కారా: కదనరంగంలో వున్న రిపోర్టర్‌

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కా.రా. గారు తన కథల్లో అనుభవం నుంచి వచ్చే అవగాహనకు,  విజ్ఞతకు ఆఖర్న చైతన్యానికి  చాల ప్రాధాన్యతనిస్తారు. అది న్యాయమే. కాని ఆశ్చర్యంగా కారా గారి రాజకీయ అవగాహన మాత్రం ఆయన పరిశీలన నుంచి వచ్చింది. ఆ పరిశీలన నీళ్లల్లో వున్న తామరాకు పరిశీలన వంటిది. ఆ తామరాకు నీటిలో ఎంత మమేకంగా ఉంటుందంటే ఆ ఆకు మీద కూడ నీటి చుక్కలుంటాయి. అయినా ఆ తామర నీటి కొలది లోతుగా వుంటుంది. ఆ నీళ్లు అంటకుండా నీటిస్వభావం గురించి, బురద అంటకుండా బురద స్వభావం గురించి చెప్తుంది. కారా కదనరంగంలో వున్న రిపోర్టర్‌ వంటి కథకుడు.

ఒక కథకునికి ఉండవలసిన వస్తుగతదృష్టి (ఆబ్జెక్టివిటీ అనే అర్థంలో) అలవడడానికి బహుశా ఆయన నేపథ్యం ఆయనకు బాగా అనుకూలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. కాని ఆదివాసీ ప్రాంతంలో కాదు. మైదానప్రాంతంలో  పల్లెటూళ్లో పుట్టి పల్లెటూళ్లో పెరిగారు. పనిచేసే కులాల్లో కాదు. ఇవి ఆయనకు నిమగ్నమై వుంటే ఉండే ఆవేశానికి బదులు పరిశీలన వల్ల వచ్చే సంయమనానికి దోహదం చేసినయి. చిన్పప్పటినుంచే లెక్కలు కట్టే వృత్తికి తోడు ఆయన క్రమంగా లెక్కల విద్యార్థి, లెక్కల మాస్టారు అయ్యారు. కారా గారికి రానురాను మేస్టారు అనేది పర్యాయపదంగా స్థిరపడిరది. 1951 నుంచి 72 దాకా ఆయన కథల్లో మనకి లెక్కలమాస్టారుకుండే ఔచిత్యం (ప్రిసిషన్‌), పరిశీలన కనిపిస్తాయి. శైలిలో కూడ లెక్కల్లో  ఉండే దశలు (స్టెప్స్‌) కూడ అట్లా తప్ప ఊహించుకోలేని విధంగా వచ్చిపడతాయి. బహుశా తెలుగుకథకుల్లో చరిత్ర, భూగోళాలు, స్థలకాలాలు స్వప్నావస్థలో కూడ విస్మరించని అరుదైన స్పృహ గల వాళ్లలో ఆయనొకరు.

పొలిటికల్‌ ఎకానమీకి ఇవన్నీ ఒక వాతావరణాన్ని కల్పిస్తాయి. పరిసరాలను సమకూరుస్తాయి. ఈ సామాజిక దేశకాల పాత్రల నుంచి ఆ దేశ రాజకీయార్థిక నేపథ్యం ఏర్పడుతుంది. లెక్కల విద్యార్థిగా, మేస్టారుగా, శ్రీకాకుళం జిల్లావాసిగా 1857 నుంచి 1972 దాకా సామాజిక పరిణామాల నాడిని ఆయన పట్టుకున్నారు.

 

ఆస్తి సంబంధాలు శ్రమదోపిడీ

ఈ అవగాహన ఆయనకు 1951లో ‘అప్రజ్ఞాతం’ కథ రాసేనాటికే ఏర్పడుతున్నది. అప్పటికి దేశం నుంచి బ్రిటిష్‌వాళ్లు వెళ్లిపోవడం అధికారం కాంగ్రెస్‌ హస్తగతం కావడం, రాజ్యాంగ రచన, తెలంగాణలో కమ్యూనిస్టుపార్టీ సాయుధపోరాట విరమణ చేయడం జరిగిపోయాయి. మొదటి సాధారణ ఎన్నికల్లోకి పోబోతున్నాం.

‘అప్రజ్ఞాతం’ కథలో సుదర్శనం యువకుడు. బి.ఎ. పరీక్షలకు కూర్చున్నాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ స్వగ్రామంలో ఉన్నాడు. వయసు ముదిరాక చదువులో ప్రవేశించడం వల్ల విద్యార్థే అయినా విద్యార్థిలా కనిపించడు.

అతనికి దొంగతనానికీ, దోపిడీకి ఉన్న తేడా మార్క్సిజం అధ్యయనం వల్ల అర్థమయింది మాత్రమే కాదు, ఊళ్లో సూరప్పడు వంటి ధర్మకర్త అయిన భూస్వామి దౌర్జన్యపూరితమైన భూసంబంధాల్లో కూడ అర్థమైంది. [1]

“నువ్వు దోపిడీని, దొంగతనాన్ని ఒక్కటే అనుకుంటున్నావు. దొంగతనమంటే నువ్విందాక చెప్పినట్టు ఎవరూ చూడకుండా ఎవరికీ తెలియకుండా కాటేసుక పోవడం. దోపిడీ అనేది వేరు. పట్టపగలు అందరూ చూస్తుండగానే  భుజబలంతోనో, ఆయుధ బలంతోనో, సంఘబలంతోనో ప్రతిఘటించడానికి అసమర్థుణ్ని చేసి దౌర్జన్యంగా ధనాన్నో బంగారాన్నో లేక ఇంకొక సంపదనో స్వంతదారుని చేత తెప్పించి పుచ్చుకొని మహారాజులా తీసుకపోతే – అదీ దోపిడీ”. (అప్రజ్ఞాతం – పే.112, కా.రా.కథలు) ఈ విషయం ఇంకా లోతుగా 113, 114 పేజీల్లో సుదర్శనం వివరిస్తాడు)

సూరప్పడు వంటి జగన్నాథభక్తుడు స్వయంగా తనకు, కూలీలకు ఎవరికీ సోయి కూడ లేకుండా చేసిన దోపిడీ వివరాలు చదివితే (పే.116,117) ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా  శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఆదివాసులను వడ్డీవ్యాపారులు, భూస్వాములు చేస్తున్న దోపిడీ గురించి – వాళ్లు తాము పోడు చేసుకున్న భూముల్లోనే తాము కంబారీలుగా మారడం గురించి దేశవ్యాప్తంగా మార్క్సిస్టు మేధావులు చేసిన విశ్లేషణంతా గుర్తుకొస్తుంది.

“రూపాయికి కాని వడ్డీ అంటే సంవత్సరానికి నూటికి ఏడువేలా?”

“ఇది గణితం. కావలిస్తే ఆ తరవాత కాగితం మీద వేసి చూడు”

ఈ గణితం నుంచి, ఈ శాస్త్రదృష్టి శాస్త్రీయదృష్టికి మారడం నుంచి ప్రారంభమైంది కా.రా. గారి రాజకీయ అవగాహన. లెక్కలు నిష్పక్షపాతంగా చేసినంతకాలం ఈ రాజకీయావగాహన ఇంకోతీరుగా ఉండడానికి వీలులేదు.

భూసంబంధాల్లో – అంటే భూస్వామి-కూలీ సంబంధాల్లో, వర్తకంలో షాహుకారు-రైతు సంబంధాల్లో, పరిశ్రమల్లో – ఫ్యాక్టరీ యజమాని-కార్మికుని సంబంధాల్లో ఈ దోపిడీ స్వభావం అర్థమైనా – (ఇది అర్థం కావడానికి గణితం చాలు) గణితం నుంచి మనిషి అవగాహన తాత్త్వికస్థాయికి పోతేనే దీనికి మూలాలు అర్థమవుతాయి. (గణితానికి – తత్వశాస్త్రానికి ఉన్న సంబంధం ఇవాళ కొత్తగా వివరించనక్కర్లేదు)

“…..ఆస్తంటూ ఎవరి దగ్గరకు ఏ మేరకు చేరినా అది అన్యాయార్జితమే. న్యాయంగా సంపాందించిన డబ్బు మనిషి భుక్తికి మాత్రమే సరిపోతుంది. కడుపుకి లేని పేదవారు ఈ లోకంలో ఉన్నంతకాలం అంతకుమించి చేసిన ఆర్జనంతా అన్యాయార్జితమే.

