కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్  –  కొప్పర్తి

నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”….. అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.

59740_566066773423516_1763463627_n

రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి.

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//…… అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.

 

ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి.

ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.

రక్తాన్నెక్కించగలరు కానీ

కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా…… అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.

 

 -బొల్లోజు బాబా

 

 

కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

 

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌

నిజమే కావచ్చు

బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

 

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు

రక్తం ఉబుకుతుంది

రక్తం ఉరలుతుంది

కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది

రక్తం కళ్లచూడాలంటే

రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌

ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

 

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో

అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు

నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది

ఒకే గొడుగు కిందకు తెచ్చింది

 

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది

ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది

అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం

నియంతను నరికినా అదే రక్తం

తెల్లవాణ్ణి నల్లవాణ్ణి

డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి

మంచివాణ్ణి చెడ్డవాణ్ణి

ఎవర్ని ఎవర్ని నరికినా

అదే రక్తం చిందుతున్నప్పుడు

మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ

మనిషితనానికి చిరునామా అవుతున్నదా

 

మంచి రక్తం చెడు రక్తం

అంటూ ఉంటాయి కానీ

మహామనిషి రక్తం

మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

 

అందుకే

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

 

లోలోపలి మనిషితనానికి

బాహ్యరూపం కన్నీళ్ళు

ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

 

తెలుసా

మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి

నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి

ఒకరు రాయి విసరనక్కరలేదు

మరొకరు కత్తి దూయనక్కరలేదు

గాయపరచేదైనా అనునయించేదైనా

చిన్నమాట చాలు

కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి

చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి

చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి

కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి

జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి

నిజానికి ఇవి కూడా అక్కరలేదు

ఒక్క ఊహ

వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

 

గుండె బరువెక్కి

ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి

కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

 

కళ్ళు వర్షించినపుడు

మనిషి నల్లమబ్బుల ఆకాశం

కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు

మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం

మనలోంచి మనం తవ్వుకునే

తెల్లటి మణులు కన్నీళ్ళు

 

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు

రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు

మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ

ఉండాలని ఎవరు చెప్పగలరు

రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది

కళ్ళు చిప్పిల్లాలంటే

రసాయనిక చర్య జరగాల్సిందే

 

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం

కణసముదాయాలుగా విడిపోయింది

పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది

కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా

స్వచ్ఛంగా ఉండిపోయాయి

 

యుద్ధ బీభత్స ప్రతీక – రక్తం

యుద్ధ విధ్వంస స్మృతి – కన్నీళ్లు

యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది

స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

 

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ

దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

 

రక్త హీనత ఉన్నట్టే

దుఃఖ లేమి కూడా ఉంటుంది

రక్తాన్ని ఎక్కించగలరు కానీ

కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా

 

—–కొప్పర్తి

మీ మాటలు

 1. Good write-up! This poem lingers in my mind since 2008 when I first read and I always quote to many of friends in emails this excerpt ” ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి
  కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి
  కళ్ళు వర్షించినపుడు
  మనిషి నల్లమబ్బుల ఆకాశం
  కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు
  మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం
  మనలోంచి మనం తవ్వుకునే
  తెల్లటి మణులు కన్నీళ్ళు “

 2. రాజారామ్.టి says:

  నా అభిమాన కవి కొప్పర్తి గారి కెమిష్ట్రి ఆఫ్ టియర్స్ ని అద్భుతంగా విశ్లేషించావు బాబ గారు.

 3. మంచి కవి కొప్పర్తి. మంచి పరిచయం.
  నిజానికి కొప్పర్తి కవిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే విశ్లేషణ రావాల్సే వుంది. అది కూడా మీరే చేసెయ్యండి.

 4. Koganti Vijaya Babu says:

  “గుండె బరువెక్కి
  ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి
  కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి”

  స్వచ్ఛమైన మనిషి మాత్రమే వ్రాయ గల వాక్యాలు . మీ కెమికల్ ఎనాలిస్ కు అభినందనలు.

 5. Aranya Krishna says:

  గొప్ప ముగింపు . నిజం! కన్నీళ్లు అమూల్యం. రక్తహీనతకు వేరొకరి రక్తం ఎక్కించినట్లు అశృహీనతకి వేరొకరి అశృవులు ఎక్కించలేము. ఎవరి కన్నీళ్ల వెనకాల దుఃఖం వారిదే. ఎవరి దుఃఖం వెనక విషాదం వారిదే, అనుభవమూ వారిదే. కన్నీటిని తాత్వీకరించిన కవిత.

మీ మాటలు

*