసెంజర్లు లేని ఖాళీ సమయం చూసి నా దగ్గిరకి వచ్చి కొట్టినట్టుగా అరుస్తూ మాట్లాడేడు. ఊహించని ఈ పరిణామానికి నేను ఒక్క మాటా మాట్లాడలేకపోయి వాష్ రూమ్లోకి నడిచేను. వాష్ రూమ్ అటెండెంట్లిద్దరు జరిగినది లోపలనుంచి తొంగి చూసినట్టున్నారు. నేను లోపలకి అడుగు పెట్టగానే మాట్లాడుకుంటున్నవాళ్ళు కాస్తా మౌనంగా పనులు కలిపించుకుని బిసీ అయిపోయేరు.

పట్టుమని ఒక వారం కాలేదు. మధ్య ముప్పైల్లో ఉన్న ‘అందమైనదే’ అనిపించే ఒకావిడ ఒక ఆదివారం విసిటర్స్ పాస్ తీసుకుని నావైపొచ్చింది. పరిచయం ఉన్న మొహంలా కనిపించింది తప్ప ఆదిత్య వాలట్లో ఆమె ఫోటో చూసేనన్న సంగతే గుర్తుకి రాలేదు. ఆమె వచ్చీ రావడంతోనే గొంతు పెద్దది చేసి “నా భర్తే కావలిసి వచ్చేడా నీకు?అంతా చెప్పేడులే నా ప్రియతొమ్. అయినా గంతకి తగ్గ బొంత అని నీలాంటి కురూపినే ఇంకెవడినో పట్టుకోక నా సంసారమే నాశనం చేయాలనిపించిందా? ఇకనుండీ అతని వెనక పడటం మానకపోతే, మీ డైరెక్టర్కి రిపోర్ట్ చేస్తా చూసుకో. ఏమనుకున్నావో! “ అంటూ ఎలా రుసరుసమంటూ వచ్చిందో అలాగే బయటకి నడిచింది. చుట్టూ జాలిగా చూస్తున్న చూపులని, హేళనగా పెట్టిన మొహాలని, లోలోపల నవ్వుకుంటున్నవారినీ తప్పించుకుంటూ ఎర్రపడిన ముఖం( తెల్ల చర్మం ఒక్కటే నాకు వారసత్వంగా వచ్చినది)తో, కళ్ళలోనుంచి ఉబికి వస్తున్న నీటిని అదుపులో పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి వాష్ రూమ్లోకి దూరేను.

ఆ రోజునుంచీ నేనే అతని డ్యూటీ ఎక్కడో చూసేక, అతనికి దూరంగా ఎక్కడో డ్యూటీ ఎంచుకునేదాన్ని.

మరుసటి నెల రోస్టర్లో నేను మధ్యాహ్నం షిఫ్ట్‌ కోసమూ దానితోపాటు టర్మినల్ బదిలీ కోసం కూడా అప్లై చేసేను. రెండూ మారేయి.

***

టర్మినల్ 2 లో నా గతాన్ని వెనక్కి నెట్టి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు కానీ నా క్రిత ఒకటిన్నర ఏళ్ళనీ ఆదిత్యతో తప్ప మిగతా ఏ స్నేహాలూ, బంధాలూ ఏర్పరచుకోకుండా వ్యర్థం చేసేనని గుర్తించలేకపోయేను. మెల్లిమెల్లిగా స్నేహితులంటూ ఏర్పడటం ప్రారంభించేరు. అప్పుడే నా పరిచయం మోహన్తో అయింది. సాయంత్రం డ్యూటీలో డిపార్చర్స్‌ టర్మినల్లో రాత్రివేళ ఖాళీగా ఉన్న కొంతమందిమి కలిపి భోజనం చేసేవాళ్ళమి. మోహన్ గొంతు బాగుండేది. అడగడమే ఆలస్యం, పాట ఎత్తుకునేవాడు.