ఎవడిపొట్ట కొట్టందే మన పొట్టకు మించిన తిండి మన యింట్లో మిగలదు. పదిమంది ఆస్తి చెదిరితే గానీ ఒకడి ఆస్తి పెరగదు” (అప్రజ్ఞాతం- పే.120)

ఆస్తి, ఆస్తిసంబంధాలు, దోపిడీ గురించి 1951 నాటికే కా.రా. గారికి ఇంత స్పష్టమైన అవగాహన ఉండడానికి ఆయనకు ప్రధానంగా తోడ్పడింది పరిశీలన. బ్రిటిష్‌ ఏజెన్సీ నేపథ్యం నుంచి వచ్చిన రచయితలకు – గిడుగు – గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు ఇవ్వాటివరకు – ఈ పరిశీలన అబ్బడానికి అక్కడ జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పరోక్ష దోహదం ఉన్నది. గురజాడ వంటివారికి అది చదువుల వల్ల అబ్బవచ్చు – రాజాస్థానంలో ఉండి అటునుంచి పరిశీలించడం వల్ల కూడ కలగవచ్చు. కొందరికి ప్రత్యక్ష అనుభవం నుంచి రావచ్చు.

తర్వాతకాలంలో ‘యజ్ఞం’ (1964), శాంతి (1971) కథలలో ఈ ఆస్తి, శ్రమదోపిడీ, వర్గసంబంధాల గురించి ఇంకా పెద్ద కాన్వాసుపై – ఆరంభంలో చెప్పినట్లు ఈస్టిండియా కంపెనీ ఈ దేశంలోకి వచ్చి ఇక్కడి ప్రకృతివనర్లను, మానవ వనర్లను మూలాల నుంచి, మూలుగుల నుంచి పీల్చిన క్రమాన్ని పాత్రలు, సంఘటనలు – కథలో భాగంగానూ, వ్యాఖ్యానంగానూ పాత్రలనోటే చెప్పిస్తారు. ‘అప్రజ్ఞాతం’లో గుడిలో చేరినవాళ్ల చర్చ తప్ప, ఆ చర్చలో అనివార్యంగా రాజకీయాలు వస్తాయి గనుక వ్యక్తమయిన రాజకీయ అవగాహనే తప్ప – ఈ రాజకీయ అవగాహనకు రక్తమాంసాలిచ్చే సంఘటనలు ఆ కథలో లేవు. విచిత్రంగా ఈ చర్చ ముగిసినాక రెండు చిన్న సంఘటనలు జరిగాయి. సూరప్పడి కొడుకు జబ్బుపడి బతకడనుకున్నారు. సుదర్శనం అతడు బతకాలని తనకు నమ్మకంలేని దేవునికి మొక్కుకున్నాడు. అతడు బతికాడు. అట్లా తన విశ్వాసాలకు భిన్నంగా మొక్కుకున్నందుకు అతడు సిగ్గుపడ్డాడు. సుదర్శనం పరీక్ష ఫెయిలయ్యాడు. 1951 నవంబర్‌ నాటికి ఇది దేశంలో రచయితలకయినా,  బుద్ధిజీవులకైనా అవగాహనకు సంబంధించిన విషయమే. ఈ కథ ‘జయభారత్‌’లో 1951 నవంబర్‌లో అచ్చయిన నెలలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ పరిపూర్తి అయింది. సుదర్శనం ఏ వర్గ రాజకీయాల ఆధారంగా, ఆస్తి, దోపిడీ సంబంధాల చర్చ చేసాడో ఆ రాజకీయాలు అతి త్వరలో వర్గసామరస్యంలోకి, పార్లమెంటరీ రాజకీయాల్లోకి పరివర్తన చెందాయి.

ఇంక దాదాపు ఒక దశాబ్దం పైన ఇటువంటి చర్చకు తప్ప ఆచరణకు అవకాశం రాలేదు. 1964లో కమ్యూనిస్టుపార్టీ చీలికకు కారణమైన అనేకానేక విషయాల్లో ప్రజల హృదయాల్లో అట్టడుగున ఉడుకుతున్న అస్పష్టమైన వర్గసంబంధ అశాంతికి వ్యక్తీకరణ సామాజిక, రాజకీయార్థిక రంగాల్లో పొడసూపినట్లే సాంస్కృతిక వ్యక్తీకరణగా వచ్చిన ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ‘యజ్ఞం’.

1964లో వచ్చిన ‘యజ్ఞం’ 1965లో వచ్చిన ‘దిగంబరకవులు’ (ఇంకా ముందుగా వచ్చిన ‘రాత్రి’ కవితాసంకలనం – శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ మొదలు, కె.వి.ఆర్‌., సి.విజయలక్ష్మి వంటి కవుల, కొ.కు., రావిశాస్త్రి వంటి కథకుల రచనలు – 1960-67 మధ్యన వచ్చినవి) చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలకు ముందరి పురుటినొప్పుల వంటివి. వీటిల్లో – ముఖ్యంగా  ‘యజ్ఞం’లో, దిగంబరకవుల్లో అసంబద్ధత (అబ్సర్డిటీ) ఉందనుకున్నా ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ ఉన్నదనుకున్నా అది సమాజంలో ఉన్నదీ – అప్పుడా సమాజానికవసరమయిందీ.

పరిష్కారాల చర్చలోకి వెళ్లడానికన్నా ముందు కా.రా. గారి రాజకీయ అవగాహనకు బలమైన పునాదిగా ఉన్న భారతీయ సమాజాల గ్రామీణ రాజకీయార్థిక జీవితం – ఎంత వెనుకబాటుదయినా దీనికున్న స్వయం ఆలంబనశక్తి – 51 నుంచి ఆయన చాల కథల్లో  ప్రస్తావనకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. గ్రామం – గ్రామంలో భూమిని సాగుచేసే రైతు ఆ వ్యవసాయ సంబంధమైన వృత్తులు – వాళ్ల పరస్పర సహాయ సహకారాల అవసరాలపై ఆధారపడిన ఆర్థికవిధానం – ఎంత బలహీనమైనది, సాధారణమైనదయినా సరే – ఈస్టిండియా కంపెనీ రాకపూర్వపు ఆర్థిక స్థితి ఇది. ఫ్యూడల్‌, రాజరిక పరిపాలనలోనూ, ఉత్తరాన విదేశీ దండయాత్రల్లోనూ – దోపిడీ జరగలేదని గానీ, ఈ ఆర్థిక చట్రం భగ్నం కాలేదనీ కాదు – కాని వృత్తులు చెదిరిపోలేదు. ‘సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు’ విధ్వంసం కాలేదు. ఆ ఆర్థిక విధ్వంసన ఈస్టిండియా కంపెనీతో ప్రారంభమై 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటిషిండియా పరిపాలన వచ్చి అది మన రాజకీయార్థిక వ్యవస్థగా మారిపోయింది.

