స్మృతి

Kadha-Saranga-2-300x268

అక్కడున్నాడా… నిజంగానా… ఎప్పుడొచ్చాడో… అయితే వెళ్ళాల… చూసి తీరాలి… ఎంత గొప్ప అవకాశం, ఎన్నాళ్ళ కల… పదా పదా… నడూ నడూ… పరిగెత్తూ… ఆయన్ను చూస్తున్నాననుకుంటేనే ఎంత శక్తి వచ్చేసిందో గదా… గాల్లో తేలినట్లు… ఆగమేఘాల విూద వాలిపోయి చేరిపోయినట్లు… నిజంగానే గాల్లో తేలిపోతున్నానా… ఆశ్చర్యం!

చుట్టూ పొగమేఘాలు ఆవరించినట్లు రంగు రంగుల ఆకారాల్లో అతని బొమ్మలు… అతని కాన్వాస్‌ విూద నుండీ లేచొచ్చి చుట్టూ నర్తిస్తున్న అతని బొమ్మల్లోని పాత్రలు… ఎగిరే రెక్కలున్న గుర్రం… విల్లంబులు చేతిలో పట్టుకొని కేరింతల తుళ్ళింతలతో అల్లరిగా ఎగురుతున్న పిల్లలూ… ఎన్నో భావాలు పలికించే ముఖాకృతులూ… చిత్రవిచిత్రమైన ఆకారాలు… రంగురంగుల సీతాకోక చిలుకలు… చెప్పనలవి కాని అందాలతో హొయలొలికే కాంతలూ… అన్నీ రంగుల ప్రపంచంలో సంచరించే ఆకృతులన్నీ… అన్నింటినీ మించి, అతనికి ఘనకీర్తిని తెచ్చిన ‘రెక్కలున్న నేలలు’… చుట్టూ తేలియాడుతూన్న దృశ్యం…

అన్నీ పరుగులు పెడుతూ … యింకెంత దూరం… దగ్గరే అన్నారే… ఎదురుగా రంగు రంగుల మేఘాలు కదలాడుతున్న ఆ షెడ్‌లో నేనా… అందులో దిగింటాడంటావా… వుండకూడదా… చాలా సాదాసీదాగా వుంటాడట కదా… కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడట… అక్కడే అందులోనే వుండుంటాడు… పదా… పదా వచ్చేసాం… జీవితసాఫల్యాన్ని చేరుకోవడానికి… కళాకారుడంటే అతను కదా…

అతనిమునివేళ్ళను చూడాలని ఎంతకోరికా… ఆ మునివేళ్ళు యెంత అద్భుతమైనవో కదా… కుంచెను పట్టే… కాన్వాస్‌ను తాకే ఆ చేతులు ఎంత మహాద్భుతమైనవో కదా… వాటిని చూడాలనీ, ఆ చిత్రాలను దర్శించి సృష్టించే ఆ కళ్ళను చూడాలనీ… తపించి తపించి ఎన్ని పరుగులు పెట్టానూ… యిన్నాళ్ళకు చేరువైందీ లక్ష్యం… తొయ్‌ తలుపులు… నాతో వస్తూన్న అతని సమస్త చిత్ర ప్రపంచం… ఏదీ ఎక్కడా… అన్నీ ఎక్కడికెళ్ళి పోయాయి అరే అడుగులు జారిపోతున్నాయే… అరే పక్కడికో పడిపోతున్నానే… పట్టుకుందామంటే యేదీ అందకుండా వుందే… ఏయ్‌… య్‌… ఏదీ రంగుల ప్రపంచం… ఎక్కడా రంగుల మనిషి… ఆనందప్రసాద్‌… ఆ.ప్ర… ఆ.ప్ర… ఏయ్‌…య్‌…