అతనికి ఇష్టమైన సింగర్ మొహమ్మద్ రఫీ. పాట పాడేటప్పుడు నావైపు చూస్తూ పాడేవాడు. నన్నే ఉద్దేశ్యించి పాడుతున్నట్టుగా అనిపించేది. అది నిజమేనని తెలియడానికి ఎక్కువకాలం పట్టలేదు. మోహన్ కూడా డైరెక్ట్ రిక్రూటీయే. నాకన్నా కొంచం సీనియర్ . జిమ్‌కి వెళ్ళడం లేకపోతే రోజుకి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడవడం అలవాటు. వత్తైన జుట్టు. కళ్ళజోడు. తల్లి తామిలియన్, తండ్త్రి తెలుగు. తన కన్నా రెండేళ్ళు చిన్నదైన చెల్లెలు సంగీతకి పెళ్ళయిపోయింది. మోహన్‌కి పుస్తకాల పిచ్చి. స్పందన అతనినుండే ప్రారంభం అవడం వల్ల అతనికి చేరువు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఎయిర్‌పోర్టులో ఎవరి వ్యవహారాలూ రహస్యం కాకపోవడం వల్ల అతనినుండి దాగినదేదీ లేదు. అతనితో పెరుగుతున్న స్నేహంతో కూడిన సాన్నిహిత్యం నన్ను స్థిమితపరుస్తూ, నాకు సాంత్వన కలగజేస్తోంది. కానీ అది ఆదిత్యతో నాకు ముందుండే సంబంధంలో ఉన్న లోపాలనీ, దాని పునాది లేమినీ, మాకిద్దరి మధ్యా ఉన్న అసమానతనీ, అ అర్థరహితమైన సంబంధం ప్రారంభం అవడానికి గల నా బలహీనతకీ కూడా ఎత్తి చూపించడం ప్రారంభించింది.

ఆ తరువాత ఆరు నెల్లకే మోహన్తో నా పెళ్ళి జరిగింది. పెళ్ళికి వచ్చిన కొలీగ్సందరూ సంతోషపడ్డారు. ఆదిత్యని పిలవలేదు. మోహన్ తల్లీ, తండ్రీ ఎయిర్ పోర్టుకి దూరంగా ఉండటం వల్ల మేమిద్దరం అప్లికేషన్ పెట్టి ఎయిర్లైన్స్ కోలొనీలో ముందు రెండేళ్ళూ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆ తరువాత లోన్ తీసుకుని ఇప్పుడున్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాం.

ఇప్పుడు నేను తెల్లవారు షిఫ్టూ, తను మధ్యాహ్నం. పిల్లలకి దగ్గిరగా 24 గంటలూ తల్లో తండ్రో ఒకరైనా ఉండాలన్న మోహన్ ప్రతిపాదన నచ్చింది నాకు. నిద్ర లేమి ఇద్దరికీ. కానీ ఒకరికోసం మరొకరం, పిల్లలకోసం తపన పడటం ఆహ్లాదం కలిగిస్తోంది. నాకంటూ ఒక చిన్న లోకం ఏర్పడింది. అదంటే నాకు మక్కువ.

ఆ రోజుల ఉద్రిక్తతా, ఏడుపులూ, మొర్రలూ, అభద్రతాభావం, బెదిరింపులూ ఏవీ లేవిప్పుడు. మోహన్ కోసం తన భార్యతో పోట్లాడాలేమో అనే భయం లేదు. ఎవరో వచ్చి నన్ను బెదిరిస్తారేమో అనుకోనక్కరలేదు. ఈ సంసారం, ఈ మనిషీ నా స్వంతం. అరువు తెచ్చుకున్నదేదీ/ఎవరూ లేరు. నా ఆడపడుచుకీ అత్తమామలకీ నేనంటే ఎంతో అభిమానం. చాటుమాటు వ్యవహారాలు లేవు. ఎక్కడికి వెళ్తే ఎవరు గుర్తు పడతారో అన్న జడుపు లేదు. అప్పటి చీకటి బతుక్కీ దీనికీ ఎంత తేడా!