‘కులంచే అతను సాలె. తండ్రికి ఒక్కడే కొడుకు. తల్లి లేదు. అతడి తండ్రి కులవృత్తి చేతే జీవిస్తుండేవాడు. ఆ సరికే యార్క్‌షైర్‌, లాంకాస్టర్‌ మిల్లుల రాక్షసహస్తాలు భారతదేశంలో నాలుగువంకలా లక్షలాది తంతువాయుల నోటిముందరి ముద్దలు ఒడుచుకపోనారంభించినా, ఈ మారుమూల పల్లెల వరకూ అవి సాగి ఉండలేదు.’ (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.230)

“గత రెండు దశాబ్దాలలో గుర్తింపరానంతగా మారే ప్రపంచంతో మారే మనదేశంతో పాటు మా నాడూ మా గ్రామం కూడ చాల మారిపోయింది.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.237)

ఇంక ఇక్కడినుంచి అంటే 237వ పేజీ పేరా 5 నుంచి 239వ పేజీ పేరా 3 వరకు వివరంగా గత రెండు దశాబ్దాల్లో – అంటే -1930ల నుంచి 53 దాకా ప్రపంచంలో, దేశంలో, నాడులో, ఊళ్లో వచ్చిన రాజకీయార్థిక పరిణామాలను కళ్లకు కట్టినట్లు విశ్లేషిస్తారు.

“రెండవ ప్రపంచయుద్ధం నాటి కంట్రోళ్లూ, ద్రవ్యోల్బణం ఫలితంగానైతేనేం, స్వాతంత్య్ర సిద్ధ్యనంతరం ప్రవేశించిన స్థానిక పరిపాలనా నగర సంబంధాల వల్లనైతేనేం, ఈ విధంగా జీవితావసరాల పద్దుల్లో అనవసరమైనవి కూడ చాల చేరిపోయాయి. పచ్చగడ్డి నుంచి బంగారం వరకూ సమస్త పదార్థాల ధరలూ పెరగడమే కాని వరగడం ప్రసక్తి లేదంటున్నాయి.” (సేనాపతి వీరన్న – కా.రా.కథలు, పే.238)

1951లో రాసిన ‘అప్రజ్ఞాతం’ నుంచి 53లో రాసిన ‘సేనాపతి వీరన్న’ నాటికి కారా గారి రాజకీయ అవగాహనలో పరిశీలన వల్ల మరికొన్ని వివరాలు చేరాయి. దానివల్ల విస్తృతి ఏర్పడింది. మొదటి సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు, స్థానిక స్వపరిపాలన కోసం ఎన్నికలు, పంచవర్ష ప్రణాళిక వచ్చాయి. ఈ కథలో పంచవర్ష ప్రణాళిక ప్రస్తావన లేదుగానీ – ‘యజ్ఞం’, ‘కుట్ర’లలో వాటిపట్ల ఆయన అవగాహన కూడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీ గురించి కారా గారికి ‘అప్రజ్ఞాతం’ (1951), ‘సేనాపతి వీరన్న’ (1953) కథలు రాసేనాటికే స్పష్టమైన వర్గదృష్టి ఏర్పడిరదనీ, యజ్ఞం నాటికి అది క్రియ (యాక్షన్‌)గా పరిణమించక తప్పని అశాంతికి గురయ్యారని చెప్పవచ్చు.

‘అప్రజ్ఞాతం’లో సాధ్యంకాని సంఘటనల చిత్రణ, కథానిర్వహణ, మానవసంబంధాల ఆర్ద్రత ‘సేనాపతి వీరన్న’లో కనిపిస్తాయి. ‘నా వర్గానికి చెందిన వారందరి తరఫున నేనే నెత్తిన వేసుకున్నందు’ (పే.241)వల్ల వచ్చిన కన్ఫెషన్‌లోని శక్తి అది.

ఆనాటి నుంచి ఇవ్వాటివరకు అది 1947, 67, 91 వంటి మైలురాళ్లను కూడ గణనలోకి తీసుకున్నా ఊర్ధ్వముఖంగానే సాగుతున్నది. 1967 దానికొక సమూలమైన సవాల్‌గా వచ్చింది. ఆ సవాల్‌ ముప్పై ఏళ్లకు పైగా కొనసాగుతున్నదే. దానికి దోపిడీ వెతుక్కుంటున్న జవాబుల చర్చను కథగాకన్న ఒక రన్నింగ్‌ కామెంటరీగా 1972లో ‘కుట్ర’లో కారా గారు చెప్పారు. అది శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌ నాటి పరిస్థితి.

అభివృద్ధి గురించిన అవగాహన

ఆస్తి సంబంధాలు, శ్రమదోపిడీల గురించి మౌలిక అవగాహన నుంచే ఆయన ‘యజ్ఞం’ కథలో గానీ, తర్వాత రాసిన కథల్లోగానీ భూసంబంధాల్లో వచ్చిన మార్పులు, వ్యవసాయంలో వ్యాపారపంటలు, గ్రామాల్లోకి మార్కెట్‌ ప్రవేశం, డబ్బు ప్రవేశం, మిశ్రమ ఆర్థిక విధానం, గ్రామాల్లో వచ్చినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి, న్యాయం, విద్య, పంచాయితీవిధానం మొదలైన అంశాలను చిత్రించారు.

‘యజ్ఞం’లో ‘‘బాబూ యిక నాకత సెపుతాను ఇనండి’’  (పే.342) అని ఆరంభించి, తన కథ ముగించి అప్పు పత్రం మీద అప్పల్రాముడు వేలుముద్ర వేసే దాకా (పే.352) పదిపేజీలు పరచుకున్న ఆత్మకథ – ఈ దేశంలో రైతుల ఆత్మఘోష – రైతు వ్యవసాయకూలీగా మారి, అప్పులబారిన పడి – బానిసైన కథ. ఆ పదిపేజీలే కాదు ‘యజ్ఞం’ కథలోని రాజకీయార్థిక అవగాహన గురించి ఇప్పటికెంతో చర్చ జరిగింది. కనుక ఆ వివరాల్లోకి, విశ్లేషణలోకి పునరుక్తి భయంతో వెళ్లకుండా ఆ కథ శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి ఎట్లా తెరదీసిందో (కర్టెన్‌రైజర్‌ అయిందో) మాత్రమే చెప్తాను.

శ్రీకాకుళం ఏజెన్సీలో  (బ్రిటిష్‌వాళ్లు ఆ పేరుతో పిలిచిన అడవిలో) సవరలు, జాతాపులు అనే ఆదివాసులు పోడుచేసుకుని బతికేవారు. అడవిని నమ్ముకొని బతికేవారు. అక్కడికి ఉప్పు, పులుసు రూపంలో షాహుకార్లు వచ్చారు. అడవిరక్షణ పేరుతో అడవి చట్టాలు వచ్చాయి. చట్టాల అమలుకోసం పోలీసులు వచ్చారు. ఉప్పు, పులుసు కోసమే కాదు నూలుతో మొదలై పెరిగిన నాగరిక అవసరాల కోసం ఆదివాసులు జీడిపప్పు, ఇప్పపువ్వు, తేనె మొదలు అడవిలోని సమస్త సంపదలు, తాము పోడుచేసుకున్న భూమి మాత్రమే కాదు తమ శ్రమ కూడ పణం పెట్టి మైదాన ప్రాంతాలనుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీవ్యాపారుల కింద కంబారులుగా మారారు. అంటే తాము పోడుచేసుకున్న తమ కాళ్లకింది భూమిలో తామే బానిసలయ్యారు.

ఇదీ 1964 నాటికి శ్రీకాకుళ సవరలకు, జాతాపులకు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం తెలివిడి చేసిన సత్యం.