కాళ్ళూ చేతులూ గాల్లో ఆడిస్తూ… దబ్బున పడ్డాడు మనోహర్‌.
‘‘అబ్బా…’’
‘‘ఏయ్‌ మనూ… ఏయ్‌మనూ… అట్లా పడ్డావేంది స్వావిూ…’’ హారిక అరుపులకు కలలో నుండీ మెలుకువలోకొచ్చాడు. బెడ్‌ అంచు నేల విూద వున్నాడు పక్కటెముకలు నొప్పి… తలంతా గజిబిజి.
‘కలలో కూడా కనిపించడా ఆయనా… ఆ షెడ్‌… ఉమామహేశ్వర్‌ వాళ్ళ కార్‌షెడ్‌ కాదూ… ఆ షెడ్లో ఎందుకున్నట్లబ్బా… యీ కలకు ఏమిటీ లింక్‌’ అనుకుంటున్నాడు.
‘‘ఏమి స్వావిూ పక్కటెముకలు భద్రమేనా, లేదా నన్నేమన్నా యించమంటావా… ఏ బొమ్మ కలలోకొచ్చి నిన్ను దొర్లించినదీ…’’
నాటకీయంగా అడుగుతోంది హారిక.
అయోమయంగా మొఖంపెట్టి యింకా కలలోనే వున్నట్లు భ్రమింపజేయాలని
‘‘ఎవ్వతెవీవు భీతహరినేక్షణా…’’ అనే పద్యమెత్తుకున్నాడు.
‘‘ప్రవరా… ఓ మనోహరా… నే దిండూధినిని, దిండుతో నాలుగు మొత్తు దానిని…’’ అని దిండుతో నాలుగు బాదింది.
‘‘నీ సరదాకూలా… ఆగూ… ఆ.ప్ర కలలో కన్పించింటే నీతో తన్నులు తింటున్నందుకు ఆనందంగా వుండు…’’ బెడ్‌విూదెక్కి, విషాదంగా చెంపకు చేయి ఆన్చుకొన్నాడు.
‘‘ఓహో యిది ఆనందప్రసాద్‌ స్ట్రోకా… ఆ తోపుకు పడ్డావా… ఆ బ్రష్ష్‌ స్ట్రోక్‌ చాలా స్ట్రాంగప్పా…’’ యీ సరదాకు మనోహర్‌ మూడ్‌ మారదని అర్థమై…
‘‘కన్పించలేదా… సరే ఏం చేద్దాం… నెక్ట్స్‌టైం బెస్ట్‌ ఆఫ్‌లక్‌… పడుకో రెండుగంటలైంది… నిన్నట్నుంచీ హైద్రాబాద్‌లో చూసొచ్చిన ఆ పెయింటింగ్‌ గురించి మాట్లాడుతున్నావే… ఆ ప్రభావమే యీ కల… పడుకో…’’
‘‘చాలా దిగులుగుంది హారికా… యిక కన్పించడు కదా అనుకునేకి మనసు రావట్లేదు…’’
‘‘ఆనందప్రసాద్‌… ఆ.ప్ర. ఒక వ్యవస్థ… ఒక అస్తిత్వ వ్యవస్థ… అది తన్ను తాను రద్దు చేసుకుంటున్నానని, ప్రకటించుకున్నాక… యిక ఎవరైనా చేసేదేముంది… తన్నుతాను రద్దు చేసుకోవడమనే ట్రెండ్‌ ఆయన పైటింగ్స్‌లో ముందు నుంచీ వున్నిందే కదా… దాని గురించి దిగులెందుకు… దీన్ని నువ్వు జీర్ణించుకోవాల్సిందే మనోహర్‌…’’
ఆ మాటలేవిూ మనోహర్‌ విూద పని చేయలా… అది గ్రహించి, యిది ఆ.ప్ర (ఆనందప్రసాద్‌) మాయ, ఆ.ప్ర లేనితనాన్ని ఎప్పుడు జీర్ణించుకుంటాడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది హారిక.
‘యింకేం నిద్రొస్తుంది’ అనుకుంటూ స్టడీరూంలోకి వెళ్ళాడు మనోహర్‌.
˜ ˜
ఆనందప్రసాద్‌ (ఆ.ప్ర) పేరెన్నికగన్న చిత్రకళాకారుడు.
ఆ.ప్ర పేరుతో తెలుగు నేలంతా, తెలుగువాళ్ళున్న చోటంతా ప్రసిద్ధుడు. పక్కడో పురాతన తెలుగు స్థావరమైన హొసూరు మారుమూల పల్లెల్లో వున్నాయి అతని మూలాలు. అతని పూర్వీకులు చాలా మంది గొప్ప కళాకారులుగా సంగీతకారులుగా ప్రసిద్ధులు. అతని తండ్రి ఆనంద శంకరస్వామి ప్రసిద్ధ సంగీతకారుడు, అతని తల్లి కుసుమ పరాగవతి పెద్ద నాట్యగత్తె.