***
“మాడమ్ లక్నో పాసెంజెర్లు ఫ్లైట్ లేటయిందని గొడవ పెడుతున్నారు” అన్న అసిస్టెంట్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. వెళ్ళి చూస్తే అక్కడ సేన్‌గుప్తా పేసెంజెర్లని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.

“ ఓహో, ఇక్కడ పోస్టింగ్ అయిందా! మరి జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడిచ్చేడో! బదిలీల అధ్యాయం మళ్ళీ మొదలయిందన్న మాట!” అనుకుంటూ అటువైపు నడుస్తుండగా, “ ఏమిటయ్యా, పని రాదా? ఫ్లైట్ ఆలస్యం అవడానికి కారణం అడిగితే ఇదా సమాధానం?” అంటూ అరుస్తున్న బిగ్గర గొంతులు వినిపించేయి. అనుకోకుండా అతని వైపు చూస్తే అతని కళ్ళలో ఎర్రజీరలు. మనిషి పొట్టి, దానికి తోడు ముందుకి పొడుచుకుని వచ్చిన పొట్ట మీద నీలం రంగు యూనిఫార్మ్ టై కాస్తా అతను కదిలినప్పుడల్లా పొట్టమీద ఉండనని మారాం చేస్తూ ఇటూ అటూ ఊగిసలాడుతోంది. పదేళ్ళ కింద ఉన్న పలచని జుట్టు నున్నని బట్టతలగా మారినట్టుంది. ఎన్ని మార్పులు! అయిదేళ్ళయి ఉండదూ ఈ మనిషిని చూసి! తనకొక చోట పోస్టింగ్ అయితే నాకు వేరే చోట కావాలని నేనడగడం, అలాగే తనూ-ఇద్దరం ఒకరినొకరు తప్పించుకుంటూ, ఒకే సంస్థలో పని చేస్తున్నా కానీ ఒకరికొకరం ఎదురుపడలేదీ మధ్య.

ఈ మధ్య రతి అన్న ఎవరో కొత్తమ్మాయితో ఈ యాబై ఏళ్ళ మనిషి తిరుగుతున్నాడని విన్నాను. చిన్న నిట్టూర్పు విడిచి పాసెంజెర్ల మధ్యకి నడిచి నన్ను నేను సీనియర్ మేనేజర్గా పరిచయం చేసుకుని, ఫ్లైట్ స్థితిని వివరించడం ప్రారంభించేను. వెనక్కి చూస్తే ఆదిత్య లేడక్కడ.

మొబైల్లో మోహన్ నుంచి ఫోన్ “ రేపు నీకూ సెలవేగా! అమ్మావాళ్ళింటికి పిల్లలని తీసుకుని వెళ్దామా? అమ్మ అడుగుతోంది చాలా రోజలయింది కలుసుకుని- అని. సంగీత కూడా వస్తోందిట తన పిల్లల్ని తీసుకుని.” ‘ హమ్మయ్యా. నా జీవితం, నా సంసారం, నా వర్తమానం నన్ను పిలుస్తున్నాయి. గతమా, నన్ను క్షమించేవు. అది చాలు నాకు. దయచేసి ఇంక గుర్తు రాకు సుమా.’”

-కృష్ణ వేణి

 

మీ మాటలు

  1. krishna veNi gaaru.. mee story chala baagundi.. Good ! good narration

    • Krishna Veni Chari says:

      మధు అద్దంకిగారూ, నిజమే!!! నా మొదటి తెలుగు కథ. తెలుగులో రాయగలనని కూడా ఎప్పుడూ అనుకోలేదు. థేంక్యూ, థేంక్యూ, థేంక్యూ :)

  2. కృష్ణ,
    ఇది మొదటి కథలా అనిపించలేదు. చాలా బాగా రాసావు. కీప్ ఇట్ అప్ డియర్ ఫ్రెండ్! ఇంకా ఎన్నో కథలు రాయాలని మనసారా కోరుకుంటూ… నీ నేస్తం, దుర్గ.