ఆ ఏజెన్సీ అంచున్న ఉన్న సుందరపాలెం అనే మైదానప్రాంత గ్రామంలో ఒక దళితుడైన అప్పల్రాముడు తన కొడుకు సీతారాముణ్ని అప్పుపత్రం మీద సంతకంపెట్టి ఆ స్థితికి నెట్టబోతున్నాడు. ఒక్క  సీతారాముణ్ననే కాదు,  కొడుకులందరినీ, శాశ్వతంగా వాళ్ల సంతానాలను, రైతులు వ్యవసాయకూలీలుగా, వ్యవసాయకూలీలు వెట్టివాళ్లుగా అంటే బానిసలుగా మారే పరిణామక్రమం చరిత్రలో విషాదకరంగా మరోమారు వచ్చిన సంధిదశలో అటు వర్గపోరాట అవసరం అశాంతిలో చీలిన కమ్యూనిస్టుపార్టీ – ఆ లక్ష్యంతో ఆదివాసులను కూడగడుతున్న శ్రీకాకుళ నాయకత్వం – అప్పటికి పేర్కొనదగిన వాళ్లు వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం, రామలింగాచార

ఆ నిప్పందుకున్న నేపథ్యం మైదానప్రాంత సుందరపాలెం మాలపల్లెలో స్పష్టంగా మనం చూడవచ్చు. అప్పల్రాముడు చెప్పుకొచ్చిన ఆత్మకథలో పంచాయితీకి ముందురోజు ‘‘రాత్తిరి మాయింటికాడ తగువయింది’’ (పే.347) అని ఆరంభించి ఒక చర్చను ప్రస్తావిస్తాడు. ఆ చర్చంతా అభివృద్ధి గురించి గ్రామంలోని శ్రమజీవుల దృష్టితో చేసిన చర్చ. మాలవాడలోనే  ఎర్రయ్య ఇంటికి సుట్టపుసూపుగా వచ్చిన పెద్దమనిషి ఒకాయన ఆ చర్చలో జోక్యం చేసుకున్నాడు.

‘‘…..జరుగుతున్న దగా యెక్కడో మీకు తెల్నట్టే ఆయనకీ తెలవదు. దీనికంతటికీ కీలకం యిక్కడెక్కడా నేదు, పైనెక్కణ్నుంచో  వచ్చిన ముప్పు మనందర్నీ ముంచుతోంది.

పండిన పంటంతా కావందుల గోదాలకెళ్లాల. ఎల్లకుండా కూలోడు అడ్డు తగుల్తున్నాడు. ఎనకట్రోజుల్లో అయితే తన్ని సేయించుకునేవోరు. ఇప్పటిరోజుల్లో ఆ పప్పులుడకవు. కూలోడి అడ్డు  వదిలించుకోవాలంటే మిసీన్లు కావాలి. మిసీన్లు తేవాలంటే యెలట్రిసిటీ, రోడ్లూ కావాలి. అంతేకాదు, సదువుకున్న కూలోళ్లు కావాలి. అందుకనే యీ యిస్కూళ్లు. అందుకనే యీ రోడ్లు, యీ యలట్రిసిటీ. ఇయన్నీ మనకోసవే అనుకోడం మన బుద్ధితక్కువ. నీళ్లు తోడ్డానికి మిసీన్లొచ్చేసినాయనే గుంజుకుపోతున్నారు. రేప్పొద్దున దున్నడానికి, ఊడుపులకి, గొప్పులకు, కోతలకు కూడ మిసీన్లు రాబోతున్నాయి. అప్పుడు సూసుకోండి తడాఖా’’ అన్నాడు.

‘బాబయ్యా! మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది. కాని జరిగింది జరగబోయేది సూస్తే ఆల్ని కాదనడవెలాగో నాకు తెలకుండున్నది.

నువ్వెవరికుపకారం సేస్తానని బయలెల్లినావు? అదెవరికుపకారం అవుతోంది?…. పున్నానికొచ్చినవోరిని నువ్‌ మొదలెట్టిన యెగ్గెం, పాపంలో దింపింది. దిగినాక తెలిసీ తెలీకా అందరం కూరకపోతున్నం’ (యజ్ఞం – కా.రా.కథలు, పే.347)

35 ఏళ్ల కింద ప్రారంభమైన ఈ యజ్ఞం ఇపుడు విశ్వరూపం దాల్చింది.

అప్పల్రాముడు చాల అమాయకంగా ‘మంచన్నది సెబ్బరైపోవడం నాకూ సిత్రంగానే వుంది’ అని అన్నాడుగానీ ఈ దేశంలో పెట్టుబడి వలస, మార్కెట్‌ ఆర్థికవిధానం వల్ల భూస్వామ్య సంబంధాలు రద్దయిపోతాయని, మిశ్రమ ఆర్థికవిధానంతో పంచవర్ష ప్రణాళికలతో సోషలిజం వస్తుందని భ్రమపెట్టినవారో, పడినవారో – ఈ ముప్పై అయిదేళ్ల ఈ అభివృద్ధిలో ‘యజ్ఞం’ కాస్త విశ్వీకరణ పొందిన రూపాన్ని మన ప్రజల అనుభవానికి తెచ్చారు. భూస్వామ్య సంబంధాలు, సామ్రాజ్యవాద బలంతో ఇంకా బలపడి దేశమంతా దళారీ రాజకీయాలకు తాకట్టుపడిన స్థితి ‘యజ్ఞం’ మరోమారు చదివినా ఊహించుకోవచ్చు.

‘కుట్ర’ (1972)లో బొంబాయిప్లాను మొదలుకొని 1972 వరకు సాగిన రాజకీయార్థిక కుట్రను వివరించిన మేస్టారు గత 27 ఏళ్లుగా ఇంకా ఏం జరిగిందో ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజానికి ‘కుట్ర’ ఒక మోనోలాగ్‌, వ్యాఖ్యానం లేదా రన్నింగ్‌ కామెంటరీ అవుతుంది గానీ కథ కాదు. కథగా ‘యజ్ఞం’ మాత్రమే విశ్వీకరణ ఇవ్వాల్టి కుట్రకు ఒక  ప్రొఫెసీ – భవిష్యదవగాహన – సంచలనాత్మక కల్పన.

అందులోనే ఒక ప్రతిక్రియ – అటు శ్రీకాకుళం అడవిలో ప్రారంభమైన సంచలనం ప్రభావం కూడ చోటుచేసుకున్నది.

తన కొడుకును చంపి గోనెసంచిలో తలను, మొండాన్ని కట్టి తెచ్చి పంచాయితీ ముందు పడేసిన సీతారాముడి మాటల్లో అది వ్యక్తమవుతున్నది.

‘‘నువు మమ్మల్ని సచ్చిందాక బానిసబతుకు బతుకమన్నావ్‌. నీకు తెల్నప్పుడు అది సరే. ఇప్పుడు తెలిసినాకా నువు ఆ మాటే అంటే – ఇదిగో నాకిష్టంనేదు.

నా కొడుకు మీద నాకాశెక్కువ. నా కొడుకు బానిసబతుకు బతకడు. నా కొడుకు కంబారి కాడు.

అందుకే పరుగెత్తుకెల్నాను. ఒరేయ్‌! ఓరె, కొడుకా, నువు బానిస బతుకు బతుకుతావా – లేకపోతే సస్తావా? యీయాల సస్తే రేపటికి రెండు. రా నిన్ను సంపుతా’’నన్నాను. ఆడు పరుగెత్తుకొచ్చినాడు….’’

64లో రాసిన ‘యజ్ఞం’లో రెండు భవిష్యత్‌ వాస్తవాలు ఇమిడి ఉన్నాయి. అప్పటికే ప్రారంభమైన శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ సంఘర్షణలో వాటి ప్రభావం కనిపిస్తున్నది. అవి – తమ కొడుకులింక కంబారులు కావద్దు. బానిస బతుకులు బతుకొద్దన్న దృఢనిర్ణయం. అది సాధించాలంటే – పరుగెత్తాలి – అంటే నడకలుగా ఉన్న మార్పు ప్రయత్నం పరుగులుగా, గెంతులుగా మారాలి. కొడుకును చంపుకోవడమా, కొడుకు తండ్రిని చంపుకోవడమా, ఇద్దరూ కలిసిగానీ, విడిగా గానీ శత్రువును చంపడమా – ఆ తర్వాత శ్రీకాకుళంలో తేలిన అంశాలు. కాని కంబారిగా, బానిసగా బతుకొద్దంటే మాత్రం ఏదో గుణాత్మకమార్పు రావాలి. 1964 నాటికి అది షాక్‌ట్రీట్‌మెంట్‌గానే ఉంది. 68లో గానీ అది సాయుధప్రతిఘటన కాలేదు.