రక్తంలో తెలుగు సంస్కృతీ మెరుపులు నింపుకొని ఆ.ప్ర మద్రాసును వదిలేసి తెలుగునేల మూలమూలలా తిరిగాడు, కొన కొనకూ వ్యాపించాడు. వ్యక్తిగా ప్రారంభమై తన కళతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకొన్న అస్తిత్వశక్తిగా ఎదిగాడు. తన బొమ్మల్లో ఎంత సరళత్వముంటుందో అంతే సంక్లిష్టతా వుంటుంది. అందుకే పెద్దలు మొదలుకొని పిల్లలదాకా అతని అభిమానులే. పిల్లల కోసమే ఆ.ప్ర ఎన్నో బొమ్మల్ని గీసాడు. మనోహర్‌తరం పిల్లలందరూ తెలుగునేల విూద ఆ.ప్ర రంగుల ప్రపంచంలో తేలియాడిన వాళ్ళే.

afsar

మనోహర్‌ వాళ్ళ నాన్న వెంకటనాగన్న, స్కూల్‌ టీచర్‌, ఆయన అభిరుచి మేరకు సాహిత్య పత్రికలు తెప్పించుకునేవాడు. అందులో వచ్చే బొమ్మల్లో ఆ.ప్ర బొమ్మల్ని మనోహర్‌ అనుకరించేవాడు. కొడుకులోని ఆసక్తిని తండ్రి ప్రోత్సహిస్తూ ఎక్కడెక్కడి నుండో ఆ.ప్ర కార్టూన్లూ, రంగుల చిత్రాలూ తెప్పించేవాడు. అట్లా మనోహర్‌ ఆంతరంగిక ప్రపంచంలో ఆ.ప్ర ఒక భాగమయ్యాడు.
ఆ.ప్ర బొమ్మలూ, ఆ రంగుల కలయికా పంతో వివాదాస్పదమైనవి. వాటివిూద ఎంతో చర్చ నడిచేది. ఆయన బొమ్మలన్నీ కొన్ని భాగాల కలయికగా వుండేవి. ఆయా భాగాల కలయిక విూద పంతో వివాదముండేది. కలపకూడని భాగాలను కలుపుతాడనీ, ఒక ప్రాంతానికెప్పుడూ ఒక రంగే వాడుతాడనీ, యింకొన్ని భాగాల్ని ఎప్పుడూ ఎడారి రంగులనే అద్దుతాడనీ, నెర్రులు చీలిన ఆ భూశకలాలు అతన్నెప్పుడూ ప్రశ్నించవా అని తలపండిన మేధావులు అడుగుతుండేవారు.

ప్రవహించే నీటిజాడలను ఆధిపత్యానికి చిహ్నాలుగా వాడటం, కాలువల వెంట పారే నీళ్ళకు వాడే రంగులు, ఆక్రమణ చిహ్నాలుగా చూపడం, ఆ నీళ్ళవల్ల మొలకెత్తే సంపదను అహంకారంగా చూపడం వంటివాటిపై యింకోవైపు నుండీ పెద్ద పెద్ద దుమారాలు రేగేవి. ప్రతి వివాదానికీ ఆ.ప్ర మౌనంగా వుండేవాడు. తనపని తాను చేసుకుపోయేవాడు. ప్రతిసారీ ఔత్సాహికుల్లో తన రంగుల ప్రపంచంతో, తన చిత్రిక విన్యాసంతో కొత్త కలలూ, కొత్త ఆశలూ రేకెత్తించేవాడు.