  3. Venkat Addanki says:

    ఒక కధ రాయాలంటే సాధకబాధలు,సబ్జక్ట్ మీద క్లారిటీ ఉండాలి. పాఠకులని టచ్ చెయ్యాలి అంటే వర్ణన బాగుండాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే భాష మీద పట్టువుండాలి. అన్నీ సమపాళ్ళలో బాలన్స్ చేస్తూ తెలుగువారి జీవన విధానాలకి దూరంగా పెరిగిన తెలిగింటి ఆడబడుచుగా తెలుగులో ఇటువంటి మంచి కధను తొలిసారిగా రాసి పాఠకులను ఒప్పించగలగడం తో తెలుగు పాఠకులుకు ఒక కొత్త మంచి రచయిత్రి దొరికింది అనుకోవాలి. మీరు ఇలాగే అంచలంచలుగా తెలుగుసాహిత్యంలో మరింతగా ఎదిగి మరిన్ని మంచి కధలు ఇస్తారని ఆశిస్తున్నాను.ఈ మీ తొలి కధ సూపర్.

    • Krishna Veni Chari says:

      వెంకట్ అద్దంకిగారూ, థేంక్యూ. భాష మీద పట్టంటే లేదు. “తొలి కథ” సూపర్ “ అన్నారు. సంతోషంగా ఉంది.

  4. రామదుర్గం మధుసూదనరావు says:

    కృష్ణవేణి గారూ …కథ చాలా బాగుంది. గతానికి వర్తమానానికి మధ్య నడిచిన తీరు అభినందనీయం. కథా శిల్పం ముచ్చటగా ఉంది. మీది మొదటి ప్రయత్నం అన్నారు. కానీ భాష,భావ ప్రవాహాలు చూస్తే అలా అనిపించదు. మీ కలం నుంచి మరిన్ని చక్కని తెలుగు కథలు ఆశిస్తున్నా.

    • Krishna Veni Chari says:

      రామదుర్గం మదుసూదనరావుగారూ,
      కృతజ్ఞతలు.

  5. మొదటి కధలా లేదు. చాలా బాగుంది. మరెన్నో కధలు వ్రాయాలి మీరు.

    • Krishna Veni Chari says:

      బులుసు సుబ్రహ్మణ్యంగారూ, థేంక్యూ. ఇలా మిత్రులందరూ ప్రోత్సహిస్తుంటే సంతోషంగా ఉంది.

  6. తెలుగు రచయిత గా కృష్ణవేణి గారి ప్రయాణానికి మొదలు ఈ కథ .. ఇది నాకొక ఆశ్చర్యం ..తెలుగు సరిగ్గా రాదు అనుకుంటూనే ఆమె కధ రాసిన తీరు, భలే ఉంది .. ముఖ్యంగా అర్బన్ ఫీమేల్ ఇష్యూస్ , అర్బన్ కేయాస్ రాస్తున్న వాళ్ళల్లో .. కుప్పిలి పద్మ గారి తర్వాత నాకు కృష్ణవేణి గారు కథ భలే కనెక్టింగ్ గా ఉంది ..
    way to go friend .. Keep writing .. Love. Sai

    • Krishna Veni Chari says:

      సాయి పద్మా, ఇంత మెప్పుకి నేను అర్హురాలినా! “తెలుగు సరిగ్గా రాకపోవడం”- అబద్ధం కాదు. వాతావరణ వర్ణనలూ అవీ రాయాలంటే భాష సరిపోదు. ఏదో ఇంట్లో మాట్లాడుకునే తెలుగు తప్ప. మరీ ఇలా ప్రసిద్ధ రచయిత్రులో పోల్చేస్తే ఎలా!