హింస శాంతి

అసమానతయే హింస, అందరికీ కనీస వనర్లు, జీవించే హక్కు గ్యారంటీ కావడమే శాంతి అనే అవగాహన కా.రా. కథల్లో అన్నింట్లో కనిపిస్తుంది. హింసాహింసల చర్చ, వాటిపై తన వైఖరి కారా గారు ప్రత్యేకించి వ్యక్తం చేసిన కథలు వీరుడు మహావీరుడు, హింస, శాంతి.

హింస గురించి, శాంతి గురించి బుద్ధిజీవులు తమ వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిన కాలంలోనే కారాగారు ఈ మూడు కథలు రాసారు.

‘ఇద్దరు దెబ్బలాడుతుంటే ఎవళ్లది తప్పని ఎవ్వర్నీ అడగక్కర్లేదు. అడిగితే ఆడిది తప్పని ఈడూ, ఈడిదే తప్పని ఆడూ ఎలాగూ సెప్తారు. అడక్కుండా ఆ పక్కన్నిలబడి ఆళ్లమొహాల్లోకి చూడు, తప్పెవళ్లదో ఎవడూ సెప్పక్కర్లేకుండానే కరక్టుగా నువ్వే చెప్పేస్తావు.

అందుకే నా సింపతీ అల్లిపురం వస్తాదు మీద కాక గంజిపేట రౌడీమీదే ఉండేది’ (వీరుడు-మహావీరుడు – కారా కథలు, పే.379)

‘అయితే మనిషికా ఫైటింగ్‌ స్పిరిటు వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. ఎలాటప్పుడు? న్యాయం నీ పక్కనుండాల, అవతలోడు ఫౌలుగేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల, సూస్తున్నోళ్లు సీవ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగిపోతుండాల. అదిగో అలాటప్పుడు వొచ్చేస్తాది ఎక్కల్లేని ఫైటింగు స్పిరిటూ. అప్పుడు పిల్లిలాటోడైనా పిల్లపులైపోతాడు. పులిపిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా సాస్తాడు.’ (వీరుడు-మహావీరుడు, కా.రా. కథలు, పే.379)

న్యాయం వున్నవానిలో ఫైటింగ్‌ స్పిరిట్‌ వస్తుందని, అపుడు వాడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినా అది న్యాయంకోసం చేసే పోరాటమే అవుతుందిగాని హింసకాదని ఏ అభ్యంతరం లేకుండా రచయిత ప్రతిపాదిస్తున్నాడు.

అల్లిపురం వస్తాదు, గంజిపేట రౌడీ ఈ అసమ యుద్ధంలోకి కొత్తపేట శాండో ప్రవేశిస్తాడు. విడదీయడానికి కాదు, గంజిపేట రౌడీకి సహాయం చేయడానికి కాదు. అల్లిపురం వస్తాదుకు సహాయం చేయడానికే.

అప్పటికప్పుడే నూరుసార్లు మన్నుతిని నూటొక్కటోసారి లెగడవే ఓ ఫీటుగా లెగుస్తున్న గంజిపేట వీరుడు –

‘లెంజకొడుకా? నేనియ్యాళ నీ సేతుల్లో సచ్చైనా పోతానుగానీ, నీ రకతం కళ్లజూడక మానన్రా’ అంటూ తూలి తూలి నిలబడుతూ కొత్తగా దిగిన శాండో కళ్లకడ్డవైతే యీడెవడన్నట్టు మసక్కళ్లు అప్పగించి చూసేడు.

కొత్తపేట శాండో తన సహాయానికే వచ్చాడని అల్లిపురం వస్తాదుకు తెలిసిపోయింది. అందుకే అంతవరకు కాలుసేయి తప్ప నోరు విప్పనివాడు

‘రారా బాడకావ్‌. నీకు ఏ లంజకొడుకడ్డుపడతాడో నేనూ సూస్తా’ అన్నాడు.

కొత్తపేట శాండో అమాంతం వెళ్లి గంజిపేట రౌడీ చెయి పట్టుకున్నాడు. పట్టుకున్న ఆ చెయ్యి వెనక్కి తిప్పుతూ అన్నాడు….. ఎవడితో? గంజిపేట రౌడీతో…. అంటే దెబ్బలు తింటున్నవాడితో, ఏవనీ?

‘‘ఇంక శాంతించు’’

‘‘ఆ మాట ఆడితో చెప్పు’’ (వీరుడు-మహావీరుడు, పే.381)

ఈ కథ కేవలం ఉస్తాదు, రౌడీల మధ్యన తగువుకాదు. కాదని చెప్పడానికి కథ చివరన కా.రా. గారే వ్యాఖ్యానం చేసారు.

‘…..బిగ్‌పవర్‌లో వున్న ఆకర్షణే అది. మనవనుకుంటాం గానీ యే కాలంలోనైనా, ఏ లెవెల్లోనైనా బిగ్గూ, స్మాలూ తేడాలు వుండేవుంటాయి’ (వీరుడు-మహావీరుడు, పే.383)

పాలస్తీనా – ఇజ్రాయిల్‌ల మధ్యన,  ఇరాక్‌ -కువాయిట్‌ల మధ్యన అమెరికా జోక్యం ఒక్కసారి గుర్తొస్తోంది ఈ నేపథ్యంలో మళ్లీ చదివితే.

హింస, న్యాయం సాపేక్షమైనవి. వర్గస్వభావం కలవి. వాటిని నిరపేక్షంగా నిర్వచించి, అహింసా సూక్తులు పలకడం హింసనే పోషిస్తుంది.

‘హింస’ కారా గారి కథల్లోనే కాదు తెలుగు సాహిత్యంలో అరుదైన కథల్లో ఒకటి. గుండెల్ని పిండేసే మానవీయస్పర్శ. పీడిత ప్రజల పట్ల, అందులోనూ సంఘపరిత్యక్త అయిన స్త్రీ పట్ల పరిపూర్ణ సానుభూతి – ఒక్కమాటలో చెప్పాలంటే – ఇవన్నీ ఎంత సహజంగా, ఎంత నైసర్గికంగా పసివయసులో వుండే కడుపేద ఇంటి అమ్మాయిలో వుంటాయో, ఆ ‘సంగి’ కళ్లనుంచి చెప్తారు రచయిత.

సంగి అక్క పైడమ్మ చేసిన పెళ్లి ఇష్టంలేక భర్తను వదిలేసింది. మారుమనువు ఆలోచన చేయకుండా బతకడానికి విశాఖపట్నం పోయింది. అక్కడ కూలీచేస్తూ బతుకుతున్నది. కాని ఊళ్లో జనం అనుమానం ఆమె ఒళ్లమ్ముకొని బతుకుతున్నదని. కావచ్చుననే సూచన కథలో వుంది. పైడమ్మ విశాఖపట్నం నుంచి నాలుగురోజులుందామని లేదా ఆ బతుకుమీద రోతబుట్టి ఇంటికి తిరిగొస్తే, కులపెద్దలు, బంధువులందరూ పైడమ్మ తల్లికి ఆమెను ఇంట్లో పెట్టుకోవద్దని పంపించివేయమని హితం చెప్తారు. హెచ్చరిక లాంటి హితం. అప్పటికే పైడమ్మ సోదరులెవరూ ఆ కుటుంబానికి సహాయం చేయడంలేదు. ఇంటితో సంబంధాలు కూడ తెంచుకున్నారు.

