అక్షరం ఆత్మహత్య చేసుకోదు

images
అన్నా!పెరుమాళ్ మురుగన్ 
రచయితగా మరణించానన్నావు 
అక్షరాల అస్త్ర సన్యాసం చేశానన్నావు 
ఇంకెప్పుడూ కలాన్ని ముట్టుకోనన్నావు 
రాసిన పుస్తకాలను వెనక్కి రప్పించుకున్నావు 
ఆవేదనతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానన్నావు 
అన్నా!కన్నీటి మురుగన్
నీ ఆర్తికి ఏ రాతి వర్ణాల 
కరకు గుండెలు కరుగున్ 
ఏ రాజ్యం నీ భావ జాలం వైపు ఒరుగున్? 
అన్నా!పెరుమాళ్ !
నీ ఉదంతం ఈ ప్రపంచానికొక పెను సవాల్ 
ఈ మట్టి మీద రచయితగా గిట్టడమంటే 
సరస్వతీ పుత్రుడు బతికిన సమాధి కావడమే
 వాల్మీకి వ్యాసుల  స్వేచ్చకు వాస్తవంగా నీళ్ళు ఒదలడమే  
రచయితగా పుట్టడమంటే 
కలం చుట్టూ కత్తులు కట్టుకోవడం 
భావాల చుట్టూ కవచాలు పెట్టుకోవడం 
ఒక్క మాటలో చెప్పాలంటే 
మృత్యువు భుజాల చుట్టూ 
శాశ్వతంగా శాలువా కప్పుకోవడం 
అందరం మనుషులమే 
కానీ మనుషులందరూ ఒక్కటి కాదు 
గంగాజలం ఒకటే కానీ 
మునిగి లేచే వాళ్ళంతా ఒక్కటి కాదు 
దుర్మార్గులు వర్ధిల్లే దేశంలో 
నీలాంటి వాళ్లకు చోటు లేదు 
ఎంత మంచి వాడవన్నా 
ఎంత మెత్తటి వాడవన్నా 
చెప్పుతో కొట్టినట్టు 
ముఖాన ఖాండ్రించి ఉమ్మేసినట్టు 
నువ్వు ప్రకటించిన నిరసన 
నీ వర్ణ శత్రువుల సరసన 
ఖచ్చితంగా నీకు పెద్ద పీటే వేసి వుంటుంది 
ఎంత క్షోభ పడకపోతే 
ఎంత మనసు గాయపడక పోతే 
అంత నిర్ణయం తీసుకున్నావు
అంత నిర్దయగా కలం రెప్పలు మూసుకున్నావు 
ఈ ప్రపంచంలో రచయితంటే 
​​
చీకటి కళ్ళకు చూపిచ్చే  సూర్యోదయం
అధర్మంపై ఆగ్రహం ప్రకటించే అగ్ని పర్వతం
అభాగ్యులపై కరుణ కురిపించే వెన్నెల జలపాతం
అన్నా!మురుగన్ 
ఆయుధాలకు భయపడే రోజులు పోయాయి 
ఇప్పుడు అక్షరాలకు జడుసుకునే రోజులొచ్చాయి 
మన అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్టు
‘మరణం నా చివరి చరణం కాదు’
అన్నా! మన కల నెరవేరింది 
నువ్వు రచయితగా మరణించలేదు 
మరణించింది నీ శత్రు మూకలు 
నువ్వు అక్షరాలా అమరుడివి 
నీ భాష ఏదైతేనేం 
నువ్వు ఆ చంద్రతారార్కుడివి 
అక్షరాలు ఆత్మహత్యలు చేసుకోవు   
అక్షరాలు మరణ శాసనాలు రాసుకోవు 
అన్నా! నువ్వు విజయుడివి 
అక్షరం దాల్చిన వజ్రాయుధుడివి
సాహిత్య సమరాంగణ సాయుధుడివి
నువ్వు ఒంటరివాడివి కాదు 
నీది ఒంటరి పోరాటమూ కాదు 
నీ చుట్టూ లక్షల కలాలున్నాయి 
నీ వెంట కోట్ల గళాలున్నాయి 
– ఎండ్లూరి సుధాకర్
75663_237877626338350_67663514_n

మీ మాటలు

  1. Uma Kosuri says:

    చాలా బాగా రాసారు. అభినందనలు… ప్రతి మాట – అందులోని భావార్ధం – బాధనిపించింది…. హాట్స్ ఆఫ్ …..

  2. Thirupalu says:

    /నీ చుట్టూ లక్షల కలాలున్నాయి
    నీ వెంట కోట్ల గళాలున్నాయి /
    అవును, చీకటి ఎప్పుడు వెలుగును మింగేయ లేదు.
    చీకటీ చీకటీలో కలిసిపోతుంది.
    వెలుగు ఎప్పుడు ఓడిపోలేదు. ఓడి పోదు.

  3. johnson choragudi says:

    శ్రీ మురుగన్ ఎపిసోడ్ వల్ల అస్సలు ఆయన రాసిన దాన్లో అభ్యంతరకరమైన అంశం ఏమిటో బయటకు వచ్చింది.
    అలా ఆయన నవల ప్రపంచ భాషల్లోకి అనువాదమయింది.
    ఇప్పుడు అది నిషేధించ వీలు లేని పుస్తకం.
    ఎందుకంటే, అది మనలోనే వుందికనుక.
    ఇప్పుడు ఆయన ప్రపంచ రచయత.
    ఇక, ఆయన రాసింది గొప్పది కానక్కర లేదు.
    – జాన్సన్ చోరగుడి

  4. Vilasagaram Ravinder says:

    రచయితగా పుట్టడమంటే
    కలం చుట్టూ కత్తులు కట్టుకోవడం
    భావాల చుట్టూ కవచాలు పెట్టుకోవడం
    ఒక్క మాటలో చెప్పాలంటే
    మృత్యువు భుజాల చుట్టూ
    శాశ్వతంగా శాలువా కప్పుకోవడం

    పెరుమాల్ కు మరణం ఉంటుందా? ఉండదు గాక ఉండదు

  5. నిశీధి says:

    మరణించిన మనష్యుల మధ్య బ్రతికున్న అక్షరం పెరుమాళ్. మంచి కవిత సర్

  6. balasudhakarmouli says:

    నిజం

  7. buchireddy gangula says:

    నీ వెంట కోట్ల గళాలు లున్నాయి —
    sir— చాలా బాగా చెప్పారు
    ——————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  8. ఆయుధాలకు భయపడే రోజులు పోయాయి ఇప్పుడు అక్షరాలకు జడుసుకొనే కాలమొచింది…నిజం చెప్పారు సర్ !!

  9. చాలా బాగుంది సర్

Leave a Reply to johnson choragudi Cancel reply

*