  7. కృష్ణవేణి గారు,
    ఇది మీ మొదటి కథలా లేదు. తెలుగు రాదంటూనే ఎంత బాగా రాశారు. చాలా బాగుంది.ఇంకా మీరు ఎన్నొ కథలు వ్రాసి, పెద్ద రచయిత్రిగా ఎదగాలి. ఆల్ ద బెస్ట్.

    • Krishna Veni Chari says:

      థేంక్యూ మాలగారూ. ఈ మధ్య మీ అందరి మధ్యా ఉండడంతో తెలుగు సరైంది కదా అని ధైర్యం చేసేను కొంచం. సహవాస ఫలం. కానీ కథలో పెద్దపెద్ద మాటలు ఉపయోగించలేను.

  8. venkata krishna (kittigadu) says:

    చాల బాగుంది కృష్ణవేణి గారు, ఓ శీతాకాల ఉదయాన నడకకు వెళ్ళినప్పుడు అ మంచు మౌనాన మనసున దొర్లే జ్ఞాపకాల అలల ఉంది.

    • Krishna Veni Chari says:

      వెంకట క్రిష్ణ (కిట్టిగాడు) గారూ, థేంక్యూ.
      > ఓ శీతాకాల ఉదయాన నడకకు వెళ్ళినప్పుడు అ మంచు మౌనాన మనసున దొర్లే జ్ఞాపకాల అలల ఉంది.<
      వావ్! ఇలాంటి మాటలు నేను రాయను కూడా రాయలేను.
      కథని చదివినందుకూ, మెచ్చుకుని, మీ అభిప్రాయం తెలిపినందుకూ కృతజ్ఞతలు.

  9. కిరణ్ కుమార్ కే says:

    గ్రీటింగ్స్.
    ఇది మీ మొదటి కథలా లేదండి కృష్ణ వేణి గారు. బాగా రాసారు. నాకు ఈ కథ నచ్చింది. మీ నుండి వచ్చే మరిన్ని కథల కొరకు ఎదురు చూస్తాను.

    • Krishna Veni Chari says:

      కిరణ్ కుమార్ కే,
      థేంక్యూ. తెలుగులో ఈ మధ్యే రాయడం. “మరిన్ని కథలు” అంటే ఏమో రాయగలనో లేదో కూడా తెలియదు. కానీ ఈ కథ నచ్చినందుకు కతజ్ఞతలు.

  10. ఇది తెలుగు కథా? లేక హిందీ కథకు అనువాదమా?

    • Krishna Veni Chari says:

      మీరు రాసిన కామెంట్ కనిపించకపోవడం వల్ల నేను “సారంగ” టీముకి రాసేను. సమాధానం చూడండి మోహన్ గారూ. మీరే హిందీ కథ- ఇలాంటిది చదివేరో చెప్తే నేనూ చదువుతాను. స్కూల్ పాస్ అయిన తరువాత హిందీ పుస్తకాలేవీ చదవలేదు మరి!
      అసలు మీకెందుకు ఇలాంటి సందేహం కలిగింది? తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడినుంచో కాపీ కొట్టడం కాపీ రైట్స్ ఉల్లంఘన అన్న సృహ ఉంది నాకు. మీ గురించి నాకు తెలియదు కానీ జర్నలిస్మ్ విధ్యార్థినిగా ఉన్నప్పటినుంచీ నేను వారం వారం ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కికి ఒక కాలమ్ రాస్తాను. కాబట్టి ఈ సంగతులన్నీ నాకు బాగానే తెలుసు.
      మిమ్మల్ని ఉద్దేశ్యించి సారంగ టీముకి నేను రాసిన సమాధానాన్ని చదువుకోగలరు౤
      మీరు హిందీ పుస్తకాలు బాగా చదువుతారనుకుంటాను. ఆ పుస్తకం పేరేదో కొంచహం చెప్తారా?