మనోహర్‌ బాల్యంలో యీ చర్చలేవీ తెలియకుండానే ఆ.ప్ర మత్తులో పడ్డాడు. వాళ్ళ నాన్నకు కొంతవరకూ తెలుసుగానీ, ప్రజల్లో గొప్ప ఆశనూ, ఆసక్తినీ రేకెత్తిస్తున్న చిత్రాల విూద కొడుకు యిష్టపడటం చాలా మంచి పరిణామం అనుకొని, దాన్నో మురిపెంగా భావించి కొడుకులో ఆ ఆసక్తి చివరిదాకా కొనసాగాలని కోరుకున్నాడు. అందుకే ఏవిూ తెలియని వయసులో కొడుకుని, చెక్కిలిపై ముద్దు పెట్టుకొని-
‘‘ఆ.ప్ర లాగా గొప్పవాడివి కావాలి నాన్నా…’’ అని నూరిపోసాడు
ఆ తడిఆరని ముద్దు మనోహర్‌ మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది.

1970ల్లో మనోహర్‌కు ఆరేండ్ల వయసులో ఆ.ప్రను చూపిద్దామని వెంకటనాగన్న కొడుకును తీసుకొని విజయవాడ వెళ్ళాడు. అప్పుడు ఆ.ప్ర గీసిన ‘ఉపాధుల హద్దులు’ అనే బొమ్మ విూద పెద్ద వివాదం నడుస్తుండేది. ఆయన బొమ్మల్లో సహజంగా వుండే భౌగోళికత వివాదాస్పదంగా తయారై పెద్ద వుద్యమం నడిచింది. ఆ గలాటాల్లో కొడుకుతో పాటు వెనక్కు రావడానికి వెంకటనాగన్న చాలా యిబ్బందులు పడ్డాడు. ఆ.ప్ర నేమో విజయవాడను వదలి హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. అట్లా మొదటి ప్రయత్నమే, ఎంతో మురిపెంగా గొప్ప కళాకారుణ్ణి చూపిద్దామనుకున్న ప్రయత్నం నెరవేరలేదు. అప్పటి నుండీ మనోహర్‌కు ఆ.ప్రను చూడాలనే ఆకాంక్ష, అది నేరవేరని నిరాశా వెంటాడాయి.

అయితే ఆ.ప్ర మాత్రం ‘1970’ల వివాదం తర్వాత ముఫ్పై యేళ్ళపాటు హైదరాబాద్‌తో పాటు పదిగాడు. అంతర్జాతీయంగా తన కళాసృజనతో పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలంలో ఆయన తీసిన ఆర్ట్‌ డాక్యుమెంటరీలైతేనేవిూ, గీసిన  బొమ్మలైతేనేవిూ తెలుగు సంస్కృతిని విశ్వవిపణిలో నిలబెట్టాయి. అతని అంతర్జాతీయ విమర్శకులు ఆ బొమ్మల్ని చూసి, ఆంధ్రుల వ్యాపారాత్మకత ఎక్కువ అదే యీ బొమ్మల్లో కన్పిస్తుందనేవారు. అతని అంతర్గత విమర్శకులేమో, హైదరాబాద్‌ మూలమూలల్నీ తన బొమ్మల్లో అలంకరించినంతగా తెలంగాణా పల్లెసొగసుల్ని పట్టుకోలేదని విమర్శించేవాళ్ళు. దాన్ని ప్రశంసగా తీసుకొని ఆ.ప్ర ‘‘హైదరాబాద్‌ నా ఆత్మ’’ అనేవాడు. అందుకే మనోహర్‌ తరం ఆ.ప్ర అభిమానులకు హైదరాబాద్‌ చిత్రాలంటే వేలంవెర్రిగా వుండేది.
˜ ˜
‘‘ఈ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఎంత కళాత్మకంగా వుందో మనోహర్‌… నువ్వూ నీ గురువులా ప్రొఫెషనల్‌ పైంటర్‌ అయ్యుంటే నీది కూడా ఆర్ట్‌ పగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేదాన్ని…’’ హారికా అంటోంది.