అక్క విశాఖపట్నంలో ఏం చేస్తుంది, ఎట్లా బతుకుతుంది, అక్కగురించి సమాజం ఏమనుకుంటుంది – వంటి ఏ విషయాలతో సంబంధం లేని రక్తబంధువు సంగికి అక్క రావడం ఒక సంబరం. ఒక పండుగ. ‘అప్ప వెచ్చని రక్తం ఆమె నాళనాళాన వేడిని నింపుతూ, ఆమెను పొదువుకుపోతుంటే’ నిద్దట్లోనే అక్క కావలించుకోగా వొదిగిపోవడమనే అనుభూతి ఒక్కటే సంగి రక్తానికి తెలిసిన పరమసత్యం.

కాని పైడమ్మ వచ్చిన దగ్గర్నించి ఆమెను తిరిగి పంపించే పథకాలూ చుట్టూ అల్లుకుంటున్నాయి. అందులో అందరూ కుట్రదారులనే కాదు, అసహాయులు కూడా.

‘‘ఏం సెయ్యడానికైనా నీ వశవా? నాలుగేళ్ల క్రితం దాకా నీ నట్టింట పెరిగిన బొట్టె ఏణ్నర్థం కితం పండక్కి నీ యింట పసుపూ కుంకం పుచ్చుకుంది. యియ్యాళ నియ్యింటికొస్తే నట్టింట పీటేసి నాలుగు మెతుకులెట్టలేప్పొన్నావు. ఎవరో ఎరగన్దానికెట్టినట్టు గుమ్మంలో ఆకేసి తిండెట్టినావు… ఏటుంది నీ సేతుల్లో’’ అంది సన్నాసమ్మ. (హింస, పే.410,411)

పెద్దమ్మ పైడమ్మకొచ్చిన కష్టాలు, పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా వివరించినా లాభం లేకపోయింది. పోనీ బిడ్డెంట తాను పట్నం పోతానంటే మరి సంగి సంగతేమిటన్నది ముందుకొచ్చింది. ముక్కుపచ్చలారని సంగి బతుకు సరిగా తెల్లారాలే అన్నా ఆమె ఎంతగానో ప్రేమించే అక్కను పంపించేయాలన్నదే ఈ వ్యవస్థ క్రూరమైన నిర్ణయం.

ఉదయం సంగి కళ్లు విప్పేవరకే పైడమ్మ వెళ్లిపోయింది.

ఒక్కక్షణం చిన్నప్పట్లా, బావురుమని ఏడవాలనుకుంది. కాని ఏడవడం సంగికి నప్పదు. తల్లి దుఖం గుర్తుకొచ్చింది. ఆ శోకన్నం బరువు మొయ్యలేనంత కాగానే ఆ పిల్ల చప్పున లేచిపోయింది. ఊరికి ఆవడో, ఆవడపైనో వున్న శలకవైపు పోయింది.

ఆ చెలకలో, అంతా నిర్మానుష్యమైన చెలకలో మేకపిల్లలు తనకు తోడు. దూరాన ఒక మేకపిల్లను నక్కలు దాడిచేసి తిన్నాయి. మిగిలిన మేకపిల్లల హృదయవిదారకమైన అరుపులు విని, విపరీతమైన జాలి కలిగి, కన్నులు జేవురించగా

‘‘మాయ ముండల్లారా! రాకాసి ముండల్లారా! మీ పని సెపతానుండండి’’  అంటూ చుట్టూ చూసింది సంగి. ఎండిపోయిన తాటిమట్ట ఒకటి తప్ప ఇంకే ఆయుధమూ దొరకలేదు ఆ పిల్లకు. ‘యియ్యేళ్ల మిమ్మల్ని ఒకళ్లనో ఇద్దర్నో సంపిందాకా నానింటికి పోను’ అని శలకకడ్డంగా బయల్దేరింది.

‘తనకు పట్టని బాధ – ఎవరికో జరిగిన అన్యాయం’ అనకుండా ఆ యెండవేళ నక్కలకోసం వెతుకుతోంది సంగి.

నక్కలు తనకు చిక్కుతాయా? అసలెక్కడ చిక్కుతాయి? చిక్కితే తనేం చేయగల్దు? ఇలాంటి ప్రశ్నలామెకు తట్టలేదు. తట్టవుకూడ.

ఆమె ఆవేశం మనకు అర్థం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు, ఆమె గుండెకూడ మనకుండాలి. (హింస, పే.419)

రచయిత ఈ వ్యాఖ్యానంతో ముగిసే కథకింక వ్యాఖ్యానం అనవసరం. న్యాయం గురించి ఒక రౌడీ, ఒక పహిల్వాన్‌ మధ్యన తగువును, హింస గురించి అక్కచెల్లెళ్ల, తల్లీకూతుళ్ల అనుబంధాన్ని తెంచిన వ్యవస్థ క్రౌర్యాన్ని ఆధారం చేసుకొని తన అవగాహన అందించిన కారా గారు శాంతి గురించి నేరుగా యజమాని కార్మిక సంబంధాల ద్వారానే ‘శాంతి’ కథలో వివరించారు. ఇది 1971లో రాసిన కథ గనక ఈ అవగాహనకొక రాజకీయ పరిణతి రావడం సహజమే. శ్రీకాకుళ రైతాంగ పోరాటం మొదలై, సెట్‌బ్యాక్‌కు గురవుతున్న దశ. విరసం ఏర్పడిన దశ. కారా గారి భావాల్లో చాల స్పష్టమైన వైఖరి ఏర్పడింది.

ఈ కథలో శాంతి గురించి ఒక కవి చెప్పిన మాటల్ని కూడ కార్మిక నాయకునిచేత చెప్పిస్తాడు. ఇలాంటివి ఆ కవి చాల చెప్పేవాడు. ఆవేశంలో అతిగా అన్నాడు అని అనుకున్నానే గాని అందులో నిజం చాల వుంది అనిపిస్తోందిప్పుడు అంటూ కార్మిక నాయకుడు విశ్వనాథం ‘‘న్యాయమైన కోర్కెలు మేం ఒదులుకోప్పోతే శాంతికి భంగం కలుగుతుంది. తీర్చవలసే కోరికలు వారు తీర్చకప్పోతే శాంతికి భంగం కాదు.

శాంతియుతమైన సంప్రదింపుల్లో యింతకాలవూ వారు మొరాయించింది అశాంతికి దారితీసేది కాదు. చట్టసమ్మతంగా మేం రేపు సమ్మె చేయబోతే అది అశాంతికి దారితీస్తుంది. ఆ నిప్పురవ్వలో దేశమంతా మండిపోతుంది.

ఘర్షణకి బాధ్యత ఎప్పుడూ ఒక పక్షానిదే. దేవుడికోసం, దేశం కోసం, మనిషి కోసం లేనివాడే ఎప్పుడూ త్యాగం చేయాలి. రెండోవాడిపై ఎవడు ఏమాత్రం ఒత్తిడి తెచ్చినా అది వాడి హక్కులమీదా, వ్యక్తిమీదా ఘోరంగా చేస్తున్న దాడిలా అనిపిస్తుంది. సమతాధర్మం అన్నది చదువుకున్న పెద్దలందరికీ ఒక్కలాగే అర్థమవుతుంది. నిజంగా చిత్రమైన సంగతి’’ (శాంతి, పే.578)

ఈ వ్యంగ్యంలో ఇవ్వాళ ఇంకెంత నిష్ఠురమైన నిజం కనిపిస్తుందో.

కారా కథల్లో మూడు సందర్భాల్లోనే పోలీసుల ప్రస్తావన వస్తుంది. సేనాపతి వీరన్నలో అతడు దొంగతనం చేస్తున్నాడనే అనుమానానికి దారితీసే పోలీసు కేసుల ప్రస్తావన వుంది. ‘హింస’లో పైడమ్మ కూడ పోలీసుకేసులో ఇరుక్కున్నది.

‘శాంతి’ కథలో మాత్రమే కార్మికుల సమ్మెను భగ్నం చేయడానికి అటు లాకౌటు, అరెస్టులు, పోలీసుల బందోబస్తు, ఇటు కార్మికనాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిడం – ఈ ఏర్పాట్లకన్నిటికీ తగినంత వ్యవధి పొందడానికే కలెక్టర్‌, ఎస్పీ, ఫ్యాక్టరీ యజమానితో కార్మికనాయకుల చర్చలు వంటి ఒక పూర్తి రాజకీయ వాతావరణం – రాజ్యాంగయంత్ర స్వభావం కనిపిస్తాయి.