    • Venkata Addanki says:

      కొండొకచో ఎక్కడన్నా రచయితల ధీమ్ కలిసి ఉండవచ్చేమో మోహన్ గారికి ఏమన్నా అలాంటి కధ తగిలుండవచ్చేమో గానీ ఏ ఆధారం లింక్ పోస్ట్ చెయ్యకుండా అనువాదమా అని అడగడం అసమంజసం . లేదా కధ సాగిన నేపధ్యం అలా అనిపించివున్నా అడిగే విధానం తప్పు.

      • Krishna Veni Chari says:

        వెంకట అద్దంకిగారూ,
        క్రృతజ్ఞతలు. నేను చెప్పలేకపోయినదీ, ఎలా చెప్తామనుకున్నదాన్నీ మీరు సరిగ్గా చెప్పినందుకు. :)

  11. Krishna Veni Chari says:

    సారంగా టీమ్,
    ఇలా రాయడం సరైన ప్రొటోకోలో కాదొ నాకు తెలియదు. నా ఇన్‌బాక్స్ లో ఎవరో “ మోహన్ “ గారు పెట్టిన కామెంటుంది. మరిక్కడకి వచ్చి చూస్తే ఆ కామెంట్ లేదు.
    ఆయన అడిగిన ప్రశ్న–>ఇది తెలుగు కథా? లేక హిందీ కథకు అనువాదమా?<
    దానికి సమాధానం చెప్తున్నాను. ప్రచురించాలో లేదో మీకే ఎక్కువ తెలుసు. నాకివన్నీ కొత్త.
    “”””మోహన్ గారూ, ఇది తెలుగు కథేనండీ. నేను ఏర్లైన్సులో 21 ఏళ్ళకి పైగా పని చేసేను. కాబట్టి ఏయిర్ పోర్ట్ గురించి రాయాలంటే “కాపీ” కొట్టే అవసరం ఎందుకు వస్తుంది? అసలు మీకా అపోహ ఎలా కలిగింది? ఢిల్లీ నేపథ్యంలో కథ ఉన్నందువల్లా? నేను పుట్టినప్పటినుంచీ ఇక్కడే ఉన్నాను. అందుకే ఏ హైదరాబాదులో ఉన్న ఏయిర్‌పోర్ట్ గురించో రాయలేను. నాకు తెలిసిన, చూసిన లోకం గురించి మాత్రమే రాయగలను.
    మీరు ఇలాంటి హిందీ కథేమైనా చదివేరా? పేరు చెప్పగలరు. నేను హిందీ పుస్తకాలు చదవడం మాని చాలా ఏళ్ళయింది. ఈ నెపంతోనైనా చదువుతాను.

  12. SURESH KUMAR says:

    చాల బాగా రాసారు …కృష్ణ వేణి గారు .మీ నుండి మరిన్ని కథలు ఆశిస్తున్నాం ..

  13. Krishna Veni Chari says:

    సురేష్ కుమార్ గారూ, కథ నచ్చినందుకు కృతజ్ఞతలండీ. “మరిన్ని” అంటే ఏమో మరి- రాయగలనో లేనో కానీ ప్రయత్నం మాత్రం చేస్తాను

  14. చాలా బాగుంది కథ. అభినందనలు.

    • Krishna Veni Chari says:

      ఎన్నెలగారూ, మీ మెప్పు నాకెంతో సంతోషం కలిగించింది. ఇటువంటి సబ్జెక్ట్సుకి అసలు ఆదరణ లభిస్తుందా లేదా అని సందేహపడుతూ ఉండాలి. మీ కామెంట్ వల్ల కొంచం ధైర్యం సమకూరింది. థేంక్యూ. తెలుగు బ్లాగుల్లో మీ పేరు విన్నాను.