‘‘వ్యంగ్యయేవిూ వద్దుగానీ… యీ బొమ్మ చూడూ ‘వంటావార్పూ’ దీని టైటిల్‌. కట్టెలు మండుతున్నాయి ఒక యాంగిల్లో, పాత్రలు ఎక్కడున్నాయో చూడూ, ఆ పాత్రలు మనుషుల్లా లేరూ… బ్యాక్‌డ్రాపంతా రోడ్డే కదా… ఆ బ్రష్‌ విన్యాసంలో ఏదో మెలికె వుంది, లేదంటావా… ఏం చెబుతున్నాడూ… మంటలై మండుతూ బాటన పడతారు… భుక్తికీ, విముక్తికీ అనా…’’

‘‘నిజమే మనూ, యీయన చిత్రాల్లో స్త్రీలు విచిత్రంగా కన్పిస్తారు. చీరల కోసం, ఆచ్ఛాదనకోసం, ఆయనెంచుకునే రంగుల వుద్దేశ్యం, భారతీయత కోసమేనా… లేదా దాన్ని తిరస్కరించడం కోసమా… అవయవాల అమరికలో ఒక డిస్‌ప్లేస్‌మెంట్‌ చూపిస్తాడే, ఏం కారణమో కదా…’’
‘‘లేదు హారికా యీయన మొదట్నుంచీ తన బొమ్మల్లో విడి విడితనాన్ని సింబలైజ్‌ చేస్తున్నాడు… అది అస్తిత్వవాదానికి గుర్తు అనుకుంటా… ఆ.ప్రలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఆ లక్షణమే… యీ బొమ్మ చూడూ ‘డైవర్సిటీ`యూనైట్‌’ థీమాటిక్‌ పైంటింగ్‌… యిదే ఆ.ప్ర సారం…’’
‘‘నిజంగా యీరోజు పక్కడికొస్తాడంటావా… యీ నిర్వాహకుల ప్రకటన చూసి, పనులన్నీ వదిలేసి పరిగెత్తుకొచ్చామే…’’
‘‘నిరాశపడొద్దు… హారికా నన్నూ నిరాశపర్చొద్దూ… తప్పకవస్తాడు, నువ్వూ నేనూ అతన్ని చూస్తాం… ‘యిక యిదే ఆఖరి ఎక్స్‌బిషన్‌ యిక నా పైటింగ్స్‌నూ నన్నూ రద్దు చేసుకుంటానని’ ప్రకటించాడు గదా… ఆఖరి దర్శనం తప్పక దొరుకుతుంది…’’
అట్లాంటి ఆశతో మనోహర్‌ ఎంతగానో ఎదురుచూసాడు గానీ, సాయంత్రానికి, ‘‘ఆ.ప్ర రావట్లేదనీ, ఆత్యవసర పని విూద అమెరికా వెళ్ళాడనీ, క్షమించమని’ ప్రకటించారు నిర్వాహకులు.
‘‘…విఫలమైన నా కోరికలా…’’ విషాదభరితమైన పాట వొకటి వినిపిస్తోంది. హారికా మనోహర్‌లు ఆర్ట్‌ పక్సిబిషన్‌ నుంచీ నేరుగా వూరికి బయల్దేరారు… కార్‌ పక్కినప్పటి నుండీ కలత నిద్రపోతున్నాడు మనోహర్‌. అతని నుదిటిపై చేయివేసింది హారిక. వులిక్కిపడ్డాడు. బలహీనంగా,
