బోయవాడి నూకలు

drushya drushyam sparowsనక్షత్రాలు మిణుక్కు మిణుక్కుమంటున్నాయి అనుకుంటాం.
కానీ అవి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయట!

మిణుక్కు మిణుక్కు…
అదొక ఊహ. భావన. అనుభూతి.
అదే దృశ్యంగా జ్ఞాపకాల్లో ఉండిపోవడం చిత్రమే.

నిజం. చీకటి విశాలాకాశంలో ఆ కాంతి ఒకటి నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందని మాత్రం అనుకోం.
అనుకోకుండానే ఒక జ్ఞాపకం –  నక్షత్రం ఒక దృశ్యమై ఒక వెలుతురును మిణుక్కు మిణుక్కు మనిపిస్తుంది.

ఈ చిత్రమూ అటువంటిదే.
ఇందులో కనిపించేవన్నీ పిట్టలు. పిచ్చుకలు.
నేల మీది నక్షత్రమండలం.
చిన్న స్థలమే.
అయినా…

ఇవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటై, చీకట్లో.
కానీ, ఉదయం తెలియదు.
ఒకసారి ఇలా చూశాక అవెప్పుడూ మిణుక్కు మిణుక్కు మంటూ ఇలా వెలుగుతూ ఆరుతూ ఉంటై అనుకుంటం. ఇదీ ఒక ఊహే. అధివాస్తవిక జ్ఞప్తి.
అంతే.

అవును.
అవి వెలుగులో వెలగవు.

అసలింతకీ, పిచ్చుకలు..

ప్రతి వ్యక్తి జ్ఞాపకంలో ఒక ఊరు ఉంటే గనుక ఆ ఊర్లో ఇల్లు ఉంటే గనుక ఆ ఇంట్లో దూలాల వద్దా… సూర్ల వద్ద, అక్కడ యాలాడగట్టిన వరి కంకులూ ఉంటే…అక్కడా.వాకిట్లో…కిచకిచ మని పిచ్చుకలు అరవడమూ…ఒకచోటు నుంచి ఇంకో చోటుకు దుంకుడమూ…అక్కడక్కడ్నే తిరుగుతూ…చిన్న చిన్న గుంపులుగా చేరి ముచ్చటిస్తూ..తుర్రున ఎగరడమూ…ఆ పిచ్చుకల జ్ఞాపకాలూ మనకు ఉండనే ఉంటై. ముఖ్యంగా అవి ఆ రెండు కాళ్లతో దుంకడం…అందంగా ఉంటుంది.

వాటి తెలుపు. గోధుమ రంగూ. ఆ కళ్లూ, తోకా…
అంతానూ ఒక చిరు సందడి. మనసులో ఒక సంతోషాన్ని పూయించే పిట్టలవి!

ఆవి ఆడుతూ ఉంటై. పాడుతూ ఉంటై.
మన గుండెల్లో తెలియని శబ్దమై నిశ్శబ్దమై…దృశ్యమై అదృశ్యమయ్యే ఉంటయి.

మనకిప్పుఉ పట్నంలో బాల్కనీలు. అయినా ఒకట్రెండు పిట్టలు.
అయినానూ రాను రానూ అవి తగ్గిపోతున్నాయని ఆందోళన.
ఎండాకాలంలో అయితే వాటికి కాసిన్ని నీళ్లు అందుబాటులో వుంచాలని ఎస్ఎంఎస్ లూనూ…
కానీ, వాటి జ్ఞాపకం ఒకటి వాస్తవంలో ఉండనే ఉంటుంది.

ఎక్కువ పిట్టలు ఉన్న రోజులే జ్ఞాపకాలు.

కానీ, కొత్తగా ప్రతిదీ మారినాక పాతది మరీ జ్ఞాపకంగా మారిపోయి మరెన్నో పిట్టలై వాస్తవంలో అవి ఎగిరిపోతాయ్. మాయమైపోతాయ్.  కానీ, ఆ మాయం మనలో ఒక ‘నాస్టాల్జియా’ లేదా “తేనెతుట్టెలా’ ఏర్పడుతుంది. ఒక వలలాగా మళ్లీ పిట్ట మనకు పడుతూ ఉంటుంది. ఇదీ అదే.కానీ, వేరు.
సిటీ లైట్స్.

అవును. ఇది బతుకు దెరువు పిట్ట.
ఒక మిణుక్కు…మిణుక్కు..
ఒక వ్యక్తి ప్లాస్టిక్ పిచ్చుకల -బ్యాటరీ మెరుపుల – జీవన వాకిలి – ఈ చిత్రం.