  15. sasi kala says:

    నైస్ నేరేషన్ మేడం

  16. Krishna Veni Chari says:

    శశి కళగారూ, మీకు నచ్చినందుకు బోల్డు థేంక్సండీ

  17. చాలా కాంటెంపరరీ స్టొరీ లైన్. Thought process is genuine too!. ఇలాంటి కధలు నిజ జీవితం లో మనం చూస్తూనే ఉన్నాము. I liked the way you gave her closure to her previous story. Glad she moved on and has closed the book forever! Good luck for future works :)

  18. Krishna Veni Chari says:

    Deepa Gi గారూ, thank you so very much for your detailed comment. “రొజాయి” –ఇలాంటి మాటలు చాలా ఎక్కువసార్లు వాడడమూ, అలాంటి తప్పులన్నీ చాలా ఉన్నాయి. అచ్చుతప్పులు కూడా. కానీ పబ్లిష్ అయిపోయేక వాటిని గమనించేను.

  19. naveen kumar says:

    దాదాపు గా నేను చెప్పాలి అనుకున్నవి మిత్రులు అందరు పైన చెప్పేశారు , కృష్ణవేణి గారికి నా హృదయపూర్వక అభినందనలు , తప్పకుండా మీ నుండి ఇంకా చాలా కథలు ఆశిస్తున్నాను , ఈ fb whatsapp యుగం లో మళ్ళి మన సాహిత్యానికి జీవం పోస్తున్న మీకు మరొక్క సారి అభినందనలు తెలుపుతూ ……..నవీన్ @ సామాన్యుడు

    • Krishna Veni Chari says:

      నవీన్ కుమార్ గారూ,
      బోల్డు కృతజ్ఞతలు- కామెంట్‌కీ, అభినందనలకీ కూడా. అందరి ప్రోత్సాహం చూస్తే సంతోషంగా ఉంది.
      థేంక్యూ.

  20. ఏల్చూరి మురళీధరరావు says:

    కథ, కథనం కథనీయంగా ఉన్నాయి. మీకు అభినందనలు!

  21. Krishna Veni Chari says:

    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మీ వద్దనుండి మెచ్చుకుంటూ కామెంట్ రావడం ఒక సర్టిఫికెట్ లాంటిదే. కృతజ్ఞతలు.

  22. చాలా బాగా రాశారు.

    • Krishna Veni Chari says:

      థేంక్యూ నారాయణ స్వామిగారూ,
      మిత్రులందరూ ప్రోత్సహిస్తూంటే సంతోషంగా ఉంది.

  23. ఓలేటి శ్రీనివాసభాను says:

    ఇది మొదటి కథా ? కాదేమో! … ఎంతో సూటిగా ఉంది. స్పష్టంగా , సరళంగా , సాఫీగా ఉండటం తో బాటు చదువరిని ప్రతీ పదం చర చరా లాక్కుపోతుంది. ఔద్యోగికపరమైన వాతావరణాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టిస్తూనే, అంతరంగ చిత్రాన్నిచక్కగా ఆవిష్కరించారు. మళ్ళీ అదే అనుమానం , ఇది మొదటి కథా ? కాదేమో!

    • Krishna Veni Chari says:

      హహహ, మొదటి కథ కాదేమోనన్న మీ కామెంట్/సందేహమే చాలా సంతోషం కలిగింది ఓలేటి శ్రీనివాసభానుగారూ. అసలు కథలు రాయడానికి నాకొచ్చిన (రాత) తెలుగు సరిపోతుందా లేదా అని సందేహపడుతూనే పంపించేను. “సరళంగా” కాక మరోలా రాయడానికి అన్ని క్లిష్టమైన మాటలు తట్టవు. మొట్టమొదట ఉన్న పారాలోనే “ రాత్రి సెట్ చేసి పెట్టిన టైం” అన్నది ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయకుండా పంపించేను. అనుభవం ఉన్నవాళ్ళెవరైనా ఇలాంటి తప్పులు చేస్తారా! ఏది ఏమైనా మీ మెప్పుదలకి బోల్డు బోల్డు కృతజ్ఞతలు.