కారా కథల్లో న్యాయము, పోలీసులు, రాజ్యాంగయంత్రం స్వభావం అర్థమయ్యే కథ ‘శాంతి’ ఒక్కటే. ఇది కూడ ‘కుట్ర’ వలెనే కథకన్నా, అంటే సంఘటనలకన్నా చర్చలమీద ఎక్కువ ఆధారపడి నిర్మాణమైంది.

‘ఆదివారం’ (సరియైన   మార్క్సిస్టు ఫెమినిస్టు దృక్పథం ఉన్న కథ). ‘హింస’, ‘నోరూమ్‌’ (పేదవాళ్ల ప్రేమకు, ప్రైవసీకి హృదయాల్లోనే గానీ నేలమీద చోటులేని విశాల ప్రపంచమిది), ‘ఆర్తి’ (కఠిన నిజాలైన ఆర్థికావసరాలలో నలిగిపోయిన ముగ్ధప్రేమ, పరిష్కారం మాత్రం ఊర్లో పెద్దలే చేస్తారు!), ‘చావు’ (‘అప్పుడు పెళయం తేవాల. అది తేవడం తప్ప ఆడికింకో దారినేదు. దానికాడ ఈ తుపాకులు గిపాకులు, బాంబులు, ఇమానాలు యియ్యేయీ ఆగవు. అది జొరావరులన్నిట్లోకి పెద్ద జొరావరి. దానికి ఇక తిరుగునేదు…. అయితే అది రావడమెలాగొస్తాదో ఎరికా..’’ మాటపూర్తి కాకుండానే …. దభీమని ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఓ కట్టెలమోపు అతడిముందు పడింది. తుళ్లిపడి తలెత్తితే  – రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కట్టెలమోపులు ఒకదాని తర్వాత ఒకటిగా నేలబడి ఆ అదుటుకి కట్లు తెంచుకు చెదురుతున్నాయి. పే.640) ప్రళయం, అంటే విప్లవం వస్తే ఎట్లా అంగలుగా గెంతులుగా వస్తుందో కథాశిల్పరీత్యా కూడ గొప్పగా చిత్రించిన కథ.

‘చావు’, ‘జీవధార’ – కథలుగా ఎంత గొప్పవో, అంత వర్గదృష్టితో రాసినవి. పీడితప్రజల పక్షపాతంతో రాసినవి. జీవితంలోని పార్శ్వాలను వైవిధ్యంతో చిత్రించినవి. ఈ అన్ని కథల్లోనూ వర్గచైతన్యంతో కూడిన ధిక్కారస్వభావం, తిరుగుబాటు ప్రస్ఫుటమవుతాయి.

‘సేనాపతి వీరన్న’, ‘అభిశప్తులు’, ‘అశిక్ష-అవిద్య’, ‘యజ్ఞం’, ‘వీరుడు-మహావీరుడు, ‘ఆదివారం’, ‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘భయం’, ‘శాంతి’, ‘చావు’, ‘జీవధార’ – వంటి అన్ని కథల్లోనూ ప్రధానపాత్రలు, నాయకులు, కష్టజీవులు, వృత్తిజీవులు, స్త్రీలు. కారా కథల్లోని రాజకీయ అవగాహన నైశిత్యం ఎక్కడంటే ఆయన కేవలం పేదలపక్షం కాదు. కష్టం చేసి దోపిడీకి గురవుతున్న పేదలపక్షం.

‘అభిశప్తులు’, ‘అశిక్ష – అవిద్య’, ‘ఆదివారం’, ‘హింస’, ‘ఆర్తి’, ‘చావు’ కథల్లో ఆయన పీడిత స్త్రీల విషయంలో ఎంత ఆర్తి కనబరుస్తారో అర్థమవుతుంది.

‘శాంతి’ కథ ద్వారా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తమ హక్కులకోసం చర్చలు, సమ్మెలు చేయడమైనా వుందని సత్యం చెప్పినట్లుగానే  ‘ఆదివారం’ కథ ద్వారా  అసంఘటిత, అనుత్పాదకరంగంలో వున్న స్త్రీలకు (ఇంట్లో పనిచేసే పనిమనుషులు  ఇంక అందులో అధమతరగతి)  పనిగంటలూ లేవు. ఆదివారాలూ లేవు. కష్టం చేసే ఆ చేతులు నోరుపెట్టుకొని బతుకకపోతే వాళ్ల చిన్న చిన్న కోర్కెలు కూడ నెరవేరకపోవడం అలా వుంచి డొక్కారగట్టుకుని తిండికి అల్లాడవలసిందే.

‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘జీవధార’లో పాత్రలన్నీ అట్టడుగువర్గాల నుంచి వచ్చినవాళ్లు – స్త్రీలు. కథలుగా కూడ ఇవి చాల గొప్పకథలు.

ఇంక కారా గారి కథల్లో తలమానికాలు అయిన ‘యజ్ఞం’, ‘చావు’ కథలు రెండూ దళిత జీవితాలను చిత్రించేవి. ‘చావు’ కథలో అస్పృశ్యత కూడ ఒక ప్రధానమైన అంశంగా నలుగుతుంది.

ఇంత నిశితమైన వర్గదృష్టి, రాజకీయ అవగాహన ఉన్న కారా గారు 1972 తర్వాత ఒక్క ‘సంకల్పం’ తప్ప కథలు రాయలేకపోయారు. ఆయన కథలన్నీ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951) శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట సెట్‌బ్యాక్‌ (1972)కి మధ్యన వచ్చినవే. ఆయన అనుభవాలు కాకపోయినా ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న గాఢమైన  శ్రీకాకుళ పరిసరాలు, ఉద్యమాలు ఆయన పరిశీలనకు ఎంతగానో తోడ్పడ్డాయి.

(ఆధారం – కాళీపట్నం రామారావుకథలు, ఆర్‌.కె.పబ్లికేషన్స్‌, విశాఖపట్నం – 1986)

 

[1] ‘యజ్ఞం’లో శ్రీరాములునాయుడు ధర్మమండపంలో నిలబడి అప్పల్రాముని అప్పు గురించి వర్గదృష్టితో తప్ప ఎట్లా చూడలేడో, చూడలేక తాను న్యాయమే చెప్తున్నాననుకుంటాడో (అది నాలుగుకాళ్ల మీద నడిచే ఆస్తి న్యాయం – శ్రమమీద ఆధారపడిన న్యాయం కాదు) ఇందులో సూరప్పడు కూడ ‘…దోపిడీ చేయలేదు. అతనివల్ల దోపిడీ జరిగింది’ (పే.125) అనుకుంటాడు.