అవును.

ఒకానొక చీకటైన సాయంత్రం వెలుతురైన దృశ్యం.
భాగ్యనగరంలోని రాంనగర్ చౌరస్తా చేరకముందే ఒకప్పటి ‘ఉదయం’ పత్రికా కార్యాలయం.
దాని భవనం ముందు ఒక వ్యక్తి నేలమీద ప్లాస్టిక్ పిచ్చుకలను చిచ్చుబుడ్లలా పూయిస్తున్నాడు.

ముందు అవి కనిపించలేదు.
‘ఆన్’ …”ఆఫ్’… అవుతూ… వెలిగి ఆరిపోతూ… వెలుతురు.
అవి మిణుగురులు..కాంతి పుంజాలు. ఎరుపు, ఆకుపచ్చ,.నీలం కాంతులు.

గుప్పిట ముడిచీ తెరిచినట్టు… అవి వెలుగూ… ఆరూ.
అలా-ఇలా.. ఆ వెలుతురు పక్షులు కనిపించాయి.

ముందవి పక్షులని అనిపించలేదు. బ్యాటరీ పిట్టలని తట్టనే తట్టలేదు.
బ్యాటరీతో నడిచే వెలుతురు వర్ణ రాగాలుగా తెలియరాలేదు.

దగ్గరకు వెళ్లి ఆగిచూస్తే కుతూహలం.
పిట్టను చూస్తే మనసు పొందే రెక్కల ఆనందం.
ఎగిరే కుతూహలం.

చిత్రమేమిటంటే ఒక యాభై అరవై పిచ్చుకలు.
కానీ, మరీ చిత్రమేమిటంటే అందులో అన్నీ కానరావు లేదా కొన్ని కానరావు.
ఒకసారి దృశ్యంలో కొన్ని మాయం. మరోసారి దృశ్యంలో మరికొన్ని మాయం.
కానీ, అక్కడ ఉంటై. కానరావు. కానవచ్చిన వాటి పక్కనా పైనా ఖాళీలుంటాయి.
అక్కడా వుండొచ్చు పిచ్చుక.
అదే దృశ్యాదృశ్యం.

+++

చిత్రం చేయడం ప్రారంభిస్తే ఒకటి వెలుగుతూ ఉంటే ఒకటి ఆరుతూ ఉందా అనిపించింది..
మరొకటి వెలుగుతూ ఉంటే ఇంకొకటి ఆగిపోతూ ఉందా అన్నడౌటూ వచ్చింది.

ఒక్క మాటలో దృశ్యం వెలుతురు. అదృశ్యం చీకటి.
లేదా అదృశ్యం చీకటి. దృశ్యం వెలుతురు అన్న భావనా పుట్టింది.
కానీ, వాస్తవం వేరుగా ఉన్నది.

చూస్తానికి ఎక్కువే కనిపిస్తున్నాయి.
వెలుగులో ఉన్నవే ఎక్కువ. కొన్ని మాత్రం కనిపించవు.
కానీ అక్కడ అన్నీ ఉన్నయి. అదే చిత్రం.

ఉన్నవన్నీ దృశ్యం కాదు, లేనివి అదృశ్యమూ కాదు.
అదే దృశ్యాదృశ్యం.

+++

అన్నిటికన్నా విచిత్రం – ఆ పిచ్చుకలతోపాటు ఆ బోయవాడు…లేదా ఆ చిరువ్యాపారి లేదా ఆ కథకుడు ఇరవై రూపాయలకు ఒక జత చొప్పున ఆ పిచ్చుకలను రచనల వలే అమ్ముతున్నాడు.
అమ్మేవాడికి అన్నీ వెలుగే. కొనే వాడికి మాత్రం నచ్చిందే వెలుగు.

ఒకరికి ఆకుపచ్చ నచ్చి మరొకరి నీలం నచ్చి ఇంకొకరికి ఎరుపు నచ్చి కాంతులు మారుతున్నయి. చూస్తుండగానే కొన్నివెలుతుర్లు ఖాళీ అవుతున్నయి.

ఇంతలో ‘కీ’ ఇవ్వనివి కొన్ని ఉన్నయి. అక్కడే ఉన్నయి.
అవి కనిపించడం దృశ్యాదృశ్యమే.