‘‘వచ్చేసామా…’’ అన్నాడు.
‘‘దగ్గర్లో వున్నాం… కృష్ణను దాటేశాం… తుంగభద్ర రాబోతోంది…’’
‘‘పక్కడున్నా ఆపమంటావా… కాస్తా కాఫీ తాగుదువు, విూ ఆర్‌ఎమ్‌యు మార్క్‌ కాఫీ… కాఫీ నురగ విూద కాఫీపొడి చల్లుకొని తాగేది…’’ కాస్తా నవ్విద్దామని ప్రయత్నించింది. మామూలుగా వుంటే, యింత ప్రయాణంలో మనోహర్‌ ఎన్ని పంచ్‌ డైలాగ్స్‌ పేల్చిండేవాడో.
‘‘లేదులే… నీకు తాగాలనుంటే ఆపుకో…’’ తుంచేసాడు.
‘‘ఇలా అయితేఎలా… పెళ్ళైనప్పట్నుంచీ యిదే వరుస. చూడాలనుకోవడం చూళ్ళేకపోవడం. ఈ ద్వంద్వం గురించి కాస్తా తాత్వికంగా ఆలోచించూ… చూళ్ళేకపోవడంలో చూడ్డం వుంది గదా… ఆ సమయమంతా ఆ ధ్యానంలో, ఆరాధనలో వుండటమే గదా… అసలు ఆ.ప్ర తనను తాను రద్దు చేసుకుంటుంటే, యిట్లా విూరు ఆయన అభిమానులు ఆయన అస్తిత్వాన్ని నిలపాలనుకోవడంలో అర్థం వుందా…’’
నిజమేననిపించింది మనోహర్‌కు. తాము చూడాలనుకుంటున్న ఆ.ప్ర భౌతికత, కాలవశాన తనంతకుతానే రద్దయిపోతుంటే… యీ వేదన ఏమిటీ… అసలెందుకూ… అనుకొని తేలికపడ్డాడు.
మనోహర్‌ ఆ.ప్రను ఆరాధించినంత మాత్రాన, తానేవిూ పైంటర్‌ కాలేదు. బాల్యం నుంచీ ఆ బొమ్మలు చూస్తూ, చూస్తూ లైబ్రరీకి అలవాడు పడ్డాడు. లైబ్రరీకి వెళ్తూ వెళ్తూ పుస్తకాలకు అలవాటు పడ్డాడు. చదువులో మెరుగుపడి సైన్స్‌లో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయ్యాడు. ఆనందప్రసాద్‌ ప్రభావంతో బొమ్మలపై అనురక్తి ఏర్పడి యిప్పటికీ తాను కళాకారుడిగా మిగిలాడు. ఆ.ప్రను చూడ్డం మనోహర్‌కు జీవన్మరణ సమస్య కాకున్నా ఆ.ప్ర గురించి ఆలోచించడం, అతని చిత్రాలు రగిల్చే మంటల్లో కాలడం ఒకవ్యసనంగా మారింది. అది తెరలు తెరలుగా అతన్ని సోకుతూ వుంటుంది.
˜ ˜
‘‘జగదీశ్వర్‌కు తెలిసిన ఒక ఎడిటర్‌కు, ఆ.ప్ర గారు బాగా దగ్గరట. ఆయన ద్వారా యీసారి ప్లేస్‌, టైమ్‌ ఫిక్స్‌ చేస్తా దిగులు పడొద్దు’’ అన్నాడు ఉమామహేశ్వర్‌.