  -వరవర రావు

vv.karaఏబై ఏళ్లుగా కవిత్వం, సాహిత్య రాజకీయ విమర్శ చేస్తున్నారు. ప్రజాపక్ష వక్త. విరసం వ్యవస్థాపక సభ్యులు. సృజన పత్రికను హన్మకొండ కేంద్రంగా నడిపారు మిత్రులతో కలిసి. ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతుదారు. చలినెగళ్ళు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్తు చిత్రపటం, ముక్తకంఠం, అంతసూత్రం — కవిత్వ సంపుటాల్లో కొన్ని. కొత్త కవితా సంపుటి బీజభూమి ఇటీవలే విడుదలయ్యింది. ఈయన రచనలు ఇంగ్లీషులోకి, హిందీలోకి, ఇంకొన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి

మీ మాటలు

 1. attada appalnaidu says:

  వరవర రావు గారి విశ్లేషణ బాగుంది.కారా కథా రచన,ద్రుక్పధం గురించి మాస్టారి కథల ద్వారా సరిగానే విశ్లేషించారు.కానీ కారాను కదనరంగ రిపోర్టర్ అనడం సరైనది కాదు.భూషణం కదన రంగ రిపోర్టర్,ఇంకా సువర్ణముఖి suitable ,కాస్త నేను కూడా,గానీ కారా కాదు. కదనరంగానికి సుదూరంగా జీవిక,వృతి,వ్యావ్రుత్తి గల వాడు కారా.కారా సామాజిక చలనాలను,సామాజిక సంఘర్షణలకు కారణాలను అర్ధం చేసుకొని తనకు తాను విశ్లేషించుకొని కథనం చేసాడు.అవి పైన చెప్పిన చలనాలను,కారణాలను అద్దం పట్టినాయి.గొప్ప కథలయినవి.
  అలాగే, యగ్యం కథను శ్రీకాకుళ పోరాటానికి కర్టెన్ raiser అనడము ,ఈ మాట వివీయే కాదు కొందరు విరసం మిత్రులు గూడా చాలా సార్లు అనడం విన్నాను. యగ్యం కథ మీద – ఆ వివరాల్లోకి, విశ్లేషణలోకి పునరుక్తి భయంతో వెళ్లకుండా ఆ కథ శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి ఎట్లా తెరదీసిందో (కర్టెన్‌రైజర్‌ అయిందో) మాత్రమే చెప్తాను-అని,వివి కొన్ని వివరాలు ఇచ్చారు…తమ నేలలో తామే కంబార్లైన గిరిజన స్తితిని చెప్పారు.ఈ స్థితిని తెలివిడి చేసింది సత్యం,కైలాసం ఇంకా రామలింగాచారి,వర్గ పోరాట ఆకాంక్షతో కమూనిస్ట్ పార్టీ చీలిక వగైరాలను వివరించిన వరవర రావు గారు కూడా…శ్రీకాకులోద్యమానికి దశాబ్ద కాలంపాటు 1958 నుండి 1968 నవంబర్ 25 వరకు( వర్గశత్రు ఇంటిమీద తోలి దాడి )చట్టబద్ద చట్ట ధిక్కార ఆందోళనలు,ఉద్యమాలు సాగినవి.అకస్మాత్తుగా 1964 లో ఈ తెలివిడి కలుగ లేదు.దశాబ్ద కాలంపాటు సాగిన గిరిజనోద్యమంపై 1967 అక్టోబర్ 31 న మేడిద సత్యం ముఠా దాడి,కోరన్న ,మంగన్నహత్య…అదే సందర్భంలో అటు పశ్చిమ బెంగాల్ లో సంతల్ తిరుగుబాటు,సిపిఎం పార్టీ సంతల్ పోరాట నాయకత్వాన్ని సస్పెండ్ చేయడం,మజుందార్ సిపిఎం నుండి విడివడడం,దాదాపు 1967 నుండి 1968 మే దాక శ్రికాకులోద్యమం అణచివేతకు,అగ్యాతానికి వెళ్ళడం…ఇదీ చరిత్ర.ఈ నడచిన చరిత్ర కర్టెన్ raiser .యగ్యం -వర్గ వ్యవస్థలో అభివ్రుది పేరుతో జరిపే ప్రణాళిక యగ్యంలో కష్టజీవులు సమిధాలవుతారని ఒక గ్రామ నేపధ్యంలో చెప్పిన గొప్ప కథ.
  అలాగే,యగ్యం కథలోని సుందరపాలెం గ్రామం…వరవరరావు గారు భావించినట్టు,ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని వున్న మైదాన గ్రామం కూడా కాదు.ఆ ఊరి గురించి ఆ కథలోనే…మద్రాస్,కలకతా ట్రంక్ రోడ్ కి కాకి మార్గాన….అంటూ దూరమ్ చెప్తారు మాస్టారు.అది శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరం లోని మురపాక గ్రామం.మాస్టారు ఈ గ్రామాన్ని,యగ్యానికి భూమిక గ్రామమని చాల మందికి చూపారు.ఇది ఏజెన్సీకి వందకు పైబడి కిలోమీటర్ల దూరంలో,ఉద్యమ ప్రభావం ఏమీ లేని గ్రామం.ఇది వాస్తవం.
  కల్పనా సాహిత్యంలోంచి చరిత్రను చూడడం సరైన మార్గం కాదు.చరిత్ర ఫలనాలను సాహిత్ర్యం ఏ మేరకు ప్రతిఫలించినదో చూదవచ్చుగానీ ,ఇటు నుంచి అటు చూడడం వాస్తవానికి దూరంగా ఉంటుందేమో..యగ్యం కథను ఈ చారిత్రిక వివరాల,వాస్తవాల లోపాలు నిండిన కథగా విద్యాసాగర్ ఆ మధ్య వ్యాసం రాసారు.చరిత్రను కథ ద్వారా పోల్చుకోవడం వలన ఆయనకు అలా అన్చ్పించిందని నా అభిప్రాయం.వరవరరావు గారు యగ్యం లోపాలు కాదు గొప్పతనమే చెప్పారు కానీ చరిత్రకు ముడి వేయడమే …సత్యదూరమని భావిస్తూ,అయినా మిగిలిన అన్ని కథలపైన ఏ ఎరుకను పొందాలో గొప్పగా విశ్లేషించిన వివీ గారికి అభినందనందిస్తూ..

 2. ఎ.కె.ప్రభాకర్ says:

  నాలుగు నెలలకి పైగా తన సృజనాత్మక రచనా వ్యాసంగాన్ని మానుకొని విలువైన సమయాన్ని వెచ్చించి మనశ్శరీరాలను శ్రమకి గురి చేసి కారా సాహిత్య విలువల్ని ఈ తరానికి అందించడానికి తపన పడి శీర్షికను విజయవంతంగా నిర్వహించిన రమాసుందరి గార్కి అభినందనలు.

 3. కధ అంటే కా.రా మాష్టారు, కా,రా. మాష్టారంటే కధ అన్న నానుడి చాలా కాలం నుండి వింటూన్నామే గానీ, ఒకటి అరా తప్పా ఆయన కధలు అంతగా తెలియదు. ఈ శీర్శిక నిర్వహాణతో ఆయన గురించి సమగ్రంగా కాక పోయినా, ముఖ్యంగా ఆయన సాహిత్య దృక్పదాన్ని తెలుసుకోవడాని దోహద పడిన సారంగా సంపాదక వర్గానికి, రమా సుందరి గారికి, కధలు విశ్లేషణ చేసిన రచయుతలకు ధన్య వాదాలు.

 4. కష్టమైన పని తలకెత్తుకుని సాధించిన రమాసుందరి గారికి అభినందనలు.

 5. కారా గారి కధల మీద ప్రేమతో నా వేధింపులను , తెల్లవారి అర్ధ రాత్రి కాల్స్ ను, ఫేస్ బుక్ పింజ్ లను, గుర్తు వచ్చినప్పుడల్లా నేను ఇచ్చే మైల్స్ ను భరించి ఈ శీర్షికకు రాసిన రచయితలందరికి మప్పిదాలు. అలాగే ఈ శీర్షికను రెగ్యులర్ గా చదివి వారి అభిప్రాయాలు తెలియచేసిన వారికి .. తెలియచేయక పోయినా చదివి ఆనందించినవారికీ .. ఫేస్ బుక్, గూగుల్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారికి .. అందరికీ సాహితీ వందనాలు. అనుకొన్న దాని కంటే పొడిగించినా వచ్చిన అన్ని వ్యాసాల ప్రచురణకు గొప్ప సాహిత్య అభిరుచితో సహకరించిన సారంగ వారికి ధన్యవాదాలు. ఇక పరోక్షంగా ఈ శీర్షిక నిర్వహణకు సహకరించి, నాకు నైతిక మద్దతు ఇచ్చిన అనేక మంది మిత్రులకు కృతజ్నతలు.

మీ మాటలు

*