అంతేకాదు, ఒక సంచీ ఉంది.
అందులోంచి అతడు తీసి పెట్టాక మరికొన్ని వెలుగుతూ ఉన్నాయి.
మరి అంతదాకా ఆవి లేవా అంటే ఆ కాంతి దానిలో లేదనాలి. అంతే!

నిజమే. ఒక దృశ్యం దగ్గర ఆగినప్పుడు అదృశ్యాలు దృశ్యమైతాయి.
అదే ప్రేక్షణ. దృశ్యం అర్థమౌతూ ఉండటం.

మన పనిలో మనం ఉండగానే కొన్ని దృశ్యాలు ఇక కంటికి అంటుకొని మదిలో వెలుగుతూ ఉంటై.
అదే ప్రేక్షణ. జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ పిట్టలు వెలుగుతూ ఉంటై, నక్షత్రాల్లా.

కానీ, ఇవన్నీ పట్నం పిచ్చుకలు.
బ్యాటరీ పిచ్చుకలు . ‘కీ’ ఉండే పిచ్చుకలు..

అతడికి డబ్బులు కురిపించే పిట్టలు మరి!
అతడు కనిపించేలా చిత్రంచలేకపోవడం ఈ చిత్రం.+++

ఉప్పల్ లో ఉంటాడట.
ఒకచోటే ఇలా పెట్టుకుని కూచోడట. ఎక్కడ వీలైతే అక్కడ ఆ పక్షులను పరుచుకుంటాడట. స్థలం కన్నా జనసమ్మర్థం ముఖ్యమట. కొంచెం జాగా ఉంటే చాలు, చీకటి అయితేనే వెలిగిస్తాడట. అవును మరి. చీకటే అతడికి కావాలి. వెలుగుతో అవి అమ్మాలి.
అదే దృశ్యాదృశ్యం అతడికి.

అవి వెలుగుతూ ఉంటే ఆగి వచ్చి కొనుక్కునే మనుషులతో అతడి ముఖం వెలుగుతూ ఉంటే చూడాలి.
పిచ్చుకలా ఉన్నాడని పిచ్చిగా అనిపించింది. ఇంత చిన్నసంతోషాలా? ఆ పిచ్చుకకు అనీ అనిపించింది!:

ఎవరూ కొనకపోతే మాడ్పు ముఖం- అంటే చీకటి. అది బాధిస్తుంది మరి!
అందుకే అల్ప సంతోషంలా పిచ్చుకలూ, ఈ మిణుక్కు మిణుక్కులూ.

+++

నచ్చిందేమిటంటే, పంచతంత్ర కథల్లో మిత్రలాభం..
అనగనగా బోయవాడి నూకలకు ఆశపడ్డ పక్షుల కథ.
ఆ పక్షులన్నీ తెలివిగా వలతో సహా లేచిపోవడమూ ఆ కథ.

ఇప్పుడు ఆ వల ఏదో పక్షులతో సహా వచ్చి వాలినట్టయింది నాకు.
అది దృశ్యం.

కానీ బోయవాడు నగరంలో విసిరిన ఒక వల.
అది అదృశ్యం.

మొత్తానికి, భాగ్యనగరంలో. రాం నగర్లో.
ఒక చిరువ్యాపారి కూటికోసం, తన కుటుంబం కోసం పక్షి ఎర.
పిచ్చుక ఒక అస్త్రం.

ఆ నూకలను ఒకటి కాదు, పది చిత్రాలు చేశాను. ఎలా తీయాలో తెలియడం లేదు.
చూస్తుంటే అవి నేల మీది నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి.

మిణుక్కు మిణుక్కు.
బాగుంది.

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

మీ మాటలు

  1. పిచ్చుకలపై వచ్చిన సాహిత్యం ఎక్కువగా నాస్టాల్జియా మీద ఆధారపడి వ్రాసేదే కదూ. మంచిపరిశీలన. పిచ్చుక గురించి మాట్లాడటం అంటే మనబాల్యం గురించి మాట్లాడుకోవటమే. దానికి ఎంతదూరం అయిపోయామో అనేదాన్ని తలపోసుకోవటమే. ఇదో తేనెతుట్ట….. సిటీలైట్ల మధ్య…ఇప్పుడుప్రతీఒక్కరమూ ఒక్కో బాటరీ మెరుపుల ప్లాస్టిక్ పిచ్చుకలం….

    కందుకూరి రమేష్ గారు చాలాబాగుందండీ మీ భావుకతా, జ్ఞాపకాల తేనెతుట్ట. చదువుతూంటే ఓ విషాద హాయి నిస్తోంది.

మీ మాటలు

*