‘నేనూ నువ్వూ జగదీశ్వర్‌తో పాటు శేషసాయి గారిని కలిసి వెళ్దాం… శేషశాయి గారికి పర్సనల్‌ పని వుందట. కలసి తీరుతారట. ఆయన్తో పాటు మనం… యీసారికి తిరుగులేదు’ అని భరోసా యిచ్చాడు.
ఆ.ప్ర వైభవం తెలుగు నేల విూద కన్నా, తెలుగువాళ్ళు జీవిస్తున్న అమెరికాలోనే పక్కువ. ఈ మధ్యా కొన్నేళ్ళుగా అక్కడే వుంటున్నాడు. తన ‘విభజనరేఖలు’ చిత్రం దుమారం రేపిన తర్వాత, భౌగోళిక విభజన కన్నా, భౌద్ధిక అంతరాలకు, అగాథాలకూ ముందస్తు సూచిగా, ఆయన ‘బొమ్మ’ రూపు కట్టాకా, తెలుగునేల అల్లకల్లోలమై పోయింది.
ఆ తర్వాత ఒక ప్రముఖ సాహిత్య పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో ఆ.ప్ర తనిక భౌతికంగా తెలుగునేలపై వుండననీ, తన బొమ్మలు యిప్పుడు గతంలో కలసిపోయిన యితివృత్తాలనీ, ప్రకటించడం, విమర్శకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. ఇదిగో ఎప్పుడో యిలాంటి వ్యక్తిగత పనుల విూద మిత్రుల కోసం మాత్రమే హైదరాబాద్‌ వచ్చి ఓ నాలుగు రోజులుండీ మాయమవుతాడు.
‘‘హైదరాబాద్‌ పప్పుడొచ్చినా యిక్కడే వుంటాడు. యిక్కడే తన ఆఖరి బొమ్మగా ప్రచారం అయిన ‘స్మృతి’ గీసాడు’’ శేషశాయి గారు చెప్తూంటే మనోహర్‌కు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ.ప్ర నడయాడిన ఆ నేలనూ, ఆ గోడల్నీ తాకి కళ్ళకద్దుకుందామనుకున్నాడు. స్మృతి ` ఆ.ప్రకు గొప్ప సృజనాత్మక కొనసాగింపని పేరు పొందింది. అసలు నేలలు తమ అస్తిత్వాల కోసం రెక్కలు తగిలించుకొని పగిరిపోవడమనే దాన్ని మొదలు పెట్టిందే ఆ.ప్ర దాన్ని యిన్నేండ్లలో గడిచిన తాత్వికతతో దట్టించి ‘స్మృతి’ని గీసాడు. అతన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడ మెచ్చుకున్నారు. అతని కాన్సెప్ట్‌లోని అనివార్యత ముందు ఓడిపోయిన వాళ్ళే అందరూ…

మనోహర్‌కు అంతా కలలా వుంది. నిజంగా యీ రోజు ఆ.ప్ర ను చూస్తానా… లేక యీ నేలకు దూరమైపోయిన ఆనందప్రసాద్‌ను విస్మృతిలోకి నెట్టే పనికి యీ రోజు నుంచే మొదలుపెడతానా అనుకుంటున్నాడు. ఆ మాట ముందే హారికకు చెప్పే వచ్చాడు. ఆ.ప్రను చూడ్డం, చూడకపోవడం అనేవి యిప్పుడు మనోహర్‌ లక్ష్యాలు కావు. ఒక స్మృతి రద్దయిపోవడం, దానికి తాను పదుర్కోవాల్సిన రిహార్సల్‌ ముఖ్యమనకున్నాడు. ఆ.ప్ర గురించి లోపల పేరుకుపోయిన ఒక్కో దృశ్యాన్ని రద్దు చేసుకోవడం పలా అనే ఆలోచిస్తున్నాడు. ఇందుకు స్ఫూర్తి కూడా తిరిగి ఆనంద ప్రసాదే.
ఇంతలో ‘వస్తున్నాడు వస్తున్నాడు’ అనే శబ్దాలు వినిపించాయి. వాతావరణం నిశ్శబ్దమయ్యింది. చూస్తూనే ఏమని మాట్లాడిరచాలా, పలా పరిచయం చేసుకోవాలని మనోహర్‌ సతమతమవుతున్నాడు.
‘సార్‌ నేను విూ డెడ్లీఫాన్‌… విూ వేళ్ళకొసలను కళ్ళకద్దుకుంటాను అనుగ్రహిస్తారా…’
‘విూ బొమ్మల చుట్టూ నా జీవితాన్ని పెనవేసుకున్నాను. విూ సారాన్ని పీల్చి మనిషిగా మారాను… విూ పాదాలను తాకనిస్తారా…’
‘చరిత్రలో కనుమరుగైన భూముల్లాగా, వాటి అస్తిత్వాల్లాగా విూరూ విూ బొమ్మలూ గతజల సేతుబంధనాలు… అప్పటి గాల్లో కలసిన సువాసనల్లో నన్నూ ఓ శ్వాస కానిస్తారా…’
యిన్ని ఆలోచనల్లో మనోహర్‌ వుండగా, రావాల్సిన వ్యక్తి రానేవచ్చాడు. మనోహర్‌ గుడ్లప్పగించి చూసేంతలో…