  24. voleti srinivasa bhanu says:

    ఓ విషయం చెప్పాలండీ .. ప్రూఫ్ రీడింగ్ లో నేను చాలా పూర్ . కథారంభం నన్ను చదివింపజేసేలా ఉంటే అక్కణ్ణించి ఆ వాతావరణం లోకి వెళ్ళిపోతానుకాబోలు ఇక అచుతప్పులు నా కంట పడవు . మీరు కథని ఆరంభించిన తీరు ఢిల్లీ లోని శీతకాలం ఉదయం లోకి నన్ను తీసుకువెళ్లిపోయింది . అలాగే ఎయిర్ పోర్ట్ వాతావరణం కూడా! కళ్ళకు కట్టించారు . కెమెరా కన్ను తో కథను చూపిస్తూనే పాత్ర అంతరంగాన్ని ఆవిష్కరించే శైలి మీ కథ లో ఉంది. అందువల్ల సాంకేతిక లోపాలు నాకు అవరోధాలు కాలేదు.

  25. Krishna Veni Chari says:

    ఓలేటి శ్రీనివాసభానుగారూ,
    ఇంత మంచి వివరమైన కాంప్లిమెంటుకి నేను చెప్పగలిగే సమాధానమల్లా ఒక పెద్ద “థేంక్యూ” మాత్రమే.
    థేంక్యూ :)

  26. Vijayalaxmi Dusi says:

    వేరి నైస్ స్టొరీ హార్ట్ టచింగ్

    • Krishna Veni Chari says:

      విజయలక్ష్మి దూసి, నచ్చినందుకు చాలా చాలా థేంక్స్ :)

  27. తిలక్ బొమ్మరాజు says:

    కృష్ణవేణి గారు మీ కథ చాల బాగుంది.ఒక ఫ్లో కొనసాగింది చివరిదాకా.నచ్చింది.అభినందనలు.

  28. చాలా బావుంది .

  29. Krishna Veni Chari says:

    శ్రీదేవి గారూ,
    చాలా చాలా థేంక్స్ -మీకు నచ్చినందుకు :)

  30. కథ ఆసాంతం చదివాను.ఇంట్రస్టింగ్ గా వుమది.తోలికథన్న తోట్రుపాటు లేదు.చక్కని ప్రారంభం.ముగింపు బాగుంది.బహుశా ఎయిర్ పోర్ట్ నేపథ్యం మీ వ్రుత్తి రీత్యీ వున్న సౌలభ్యం అనుకుంటా.ఎనీవే బాగా నచ్చింది నాకు

  31. Krishna Veni Chari says:

    సాయి. గోరంట్ల గారూ,
    థేంక్యూ :)

  32. kothapalli ravibabu says:

    ఇంకా నయం. ఈ పురుషాహంకార సమాజంలో ‘ ఈ కధ మీరు రాసారా లేక మీ ఆయన రాసి మీ పేరు పెట్టారా’ అని ఎవరు రాయనందుకు ఎంతో సంతోషం గా ఉంది. ఆధారం లేకుండా హిందీ కధకు అనువాదమా అని మోహన్ రాయడం అసహ్యంగా ఉంది.

  33. Krishna Veni Chari says:

    ‘ మీ ఆయన రాసి మీ పేరు పెట్టారా?’ హహహ.
    అలా అడగనందుకే ఆయనకి బోల్డు కృతజ్ఞతలు.
    ఈ పాత కథ మీ కంటబడి, దీన్ని మీరు చదివి కామెంటు కూడా పెట్టినందుకు మీకు థేంక్యూ.

Leave a Reply to ennela Cancel reply

*