శేషశాయి గారి నమస్కారానికి ప్రతినమస్కారం చేసాడు. మిగతావాళ్ళవి గాల్లోనే స్వీకరించాడూ, అందర్నీ అలా చూసి, అందరూ సంభ్రమంలో వుండగా

‘కూర్చోండి’ అని చాలా మృదువుగా అన్నాడు. శేషశాయి గారు ఒకవైపు కూర్చుంటే, ఉమా మహేశ్వర్‌ యింకోవైపు కూర్చోగలిగాడు. మనోహర్‌ నిలబడే వుండి పోయాడు.
ఆ.ప్ర కాళ్ళ దగ్గర కూర్చోగలను అవకాశమొస్తుందా? అన్నట్లున్నాడు.
‘విూ స్మతి చాలా పాపులర్‌ అవుతోంది సార్‌… చాలా మంది క్రిటిక్స్‌ దాన్ని గురించి రాస్తున్నారూ… మాట్లాడుతున్నారు’ శేషశాయి గారు అంటుంటే,
‘నా ‘విభజనలో’ విూరు జీవిస్తారు’ అన్నాడు ధీరగంభీరంగా అని చివ్వున లేచి నిలబడ్డాడు. శేషశాయి గారు ఆత్రంగా కాస్తా పెద్దకవరొకటి అందించి,
‘విూరడిగింది సార్‌’ అన్నాడు.
‘సరే…’ అని సర్రున కారులో మాయమయ్యాడు.
మనోహర్‌ కళ్ళు తెరుచుకునేలోగా, కలలోలాగా మాయమయ్యాడు.
ఇది కలా నిజమా అనుకొంటూ, మనోహర్‌ చేతిని పట్టుకొని గట్టిగా గిల్లాడు.
‘‘ఏయ్‌ మనూ నన్ను గిచ్చుతావేందబ్బా నువ్వూ… నన్ను నిద్రపోనివ్వవా…’’
హారిక అరుపుతో కళ్ళు తెరిచాడు.

-జి. వెంకట కృష్ణ 

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    మొత్తానికి మేము కూడా చూడ లేక పోయాం ఆ.ప్ర గారిని. భలే బిగువుగా నడిపించారు. కధనం,భావుకత చాల నచ్చింది. నాకు వెంకట కృష్ణ గారు. గ్రేట్.

    “చరిత్రలో కనుమరుగైన భూముల్లాగా, వాటి అస్తిత్వాల్లాగా విూరూ విూ బొమ్మలూ గతజల సేతుబంధనాలు… అప్పటి గాల్లో కలసిన సువాసనల్లో నన్నూ ఓ శ్వాస కానిస్తారా…”
    అవును అలాగే అనిపిస్తుంది నిజం! నిజం ! నిజం

  2. హ్మ్మ్. చాలా ఆలోచింపచేస్తుంది., కదకుడి ఆరాధన ముఖంగా చేసిన విమర్శ

మీ మాటలు

*